ప్రపంచ సమైక్యత—అదెలా వస్తుంది?
అద్దెకున్న నిర్లక్ష్యపరుల చేతిలో పూర్తిగా పాడై శిథిలమైపోతున్న ఓ భవనంవలె, ప్రస్తుత ప్రపంచ విధానం కూల్చివేయబడి పునర్నిర్మించబడడానికి తప్ప మరి దేనికీ పనికిరాదు. ఇది సందేహించదగిన వినాశనాంధకార ఊహా సంఘటనల పరంపరేమీ కాదు. బైబిలు ప్రకారంగా, అదే ఏకైక వాస్తవిక దృక్పథం. ఎందుకు?
ప్రస్తుత ప్రపంచ విధానం యొక్క పునాదులు సురక్షితంగాలేవు. ప్రపంచ విధానమనే భవనమంతా చెదపురుగులు పట్టి, శిలీంధ్రాలవల్ల పాడైపోతోంది. ఆ ప్రపంచపు ఉక్కు చట్రం తుప్పుపట్టింది. దాని గోడలు బలహీనమయ్యాయి. పైకప్పు దిగబడింది. కొళాయి గొట్టాలు లీకౌతున్నాయి. కరెంటు సరఫరా లోపభూయిష్టంగానూ, అపాయకరంగానూ ఉంది. ఆ భవనంలో ఉండేవాళ్లు ఎల్లప్పుడూ అదేపనిగా, తీవ్రమైన ద్వేషంతో కొట్టుకుంటూ, దాన్ని పూర్తిగా పాడుచేస్తున్నారు. ఆ భవనమంతా, దాని చుట్టుప్రక్కల ఉన్న పరిసరాలూ తెగులుపట్టి, ప్రాణాలకు ముప్పుకల్గించేవిగానూ లేక తీవ్రంగా గాయపర్చేవిగానూ ఉన్నాయి.
“సమాధపుటంచులపై నృత్యం”
గ్వానె డైర్ చెబుతున్నట్టుగా, ఎడతెగని రాజకీయ పోరాటాల్నిబట్టీ, అత్యాశా వినాశకర ప్రవర్తనల్నిబట్టీ, లోతుగా పాతుకుపోయిన జాతి వర్గ వైరాల్నిబట్టీ “యావత్ మానవజాతీ సమాదపుటంచులపై నృత్యం చేస్తోంది.” ప్రపంచమందంతటా, దృఢసంకల్పంగల అల్పసంఖ్యాక వర్గాలు అంటే ఒత్తిడి వర్గాలూ, స్వాతంత్ర్య యోధులూ, నేర ముఠాలూ, అంతర్జాతీయ ఉగ్రవాదులూ మరితర వర్గాలూ తమ స్వంత స్వార్థపూరిత ప్రణాళికలను వెంబడించి, ప్రపంచంలో శాంతికొరకైన ఏ సాధ్యతల్నైనా సరే దాదాపు ఇష్టానుసారంగా నాశనం చేయగల్గేలా కనబడుతున్నాయి. అంతరాయం కల్గించగల అద్దెకున్న వ్యక్తులవలే, వాళ్లు అందరి జీవితాల్ని దుర్భరం చేయగలరు.
అయితే, అనేకమంది వ్యాఖ్యానకర్తలు చెప్పిన ప్రకారంగా, ప్రపంచ సమైక్యతకు ఆటంకాన్ని కల్గిస్తున్నది అసమ్మతి వర్గాలు లేక అదుపు తప్పిన వ్యక్తులు మాత్రమే కాదు. పెద్ద ఆటంకమేమంటే రాష్ట్ర-దేశమే. “అంతర్జాతీయ అరాజకత్వపు స్థితి”లో స్వతంత్ర దేశాలు ఉన్నాయని యుద్ధసంగ్రామంపై రాసిన రచయిత ఎస్. బి. పాయ్‌నె, జూ. చెబుతున్నాడు. ఇతర దేశాల ఎడల కంటి తుడుపుగా శ్రద్ధను చూపిస్తూనో లేక అస్సలు శ్రద్ధలేకుండానే తమ జాతీయ ఆసక్తులకు తోడ్పడే ప్రతీదాన్నీ ఆ దేశాలు చేస్తాయి. తత్ఫలితంగా, చరిత్రయందంతటా “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు.”—ప్రసంగి 8:9.
నిజమే, తమ సరిహద్దుల్లో మరి కొంతమేరకు అంతర్జాతీయ స్థాయిలో జరిగే అన్యాయాలకూ, అణచివేతకూ వ్యతిరేకంగా పోరాడడంలో కొన్ని జాతీయ ప్రభుత్వాలు కొంతవరకు సఫలీకృతమయ్యాయి. అప్పుడప్పుడూ అవి అంతర్జాతీయ సమైక్యతను స్థాపించాయి. కానీ దురాక్రమణచేసే దేశానికి వ్యతిరేకంగా చర్య తీసుకునేందుకు కొన్ని దేశాలు సమైక్యమైనప్పుడు కూడా, యథార్థమైన పరహితవాదానికి బదులు స్వార్థపరమైన ఆసక్తినిబట్టి అవి చర్య తీసుకున్నాయనే అనుమానం తరచూ మెదులుతుంది. నిజానికి, ఏ మానవ ప్రభుత్వం దగ్గరా ప్రపంచ అనైక్యతకు సమగ్రమైన శాశ్వతమైన పరిష్కారం లేదు. గ్వానె డైర్ ఇలా అంటున్నాడు: “స్వతంత్ర ఉద్దేశాలుగల ఏదొక దేశంపై దురాక్రమణ చేసే దేశాన్ని ఆపడానికీ లేక శిక్షించడానికీ ప్రపంచ దేశాలన్నీ సమైక్యం కావడమనే సిద్ధాంతం సూత్రబద్ధంగా శ్రేష్ఠమైనదే, కానీ ఫలానా దేశం దురాక్రమణకు పాల్పడిందని నిర్ణయించే దేశమేది, ఆ దురాక్రమణ దేశాన్ని ఆపడానికి అవసరమయ్యే మూల్యాన్ని డబ్బు రూపంలోనూ, ప్రాణాల రూపంలోనూ చెల్లించేదేది?”
దురాక్రమణ చేసే దేశానికి చెందిన పౌరుల్లో అత్యధికులు ఆ దురాక్రమణను వ్యతిరేకించనప్పుడు మాత్రమే ఒక దేశం మరొక దేశంపై దురాక్రమణకు పాల్పడడం సాధ్యమౌతుందనుకోండి. దురాక్రమణకు పాల్పడేది, తమ నాయకులు చేసేది తప్పైనా ఒప్పైనా వారిని సమర్థించిన పౌరులుండే ఏదొక “స్వతంత్ర దేశం”లో మాత్రమే కాదని చరిత్ర పదే పదే చూపుతుంది. నిజానికి, భూనివాసుల్లో అత్యధికులు దురాక్రమణకు పాల్పడ్డారు. టైమ్ పత్రిక చెబుతున్నట్లుగా, రాజకీయ మత నాయకుల ప్రవాహం నుండి వచ్చే “అబద్ధాల్నీ, ఆందోళనా ప్రచారాల్నీ” వాళ్లు గ్రుడ్డిగా అనుసరించారు.
