మా స్థానిక మిషనరీ ప్రాంతాన్ని సందర్శించడం
నేను సందర్శించే క్రైస్తవ సంఘాల గుంపు నన్ను పోర్చుగల్ నుండి చైనా వరకు తీసుకెళ్తుంది—లేక అలాగనిపిస్తుంది. అయినప్పటికీ, నేనూ నా భార్య ఆలివ్ ఎప్పుడూ బ్రిటన్ వదిలి వెళ్లము.
మేము యెహోవాసాక్షుల విదేశీ భాషా సంఘాలను సందర్శిస్తాము. మరి దేశమంతటా అనేక ప్రాంతాల్లో అలాంటి గుంపులే క్రొత్తవి ఏర్పడుతున్నాయి. ఫ్రాన్స్ యొక్క నార్‌మండీ తీరానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరానున్న జెర్సీ ద్వీపంలోని ఒక పోర్చుగీస్ గుంపు నుండి మేము దర్శించే చైనా భాష మాట్లాడే ఆసక్తిగల ప్రజలున్న ఇంగ్లాండ్‌కి ఉత్తరానున్న సండర్‌లాండ్ పట్టణం వరకూ మేము వర్ధిల్లుతున్న ఆత్మీయంగా పురోభివృద్ధి చెందుతున్న బహుభాషా క్షేత్రాన్ని సందర్శిస్తాము. ఈ అసాధారణమైన నియామకాన్ని మేము ఎలా పొందాము? మరి మా స్థానిక మిషనరీ ప్రాంతంలో ఏమి జరుగుతోంది? నన్ను వివరించనివ్వండి.
అలీవ్, నేనూ ప్రతి వారం వేర్వేరు సంఘాలను దర్శిస్తూ ప్రయాణ పనిలో దాదాపు 20 ఏళ్లు గడిపాము. మా ప్రయాణాల్లో మేము ఉత్తరం నుండి దక్షిణానికి, తూర్పు నుండి పశ్చిమానికీ అలా బ్రిటన్‌లో అన్ని ప్రాంతాలనూ దర్శించాము, మరి ఇటీవలనే మేము మధ్యధరా ద్వీపమైన మాల్టానందలి మా క్రైస్తవ సహోదరుల వద్దకు కూడా వెళ్లాము, మేమక్కడ అత్యంత విశేషమైన క్రైస్తవ ఆతిథ్యాన్ని పొందాము. (అపొస్తలుల కార్యములు 28:1, 2 పోల్చండి.) మాల్టాలో మూడు సంవత్సరాలు గడిపిన తర్వాత, మా తదుపరి నియామకం ఎక్కడ ఉంటుందోనని మేమనుకున్నాము. బహుశా మేము ఇంగ్లాండ్‌లోని పల్లె ప్రాంతాలను దర్శించవలసి రావచ్చని ఊహించి, మేము మా మనస్సులను ఆ పని కొరకు సిద్ధం చేసుకోనారంభించాము. అయితే 23 వేర్వేరు భాషలను మాట్లాడే గుంపులూ సంఘాలతో ఏర్పడిన క్రొత్త సర్క్యూట్‌లో సేవ చేయడమనే నియామకాన్ని మేము అందుకున్నప్పుడు, అది మాకెంతో ఆశ్చర్యానందాలను కలిగించింది!
మేము ఆ పనిని చేయగలమా అని ఆలోచించాము. మాల్టాలోని మా అనుభవం మినహా, భిన్నమైన పూర్వచరిత్రగల వారితో మరియు భిన్నమైన సంస్కృతికి చెందిన ప్రజలతో మేము ఎక్కువగా సహవసించలేదు. ఆంగ్లం అంత ఎక్కువగా రాని వారిని మేము నిజంగా ప్రోత్సహించగలుగుతామా? ఇతర భాషలు రాకుంటే మేమెలా సంభాషించగలము? ఇతరుల ఆహారము మరియు విభిన్న ఆచారాల సంగతేమిటి? మేము దానికి సర్దుకుపోగలమా? మాసిదోనియా పిలుపు వంటి ఈ పిలుపుకు సమాధానమివ్వడాన్ని గురించి మేము ప్రార్థనాపూర్వకంగా పరిగణిస్తుండగా అలాంటి ప్రశ్నలు మా మనస్సుల్లో మెదిలాయి.—అపొస్తలుల కార్యములు 16:9, 10; 1 కొరింథీయులు 9:19-22.
భాషా అడ్డంకును అధిగమించడం
“నాకు ఎక్కువ భాషలు రావు గనుక మొదట్లో నేను అయోగ్యురాలినని భావించాను. నేను సహోదరీలకు ఎలా సహాయం చేయగలనో నాకు పాలుపోలేదు. మాతో మొదట పఠించిన జంట ఏ నియామకాన్నీ నిరాకరించవద్దని మాకు చెప్పిన విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. మనం చేయలేని దాన్ని చేయమని యెహోవా మనలను ఎన్నడూ అడగడని వారు మాకు బోధించారు” అని ఆలివ్ వివరిస్తుంది. కాబట్టి మేమిద్దరమూ ఇష్టపూర్వకంగా ఆ నియామకాన్ని అంగీకరించాము.
పునరాలోచన చేసి చూస్తే, వేరే భాష రాకపోవడం మేము అందరితో ఒకేలా వ్యవహరించేందుకు మాకు సహాయం చేసిందని మేము చూడగలుగుతున్నాము. ఉదాహరణకు, ప్రతివారం ఒక్కో భాషా కూటానికి హాజరవ్వడం, ఆంగ్లం ఎక్కువగా అర్థం చేసుకోలేని సహోదరులు ఆంగ్ల భాషా కూటాలకు హాజరవ్వవలసి వచ్చినప్పుడు ఎలా భావించి ఉంటారనే విషయాన్ని గుణగ్రహించేందుకు మాకు సహాయం చేసింది. అక్కడ అందించబడుతున్న విషయాల భావాన్ని గ్రహించగలిగేలా మేము కూటాలకు చాలా బాగా సిద్ధపడవలసి వచ్చేది. కూటాల్లో ఆలివ్ ఎప్పుడూ కనీసం ఒక ప్రశ్నకైనా సమాధానం చెబుతుంది. ఆమె సమాధానాన్ని ఆంగ్లంలో సిద్ధం చేసుకుని, దాన్ని తన కొరకు అనువదించమని ఎవరైన ఒక సహోదరిని అడుగుతుంది, ఆ తర్వాత ఆమె దాన్ని ఉచ్చరణ ఆధారంగా వ్రాసుకుంటుంది. అయితే తాను కొంత సంకోచిస్తూనే, వ్యాఖ్యానించేందుకు తన చేతిని పైకెత్తుతానని ఆమె చెబుతుంది. కొన్నిసార్లు ఆమె ప్రయత్నాలు నవ్వు తెప్పిస్తాయి. అయితే అది ఆమెను నిరుత్సాహపర్చదు. “నేనలా ప్రయత్నించడాన్ని సహోదరులు మెచ్చుకుంటారని నాకు తెలుసు. వాస్తవానికి, నేను సమాధానాలు చెప్పడం ఆ భాష ఎక్కువ తెలిసిన వాళ్లు కూటాల్లో మరింత ఎక్కువగా భాగం వహించేందుకు వారిని ప్రోత్సహిస్తుంది” అని ఆమె అంటోంది.
నేను ప్రసంగాలు ఇచ్చే విధానంలో కూడా మార్పు వచ్చింది, ఎందుకంటే నేను ప్రతి వాక్యం తర్వాత దాన్ని అనువదించడాన్కి అనువాదకునికి సమయాన్ని కేటాయించాలి. నేను నా ఆలోచనల పరంపరను సులభంగా పోగొట్టుకునే అవకాశం ఉంది. నేను మరింత ఎక్కువగా ఏకాగ్రత నిలపవలసి ఉందనీ నేను అందించే సమాచారాన్ని తగ్గించవలసి ఉంటుందనీ నేను గుర్తించాను. అయితే అది నాకు బాగా నచ్చింది.
మా వైవిధ్యమైన పరిచర్య
బ్రిటన్‌నందలి అనేక నగరప్రాంతాల్లో, విదేశీ భాషలు మాట్లాడే ప్రజలు ఒక్కో వీధికి ఒకరో లేక ఇద్దరో ఉంటారు, మరి మిగతా వారిని కలుసుకునేందుకు మరి కొంతదూరం ప్రయాణించవలసి ఉంటుంది. అయినప్పటికీ, మనం వారి స్వంత భాషలో వారిని పలకరించినప్పుడు, వారి ప్రతిస్పందనను చూసినప్పుడు మనం అదంతా చేయడం యోగ్యమైనదేనని భావిస్తాము. నా వెంటనున్న సహోదరుడు గృహస్థునికి రాజ్య వర్తమానాన్ని అతడి స్వంత భాషలో అందించినప్పుడు తరచూ వచ్చే ప్రతిస్పందన అత్యంతానందమే.
వాస్తవానికి విదేశీ భాషా ప్రాంతంలో పరిచర్య చేయడం, మేము మా 40 సంవత్సరాల రాజ్యసేవలో అనుభవించిన వాటిలోని ఎంతో ఉత్తేజకరమైన విషయం. అభివృద్ధి జరిగే సాధ్యత ఎంతో ఎక్కువగా ఉంది. ప్రజలకు తమ స్వంత భాషలో బోధించినప్పుడు వారు సత్యాన్ని ఎంతో త్వరగా మరియు మరింత గుణగ్రహణతో నేర్చుకుంటారనడానికి సందేహమే లేదు. (అపొస్తలుల కార్యములు 2:8, 14, 41) సహోదర సహోదరీలు కూటాల చివరిలో ఆనందబాష్పాలు రాల్చడాన్ని చూడటం మా భావోద్రేకాలను ప్రభావితం చేస్తుంది, ఎందుకంటే కొన్ని సందర్భాలలో వారు కార్యక్రమాన్ని అంతటినీ తమ స్వంత భాషలో విని అర్థం చేసుకోగలగటం అదే మొదటిసారి అయివుంటుంది.
ఇంటింటికీ ప్రకటిస్తున్నప్పుడు, మేము కనీసం పరిచయం చేసుకునేటప్పుడైనా గృహస్థుని భాషలో పరిచయం చేసుకోవాలని ప్రయత్నించే వాళ్లము, అయితే అది కొన్నిసార్లు మాకు సమస్యలను కలిగించినప్పటికీ మేమలా చేసేందుకు ప్రయత్నించేవాళ్లము. ఉదాహరణకు, ఒక గుజరాతీ గృహస్థున్ని పలకరించేందుకు సాధారణంగా కెమ్‌చో అని అంటే “ఎలాగున్నారూ” అని పలకరించాలి. అయితే ఒకసారి నేను తప్పుగా ఉచ్చరించినప్పుడు నేను ఒక పేరుపొందిన కాఫీ బ్రాండు వాణిజ్య ప్రకటన ఇస్తున్నట్లు అనిపించింది. అయినప్పటికీ, ఒక ఇంట్లోని భార్యాభర్తలను నేను గుజరాతీలో పలకరించినప్పుడు వాళ్లు నన్ను చూసి చిరునవ్వు నవ్వారు. వారు వెంటనే మమ్మల్ని ఇంట్లోకి ఆహ్వానించి, మాకు మర్యాదపూర్వకంగా కాఫీ అందించారు, అయితే నేను తప్పుగా ఉచ్చరించినందుకు కాదండోయ్. మేము దర్శిస్తున్న గుంపులోని యెహోవాసాక్షులకు వారు బంధువులని మాకు తెలియజేశారు, మరి వారు సత్యం ఎడల యథార్థమైన ఆసక్తిని చూపించారు.
ఆంగ్లం మాట్లాడే ఒక సహోదరి చైనీయుల భాష మాట్లాడే ఒక స్త్రీకి కొన్ని సంవత్సరాల పాటూ తరచూ పత్రికలను అందించేది. ఆ సహోదరి ఆమెకు అప్పుడప్పుడూ ఉచిత గృహ బైబిలు పఠనాన్ని గురించి చెప్పేది, అయితే ఆమె దాన్ని నిరాకరించేది. ఒక రోజు చైనీయుల భాష నేర్చుకుంటున్న ఒక సహోదరి ఆమె వెంట వెళ్లి, ఆ భాషలో వున్న మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని అందించింది, ఆసక్తిగల ఆ గృహస్థురాలు దాన్ని వెంటనే అంగీకరించింది.a ఇప్పుడు తన స్వంత భాషలో పుస్తకాన్ని కలిగివున్న ఆమె బైబిలు పఠనానికి అంగీకరించింది. ఆ స్త్రీ యొక్క స్వంత భాషలో మాట్లాడిన కొన్ని మాటలే అంత వ్యత్యాసాన్ని కలిగించాయి.
విభిన్న సంస్కృతులు
కొన్ని సంస్కృతుల్లో తమ ఇళ్లల్లోని స్త్రీలు రాత్రుల్లో ఒంటరిగా బయటకు వెళ్లడాన్ని పురుషులు ఇష్టపడరనే విషయాన్ని మేము గుర్తించలేదు. సాయంత్రాల్లో జరిగే కూటాలకు అనేకమంది సహోదరీలు హాజరవ్వడం కష్టం. వివాహం చేసుకోకుండా ఇంట్లోనే ఉండాలని తీర్మానించుకునే యౌవన స్త్రీలు కుటుంబ ప్రతిష్ఠకు అవమానమని కొన్ని ఆసియా సమాజాలు విశ్వసిస్తాయి. ఒక యౌవన సహోదరి కొరకు ఆమె కుటుంబీకులు చూసిన పెళ్లిసంబంధాన్ని చేసుకునేందుకు ఆమె నిరాకరించినందున ఆమె తండ్రి విషం మింగి చనిపోవాలని అనుకున్నాడు. అవును, అలాంటి సహోదరీలు ఏయే విషయాలను సహించవలసి ఉంటుందో అది ఎంతో గమనార్హంగా ఉంటుంది! అయినప్పటికీ, ఆ కుటుంబీకుల జీవితంపై సత్యం చూపించే ప్రభావాన్ని చూడటమూ యెహోవా ఎడల ఆ సహోదరీలు చూపించే యథార్థత వారి తలిదండ్రులపై చూపే ప్రభావాన్ని చూడటమూ, నిజంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది.
ఈ నియామకాన్ని అంగీకరించడంలో, మేము కొన్ని మార్పులను చేసుకోవలసి వచ్చింది. మేము ఈ ప్రయాణ నియామకాన్ని ప్రారంభించక ముందు నేను పూర్తిగా ఆంగ్లేయుల పద్ధతిలో వండిన ఆహారాన్నే తినే వాడిని, అయితే ఇప్పుడు ఆహారంలో ఎంత మసాలా ఉంటే అది అంత రుచిగా ఉంటుంది. పచ్చి చేపల నుండి మసాలా కూరల వంటి విభిన్న రుచులను మేము ఇంతకాలం పోగొట్టుకున్నామని అనిపిస్తుంది.
చక్కని అవకాశాలు
అనేక స్థలాల్లో విదేశీ భాషా ప్రాంతం పెరిగేందుకు సమయం ఆసన్నమయ్యిందనే విషయం స్పష్టమౌతుంది. వేర్వేరు భాషల్లో అనేకానేక ప్రచురణలు ఇప్పుడు లభ్యమౌతున్నాయి. క్రొత్త సంఘాలు ఏర్పాటు చేయబడుతుండగా మనం యెహోవా ఆశీర్వాదాలను గ్రహించగలము. ఇతర భాషలు తెలిసిన సహోదరులు సహాయం చేసేందుకు ఎంతో దూరంనుండి వస్తున్నారు.
అత్యంత గణనీయమైన ఉదాహరణ, ఫ్రెంచి భాషలో రాజ్యసువార్తను ప్రకటించడానికి లభించిన ప్రతిస్పందన. ఇటీవలి సంవత్సరాల్లో అనేకమంది ఫ్రెంచి మాట్లాడే శరణార్థులు జైరీ మరియు ఇతర ఆఫ్రికా దేశాలనుండి బ్రిటన్‌కు వచ్చారు. లండన్‌లో మొదటి ఫ్రెంచి భాషా సంఘం ఏర్పడినప్పుడు దాదాపు 65 మంది రాజ్యప్రచారకులు దానితో సహవసించేవారు. ఒక సంవత్సరం తర్వాత ఆ సంఖ్య 117కు పెరిగింది, మరి వారిలో 48 మంది క్రమ పయినీర్లుగా పూర్తికాల సేవ చేశారు. పెరుగుతున్న ఆసక్తి ఎడల శ్రద్ధవహించేందుకు కొంత కాలానికే రెండవ సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఆసక్తిగల వారి ఎడల మరింత శ్రద్ధను కనపర్చవచ్చు, వారిలో 345 మంది 1995 జ్ఞాపకార్థ దిన ఆచరణకు హాజరయ్యారు. బెనిన్, కోటే డీ ఐవోరీ, మొరాకో మరియు జైరీల్లో సేవ చేసిన పూర్వపు గిలియడ్ పట్టభద్రులు పెరుగుతున్న ఈ ప్రాంతం ఎడల శ్రద్ధ వహించేందుకు ఇప్పుడు తమ అనుభవాన్ని ఉపయోగిస్తున్నారు, మరి దానికి లభిస్తున్న ప్రతిస్పందన అమోఘంగా ఉంది.
ఫ్రెంచి సంఘాన్ని ఒకసారి సందర్శించినప్పుడు, ఆఫ్రికాకు చెందిన ఒక యౌవనస్థురాలితో నిర్వహించబడుతున్న పఠనానికి నేనూ వెళ్లాను. మేము వచ్చేయవలసిన సమయం వచ్చినప్పుడు, ఆ యౌవన స్త్రీ ఇలా వేడుకుంది: “దయచేసి వెళ్లిపోకండి. ఇంకొంత సేపు ఉండండి.” ఆమె ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని కోరుకుంది. ఆమె నాకు మొదటి శతాబ్దంనాటి లూదియను జ్ఞప్తికి తెచ్చింది.—అపొస్తలుల కార్యములు 16:14, 15.
చిన్న విదేశీ భాషా గుంపులను సంఘాలుగా ఏర్పరచడమే మా ప్రారంభ పని. సహోదరులు వారపు సంఘ పుస్తక పఠనాన్ని జరుపుకుంటున్న స్థలాల్లో, నెలకు ఒకసారి చొప్పున జరుపుకునేలా మేము క్లుప్త దైవపరిపాలనా పరిచర్య పాఠశాలను పరిచయం చేశాము. ప్రాంతీయ పరిచర్యలో వారు తమనుతాము చక్కగా వ్యక్తం చేసుకునేందుకు ఇది వారికి సహాయం చేస్తుంది. వారపు ఐదు సంఘ కూటాలను మెల్లి మెల్లిగా జరుపుకునేందుకు వారు ప్రయత్నిస్తారు. చైనీయుల భాష (కంటోనీస్), ఫ్రెంచి, గుజరాతీ, జపనీస్, భాష, పోర్చుగీస్, పంజాబీ, తమిళం మరియు వేల్స్ భాషల్లో ఇప్పటికే మాకు క్రొత్త సంఘాలు ఉన్నాయి.
బధిరులైన సహోదరుల కూటాలకు హాజరయ్యే ఆధిక్యతను కూడా మేము పొందాము. సహోదరులు తమ చేతులతో పాడటాన్ని చూడటం ఎంతో కదిలించేదిగా ఉంటుంది. వారు తమ పరిచర్యలో సైగల ద్వారా మాట్లాడతారనే విషయాన్ని గుర్తించిన నేను, రాజ్య ప్రకటనాపనిలో వారు చేసే చక్కని ప్రయత్నాలను మెచ్చుకుంటున్నాను. బధిరులూ అంధులూ అయిన వారి కొరకు కూడా సూచనలను ఇచ్చేందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తి చొప్పున ఉన్నారు. అందరి ఎడలా తప్పకుండా శ్రద్ధవహించేలా యెహోవా చేస్తున్నాడని అనిపిస్తుంది.
మేము ఒక ప్రత్యేకమైన విన్నపాన్ని చేయవలసి ఉంటే, “తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని” యేసు చేసిన విన్నపం వంటిదే అయ్యుంటుంది. (మత్తయి 9:38) తమ సంఘ ప్రాంతంలోని అల్ప సంఖ్యాక భాషకు చెందిన వారి భాషను నేర్చుకోవాలనే సవాలును మన సహోదరుల్లో అనేకులు అంగీకరిస్తున్నారు. వేర్వేరు భాషలను మాట్లాడే బహుమానం మాకు అద్భుతరీతిలో లభించకపోయినప్పటికీ, స్థానిక మిషనరీ ప్రాంతంలోని పరిచర్యను యెహోవా నిశ్చయంగా ప్రారంభిస్తున్నాడు, ఆ ప్రాంతం ఇప్పుడు కోతకు సిద్ధంగా ఉంది. (యోహాను 4:35, 36)—కాలిన్ సేమోర్ చెప్పినది.
[అధస్సూచీలు]
a వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించినది.