“పరిశోధనాత్మక తీర్పు”— బైబిలు ఆధారిత సిద్ధాంతమా?
అమెరికాలోని తూర్పు తీరమందలి దాదాపు 50,000 మందికి అక్టోబరు 22, 1844, ఎంతో ఎదురుచూసిన దినం. యేసుక్రీస్తు ఆ దినాన తిరిగి వస్తాడని వారి ఆధ్యాత్మిక నేతయైన విలియమ్ మిల్లర్ వారికి చెప్పాడు. మిల్లరైట్లు అని పిలువబడే వీరు తమ కూటాల స్థలాల్లో చీకటి పడేంత వరకూ ఎదురుచూశారు. మర్నాడు ఉదయమయ్యింది, అయినా ప్రభువు మాత్రం రాలేదు. భ్రమ తొలగింపబడిన వీరు తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు, అప్పటి నుండీ ఆ దినాన్ని “గొప్ప నిరాశ” అని జ్ఞాపకం చేసుకున్నారు.
అయినప్పటికీ, నిరాశ త్వరలోనే నిరీక్షణకు దారి తీసింది. ఎలీన్ హార్మన్ అనే యౌవనస్థురాలు, సమయాన్ని గురించిన వారి లెక్క సరైనదేనని దేవుడు తన దర్శనాల్లో బయల్పరిచాడని మిల్లరేట్ల చిన్న గుంపును ఒప్పించింది. ఆ రోజున ఒక గొప్ప సంఘటన జరిగిందని, అంటే అప్పుడు క్రీస్తు “పరలోక దేవాలయంలోని అతి పరిశుద్ధ స్థలంలోకి” ప్రవేశించాడని ఆమె విశ్వసించింది.
ఒక దశాబ్దానికంటే ఎక్కువకాలం తర్వాత, అడ్వెంటిస్టు ప్రచారకుడైన (ఎలీన్ హార్మన్‌ను వివాహం చేసుకున్న) జేమ్స్ వైట్, 1844 అక్టోబరు నుండి క్రీస్తు పని విధానాన్ని వివరించేందుకు ఒక పద బంధాన్ని రూపొందించాడు. 1857 జనవరి 29 నాటి రివ్యూ అండ్ హెరాల్డ్‌లో, యేసు “పరిశోధనాత్మక తీర్పు”ను ప్రారంభించాడని వైట్ చెప్పాడు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్లమని చెప్పుకునే దాదాపు 70 లక్షల మందికి ఇదే మూల విశ్వాసంగా మిగిలిపోయింది.
అయితే, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ (ఎస్.డి.ఎ) చర్చిలోని గౌరవనీయులైన పండితుల్లో కొంతమంది “పరిశోధనాత్మక తీర్పు” బైబిలు ఆధారిత సిద్ధాంతమేనా అనే విషయాన్ని గురించి ఆలోచిస్తున్నారు. దాని గురించి వారికి పునరాలోచనలు ఎందుకు వస్తున్నాయి? మీరు సెవెంత్-డే అడ్వెంటిస్టుల్లో ఒకరై ఉంటే ఈ ప్రశ్న మీకు ఆసక్తికరమైనదై ఉంటుంది. అయితే మొదటిగా, “పరిశోధనాత్మక తీర్పు” అంటే ఏమిటి?
అదేమిటి?
