కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 12/15 పేజీలు 8-10
  • వాళ్లు ‘సత్యాన్ని కొన్నారు’!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వాళ్లు ‘సత్యాన్ని కొన్నారు’!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • బైబిలు బోధల ద్వారా ఆకర్షించబడ్డారు
  • తనకు తానుగా సత్యాన్ని నిరూపించుకోవడం
  • అబద్ధ మతం వల్ల నిరాశ చెందడం
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 12/15 పేజీలు 8-10

వాళ్లు ‘సత్యాన్ని కొన్నారు’!

“సత్యమును అమ్మివేయక దాని కొని యుంచుకొనుము.” (సామెతలు 23:23) జ్ఞానియైన సొలొమోను ఆ విధంగా ఉపదేశించాడు. సర్వసామాన్యమైన సత్యాన్ని గురించి అలా అనగలిగినప్పటికీ, దేవుని వాక్యమైన బైబిలులో కనుగొనబడే సత్యం విషయంలో మరి ప్రత్యేకంగా అది వాస్తవమై ఉంది. అలాంటి సత్యం నిత్యజీవం వైపుకు నడుపగలదు! (యోహాను 17:3, 17) అయితే అలాంటి సత్యాన్ని సంపాదించాలంటే మూల్యం చెల్లించవలసి ఉంటుందని గమనించండి. దాన్ని ‘కొనేందుకు’ మనం సుముఖులమై ఉండాలి, అంటే దాన్ని పొందేందుకు గానూ దేనినైనా త్యాగం చేసేందుకు లేదా వదలుకునేందుకు సుముఖంగా ఉండాలి. (మత్తయి 13:45, 46 పోల్చండి.) సాధారణంగా, అలా చేసేందుకు ప్రజలు సుముఖంగా ఉండరు. అయితే అనేక దేశాల్లో, అత్యధిక సంఖ్యల్లో ధైర్యవంతులైన వ్యక్తులు బైబిలు సత్యాన్ని కొనుక్కుంటున్నారు, అందుకు వారు తరచూ వ్యక్తిగతంగా ఎంతో ఎక్కువ మూల్యాన్ని చెల్లిస్తున్నారు.

ఉదాహరణకు, పశ్చిమాఫ్రికా దేశమైన ఘానాలోని యెహోవాసాక్షుల విషయాన్ని పరిశీలించండి. గత 1989 జూన్‌కల్లా, ఆ దేశంలో బైబిలు సత్యాన్ని హత్తుకుని, ఆ సత్యాన్ని ఇతరులతో చురుకుగా పంచుకుంటున్న వ్యక్తులు 34,000 కంటే ఎక్కువమంది ఉన్నారు. అప్పట్లో బహిరంగ ప్రకటనాపనిపై చట్టపరమైన నిషేధాలు విధించబడ్డాయి. చట్టపరమైన ఆటంకాలు ఉన్నప్పటికీ, యథార్థ హృదయం గలవారు ‘సత్యాన్ని కొనడంలో’ కొనసాగారు. గత 1991 అక్టోబరు 31న ఆ నిషేధాజ్ఞలు తొలగించబడ్డాయి, 1995 మధ్యకాలానికి అంటే ఆ నిషేధం ఎత్తివేయబడిన కేవలం మూడున్నర సంవత్సరాలకే ఘానాలోని క్రియాశీలురైన యెహోవాసాక్షుల సంఖ్య 46,104కు పెరిగింది! మరి ఈ సంవత్సరం ఆ సంఖ్య 52,800 కన్నా ఎక్కువగా పెరిగింది.

ప్రజలను దేవుని వాక్యంలోని సత్యం వైపుకు ఏది ఆకర్షించింది? ‘సత్యాన్ని కొనేందుకు’ కొందరు ఏ త్యాగాలను చేయవలసి వచ్చింది? దానికి సమాధానంగా, ఘానాకు చెందిన ముగ్గురు క్రైస్తవుల అనుభవాలను మనం పరిశీలిద్దాము.

బైబిలు బోధల ద్వారా ఆకర్షించబడ్డారు

తన 20వ పడి తొలిభాగంలో ఉన్న ఒక యువతి విషయాన్ని పరిశీలించుదాం. ఆమె తండ్రి ఒక పాస్టరు. అయినప్పటికీ, ఆమె తన తండ్రి మతాన్ని విడిచిపెట్టాలని తీర్మానించుకుంది. దానికిగల కారణం? సత్యం ఎడల ఆమెకున్న ప్రేమే.

ఆమె ఒకసారి ఇలా వివరిస్తోంది: “తమ ఇంటింటి సందర్శనాల్లో భాగంగా సాక్షులు మా ఇంటికి వచ్చేవారు. వారితో కొన్నిసార్లు చర్చించిన తర్వాత, వారు బోధిస్తున్న విషయాలు బైబిలు ఆధారమైనవని నేను గుర్తించాను. త్రిత్వం, నరకాగ్ని, అమర్త్యమైన ఆత్మ మరియు ప్రాముఖ్యంగా విశ్వాస స్వస్థత వంటి విషయాలపై నేను ప్రశ్నలు వేశాను. ఈ సిద్ధాంతాలు బైబిలు ఆధారమైనవని నేను దృఢంగా విశ్వసించాను. అయితే వాస్తవం అది కాదని నేను గుర్తించేందుకు సాక్షులు నాకు సహాయం చేశారు.”—అలాంటి అంశాలపై బైబిలు దృక్పథమేమిటో తెలుసుకునేందుకు దయచేసి మార్కు 13:32; రోమీయులు 6:23; అపొస్తలుల కార్యములు 10:40; మరియు 1 కొరింథీయులు 13:8-10 చూడండి.

ఆ యువతి ఇంకా ఇలా అంటోంది: “అప్పటికీ, నా కుటుంబంనుండి ప్రాముఖ్యంగా నా తండ్రినుండి నాకు తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. నన్ను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన భావించాడు. అయితే, యెహోవాసాక్షుల నుండి నేను నేర్చుకుంటున్న విషయాలు సత్యమని నాకు తెలుసు. బైబిలులోని ఈ విషయాలను గురించి మా నాన్నగారికి చెప్పాలని నేను ప్రయత్నించాను, కానీ ఆయన దాన్ని వినలేదు. వాస్తవానికి, వ్యతిరేకత ఇంకా తీవ్రమైంది.

“అయితే, నేను ఎంతో దృఢంగా ఉన్నాను. నిజమైన జ్ఞానం మాత్రమే పరదైసులో నిత్యం జీవించడాన్ని సాధ్యం చేస్తుందని నాకు తెలుసు, నేను దాన్ని హత్తుకోవాలని తీర్మానించుకున్నాను. నేను ఎదుర్కుంటున్న సమస్యలను గురించి స్థానిక సాక్షులకు తెలిసినప్పుడు, వారు నన్ను ప్రోత్సహించి నాకు కావాల్సిన వాటినిచ్చి వారు ప్రేమపూర్వకంగా నాకు సహాయం చేశారు. ‘మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు’ అని యోహాను 13:35 నందు యేసు పలికిన మాటల ప్రాముఖ్యతను అర్థం చేసుకునేందుకు ఇది నాకు సహాయం చేసింది. యెహోవాసాక్షులు సత్యమైన మతాన్ని ఆచరిస్తున్నారనే నా నమ్మకం దృఢపడింది. తర్వాత, నేను నా జీవితంలో మార్పులు చేసుకోవడం మంచికే దారితీసిందని నా తలిదండ్రులు గమనించినప్పుడు, వారు గమనించిన దాన్ని బట్టి ఆనందించారు, నా ఎడల వారి దృక్పథం మారింది, అది ఎంతగా మారిందంటే మా అన్నయ్యతో బైబిలును పఠించాలని మా నాన్నగారు సాక్షులను కోరారు!”

తనకు తానుగా సత్యాన్ని నిరూపించుకోవడం

సాక్షులైన తలిదండ్రుల పెంపకంలో పెరిగిన కొంతమంది పిల్లలకు కూడా ‘సత్యాన్ని కొనడం’ ఒక సవాలుగా ఉంటుంది. కొంతమంది యౌవనులు బైబిలు సత్యాన్ని తేలికగా తీసుకునే అవకాశం ఉంది. వారు అలాంటి సత్యాలను తమ స్వంతం చేసుకోవడంలో విఫలమైతే, వారి విశ్వాసం బలహీనమై లోతు లేనిదిగా అవుతుంది. (మత్తయి 13:20, 21 పోల్చండి.) 30వ పడిలో ఉన్న ఘానాకు చెందిన నతానియేల్‌ అనే పేరుగల వ్యక్తి, తాను యౌవనంలో ఉన్నప్పుడే ‘సత్యాన్ని’ ఎలా ‘కొన్నదీ’ వివరిస్తున్నాడు.

“నేను పసివానిగా ఉన్నప్పటినుండీ నా తలిదండ్రులు నాకు బైబిలును గురించి బోధించారు” అని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. “నేను పెరిగిపెద్దౌతున్నప్పుడు వారితోపాటూ ప్రకటనాపనికి వెళ్లే వాన్ని, అయితే నేను ఒక సాక్షినవ్వాలని నిజంగా నిర్ణయించుకోలేదు. కొంతకాలానికి విషయాలను నాకైనేనే పరిశీలించవలసి ఉందని గుర్తించాను.

“మొదట, బైబిలు తప్ప మరే ఇతర మతానికి చెందిన పవిత్ర గ్రంథమూ దేవుని వాక్యం కాదనే విషయంలో నేను దృఢంగా నిర్ధారించుకోవలసి వచ్చింది. అనేకానేక స్పష్టమైన ప్రవచనాలను కలిగివున్న ఏకైక పవిత్ర గ్రంథం అదేననీ, ఆ ప్రవచనాలు కచ్చితంగా నెరవేరాయనీ వ్యక్తిగత అధ్యయనం ద్వారా తెలుసుకున్నాను. బైబిలు అనేక వైజ్ఞానిక సత్యాలను కలిగి ఉందని నేను తెలుసుకున్నాను. ఉదాహరణకు భూమి ‘శూన్యంలో వ్రేలాడుతూ ఉందని’ అది చెబుతోంది. (యోబు 26:7) వైజ్ఞానికులకు మన సూర్యమండలాన్ని గురించి తెలియక ముందే వేల సంవత్సరాల ముందే ఈ మాటలు వ్రాయబడ్డాయి. అలాంటి విషయాలు వ్రాసేందుకు దేవుడు మాత్రమే మానవులను ప్రేరేపించగలడు!a

“తర్వాత, బైబిలులో బోధించబడిన సత్యాలను ఏ మత సంస్థ బోధిస్తుంది మరియు ఆచరిస్తుంది అనే విషయాన్ని నేను తెలుసుకోవాలని అనుకున్నాను. అనేక మతాలు నరకాగ్ని, త్రిత్వం, మరియు మరణాన్ని తప్పించుకునే అమర్త్య ఆత్మ వంటి వాటిని బోధిస్తాయి. అయితే ఈ సిద్ధాంతాలు నాకు అర్థవంతంగా అనిపించలేదు. నేనిలా తర్కించుకున్నాను: తన కొడుకును శిక్షించేందుకు వాడి చేతిని నీళ్లు మరుగుతున్న కుండలో ఉంచే తండ్రి దుష్టుడే కదా? మరి ఒక ప్రేమగల దేవుడు తన పిల్లలను నరకాగ్నిలో వేసి వాళ్లు అక్కడ యాతన అనుభవించేందుకు ఎలా అనుమతిస్తాడు? అయితే యెహోవాసాక్షులు మాత్రం, “పాపమువలన వచ్చు జీతము మరణము” అని చెబుతున్న రోమీయులు 6:23 వంటి బైబిలు లేఖనాలకు అనుగుణంగా బోధిస్తారు. ఇది నాకు అర్థవంతంగా అనిపించింది.

“సభ్యులందరూ కూడా బైబిలు ప్రమాణాలకు అనుగుణంగా జీవించాలని యెహోవాసాక్షులు కోరుతారనీ మరియు పశ్చాత్తాపం చెందని పాపులను వారు బహిష్కరిస్తారనీ కూడా నేను గమనించాను. ఈ విషయాలన్నింటినీ బట్టి చూస్తే, యెహోవాసాక్షుల వద్దనే సత్యం ఉందనే దృఢ నిశ్చయానికి నేను వచ్చాను, మరి నేను వారిలో ఒకడిని కావాలని వ్యక్తిగతంగా తీర్మానించుకున్నాను. నేను ఒక సాక్షిగా బాప్తిస్మం పొందేందుకు అర్హుడను కావడానికి కృషి చేశాను.”—1 కొరింథీయులు 5:11-13.

క్రైస్తవ తలిదండ్రుల పెంపకంలో పెరిగిన యౌవనులు కూడా ‘సత్యాన్ని కొనాలనే’ విషయాన్ని నతానియేల్‌ అనుభవం చక్కగా దృష్టాంతపరుస్తుంది. వారు సంఘ కూటాలకు వచ్చి ఊరికే విగ్రహంలా కూర్చోకూడదు. ప్రాచీన బెరయలోనివారి వలె, ‘సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధిస్తూ’ ఉండాలి. (అపొస్తలుల కార్యములు 17:11) దీని కొరకు సమయాన్ని వెచ్చించి కృషి చేయవలసి ఉంటుంది, అయితే అది దృఢమైన విశ్వాసాన్నీ తీర్మానాన్నీ కలిగించగలదు.—ఎఫెసీయులు 3:17-19 పోల్చండి.

అబద్ధ మతం వల్ల నిరాశ చెందడం

ఘానాకు చెందిన గాడ్వన్‌ అనే పేరుగల వ్యక్తి ప్రెస్బటేరియన్‌ చర్చిని మరియు ఒక మసోనిక్‌ లాడ్జిని వదిలి వచ్చేసినప్పుడు అతని వయస్సు దాదాపు 70 సంవత్సరాలు. “అభ్యంతరకరమైనవని నేను కనుగొన్న అనేక సంగతులు చర్చిలో జరుగుతూ ఉండేవి” అని గాడ్విన్‌ చెబుతున్నాడు. “ఉదాహరణకు, ఎన్నో అంతఃకలహాలు జరిగేవి, అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితిని చక్కదిద్ది, శాంతి నెలకొల్పేందుకు కొన్నిసార్లు పొలీసులు రావాల్సి వచ్చేది. క్రీస్తు అనుచరులకు ఇలాంటి ప్రవర్తన తగదని నేను భావించాను. ఆ తర్వాత నాకూ తోటి ప్రెస్బటేరియన్‌కూ మధ్య గొడవ వచ్చిపడింది. ప్రజా కోర్టు మా కేసును పరిశీలించి అవతలి వ్యక్తిదే తప్పని తీర్పు ఇచ్చింది. అయితే, చర్చి పరిచారకుడు మాత్రం అన్యాయంగా ఆ వ్యక్తి పక్షం వహించి, నన్ను సంఘమంతటి ముందూ మందలించేందుకు ప్రయత్నించాడు! ఈ విషయాన్నంతటిని గురించి నా అభిప్రాయాన్ని కుండ బ్రద్దలు కొట్టినట్లు అతనికి చెప్పి నేను చర్చిలోనుండి బయటకు నడిచి వచ్చేశాను, మరెన్నడూ తిరిగి వెళ్లలేదు.

“కొంత కాలమైన తర్వాత, యెహోవాసాక్షులు మా ఇంటిని సందర్శించారు. మొదట్లో, దేవుని గురించి మాట్లాడుతున్న ప్రజలను నిరాకరించ కూడదనే అభిప్రాయంతో మాత్రమే నేను వారి మాటలను విన్నాను. నేను దశాబ్దాలుగా ఒక ప్రెస్బటేరియన్‌గా ఉండినప్పటికీ నాకు బైబిలును గురించి ఎన్నో విషయాలు అసలు తెలియవని నేను గుర్తించడం ప్రారంభించాను. ఉదాహరణకు, భూమిపై పరదైసులో జీవించగల ఉత్తరాపేక్షను బైబిలు అందిస్తుందని నాకు తెలియనే తెలియదు.b మరి నేను యెహోవాసాక్షుల కూటాలకు హాజరు కావడం ప్రారంభించినప్పుడు, వారి మర్యాద మరియు ప్రాముఖ్యంగా వారి మధ్యగల యౌవనస్థుల వస్త్రధారణా కేశాలంకరణా నన్ను చాలా ముగ్ధుడ్ని చేశాయి. ఈ ప్రజలే నిజంగా బైబిలు సూత్రాల అనుసారంగా జీవిస్తున్నారు!”

అయినప్పటికీ, ‘సత్యాన్ని కొనుక్కోవడానికి’ ఆయన తన జీవితంలో ఎన్నో కష్టతరమైన సవరణలు చేసుకోవాల్సి వచ్చింది. గాడ్వన్‌ ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు: “నేను మసోనిక్‌ లాడ్జ్‌ సభ్యుడ్ని. అది తన సభ్యులకు సహాయాన్ని అందించే సౌభ్రాత్ర సంఘమని పిలువబడుతున్నప్పటికీ, పుర్రెలూ ఎముకల ఉపయోగం మరియు ఆత్మలను ఆహ్వానించడం వంటివి ఇమిడివున్న మతకర్మలను నేను అనుసరించే వాడ్ని. ఈ ఆత్మలు తమతో ఆదానప్రదానాలు చేసే వారు ఆధ్యాత్మికంగా వృద్ధి చెందేందుకు సహాయం చేస్తాయని భావించబడుతుంది.

“అభిచారం అనేది మనలను సూటిగా సాతాను మరియు అతని దుష్టాత్మల ప్రభావం క్రిందకు తీసుకు వెళ్తుంది గనుక అభిచారంతో సంబంధాన్ని కలిగి ఉండటాన్ని యెహోవా ద్వేషిస్తున్నాడని గుర్తించేందుకు నా పఠనాలు నాకు సహాయం చేశాయి.c రహస్యవాదాలతో ఉన్న మసోనిక్‌ లాడ్జ్‌ యొక్క సభ్యునిగా కొనసాగుతానా లేక నేను దాన్ని వదిలేసి యెహోవాను ప్రీతిపర్చుతానా? నేను రెండవ విషయాన్నే ఎంపిక చేసుకున్నాను. నేను నా వద్ద ఉన్న సౌభ్రాత్ర సంఘ సరంజామాను అంతటినీ నాశనం చేసేశాను, నేను నా లాడ్జ్‌ కూటాలకు ఉపయోగించే వస్త్రాలను కూడా నాశనం చేసేశాను. ‘సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును’ అని యేసు చెప్పినప్పుడు ఆయన వాగ్దానం చేసిన దాన్ని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను! (యోహాను 8:32) నేను నేర్చుకున్న విషయాలను ఇప్పుడు ఇతరులతో ఆనందంగా పంచుకుంటున్నాను. నేను ఇప్పుడు ఏ విధంగానూ విచారించడం లేదు.”

‘సత్యాన్ని కొనేందుకు’ అనేకమంది యథార్థహృదయులు అదే విధంగా ఎన్నో త్యాగాలు చేశారు. ఇక్కడ ప్రస్తావించబడిన ముగ్గురు క్రైస్తవుల్లాగే తాము చేసుకున్న మార్పులనుబట్టి వారు కూడా విచారించడం లేదు. వారు “వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది”ని బైబిలు సత్యం ఇచ్చింది. (1 తిమోతి 6:17-19) మీరు ‘సత్యాన్ని కొంటే’ ‘వాస్తవమైన జీవం’ మరియు దాని వెంట లభించే సమస్త దీవెనలూ కూడా మీ స్వంతం కాగలవు.

[అధస్సూచీలు]

a అదనపు సమాచారం కొరకు, వాచ్‌టవర్‌ బైబిలు అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం) అనే పుస్తకాన్ని చూడండి.

b ఉదాహరణకు, కీర్తన 37:9-11, 29 చూడండి.

c ద్వితీయోపదేశకాండము 18:10-12 మరియు గలతీయులు 5:19-21 చూడండి.

[9వ పేజీలోని చిత్రం]

నతానియేల్‌

[9వ పేజీలోని చిత్రం]

గాడ్వన్‌

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి