‘ఆయన వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృష్టించాడు’
“దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.”—ఆదికాండము 1:27.
1. సత్యం, క్రైస్తవ స్త్రీ పురుషులకు ఓ ఆశీర్వాదంగా ఎలా ఉండగలదు?
యిహోవా ప్రజల మధ్య ఉండడమూ, దేవున్ని ప్రేమించి ఆయనకు విధేయత చూపడమే తమ జీవితధ్యేయంగాగల స్త్రీ పురుషులతోనూ బాలబాలికలతోనూ సహవసించడమూ ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో కదా! యెహోవా దేవునికి అప్రీతికరమైన దృక్పథాలనుండీ, ప్రవర్తననుండీ కూడా సత్యం మనల్ని స్వతంత్రులను చేస్తోంది. అది, క్రైస్తవులకు తగినట్లుగా ఎలా జీవించాలో మనకు బోధిస్తోంది. (యోహాను 8:32; కొలొస్సయులు 3:8-10) ఉదాహరణకు, పురుషులు తమ పురుషత్వాన్నీ, స్త్రీలు తమ స్త్రీత్వాన్నీ వ్యక్తపర్చాల్సిన విధానాన్ని గూర్చిన సాంప్రదాయాల్నీ లేక భావనల్నీ ప్రజలందరూ కల్గివున్నారు. ఇది కేవలం పురుషులు పురుషత్వాన్నీ, స్త్రీలు స్త్రీత్వాన్నీ జన్మతః పుణికిపుచ్చుకున్నందుకేనా? లేక పరిగణలోకి తీసుకోవాల్సిన ఇతర కారకాలు ఏవైనా ఉన్నాయా?
2. (ఎ) స్త్రీత్వాన్ని గూర్చిన, పురుషత్వాన్ని గూర్చిన మన దృక్పథాన్ని ఏది నిర్ధారించాలి? (బి) స్త్రీ పురుష లింగ భేదాల్ని గూర్చిన తలంపులకు ఏమి సంభవించింది?
2 క్రైస్తవులకు దేవుని వాక్యమే అధికారికమైనది. మనం అలవర్చుకున్న వ్యక్తిగత, సాంస్కృతిక లేక సాంప్రదాయక దృక్పథాలేవైనప్పటికీ, మనం దేవుని వాక్యానికే విధేయత చూపించాలి. (మత్తయి 15:1-9) బైబిలు, స్త్రీత్వపు లక్షణాలను గురించీ పురుషత్వపు లక్షణాలను గురించీ విశదంగా వివరించడంలేదు. బదులుగా, అది విభిన్న సంస్కృతుల్లో మనం చూస్తున్న వైవిధ్యంవంటి వైవిధ్యానికి తావిస్తోంది. స్త్రీ పురుషులు ఎలా ఉండాలని దేవుడు సృష్టించాడో వాళ్లు అలాగే ఉండాలంటే, పురుషులకు పురుషత్వమూ, స్త్రీలకు స్త్రీత్వమూ ఉండాలి. ఎందుకు? స్త్రీ పురుషులు శరీరరీత్యా ఒకరికొకరు సాటియైన తోడుగా ఉండడానికి సృజించబడ్డంతోపాటూ, స్త్రీత్వ పురుషత్వ లక్షణాల ద్వారా ఒకరికొకరు సాటియైన తోడుగా ఉండేలా వాళ్లు సృష్టించబడ్డారు. (ఆదికాండము 2:18, 23, 24; మత్తయి 19:4, 5) అయినప్పటికీ, స్త్రీ పురుష లింగభేదాల్ని గూర్చిన తలంపులు వక్రంగానూ, వికృతంగానూ తయారయ్యాయి. అనేకులు, పురుషత్వాన్ని కఠినమైన ఆధిపత్యంతోనూ కఠినత్వంతోనూ లేక పురుషాహంకారంతోనూ సమానమైనదిగా పరిగణిస్తారు. కొన్ని సంస్కృతుల్లో పురుషుడు బాహాటంగానైనా ఒంటరిగానైనా ఏడ్వడం అరుదైన విషయమై ఉంటుంది, లేక సిగ్గుకరమైన విషయంగానైనా ఉంటుంది. కానీ, లాజరు సమాధి దగ్గరున్న జనసమూహంలో ఉన్నప్పుడు, “యేసు కన్నీళ్లు విడిచెను.” (యోహాను 11:35) అలా చేయడం, పరిపూర్ణ పురుషత్వంగల యేసుకు అనుచితమైన విషయంకాదు. స్త్రీత్వాన్ని కేవలం శారీరక, లైంగిక ఆకర్షణగానే పరిగణిస్తూ నేడు అనేకమంది దాని విషయంలో సమతూకాన్ని కోల్పోయారు.
నిజమైన స్త్రీత్వం, నిజమైన పురుషత్వం
3. స్త్రీ పురుషులు ఏ విధంగా భిన్నంగా ఉంటారు?
3 నిజమైన స్త్రీత్వం అంటే ఏమిటి, నిజమైన పురుషత్వం అంటే ఏమిటి? ది వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా ఇలా చెబుతోంది: “స్త్రీ పురుషుల్లో అనేకమంది, శరీర నిర్మాణంలోనే కాక ప్రవర్తనాసక్తుల్లో కూడా భిన్నంగా ఉంటారు. ఈ తేడాల్లో కొన్ని, జన్యు నిర్మాణరీత్యా నిర్ధారించబడతాయి. . . . కానీ అనేకమైన శరీరనిర్మాణేతర తేడాలు, ప్రతీవ్యక్తీ నేర్చుకునే స్త్రీ పురుష ప్రవర్తనా మాదిరులపై ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రజలు మగవారిగా లేక ఆడవారిగా జన్మించినప్పటికీ, వాళ్లు పురుష లక్షణాలను లేక స్త్రీ లక్షణాలను కల్గివుండడం నేర్చుకుంటారు.” మన జన్యు నిర్మాణం, అనేకమైన వాటికి వివరణలను ఇవ్వగల్గినప్పటికీ, సముచితమైన పురుషత్వపు పెరుగుదలైనా లేక స్త్రీత్వపు పెరుగుదలైనా దేవుడు కోరేవాటిని మనం నేర్చుకోవడంపైనా, జీవితంలో వెంబడించడానికి మనం వేటిని ఎంపిక చేసుకుంటామనే దానిపైనా ఆధారపడి ఉంటుంది.
4. స్త్రీ పురుషుల పాత్రల్ని గూర్చి బైబిలు ఏమని బయల్పరుస్తోంది?
4 ఆదాము తన భార్యా పిల్లలకు శిరస్సుగా నాయకత్వం వహించడమే, ఆయన పాత్రని బైబిలు చరిత్ర బయల్పరుస్తోంది. దానితోపాటు, ఆయన భూమిని నిండించి దాన్ని లోబర్చుకొనీ, భూసంబంధమైన సృష్టినంతటినీ ఏలమనే దేవుని చిత్తానికి అనుగుణ్యంగా ఉండాల్సివుంది. (ఆదికాండము 1:28) హవ్వ నిర్వహించాల్సిన స్త్రీత్వపు కుటుంబ పాత్ర ఏమిటంటే, తమ కొరకు బయల్పర్చబడిన దేవుని సంకల్పాన్ని నెరవేర్చడంలో ఆదాముతో సహకరిస్తూ, ఆయనకు ‘సహాయకారి’గా, ‘సాటియైన తోడు’గా ఉండడమూ, ఆయన శిరస్సత్వానికి లోబడి ఉండడమూ అయివుంది.—ఆదికాండము 2:18; 1 కొరింథీయులు 11:3.
5. స్త్రీ పురుషుల మధ్య బాంధవ్యాలెలా చెడిపోయాయి?
5 కానీ ఆదాము తన బాధ్యతను విస్మరించాడు. హవ్వయైతే, దేవునికి అవిధేయత చూపించడంలో తనతో చేతులుకలిపేలా ఆదామును మభ్యపెట్టేందుకు, ఆమె తన స్త్రీత్వాన్ని మరులుకొల్పేరీతిలో ఉపయోగించింది. (ఆదికాండము 3:6) ఆదాము తనకు తప్పని తెలిసినదానిని చేయడంద్వారా, నిజమైన పురుషత్వాన్ని చూపించడంలో విఫలుడయ్యాడు. ఆయన, తన తండ్రియైన సృష్టికర్త చెప్పినదాన్ని అంగీకరించడానికి బదులు, మోసగించబడిన తన జత మాటను అంగీకరించడాన్నే సులభంగా ఎంపిక చేసుకున్నాడు. (ఆదికాండము 2:16, 17) అవిధేయతా పర్యవసానంగా ఉండబోతుందని దేవుడు దేనిని ముందుగా తెలియజేశాడో, దాన్నే ఆ ఆదిదంపతులు త్వరలో అనుభవించడం ఆరంభించారు. మునుపు తన భార్యను అలంకారికంగానూ కావ్యరూపంలోనూ వర్ణించిన ఆదాము, ఇప్పుడు భావరహితంగా ‘నీవు నాకిచ్చిన స్త్రీ’ అని ఆమెను సంబోధించాడు. ఆయన అపరిపూర్ణతే, ఆయన పురుషత్వాన్ని ఇప్పుడు నాశనం చేసి తప్పుదోవ పట్టించింది. తత్ఫలితంగా, ఆయన తన ‘భార్యపై అధికారాన్ని’ చెలాయించాడు. హవ్వకు తన భర్త ఎడల “వాంఛ” కల్గుతుంది. బహుశా, అది అధికంగానైనా లేక సమతూకం లేకుండానైనా అయ్యుండొచ్చు.—ఆదికాండము 3:12, 16.
6, 7. (ఎ) జలప్రళయానికి ముందు పురుషత్వపు ఏ వికృతరూపం వృద్ధిచెందింది? (బి) జలప్రళయానికి ముందున్న పరిస్థితినుండి మనం ఏం నేర్చుకోగలం?
6 స్త్రీత్వ పురుషత్వాల దుర్వినియోగం, నోవహు కాలానికి ముందునుండే మరింత స్పష్టమయ్యింది. పరలోకంలోని తమ స్థానాన్ని విడిచిపెట్టిన దేవదూతలు, స్త్రీలతో లైంగిక సంబంధాల్ని కలిగి ఉండేందుకు మానవ శరీరాలను ధరించారు. (ఆదికాండము 6:1, 2) అసహజమైన ఆ లైంగిక సంబంధాల మూలంగా పురుషులు మాత్రమే జన్మించారని ఆ వృత్తాంతం తెలియజేస్తోంది. ఆ సంతానం పునరుత్పత్తికి పనికిరాని సంకరజాతిగా కనబడుతోంది. వాళ్లు ‘శూరులనీ,’ ‘నెఫీలులనీ,’ లేక ఇతరులను క్రూలదోసేవారు గనుక బలత్కారులనీ పిలువబడ్డారు. (ఆదికాండము 6:4; అధఃస్సూచి) వాళ్లు దౌర్జన్యకారులూ, కలహశీలురూ, నిర్దయులూ అని రుజువౌతోంది.
7 స్పష్టంగా, శరీరసౌందర్యంగానీ, సౌష్టవంగానీ, పరిమాణంగానీ లేక బలంగానీ వాటంతటవే అంగీకృతమైన పురుషత్వాన్నీ, లేక స్త్రీత్వాన్నీ తీసుకురాలేవు. మానవ శరీరాలను దాల్చిన ఆ దేవదూతలు, బహుశా చక్కని వారై ఉండొచ్చు. నెఫీలులు కండలుతిరిగిన దృఢకాయులే అయినా, వాళ్ల మానసిక దృక్పథం కుటిలమైంది. అవిధేయులైన దేవదూతలూ, వాళ్ల సంతానమూ భూమిని లైంగిక దుర్నీతితోనూ దౌర్జన్యంతోనూ నింపేశారు. ఆ కారణాన్నిబట్టే, యెహోవా అప్పుడున్న ఆ లోకానికి అంతాన్ని తెచ్చాడు. (ఆదికాండము 6:5-7) అయితే, ఆ జలప్రళయం దయ్యాల ప్రభావాన్నిగానీ, ఆదాము పాప ఫలితాల్నిగానీ తుడిచివేయలేదు. స్త్రీత్వాన్నీ పురుషత్వాన్నీ అనుచితంగా వ్యక్తపర్చడం, జలప్రళయానంతరం మరలా ఆరంభమైంది. స్త్రీత్వాన్ని గూర్చిన పురుషత్వాన్ని గూర్చిన మంచి మాదిరిలనుండీ, చెడ్డ మాదిరులనుండీ మనం నేర్చుకొనగల్గేలా ఆ రెండు మాదిరులూ బైబిల్లో ఉన్నాయి.
8. యోసేపు సముచితమైన పురుషత్వం విషయంలో ఏ శ్రేష్ఠమైన మాదిరిని ఉంచాడు?
8 యోసేపును గూర్చీ పోతిఫరు భార్యను గూర్చీ తెలియజేసే వృత్తాంతం, సముచితమైన పురుషత్వానికీ ప్రాపంచిక స్త్రీత్వానికీ మధ్యగల విశిష్టమైన తేడాను తెలియజేస్తోంది. యోసేపు చక్కని రూపాన్ని చూసి మోహించిన పోతిఫరు భార్య, అతన్ని మరులుకొల్పడానికి ప్రయత్నించింది. ఆ కాలంలో, వ్యభిచారాన్నీ లేక జారత్వాన్నీ నిషేధించిన లిఖితపూర్వకమైన దైవికచట్టమేదీ లేదు. అయినప్పటికీ, యోసేపు దుర్నీతిపరురాలైన ఆ స్త్రీ దగ్గరనుండి పారిపోయి, దేవునికి అంగీకృతమైన పురుషత్వాన్ని చూపించే నిజమైన దైవజనునిగా తనను తాను నిరూపించుకున్నాడు.—ఆదికాండము 39:7-9, 12.
9, 10. (ఎ) రాణి వష్తి, తన స్త్రీత్వాన్ని ఎలా దుర్వినియోగపర్చింది? (బి) మనకోసం, స్త్రీత్వాన్ని గూర్చిన ఏ శ్రేష్ఠమైన మాదిరిని ఎస్తేరు ఉంచింది?
9 ఎస్తేరూ రాణి వష్తీలిరువురూ, స్త్రీల కొరకు విశేషంగా పోల్చిచూడదగిన మాదిరిని ఉంచారు. వష్తి, తాను బహు సౌందర్యవంతురాలిని గనుక రాజైన అహష్వేరోషు తన కోరికల్ని ఎల్లవేళలా అంగీకరిస్తాడని తలంచివుండవచ్చు. కానీ, ఆమె సౌందర్యం బాహ్యమైనదే. ఆమెలో అణుకువా, స్త్రీత్వమూ కొరవడ్డాయి. గనుక ఆమె తన భర్తకూ, రాజుకూ విధేయత చూపించలేదు. రాజు ఆమెను నిరాకరించి, నిజమైన స్త్రీత్వం గల ఓ స్త్రీని, నిజానికి యెహోవాకు భయపడే ఓ స్త్రీని తన రాణిగా ఎంపిక చేసుకున్నాడు.—ఎస్తేరు 1:10-12; 2:15-17.
10 ఎస్తేరు, క్రైస్తవ స్త్రీలకు ఓ అద్భుతమైన మాదిరిగా సహాయపడుతోంది. ఆమె “అందమైన రూపమును సుందర ముఖమును”గలదైనా, “సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల . . . హృదయపు అంతరంగ స్వభావము” అనే అలంకారాన్ని ప్రదర్శించింది. (ఎస్తేరు 2:7; 1 పేతురు 3:4) ఆడంబరమైన అలంకారమే ప్రధానమని ఆమె దృష్టించలేదు. ఎస్తేరు తన ప్రజల ప్రాణాలు అపాయంలో ఉన్నప్పుడు కూడా, తన భర్తయైన అహష్వేరోషుకు విధేయత చూపించడంద్వారా విచక్షణనూ, ఆశానిగ్రహాన్నీ చూపించింది. ఎస్తేరు, మౌనంగావుండడం తెలివైన పనియైనప్పుడు మౌనంగావుంది. కానీ అవసరమైనప్పుడు, తగిన సమయంలో నిర్భయంగా మాట్లాడింది. (ఎస్తేరు 2:10; 7:3-6) ఆమె, పరిణతిచెందిన తన సహోదరుడైన మొర్దెకై ఇచ్చిన ఉపదేశాన్ని అంగీకరించింది. (ఎస్తేరు 4:12-16) ఆమె తన ప్రజల ఎడల ప్రేమా యథార్థతల్ని చూపించింది.
బాహ్య రూపం
11. బాహ్యరూపానికి సంబంధించినంత వరకూ మనం దేన్ని మనస్సులో ఉంచుకోవాలి?
11 సముచితమైన స్త్రీత్వానికిగల కీలకం ఏమిటి? ఓ తల్లి ఇలా చెబుతోంది: “అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును.” (సామెతలు 31:30) కాబట్టి దేవుని ఎడల పూజ్యనీయమైన భయం అవసరం. స్త్రీత్వానికి, భౌతిక సౌందర్యంకన్నా దయాళుత్వమూ, ప్రసన్నతా, అణుకువా, దీనత్వమూ ఎంతో ఎక్కువగా దోహదపడతాయి.—సామెతలు 31:26.
12, 13. (ఎ) విచారకరంగా, అనేకుల సంభాషణ దేనికి ప్రతీకగావుంది? (బి) సామెతలు 11:22 భావం ఏమైవుంది?
12 స్త్రీ పురుషుల్లో అనేకమంది తమ నోటిని జ్ఞానయుక్తంగానూ తమ నాలుకను ప్రేమపూర్వకంగానూ ఉపయోగించకపోవడం, విచారకరమైన విషయం. వాళ్ల సంభాషణ దుర్భాషలతోనూ, ఎత్తిపొడిచే విధంగానూ, అసభ్యంగానూ, నిర్దయగానూ ఉంటుంది. అశ్లీలమైన మాటల్ని ఉపయోగించడం, పురుషత్వానికి ప్రతీకగా కొంతమంది పురుషులు తలస్తారు. కొంతమంది స్త్రీలు బుద్ధిహీనంగా వీళ్లను అనుకరిస్తారు. కానీ, ఓ స్త్రీ అందంగావున్నా వివేకంలేనిదిగానూ, వాదించేదిగానూ, ఎత్తిపొడిచేదిగానూ, లేక పొగరబోతుగానూ ఉంటే, ఆమె శ్రేష్ఠమైన అర్థంలో నిజమైన సౌందర్యరాశిగానూ, నిజమైన స్త్రీత్వంగలదిగానూ ఉండగలదా? “వివేకములేని సుందరస్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మివంటిది.”—సామెతలు 11:22.
13 అపవిత్రమైన మాటలతోనూ ఎత్తిపొడుపులతోనూ లేక నిర్హేతుకత్వంతోనూ కలబోసివున్న సౌందర్యం, స్త్రీత్వ సౌందర్యంతో పొందికలేనిదిగా ఉంటుంది. వాస్తవానికి, అలాంటి భక్తిహీన ప్రవర్తన, ఆకర్షణీయంగావున్న వ్యక్తిని కూడా అందవికారంగా కనిపించేలా చేయగలదు. పురుషుని భౌతికరూపమైనా లేక స్త్రీ భౌతికరూపమైనా, దానంతటదే ఆగ్రహావేశాల్నీ అరుపుల్నీ లేక దూషణ మాటల్నీ భర్తీచేయలేదనీ లేక వాటిని సమర్థించలేదనీ మనం సులభంగా గ్రహించవచ్చు. క్రైస్తవులందరూ, తమ బైబిలు ఆధారిత సంభాషణా ప్రవర్తనల ద్వారా దేవుని దృష్టికీ, తోటి మానవుల దృష్టికీ తమను తాము ఆకర్షణీయమైనవారిగా చేసుకోగలరు, చేసుకోవాలి కూడా.—ఎఫెసీయులు 4:31.
14. 1 పేతురు 3:3-6 వచనాల్లో ఏ రకమైన అలంకరణ కొనియాడబడింది, మరి దాని విషయంలో మీరెలా భావిస్తారు?
14 యోగ్యమైన స్త్రీత్వమూ, పురుషత్వమూ ఆత్మీయ లక్షణాలపై ఆధారపడివుండగా, మనం ధరించే వస్త్రాలూ, వాటిని ధరించే తీరులతోపాటూ బాహ్యప్రవర్తనా, కన్పించేతీరూ మనల్ని గురించి తెలియజేస్తాయి. అపొస్తలుడైన పేతురు క్రైస్తవ స్త్రీలకు ఈ క్రింది సలహాను ఇచ్చినప్పుడు, మొదటి శతాబ్దానికి చెందిన కొన్ని వస్త్రధారణా శిరోజాలంకరణా పద్ధతులు, ఆయన మనస్సులో నిస్సందేహంగా ఉన్నాయి: “జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి.”—1 పేతురు 3:3-6.
15. తమ వస్త్రధారణయందు క్రైస్తవ స్త్రీలు దేన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించాలి?
15 మొదటి తిమోతి 2:9, 10 వచనాల్లో, స్త్రీల వస్త్రధారణను గురించి పౌలు ఇలా వ్యాఖ్యానించాడు: “స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేత . . . దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.” స్వస్థబుద్ధిని ప్రతిబింబించే మర్యాదపూర్వకమైన, చక్కని వస్త్రధారణ అవసరతను ఆయన అక్కడ నొక్కిచెప్పాడు.
16, 17. (ఎ) నేడు అనేకమంది స్త్రీ పురుషులు వస్త్రధారణను ఎలా దుర్వినియోగపరుస్తున్నారు? (బి) ద్వితీయోపదేశకాండము 22:5 వచనంలో ఉన్న సలహానుండి మనమే నిర్ధారణకు రావాలి?
16 పురుషుడైనా లేక స్త్రీయైనా, బాలుడైనా లేక బాలికైనా లైంగికంగా రెచ్చగొట్టేరీతిలో ప్రవర్తించడంగానీ లేక వస్త్రాల్ని ధరించడంగానీ నిజమైన పురుషత్వాన్నీ లేక నిజమైన స్త్రీత్వాన్నీ పెంపొందింపజేయదు. అది నిశ్చయంగా దేవున్ని ఘనపర్చదు. లోకంలోని అనేకమంది ప్రజలు, వస్త్రధారణలోనూ ప్రవర్తనలోనూ పురుషత్వపు లైంగికత్వాన్నో లేక స్త్రీత్వపు లైంగికత్వాన్నో ప్రదర్శించడంలో విపరీతపు పోకడలకు పోతున్నారు. ఇతరులు దుర్నీతికర గమ్యాల్నిబట్టి స్త్రీపురుషుల మధ్య తేడాలు సమసిపోయేలా చేస్తున్నారు. దేవుని ఆలోచనను బైబిలు బయల్పరుస్తున్నందున, క్రైస్తవులమైన మనం ఎంత కృతజ్ఞులమై ఉండగలమో కదా! ప్రాచీన ఇశ్రాయేలునకు యెహోవా ఇలా ప్రకటించాడు: “స్త్రీ పురుష వేషము వేసికొనకూడదు; పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు; ఆలాగు చేయువారందరు నీ దేవుడైన యెహోవాకు హేయులు.”—ద్వితీయోపదేశకాండము 22:5.
17 ఈ విషయంలో, ఆగస్టు 15, 1989, 17వ పేజీలో కావలికోట (ఆంగ్లం) తెలియజేసిన దాన్ని పునఃపరిశీలించేందుకు మీరు బహుశా ఆనందిస్తారు: “ఫలానా వస్త్రధారణ విపరీతమైన ఫ్యాషన్ కల్గిందా లేదా అనేది ప్రశ్నకాదుగానీ, దేవుని పరిచారకున్నని చెప్పుకొనే వ్యక్తికి తగినదా కాదా అనేదే ప్రశ్నయైవుంది. (రోమీయులు 12:2; 2 కొరింథీయులు 6:3) మరీ క్యాజువల్గానో లేక బిగుతుగానో ఉన్న దుస్తులు, మనం అందించే రాజ్య సందేశాన్నుండి ప్రక్కకు మళ్లించవచ్చు. అసభ్యకరంగా ఉండే స్టైళ్లూ, కావాలని స్త్రీలను పురుషులుగా పురుషులను స్త్రీలగా చేసే స్టైళ్లూ కచ్చితంగా తగినవికావు. (ద్వితీయోపదేశకాండము 22:5తో పోల్చండి.) వాతావరణ పరిస్థితుల్నిబట్టీ, చేసే పనులనుబట్టీ మరి అలాంటి ఇతర పరిస్థితుల్నిబట్టీ స్థానికాచారాలు వేర్వేరుగా ఉండవచ్చనుకోండి. ఈ కారణాల్నిబట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదరులందరికీ అన్వయించేలా కచ్చితమైన నియమాలను క్రైస్తవసంఘం చేయదు.”
18. వస్త్రధారణ, కేశాలంకరణల విషయంలో బైబిలు సలహాను అన్వయించుకోవడంలో మనమే చర్యల్ని తీసుకోవాలి?
18 ఎంతటి సమతూకమైన, సముచితమైన సలహాయో కదా! విచారకరంగా, కొంతమంది క్రైస్తవ స్త్రీ పురుషులు, వస్త్రధారణ కేశాలంకరణల విషయంలో లోకం ప్రవేశపెడుతున్న ప్రతీదానిని—అది యెహోవాపైనా క్రైస్తవ సంఘంపైనా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందోననే విషయాన్ని పరిగణలోనికి తీసుకోకుండా—గ్రుడ్డిగా అనుసరిస్తున్నారు. లోక ఆలోచనా విధానంచే మనం ప్రభావితమయ్యామా లేదాయని తెలుసుకునేందుకు మనలో ప్రతిఒక్కరమూ, కొంత స్వయం పరిశీలన చేసుకోవాలి. లేదా గౌరవనీయులునూ అనుభవజ్ఞులునూ అయిన ఓ సహోదరున్నో లేక సహోదరినో సమీపించి, మన వస్త్రధారణ విషయంలో మనం చేసుకోవాల్సిన మార్పులేమైనా ఉన్నాయా అని అడగండి. తర్వాత, ఇవ్వబడిన సలహాలను గంభీరంగా పరిశీలించాలి.
క్రైస్తవ స్త్రీ పురుషులు—నిజమైన స్త్రీ పురుషులు
19. కోరదగని ఏ ప్రభావానికి వ్యతిరేకంగా మనం పోరాటాన్ని సల్పాలి?
19 ఈ లోకం యొక్క దేవుడు సాతాను. అతని ప్రభావం, స్త్రీ పురుష తేడాలకు సంబంధించిన గందరగోళంలో కనబడుతోంది. అది వస్త్రధారణ విషయంలోనేగాక ఇతర విషయాల్లోనూ స్పష్టమౌతుంది. (2 కొరింథీయులు 4:4) కొన్ని దేశాల్లో, అనేకమంది స్త్రీలు బైబిలు సూత్రాలను నిర్లక్ష్యం చేస్తూ, శిరస్సత్వం కోసం పురుషులతో పోటీపడుతున్నారు. మరోవైపున, ఆదాము శిరస్సత్వ బాధ్యతలను విడనాడినట్లుగానే, పురుషుల్లో అనేకమంది ఊరకనే విడనాడుతున్నారు. జీవితంలో లైంగికపరంగా తాము నిర్వహించాల్సిన పాత్రను మార్చుకునేందుకు ప్రయత్నించే వాళ్లు కూడా ఉన్నారు. (రోమీయులు 1:26, 27) దేవుడు అంగీకరించిన ఏ విధమైన ప్రత్యామ్నాయ జీవన విధానాల్ని గురించీ బైబిలు చెప్పడం లేదు. క్రైస్తవులుకాక మునుపు, తమ విభిన్నమైన పాత్రలను గుర్తించడంలోగానీ లేక లైంగిక ఎంపికల విషయంలోగానీ తికమకపడిన వాళ్లెవరైనా, దేవుని ప్రమాణానికి అనుగుణంగా జీవించడం తమ నిత్య శ్రేయస్సు కొరకేనని విశ్వసించవచ్చు. ఆ ప్రమాణం, మానవ పరిపూర్ణతకు చేరుకునే వారందరికీ నిశ్చయంగా విలువైనదౌతుంది.
20. స్త్రీత్వాన్ని గూర్చిన పురుషత్వాన్ని గూర్చిన మన దృక్పథంపై గలతీయులు 5:22, 23 వచనాలు ఏ ప్రభావాన్ని చూపించాలి?
20 క్రైస్తవ స్త్రీ పురుషులు, దేవుని ఆత్మ ఫలాలైన ప్రేమనూ సంతోషాన్నీ, సమాధానాన్నీ, దీర్ఘశాంతాన్నీ, దయాళుతాన్నీ, మంచితనాన్నీ, విశ్వాసాన్నీ, సాత్వికాన్నీ, ఆశానిగ్రహాన్నీ పెంపొందింపజేసుకొని, వాటిని వ్యక్తపర్చాల్సిన అవసరతను లేఖనాలు చూపుతున్నాయి. (గలతీయులు 5:22, 23) దేవుడు తన గొప్ప జ్ఞానముతో, ఆత్మ ఫలాలను పెంపొందింప చేసుకోవడం ద్వారా పురుషులు తమ పురుషత్వాన్నీ స్త్రీలు తమ స్త్రీత్వాన్నీ వృద్ధి చేసుకునే సామర్థ్యాన్ని వారికిచ్చాడు. ఆత్మ ఫలాల్ని ప్రదర్శించే ఓ పురుషున్ని గౌరవించడం సులభం, మరి వాటిని ప్రదర్శించే ఓ స్త్రీని ప్రేమించడమూ సులభమే.
21, 22. (ఎ) జీవన విధానాలకు సంబంధించినంత వరకూ యేసు ఏ మాదిరిని ఉంచాడు? (బి) యేసు తన పురుషత్వాన్ని ఎలా వ్యక్తపర్చాడు?
21 జీవించిన వారిలోకెల్లా మహా గొప్పమనిషి యేసుక్రీస్తు. క్రైస్తవులు అనుకరించాల్సింది ఆయన జీవన విధానాన్నే. (1 పేతురు 2:21-23) యేసు వలె, పురుషులూ స్త్రీలూ దేవుని ఎడల యథార్థతను రుజువుచేసుకొని, ఆయన వాక్యానికి విధేయులై ఉండాలి. ప్రేమా, దయా, కనికరమూ అనే అద్భుత లక్షణాల్ని యేసు ప్రదర్శించాడు. నిజ క్రైస్తవులుగా, మనం ఆయన శిష్యులమని నిరూపించుకునేందుకు, ఆయన్ని అనుకరించాలని అపేక్షించబడుతున్నాం.—యోహాను 13:35.
22 యేసుక్రీస్తు నిజమైన పురుషుడు. లేఖనాల్లో పొందుపర్చబడిన ఆయన జీవిత చరిత్రను మనం అధ్యయనం చేస్తుండగా, ఆయన పురుషత్వ లక్షణాల్ని మనం చూడగలం. వివాహం చేసుకోకపోయినా, ఆయన స్త్రీలతో సమతూక సహవాసాన్ని కల్గివున్నాడని బైబిలు చూపిస్తోంది. (లూకా 10:38, 39) స్త్రీ పురుషులతో ఆయనకున్న సంబంధాలు, ఎల్లప్పుడూ పవిత్రంగానూ, గౌరవప్రదంగానూ ఉండేవి. పురుషత్వానికి పరిపూర్ణ మాదిరి ఆయనే. ఆయన తననుండి తన దైవిక పురుషత్వాన్నీ, యెహోవా ఎడలగల తన నమ్మకాన్ని దోచుకునేందుకు—స్త్రీ పురుషుల్లోగానీ, అవిధేయులైన దేవదూతల్లోగానీ—ఎవ్వరినీ ఆయన అనుమతించలేదు. ఆయన తన బాధ్యతలను అంగీకరించేందుకు వెనుకాడలేదు. ఫిర్యాదు చేయకుండా ఆ బాధ్యతల్ని నెరవేర్చాడు.—మత్తయి 26:39.
23. స్త్రీ పురుషుల పాత్రలకు సంబంధించినంత వరకూ నిజ క్రైస్తవులు ఎలా భిన్నంగా ఆశీర్వదించబడ్డారు?
23 యెహోవా ప్రజల మధ్య ఉండడమూ, యెహోవా దేవున్ని ప్రేమించి, ఆయనకు విధేయత చూపడమే జీవితధ్యేయంగాగల స్త్రీ పురుషులతోనూ, బాలబాలికలతోను సహవసించడమూ ఎంత సంతోషించదగిన విషయమో కదా! దేవుని వాక్యానికి విధేయత చూపడం మూలంగా మనం నిర్బంధించబడం. బదులుగా, స్త్రీ పురుషుల అందాన్నీ, సంకల్పాన్నీ, భిన్నమైన వారి పాత్రల్నీ హీనపర్చే ఈ లోకం నుండీ, దాని మార్గాల నుండీ మనం స్వతంత్రులమౌతాము. మనం స్త్రీలమైనా, పురుషులమైనా జీవితంలో దేవుడిచ్చిన మన స్థానాన్ని నెరవేర్చడం మూలంగా వచ్చే నిజమైన సంతోషాన్ని మనం అనుభవించగలం. అవును, సృష్టికర్తయైన యెహోవా దేవుడు మనందరి కొరకూ చేసిన ప్రేమపూర్వక ఏర్పాట్లన్నిటినిబట్టీ, మనల్ని స్త్రీ పురుషులుగా సృష్టించడాన్నిబట్టీ ఆయనకు మనమెంత కృతజ్ఞులమో కదా!
మీరెలా జవాబిస్తారు?
◻ స్త్రీ పురుషులకు ఏ సముచితమైన పాత్రల్ని బైబిలు వర్ణిస్తోంది?
◻ జలప్రళయానికి ముందు పురుషత్వం ఎలా వికృతరూపాన్ని దాల్చింది, మరి మనకాలంలో స్త్రీత్వాన్ని గూర్చిన, పురుషత్వాన్ని గూర్చిన తలంపులు ఎలా వక్రీకరించబడ్డాయి?
◻ కన్పించేతీరు విషయంలోనూ ఏ బైబిలు సలహాను మీరు అన్వయించుకొన ప్రయత్నిస్తారు?
◻ క్రైస్తవ స్త్రీ పురుషులు తమను తాము నిజమైన స్త్రీ పురుషులుగా ఎలా రుజువుచేసుకోగలరు?
[17వ పేజీలోని చిత్రం]
ఎస్తేరు సౌందర్యరాశియేయైనా, విశేషంగా తన అణుకువనుబట్టీ తన శాంత స్వభావాన్నిబట్టీ ప్రశాంతతనుబట్టీ జ్ఞాపకం చేసుకోబడుతుంది
[18వ పేజీలోని చిత్రం]
అంతరంగ సౌందర్యానికి మరింత ప్రాముఖ్యతను ఇస్తూ, ముస్తాబు కావడానికి తగిన శ్రద్ధను ఇవ్వండి