రాజ్య ప్రచారకుల నివేదిక
“నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు”
మహా పరాక్రమవంతుడైన సిరియా సైన్యాధిపతియైన నయమాను కుష్టురోగి. చికిత్స చేయనట్లయితే, ఆ అసహ్యమైన వ్యాధి అతని శరీరావయవాల్ని తిని వేయడమే కాక మరణానికి కూడా దారితీస్తుంది. నయమాను ఏం చేయగలడు? ‘ఇశ్రాయేలు దేశము నుండి చెరగొని తెచ్చిన’ వారిలో ఒక బాలిక నయమాను ఇంట్లో ఉంది. ఆమె ధైర్యంగా నయమానును స్వస్థపర్చగల ప్రవక్తయైన ఎలీషాను గూర్చి చెప్పింది.—2 రాజులు 5:1-3.
ధైర్యవంతమైన ఆమె వైఖరి మూలంగా, నయమాను ఎలీషా వద్దకు వెళ్ళి, స్వస్థత పొందాడు. అంతే కాకుండా, నయమాను యెహోవా ఆరాధికుడయ్యాడు! సా.శ.పూ. పదవ శతాబ్దంలో జరిగిన ఈ సంఘటన, బైబిల్లో నమోదై ఉంది. (2 రాజులు 5:4-15) ఈనాడు, ఎంతోమంది యౌవనులు రాజ్యాసక్తులను గూర్చి మాట్లాడటంలో అలాంటి ధైర్యాన్నే కనబరుస్తున్నారు. మొజాంబిక్ నుండి వచ్చిన ఈ అనుభవం దీన్ని రూఢి చేస్తుంది.
ఆరు సంవత్సరాల నూను బాప్తిస్మం పొందని సువార్త ప్రచారకుడు. బాప్తిస్మం పొందని ప్రచారకుడు కాకముందు కూడా, నూను పొరుగున ఉన్న పిల్లల్ని పోగుచేసి, ప్రార్థన చేసి నా బైబిలు కథల పుస్తకము అనే ప్రచురణనుపయోగించి, వారికి బైబిలు గురించి బోధించేవాడు.
చాలాసార్లు నూను శనివారం ఉదయాన్నే మేల్కొని “ఈ రోజు మనం పరిచర్యకు వెళ్ళాలి” అని ఇంట్లో వారందరికీ గుర్తు చేసేవాడు. పరిచర్యను గూర్చిన అతని ఆసక్తి ఇతర విధాలుగా కూడా కనబడేది. మాపుటోలో తన తల్లిదండ్రులతో పాటు వీధిసాక్ష్యం ఇస్తున్నపుడు, తరచూ నూను తన స్వంతగానే ప్రజల్ని కలిసేవాడు. ఒక సందర్భంలో ఒక వ్యాపారస్థుడు అతని వద్దకు వచ్చి ఇలా అడిగాడు: “ఎందుకు నువ్వీ పత్రికలను అమ్ముతున్నావు?” నూను ఇలా అన్నాడు: “నేనేమీ పత్రికలను అమ్మడం లేదు, కానీ ప్రకటనా పనికి ఆర్థిక సహాయం కొరకు నేను చందాలను స్వీకరిస్తున్నాను.” దానికా వ్యాపారస్థుడు ఇలా అన్నాడు: “నాకంతగా ఆసక్తి లేకపోయినా, నీ వైఖరీ, కౌశలమూ నన్ను బాగా ప్రభావితం చేశాయి. ఈ పనికి నేనూ చందా ఇవ్వాలనుకుంటున్నాను.”
మరో సందర్భంలో, నూను వీధిలో ఒక వ్యక్తిని కలిసి అతనికి నిజమైన శాంతి మరియు భద్రత—దాన్ని ఎలా కనుగొనగలరు? (ఆంగ్లం) అనే పుస్తకాన్ని అందించాడు. ఆ వ్యక్తి ఇలా అడిగాడు: “నువ్వు ఆ స్కూలుకే కదూ వెళ్ళేది?” అందుకు నూను “అవును,” అని “నేను ఆ స్కూలుకే వెళతాను, కానీ ఈ రోజు నేను ఈ పుస్తకంలోని ప్రాముఖ్యమైన సమాచారాన్ని అందిస్తున్నాను. ఈ పుస్తకంలోని బొమ్మలో చూపించినట్లుగా, దేవుడు తీసుకురాబోయే నూతనలోకంలో మీరు జీవించగలరని ఇది మీకు చూపిస్తుంది” అని అన్నాడు. తను మాట్లాడిన వ్యక్తి తన స్కూల్లో టీచరని నూనుకు తెలియదు. ఆ టీచరు ఆ పుస్తకాన్ని తీసుకోవడం మాత్రమే కాదు ఇప్పుడు నూను నుంచి క్రమంగా కావలికోట, తేజరిల్లు! పత్రికలను కూడా తీసుకుంటున్నాడు.
నీకు ప్రకటనా పని అంటే ఎందుకంత ఇష్టం అని నూనును అడిగినపుడు అతడు ఇలా అన్నాడు: “నేను ప్రజలతో మాట్లాడాలనుకుంటాను, యెహోవాను గూర్చి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును గూర్చి వారికి నేర్పించాలను కుంటాను.” ఇంకా ఇట్లన్నాడు: “ప్రజలు వినదల్చుకోనప్పుడు, నిరుత్సాహపడేందుకు ఏ కారణమూ లేదు.”
ప్రపంచ వ్యాప్తంగా, వేలకొలది నూనులాంటి యౌవనులు దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించడానికి, నేర్పించడానికి ‘ఇష్టపూర్వకంగా వస్తున్నారు.’ (కీర్తన 110:3) కానీ ఇది కాకతాళీయంగా జరుగుతున్నది కాదు. తమ పిల్లలకు వారి శిశుప్రాయం నుండే యెహోవాను గూర్చి నేర్పించి, పరిచర్యలో మంచి మాదిరినుంచి, అత్యంతాసక్తితో రాజ్యాసక్తులను వెంబడించే తల్లిదండ్రులు సమృద్ధిగా ప్రతిఫలాలను పొందుతారు.