ఈ సిద్ధాంతానికి మద్దతునిచ్చే ప్రధాన లేఖనంగా వారు దానియేలు 8:14ను ఉదహరిస్తారు. అదిలా చదువబడుతుంది: “ఆయన నాకిలా చెప్పాడు, రెండువేల మూడువందల దినముల వరకే; అప్పుడు ఆలయము శుభ్రపర్చబడుతుంది.” (కింగ్ జేమ్స్ వర్షన్, ఆంగ్లం) “అప్పుడు ఆలయము శుభ్రపర్చబడుతుంది” అనే పదబంధం మూలంగా, అనేకమంది అడ్వెంటిస్టులు ఈ వచనాన్ని లేవీయకాండము 16వ అధ్యాయంతో జోడిస్తారు. ప్రాయశ్చిత్త దినాన యూదుల ప్రధాన యాజకుడు ఆలయాన్ని పరిశుభ్రపర్చడాన్ని ఆ అధ్యాయం వివరిస్తుంది. దానియేలు మాటలను వారు, యేసును పరలోకంలోని గొప్ప ప్రధాన యాజకునిగా వర్ణిస్తున్న హెబ్రీయులు 9వ అధ్యాయంతో కూడా జోడిస్తారు. ఆ తర్కం “ప్రూఫ్-టెక్స్ట్” పద్ధతిపై ఆధారపడి ఉందని ఒక ఎస్.డి.ఎ. పండితుడు చెబుతున్నాడు. ఆ పద్ధతిని ఉపయోగించే వ్యక్తి “ఆలయం వంటి ఒక పదాన్ని దాని. 8:14లోనూ, అదే పదాన్ని లేవీ. 16లోనూ అలాగే హెబ్రీ. 7, 8, 9ల్లోనూ” కనుగొంటాడు, “ఆ లేఖనాలన్నీ ఒకే విషయాన్ని గురించి చెబుతున్నాయని ఆ విధానం” ముగిస్తుంది.
అడ్వెంటిస్టులు ఇలా తర్కిస్తారు: ప్రాచీన ఇశ్రాయేలు యాజకులు పరిశుద్ధ స్థలమని పిలువబడే దేవాలయ గదిలో ప్రతి దినం పరిచర్య చేసేవారు, దాని ఫలితంగా పాపాలు క్షమించబడేవి. ప్రాయశ్చిత్త దినాన, ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో (దేవాలయ అంతర్భాగంలో ఉన్న గది) సాంవత్సరిక పరిచర్య చేసే వాడు, అది పాపాలు తుడిచివేయబడేందుకు దారి తీసేది. పరలోకంలో క్రీస్తు చేసే యాజక పరిచర్య రెండు భాగాలుగా ఉంటుందని వారు తేల్చి చెబుతున్నారు. మొదటి శతాబ్దంలో ఆయన ఆరోహణమైనప్పుడు మొదటిది ప్రారంభమై 1844లో అంతమైంది, అది పాప క్షమాపణకు దారి తీసింది. రెండవ లేక “తీర్పు భాగం” 1844 అక్టోబరు 22న ప్రారంభమైంది, అదింకా కొనసాగుతోంది మరియు పాపాలు తుడిచివేయబడేందుకు అది దారి తీస్తుంది. అది ఎలా సాధించబడుతుంది?
విశ్వాసులమని చెప్పుకునే వారందరూ నిత్య జీవాన్ని పొందేందుకు అర్హులో కాదో నిర్ణయించేందుకు 1844 నుండి యేసు, వారి జీవిత రికార్డులను (మొదట మరణించిన వారివి, తర్వాత సజీవంగా ఉన్న వారివి) పరిశీలిస్తున్నాడని చెప్పబడుతుంది. ఇలా పరీక్షించడమే “పరిశోధనాత్మక తీర్పు.” ప్రజలు అలా తీర్పుతీర్చబడిన తర్వాత, ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారి పాపాలు రికార్డు పుస్తకాల్లో నుండి తుడిచివేయబడతాయి. అయితే, ఉత్తీర్ణులు కాని వారి ‘పేర్లు జీవ గ్రంథం నుండి తుడిచివేయ’ బడతాయని ఎలీన్ వైట్ వివరించింది. అలా “అందరి విధీ జీవానికో లేక మరణానికో నిర్ణయింపబడుతుంది.” ఆ సమయంలో పరలోక ఆలయం శుభ్రపర్చబడుతుంది మరియు దానియేలు 8:14 నెరవేరుతుంది. అలాగని సెవెంత్-డే అడ్వెంటిస్టులు బోధిస్తారు. అయితే “పరిశోధనాత్మక తీర్పు అనే పదము బైబిలులో లేదు” అని ఎస్.డి.ఎ. ప్రచురణయైన అడ్వెంటిస్ట్ రివ్యూ అంగీకరిస్తుంది.
లోపించిన భాషాపర లింకు
ఈ బోధ కొంతమంది అడ్వెంటిస్టులను కలవరపర్చింది. “మా సభ్యత్వంలోని నమ్మకమైన నాయకులు పరిశోధనాత్మక తీర్పును గూర్చిన మా పారంపర్య బోధను గురించి ఆలోచించినప్పుడు క్షోభను అనుభవించారని చరిత్ర చూపుతోంది” అని ఒక పరిశీలకుడు చెబుతున్నాడు. ఇటీవలి సంవత్సరాల్లో, పండితులు “దేవాలయాన్ని గురించిన మా సాధారణ వివరణ యొక్క అనేక మూల స్తంభాలను ప్రశ్నించడం” ప్రారంభిస్తుండగా ఆ క్షోభ అనుమానంగా మారిందని అతడు జత చేస్తున్నాడు. వాటిలో రెండింటిని ఇప్పుడు పరిశీలిద్దాము.
స్తంభం ఒకటి: దానియేలు 8వ అధ్యాయం లేవీయకాండము 16వ అధ్యాయంతో జతచేయబడింది. ఈ ఉపోద్ఘాతం రెండు ముఖ్య సమస్యల మూలంగా బలహీనమయ్యింది—భాష మరియు పూర్వాపర సందర్భం. మొదట భాషను పరిశీలించండి. దానియేలు 8వ అధ్యాయంలోని ‘శుభ్రపర్చబడిన ఆలయము’ లేవీయకాండము 16వ అధ్యాయంలోని ‘శుభ్రపర్చబడిన ఆలయానికి’ ప్రవచనార్థక నెరవేర్పని అడ్వెంటిస్టులు విశ్వసిస్తారు. కింగ్ జేమ్స్ వర్షన్లో ‘శుభ్రపర్చబడిన’ అని ఉన్న పదం దానియేలు 8:14 నందు ఉపయోగించబడిన సాదాక్ (“నీతిమంతంగా” ఉండటం అని అర్థం) అనే హెబ్రీ క్రియాపదానికి తప్పు అనువాదమనే విషయం అనువాదకులకు తెలిసేంత వరకూ, ఈ వివరణ అంగీకారయోగ్యమైనదని అనిపించింది. థియాలజీ ప్రొఫెసరైన ఆంథనీ ఏ. హోకమా ఇలా పేర్కొంటున్నాడు: “ఆ పదం శుభ్రపర్చపడుతుంది అని అనువదించబడటం ఎంతో దురదృష్టకరం, ఎందుకంటే శుభ్రపర్చబడిన [టాహెర్] అని సాధారణంగా అనువదించబడే హెబ్రీ క్రియాపదం ఇక్కడ అసలు ఉపయోగించబడలేదు.”a లేవీయకాండము 16వ అధ్యాయంలో టాహెర్ అనే పదం యొక్క రూపాలను కింగ్ జేమ్స్ వర్షన్ “శుభ్రపర్చడం” మరియు “శుభ్రంగా ఉండడం” అని అనువదించిన చోట అది ఉపయోగించబడింది. (లేవీయకాండము 16:19, 30) కాబట్టి, డా. హోకమా సరిగ్గానే ఇలా ముగించాడు: “ఒకవేళ దానియేలు ప్రాయశ్చిత్తార్థ దినాన జరిగే శుభ్రపర్చడాన్ని సూచించాలనుకున్నట్లైతే, ఆయన సాదాక్కు బదులు టాహెర్నే ఉపయోగించి ఉండేవాడు.” అయినప్పటికీ, లేవీయకాండములో సాదాక్ అనే పదం లేదు, మరి దానియేలులో టాహెర్ అనే పదం లేదు. భాషాపరమైన లింకు లోపిస్తోంది.
పూర్వాపర సందర్భం ఏమి బయల్పరుస్తుంది?
ఇప్పుడు పూర్వాపర సందర్భాన్ని పరిశీలించండి. దానియేలు 8:14 వ వచనం దానికి ముందున్న వచనాలతో ఎలాంటి సంబంధాన్నీ కలిగి లేని “పూర్వాపర సందర్భ ద్వీపమని” అడ్వెంటిస్టులు అంటారు. “పూర్వాపర సందర్భంలో దానియేలు 8:14” అనే శీర్షికగల బాక్సులో దానియేలు 8:9-14 వచనాలను మీరు చదివినప్పుడు మీకు అదే అభిప్రాయం కలుగుతుందా? 9వ వచనం ఒక దురాక్రమణదారును సూచిస్తుంది, అతడే ఆ చిన్న కొమ్ము. ఈ దురాక్రమణదారు ఆలయంపై దాడి చేస్తాడని 10-12 వచనాలు బయల్పరుస్తున్నాయి. 13వ వచనం ఇలా అడుగుతుంది, ‘ఈ దురాక్రమణ ఎన్నాళ్లు కొనసాగుతుంది?’ 14వ వచనం ఇలా సమాధానమిస్తుంది: “రెండువేల మూడువందల దినములమట్టుకే . . . అప్పుడు ఆలయపవిత్రతనుగూర్చిన తీర్పు తీర్చబడును.” 13వ వచనం ఒక ప్రశ్న లేవనెత్తుతుందనీ దానికి సమాధానం 14వ వచనంలో ఇవ్వబడిందనే విషయం స్పష్టమౌతుంది. వేదాంతియైన డెస్మండ్ ఫోర్డ్ ఇలా చెబుతున్నాడు: “దానియేలు 8:14ను [13వ వచనంలోని “ఎన్నాళ్లు?”] అనే కేకనుండి వేరు చేయడం లంగరు లేకుండా సముద్రంపై ఉండటం వలె ఉంటుంది.”b
అడ్వెంటిస్టులు 14వ వచనాన్ని దాని పూర్వాపర సందర్భం నుండి ఎందుకు వేరు చేస్తారు? ఒక ఇబ్బందికరమైన ముగింపును నివారించేందుకు. 14వ వచనంలో ప్రస్తావించబడిన ఆలయమును అపవిత్రపర్చడం చిన్న కొమ్ము యొక్క పని అని పూర్వాపర సందర్భం చెబుతుంది. అయితే, “పరిశోధనాత్మక తీర్పు” సిద్ధాంతం ఆలయం అపవిత్రపర్చబడటాన్ని క్రీస్తు కార్యకలాపాలకు ఆపాదిస్తుంది. ఆయన విశ్వాసుల పాపాలను పరలోక ఆలయానికి మార్పిడి చేస్తాడని వారు అంటారు. కాబట్టి, అడ్వెంటిస్టులు సిద్ధాంతాన్నీ అలాగే పూర్వాపర సందర్భాన్నీ రెండింటినీ అంగీకరిస్తే ఏమి జరుగుతుంది? సెవెంత్-డే అడ్వెంటిస్టూ ఎస్.డి.ఎ. బైబిల్ కమెంటరీ యొక్క మాజీ సహ ఎడిటరూ అయిన డా. రేమండ్ ఎఫ్. కాట్రిల్ ఇలా వ్రాస్తున్నాడు: “ఎస్.డి.ఎ. వివరణ దానియేలు 8:14ను దాని పూర్వాపర సందర్భంలో పరిశీలిస్తుందని మనలను మనం మోసపుచ్చుకోవడం ఆ చిన్న కొమ్ము యేసు అనే విషయాన్ని అంగీకరించేలా చేస్తుంది.” డా. కాట్రిల్ యథార్థంగా ఇలా అంగీకరిస్తున్నాడు: “పూర్వాపర సందర్భమూ అడ్వెంటిస్టు నమ్మకమూ పొందికపర్చబడలేవు.” కాబట్టి, “పరిశోధనాత్మక తీర్పు”కు సంబంధించి అడ్వెంటిస్టు చర్చి ఒక ఎంపిక చేసుకోవలసి వచ్చింది—అటు సిద్ధాంతాన్నో లేక దానియేలు 8:14 యొక్క పూర్వాపర సందర్భాన్నో అంగీకరించాలి. దురదృష్టకరంగా, అది సిద్ధాంతాన్ని స్వీకరించి పూర్వాపర సందర్భాన్ని తృణీకరించింది. “లేఖనాల్లో నుండి” తీసుకోలేని దానిని “లేఖనాల నుండి చదివేందుకు” ప్రయత్నిస్తున్నందుకు అడ్వెంటిస్టులను విషయ పరిజ్ఞానంగల బైబిలు విద్యార్థులు నిందించడంలో ఆశ్చర్యం లేదని డా. కాట్రిల్ చెబుతున్నాడు!
1967లో డా. కాట్రిల్ దానియేలు గ్రంథంపై ఒక సబ్బాతు దిన పాఠాన్ని సిద్ధం చేశాడు, అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎస్.డి.ఎ. చర్చిలకు పంపబడింది. దానియేలు 8:14 దాని పూర్వాపర సందర్భానికి సంబంధించి ఉందని మరి ‘శుభ్రపర్చడం’ విశ్వాసులను సూచించడం లేదని అది బోధించింది. ఆ పాఠంలో “పరిశోధనాత్మక తీర్పు”ను గురించిన ఏ ప్రస్తావనా లేకపోవడం గమనించదగిన విషయం.
కొన్ని గమనార్హమైన ప్రత్యుత్తరాలు
ఈ స్తంభం తమ “పరిశోధనాత్మక తీర్పు” సిద్ధాంతానికి మద్దతు నివ్వలేనంత బలహీనంగా ఉందనే విషయం అడ్వెంటిస్టులకు ఎంతమేరకు తెలుసు? ‘దానియేలు 8వ అధ్యాయానికీ లేవీయకాండము 16వ అధ్యాయానికీ మధ్యగల లింకుకు మీరు ఏ భాషాపర లేక పూర్వాపర సందర్భ కారణాలను ఇవ్వగలరు?’ అని డా. కాట్రిల్ 27 మంది ప్రముఖ అడ్వెంటిస్టు వేదాంతులను అడిగాడు. వారి ప్రతిస్పందన?
“దానియేలు 8:14ను ప్రవచనార్థక ప్రాయశ్చిత్త దినానికీ పరిశోధనాత్మక తీర్పుకూ అన్వయించడంలో ఎలాంటి భాషాపర లేక పూర్వాపర సందర్భ కారణాలూ లేవని మొత్తం ఇరవై ఏడు మందీ దృఢంగా నొక్కి చెప్పారు.” అతడు వారినిలా అడిగాడు, ‘అలా లింకు చేసేందుకు మీకు వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా?’ వారికి వేరే ఇతర కారణాలు లేవని వారిలో అనేకమంది అడ్వెంటిస్టు పండితులు చెప్పారు, ఎలీన్ వైట్ అలా లింకు చేసింది గనుక మేమూ చేశామని ఐదుగురు సమాధానమిచ్చారు, మరి అనువాదంలో “అదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం”పై తమ సిద్ధాంతాన్ని ఆధారితం చేసుకున్నామని ఇద్దరు చెప్పారు. వేదాంతియైన ఫోర్డ్ ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “మా పండితుల్లో అత్యంత నిపుణులు అలాంటి ముగింపుకు రావడం దానియేలు 8:14పై ఆధారపడిన మా పారంపర్య బోధ నిస్సహాయమైనదనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.”
హెబ్రీయుల పుస్తకం నుండి ఏమైనా సహాయం లభిస్తుందా?
స్తంభం రెండు: దానియేలు 8:14 హెబ్రీయులు 9వ అధ్యాయంతో జోడించబడింది. “దానియేలు 8:14ను వివరిస్తున్నప్పుడు మా తొలి రచనలన్నీ కూడా హెబ్రీయులు 9వ అధ్యాయంపై చాలా ఎక్కువగా ఆధారపడతాయి” అని వేదాంతియైన ఫోర్డ్ చెబుతున్నాడు. 1844లో “గొప్ప నిరాశ” తర్వాత ఈ లింకు పుట్టింది. నడిపింపు కొరకు వెదుకుతూ హీరామ్ ఎడ్సన్ అనే మిల్లరైట్ తన బైబిలు తెరుచుకుని పడేలా దాన్ని బల్లపై పడేశాడు. దాని ఫలితం? బైబిలు హెబ్రీయులు 8, 9 అధ్యాయాల వద్ద తెరుచుకుని పడింది. ఫోర్డ్ ఇలా చెబుతున్నాడు: “ఈ అధ్యాయాలు 1844 మరియు దానియేలు 8:14 యొక్క అర్థానికి కీలకమని అడ్వెంటిస్టులు అనడంలో అంతకుమించి సరైన మరియు సూచనార్థకమైన విషయం మరేమి ఉండగలదు!”
“ఆ మాట సెవెంత్-డే అడ్వెంటిస్టులకు ఎంతో ప్రాముఖ్యమైనది” అని దానియేలు 8:14, ప్రాయశ్చిత్తార్థ దినము, మరియు పరిశోధనాత్మక తీర్పు అనే తన పుస్తకంలో డా. ఫోర్డ్ జత చేస్తున్నాడు. “మాకు ఎంతో ప్రాముఖ్యమైన ఆలయ సిద్ధాంతం . . . యొక్క ప్రాముఖ్యతను గురించిన స్పష్టమైన వివరణ . . . కేవలం హెబ్రీయులు 9లోనే కనుగొనబడుతుంది.” అవును, హెబ్రీయులు 9వ అధ్యాయం, లేవీయకాండము 16వ అధ్యాయం యొక్క ప్రవచనార్థక అర్థాన్ని వివరిస్తున్న “క్రొత్త నిబంధనలోని” ఏకైక అధ్యాయము. అయితే అలా వివరిస్తున్న ఏకైక వచనం “పాత నిబంధనలోని” దానియేలు 8:14 మాత్రమే అని కూడా అడ్వెంటిస్టులు అంటారు. ఒకవేళ ఈ రెండు వ్యాఖ్యానాలు సత్యమైనవైతే, హెబ్రీయులు 9వ అధ్యాయానికీ దానియేలు 8వ అధ్యాయానికీ మధ్య కూడా లింకు ఉండాలి.
డెస్మండ్ ఫోర్డ్ ఇలా అభిప్రాయపడుతున్నాడు: “ఎవరైనా హెబ్రీయులు 9వ అధ్యాయాన్ని చదివినప్పుడు కొన్ని విషయాలు వెంటనే సుస్పష్టమౌతాయి. ఆ అధ్యాయానికి దానియేలు పుస్తకంతో ఎలాంటి స్పష్టమైన సంబంధమూ లేదు, దానియేలు 8:14 వచనంతోనైతే అసలు ఎలాంటి సంబంధమూ లేదు. . . . ఆ అధ్యాయం మొత్తం కూడా లేవీయకాండము 16వ అధ్యాయం యొక్క అన్వయింపు.” ఆయనిలా పేర్కొంటున్నాడు: “ఆలయ సేవల ప్రాముఖ్యతను గురించి చర్చించే ఏకైక క్రొత్త నిబంధన పుస్తకంలో ఆలయాన్ని గురించిన మా బోధ కనుగొనబడటం లేదు. ఆ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధి గాంచిన అడ్వెంటిస్టు రచయితలు ఒప్పుకున్నారు.” కాబట్టి, సంకటంలో ఉన్న ఈ సిద్ధాంతానికి స్తంభం రెండు కూడా మద్దతు ఇవ్వలేనంత బలహీనంగా ఉంది.
అయితే, ఈ ముగింపు క్రొత్తదేమీ కాదు. అనేక సంవత్సరాలుగా, “దానియేలు 8:14 మరియు హెబ్రీయులు 9ని గురించిన మా పారంపర్య వివరణ ఎదుర్కొంటున్న వ్యాఖ్యాన సంబంధ సమస్యల గురించి చర్చికి చెందిన బైబిలు పండితులకు బాగా తెలుసు” అని డా. కాట్రిల్ చెబుతున్నాడు. దాదాపు 80 సంవత్సరాల క్రితం, ప్రఖ్యాతి గాంచిన సెవెంత్-డే అడ్వెంటిస్టు మతస్థుడైన ఈ. జె. వాగనర్ ఇలా వ్రాశాడు: “ఆలయాన్ని గురించిన అడ్వెంటిస్టుల బోధ, దాని ‘పరిశోధనాత్మక తీర్పు’తోపాటూ చూస్తే అది ప్రాయశ్చిత్తాన్ని పూర్తిగా నిరాకరించినట్లు ఉంటుంది.” (కన్ఫెషన్ ఆఫ్ ఫేత్) 30 కంటే ఎక్కువ సంవత్సరాల క్రితం, అలాంటి సమస్యలు ఎస్.డి.ఎ. చర్చి యొక్క నాయకత్వమైన జనరల్ కాన్ఫరెన్సుకు అందించబడ్డాయి.
సమస్యలు మరియు విషమస్థితి
జనరల్ కాన్ఫరెన్సు “దానియేలు గ్రంథంలోని సమస్యలను గురించిన కమిటీ”ని నియమించింది. అది దానియేలు 8:14పై ఆధారపడి ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాలనే విషయంలో నివేదికను సిద్ధం చేయవలసి ఉంది. 14 మంది కమిటీ సభ్యులు ఆ ప్రశ్నను ఐదు సంవత్సరాల పాటూ చదివారు, అయితే ఒక ఏకాభిప్రాయ పరిష్కారాన్ని ప్రతిపాదించడంలో విఫలమయ్యారు. దానియేలు 8:14ను గురించిన అడ్వెంటిస్టు వివరణను “కల్పనల” అనుక్రమం ద్వారా “సంతృప్తికరంగా స్థాపించవచ్చనీ” సమస్యలను “మర్చిపోవాలనీ” కమిటీలోని అనేకమంది సభ్యులు భావించారని కమిటీ సభ్యుడైన కాట్రిల్ 1980లో చెప్పాడు. అతడిలా జత చేశాడు: “కమిటీ యొక్క పేరు దానియేలు గ్రంథంలోని సమస్యలను గురించిన కమిటీ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, మరి మనం సమస్యలను మర్చిపోయి వాటి గురించి ఏమీ అనకుండా ఉండాలని అత్యధికులు సలహా ఇచ్చారు.” అది “మా వద్ద ఎలాంటి సమాధానాలూ లేవని అంగీకరించడంతో” సమానం అవుతుంది. కాబట్టి అల్పసంఖ్యాక వర్గం అధికసంఖ్యాక వర్గం యొక్క అభిప్రాయానికి మద్దతు నిచ్చేందుకు నిరాకరించింది, అందువలన ఎలాంటి అధికారిక నివేదికా అందించబడలేదు. సిద్ధాంతాన్ని గురించిన సమస్యలు పరిష్కరించబడకుండా మిగిలిపోయాయి.
ఈ విషమస్థితిని గురించి వ్యాఖ్యానిస్తూ, డా. కాట్రిల్ ఇలా చెబుతున్నాడు: “ఎంతో వాస్తవమైన బైబిలు వ్యాఖ్యాన సంబంధ సమస్య ఉనికిలో ఉందనే విషయాన్ని ఎదుర్కునేందుకు మేము ఇంకా సిద్ధం కాలేదు గనుక, దానియేలు 8:14ను గురించిన వివాదం ఇంకా అలాగే మిగిలి ఉంది. ఎలాంటి సమస్యా లేదని మేము నటిస్తున్నంత వరకూ, ముందుగానే ఏర్పరచుకున్న తలంపులను మేము వ్యక్తులుగానూ సమిష్ఠిగానూ గుడ్డిగా అంగీకరిస్తున్నంత వరకూ ఆ వివాదం పరిష్కరింపబడదు.”—స్పెక్ట్రమ్, అడ్వెంటిస్టు పౌరసభల సంఘం ద్వారా ప్రచురించబడిన ఒక పత్రిక.
“దాని గురించి అంటే అడ్వెంటిస్టులకు ఎంతో అనివార్యమైన లేఖనాన్ని గురించి, మన వివరణ ఆధారపడి ఉన్న మూల కల్పనలనూ వివరణల సూత్రాలనూ మరోసారి జాగ్రత్తగా పునఃపరిశీలించమని” డా. కాట్రిల్ అడ్వెంటిస్టులను పురికొల్పుతున్నాడు. “పరిశోధనాత్మక తీర్పు” సిద్ధాంతం యొక్క స్తంభాలు బైబిలు మీద దృఢంగా ఆధారపడి ఉన్నాయో లేక పారంపర్యం అనే అస్థిరమైన ఇసుకపై ఆధారపడి ఉన్నాయో చూసుకునేందుకు ఆ సిద్ధాంతాన్ని పరిశీలించమని మేము అడ్వెంటిస్టులను ప్రోత్సహిస్తాము.c “సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి” అని అపొస్తలుడైన పౌలు జ్ఞానవంతంగా పురికొల్పాడు.—1 థెస్సలొనీకయులు 5:21.
[అధస్సూచీలు]
a విల్సన్స్ ఓల్డ్ టెస్టమెంట్ వర్డ్ స్టడీస్ సాదాక్ను “నీతిగా ఉండటం, న్యాయసమ్మతమవ్వడం” అనీ మరి టాహీర్ను (లేక, టాహెర్) “స్పష్టంగా, తేటగా మరియు మెరుస్తూ ఉండటం; స్వచ్ఛంగా, శుభ్రంగా పరిశుద్ధంగా ఉండటం; సకల విధాలైన కాలుష్యమూ లేక మైల లేకుండా శుభ్రంగా ఉండటమని” నిర్వచిస్తుంది.
b డా. ఫోర్డ్ అమెరికానందు చర్చి నడిపిస్తున్న పసిఫిక్ యూన్యన్ కాలేజీలో మతాచార్యునిగా ఉండేవాడు. ఆ సిద్ధాంతాన్ని అధ్యయనం చేసేందుకు 1980లో ఎస్.డి.ఎ. నాయక వర్గం వారు అతనికి ఆరు నెలల సెలవు ఇచ్చారు. అయితే, వారు అతను కనుగొన్న విషయాలను నిరాకరించారు. అతను వాటిని దానియేలు 8:14, ప్రాయశ్చిత్తార్థ దినము, మరియు పరిశోధనాత్మక తీర్పు (ఆంగ్లం) అనే పుస్తకంలో ప్రచురించాడు.
c దానియేలు 8వ అధ్యాయం యొక్క తర్కసంగతమైన వివరణ కొరకు, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన “నీ చిత్తం భూమిపై నెరవేరును గాక” (ఆంగ్లం) అనే పుస్తకం యొక్క 188-219 పేజీలను చూడండి.
[27వ పేజీలోని బాక్సు]
పూర్వపర సందర్భంలో దానియేలు 8:14
దానియేలు 8:9 “ఈ కొమ్ములలో ఒక దానిలోనుండి యొక చిన్నకొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనందదేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. 10 ఆకాశ సైన్యమునంటునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను. 11 ఆ సైన్యముయొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని, అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. 12 అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై యొక సేన అతనికియ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరచి ఇష్టాను సారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను.
“13 అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాటలాడగా వింటిని; అంతలో మాటలాడుచున్న ఆ పరిశుద్ధునితో మరియొక పరిశుద్ధుడు మాటలాడుచుండెను. ఏమనగా, అనుదిన బలినిగూర్చియు, అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన యీ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్లు పట్టుననియు, ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్లక్రింద త్రొక్కబడుట ఎన్నాళ్లు జరుగునో యనియు మాటలాడుకొనిరి. 14 అందుకతడు—రెండువేల మూడువందల దినములమట్టుకే యని నాతో చెప్పెను. అప్పుడు ఆలయపవిత్రతనుగూర్చిన తీర్పు తీర్చబడును.” (ఇటాలిక్కులు మావి.)