కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 12/15 పేజీలు 11-16
  • ‘యెహోవా దినాన్ని’ తప్పించుకోవడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘యెహోవా దినాన్ని’ తప్పించుకోవడం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నోవహు దినములలో యెహోవా చర్యతీసుకోవడం
  • సొదొమ గొమొఱ్ఱాలకు యెహోవా విధించిన న్యాయశిక్ష
  • ఇశ్రాయేలు ‘ప్రళయవాయువును’ కోయడం
  • యెహోవా మతభ్రష్ట యూదా యొక్క లెక్కచూడడం
  • మొదటి శతాబ్దపు “మహా శ్రమ”
  • మహాశ్రమల నుండి సజీవంగా రక్షించబడుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • రక్షణ కొరకు నోటితో ఒప్పుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • మనం అప్రమత్తంగా ఉండడం ఇప్పుడు మరింత అత్యవసరం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • మీరు యెహోవా దినం కొరకు సంసిద్ధంగా ఉన్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 12/15 పేజీలు 11-16

‘యెహోవా దినాన్ని’ తప్పించుకోవడం

“యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు?”—యోవేలు 2:11.

1. ‘యెహోవా భయంకరమైన దినము’ ఎందుకు ఆనందించవలసిన సందర్భమై ఉండాలి?

“భయంకరము”! దేవుని పవక్తయైన యోవేలు, “యెహోవా” యొక్క గొప్ప “దినము” గురించి అలా వర్ణిస్తున్నాడు. అయితే, యెహోవాను ప్రేమిస్తూ, యేసు విమోచన క్రయధన బలి ఆధారంగా ఆయనకు సమర్పించుకుని ఆయన వద్దకు వచ్చిన మనం, యెహోవా దినం సమీపిస్తుండగా భయంతో బిగుసుకు పోనవసరం లేదు. వాస్తవానికి అదొక భయంగొల్పే దినంగానే ఉన్నాగానీ, ఒక గొప్ప రక్షణ దినంగా అంటే, వేలాది సంవత్సరాలుగా మానవజాతిని పీడించిన ఒక దుష్టవిధానం నుండి విడుదల తీసుకువచ్చే దినంగా ఉంటుంది. ఆ దినం కొరకు నిరీక్షిస్తూ, “సంతోషించి, గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు” చేయునని యోవేలు దేవుని ప్రజలకు చెబుతున్నాడు. ఆయన ఈ హామీని జత చేస్తున్నాడు: “యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరు రక్షింపబడుదురు.” అప్పుడు దేవుని రాజ్య ఏర్పాటులో, “తప్పించు కొనిన వారుందురు, శేషించినవారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు.”—యోవేలు 2:11, 21, 22, 32.

2. దేవుని సంకల్పాల నెరవేర్పుగా, (ఎ) ‘ప్రభువు దినంలో’ ఏమి జరుగుతుంది? (బి) ‘యెహోవా దినంలో’ ఏమి జరుగుతుంది?

2 యెహోవా యొక్క భయంకరమైన దినమూ, ప్రకటన 1:10 నందలి ‘ప్రభువు దినము’ ఒకటేననుకుని తికమక పడకూడదు. ప్రభువు దినంలో, ప్రకటన 1 నుండి 22 అధ్యాయాలలో వర్ణింపబడిన 16 దర్శనాల నెరవేర్పు ఇమిడివుంది. “ఇవి ఎప్పుడు జరుగును. నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి?” అని తన శిష్యులు వేసిన ప్రశ్నకు సమాధానంగా యేసు ప్రవచించిన సంఘటనలన్నిటి నెరవేర్పు సమయం అందులో ఇమిడి ఉంటుంది. యేసు పరలోక ప్రత్యక్షత, భయంకరమైన ‘యుద్ధాలు, కరవులు, ద్వేషాలు, తెగుళ్లు, అక్రమం’ వంటివాటిచే భూమిపై గుర్తించబడింది. ఈ దుఃఖదాయక విపత్తులు రెట్టింపవ్వగా, “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతట” ప్రకటించడానికి తన ఆధునిక దిన శిష్యులను పంపించడం ద్వారా యేసు, దైవభయంగల మానవులకు ఓదార్పును అనుగ్రహించాడు. ఆ తర్వాత, ప్రభువు దినం యొక్క చరమాంకంగా, ప్రస్తుత విధానం యొక్క “అంతము” అంటే యెహోవా భయంకరమైన దినం ప్రారంభమవుతుంది. (మత్తయి 24:3-14; లూకా 21:11) అది, సాతాను యొక్క కలుషిత ప్రపంచంపై యెహోవా సత్వరంగా తీర్పుతీర్చే దినమై ఉంటుంది. “భూమ్యాకాశములు వణకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును.”—యోవేలు 3:16.

నోవహు దినములలో యెహోవా చర్యతీసుకోవడం

3. నేటి పరిస్థితులు నోవహు దినాలకు ఎలాంటి సమాంతరాన్ని కల్గివున్నాయి?

3 నేటి ప్రపంచ పరిస్థితులు, 4,000 కంటే ఎక్కువ సంవత్సరాల క్రిందట “నోవహు దినములలో” ఉన్న పరిస్థితులకు సమాంతరంగా ఉన్నాయి. (లూకా 17:26, 27) ఆదికాండము 6:5 నందు మనమిలా చదువుతాము: “నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూ[సెను].” ఇది నేటి ప్రపంచాన్ని ఎంతగా పోలివుందో కదా! దుష్టత్వం, అత్యాశ, ప్రేమరాహిత్యం సర్వవ్యాప్తంగా ఉన్నాయి. మానవజాతి చెడుతనం విషయంలో అధఃపాతాళానికి చేరిందని కొన్నిసార్లు మనమనుకోవచ్చు. కానీ, “దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు” అని అపొస్తలుడైన పౌలు “అంత్యదినముల”ను గురించి చేసిన ప్రవచనం యొక్క నెరవేర్పు కొనసాగుతోందంతే.—2 తిమోతి 3:1, 13.

4. తొలి కాలాల్లో అబద్ధ ఆరాధన ఏ ప్రభావాన్ని చూపింది?

4 నోవహు కాలంలో మతం మానవజాతికి ఉపశమనాన్ని తెచ్చి ఉండగలిగేదా? దానికి భిన్నంగా, అప్పట్లో ఉనికిలోవున్నటువంటి భ్రష్టమతం వినాశనకరమైన పరిస్థితులకు మరింతగా దోహదపడి ఉండవచ్చు. మన మొదటి తలిదండ్రులు, ‘అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పము’ యొక్క అబద్ధబోధకు లొంగిపోయారు. ఆదాము తర్వాత రెండవ తరంలో, “యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది,” అయితే అది దూషణకరంగానని స్పష్టమౌతుంది. (ప్రకటన 12:9; ఆదికాండము 3:3-6; 4:26) ఆ తర్వాత, దేవునికి అనితర భక్తి చెల్లించడాన్ని వదిలిపెట్టిన తిరుగుబాటుదారులైన దేవదూతలు, చక్కనివారైన మానవ కుమార్తెలతో అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకునేందుకు మానవ శరీరాలను దాల్చారు. ఈ స్త్రీలు నెఫీలులని పిలువబడిన సంకరజాతి మహాకాయులకు జన్మనిచ్చారు, వారు మానవజాతిని అణచివేసి, పీడించారు. ఈ దయ్యాల ప్రభావం క్రింద, ‘భూలోకము చెడిపోయి ఉండెను.’—ఆదికాండము 6:1-12.

5. నోవహు దినాల్లోని సంఘటనలకు సంబంధించి, హెచ్చరికతో కూడిన ఏ ఉపదేశాన్ని యేసు మనకిస్తున్నాడు?

5 అయితే, ఒక కుటుంబం మాత్రం యెహోవా ఎడల తమ యథార్థతను కాపాడుకుంది. అందుకే దేవుడు “భక్తిహీనుల సమూహముమీదికి జలప్రళయమును రప్పించినప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను.” (2 పేతురు 2:5) ఆ జలప్రళయం ఈ విధానాంతాన్ని సూచించే యెహోవా భయంకరమైన దినానికి ముంగుర్తుగా ఉంది, దాని గురించి యేసు ఇలా ప్రవచించాడు: “అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి; ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ ఉండును.” (మత్తయి 24:36-39) నేడు మనమూ అలాంటి పరిస్థితిలోనే ఉన్నాము, కాబట్టి మనం ‘జరుగబోయే వీటన్నింటినీ తప్పించుకొనగలిగేలా ఎల్లప్పుడు ప్రార్థనచేస్తూ మెలకువగా ఉండాలని’ యేసు మనల్ని పురికొల్పుతున్నాడు.—లూకా 21:34-36.

సొదొమ గొమొఱ్ఱాలకు యెహోవా విధించిన న్యాయశిక్ష

6, 7. (ఎ) లోతు కాలంలోని సంఘటనలు దేనికి ముంగుర్తుగా ఉన్నాయి? (బి) ఇది మనకు ఏ స్పష్టమైన హెచ్చరికను ఇస్తుంది?

6 జలప్రళయం సంభవించిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత, నోవహు సంతానం భూమియందంతటా విస్తరించినప్పుడు, నమ్మకమైనవాడైన అబ్రాహాము మరియు ఆయన అన్న కుమారుడైన లోతు యెహోవా యొక్క మరో భయంకరమైన దినానికి ప్రత్యక్ష సాక్షులయ్యారు. లోతు, ఆయన కుటుంబమూ సొదొమ పట్టణంలో నివసించేవారు. దీని పొరుగు పట్టణమైన గొమొఱ్ఱాతోపాటూ ఈ పట్టణం, హేయమైన లైంగిక దుర్నీతిలో కూరుకుపోయాయి. భౌతికవాదం కూడా ప్రధానాకర్షక కేంద్రంగా ఉండేది, చివరికది లోతు భార్యపై కూడా ప్రభావం చూపింది. యెహోవా అబ్రాహాముతో ఇలా చెప్పాడు: “సొదొమ గొమొఱ్ఱాలను గూర్చిన మొర గొప్పది . . . వాటి పాపము బహు భారమైనది.” (ఆదికాండము 18:20) ఆ పట్టణాలలో ఉన్న నీతిమంతులను బట్టి ఆ పట్టణాలను నాశనం చేయవద్దని అబ్రాహాము యెహోవాను వేడుకున్నాడు, కాని అక్కడ తాను కనీసం పదిమంది నీతిమంతులను కూడా కనుగొనలేకపోయానని యెహోవా వెల్లడించాడు. సమీపంలో ఉన్న పట్టణమైన సోయరుకు పారిపోవడానికి లోతుకు ఆయన ఇద్దరు కుమార్తెలకు దేవుని వద్దనుండి వచ్చిన దూతలు సహాయం చేశారు.

7 ఆతర్వాత ఏం జరిగింది? మన “అంత్యదినముల”ను లోతు దినాలకు పోలుస్తూ, లూకా 17:28-30 ఇలా నివేదిస్తుంది: “లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరిని నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును.” యెహోవా యొక్క ఆ భీతిగొల్పే దినాన సొదొమ గొమొఱ్ఱాల దుస్థితి, యేసు ప్రత్యక్షత యొక్క ఈ కాలంలో ఉన్న మనకు స్పష్టమైన హెచ్చరికనిస్తుంది. మానవజాతి యొక్క ఆధునిక తరంవారు కూడా “వ్యభిచారము చేయుచు, పరశరీరానుసారులై” ఉన్నారు. (యూదా 7) అంతేగాక, మన కాలంలోని అవినీతికరమైన లైంగిక నైతిక దృక్పథాలు, ఈ కాలం కొరకు యేసు ప్రవచించిన అనేక “తెగుళ్ల”కు కారణమై ఉన్నాయి.—లూకా 21:11.

ఇశ్రాయేలు ‘ప్రళయవాయువును’ కోయడం

8. ఇశ్రాయేలీయులు యెహోవాతో ఎంత వరకు నిబంధన కలిగివున్నారు?

8 యెహోవా తగిన సమయంలో ‘సమస్తదేశ జనులలో తన స్వకీయ సంపాద్యముగానూ . . . యాజక రూపమైన రాజ్యముగానూ పరిశుద్ధమైన జనముగానూ’ ఇశ్రాయేలును ఎంపిక చేసుకున్నాడు. కాని ఇది, వారు ‘ఆయన మాట శ్రద్ధగా విని ఆయన నిబంధన ననుసరించి నడుచుకోవడంపై’ అధారపడి ఉంటుంది. (నిర్గమకాండము 19:5, 6) వారు ఈ ఘనమైన ఆధిక్యతను ఘనపర్చారా? ఎంతమాత్రం ఘనపర్చలేదు! నిజమే, ఆ జనాంగములోని నమ్మకమైన వ్యక్తులు అంటే మోషే, సమూయేలు, దావీదు, యెహోషాపాతు, హిజ్కియా, యోషీయా, అలాగే భక్తిపరులైన ఇతర ప్రవక్తలు మరియు ప్రవక్త్రిలు యథార్థంగా ఆయన సేవ చేశారు. అయితే ఒక జనాంగంగా మాత్రం వారు నమ్మకంగా ఉండలేదు. తగిన సమయానికి, ఆ రాజ్యం రెండు భాగాలయ్యింది—ఇశ్రాయేలు మరియు యూదా. మొత్తంమీద ఆ రెండు జనాంగాలు అన్యమత ఆరాధనలోనూ, దేవుడ్ని అగౌరవపరిచే పొరుగు దేశాల ఇతర ఆచారాలలోనూ నిమగ్నమైపోయాయి.—యెహెజ్కేలు 23:49.

9. తిరుగుబాటుదారులైన పది గోత్రాల రాజ్యానికి యెహోవా ఎలా తీర్పు తీర్చాడు?

9 విషయాలను యెహోవా ఎలా పరిగణించాడు? “తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు” అని ఆమోసు చెప్పిన సూత్రం అనుసారంగా ఎప్పటిలానే ఆయన హెచ్చరికనిచ్చాడు. ఇశ్రాయేలు ఉత్తర రాజ్యానికి ఆమోసు తానే ఇలా శ్రమను ప్రకటించాడు: “యెహోవాదినము వచ్చుటవలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగుకాదు, అంధకారము.” (ఆమోసు 3:7; 5:18) ఇంకా, ఆమోసు తోటి ప్రవక్తయైన హూషేయ ఇలా ప్రకటించాడు: “వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును.” (హూషేయ 8:7) ఇశ్రాయేలు ఉత్తర రాజ్యాన్ని శాశ్వతంగా తుడిచిపెట్టేందుకు సా.శ.పూ. 740లో యెహోవా అష్షూరీయుల సైన్యాన్ని ఉపయోగించాడు.

యెహోవా మతభ్రష్ట యూదా యొక్క లెక్కచూడడం

10, 11. (ఎ) యెహోవా యూదాను క్షమించడానికి ఎందుకు సుముఖంగా లేడు? (బి) జనాంగాన్ని ఏ హేయమైన క్రియలు కలుషితం చేశాయి?

10 యూదా దక్షిణ రాజ్యానికి కూడా యెహోవా తన ప్రవక్తలను పంపించాడు. అయినప్పటికీ, మనష్షే మరియు అతని వారసుడైన ఆమోను వంటి యూదా రాజులు ‘నిరపరాధ రక్తాన్ని విస్తృతంగా చిందించి, అసహ్యమైన విగ్రహాలకు సేవచేస్తూ, వాటికి నమస్కరిస్తూ’ ఆయన దృష్టికి చెడ్డదైనదాన్ని చేయడంలో కొనసాగారు. ఆమోను కుమారుడైన యోషీయా యెహోవా దృష్టికి సరైనది చేసినప్పటికీ, ఆయన తర్వాత వచ్చిన రాజులూ అలాగే ప్రజలూ మళ్లీ దుష్టత్వంలో మునిగిపోయారు, దానితో “క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను.”—2 రాజులు 21:16-21; 24:3, 4.

11 తన ప్రవక్తయైన యిర్మీయా ద్వారా యెహోవా ఇలా ప్రకటించాడు: “ఘోరమైన భయంకరకార్యము దేశములో జరుగుచున్నది. ప్రవక్తలు అబద్ధప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు, ఆలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము; దాని ఫలము నొందునప్పుడు మీరేమి చేయుదురు?” యూదా జనాంగము ఘోర రక్తాపరాధి అయ్యింది, దొంగతనం చేయడం, హత్యచేయడం, వ్యభిచరించడం, అబద్ధ ప్రమాణాలు చేయడం, ఇతర దేవుళ్లను ఆరాధించడం, మరితర హేయమైన క్రియలు చేయడం ద్వారా దాని ప్రజలు భ్రష్టులైపోయారు. దేవుని ఆలయం “దొంగల గుహ” అయిపోయింది.—యిర్మీయా 2:34; 5:30, 31; 7:8-12.

12. మతభ్రష్ట యెరూషలేమును యెహోవా ఎలా శిక్షించాడు?

12 యెహోవా ఇలా ప్రకటించాడు: “ఉత్తరదిక్కు [కల్దీయ] నుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనమును రప్పించుచున్నాను.” (యిర్మీయా 4:6) అందుకే, ఆయన మతభ్రష్ట యెరూషలేమును దాని ఆలయాన్ని పగులగొట్టడానికి, ఆ కాలంలో “సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట” అయిన బబులోను ప్రపంచ శక్తిని రప్పించాడు. (యిర్మీయా 50:23) సా.శ.పూ. 607లో తీవ్రమైన ముట్టడి తర్వాత, నెబుకద్నెజరు శక్తివంతమైన సైన్యం ముందు ఆ నగరం లొంగిపోయింది. “బబులోనురాజు రిబ్లా పట్టణములో సిద్కియా [రాజు] కుమారులను అతని కన్నులయెదుట చంపించెను, మరియు బబులోనురాజు యూదా ప్రధానులందరిని చంపించెను. అంతట అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతని బబులోనునకు తీసికొనిపోవుటకై సంకెళ్లతో బంధించెను. కల్దీయులు రాజనగరును ప్రజల యిండ్లను అగ్ని చేత కాల్చివేసి యెరూషలేము ప్రాకారములను పడగొట్టిరి. అప్పుడు రాజదేహ సంరక్షకుల కధిపతియగు నెబూజరదాను శేషించి పట్టణములో నిలిచియున్న ప్రజలను, ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరినవారిని, శేషించిన ప్రజలనందరిని బబులోనునకు కొనిపోయెను.”—యిర్మీయా 39:6-9.

13. సా.శ.పూ. 607 నాటి యెహోవా దినాన్నుండి ఎవరు రక్షించబడ్డారు మరియు ఎందుకు?

13 నిజంగా భయంకరమైన దినమే! అయినప్పటికీ, ఆ ఉగ్రతతో కూడిన తీర్పు నుండి విడుదల పొందిన వారిలో యెహోవా ఎడల విధేయత చూపిన కొద్దిమంది ఉన్నారు. వీరిలో ఇశ్రాయేలీయులు కాని రేకాబీయులు కూడా ఉన్నారు. వీరు యూదయ నివాసులకు భిన్నంగా వినయ విధేయతలతో కూడిన స్ఫూర్తిని చూపించారు. బురదతో నిండిన గోతిలో మరణించకుండా యిర్మీయాను కాపాడిన నమ్మకమైన నపుంసకుడైన ఎబెద్మెలెకు, యిర్మీయా యొక్క యథార్థవంతుడైన శాస్త్రియగు బారూకు కూడా రక్షించబడ్డారు. (యిర్మీయా 35:18, 19; 38:7-13; 39:15-18; 45:1-5) “నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు” అని యెహోవా ప్రకటించింది అలాంటివారికే. బబులోనును జయించిన రాజైన కోరేషు దైవభయంగల యూదులను విడుదల చేయడంతో వాళ్లు యెరూషలేము నగరాన్నీ ఆలయాన్నీ పునర్నిర్మించడానికి తిరిగి వచ్చినప్పుడు సా.శ.పూ. 539లో ఆ వాగ్దానం స్వల్ప పరిమాణంలో నెరవేరింది. నేడు బబులోను సంబంధమైన మతం నుండి బయటికివచ్చి, యెహోవా స్వచ్ఛారాధనను పునఃప్రారంభించినవారు, యెహోవా పునఃస్థాపిత పరదైసు నందలి నిత్య శాంతితోకూడిన మహిమాన్విత భవిష్యత్తు కొరకు అదే విధంగా ఎదురుచూడవచ్చు.—యిర్మీయా 29:11; కీర్తన 37:34; ప్రకటన 18:2, 4.

మొదటి శతాబ్దపు “మహా శ్రమ”

14. యెహోవా ఇశ్రాయేలీయులను శాశ్వతంగా ఎందుకు నిరాకరించాడు?

14 మనం సా.శ. మొదటి శతాబ్దంవైపుకు మన అవధానాన్ని మళ్లిద్దాము. ఆ సమయానికల్లా పునఃస్థాపించబడిన యూదులు మళ్లీ మతభ్రష్టత్వంలో పడిపోయారు. తన అభిషిక్తునిగా లేక మెస్సీయగా ఉండడానికి యెహోవా తన అద్వితీయ కుమారుడ్ని భూమిపైకి పంపించాడు. సా.శ. 29 నుండి 33 వరకున్న సంవత్సరాలలో, “పరలోకరాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని” చెబుతూ యేసు ఇశ్రాయేలు దేశమందంతటా ప్రకటించాడు. (మత్తయి 4:17) అంతేగాక, రాజ్య సువార్తను ప్రకటించడంలో తనతో భాగం వహించడానికి ఆయన శిష్యులను సమకూర్చి, వారికి తర్ఫీదునిచ్చాడు. యూదా పాలకులు ఎలా ప్రతిస్పందించారు? వాళ్లు యేసును హీనపర్చి, చివరికి ఆయన హింసాకొయ్యపై వేదనభరితమైన మరణానికి గురయ్యేలా చేయడం ద్వారా హేయమైన నేరాన్ని చేశారు. యెహోవా యూదులను తన ప్రజలుగా నిరాకరించాడు. ఇప్పుడు ఆ జనాంగ నిరాకరణ శాశ్వతమైనదైంది.

15. పశ్చాత్తాపపడిన యూదులకు ఏ పని పూర్తి చేసే ఆధిక్యత లభించింది?

15 పునరుత్థానం చేయబడిన యేసు, సా.శ. 33 పెంతకొస్తునాడు పరిశుద్ధాత్మను కుమ్మరించాడు, దానితో ఆయన శిష్యులు వెంటనే అక్కడ సమకూడిన యూదులతోనూ యూదా మతప్రవిష్టులతోనూ అనేక భాషల్లో మాట్లాడగలిగారు. గుంపును ఉద్దేశించి “ఈ యేసును దేవుడు లేపెను; దీనికి మేమందరము సాక్షులము. . . . మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని” అపొస్తలుడైన పేతురు ప్రకటించాడు. యథార్థపరులైన యూదులు ఎలా ప్రతిస్పందించారు? ‘వారు హృదయములో నొచ్చుకుని’ తమ పాపాల గురించి పశ్చాత్తాపపడి, బాప్తిస్మం తీసుకున్నారు. (అపొస్తలుల కార్యములు 2:32-41) రాజ్య ప్రకటనాపని ఉదృతమైంది, 30 సంవత్సరాల్లో అది “ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి” చేరింది.—కొలొస్సయులు 1:23.

16. సహజ ఇశ్రాయేలీయులపై తన తీర్పును అమలుచేయడానికి నడిపే సంఘటనలను యెహోవా ఎలా నైపుణ్యంగా నడిపించాడు?

16 నిరాకరింపబడిన తన ప్రజలైన సహజ ఇశ్రాయేలీయులకు తీర్పుతీర్చడానికి యెహోవాకు సమయం ఆసన్నమైంది. అప్పట్లో తెలిసివున్న ప్రపంచమంతటా ఉన్న దేశాల్లో నుండి అనేక వేలమంది క్రైస్తవ సంఘంలోకి వచ్చారు, వాళ్లు “దేవుని” ఆధ్యాత్మిక “ఇశ్రాయేలు”గా అభిషేకించబడ్డారు. (గలతీయులు 6:16) అయితే, ఆ సమయంలోని యూదా సమాజం విద్వేషపూరిత కార్యకలాపాల్లో మరియు తెగలమధ్యవున్న విభేదపూరిత హింసల్లో కూరుకుపోయింది. ‘పై అధికారులకు లోబడియుండడం’ గురించి పౌలు వ్రాసినదానికి భిన్నంగా, వాళ్లు తమను పరిపాలిస్తున్న రోమా ఆధిపత్యానికి వ్యతిరేకంగా బహిరంగంగా తిరుగుబాటు చేశారు. (రోమీయులు 13:1) ఆ తర్వాత జరిగిన సంఘటనలను యెహోవా నడిపించాడని స్పష్టమౌతుంది. సా.శ. 66వ సంవత్సరంలో, జనరల్‌ గాలస్‌ నాయకత్వం క్రింద రోమా సైన్యాలు యెరూషలేమును ముట్టడించడానికి ముందుకు కదిలాయి. దాడి చేస్తున్న రోమన్లు ఆలయ గోడ క్రింద సొరంగం చేయగలిగేంత మేరకు నగరంలోపలికి ప్రవేశించారు. జోసీఫస్‌ వ్రాసిన చరిత్ర ప్రకారం, ఆ నగరంపైకి ప్రజలపైకి నిజంగానే శ్రమ వచ్చింది.a కాని దాడి చేస్తున్న సైనికులు హఠాత్తుగా పారిపోయారు. మత్తయి 24:15, 16 నందు వ్రాయబడివున్న తన ప్రవచనంలో యేసు ఉద్బోధించినట్లుగా ఆయన శిష్యులు ‘కొండలకు పారిపోవడానికి’ ఇది అవకాశాన్నిచ్చింది.

17, 18. (ఎ) యూదా సమాజంపై యెహోవా ఏ శ్రమ ద్వారా తీర్పు తీర్చాడు? (బి) ఎవరు ‘రక్షించబడ్డారు’ మరియు అది దేనికి ఛాయగా ఉంది?

17 అయితే, శ్రమ యొక్క చరమాంకంలో పూర్తిగా అమలు చేయబడే యెహోవా తీర్పు ఇంకా రానైయుంది. సా.శ. 70లో రోమా సైన్యాలు, ఇప్పుడు జనరల్‌ టైటస్‌ నాయకత్వంలో, దాడి చేయడానికి తిరిగి వచ్చాయి. ఈసారి యుద్ధంలో విజయం తథ్యం! తమలో తాము పోరాడుకుంటున్న యూదులు రోమన్లకు సమవుజ్జీలు కాలేకపోయారు. నగరం మరియు దాని ఆలయం నేలమట్టం చేయబడ్డాయి. బలహీనమైపోయిన పది లక్షలకంటే ఎక్కువమంది యూదులు వేదననుభవించి మరణించారు, దాదాపు 6,00,000 శవాలు నగర ద్వారాల నుండి బయటికి పడేయబడ్డాయి. నగరం కూలిపోయిన తర్వాత, 97,000 మంది యూదులు చెరగొనిపోబడ్డారు, వారిలో అనేకులు ఆతర్వాత గ్లాడియేటర్‌ ప్రదర్శనల్లో మరణించారు. నిజంగా, ఆ శ్రమల సంవత్సరాల్లో రక్షించబడింది, యొర్దాను అవతలవున్న కొండలకు పారిపోయిన విధేయతగల క్రైస్తవులు మాత్రమే.—మత్తయి 24:21, 22; లూకా 21:20-22.

18 అలా, తిరుగుబాటు చేసిన యూదా జనాంగంపై సా.శ. 66-70లో తీర్పుతీర్చడానికి యెహోవా దినంలో, ‘విధానాంతాన్ని’ గూర్చి యేసు ప్రవచించిన గొప్ప ప్రవచనం పరాకాష్టకు చేరడంతో అది దాని మొదటి నెరవేర్పును కల్గివుంది. (మత్తయి 24:3-22) అయినప్పటికీ, అది మొత్తం ప్రపంచంపైకి రానైయున్న అంతిమ శ్రమయైన “యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినము” యొక్క ఛాయ మాత్రమే. (యోవేలు 2:31) మీరు ఎలా ‘రక్షించబడతారు’? తర్వాతి శీర్షిక చెబుతుంది.

[అధస్సూచీలు]

a దాడి చేస్తున్న రోమన్లు నగరాన్ని చుట్టుముట్టి, గోడ క్రింద కొంతమేరకు సొరంగం త్రవ్వి, యెహోవా ఆలయ ద్వారానికి నిప్పంటించడానికి సిద్ధమయ్యారని జోసీఫస్‌ చెబుతున్నాడు. లోపల చిక్కుకుపోయివున్న అనేకమంది యూదులకు ఇది విపరీతమైన భయాన్ని కలిగించింది, ఎందుకంటే మరణము తథ్యమని వాళ్లు గ్రహించారు.—యూదుల యుద్ధాలు, (ఆంగ్లం) రెండవ పుస్తకం, 19వ అధ్యాయం.

పునఃసమీక్ష కొరకు ప్రశ్నలు

◻ ‘ప్రభువు దినానికి’ మరియు ‘యెహోవా దినానికి’ మధ్యనున్న సంబంధమేమిటి?

◻ నోవహు దినాన్ని పునఃసమీక్షిస్తూ, మనం ఏ హెచ్చరికను లక్ష్యపెట్టాలి?

◻ సొదొమ గొమొఱ్ఱాలు ఎలా ఒక శక్తివంతమైన పాఠాన్ని అందజేస్తున్నాయి?

◻ మొదటి శతాబ్దపు ‘మహా శ్రమ’ నుండి ఎవరు రక్షించబడ్డారు?

[15వ పేజీలోని చిత్రం]

నోవహు మరియు లోతు కుటుంబాలకు, అలాగే సా.శ.పూ. 607లోనూ, సా.శ. 70లోనూ యెహోవా రక్షణను అనుగ్రహించాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి