కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 6/15 పేజీలు 3-5
  • భూగ్రహం నాశనం కానైయుందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • భూగ్రహం నాశనం కానైయుందా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “సర్వనాశన దినాన్ని” గూర్చిన స్పష్టమైన వివరణ
  • మానవుని అస్తవ్యస్తమైన నిర్వహణ సరిచేయబడింది
  • అది సాధ్యమే
  • థేమ్స్‌ నది ఇంగ్లాండ్‌వారి ప్రత్యేక స్వాస్థ్యం
    తేజరిల్లు!—2006
  • మన భూమి ఎప్పటికీ ఉంటుందని దేవుడు మాటిచ్చాడు
    తేజరిల్లు!—2023
  • సున్నితమైన మన గ్రహం దాని భవిష్యత్‌ విషయమేమిటి?
    తేజరిల్లు!—1996
  • అంతరిక్ష దుర్ఘటన మన ప్రపంచాన్ని నాశనం చేస్తుందా?
    తేజరిల్లు!—1999
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 6/15 పేజీలు 3-5

భూగ్రహం నాశనం కానైయుందా?

ఇరవయ్యవ శతాబ్దపు అంతం సమీపిస్తోంది, ఇరవై ఒకటవ శతాబ్దం ఆరంభం కానైయుంది. ఈ సందర్భంలో, నాశనాన్ని గూర్చిన ప్రవచనాలకు సాధారణంగా తక్కువ అవధానాన్ని ఇచ్చే లేక అస్సలు అవధానం ఇవ్వని అత్యధిక సంఖ్యాకులు, ప్రపంచాన్ని కంపింపజేసే ప్రాముఖ్యతగల సంఘటన ఏదైనా భవిష్యత్తులో సంభవించనైయుందేమోనని ఆలోచిస్తున్నారు.

ఈ విషయాంశంపై వార్తాపత్రికల్లోనూ, మ్యాగజిన్‌లలోనూ రాయబడిన శీర్షికలనూ, అలాగే పెద్ద పెద్ద పుస్తకాలనూ మీరు గమనించి ఉండవచ్చు. ఇరవై ఒకటవ శతాబ్దం ఏ సంఘటనలతో ప్రారంభమౌతుందనేదాన్ని చూసేందుకు మనం వేచి ఉండాల్సిందే. 2000వ సంవత్సరాంతానికి సమీపించడమంటే ఒక సంవత్సరంలో నుండి మరో సంవత్సరంలోనికి మారడమే (లేకపోతే 2000 నుండి 2001వ సంవత్సరంలోనికి ప్రవేశించడానికి తేడా ఒక్క నిమిషమే) తప్ప పెద్ద తేడా ఏమీలేదనీ, అంతకుమించిన పర్యవసానాలేమీ పెద్దగా ఉండకపోవచ్చుననీ కొంతమంది ప్రజలు చెబుతారు. అనేకులకు పట్టుకున్న అధిక చింత, మన గ్రహపు దీర్ఘకాలిక భవిష్యత్తును గూర్చినదే.

ఈ రోజుల్లో అతి తరచుగా అవధానానికి తేబడుతున్న ఒక ప్రవచనమేమిటంటే, ఏదొక సమయంలో—అతిసమీప భవిష్యత్తులోనైనా లేక దూర భవిష్యత్తులోనైనా—భూగ్రహం సర్వనాశనం కాబోతుందన్నదే. అలాంటి నిరాశాజనకమైన ప్రవచనాల్లో కేవలం కొన్నింటిని పరిశీలించండి.

1996లో మొదట ప్రచురించబడిన ప్రపంచాంతం—మానవ నిర్మూలనను గూర్చిన విజ్ఞానం, నైతికతలు (ఆంగ్లం) అనే తన పుస్తకంలో, రచయితా తత్త్వశాస్త్రవేత్తా అయిన జాన్‌ లెస్లీ, భూమిపై మానవుని జీవితం ఎలా ముగిసిపోతుందనే విషయానికి సంబంధించి మూడు సాధ్యతలను ఇస్తున్నాడు. మొదట ఆయనిలా అడుగుతున్నాడు: “సంపూర్ణమైన అణుయుద్ధం మానవజాతి అంతానికి నడిపించగలదా?” తర్వాత ఆయనిలా కొనసాగిస్తున్నాడు: “బహుశ సంభవించగల సంఘటన [ఏమిటంటే] . . . రేడియేషన్‌ ప్రభావాల మూలంగా జరగబోయే వినాశనమే అంటే క్యాన్సర్‌లూ, రోగనిరోధక వ్యవస్థ బలహీనమవ్వడం మూలంగా సోకే వ్యాధులు పెరిగిపోవడమూ, లేదా పుట్టుకతో అనేక లోపాలు రావడమూ వంటి వాటి మూలంగా జరగబోయే వినాశనమే. పర్యావరణ సమతుల్యానికి ప్రాముఖ్యమైన సూక్ష్మజీవులు కూడా నాశనంకావచ్చు.” మిస్టర్‌ లెస్లీ చెబుతున్న మూడవ సాధ్యత ఏమిటంటే, భూమిని ఒక తోకచుక్క లేక ఆస్టెరాయిడ్‌ ఢీకొనవచ్చు: “భూగ్రహాన్ని ఏదో ఒకనాడు ఢీకొనగల్గే కక్ష్యలున్న తోకచుక్కలూ, ఆస్టెరాయిడ్‌లూ, దాదాపు రెండు వేల వరకూ ఉన్నట్టు కనబడుతోంది, వాటి వ్యాసం ఒకటి నుండి పది కిలోమీటర్లలోపున ఉండవచ్చు. సంఖ్యాపరంగా అతి తక్కువగా ఉన్న (దాన్ని అంచనా వేయడమంటే, వట్టి ఊహాగానమే అవుతుంది) అత్యంత పెద్దవీ, సంఖ్యాపరంగా అత్యంత అధికంగా ఉన్న చిన్నవీ కూడా ఉన్నాయి.”

“సర్వనాశన దినాన్ని” గూర్చిన స్పష్టమైన వివరణ

ఆస్ట్రేలియా నందలి అడెలాయిడ్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరైన మరో విజ్ఞానశాస్త్రవేత్త పాల్‌ డేవిస్‌ చెప్పినదాన్ని పరిశీలించండి. వాషింగ్‌టన్‌ టైమ్స్‌ ఆయనను, “అట్లాంటిక్‌ మహాసముద్రానికి ఇరువైపులా ఉన్న విజ్ఞానశాస్త్ర రచయితలలోకెల్లా ఉత్తమ రచయిత” అని అభివర్ణించింది. 1994లో ఆయన చివరి మూడు నిమిషాలు (ఆంగ్లం) అనే పుస్తకాన్ని రాశాడు, ఆ పుస్తకం “సర్వనాశన దినాన్ని గూర్చిన పుస్తకాలన్నింటికీ పుట్టిల్లు” అని పిలువబడింది. ఈ పుస్తకంలోని మొదటి అధ్యాయం పేరు “సర్వనాశనదినం”, తోకచుక్కొకటి భూగ్రహాన్ని ఢీకొంటే జరుగగల్గే పర్యవసానాన్ని గూర్చిన ఊహాజనిత దృశ్యాన్ని అది వర్ణిస్తోంది. గగుర్పాటును కలిగించే ఆ వర్ణనలోని కొంత భాగాన్ని చదవండి:

“పదివేల భూకంపాలొక్కసారిగా వచ్చినట్టు భూగ్రహం కంపించిపోతుంది. స్థానభ్రంశం చెందిన వాయుఘాతం కట్టడాలనన్నింటనీ నేలమట్టంచేస్తూ, భూమిపైనున్న ప్రతిదాన్ని తుడిచిపెడుతూ, దాని దారికడ్డు వచ్చిన ప్రతీదాన్నీ తునాతునకలుచేస్తుంది. తోకచుక్క తాకిడికి గురైన ప్రాంతానికి చుట్టూ ఉన్న సమతల భూభాగం, నూట యాభై కిలోమీటర్ల వెడల్పున్న క్రేటర్‌ [గుంట]ని కలుగజేసి భూమి అంతర్భాగాన్ని బహిర్గతపరుస్తూ, కరిగిపోయిన పర్వతాల్లా కొన్ని కిలోమీటర్ల ఎత్తువరకు పైకెగసి క్రింద పడుతుంది. . . . [అలా పైకి] ఎగిసిన దుమ్మూ ధూళితో కూడిన విస్తారమైన చెత్తా చెదారపు దుమారం వాయుమండలంలోకి వెదజల్లబడుతూ, సూర్యుడు భూమిపై ఎక్కడా కనబడకుండా చేస్తుంది. ఇప్పుడు సూర్యకాంతి స్థానంలో నాశనం అంటే అంతరిక్షంలోనుండి వాయుమండలంలోనికి చెత్తాచెదారం ప్రయాణిస్తుండగా, మిణుకు మిణుకుమనే కోట్లాది ఉల్కలు తీవ్రమైన వేడితో తమ క్రిందవున్న నేలను మాడ్చివేస్తాయి.”

ప్రొఫెసర్‌ డేవిస్‌ ఈ కాల్పనిక ఘటనని, స్విఫ్ట్‌-టటిల్‌ తోకచుక్క భూగ్రహాన్ని ఢీకొంటుందనే భవిష్యవాణికి జోడిస్తున్నాడు. అలాంటి సంఘటన సమీప భవిష్యత్తులో సంభవించకపోయినప్పటికీ, ఆయన అభిప్రాయం ప్రకారంగా “ఎప్పుడో ఒకప్పుడు స్విఫ్ట్‌-టటిల్‌ లేక అలాంటిదేదైనా సరే, భూమిని ఢీకొంటుంద”నే హెచ్చరికను ఆయన చేరుస్తున్నాడు. ఆయన అభిప్రాయం అరకిలోమీటరు లేక అంతకంటే ఎక్కువ వ్యాసాన్ని కల్గివున్న 10,000 వస్తువులు భూవక్ర కక్ష్యల్లో తిరుగుతున్నాయని సూచించే అంచనాలపై ఆధారపడి ఉంది.

అలాంటి భయానకమైన సంఘటన నిజంగా జరిగే అవకాశముందని మీరు నమ్ముతారా? నమ్మేవారి సంఖ్య చెప్పుకోదగినంతరీతిలో ఉండడం ఆశ్చర్యకరమైన విషయం. కానీ వాళ్లు తాము జీవించి ఉండగా మాత్రం అలాంటిదేదీ జరగదని తమకు తాము సర్ది చెప్పుకుంటూ, వాళ్లు తమకు కల్గిన ఎలాంటి వ్యాకులతనైనా సరే మనస్సుల్లోనుంచి తీసివేస్తారు. అయితే, త్వరలోనైనా లేక ఇప్పటినుండి కొన్ని సహస్రాబ్దాల తర్వాతనైనా, అసలెప్పుడైనా సరే భూగ్రహం ఎందుకు నాశనమవ్వాలి? భూనివాసులైన మానవుల లేదా జంతువుల కష్టాలకు మూలకారణం ఖచ్చితంగా భూగ్రహం మాత్రం కాదు. బదులుగా, “భూమి” పూర్తిగా ‘నాశనమయ్యే’ సాధ్యతతో పాటూ, ఈ 20వ శతాబ్దపు సమస్యల్లో మరనేకమైనవాటికీ బాధ్యుడు మానవుడే కాదంటారా?—ప్రకటన 11:18.

మానవుని అస్తవ్యస్తమైన నిర్వహణ సరిచేయబడింది

మానవుడు తన అస్తవ్యస్తమైన నిర్వహణ మూలంగా, అత్యాశ మూలంగా భూగ్రహాన్ని బహుశా సమూలంగా నాశనం చేసే లేక పాడు చేసే అధిక సాధ్యతను గూర్చిన సంగతేమిటి? అటవీ నిర్మూలన అధికం కావడం మూలంగా, అదుపు చేయలేనంతగా వాతావరణం కలుషితమవ్వడం మూలంగా, నీటివనరులను పాడు చేయడం మూలంగా భూమ్మీద అనేక ప్రాంతాల్లో ఇప్పటికే గొప్ప నాశనం జరిగిందనే విషయంలో సందేహం ఎంతమాత్రం లేదు. ఒకే ఒక్క భూమి [ఆంగ్లం] అనే తమ పుస్తకంలో, బార్‌బరా వార్డ్‌, రనే డుబోస్‌ అనే రచయితల ద్వారా ఈ విషయం దాదాపు 25 సంవత్సరాల క్రిందటే చక్కగా సమీక్షించబడింది: “కాలుష్యానికి సంబంధించి మనం పరిశీలించవలసిన మూడు విస్తృత రంగాలైన గాలీ, నీరూ, నేలా కలిసి మన గ్రహజీవనపు మూడు మౌలిక వాతావరణ శక్తులను రూపొందిస్తాయి.” అప్పటి నుండి పరిస్థితి ప్రాథమికంగా ఏమి మెరుగుపడలేదు, కాదంటారా?

మానవుడు తన సొంత అవివేకంతో భూగ్రహాన్ని నాశనంచేసే లేక పాడు చేసే సాధ్యతను పరిశీలించేటప్పుడు, పూర్వ స్థితిని పొందడానికీ, పునరుత్పాదన చెందడానికీ భూమికున్న అపూర్వమైన శక్తులను పరిశీలించడం ద్వారా మనం ప్రోత్సాహాన్ని పొందవచ్చు. ఆశ్చర్యకరమైనరీతిలో యథాస్థితిని పొందే ఈ సామర్థ్యాన్ని గూర్చి వర్ణిస్తూ, ది రిసిలియన్స్‌ ఆఫ్‌ ఎకోసిస్టమ్స్‌ అనే మరో పుస్తకంలో రనే డుబోస్‌ ఈ ప్రోత్సాహకరమైన వ్యాఖ్యలను చేస్తున్నాడు:

“తిరిగి సరిచేయలేనంతగా ఆవరణవ్యవస్థలకు ముప్పు ఇప్పటికే వాటిల్లినందున పర్యావరణ క్షీణతను గూర్చిన స్పృహ చాలా ఆలస్యంగా వచ్చిందని అనేకమంది వ్యక్తులు భయపడుతున్నారు. నా అభిప్రాయం ప్రకారంగా, ఈ నిరాశావాదం అర్థరహితమైనది ఎందుకంటే హానికరమైన అనుభవాల నుండి కోలుకొనే అపరిమితమైన శక్తులు ఆవరణవ్యవస్థలకు ఉన్నాయి.

“తమకుగా తాము కోలుకొనేందుకైన అనేక యాంత్రిక విధానాలను ఆవరణవ్యవస్థలు కల్గివున్నాయి. . . . అవి, పర్యావరణ సమతుల్యతకున్న మొదటి స్థితిని క్రమంగా పునరుద్ధరించడం ద్వారా ఆవరణవ్యవస్థలు ఆ ఆందోళనల ప్రభావాన్ని అధిగమించేలా చేస్తాయి.”

అది సాధ్యమే

ఇటీవలి సంవత్సరాల్లో దానికొక విశిష్టమైన ఉదాహరణగా నిలిచిన సంఘటన ఏమిటంటే, లండన్‌లో ఉన్న ప్రసిద్ధి గాంచిన థేమ్స్‌ నదిని క్రమంగా శుభ్రపర్చడమే. జెఫ్రీ హారిసన్‌, పీటర్‌ గ్రాంట్‌లు రాసిన ది థేమ్స్‌ ట్రాన్స్‌ఫార్మ్‌డ్‌ అనే పుస్తకం, మానవాళి సంక్షేమం కొరకు అందరూ కలిసిపని చేస్తే సాధ్యంకానిదేదీ లేదనే విషయాన్ని చూపిస్తోన్న ఈ విశిష్టమైన ఘనకార్యాన్ని గురించి వివరించింది. బ్రిటన్‌ యొక్క డ్యూక్‌ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌ ఆ పుస్తకానికి తాను సమకూర్చిన పీఠికలో ఇలా రాశాడు: “భారీ ఎత్తునసాగిన విజయగాథ ఒకటిక్కడ కన్పిస్తోంది, అది పర్యావరణ సంరక్షణకు సంబంధించిన సమస్యలనేవి అనుకుంటుంన్నంత తీవ్రమైనవి కావని ఊహించేలా కొంతమంది ప్రజలను బహుశా ప్రోత్సహించే ప్రమాదం ఉన్నా, ప్రచురించదగినదే. . . . థేమ్స్‌లో సాధించబడిన దానినుండి అవన్నీ [ప్రకృతి పర్యావరణాన్ని కాపాడేందుకు పాటుపడే గ్రూపులు, సంస్థలు] ధైర్యం తెచ్చుకోవచ్చు. శుభవార్త ఏమిటంటే దాన్ని [పర్యావరణాన్ని] యథాస్థితికి తీసుకురావడం సాధ్యమే, వాటి పథకాలు కూడా సఫలం కాగలవు.”

“ది గ్రేట్‌ క్లీనప్‌” అనే అధ్యాయంలో, గత 50 సంవత్సరాల్లో సాధించబడినదాన్ని గురించి హారిసన్‌, గ్రాంట్‌ ఉత్సాహంగా ఇలా రాస్తున్నారు: “ప్రపంచంలో మొట్టమొదటిసారి, విపరీతంగా కలుషితమైపోయి కర్మాగార వ్యర్థపదార్థాలతో పాడైపోయిన నది, జలచరాలూ చేపలూ పుష్కలంగా మళ్ళీ వచ్చి చేరేలా పునరుద్ధరించబడింది. మొదట ఎంతో నిరాశాజనకంగా అనిపించిన పరిస్థితిలో ఎంతో త్వరితంగా సంభవించిన అలాంటి పునరుద్ధరణ, పూర్తిగా నిరాశకు గురైన వన్యప్రాణి సంరక్షకునికి సహితం ప్రోత్సాహాన్నిస్తుంది.”

అటు తర్వాత వాళ్ళు ఆ మార్పుని గురించి ఇలా వర్ణిస్తున్నారు: “రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ప్రధానమైన నీటి కాలువలూ, మురికి నీటివాగులూ పాడైనప్పుడు లేక నాశనం చేయబడినప్పుడు తగిలిన చివరి ఘాతం [దెబ్బ]తో బహుశ మొదలై సంవత్సరాలు గడుస్తుండగా క్రమేణా ఆ నది పరిస్థితి క్షీణించిపోయింది. 1940లలో, 1950లలో థేమ్స్‌నది బొత్తిగా క్షీణించిపోయింది. ఆ నదికీ మురికి కాలువకూ పెద్ద తేడా ఏమీలేదు; నీరు నల్ల రంగులో ఉండేది, ప్రాణవాయువు ఉండేది కాదు, వేసవి నెలల్లో థేమ్స్‌నది నుండి వచ్చే దుర్గంధం చుట్టుప్రక్కల చాలా దూరం వరకూ వ్యాపించేది. . . . నీటి ఉపరితలం పైనుండి గాలిని నేరుగా పీల్చుకొనే సామర్థ్యాన్నిబట్టి తట్టుకొని జీవించగల్గుతున్న కొన్ని ఈల్‌ చేపలు తప్ప, ఒకప్పుడు పుష్కలంగా ఉన్న మిగిలిన చేపలు చివరికి నదిని విడిచిపెట్టి బయటకు వెళ్లిపోయాయి. లండన్‌కూ వూల్‌విచ్‌కూ మధ్యనున్న నదీ ప్రాంతంలో గూడు కట్టుకుని జీవనాన్ని సాగిస్తున్న పక్షులు, కొన్ని అడవిబాతులకూ, హంసలకూ మాత్రమే పరిమితమై పోయాయి, అవి సహజసిద్ధమైన ఆహారానికి బదులుగా నది ఒడ్డునున్న గిడ్డంగుల్లోనుండి చెల్లాచెదురుగా పడిన ధాన్యపు గింజల్ని తినడం ద్వారా జీవించగలిగాయి. . . . పరిస్థితి మారబోతుందనే విషయాన్ని అప్పట్లో ఎవరు మట్టుకు విశ్వసించి ఉండేవారు? పది సంవత్సరాల్లో ఆ ప్రాంతాలకు మధ్యనున్న అదే నదీ భాగం, బొత్తిగా పక్షుల్లేని స్థితి నుండి చలికాలంలో ఆహారం కొరకు వచ్చే 10,000 అడవి కోళ్ళతో, 12,000 వేడర్‌ పక్షులతో పాటుగా, అనేక జాతులకు చెందిన నీటిపక్షులకు నెలవయ్యేలా మార్పు చెందింది.”

నిజమే, భూగోళంలో ఓ మారు మూలన జరిగిన ఒక పునరుద్ధరణను మాత్రమే ఇది వర్ణిస్తోంది. అయినప్పటికీ, ఈ ఉదాహరణ నుండి మనం గుణపాఠాల్ని నేర్చుకోవచ్చు. మానవుని అస్తవ్యస్తమైన నిర్వహణ మూలంగానూ, అత్యాశ మూలంగానూ, అనాలోచన మూలంగానూ భూగ్రహం సర్వనాశనం కాబోతున్నట్టు పరిగణించాల్సిన అవసరం లేదని ఇది చూపిస్తోంది. సరైన విద్యాభ్యాసం, మానవాళి సమష్టి శ్రేయస్సు కోసం సలిపే సమైక్య కృషీ అనేవి, భూమి దాని ఆవరణానికీ, పర్యావరణానికీ, ఉపరితలానికీ జరిగిన విపరీతమైన నష్టాన్ని భర్తీచేసుకొనేలా సహాయ పడగలవు. కానీ తిరుగుతుండే తోకచుక్క లేక ఆస్టెరాయిడ్‌ వంటి వెలుపలి శక్తుల నుండి రాగల నాశనం మాటేమిటి?

అలాంటి కలవరపరిచే ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానాన్నిచ్చే కీలకం తదుపరి శీర్షికలో ఉంది.

[5వ పేజీలోని చిత్రం]

విద్యాబ్యాసమూ, సమైక్య కృషీ అనేవి, భూమికి జరిగిన విపరీతమైన నష్టాన్ని భర్తీచేసుకొనేలా దానికి సహాయ పడగలవు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి