కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 8/15 పేజీలు 4-7
  • రక్షణ నిజంగా దాని భావమేమిటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రక్షణ నిజంగా దాని భావమేమిటి?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • రక్షణ—అన్ని మతాల్లో ఉందా?
  • రక్షణ పొందేందుకు యేసును గూర్చిన కచ్చితమైన జ్ఞానం ప్రాముఖ్యం
  • దేవుని గూర్చిన కచ్చితమైన జ్ఞానం కూడా ప్రాముఖ్యం
  • ఆత్మతోను, సత్యంతోను
  • విశ్వాసం చర్యగైకొనడానికి ప్రేరేపిస్తుంది
  • రక్షణ మీకే భావాన్ని ఇవ్వగలదు
  • మీ “రక్షణనిరీక్షణ”ను ఉజ్వలంగా ఉంచుకోండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • రక్షణ అంటే ఏమిటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ‘ఒకసారి రక్షణ పొందితే, శాశ్వతంగా రక్షణ పొందినట్లే’ అని బైబిలు చెప్తోందా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • యేసు రక్షిస్తాడు—ఎలా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 8/15 పేజీలు 4-7

రక్షణ నిజంగా దాని భావమేమిటి?

‘మీరు రక్షణ పొందారా?’ తరచుగా, ఈ ప్రశ్నను అడిగేవాళ్లు తాము ‘యేసును తమ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించినందున’ తాము రక్షించబడ్డామని భావిస్తారు. అయితే, రక్షణకు వేర్వేరు మార్గాలున్నాయనీ, ‘యేసు మీ హృదయంలో’ ఉన్నంతవరకూ మీరు ఏమి నమ్ముతారు లేక మీరు ఏ చర్చికి చెందినవారు అనేది పెద్ద విషయమేమీ కాదనీ ఇతరులు భావిస్తారు.

‘మనుష్యులందరు రక్షణపొందాలనేది’ దేవుని చిత్తమని బైబిలు చెబుతోంది. (1 తిమోతి 2:3, 4) ఆ విధంగా, రక్షణయనేది దాన్ని అంగీకరించే వారందరికీ లభ్యమౌతుంది. కానీ రక్షించబడడం అంటే ఏమిటి? అది స్వల్ప ప్రయత్నంతో లేక ప్రయత్నించకుండా ఊరకనే మీకు ప్రాప్తించేదైవుందా?

“రక్షణ” అనే పదానికి “అపాయం నుండి లేక నాశనం నుండి విడుదల” అని భావం. ఆ విధంగా, నిజమైన రక్షణలో ప్రశాంతమైన మానసిక స్థితికన్నా ఎంతో ఇమిడివుంది. ఈ ప్రస్తుత దుష్ట విధాన నాశనం నుండీ, చివరకు మరణం నుండీ రక్షించబడడమని దాని భావం! అయితే దేవుడు రక్షించబోయేది ఎవరిని? దానికి జవాబుగా, ఈ విషయంలో యేసుక్రీస్తు ఏమి బోధించాడో పరిశీలిద్దాం. మన పరిశోధనా ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యపర్చవచ్చు.

రక్షణ—అన్ని మతాల్లో ఉందా?

ఒక సందర్భంలో, యేసు ఓ సమరయ స్త్రీతో సంభాషించాడు. ఆమె యూదురాలు కాకపోయినా, “క్రీస్తనబడిన” మెస్సీయ వస్తాడని ఆమె సరియైన విధంగానే నమ్మింది. (యోహాను 4:25) ఆమె రక్షించబడడానికి అలాంటి నమ్మకాన్ని కల్గివుండడమే సరిపోతుందా? సరిపోదు, ఎందుకంటే యేసు నిర్భయంగా ఆ స్త్రీతో ఇలా చెప్పాడు: “మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు.” ఈ స్త్రీ రక్షణ పొందాలంటే, ఆమె తన ఆరాధనా విధానాన్ని సరిదిద్దుకోవాల్సి ఉంటుందని యేసుకు తెల్సు. కాబట్టి యేసు ఇలా వివరించాడు: “అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరు చున్నాడు.”—యోహాను 4:22, 23.

యూదా మతంలోని ఓ ప్రముఖ శాఖయైన పరిసయ్యులు చేరివున్న మరో సందర్భంలో యేసు రక్షణ విషయంలో తన దృక్పథాన్ని బయల్పర్చాడు. పరిసయ్యులు ఓ ఆరాధనా విధానాన్ని రూపొందించి, దానికి దేవుని అనుగ్రహం ఉందని విశ్వసించారు. కానీ పరిసయ్యులకు యేసు చెప్పిన మాటల్ని వినండి: “వేషధారులారా—ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే.”—మత్తయి 15:7-9.

క్రీస్తును నమ్ముతున్నామని చెప్పుకుంటున్న నేటి అనేక మతగుంపుల సంగతేమిటి? రక్షణ పొందేందుకు అంగీకృతమైన మార్గాలుగా ఆ మతగుంపులన్నిటినీ యేసు ఆమోదిస్తాడా? “ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి—ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు—నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయు వారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును” అని యేసు స్పష్టంగా తెలియజేసినందున, ఈ విషయంలో మనం ఊహాగానాలు చేయాల్సిన అవసరం లేదు.—మత్తయి 7:21-23.

రక్షణ పొందేందుకు యేసును గూర్చిన కచ్చితమైన జ్ఞానం ప్రాముఖ్యం

యేసు చెప్పిన ఈ మాటలు గంభీరమైన భావాన్ని కల్గివున్నాయి. భక్తిగల అనేకమంది ప్రజలు ‘తండ్రి చిత్తాన్ని చేయడం’లో విఫలమవుతున్నారని అవి సూచిస్తున్నాయి. అయితే, నిజమైన రక్షణను ఒకరెలా పొందగలరు? మొదటి తిమోతి 2:3, 4 వచనాలు ఇలా జవాబిస్తున్నాయి: “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై [“కచ్చితమైన జ్ఞానాన్ని కల్గి,” NW] యుండవలెనని [దేవుడు] యిచ్ఛయించుచున్నాడు.” (ఇటాలిక్కులు మావి.)—కొలొస్సయులు 1:9, 10, పోల్చండి.

రక్షణ పొందేందుకు అలాంటి జ్ఞానం అత్యంత ప్రాముఖ్యం. అపొస్తలుడైన పౌలునూ, ఆయన సహచరుడైన సీలనూ రోమా చెరసాల నాయకుడు “రక్షణపొందుటకు నేనేమి చేయవలె[ను]” అని ప్రశ్నించినప్పుడు, వారు ఇలా ప్రత్యుత్తరమిచ్చారు: “ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదు[రు.]” (అపొస్తలుల కార్యములు 16:30, 31) చెరసాల నాయకుడూ, ఆయన ఇంటివారూ చేయాల్సిందల్లా, తమ హృదయాల్లో ఓ నిర్దిష్టమైన భావాన్ని కల్గివుండడమేనని దాని భావమా? కాదు, ఒక కారణమేమిటంటే, యేసు ఎవరు, ఆయన ఏమి చేశాడు, ఆయన ఏమి బోధించాడు అనే వాటిని గూర్చి కొంత అవగాహన వాళ్లకు లేకపోతే, వాళ్లు నిజంగా “ప్రభువైన యేసునందు విశ్వాసము” ఉంచలేరు.

ఉదాహరణకు, యేసు పరలోక ప్రభుత్వమైన ‘దేవుని రాజ్యము’ స్థాపించబడడాన్ని గూర్చి బోధించాడు. (లూకా 4:43) క్రైస్తవ నైతికతా, క్రైస్తవ ప్రవర్తనలపై సూత్రాల్ని కూడా ఆయన స్థాపించాడు. (మత్తయి, 5-7 అధ్యాయాలు) రాజకీయ విషయాలకు వచ్చేసరికి తన శిష్యులు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఆయన స్థూలంగా చెప్పాడు. (యోహాను 15:19) ఆయన భూగోళ వ్యాప్త బోధనా కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి, దానిలో భాగం వహించమని తన అనుచరులకు ఆదేశించాడు. (మత్తయి 24:14; అపొస్తలుల కార్యములు 1:8) అవును, ‘యేసునందు విశ్వాసం’ ఉంచడం అంటే ఎన్నో విషయాల్ని అర్థంచేసుకోవడమని భావం! అయితే, ఈ క్రొత్త విశ్వాసులు బాప్తిస్మం తీసుకోక ముందు పౌలు సీలలు “[చెరసాల నాయకునికి] అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి” అని అనడంలో ఆశ్చర్యమేమీ లేదు.—అపొస్తలుల కార్యములు 16:32, 33.

దేవుని గూర్చిన కచ్చితమైన జ్ఞానం కూడా ప్రాముఖ్యం

యేసునందు నిజంగా విశ్వాసముంచడంలో గల ఆవశ్యకమైన భాగమందు యేసు ఆరాధిస్తున్న దేవున్నే ఆరాధించడం చేరివుంది. యేసు ఇలా ప్రార్థించాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును [“గూర్చిన జ్ఞానాన్ని పొందుటయే,” NW] ఎరుగుటయే నిత్యజీవము.”—యోహాను 17:3.

తన భూ పరిచర్య కాలంలో, దేవుని కుమారుడు తనవైపుగాక ఎల్లవేళలా తన తండ్రివైపు అవధానాన్ని మళ్లించాడు. ఆయన ఎన్నడూ తాను సర్వశక్తిమంతుడైన దేవుడనని చెప్పుకోలేదు. (యోహాను 12:49, 50) అనేక సందర్భాల్లో, యేసు తాను తన తండ్రికంటే తక్కువవానినని చెప్పుకోవడం ద్వారా దేవుని ఏర్పాటులో తన స్థానాన్ని సుస్పష్టం చేశాడు. (లూకా 22:41, 42; యోహాను 5:19) యేసు ఇలా ప్రకటించాడు: “తండ్రి నాకంటె గొప్పవాడు.” (యోహాను 14:28) దేవునికీ క్రీస్తుకూ మధ్యనున్న నిజమైన సంబంధాన్ని గూర్చి మీ చర్చి బోధించిందా? లేక యేసే సర్వశక్తిమంతుడైన దేవుడని విశ్వసించేందుకు మీరు నడిపించబడ్డారా? సరియైన అవగాహన కల్గివుండడంపై మీ రక్షణ ఆధారపడివుంది.

ప్రభువు ప్రార్థనలో, యేసు తన శిష్యుల్ని ఇలా ప్రార్థించమని ఉద్బోధించాడు: “నీ నామము పరిశుద్ధపరచబడు గాక.” (మత్తయి 6:9) బైబిలు అనువాదాల్లో అనేకం దేవుని పేరును “ప్రభువు” అని అనువదిస్తూ, దాన్ని గ్రహించడం కష్టమయ్యేలా చేశాయి. కానీ “పాత నిబంధన” యొక్క ప్రాచీన ప్రతుల్లో, దేవుని పేరు 6,000 సార్లకు పైగా ఉంది! కీర్తన 83:18 ఇలా చదువబడుతోంది: “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక.” (ఇటాలిక్కులు మావి.) దేవుని నామమైన యెహోవాను ఉపయోగించడం మీకు బోధించబడిందా? బోధించబడకపోతే, మీ రక్షణ అపాయంలో ఉంది. ఎందుకంటే “ప్రభువు [“యెహోవా,” NW] నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు.”—అపొస్తలుల కార్యములు 2:21; యోవేలు 2:32 పోల్చండి.

ఆత్మతోను, సత్యంతోను

యేసుక్రీస్తు దేవుని వాక్యమైన బైబిలు వైపుకు కూడా అవధానాన్ని మళ్లించాడు. నిర్దిష్టమైన విషయాల్ని గూర్చి దేవుని దృక్పథాన్ని వివరిస్తూన్నప్పుడు, ఆయన తరచుగా ఇలా అనేవాడు: “అని వ్రాయబడియున్నది.” (మత్తయి 4:4, 7, 10; 11:10; 21:13) యేసు మరణించడానికి ముందు రాత్రి, తన శిష్యుల్ని గూర్చి తాను ఇలా ప్రార్థించాడు: “సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము.”—యోహాను 17:17.

కాబట్టి, దేవుని వాక్యమైన బైబిలు బోధల్ని అర్థంచేసుకోవడమనేది రక్షించబడడానికి మరొక ఆవశ్యకతయై ఉంది. (2 తిమోతి 3:16, 17) జీవితానికి అర్థం ఏమిటి? దుష్టత్వం ఇంతకాలంపాటు కొనసాగడానికి దేవుడు ఎందుకు అనుమతించాడు? ఓ వ్యక్తి మరణించినప్పుడు అతనికేమి సంభవిస్తుంది? అగ్నితోకూడిన నరకంలో దేవుడు మానవుల్ని నిజంగా హింసిస్తాడా? భూమి ఎడల దేవుని సంకల్పమేమిటి? వంటి ప్రశ్నలకు బైబిలు మాత్రమే జవాబిస్తుంది.a ఆ వివాదాంశాలను గురించి సరియైన అవగాహనలేకుండా ఒకరు దేవున్ని యుక్తమైనరీతిలో ఆరాధించలేరు, ఎందుకంటే యేసు ఇలా తెలియజేశాడు: “యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధి[స్తారు.]”—యోహాను 4:23.

విశ్వాసం చర్యగైకొనడానికి ప్రేరేపిస్తుంది

రక్షణలో కేవలం సమాచారాన్ని సంపాదించడంకన్నా ఇంకా ఎక్కువే చేరివుంది. ప్రతిస్పందించే హృదయంలో, దేవుని గూర్చిన కచ్చితమైన జ్ఞానం విశ్వాసాన్ని ఉత్పన్నం చేస్తుంది. (రోమీయులు 10:10, 17; హెబ్రీయులు 11:6) అలాంటి విశ్వాసం చర్యగైకొనడానికి ప్రేరేపిస్తుంది. ఉదాహరణకు, బైబిలు ఇలా ఉద్బోధిస్తుంది: “ప్రభువు [యెహోవా] సముఖమునుండి విశ్రాంతికాలములు వచ్చునట్లును . . . మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సునొంది తిరుగుడి.”—అపొస్తలుల కార్యములు 3:19, 20.

అవును, రక్షణలో ప్రవర్తన, నైతికతలకు సంబంధించి ఒకరు దేవుని ప్రమాణాలకు అనుగుణంగా ప్రవర్తించడం చేరివుంది. దేవుని వాక్యానికున్న రూపాంతరంనొందించే ప్రభావం క్రింద, జీవితంలో ఇంతవరకూ ఉన్న అలవాట్లైన అబద్ధాలాడడం మోసగించడం అనేవి నిజాయితీ, సత్యసంధతలచే మార్చబడతాయి. (తీతు 2:10) సలింగసంయోగమూ, జారత్వమూ, వ్యభిచారమూ వంటి దుర్నీతి క్రియలు విడనాడబడి, పవిత్రమైన నైతిక ప్రవర్తనా క్రియలచే మార్చబడతాయి. (1 కొరింథీయులు 6:9-11) ఇది భావోద్రేకంతో దుర్నీతికరమైన ప్రవర్తనను తాత్కాలికంగా అణచివేసుకోవడం కాదుగానీ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా అధ్యయనంచేసి, అన్వయించుకోవడం మూలంగా వచ్చిన శాశ్వతమైన మార్పు.—ఎఫెసీయులు 4:22-24.

కొంతకాలానికి, దేవునికి పూర్తిగా సమర్పించుకునేందుకూ, మరి దాన్ని నీటి బాప్తిస్మం ద్వారా సూచించేందుకూ దేవుని ఎడల ప్రేమ, మెప్పుదలలు యథార్థవంతుడైన వ్యక్తిని ప్రేరేపిస్తాయి. (మత్తయి 28:19, 20; రోమీయులు 12:1) బాప్తిస్మం పొందిన క్రైస్తవులు దేవుని దృష్టిలో రక్షించబడ్డారు. (1 పేతురు 3:21) రానైవున్న ఈ దుష్టలోక నాశన కాలంలో, దేవుడు వారిని ఆ శ్రమల నుండి భద్రపర్చడం ద్వారా వారిని పూర్తిగా రక్షిస్తాడు.—ప్రకటన 7:9, 14.

రక్షణ మీకే భావాన్ని ఇవ్వగలదు

రక్షణ పొందడంలో ‘యేసును మీ హృదయంలో ప్రభువుగా కల్గివుండడం’ కన్నా ఎక్కువే చేరివుందని ఈ క్లుప్తమైన చర్చనుండి స్పష్టమైంది. యెహోవా దేవుని గూర్చీ, యేసుక్రీస్తును గూర్చీ కచ్చితమైన జ్ఞానాన్ని గైకొని, ఒకరు తమ జీవితంలో అవసరమైన మార్పుల్ని చేసుకోవడమని దీని భావం. దీన్ని చేయడం అసాధ్యంగా కన్పించవచ్చు, కానీ ఈ ప్రయత్నంలో యెహోవాసాక్షులు మీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నారు. ఉచిత గృహ బైబిలు పఠనం ద్వారా, నిజమైన రక్షణకు నడిపే మార్గంలో నడవనారంభించేందుకు వారు మీకు సహాయపడగలరు.b

రానైవున్న దేవుని తీర్పు దినం దగ్గరలోనేవున్న దృష్ట్యా, ఆ మార్గంలో నడవడం ఎప్పటికన్నా ఇప్పుడు మరింత ఆవశ్యం! ప్రవక్త చెప్పిన ఈ మాటల్ని లక్ష్యపెట్టేందుకు ఇదే సమయం: “విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రతదినము రాకమునుపే కూడిరండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.”—జెఫన్యా 2:2, 3.

[అధస్సూచీలు]

a ఈ విషయాల్ని గూర్చిన చర్చ కొరకు, వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకాన్ని దయచేసి చూడండి.

b మీకు గృహ బైబిలు పఠనం కావాలనుకుంటే, దయచేసి యెహోవాసాక్షుల స్థానిక సంఘంతో సంప్రదించండి. లేక మీరు ఈ పత్రిక ప్రకాశకులకు రాయవచ్చు.

[6వ పేజీలోని బాక్సు]

రక్షణ ఎలా కల్గుతుందంటే...

◻ దేవుని గూర్చిన, యేసును గూర్చిన కచ్చితమైన జ్ఞానాన్ని పొందడం ద్వారా.—యోహాను 17:3.

◻ విశ్వాసం కల్గివుండడం ద్వారా.—రోమీయులు 10:17; హెబ్రీయులు 11:6.

◻ మారుమనస్సునొంది తిరుగడం ద్వారా.—అపొస్తలుల కార్యములు 3:19, 20; ఎఫెసీయులు 4:22-24.

◻ సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకోడం ద్వారా.—మత్తయి 16:24; 28:19, 20.

◻ బహిరంగంగా ప్రకటించడంలో కొనసాగడం ద్వారా.—మత్తయి 24:14; రోమీయులు 10:10.

[7వ పేజీలోని చిత్రం]

బైబిల్ని అధ్యయనం చేయడం, నేర్చుకొనిన దాన్ని అన్వయించుకోవడం, సమర్పించుకొని బాప్తిస్మం తీసుకోవడం రక్షణకు నడిపించే చర్యలు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి