దేవునితోకూడ నడవడంలో కొనసాగండి
“ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.”—గలతీయులు 5:16.
1. (ఎ) హనోకు ఎటువంటి పరిస్థితుల్లోను, ఎంతకాలంపాటు దేవునితోకూడ నడిచాడు? (బి) నోవహు ఎంతకాలంపాటు దేవునితోకూడ నడిచాడు, ఆయనకు ఎటువంటి బరువైన బాధ్యతలున్నాయి?
హనోకు ‘సత్య దేవునితో నడిచాడు’ అని బైబిలు మనకు చెబుతుంది. తన చుట్టూ ఉన్న ప్రజలు చాలాచెడ్డ మాటలనుపయోగిస్తూ, భక్తిహీనమైన ప్రవర్తన కల్గి ఉన్నప్పటికీ, ఆయన 365 ఏళ్ల వయస్సులో చనిపోయేంతవరకు దేవునితోకూడ నడవడంలో పట్టుదలతో కొనసాగాడు. (ఆదికాండము 5:23, 24; యూదా 14, 15) నోవహు సహితం “దేవునితోకూడ నడచినవాడు.” తన కుటుంబాన్ని పోషిస్తూ, తిరుగుబాటుదారులైన దూతలచే, హింసాయుతులైన వారి సంతానంచే ప్రభావితమైన లోకంతో పోరాడుతూ, ప్రాచీన కాలాల్లోని ఏ సముద్రయాన ఓడకన్నా పెద్దదైన ఒక భారీ ఓడను నిర్మించడానికి అవసరమైన వివరాలన్నింటి గురించి శ్రద్ధతీసుకుంటూ నోవహు దేవునితోకూడ నడిచాడు. జలప్రళయం తర్వాత బాబెలువద్ద యెహోవాకు విరుద్ధంగా తిరుగుబాటు మళ్లీ పొడచూపినప్పటికీ, ఆయన దేవునితోకూడ నడవడంలో కొనసాగాడు. నిజానికి, నోవహు 950 ఏళ్ల వయస్సులో చనిపోయేంతవరకు దేవునితోకూడ నడవడంలో కొనసాగాడు.—ఆదికాండము 6:9; 9:29.
2. ‘దేవునితోకూడ నడవడం’ అంటే అర్థం ఏమిటి?
2 విశ్వసనీయులైన ఈ పురుషులు దేవునితోకూడ ‘నడిచారు’ అని చెబుతున్నప్పుడు, బైబిలు ఆ మాటని ఒక అలంకారిక భాషలో ఉపయోగిస్తుంది. హనోకు, నోవహులు తమకు దేవునిలో దృఢమైన విశ్వాసం ఉందన్నదానికి నిదర్శనంగా తమను తాము ప్రవర్తింపజేసుకున్నారని దానర్థం. వారు యెహోవా తమకు ఆజ్ఞాపించినదానిని చేశారు. మానవజాతితో ఆయన వ్యవహారాలనుబట్టి ఆయన గురించి తమకు తెలిసినదానికి అనుగుణ్యంగా వారు తమ జీవితాలను క్రమబద్ధం చేసుకున్నారు. (2 దినవృత్తాంతములు 7:17 పోల్చండి.) దేవుడు చెప్పినదానికి, చేసినదానికి వారు మానసిక అంగీకారాన్ని వ్యక్తం చేయడం మాత్రమే కాక, వారు దేవుడు కోరినదానంతటినీ చేశారు. అదీ కేవలం కొంతమేరకు మాత్రమే కాదుగానీ, అపరిపూర్ణ మానవులుగా తమకు సాధ్యమైనంత మేరకు చేశారు. ఉదాహరణకు నోవహును తీసుకుంటే, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. (ఆదికాండము 6:22) నోవహు తనకు ఇవ్వబడిన నిర్దేశకాలకు అదనంగా ఏమీ చేయలేదు, మరోవైపు నిర్లక్ష్యంగా వెనుకబడిపోనూ లేదు. యెహోవాతో సాన్నిహిత్యాన్ని అనుభవించినవానిగా, దేవునికి ప్రార్థన చేయడానికి సంకోచించకుండా, దైవిక నిర్దేశాన్ని అమూల్యమైనదిగా ఎంచుతూ ఆయన దేవునితోకూడ నడిచాడు. మీరూ అలాగే చేస్తున్నారా?
నిరాటంకమైన జీవిత గమనము
3. సమర్పించుకుని బాప్తిస్మం పొందిన దేవుని సేవకులందరికీ ఎంతో ప్రాముఖ్యమైనది ఏమిటి?
3 ప్రజలు దేవునితోకూడ నడవడం ప్రారంభించడాన్ని చూడడం హృదయానందకరంగా ఉంటుంది. యెహోవా చిత్తానికి అనుగుణ్యంగా వారు అనుకూలమైన చర్యలను చేపడుతుండగా వారు తమ విశ్వాసానికి నిదర్శనాన్ని ఇస్తారు, అది లేకుండా ఎవరైనా సరే దేవునికి ఇష్టునిగా ఉండడం అసాధ్యం. (హెబ్రీయులు 11:6) గత ఐదు సంవత్సరాలుగా చూస్తే, సగటున ప్రతి సంవత్సరం 3,30,000 కంటే ఎక్కువ మంది యెహోవాకు తమను తాము సమర్పించుకుని నీటి బాప్తిస్మం పొందారన్నది మనకెంత సంతోషకరమైన విషయం! కానీ వారికీ, వారితోపాటు మనందరికీ దేవునితోకూడ నడవడంలో కొనసాగడం కూడా ప్రాముఖ్యము.—మత్తయి 24:13; ప్రకటన 2:10.
4. ఐగుప్తును విడిచిన ఇశ్రాయేలీయుల్లో అత్యధికులు కొంచెం విశ్వాసం ప్రదర్శించినప్పటికీ, వాగ్దానం చేయబడిన దేశంలోనికి ఎందుకు ప్రవేశించలేదు?
4 మోషే కాలంలో, ప్రతి ఇశ్రాయేలు కుటుంబమూ ఐగుప్తులో పస్కాను ఆచరించడానికీ, తమ ఇండ్ల ద్వారబంధపు నిలువు కమ్మిలమీద పైకమ్మిమీద రక్తాన్ని చల్లడానికీ వారికి విశ్వాసం అవసరమైంది. (నిర్గమకాండము 12:1-28) అయితే, ఫరో సైన్యం ఎర్ర సముద్రంవద్ద తమ వెనుక సమీపంలో ఉన్నప్పుడు చాలామంది విశ్వాసం ఊగిసలాడింది. (నిర్గమకాండము 14:9-12) వారు సముద్రము మధ్యన ఆరిన నేలపై సురక్షితంగా అవతలివైపుకు చేరుకున్న తర్వాత, నీళ్లు ఉప్పెనలా ఐగుప్తీయుల సైన్యంమీదికి వచ్చి వారిని నాశనం చేయడం చూసినప్పుడు ఇశ్రాయేలీయులు మళ్లీ “[యెహోవా] వాక్యంలో విశ్వాసముంచారు” అని కీర్తన 106:12 (NW) చూపిస్తుంది. అయితే, కొంతకాలానికే అరణ్యములో ఇశ్రాయేలీయులు త్రాగునీటిని గురించి, ఆహారం గురించి, పర్యవేక్షణ గురించి ఫిర్యాదు చేయనారంభించారు. వాగ్దానం చేయబడిన దేశంనుండి తిరిగివచ్చిన 12 మంది వేగులవారిలో 10 మంది ఇచ్చిన ప్రతికూల నివేదిక వారిని భయభ్రాంతులను చేసింది. కీర్తన 106:24 (NW) చెబుతున్నట్లుగా, ఆ పరిస్థితుల్లో “వారికి [దేవుని] వాక్యంలో విశ్వాసం లేకపోయింది.” వారు ఐగుప్తుకు మరలిపోదామనుకున్నారు. (సంఖ్యాకాండము 14:1-4) వారు దైవిక శక్తికి నిదర్శనంగా కొన్ని అద్భుతమైన ప్రదర్శనలను చూసినప్పుడు మాత్రమే వారిలో కొద్దో గొప్పో విశ్వాసం జాగృతమైంది. వారు దేవునితోకూడ నడవడంలో కొనసాగలేదు. తత్ఫలితంగా, ఆ ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేదు.—కీర్తన 95:10, 11.
5. రెండవ కొరింథీయులు 13:5, సామెతలు 3:5, 6 దేవునితోకూడ నడవడంతో ఎలా సంబంధాన్ని కలిగివున్నాయి?
5 బైబిలు మనల్ని ఇలా పురికొల్పుతుంది: “మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి.” (2 కొరింథీయులు 13:5) “విశ్వాసముగలవారై” ఉండడం అంటే, క్రైస్తవ నమ్మకాల సముదాయానికి అంటిపెట్టుకుని ఉండడమని అర్థం. మన జీవితకాలమంతా కూడా దేవునితోకూడ నడవడంలో విజయులం కావాలంటే ఇది ఆవశ్యకము. దేవునితోకూడ నడవాలంటే మనం యెహోవాపై పూర్తిగా నమ్మకం ఉంచుతూ, విశ్వాస లక్షణాన్ని కూడా పెంపొందించుకోవాలి. (సామెతలు 3:5, 6) అలా చేయడంలో విఫలమయ్యేవారిని పడవేయగల ఎన్నో ఉచ్చులూ ఎన్నెన్నో గోతులూ ఉన్నాయి. వీటిలో కొన్ని ఏవి?
ఆత్మవిశ్వాసమనే ఉచ్చునుండి దూరంగా ఉండండి
6. వ్యభిచారం గురించీ, జారత్వం గురించీ క్రైస్తవులందరికీ ఏమి తెలుసు, వారు ఈ పాపాల గురించి ఎలా భావిస్తారు?
6 బైబిలును పఠించి, యెహోవాకు తన జీవితాన్ని సమర్పించుకుని, బాప్తిస్మం పొందిన ప్రతి వ్యక్తికీ దేవుని వాక్యం వ్యభిచారాన్నీ జారత్వాన్నీ ఖండిస్తుందని తెలుసు. (1 థెస్సలొనీకయులు 4:1-3; హెబ్రీయులు 13:4) వారు ఇది సరియైనదేనని అంగీకరిస్తారు. దానికి అనుగుణ్యంగా జీవించాలని వారు ఉద్దేశిస్తారు. అయినా, లైంగిక అనైతికత సాతాను యొక్క ప్రభావవంతమైన ఉచ్చులలో ఒకటిగా ఉంటూనే వస్తుంది. ఎందుకు?
7. మోయాబు మైదానంలో, ఇశ్రాయేలు పురుషులు తప్పు అని తమకు తెలిసిన ప్రవర్తనలోనే ఎలా పడిపోయారు?
7 మొదట్లో, అటువంటి అనైతిక ప్రవర్తనలో పడిపోయేవారు అలాంటి పని చేయాలని అనుకోకపోవచ్చు. బహుశ మోయాబు మైదానంలోని ఇశ్రాయేలీయుల విషయంలో కూడా అదే వాస్తవమై ఉండవచ్చు. అరణ్యంలో గడుపుతున్న జీవితాన్నిబట్టి విసుగు చెందుతున్న ఇశ్రాయేలు పురుషులకు, వారిని మోహంలో పడవేసిన మోయాబు స్త్రీలూ, మిద్యాను స్త్రీలూ మొదట్లో స్నేహపూర్వకంగాను, ఆదరించేవారిగానూ కనిపించివుండవచ్చు. కానీ యెహోవాను కాదుగానీ బయలును ఆరాధిస్తున్న ప్రజలతో—తమ యౌవనరాండ్రను (చివరికి ప్రసిద్ధిచెందిన కుటుంబాల్లోనివారు కూడా) అవివాహితులైన పురుషులతో లైంగిక సంబంధాలను కలిగివుండేందుకు అనుమతించిన ప్రజలతో సాంగత్యం చేయమన్న ఆహ్వానాన్ని ఇశ్రాయేలీయులు అంగీకరించినప్పుడు ఏమయ్యింది? ఇశ్రాయేలీయుల పాళెములోని పురుషులు అటువంటి సాంగత్యాలను ఆకర్షణీయమైనవిగా దృష్టించడం ప్రారంభించినప్పుడు వారు తప్పు అని తమకు తెలిసినవాటినే చేసేందుకు మోహితులయ్యారు, ఇందుకు వారు తమ ప్రాణాలనే మూల్యంగా చెల్లించాల్సివచ్చింది.—సంఖ్యాకాండము 22:1; 25:1-15; 31:16; ప్రకటన 2:14.
8. మన కాలంలో ఒక క్రైస్తవుడిని లైంగిక అనైతిక కార్యంలోకి ఏది నడిపించగలదు?
8 నేడు ఏది ఒక వ్యక్తి అటువంటి ఉచ్చులో పడిపోయేలా చేయగలదు? ఆ వ్యక్తికి లైంగిక అనైతికతయొక్క గంభీరత తెలిసి ఉన్నప్పటికీ, ఆత్మవిశ్వాసంలోవున్న ప్రమాదాన్ని కూడా తెలుసుకోకపోతే, తప్పుచేయాలనే ప్రలోభం తన తార్కికశక్తినే బలహీనం చేసే పరిస్థితిలోనికి పడిపోయేందుకు తనను తాను అనుమతించుకోవచ్చు.—సామెతలు 7:6-9, 21, 22; 14:16.
9. అనైతికతకు విరుద్ధంగా ఏ లేఖనాధార హెచ్చరికలు మనల్ని కాపాడగలవు?
9 దుష్ట సాంగత్యం మనల్ని భ్రష్టపర్చలేనంత దృఢంగా మనం ఉన్నామని తలస్తూ మోసపోవద్దని దేవుని వాక్యం సూటైన మాటల్లో మనల్ని హెచ్చరిస్తుంది. అందులో అనైతిక ప్రజల జీవితాలను చిత్రీకరించే టీవీ కార్యక్రమాలను చూడడం, అనైతిక కోర్కెలను రేకెత్తించే పత్రికలను చూడడం ఇమిడివున్నాయి. (1 కొరింథీయులు 10:11, 12; 15:33) అనుచితమైన పరిస్థితుల్లో చివరికి తోటి విశ్వాసులతో సాంగత్యం చేయడం కూడా గంభీరమైన సమస్యలకు దారితీయవచ్చు. ఆడామగల మధ్య ఆకర్షణ బలంగా ఉంటుంది. అందుకనే అవివాహితులతో లేక కుటుంబ సభ్యులు కాని వ్యతిరేక లింగవ్యక్తులతోనో ఒంటరిగానూ లేక దగ్గర్లో వేరే ఎవరూ లేని పరిస్థితుల్లోనూ ఉండవద్దని యెహోవా సంస్థ ప్రేమపూర్వకమైన శ్రద్ధతో హెచ్చరించింది. దేవునితోకూడ నడవడంలో కొనసాగాలంటే మనం ఆత్మవిశ్వాసమనే ఉచ్చునుండి దూరంగా ఉండాల్సిన అవసరత ఉంది. అంతేగాక ఆయన మనకిచ్చే హెచ్చరికా సలహాను పాటించాలి కూడా.—కీర్తన 85:8.
మనుష్య భయము మిమ్మల్ని అదుపులో పెట్టనీయకండి
10. “మనుషులకు భయపడడం” ఎలా ఒక ఉచ్చుగా ఉండగలదు?
10 మరొక ప్రమాదం సామెతలు 29:25 (పవిత్ర గ్రంథం—వ్యాఖ్యానసహితం)లో గుర్తించబడింది, అక్కడ ఇలా ఉంది: “మనుషులకు భయపడడం మూలంగా మనుషులు ఉరిలో చిక్కుకుంటారు.” ఒక వేటగాడు ఉపయోగించే ఉరిలో సాధారణంగా మెడకు బిగుసుకునే ఉచ్చు లేక ఏదైనా జంతువు కాళ్లకు మెలికవేసే త్రాడులాంటివి ఉంటాయి. (యోబు 18:8-11) అదే విధంగా మనుషులకు భయపడడం ఒక వ్యక్తి స్వేచ్ఛగా మాట్లాడే సామర్థ్యాన్ని నులిమేయగలదు, దేవుడ్ని ప్రీతిపర్చే విధంగా ప్రవర్తించే సామర్థ్యాన్ని నిర్బంధించగలదు. ఇతరులను ప్రీతిపర్చాలన్న కోరిక సహజం, ఇతరులు ఏమనుకుంటేనేమి అనే కఠినమైన నిర్లక్ష్యం క్రైస్తవత్వం కాదు. అందుకే సమతూకం అవసరము. ఇతరుల సంభావ్య ప్రతిస్పందనలపట్ల చింత కారణంగా ఒక వ్యక్తి దేవుడు నిషేధించే కార్యాన్ని చేసినప్పుడు, లేదా దేవుని వాక్యం చేయమని ఆజ్ఞాపించే కార్యాన్ని చేయక మానినప్పుడు, ఆ వ్యక్తి ఉచ్చులో పడిపోయినట్లే.
11. (ఎ) ఒకరిని అదుపులో పెట్టేలా మనుష్య భయాన్ని అనుమతించడానికి విరుద్ధంగా ఎటువంటి కాపుదల ఉంది? (బి) మనుష్య భయముతో పోరాడుతున్న తన సేవకులకు యెహోవా ఎలా సహాయం చేశాడు?
11 అటువంటి ఉచ్చుకు విరుద్ధంగా కాపుదల ఒక వ్యక్తి సహజసిద్ధమైన ప్రవృత్తిలో లేదు గాని, ‘యెహోవాయందు నమ్మిక యుంచుటలోనే’ ఉంది. (సామెతలు 29:25బి) స్వాభావికంగా సిగ్గుపడే వారైనా దేవునిలో నమ్మకం ఉంచడం ద్వారా ధైర్యవంతులుగాను, స్థిరమైనవారిగాను ఉండగలరు. ఈ సాతాను విధానంలోని ఒత్తిళ్లతో చుట్టుముట్టబడినంత కాలం మనము, ఉచ్చులో పడవేసే మనుష్య భయానికి విరుద్ధంగా జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రవక్తయైన ఏలీయాకు ధైర్యంతోకూడిన సేవ చేసినట్లు చక్కని చరిత్ర ఉన్నప్పటికీ, యెజెబెలు ఆయన ప్రాణం తీస్తానని భయపెట్టినప్పుడు ఆయన పిరికితనంతో పారిపోయాడు. (1 రాజులు 19:2-18) ఒత్తిడికి గురయ్యి, అపొస్తలుడైన పేతురు యేసుక్రీస్తు ఎవరో తనకు తెలియదని భయంతో అన్నాడు, సంవత్సరాల తర్వాత విశ్వాసానికి విరుద్ధంగా నడిచేలా ప్రవర్తించేందుకు ఆయన భయాన్ని అనుమతించాడు. (మార్కు 14:66-71; గలతీయులు 2:11, 12) అయితే, ఏలీయా, పేతురు ఇద్దరూ ఆధ్యాత్మిక సహాయాన్ని స్వీకరించారు, యెహోవాపై నమ్మకంతో ఆయన్ను అంగీకారయుక్తంగా సేవించడంలో కొనసాగారు.
12. దేవుడ్ని ప్రీతిపర్చడం నుండి వారిని ఆపుతున్న భయాన్ని అధిగమించేందుకు కొందరు వ్యక్తులు ఎలా సహాయం పొందారో ఏ ఆధునిక ఉదాహరణలు చూపిస్తున్నాయి?
12 మన దినాల్లో అనేకమంది యెహోవా సేవకులు కూడా ఉచ్చులో పడవేసే భయంపై ఎలా విజయం సాధించాలనేది నేర్చుకున్నారు. గయానాలోని ఒక టీనేజ్ అమ్మాయి ఇలా చెబుతుంది: “స్కూలులో తోటి విద్యార్థుల ఒత్తిడిని ఎదుర్కోవడానికి బలంగా పోరాడాల్సివస్తుంది.” కానీ ఆమె ఇంకా ఇలా చెబుతుంది: “యెహోవాలో నా విశ్వాసం కూడా బలంగానే ఉంది.” తన విశ్వాసం గురించి క్లాసులో అందరిముందూ ఉపాధ్యాయుడు ఆమెను ఎగతాళి చేసినప్పుడు ఆమె నెమ్మదిగా యెహోవాకు ప్రార్థించింది. తర్వాత ఆమె వ్యక్తిగతంగా ఆ ఉపాధ్యాయునికి యుక్తిగా సాక్ష్యాన్ని ఇచ్చింది. ఒక యువకుడు యెహోవా తన నుండి ఏమి కోరుతున్నాడో నేర్చుకుంటున్నాడు. అందుకని, ఆయన ఒకసారి బెనిన్లోని తన స్వగ్రామానికి వెళ్లినప్పుడు తన తండ్రి తన కొరకు చెక్కిచ్చిన ఒక విగ్రహాన్ని వదిలించుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ ప్రతిమ నిర్జీవమైనదని ఆ యువకునికి తెలుసు, ఆయన ఆ విగ్రహానికి భయపడలేదు. కానీ కుపితులైన గ్రామస్థులు తనను చంపాలని చూస్తుండవచ్చని కూడా ఆయనకు తెలుసు. ఆయన యెహోవాకు ప్రార్థించి, రాత్రిపూట విగ్రహాన్ని తీసుకుని పొదల్లోకి వెళ్లి దాన్ని వదిలించుకున్నాడు. (న్యాయాధిపతులు 6:27-31 పోల్చండి.) డొమినికన్ రిపబ్లిక్లోని ఒక స్త్రీ యెహోవాను సేవించడం ప్రారంభించినప్పుడు, తాను కావాలో లేక యెహోవా కావాలో తేల్చుకోమని ఆమె భర్త ఆమెతో ఖండితంగా చెప్పాడు. విడాకులు ఇస్తానని ఆయన ఆమెను భయపెట్టాడు. భయం ఆమె తన విశ్వాసాన్ని విడనాడేలా చేస్తుందా? ఆమె ఇలా ప్రత్యుత్తరం ఇచ్చింది: “దాంపత్య ద్రోహం ఇమిడివున్నట్లైతే నేను సిగ్గుపడేదాన్ని, కానీ యెహోవా దేవునికి సేవచేస్తున్నందుకు సిగ్గుపడను!” ఆమె దేవునితోకూడ నడవడంలో కొనసాగింది, సకాలంలో ఆమె భర్త కూడా ఆమెతోపాటు యెహోవా చిత్తాన్ని చేయడంలో ఆమెతో చేరాడు. మన పరలోకపు తండ్రిపై పూర్తి నమ్మకంతో మనం కూడా, యెహోవాను ప్రీతిపరుస్తుందని మనకు తెలిసిన దేనినైనా చేయకుండా చేసే మనుష్య భయాన్ని విడనాడవచ్చు.
సలహా ప్రాధాన్యతను తక్కువ చేయడాన్ని నివారించండి
13. మొదటి తిమోతి 6:9లో మనము ఏ ఉచ్చు గురించి హెచ్చరించబడుతున్నాము?
13 వేటగాళ్లు ఉపయోగించే కొన్ని ఉచ్చులు అటుగా వెళ్లే ఏ జంతువునైనా పట్టుకోవడానికి రూపొందించబడినప్పటికీ కొన్ని ఉచ్చులు మాత్రం మోసకరమైన రీతిలో ఆకర్షణీయంగా ఉండే ఎరలతో జంతువులను ప్రలోభంలో పడవేస్తాయి. చాలామందికి ధనసంపదలు అలాంటివే. (మత్తయి 13:22) 1 తిమోతి 6:8, 9లో, అన్నవస్త్రములతో తృప్తికల్గివుండమని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది. తర్వాత అదిలా హెచ్చరిస్తుంది: “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.”
14. (ఎ) అన్నవస్త్రములతో తృప్తిపడమన్న సలహాను అనుసరించడం నుండి ఒక వ్యక్తిని ఏది బహుశ ఆపవచ్చు? (బి) ధనసంపదలు అనేవాటి తప్పు నిర్వచనం, 1 తిమోతి 6:9లోని హెచ్చరికను ఒక వ్యక్తి తక్కువ ప్రాధాన్యమైనదిగా దృష్టించేలా ఎలా చేయగలదు? (సి) కొందరు తమ కొరకు వేచివున్న ఉచ్చును గుర్తించకుండేలా “నేత్రాశ” వారిని ఎలా అంధులను చేయగలదు?
14 ఇటువంటి హెచ్చరిక ఇవ్వబడినా, చాలామంది ఉరిలో పడిపోతారు, ఎందుకంటే వారు సలహాను తమకు అన్వయించుకోరు. ఎందుకని? బైబిలు తృప్తిపడమని చెబుతున్న “అన్నవస్త్రముల”కన్నా ఎక్కువే తెచ్చిపెట్టే జీవితవిధానాన్ని మూర్ఖంగా అంటిపెట్టుకునేందుకు గర్వం వారిని ప్రభావితం చేస్తుందా? ధనసంపదలు అంటే చాలా ధనవంతులు కలిగివుండేవే అని వారు నిర్వచిస్తున్నందున బహుశ వారు బైబిలు హెచ్చరిక ప్రాధాన్యతను తక్కువ చేస్తారా? ధనవంతులవ్వాలనే కృతనిశ్చయం, అన్నవస్త్రాలతో తృప్తిపడాలని అనుకోవడంతో పూర్తి విరుద్ధంగా ఉందని బైబిలు చూపుతుంది. (హెబ్రీయులు 13:5 పోల్చండి.) “నేత్రాశ”—అంటే తాము చూసిన వాటిని తమ స్వంతం చేసుకోవాలనే కోరిక, చివరికి ఆధ్యాత్మిక కార్యకలాపాలను బలిచేసైనా వాటిని సంపాదించాలనే కోరిక వారు సత్యారాధనను రెండవ స్థానానికి త్రోసివేసేలా చేస్తుందా? (1 యోహాను 2:15-17; హగ్గయి 1:2-8) యెహోవా సేవనే తమ జీవితాల్లో కేంద్రబిందువుగా చేసుకోవడం ద్వారా బైబిలు సలహాను నిజంగా అనుసరించి, దేవునితోకూడ నడిచేవారు నిజంగా ఎంత సంతోషకరమైన ప్రజలు!
జీవిత చింతలను విజయవంతంగా ఎదుర్కోవడము
15. అర్థంచేసుకోదగిన ఏ పరిస్థితులు యెహోవా ప్రజల్లో చాలామందికి చింతను కలుగజేయగలవు, మనం అటువంటి ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏ ఉచ్చు గురించి జాగ్రత్తగా ఉండాలి?
15 ధనవంతులవ్వాలన్న దృఢ సంకల్పంకన్నా ఎక్కువ సాధారణమైనది, జీవితావసరాలను తీర్చుకోవడంపట్ల చింత. యెహోవా సేవకుల్లో చాలామందికి వస్తుపరంగా చాలా తక్కువ ఉంది. కనీసవస్త్రాలు, తమ కుటుంబం రాత్రిపూట తలదాచుకోవడానికి కాస్తంత స్థలం, ఆ రోజుకు కావాల్సిన కొంచెం ఆహారము సంపాదించుకోవడానికే వారు ఎన్నో గంటలు కష్టపడి పనిచేస్తారు. మరితరులు, తాము లేక తమ కుటుంబ సభ్యులు అస్వస్థులవ్వడం వృద్ధులవ్వడం మూలంగానో వచ్చిపడే సమస్యలతో పోరాడుతుంటారు. తమ జీవితాల్లో నుండి ఆధ్యాత్మిక విషయాలను తుడిచిపెట్టేందుకు అటువంటి పరిస్థితులను అనుమతించడం ఎంత సులభం!—మత్తయి 13:22.
16. జీవిత ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడు?
16 మెస్సీయా రాజ్యం క్రింద మనం అనుభవించే ఉపశమనం గురించి ప్రేమపూర్వకంగా యెహోవా మనకు చెబుతున్నాడు. (కీర్తన 72:1-4, 16; యెషయా 25:7, 8) మన జీవిత ప్రాధాన్యతలను ఎలా సరిచేసుకోవచ్చో సలహా ఇవ్వడం ద్వారా నేటి జీవిత ఒత్తిళ్లను ఎదుర్కోవడం ఎలాగో కూడా ఆయన మనకు నేర్పిస్తున్నాడు. (మత్తయి 4:4; 6:25-34) గతకాలంలో తాను తన సేవకులకు ఎలా సహాయం చేశాడో వాటి వివరణల నివేదికల ద్వారా యెహోవా మనకు హామీనిస్తున్నాడు. (యిర్మీయా 37:21; యాకోబు 5:11) మనపైకి ఎటువంటి దుస్థితి వచ్చిపడినా తన యథార్థ సేవకులపట్ల తన ప్రేమ నిరంతరమూ ఉంటుందన్న జ్ఞానముతో ఆయన మనల్ని దృఢపరుస్తున్నాడు. (రోమీయులు 8:35-39) యెహోవాపై తమ నమ్మకాన్ని ఉంచేవారికి ఆయనిలా ప్రకటిస్తున్నాడు: “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను.”—హెబ్రీయులు 13:5.
17. ఘోరమైన దుస్థితిలో ఉన్న వ్యక్తులు ఎలా దేవునితోకూడ నడుస్తూ ఉన్నారో ఉదాహరణలు ఇవ్వండి.
17 ఈ జ్ఞానము మూలంగా బలపర్చబడిన నిజ క్రైస్తవులు లోకస్థుల మార్గాల్లోకి మళ్లడానికి బదులుగా దేవునితోకూడ నడవడంలో కొనసాగుతారు. ఒకరు తమ కుటుంబాన్ని పోషించడానికి, ఉన్నవాళ్ల దగ్గరినుండి తీసుకోవడం దొంగతనం కాదు అనేది చాలా దేశాల్లోని బీద ప్రజల్లో సాధారణంగా ఉన్న ఇహలోక తత్వం. కానీ విశ్వాసంవలననే నడుచుకునేవారు ఆ దృక్కోణాన్ని విసర్జిస్తారు. అన్నింటికీ మించి దేవుని అంగీకారం అమూల్యమైనదిగా వారు ఎంచుతారు, నిజాయితీతో కూడిన తమ ప్రవర్తనకు ప్రతిఫలం కొరకు వారు ఆయనవైపుకి చూస్తారు. (సామెతలు 30:8, 9; 1 కొరింథీయులు 10:13; హెబ్రీయులు 13:18) ఇండియాలోని ఒక విధవరాలు పనిచేయడానికి ఇష్టపడడమూ, దానితోపాటు సాధనోపాయాల్ని కొనుగొనడమూ తనకు సహాయపడ్డాయని తెలుసుకుంది. జీవితంలో తన పరిస్థితిపట్ల ఉక్రోషంతో ఉండడానికి బదులుగా, దేవుని రాజ్యాన్నీ ఆయన నీతిని తన జీవితంలో మొదట ఉంచితే, తనకు తన కుమారునికి అవసరమయ్యే జీవితావసరాలను తీర్చుకునేందుకు తాను చేసే ప్రయత్నాల్ని యెహోవా ఆశీర్వదిస్తాడని ఆమెకు తెలుసు. (మత్తయి 6:33, 34) తాము అనుభవించే దుస్థితి ఎటువంటిదైనప్పటికీ భూవ్యాప్తంగా వేలాదిమంది యెహోవా తమ ఆశ్రయమని తమ కోట అని ప్రదర్శించి చూపిస్తున్నారు. (కీర్తన 91:2) అది మీ విషయంలోనూ వాస్తవమేనా?
18. సాతాను లోకంలోని ఉచ్చులకు దూరంగా ఉండడానికి కీలకమేమిటి?
18 ఈ ప్రస్తుత విధానంలో జీవిస్తున్నంత కాలం జాగ్రత్తపడాల్సిన ఉచ్చులు ఉంటూనే ఉంటాయి. (1 యోహాను 5:19) బైబిలు వీటిని మనకు చూపిస్తుంది, అంతేగాక వాటిని ఎలా తప్పించుకోవచ్చో కూడా చూపిస్తుంది. యెహోవాను నిజంగా ప్రేమిస్తూ, ఆయనను అప్రీతిపర్చడం పట్ల ఆరోగ్యకరమైన భయాన్ని కలిగివున్నవారు అటువంటి ఉచ్చులతో విజయవంతంగా వ్యవహరించగలరు. వారు ‘ఆత్మానుసారముగా నడుచుకుంటూ ఉంటే’ వారు లోకస్థుల మార్గాల్లో పడిపోరు. (గలతీయులు 5:16-25) యెహోవాతో తమ సంబంధం చుట్టూ తమ జీవితాలను నిర్మించుకునే వారందరికీ, దేవునితోకూడ నడుస్తూ ఆయనతో నిరంతర సాన్నిహిత్యాన్ని అనుభవించే గొప్ప ఉత్తరాపేక్ష ఉంది.—కీర్తన 25:14.
మీ వ్యాఖ్యానం ఏమిటి?
◻ ఆత్మవిశ్వాసం ఎలా ఒక ఉచ్చు కాగలదు?
◻ మనుష్య భయము మనల్ని అదుపులో పెట్టడానికి విరుద్ధంగా ఏది మనకు కాపుదలను అందజేయగలదు?
◻ ధనసంపదలు కూర్చుకోవడంలోని ప్రమాదాన్ని గురించిన సలహాను అన్వయించుకోవడంలో ఏది మనం విఫలమయ్యేలా చేయగలదు?
◻ జీవిత చింతలవల్ల ఉచ్చులో పడకుండా ఉండడానికి ఏది మనకు సహాయం చేయగలదు?
[16, 17వ పేజీలోని చిత్రం]
చాలామంది తమ జీవితమంతటిలోనూ దేవునితోకూడ నడుస్తూ ఉన్నారు