కుటుంబ జీవితంలో దైవికశాంతిని వెంబడించండి
“జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి. మహిమబలములు యెహోవాకు చెల్లించుడి.”—కీర్తన 96:7.
1. యెహోవా ఏ రకమైన కుటుంబ జీవితాన్ని స్థాపించాడు?
వివాహమందు మొదటి స్త్రీ పురుషుల్ని యెహోవా ఐక్యపర్చినప్పుడు, ఆయన స్థాపించిన కుటుంబ జీవితం శాంతి సంతోషాలతో తులతూగేది. వాస్తవానికి, ఆదాము తన ఆనందాన్ని “నా యెముకలలో ఒక యెముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును” అని పద్యరూపంలో వ్యక్తపర్చేంతగా సంతోషించాడు. ఇది మొట్టమొదట రాయబడిన పద్యం.—ఆదికాండము 2:23.
2. దేవుడు తన మానవపిల్లలకు సంతోషాన్ని తీసుకురావడంతోపాటూ వివాహాన్ని ఏర్పాటు చేసినప్పుడు దేన్ని సంకల్పించాడు?
2 దేవుడు వివాహాన్నీ, కుటుంబ ఏర్పాటునూ స్థాపించినప్పుడు, తన మానవ పిల్లలకు సంతోషాన్ని మాత్రమే తీసుకురావడంకన్నా, ఇంకా ఎక్కువే సంకల్పించాడు. వాళ్లు తన చిత్తాన్ని చేయాలని ఆయన కోరుకున్నాడు. ఆది దంపతులతో దేవుడు ఇలా చెప్పాడు: “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలు[డి].” (ఆదికాండము 1:28) నిజానికి, అది ప్రతిఫలదాయకమైన ఓ నియమాకం. వివాహితులైన ఆది దంపతులగు ఆదాము హవ్వలే గనుక యెహోవా చిత్తాన్ని చేయడంలో విధేయత చూపించివుంటే వారూ, వారి భవిష్యద్ పిల్లలూ ఎంత సంతోషంగా ఉండేవారో కదా!
3. దైవభక్తితో జీవించేందుకు కుటుంబాలకు ఏమి అవసరం?
3 అయితే, దేవుని చిత్తాన్ని చేయడంలో కుటుంబాలు కలిసిమెలసి పనిచేస్తుండగా, అవి ఈనాడు కూడా సంతోషంగానే ఉంటాయి. విధేయతను చూపించే అలాంటి కుటుంబాలకు ఎంతటి దివ్యమైన ఉత్తరాపేక్షలో కదా! అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును.” (1 తిమోతి 4:8) నిజమైన దైవభక్తితో జీవిస్తున్న కుటుంబాలు, యెహోవా వాక్యంలోని సూత్రాల్ని అనుసరించి, ఆయన చిత్తాన్ని చేస్తాయి. అవి దైవికశాంతిని వెంబడిస్తాయి, అలా “యిప్పటి జీవము” విషయంలో సంతోషాన్ని పొందుతాయి.
కుటుంబ జీవితం ప్రమాదంలోవుంది
4, 5. ప్రపంచవ్యాప్తంగా కుటుంబ జీవితం ఇప్పుడు ప్రమాదానికి గురవుతోందని ఎందుకు చెప్పవచ్చు?
4 అన్ని కుటుంబాల్లోనూ శాంతి సంతోషాలు మనకు కన్పించకపోవడం సహజమే. జనాభా సమాలోచన సభ అని పిలువబడిన ఒక జనసంఖ్యా శాస్త్ర ఇన్స్టిట్యూట్ చేసిన ఓ అధ్యయనాన్ని ఉల్లేఖిస్తూ, ది న్యూయార్క్ టైమ్స్ ఇలా చెబుతోంది: “ధనిక బీద దేశాల్లో ఒకే విధంగా, కుటుంబ జీవిత నిర్మాణం తీవ్రమైన మార్పులకు గురౌతూవున్నది.” ఈ అధ్యయన గ్రంథకర్తల్లో ఒకరు “కుటుంబం పటిష్ఠంగానూ, సంఘటితంగానూ ఉన్న ఓ యూనిట్గావుండి, అందులో తండ్రి ఆర్థికంగా కావాల్సినవాటిని అందించేవాడిగానూ, తల్లి భావోద్రేకపరంగా అవసరమైన శ్రద్ధను చూపించేదానిగానూ పనిచేస్తారనే తలంపు కల్పితకథనమే. అవివాహిత తల్లులూ, పెరుగుతున్న విడాకుల రేట్లూ, చిన్నచిన్న కుటుంబాలూ వంటి ధోరణులు . . . ప్రపంచవ్యాప్తంగా కన్పిస్తుండడం, వాస్తవమే. అలాంటి ధోరణుల మూలంగా, లక్షలాది కుటుంబాలు స్థిరత్వాన్నీ శాంతిసంతోషాల్నీ కోల్పోతున్నాయి, అనేకం ఛిన్నాభిన్నమైపోతున్నాయి కూడా. స్పెయిన్లో, 20వ శతాబ్దం యొక్క చివరి దశాబ్దారంభానికల్లా విడాకుల రేటు ప్రతి 8 వివాహాలకు ఒకటిచొప్పున పెరిగిపోయింది. ప్రతి 100కు ఒకటిచొప్పునవున్న 25 ఏళ్ల క్రిందటి విడాకులరేటుతో పోలిస్తే, ఇదెంతో పెరిగిపోయింది. అత్యధికస్థాయిలో విడాకుల రేటును కల్గివున్న యూరప్ దేశాల్లో ఇంగ్లాండు ఒకటనీ—అక్కడ ప్రతి 10 వివాహాల్లో 4 విఫలమవుతున్నాయనీ చెప్పబడింది. ఆ దేశం, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు మాత్రమే ఉండే కుటుంబాల సంఖ్యలో ఆకస్మిక పెరుగుదలను కూడా చూసింది.
5 కొంతమంది విడాకుల్ని పొందేందుకు వేచివుండలేకపోతున్నట్లు కనబడుతోంది. జపాన్లోని టోక్యో దగ్గరున్న “బంధనవిముక్త పుణ్యక్షేత్రం” దగ్గరకు అనేకమంది గుంపులు గుంపులుగా తరలి వెళతారు. ఈ షింటో దేవాలయం, విడాకుల కోసమూ, అలాగే ఇష్టంలేని ఇతర సంబంధాల్ని త్రెంచుకోవడం కోసమూ చేసుకునే విన్నపాల్ని అంగీకరిస్తుంది. ప్రతీ ఆరాధికు(డూ)రాలూ పల్చగావున్న చెక్క బోర్డుపై తన విజ్ఞాపనను రాసి, దాన్ని ఆ పుణ్యక్షేత్రపు ఆవరణలో వ్రేలాడదీసి జవాబు కోసం ప్రార్థి(స్తాడు)స్తుంది. దాదాపు ఓ శతాబ్దంక్రితం ఆ పుణ్యక్షేత్రం స్థాపించబడినప్పుడు, “ధనవంతులైన స్థానిక వర్తకుల భార్యలు, తమ భర్తలు ఉంపుడుగత్తెల్ని విడిచి, తమ దగ్గరకు రావాలని అడుగుతూ ప్రార్థనల్ని రాసేవారు” అని టోక్యో వార్తాపత్రికొకటి చెబుతోంది. అయితే, ఈనాడు చేసే విజ్ఞాపనల్లో అనేకం, విడాకులకోసం చేసేవే కానీ సమాధానపడ్డానికి చేసేవి కాదు. నిస్సందేహంగా, కుటుంబ జీవితం ప్రపంచవ్యాప్తంగా ప్రమాదానికి గురౌతోంది. ఇది క్రైస్తవుల్ని ఆశ్చర్యపర్చాలా? ప్రస్తుత కుటుంబ విపత్తుకు సంబంధించిన నిశితదృష్టిని బైబిలు మనకు ఇస్తోంది గనుక ఇది ఆశ్చర్యపర్చాల్సిన విషయంకాదు.
కుటుంబ సంక్షోభం ఎందుకుంది?
6. మొదటి యోహాను 5:19 వచనం నేటి కుటుంబ సంక్షోభంపై ఎలాంటి సంబంధాన్ని కల్గివుంది?
6 ‘లోకమంతయు దుష్టుని యందుండడం’ నేటి కుటుంబ సంక్షోభానికిగల ఒక కారణం. (1 యోహాను 5:19) అపవాదియైన సాతానుయగు దుష్టునినుండి మనం దేన్ని ఎదురుచూడగలం? అతడొక దుష్టుడు, దుర్నీతిపరుడైన అబద్ధికుడు. (యోహాను 8:44) అతని లోకం కుటుంబ జీవితాన్ని వినాశనంచేసే కుతంత్రాల్లోనూ, దుర్నీతిలోనూ మునిగిపోవడంలో ఆశ్చర్యమేమీలేదు! దేవుని సంస్థకు వెలుపల, సాతాను ప్రభావం యెహోవా వివాహ ఏర్పాటును నాశనంచేయడానికీ, శాంతియుతమైన కుటుంబ జీవితాన్ని అంతమొందించడానికీ పొంచివుంది.
7. ఈ అంత్యదినాల్లో అనేకమంది వ్యక్తపరుస్తున్న లక్షణాలు, కుటుంబాల్ని ఎలా ప్రభావితం చేయగలవు?
7 ఇప్పుడు మానవజాతిని పట్టి పీడిస్తున్న కుటుంబ సమస్యలకుగల మరో కారణం, 2 తిమోతి 3:1-5 వచనాల్లో సూచించబడింది. అక్కడ రాయబడివున్న పౌలు ప్రవచనాత్మక మాటలు, మనం “అంత్యదినములలో” జీవిస్తున్నామని సూచిస్తున్నాయి. కుటుంబాల్లోని సభ్యులు గనుక “స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తలిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞతలేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారు” అయితే, ఆ కుటుంబాలు శాంతిసంతోషాల్ని కల్గివుండలేవు. కుటుంబ సభ్యుల్లో కనీసం ఒక్కరిలో అనురాగం కొరవడినా లేక నమ్మకద్రోహియైనా ఆ కుటుంబం సంతోషాన్ని పూర్తిగా అనుభవించలేదు. కుటుంబ సభ్యుల్లో ఒకరు గనుక అతిద్వేషో లేక క్రూరుడో అయితే ఆ కుటుంబ జీవితమెలా సమాధానకరంగా ఉండగలదు? మరీ అధ్వాన్నంగా, కుటుంబ సభ్యులు దేవునికంటే సుఖానుభవమునెక్కువగా ప్రేమించువారైతే శాంతిసంతోషాలు ఏ విధంగా ఉండగలవు? సాతానుచే పరిపాలించబడుతున్న ఈ లోకంలోని ప్రజల లక్షణాలు ఇవే. ఈ అంత్యదినాల్లో, కుటుంబసంతోషం దుర్లభమైపోయినందుకు ఆశ్చర్యపోవాల్సిన పనేమీలేదు!
8, 9. కుటుంబ సంతోషంపై పిల్లల ప్రవర్తన ఏ ప్రభావాన్ని చూపించగలదు?
8 అనేక కుటుంబాల్లో శాంతిసంతోషాలు కొరవడడానికిగల మరొక కారణం, పిల్లల దుష్ప్రవర్తనే. అంత్యదినాల్లోని పరిస్థితుల్ని గురించి పౌలు ప్రవచించినప్పుడు, అనేకమంది పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులవుతారని ఆయన ప్రవచించాడు. మీరు యౌవనులైతే, మీ కుటుంబం, శాంతిసంతోషాలకు నిలయమయ్యేలా చేయడంలో మీ ప్రవర్తన దోహదపడుతోందా?
9 కొంతమంది పిల్లలు, ప్రవర్తనలో మాదిరికరంగా ఉండరు. ఉదాహరణకు, ఓ బాలుడు తన తండ్రికి కోపంతెప్పించే ఓ ఉత్తరాన్ని ఇలా రాశాడు: “నన్ను అలెగ్జాండ్రియాకు తీసుకెళ్లకపోయావో, నేను నీకు ఉత్తరం రాయను, నీతో మాట్లాడను, నీకు గుడ్బైకూడా చెప్పను, మరి నువ్వు నేనులేకుండా అలెగ్జాండ్రియాకు వెళ్లావనుకో నీ చెయ్యిపట్టుకోను, ఇక నిన్నెప్పటికీ పలకరించను. నువ్వు నన్ను తీసుకెళ్లకపోతే జరిగేదదే . . . కానీ నేను నిన్ను తీసుకురమ్మని అడిగేనే, దాన్ని [సితారను] నాకు పంపించు. నువ్వు పంపించకపోయావో, నేను తిననూ, త్రాగనూ. చూస్కో మరి!” ఇది ప్రస్తుతంవున్న పరిస్థితిలానే కనబడుతోందా? 2,000 కంటే ఎక్కువ సంవత్సరాల క్రిందట, ప్రాచీన ఐగుప్తులో ఓ బాలుడు తన తండ్రికి రాసిన ఉత్తరమది.
10. దైవికశాంతిని వెంబడించేందుకు తమ కుటుంబాలకు పిల్లలెలా సహాయపడగలరు?
10 ఐగుప్తీయుడైన ఆ బాలుని వైఖరి, కుటుంబ శాంతిని ఎంతమాత్రం పెంపొందించలేదు. ఈ అంత్యదినాల్లో కుటుంబాల్లో మరింత తీవ్రమైనవెన్నో జరుగుతున్నాయనుకోండి. కానీ, పిల్లలైన మీరు, దైవికశాంతిని వెంబడించేందుకు మీ కుటుంబానికి తోడ్పడగలరు. ఎలా? బైబిలులోని ఈ సలహాకు విధేయత చూపించడంద్వారా: “పిల్లలారా, అన్నివిషయములలో మీ తలిదండ్రులమాట వినుడి; ఇది ప్రభువునుబట్టి మెచ్చుకొనతగినది.”—కొలొస్సయులు 3:20.
11. తమ పిల్లలు, యెహోవాకు నమ్మకమైన సేవకులుగా అయ్యేందుకు తల్లిదండ్రులెలా వారికి సహాయపడగలరు?
11 తల్లిదండ్రులారా మీ విషయమేంటి? యెహోవా నమ్మకమైన సేవకులుగా అయ్యేందుకు మీ పిల్లలకు ప్రేమపూర్వకంగా సహాయపడండి. “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు” అని సామెతలు 22:6వ వచనం చెబుతోంది. శ్రేష్ఠమైన లేఖనాధారిత బోధ మూలంగానూ, తల్లిదండ్రులు చూపించిన మంచి మాదిరి మూలంగానూ, అనేకమంది బాలబాలికలు పెరిగి పెద్దవారైనప్పుడు సరియైన మార్గంనుండి ప్రక్కకు తొలగిపోరు. కానీ ఇది ఎక్కువగా, పిల్లవానికిచ్చే బైబిలు తర్ఫీదు నాణ్యతపైనా, అది ఎంత విస్తృతంగా ఇవ్వబడుతుందనే దానిపైనా, అలాగే పిల్లవాని హృదయస్థితిపైనా ఆధారపడివుంటుంది.
12. క్రైస్తవ గృహం ఎందుకు సమాధానకరంగా ఉండాలి?
12 మన కుటుంబంలోని సభ్యులందరూ యెహోవా చిత్తాన్ని చేసేందుకు ప్రయత్నిస్తుంటే, మనం దైవికశాంతిని అనుభవించే సాధ్యతవుంది. క్రైస్తవ గృహం, ‘సమాధానపాత్రుల’తో నింపబడాలి. యేసు తన 70 మంది శిష్యుల్ని పరిచారకులుగా పంపిస్తూ వారితో, “మీరు ఏ యింటనైనను ప్రవేశించునప్పుడు—ఈ యింటికి సమాధానమగు గాక అని మొదట చెప్పుడి. సమాధానపాత్రుడు అక్కడ నుండినయెడల మీ సమాధానము అతనిమీద నిలుచును” అని చెప్పినప్పుడు ఆయన మనస్సులో అలాంటి ప్రజలే ఉన్నారని లూకా 10:1-6 వచనాలు చూపిస్తున్నాయి. యెహోవా సేవకులు “సమాధానకరమైన సువార్త”తో ఇంటింటికి శాంతియుతంగా వెళ్తున్నప్పుడు, వాళ్లు సమాధానపాత్రుల్ని అన్వేషిస్తారు. (అపొస్తలుల కార్యములు 10:34-36; ఎఫెసీయులు 2:13-18) నిశ్చయంగా, సమాధానపాత్రులతో రూపొందించబడిన క్రైస్తవ గృహం సమాధానకరమైనదై ఉండాలి.
13, 14. (ఎ) రూతు ఓర్పాల కొరకు నయోమి ఏమి కోరుకుంది? (బి) ఓ క్రైస్తవ గృహం ఏ తరహా నివాస స్థలంగా ఉండాలి?
13 ఓ ఇల్లు శాంతి సమాధానాలకు నిలయమై ఉండాలి. యౌవన విధవరాండ్రైన తన కోడళ్లగు రూతు, ఓర్పాలకు మంచి భర్తల్నీ, ఇంటినీ ఇవ్వడంద్వారా నెమ్మదినీ ఓదార్పునూ దేవుడు దయచేస్తాడని వృద్ధ విధవరాలైన నయోమి నిరీక్షించింది. నయోమి ఇలా చెప్పింది: “మీలో ఒక్కొక్కతె పెండ్లి చేసికొని తన యింట నెమ్మదినొందునట్లు యెహోవా దయచేయును గాక.” (రూతు 1:9) అలాంటి ఇళ్లల్లో రూతు ఓర్పాలు “ఆందోళనా చింతలనుండి విడుదల పొందుతారు. వాళ్లకు మనశ్శాంతి లభిస్తుంది. అది, వాళ్లు కాపురముండగలిగే, తమ మృదువైన భావాల్నీ, మంచి కోరికల్నీ తీర్చుకునే, తృప్తిపర్చుకునే స్థలంగా ఉంటుంది. హీబ్రూ . . . లోవున్న విశిష్టమైన శక్తి, [యెషయా 32:17, 18] వచనాల్లోవున్న సంబంధిత పదాల స్వభావంద్వారా కొట్టొచ్చినట్లు ప్రదర్శించింది” అని ఓ పండితుడు నయోమి కోరికను గురించి రాశాడు.
14 యెషయా 32:17, 18 వచనాలకు సంబంధించిన ఈ రిఫరెన్సును దయచేసి గమనించండి. అక్కడ మనమిలా చదువుతాం: “నీతి సమాధానము కలుగజేయును. నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు.” క్రైస్తవ గృహం నీతీ, నిమ్మళమూ, భద్రతా, దైవికశాంతులకు నివాసములుగా ఉండాలి. కానీ శోధనలూ, విభేదాలూ లేక మరితర సమస్యలు తలెత్తితే అప్పుడేమిటి? అప్పుడు, మనం ప్రాముఖ్యంగా, కుటుంబ సంతోషానికిగల రహస్యాన్ని తెల్సుకోవాల్సిన అవసరం ఉంటుంది.
నాల్గు ముఖ్యమైన సూత్రాలు
15. కుటుంబ సంతోషానికిగల రహస్యాన్ని మీరెలా నిర్వచిస్తారు?
15 భూమిమీద ఉన్న ప్రతీ కుటుంబమూ కుటుంబాలకు సృష్టికర్తయైన యెహోవా దేవునిబట్టి కుటుంబమని పిలువబడుతోంది. (ఎఫెసీయులు 3:14, 15) కాబట్టి, కుటుంబ సంతోషాన్ని అభిలషించేవాళ్లు, ఆయన నడిపింపును వెదకి, కీర్తనల గ్రంథకర్త కొనియాడినట్లుగానే ఆయన్నిలా కొనియాడాలి: “జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి. మహిమబలములు యెహోవాకు చెల్లించుడి.” (కీర్తన 96:7) కుటుంబ సంతోషానికిగల రహస్యం దేవుని వాక్యమైన బైబిలు పుటల్లోనూ, దాని సూత్రాల్ని అన్వయించుకోవడంలోనూ ఉంది. ఈ సూత్రాల్ని అన్వయించుకునే కుటుంబం సంతోషంగలదిగానూ, దైవికశాంతిని అనుభవించేదిగానూ ఉంటుంది. కాబట్టి, ఈ ప్రాముఖ్యమైన నాల్గు సూత్రాల్నీ మనం పరిశీలిద్దాం.
16. కుటుంబ జీవితంలో ఆశానిగ్రహం ఏ భూమికను నిర్వహించాలి?
16 ఈ సూత్రాల్లో ఒకటి, కుటుంబ జీవితంలో దైవికశాంతిని పొందేందుకు ఆశానిగ్రహం ప్రాముఖ్యం అనే దానిపై కేంద్రీకరించబడుతుంది. రాజైన సొలొమోను ఇలా తెలియజేశాడు: “ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణచుకొనలేనివాడును అంతే.” (సామెతలు 25:28) సమాధానకరమైన, సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని కల్గివుండాలని మనం అభిలషిస్తే, మన మనస్సును అణుచుకోవడం—ఆశానిగ్రహాన్ని కల్గివుండడం—ప్రాముఖ్యం. మనం అపరిపూర్ణులమైనప్పటికీ, దేవుని పరిశుద్ధాత్మ ఫలమైన ఆశానిగ్రహాన్ని కల్గి ఉండాల్సిన అవసరంవుంది. (రోమీయులు 7:21, 22; గలతీయులు 5:22, 23) మనమీ లక్షణం కొరకు ప్రార్థించి, దానికి సంబంధించిన బైబిలు సలహాను అన్వయించుకొంటూ, అలా అన్వయించుకుంటున్న ఇతరులతో సహవసిస్తే ఆత్మ మనలో ఆశానిగ్రహాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఇది, ‘జారత్వమునకు దూరముగా పారిపోవ’డానికి మనకు సహాయపడుతుంది. (1 కొరింథీయులు 6:18) దౌర్జన్యాన్ని తిరస్కరించేందుకూ, త్రాగుబోతులుకాకుండా జాగ్రత్తపడేందుకూ లేక దాన్ని అధిగమించేందుకూ, క్లిష్టమైన పరిస్థితులతో మరింత ప్రశాంతంగా వ్యవహరించేందుకూ ఆశానిగ్రహం మనకు సహాయపడుతుంది.
17, 18. (ఎ) 1 కొరింథీయులు 11:3వ వచనం, క్రైస్తవ కుటుంబ జీవితానికి ఎలా అన్వయిస్తుంది? (బి) శిరస్సత్వాన్ని గుర్తించడం, కుటుంబంలో దైవికశాంతిని ఎలా పెంపొందింపజేస్తుంది?
17 మరొక ప్రాముఖ్యమైన సూత్రాన్ని ఈ విధంగా చెప్పవచ్చు: మన కుటుంబాల్లో దైవికశాంతిని వెంబడించేందుకు, శిరస్సత్వాన్ని గుర్తించడం మనకు సహాయపడుతుంది. పౌలు ఇలా రాశాడు: “ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను.” (1 కొరింథీయులు 11:3) కుటుంబంలో పురుషుడు నడిపింపును ఇస్తాడనీ, అతని భార్య నమ్మకంగా మద్దతు ఇస్తుందనీ, మరి పిల్లలు విధేయత చూపిస్తారనీ దీని భావం. (ఎఫెసీయులు 5:22-25, 28-33; 6:1-4) అలాంటి ప్రవర్తన, కుటుంబ జీవితంలో దైవికశాంతిని పెంపొందింపజేస్తుంది.
18 లేఖనాధారిత శిరస్సత్వం అంటే నియంతృత్వం కాదని ఓ క్రైస్తవ భర్త గుర్తుంచుకోవాల్సిన అవసరంవుంది. అతడు తన శిరస్సైన యేసును అనుకరించాలి. యేసు ‘సమస్తానికి శిరస్సు’గా ఉన్నప్పటికీ, ఆయన “పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు” వచ్చాడు. (ఎఫెసీయులు 1:22; మత్తయి 20:28) అదే విధంగా, ఒక క్రైస్తవ పురుషుడు ప్రేమపూర్వకమైన రీతిలో శిరస్సత్వాన్ని అభ్యసించడం, అతడు తన కుటుంబ సభ్యుల ఆసక్తులపై అధిక శ్రద్ధను చూపించేందుకు అతనికి దోహదపడగలదు. మరి నిశ్చయంగా క్రైస్తవభార్య తన భర్తకు సహకరించాలని కోరుకుంటుంది. అతని ‘సహాయకారి’గా, ‘సాటియైన తోడు’గా, ఆమె తన భర్తలో కొరవడిన లక్షణాల్ని భర్తీచేస్తుంది. ఆ విధంగా ఆమె అతనికి అవసరమైన మద్దతును ఇస్తుంది. (ఆదికాండము 2:20; సామెతలు 31:10-31) శిరస్సత్వాన్ని సక్రమంగా ఉపయోగించడం, భర్తలూ, భార్యలూ, ఇరువురూ ఒకరితోనొకరు గౌరవప్రదంగా వ్యవహరించేందుకు సహాయపడుతుంది. మరి విధేయత చూపించేందుకు పిల్లల్ని ప్రేరేపిస్తుంది. అవును, శిరస్సత్వాన్ని గుర్తించడం, కుటుంబ జీవితంలో దైవికశాంతిని పెంపొందింపజేస్తుంది.
19. కుటుంబ శాంతి సంతోషాలకు మంచి పరస్పర సంభాషణ ఎందుకు అవసరం?
19 ప్రాముఖ్యమైన మూడో సూత్రాన్ని, ఈ క్రింది మాటల్లో వ్యక్తపర్చవచ్చు: కుటుంబ శాంతి సంతోషాలకు మంచి పరస్పరసంభాషణ ముఖ్యం. యాకోబు 1:19వ వచనం మనకిలా చెబుతోంది: “ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై యుండవలెను.” కుటుంబ పరస్పర సంభాషణయనేది ఇచ్చిపుచ్చుకోవడం లాంటిది గనుక కుటుంబ సభ్యులు వినాల్సిన అవసరమూ, ఒకరితో మరొకరు మాట్లాడుకోవాల్సిన అవసరమూ ఉంది. మనం చెప్పేది నిజమే అయినప్పటికీ కూడా, దాన్నే మనం నిర్దయగానో గర్వంగానో లేక నిర్లక్ష్యంగానో చెబితే, అది చేసే మంచికన్నా చెడే ఎక్కువగావుండే అవకాశంవుంది. మన సంభాషణ రుచికరంగానూ, “ఉప్పువేసినట్టు”గానూ ఉండాలి. (కొలొస్సయులు 4:6) లేఖనాధార సూత్రాల్ని అనుసరించే, చక్కగా సంభాషించుకునే కుటుంబాలు దైవికశాంతిని వెంబడిస్తున్నాయి.
20. కుటుంబ శాంతికి ప్రేమ ప్రాముఖ్యమని మీరు ఎందుకు చెబుతారు?
20 కుటుంబ శాంతిసంతోషాలకు ప్రేమ అవసరమనేదే నాల్గవ సూత్రం. ప్రణయభరితమైన ప్రేమ, వైవాహిక జీవితంలో ఓ ప్రముఖమైన భూమికను నిర్వర్తించవచ్చు, మరి కుటుంబ సభ్యులమధ్య ప్రగాఢమైన అనురాగం పెంపొందవచ్చు. అయితే, అగాపే అనే గ్రీకు పదంచే గుర్తించబడిన ప్రేమ మరింత ప్రాముఖ్యమైంది. యెహోవా ఎడలా, యేసు ఎడలా, మన పొరుగువారి ఎడలా మనం అలవర్చుకునే ప్రేమ ఇదే. (మత్తయి 22:37-39) ‘తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించడం’ ద్వారా దేవుడు మానవజాతి ఎడల ఇదే ప్రేమను చూపించాడు. (యోహాను 3:16) అదే ప్రేమను, మనం మన కుటుంబ సభ్యుల ఎడల చూపించగలగడం ఎంత అద్భుతంగా ఉండగలదు! ఉన్నతమైన ఈ ప్రేమ, ‘పరిపూర్ణతకు అనుబంధమైనది.’ (కొలొస్సయులు 3:14) ఇది, వివాహిత దంపతుల్ని కలిపి ఉంచుతుంది. వారు తామిరువురికీ, తమ పిల్లలకూ శ్రేష్ఠమైనదాన్ని చేసేలా వారిని ప్రేరేపిస్తుంది. క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఐక్యంగా వాటితో వ్యవహరించేందుకు ప్రేమ వారికి తోడ్పడుతుంది. “ప్రేమ . . . స్వప్రయోజనమును విచారించుకొనదు; . . . అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వతకాలముండును” గనుక, మనమీ విషయంలో నిశ్చయత కల్గి ఉండొచ్చు. (1 కొరింథీయులు 13:4-8) యెహోవా ఎడలగల ప్రేమచే ఒకరి ఎడల మరొకరికిగల ప్రేమ పటిష్ఠపర్చబడివున్న కుటుంబాలు నిజంగా ధన్యమైనవి!
దైవికశాంతిని వెంబడిస్తూ ఉండండి
21. మీ కుటుంబ శాంతి సంతోషాల్ని ఏది తప్పక వృద్ధిచేస్తుంది?
21 ప్రస్తావించబడిన సూత్రాలూ, బైబిల్లోనుండి తీసుకొనబడిన ఇతర సూత్రాలూ ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ ద్వారా యెహోవా దయాపూర్వకంగా దయచేసిన ప్రచురణల్లో సంక్షిప్తపర్చబడ్డాయి. (మత్తయి 24:45) ఉదాహరణకు, 1996/97లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన యెహోవాసాక్షుల “దైవికశాంతి సందేశకులు” జిల్లా సమావేశాల్లో విడుదల చేయబడిన కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే 192 పేజీల పుస్తకంలో అలాంటి సమాచారం దొరుకుతుంది. అలాంటి ప్రచురణ సహాయంతో లేఖనాల్ని వ్యక్తిగతంగానూ, కుటుంబపరంగానూ అధ్యయనం చేయడం, అనేక ప్రయోజనాల్ని తీసుకురాగలదు. (యెషయా 48:17, 18) అవును, లేఖనాధార సలహాను అన్వయించుకోవడం, మీ కుటుంబ శాంతి సంతోషాల్ని తప్పక వృద్ధిచేస్తుంది.
22. మన కుటుంబ జీవితాన్ని దేనిపై మనం కేంద్రీకరించాలి?
22 తన చిత్తాన్ని చేస్తున్న కుటుంబాల కోసం, యెహోవా అద్భుతమైన వాటిని దాచివుంచాడు. మరి ఆయన మన స్తుతులనూ, సేవనూ పొందనర్హుడు. (ప్రకటన 21:1-4) గనుక, మీ కుటుంబం జీవితం సత్యదేవుని ఆరాధనపై కేంద్రీకరించబడునుగాక. మీరు మీ కుటుంబ జీవితంలో దైవికశాంతిని వెంబడిస్తుండగా, మన ప్రేమగల పరలోకపు తండ్రియైన యెహోవా మిమ్మల్ని సంతోషంతో ఆశీర్వదించుగాక!
మీరెలా జవాబిస్తారు?
◻ కుటుంబాలు గనుక దైవభక్తితో జీవించాలనుకుంటే ఏది అవసరం?
◻ నేడు కుటుంబ సంక్షోభం ఎందుకుంది?
◻ కుటుంబ సంతోషానికిగల రహస్యం ఏమిటి?
◻ కుటుంబ జీవితంలో శాంతి సంతోషాల్ని పెంపొందింపజేసేందుకు తోడ్పడే కొన్ని సూత్రాలు ఏవి?
[24వ పేజీలోని చిత్రం]
కుటుంబ జీవితంలో దైవికశాంతిని వెంబడించేందుకు మంచి పరస్పర సంభాషణ సహాయపడుతుంది