జాతీయవాదం సహేతుకంగానూ దయగానూ ఉండే ప్రజల్లో క్రోధావేశాన్ని రగిల్చి, మరో దేశానికి చెందిన స్త్రీపురుషులకూ పిల్లలకూ వ్యతిరేకంగా పాశవిక నేరాలు చేసేలా వారిని పురికొల్పింది. ఉదాహరణకు, మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించి, చరిత్రకారుడైన జె. ఎమ్. రాబర్ట్స్ ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “1914 యొక్క విరోధాభాసాల్లో ఒకటేంటంటే ప్రతీ దేశంలోనూ అత్యధిక సంఖ్యలో ప్రజలూ, అన్ని పార్టీలూ, మతాలూ, వంశావళులూ ఇష్టపూర్వకంగానూ సంతోషంగానూ యుద్ధానికి వెళ్లడం ఆశ్చర్యకరంగా కనబడుతుంది.” అప్పటి నుండి ప్రజలు గుణపాఠాన్ని నేర్చుకున్నారా? లేదు! దాన్ని రాడ్ అషార్ పిల్చినట్లుగా “అంధ జాతీయవాద”మనే మృగం, ప్రపంచ సమైక్యతకున్న ఏ అవకాశాన్నైనా నాశనం చేయడంలో కొనసాగుతుంది.
వెలుపటి శక్తులు పనిచేస్తున్నాయి
అయితే, ప్రపంచ సమైక్యతకు ఓ గొప్ప ఆటంకం ఉంది. వెలుపటి శక్తులు పనిచేస్తున్నాయని బైబిలు బయల్పరుస్తోంది. అపవాదియైన సాతానూ, అతని తొత్తులైన దయ్యాలూ ఈ వెలుపటి శక్తులుగా గుర్తించబడ్డారు. బైబిలు ప్రకారంగా, “దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము” అవిశ్వాసులపై ఎటువంటి ప్రభావాన్ని చూపకుండా ఉండేలా “ఈ యుగ సంబంధమైన దేవత”యగు సాతాను వారి “మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జే[స్తున్నాడు.]”—2 కొరింథీయులు 4:4; ప్రకటన 12:9.
ఇది తమ స్వంత చర్యలకు బాధ్యతవహించకుండా వ్యక్తుల్ని తప్పించు కోనివ్వదనుకోండి. కానీ మానవ ప్రభుత్వాలు ఎందుకు ఓ నిజమైన ప్రపంచ సమైక్యతను ఎన్నటికీ స్థాపించలేవో ఇది వివరిస్తుంది. అపవాదియైన సాతాను ఉనికిలో ఉన్నంతవరకూ, ‘ద్వేషాలతో, కలహంతో, కక్షలతో, భేదాలతో’ పాటూ “శరీరకార్యములు” అని బైబిలు పిలుస్తున్న వాటిని పెంపొందించేందుకు అతడు స్త్రీపురుషుల్ని ప్రభావితం చేస్తాడు.—గలతీయులు 5:19-21.
ప్రపంచ ప్రభుత్వం
అయితే, పరిష్కారమేమిటి? దాదాపు ఏడువందల సంవత్సరాల క్రిందట, సుప్రసిద్ధ ఇటాలియన్ కవీ, తత్వవేత్తా అయిన డాన్‌టే దానికి జవాబును సూచించాడు. మానవజాతి శాంతి సమైక్యతల్ని కాపాడగల్గేది ప్రపంచ ప్రభుత్వం మాత్రమేనని ఆయన వాదించాడు. ప్రపంచ ప్రభుత్వమనేది ఏ రూపంలో ఉన్నా దాన్ని గూర్చిన నిరీక్షణ అనేకమంది ప్రజలకు ఒక భ్రాంతి మాత్రమే కానీ నిజమైన నమ్మకాన్ని ఉంచాల్సింది కాదు. ముందు ప్రస్తావించిన గ్రంథకర్త పాయ్‌నె “చరిత్రలో ఈ స్థాయిలో ప్రపంచ ప్రభుత్వమనేది అసాధ్యం” అనే నిర్థారణకు వచ్చాడు. ఎందుకు? ఎందుకంటే మానవ సామర్థ్యానికి పూర్తిగా మించిన రెండు విషయాలకు అంటే “ప్రపంచ ప్రభుత్వం యుద్ధాల్ని అంతమొందించాలి, ప్రపంచ ప్రభుత్వం భౌగోళిక నియంతృత్వపాలన కాకూడదు” అనే రెండు విషయాలకు విజయవంతమైన ఏ ప్రపంచ ప్రభుత్వమైనా అభయమివ్వాలి.
ఏ మానవ ప్రభుత్వమూ దీనికి సరితూగలేదనే విషయం నిశ్చయం. అయితే, యేసు క్రీస్తు చేతుల్లో ఉన్న దేవుని రాజ్యం, యుద్ధంలేకుండా చేయగలదు, చేస్తుంది. (కీర్తన 46:9, 10; మత్తయి 6:10) నిశ్చయంగా, యుద్ధపిపాసుల్నందర్నీ అది తొలగిస్తుంది. భూమిపై మానవ పరిపాలన కొరకైన దేవుని నియమిత కాలగడువు ముగింపులో, మానవ పరిపాలనాధిపత్యం “ఇనుము బురదతో కలిసియున్నట్టు”గానే “భేదముల”తో ఉంటుందని ప్రవక్తయైన దానియేలు సూచించాడు. (దానియేలు 2:41-43, NW) ఇది రాజకీయ విచ్ఛిన్నానికీ, అనివార్యమైన పోరాటానికీ దారితీస్తుంది. అయితే, యేసుక్రీస్తు ఆధ్వర్యం క్రిందవున్న దేవుని రాజ్యం అంటే దీర్ఘకాలం నుండీ ఎదురుచూసిన దేవుని రాజ్యం “ముందు చెప్పిన [జాతీయవాద, అనైక్య] రాజ్యములన్నిటిని” లేక ప్రభుత్వాలన్నింటిని “పగులగొట్టి నిర్మూలము చే[సి]” వాటి స్థానంలో వస్తుందని దానియేలు చెబుతున్నాడు.—దానియేలు 2:44.
ఇతరుల జీవితాల్ని దుర్భరంచేస్తున్న పరాన్నభుక్కులైన వ్యక్తులు భూమిపై ఇంకా జీవిస్తూనే ఉంటే ప్రజలకు తగిన వాతావరణాన్ని సృష్టించడంలో అర్థమేమీ లేదు. అయితే, “కీడు చేయువారు నిర్మూలమగుదురు.” (కీర్తన 37:1, 2, 9, 38; సామెతలు 2:22) అందుకే, దేవుని ప్రమాణాల్ని ఉద్ధేశపూర్వకంగా తిరస్కరించే వారందర్నీ లేక విఘాతంకల్గించే ప్రపంచ అధికారాలకు మద్ధతునిచ్చే వారందర్నీ క్రీస్తు తొలగిస్తాడు. ఈ గ్రహాన్ని నాశనంచేస్తున్న వారందర్నీ ఆయన నిర్మూలిస్తాడు. ‘భూమిని నశింపజేసేవారిని నశింపచేస్తానని’ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు.—ప్రకటన 11:18.
ఇది ఓ తరహా భౌగోళిక నియంతృత్వమేమీ కాబోదు. యేసుక్రీస్తు చెడ్డవారినీ మంచివారినీ వేరుపర్చేటప్పుడు, ఆయన “సత్యమును వినయముతోకూడిన నీతిని స్థాపించుటకు” చర్య తీసుకుంటాడు. (కీర్తన 45:3, 4; మత్తయి 25:31-33) ఈ చర్య కేవలం ప్రతికూలమైనదో, వినాశనకరమైనదో, అధికారాన్ని దుర్వినియోగపర్చేదో అవుతుందా? కానే కాదు! ఇది కబ్జాదారుడు ఓ అందమైన చారిత్రాత్మక కట్టడాన్ని కూలగొట్టడం లాంటి చర్య కాదు. ఇది ఆహ్లాదకరమైన పరిశుభ్ర పరిసరాలకు తావిచ్చేందుకు, పాడై నాశనంకానైవున్న ఓ భవనాన్ని కూలగొట్టడం లాంటిది.
కానీ గతకాలంలో అలాంటి అనైక్యతకు కారకులైన వెలుపటి శక్తుల సంగతేమిటి? నూతన విధానంలోని నివాసులు తమ తోటి నివాసులతో కలహించుకుంటూ, ప్రతి ఒక్కరి జీవితాన్నీ దుర్భరంచేసే, వినాశకర ప్రక్రియను పునఃప్రారంభించేలా ఆ శక్తులు ఈ నూతన విధానంలో జొరబడతాయా? జొరబడలేవు. ఈ మార్పులే చివరివీ, సమగ్రమైనవీ అవుతాయి. ‘బాధ రెండవమారు రాబోదు.’—నహూము 1:9.
సాతాను అంతిమ నాశనాన్ని, సమూలంగా కాల్చివేయబడే చెత్తకు పోల్చి బైబిలు చెబుతోంది. “[భూనివాసులను] మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను” అని అది అంటోంది. (ప్రకటన 20:10) అదెంత శక్తిమంతమైన సూచనార్థకమో కదా! దహించే సామర్థ్యం పరిమితంగావున్న ఏదో ఒక చిన్న కొలిమికిగాక చెడ్డదీ, కళంకపర్చేదీ అయిన ప్రతీదాన్నీ ఉనికిలో లేకుండా దహిస్తూ తొలగిస్తున్న అగ్నిగుండమంతటికీ నాశనం పోల్చబడిందని ఊహించండి. విశ్వానికి ముప్పును తెచ్చే, తప్పొప్పులను గూర్చిన దేవుని ప్రమాణాల్ని ఉల్లంఘించే లేదా తమ తోటి మానవులకు బాధను కల్గించే వాళ్లు అటు మనుష్యులైనా ఇటు దయ్యాలైనా సరే, ఇక ఎవ్వరూ అనుమతించబడరు. సమైక్యతను విచ్ఛిన్నం చేసే వారందరూ నాశనమవుతారు!—కీర్తన 21:9-11; జెఫన్యా 1:18; 3:8.
అన్ని జనాంగాలనుండి వచ్చిన సమైక్యప్రజ
ఈ గొప్ప నాశనం నుండి తప్పించుకునేవారు “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలోనుండియు వచ్చి[న], . . . యొక గొప్పసమూహము”గా రూపొందించబడతారు. (ప్రకటన 7:9) జాతి వర్గ విభేధాలు వారిని విడదీయవు. సమాధానకరమైన ఏకాభిప్రాయంతో కలిసి జీవించడాన్ని వాళ్లు నేర్చుకుంటారు. (యెషయా 2:2-4) పరిశుభ్రపర్చబడిన భూమిపై నివసించడానికి అద్భుతమైన పునరుత్థాన ఏర్పాటు ద్వారా తిరిగి లేపబడబోయే ఒకనాటి ఈ భూగ్రహ నివాసులు వీరికి తోడవ్వడం మరింత అద్భుతకరమైన విషయం.—యోహాను 5:28, 29.
అలాంటి ప్రపంచంలో మీరు జీవించడానికి ఇష్టపడతారా? దేవుని కట్టడలకు హత్తుకునేవారు మాత్రమే అందులో జీవిస్తారు, మరి ఆయన కట్టడలు బైబిల్లో స్పష్టంగా తెలియజేయబడ్డాయి. (యోహాను 17:3; అపొస్తలుల కార్యములు 2:38-42) నిజంగా సమైక్యపర్చబడ్డ ప్రపంచంలో జీవితాన్ని నిరంతరం అనుభవించేందుకు మీరు నిరీక్షించేలా దేవుడు కోరుతున్నవాటిని నేర్చుకునేందుకు మీకు సహాయపడేందుకు యెహోవాసాక్షులు సంతోషిస్తారు.
[7వ పేజీలోని చిత్రం]
యేసుక్రీస్తు చేతుల్లో ఉన్న ప్రభుత్వం, సమైక్య ప్రపంచానికి హామీనిస్తుంది