బైబిలు కాలాల్లో యెరూషలేము పురావస్తుశాస్త్రం ఏమి బయల్పరుస్తుంది?
ప్రాముఖ్యంగా 1967 నుండి యెరూషలేములో ఆసక్తికరమైన ముఖ్య పురావస్తు శాస్త్ర త్రవ్వకాలు జరిగాయి. త్రవ్వబడిన స్థలాల్లో అనేకం ఇప్పుడు ప్రజలు చూసేందుకు ఏర్పాటుచేయబడ్డాయి, కాబట్టి వాటిలో కొన్నింటిని మనం దర్శించి పురావస్తు శాస్త్రం బైబిలు చరిత్రతో ఎలా పొందిక కలిగి ఉందో చూద్దాము.
రాజైన దావీదు యొక్క యెరూషలేము
దావీదు యొక్క ప్రాచీన పట్టణం కట్టబడి ఉన్న, సీయోను పర్వతం అని బైబిలు సూచిస్తున్న ప్రాంతం ఆధునిక యెరూషలేము యొక్క రాజధానిలో ఎంతో సామాన్యంగా కనిపిస్తుంది. కీర్తిశేషుడైన ప్రొఫెసర్ ఈగల్ షీలోహ్ 1978-85 మధ్యకాలంలో దావీదుపురములో జరిపిన త్రవ్వకాల సమయంలో, పర్వతం యొక్క తూర్పు వైపున ఉన్న మెట్లుగల ఒక పెద్ద రాతి కట్టడం లేక మద్దతునిచ్చే గోడ బయటబడింది.
అది ఎత్తైన గోడల పెద్ద ఉపకట్టడపు అవశేషమైవుంటుందని ప్రొఫెసర్ షీలోహ్ పేర్కొన్నాడు, యెబూసీయులు (దావీదు జయించక ముందు ఉన్న నివాసులు) మెట్లుగల ఈ గోడపైన ఒక దుర్గాన్ని నిర్మించారు. గోడపైన తాను కనుగొన్న మెట్ల-రాతి కట్టడం, యెబూసీయుల దుర్గం స్థానంలో దావీదు కట్టిన క్రొత్త కోటయై ఉందని ఆయన వివరించాడు. 2 సమూయేలు 5:9 నందు, మనమిలా చదువుతాం: “దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదుపురమను పేరు పెట్టెను, మరియు మిల్లోనుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను.”
ఈ కట్టడం దగ్గర నగరపు ప్రాచీన నీటి పారుదల వ్యవస్థ ద్వారాలు ఉన్నాయి, దానిలోని కొన్నిభాగాలు దావీదు కాలం నాటివని అనిపిస్తుంది. యెరూషలేములోని నీటి కాలువల వ్యవస్థను గురించి బైబిలులో ఉన్న కొన్ని వ్యాఖ్యానాలు ప్రశ్నలను లేవనెత్తాయి. ఉదాహరణకు, “యెబూసీయులను హతము చేయువారందరు నీటి కాలువపైకి వెళ్లి” శత్రువును “హతము చేయవలెనని” దావీదు తన మనుషులకు చెప్పాడు. (2 సమూయేలు 5:8) దావీదు సేనాధిపతియైన యోవాబు అదే చేశాడు. “నీటి కాలువ” అంటే కచ్చితమైన భావం ఏమిటి?
సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో, రాజైన హిజ్కియా యొక్క ఇంజనీర్లు త్రవ్విన మరియు 2 రాజులు 20:20నందు మరియు 2 దినవృత్తాంతములు 32:30 నందు ప్రస్తావించబడిన, ప్రఖ్యాత సిలోయము సొరంగాన్ని (కాలువ) గురించి ఇతర ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. రెండు వ్యతిరేక దిశల నుండి సొరంగాన్ని త్రవ్వుకొస్తున్న వారి రెండు జట్లు ఎలా కలుసుకోగలిగాయి? సొరంగాన్ని త్రవ్వేందుకు తిన్నని మార్గంకంటే పొడవుగా అనిపించే పాము చుట్టులవలె వంకరటింకరగా ఉండే మార్గాన్ని వారెందుకు ఎంపిక చేసుకున్నారు? ప్రాముఖ్యంగా వారు వెలుగు కొరకు నూనె దీపాలను ఉపయోగించి ఉంటారు గనుక వారికి ఊపిరాడేందుకు తగినంత ప్రాణవాయువు ఎక్కడనుండి వచ్చింది?
బిబ్లికల్ ఆర్కియాలజీ రివ్యూ అనే పత్రిక అలాంటి ప్రశ్నలకు సంభావ్య సమాధానాలను అందించింది. ఈ త్రవ్వకాల విషయంలో సంప్రదింపబడిన డాన్ గిల్ అనే భూగర్భ శాస్త్రజ్ఞుడు ఇలా చెప్పిన విషయాన్ని ఉదహరించడం జరిగింది: “దావీదు పురము భూగర్భంలో సువ్యవస్థితమైన సహజ కార్స్ట్ వ్యవస్థ ఉంది. భూగర్భ రాతి పునాదిలోని నీరు ఇంకుతూ ప్రవహించడమూ మూలంగా ఏర్పడిన మడుగులు, బిలములు మరియు ఏరుల క్రమరహితమైన ప్రాంతాన్ని వర్ణించేందుకు ఉపయోగింపబడే భూగర్భ సంబంధమైన పదమే కార్స్ట్. . . . దావీదు పురము క్రింద ఉన్న భూగర్భ నీటిపారుదలను మేము అధ్యయనం చేసినప్పుడు, చక్కని నీటి సరఫరా వ్యవస్థగా ఏర్పడిన సహజమైన భూ క్షయత మూలంగా కలిగిన ఏరులనూ షాఫ్ట్లనూ ప్రాముఖ్యంగా మానవులు నైపుణ్యవంతంగా విస్తృతపర్చారనే విషయాన్ని అవి స్పష్టంచేశాయి.”
సిలోయము సొరంగం ఎలా త్రవ్వబడిందనే విషయాన్ని వివరించేందుకు ఇది సహాయం చేయవచ్చు. అది ఒక కొండ క్రింద ఉన్న సహజ ఏరు యొక్క మలుపులు తిరిగే మార్గాన్ని అనుసరించి త్రవ్వబడి ఉంటుంది. రెండు కొనలనుండి త్రవ్వుకొస్తున్న జట్లు ఇది వరకే ఉన్న బిలములను మార్చడం ద్వారా తాత్కాలిక సొరంగాలను త్రవ్వివుండవచ్చు. తర్వాత గీహోను ఊట నుండి బహుశ నగర గోడల లోపల ఉన్న సిలోయము కొలను వరకు నీరు ప్రవహించేందుకు ఒక ఏటవాలు ఏరు త్రవ్వబడి ఉండవచ్చు. ఇది నిజంగా ఒక అద్భుతమైన నిపుణతగల కార్యం, ఎందుకంటే దాని పొడవు 533 మీటర్లున్నప్పటికీ రెండు చివర్ల మధ్యగల ఎత్తు తేడా కేవలం 32 సెంటీమీటర్లే ఉంది.
ప్రాచీన నగరం యొక్క ముఖ్య నీటి సరఫరా గీహోను ఊట నుండేనన్న విషయాన్ని పండితులు ఎంతోకాలం క్రితమే గ్రహించారు. అది నగరు గోడలకు వెలుపల ఉంది, అయితే దాని నుండి ఒక సొరంగాన్ని మరియు 11 మీటర్ల ఎత్తుగల షాఫ్ట్లను త్రవ్వేందుకు వీలయ్యేంత దగ్గర్లోనే ఉంది, అలా చేయడం ద్వారా నగర నివాసులు రక్షణ గోడలను దాటకుండానే నీరు తీసుకోవచ్చు. అది వారన్ షాఫ్ట్ అనే పేరును కూడా కలిగివుంది, ఎందుకంటే 1867లో చార్లెస్ వారన్ ఆ విధానాన్ని కనుగొన్నాడు. అయితే సొరంగమూ షాఫ్ట్లూ ఎప్పుడు త్రవ్వబడ్డాయి? అవి దావీదు కాలంలో ఉండినవా? యోవాబు ఉపయోగించిన నీటి సొరంగం ఇదేనా? డాన్ గిల్ దానికిలా సమాధానమిస్తున్నాడు: “వారన్ షాఫ్ట్ సహజమైన మడుగు అవునో కాదో పరీక్షించేందుకు, దాని ఎగుడు దిగుడు గోడలనుండి మేము ఒక సున్నపు రాతి పొర ముక్కను తీసి దానిలో కార్బన్-14 ఉందేమోనని పరిశీలన చేశాము. ఆ పొర 40,000 సంవత్సరాలకంటే పూర్వందనే విషయాన్ని సూచిస్తూ అందులో ఎలాంటి కార్బన్-14 అగుపించలేదు: ఆ షాఫ్ట్లను మానవులు త్రవ్వి ఉండరనే విషయానికి అది తిరుగులేని రుజువునిస్తుంది.”
హిజ్కియా కాలంనాటి అవశేషాలు
అష్షూరీయుల రాజ్యం తన దారికి అడ్డు వచ్చిన వారినందరినీ జయిస్తున్న కాలంలో రాజైన హిజ్కియా జీవించాడు. ఆయన పరిపాలనలోని ఆరవ సంవత్సరంలో, పది గోత్రాల రాజ్యం యొక్క రాజధానియైన సమరయను అష్షూరీయులు జయించారు. ఎనిమిది సంవత్సరాల తర్వాత (సా.శ.పూ. 732) యూదా యెరూషలేములను జడిపిస్తూ అష్షూరీయులు తిరిగి వచ్చారు. రెండవ దినవృత్తాంతములు 32:1-8 వచనాలు హిజ్కియా యొక్క ప్రతిరోధక తంత్రాన్ని వర్ణిస్తున్నాయి. నేడు ఆ కాలంనాటి దృశ్య రుజువులేమైనా ఉన్నాయా?
ఉన్నాయి. 1969లో ప్రొఫెసర్ నహమాన్ అవిగాడ్ ఆ కాలంనాటి అవశేషాలను కనుగొన్నాడు. ఒక పెద్ద గోడ యొక్క కొంతభాగాన్ని త్రవ్వకాల్లో కనుగొన్నారు, అంచనాల ప్రకారం దాని మొదటి భాగం 40 మీటర్ల పొడవు, 7 మీటర్ల వెడల్పు మరియు 8 మీటర్ల ఎత్తు ఉంది. ఆ గోడ శిలపైన కొంతభాగమూ ఇటీవలనే నిర్మించబడిన ఇండ్లపైన కొంత భాగమూ నిల్చునివుంది. ఆ గోడను ఎవరు, ఎప్పుడు నిర్మించారు? “ఆ తేదీనీ ఆ గోడ సంకల్పాన్నీ తెలుసుకునేందుకు బైబిలులోని రెండు వాక్య సముదాయాలు అవిగాడ్కు సహాయం చేశాయని” ఒక పురావస్తు శాస్త్ర పత్రిక నివేదిస్తుంది. ఆ వాక్య సముదాయాలు ఇలా చదవబడుతున్నాయి: “మరియు రాజు ధైర్యము తెచ్చుకొని, పాడైన గోడ యావత్తు కట్టించి, గోపురములవరకు దానిని ఎత్తు చేయించి, బయట మరియొక గోడను కట్టిం”చాడు. (2 దినవృత్తాంతములు 32:5) ‘ప్రాకారమును గట్టిచేయుటకు ఇండ్లను పడగొట్టిరి.’ (యెషయా 22:10) నేడు సందర్శకులు వెడల్పయిన గోడ అని పిలువబడే దాని కొంతభాగాన్ని పాత నగరంలోని యూదా విభాగంలో కనుగొనవచ్చు.
ఆ సమయంలో ఉన్న యెరూషలేము, ఉత్తర రాజ్యం అష్షూరీయుల చేతిలో ఓడిపోయిన తర్వాత అక్కడ నుండి శరణార్థులు బయల్దేరిరావడం మూలంగా ఇంతవరకూ అనుకున్న దానికంటే అప్పుడే ఎంతో పెద్దగా ఉండేదనే విషయాన్ని కూడా విభిన్న త్రవ్వకాలు స్పష్టం చేశాయి. యెబూసీయుల నగరం దాదాపు 15 ఎకరాల ప్రాంతాన్ని ఆక్రమించిందని ప్రొఫెసర్ షీలోహ్ అంచనావేశాడు. సొలొమోను కాలంలో అది దాదాపు 40 ఎకరాల ప్రాంతంలో ఉండినది. రాజైన హిజ్కియా కాలంలో, అంటే దాదాపు 300 సంవత్సరాల తర్వాత, నగరం యొక్క పటిష్ఠమైన ప్రాంతం 150 ఎకరాల విస్తీర్ణం వరకూ వ్యాపించింది.
మొదటి దేవాలయ కాలంలోని శ్మశానాలు
మొదటి దేవాలయ కాలంలోని అంటే సా.శ.పూ. 607లో బబులోనీయులు యెరూషలేమును నాశనం చేయకముందు ఉన్న సమాధులు కూడా ఎంతో సమాచారాన్ని కలిగి ఉన్నాయి. 1979/80లో హిన్నోము లోయనందలి ఏటవాలు ప్రాంతంలోని సమాధి గుహల సముదాయాన్ని త్రవ్వినప్పుడు అత్యద్భుతమైన సంగతులు బయల్పర్చబడ్డాయి. “యెరూషలేములో జరిపిన పురావస్తు శాస్త్ర పరిశోధనా చరిత్రంతటిలోనూ, దానిలోని వాటన్నిటితోసహా కనుగొనబడిన మొదటి దేవాలయంలోని వస్తుభాండాగారాలలోని కొన్నింటిలో ఒకటి. అందులో ఒక వేయికంటే ఎక్కువ వస్తువులు ఉన్నాయి” అని గేబ్రియల్ బార్కే చెబుతున్నాడు. అతడిలా కొనసాగిస్తున్నాడు: “ఇజ్రాయేల్లో ప్రాముఖ్యంగా యెరూషలేములో పని చేసే ప్రతి పురావస్తు శాస్త్రజ్ఞుని అతి తీయని కల ఏదైనా వ్రాతపూర్వక వస్తువును కనుగొనాలన్నదే.” రెండు చిన్న వెండి గ్రంథపు చుట్టలు కనుగొనబడ్డాయి, అయితే వాటిలో ఏముంది?
బార్కే ఇలా వివరిస్తున్నాడు: “చుట్టబడని వెండి ముక్కను నేను చూసి, దాన్ని భూతద్దం క్రింద పెట్టినప్పుడు ఎంతో పల్చని మరియు నాజూకైన ఆ వెండి పొర ఉపరితలంపై పదునైన వస్తువుతో సున్నితంగా వ్రాయబడిన అక్షరాలు ఉన్నాయని నేను చూడగలిగాను. . . . ఆ వ్రాతప్రతిపైనున్న దైవిక నామం, ప్రాచీన హెబ్రీ లిపిలో యోద్హేవావ్హే అనే నాలుగు హెబ్రీ అక్షరాలు వ్రాయబడివున్నాయి.” తర్వాతి ప్రచురణలో బార్కే ఇలా వ్రాస్తున్నాడు: “ఆ రెండు వెండి ముక్కలు కూడా ఆశీర్వచన సూత్రాలను కలిగివున్నాయి అవి బైబిలులోని యాజకుల దీవెనతో సమానంగా ఉన్నాయనే విషయం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.” (సంఖ్యాకాండము 6:24-26) యెరూషలేములో కనుగొనబడిన వ్రాతప్రతిపై యెహోవా నామం కనుగొనబడటం ఇదే మొదటిసారి.
ఈ వెండి చుట్టల తేదీని పండితులు ఎలా నిర్ణయించారు? ముఖ్యంగా అవి ఏ పురావస్తు శాస్త్ర పూర్వపర సందర్భంలో కనుగొనబడ్డాయో దాని ఆధారంగానే. తేదీని లెక్కించగల 300 కంటే ఎక్కువ మట్టి పాత్రలు ఆ వస్తుభాండాగారంలో కనుగొనబడ్డాయి, అవి సా.శ.పూ. ఏడవ మరియు ఆరవ శతాబ్దాలకు చెందినవని సూచిస్తున్నాయి. తేదీ తెలిసిన ఇతర వ్రాతప్రతులతో పోల్చిచూసినప్పుడు అందులోని లిపి అదే కాలాన్ని సూచిస్తుంది. ఆ చుట్టలు యెరూషలేములోని ఇజ్రాయేల్ వస్తు ప్రదర్శనశాలలో ప్రదర్శించబడుతున్నాయి.
సా.శ.పూ. 607లో యెరూషలేము నాశనం
సా.శ.పూ. 607లో జరిగిన యెరూషలేము నాశనాన్ని గురించి బైబిలు 2 రాజులు 25వ అధ్యాయంలో మరియు 2 దినవృత్తాంతములు 36వ అధ్యాయంలో మరియు యిర్మీయా 39వ అధ్యాయంలో నెబుకద్నెజరు యొక్క సైన్యం ఆ నగరానికి నిప్పంటించిందని నివేదిస్తుంది. ఈ చారిత్రక వృత్తాంతాన్ని ఇటీవలి త్రవ్వకాలు స్పష్టం చేశాయా? ప్రొఫెసర్ ఈగల్ షీలోహ్ ప్రకారం, “బైబిలు నందు ప్రస్తావించబడిన యెరూషలేమును [బబులోను నాశనం చేయడం] యొక్క రుజువు స్పష్టమైన పురావస్తు శాస్త్ర రుజువుల ద్వారా నిజమని నిరూపించబడుతుంది; విభిన్న కట్టడాల సమూల నాశనం మరియు గృహాల వేర్వేరు చెక్కభాగాలను పూర్తిగా నాశనం చేసిన అగ్ని.” అతడు ఇంకా ఇలా వ్యాఖ్యానించాడు: “యెరూషలేములో జరిగిన ప్రతి త్రవ్వకంలో కూడా ఈ వినాశనం యొక్క అవశేషాలు కనుగొనబడ్డాయి.”
2,500 కంటే ఎక్కువ సంవత్సరాల క్రితం జరిగిన ఈ నాశనం యొక్క అవశేషాలను సందర్శకులు చూడవచ్చు. ఇశ్రాయేలీయుల గోపురం, కాలిన గది మరియు అధికారిక ముద్రల గృహం మొదలైనవి, పరిరక్షించబడి ప్రజలు చూసేందుకు తెరువబడిన ప్రఖ్యాత పురావస్తు శాస్త్ర ప్రాంతాలు. పురావస్తు శాస్త్రజ్ఞురాలైన జేన్ ఎమ్. కేహిల్ మరియు డేవిడ్ టార్లర్లు ప్రాచీన యెరూషలేము బయల్పర్చబడింది (ఆంగ్లం) అనే తమ పుస్తకంలో ఇలా సంక్షిప్తంగా వ్రాశారు: “బబులోనీయులు యెరూషలేమును సమూలంగా నాశనం చేసిన రుజువులు, కాలిన గది మరియు అధికారిక ముద్రల గృహం వంటి కట్టడాలలో కనుగొనబడిన మంటల్లో కాలిపోయిన అవశేషాల దట్టమైన పొరల్లోనే కాదు గానీ, తూర్పున ఉన్న ఏటవాలు ప్రాంతాన్నంతటినీ కప్పేసి కనబడిన కూలిపోయిన కట్టడాల పెద్ద రాతి తుప్పలో కూడా కనబడుతున్నాయి. నగర నాశనాన్ని గురించిన బైబిలునందలి వివరణ . . . పురావస్తు శాస్త్రం కనుగొన్న వాటితో పొందిక కలిగి ఉంది.”
అలా, దావీదు సమయంనుండి సా.శ.పూ. 607లో దాని నాశనం వరకూ, యెరూషలేమును గురించిన బైబిలు చిత్రణ, గత 25 సంవత్సరాల కాలంలో జరిపిన పురావస్తు శాస్త్ర త్రవ్వకాల ద్వారా అనేక రీతుల్లో సుస్పష్టం చేయబడింది. అయితే సా.శ. మొదటి శతాబ్దంలోని యెరూషలేము సంగతేమిటి?
యేసు దినాల్లో యెరూషలేము
సా.శ. 70లో రోమనులు నాశనం చేయకముందు, యేసు దినాల్లో యెరూషలేము ఎలా ఉండేదో చిత్రీకరించుకునేందుకు పురావస్తు శాస్త్ర త్రవ్వకాలు, బైబిలు, మొదటి శతాబ్దంలోని యూదా చరిత్రకారుడైన జోసీఫస్ మరియు ఇతర మూలాలు పండితులకు సహాయం చేస్తున్నాయి. యెరూషలేములోని ఒక పెద్ద హోటలు వెనుక ప్రదర్శించబడుతున్న ఒక ప్రతిమానం, క్రొత్త త్రవ్వకాలు బయల్పరిచే విషయాలకు అనుగుణంగా క్రమంగా మార్చబడుతుంది. ఆ నగరం యొక్క ముఖ్యాంశం దేవాలయ పర్వతమే, సొలొమోను కాలంలో ఉన్నదాని పరిమాణానికి రెండింతల దానిని హేరోదు నిర్మించాడు. ప్రాచీన ప్రపంచంలో మానవుడు నిర్మించిన అతి పెద్ద తిన్నె అదే, అది 480 మీటర్ల పొడవూ 280 మీటర్ల వెడల్పూ ఉంది. కొన్ని నిర్మాణ రాళ్లు 50 టన్నుల బరువు ఉన్నాయి, ఒకటి దాదాపు 400 టన్నుల బరువు ఉంది, “దాని పరిమాణంలో సమానమైనది ప్రాచీన ప్రపంచంలో ఎక్కడా లేదని” ఒక పండితుడు పేర్కొన్నాడు.
“ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని” యేసు అనడాన్ని విన్నప్పుడు కొంతమంది ప్రజలు దిగ్భ్రాంతి చెందారంటే అందులో ఆశ్చర్యం లేదు. ఆయన “తన శరీరమను దేవాలయమునుగూర్చి” అలా అన్నప్పటికీ ఆ పెద్ద దేవాలయాన్ని గురించి మాట్లాడుతున్నాడని వారు తలంచారు. కాబట్టి, వారిలా అన్నారు: “ఈ దేవాలయము నలువదియారు సంవత్సరములు కట్టిరే; నీవు మూడు దినములలో దానిని లేపుదువా”? (యోహాను 2:19-21) దేవాలయ పర్వత పరిసర త్రవ్వకాల ఫలితంగా, సందర్శకులు ఇప్పుడు గోడ యొక్క కొన్ని భాగాలను మరియు యేసు కాలంనాటి ఇతర పురావస్తుశాస్త్ర అంశాలను చూడవచ్చు మరియు దేవాలయ దక్షిణ ద్వారాల వైపుకు ఏ మెట్లమీదైతే యేసు బహుశ ఎక్కి వెళ్లాడో వాటిని ఎక్కి వెళ్లవచ్చు.
దేవాలయ శిఖరం యొక్క పశ్చిమ గోడకు కొంత దూరంలో, అంటే పాత నగరంలోని యూదా విభాగంలో, కాలిన గృహం మరియు హేరోదీయుల విభాగం అని పిలువబడే రెండు త్రవ్వకం స్థలాలు ఉన్నాయి. సా.శ. మొదటి శతాబ్దానికి చెందిన ఈ స్థలాలు ఎంతో చక్కగా పునరుద్ధరించబడ్డాయి. కాలిన గృహాన్ని కనుగొన్న తర్వాత, పురావస్తు శాస్త్రజ్ఞుడైన నహమాన్ అవిగాడ్ ఇలా వ్రాశాడు: “ఈ కట్టడం సా.శ. 70లో యెరూషలేము నాశనం జరిగినప్పుడు రోమీయుల చేత కాల్చివేయబడిందనే విషయం ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఆ నగరంలో జరుపబడిన త్రవ్వకాల చరిత్రలోనే మొదటిసారిగా, ఆ నగరం కాలిపోవడాన్ని గురించిన విశదమైన, స్పష్టమైన పురావస్తు శాస్త్ర రుజువులు వెలుగులోకి వచ్చాయి.”—12వ పేజీలోని ఛాయాచిత్రాలను చూడండి.
ఇలా కనుగొన్న వాటిలో కొన్ని యేసు జీవితంలోని కొన్ని సంఘటనలపై వెలుగు ప్రసరింపజేస్తున్నాయి. ఆ కట్టడాలు పైనున్న పట్టణంలో ఉన్నాయి, అక్కడ ప్రధానయాజకులతో సహా యెరూషలేములోని ధనికులైన ప్రజలు జీవించేవారు. ఆచారబద్ధమైన అనేక స్నానపాత్రలు ఆ ఇండ్లలో కనుగొనబడ్డాయి. ఒక పండితురాలు ఇలా గమనించి చెబుతుంది: “అన్ని స్నాన పాత్రలుండటం, రెండవ దేవాలయ సమయంలో పైనున్న నగరంలో జీవించిన నివాసులు ఆచారబద్ధ శుద్ధతకు సంబంధించిన సూత్రాలను ఎంతో కచ్చితంగా పాటించేవారనే విషయాన్ని సూచిస్తున్నాయి. (ఈ సూత్రాలు మిష్నాలో వ్రాయబడి ఉన్నాయి, మిష్నాలో మిక్వేహ్ వివరాలకు పది అధ్యాయాలను కేటాయించబడ్డాయి.)” పరిసయ్యులూ శాస్త్రులతో ఈ ఆచారాలను గురించి యేసు చేసిన వ్యాఖ్యానాలను గుణగ్రహించేందుకు ఈ సమాచారం మనకు సహాయం చేస్తుంది.—మత్తయి 15:1-20; మార్కు 7:1-15.
యెరూషలేములో రాతి పాత్రలు ఆశ్చర్యం గొలిపేంత అత్యధిక సంఖ్యలో కనుగొనబడ్డాయి. నహమాన్ అవిగాడ్ ఇలా పేర్కొంటున్నాడు: “అవి యెరూషలేము గృహాల్లో అన్ని సంఖ్యల్లో అంత అకస్మాత్తుగా ఎందుకు కనిపించాయి? దానికి సమాధానం, ఆచారబద్ధ శుద్ధతకు సంబంధించిన యూదుల సూత్రాలు ఉండే హాలాకహ్లో లభిస్తుంది. అశుభ్రమయ్యే సాధ్యత లేని వస్తువుల్లో రాతి పాత్రలు కూడా ఉన్నాయని మిష్నా మనకు చెబుతుంది . . . రాయి ఎన్నడూ అచారబద్ధమైన కాలుష్యానికి గురికాదు.” యేసు ద్రాక్షారసంగా మార్చిన నీళ్లు మట్టి పాత్రల్లో కాక రాతి పాత్రల్లో ఎందుకున్నాయో ఇది వివరిస్తుందని సూచించబడింది.—లేవీయకాండము 11:33; యోహాను 2:6.
ఇజ్రాయేల్ ప్రదర్శన శాలను దర్శిస్తే రెండు అసాధారణమైన అస్తికల పాత్రలు కనిపిస్తాయి. బిబ్లికల్ ఆర్కియాలజీ రివ్యూ ఇలా వివరిస్తుంది: “అస్తికల పాత్రలు సా.శ. 70లో యెరూషలేము రోమీయుల ద్వారా నాశనం చేయబడటానికి దాదాపు వంద సంవత్సరాల ముందు ప్రాముఖ్యంగా ఉపయోగించబడేవి. . . . సమాధి గుహలోని గోడలో చెక్కబడిన సందులో మృతులను ఉంచుతారు; శరీరం కుళ్ళిపోయిన తర్వాత, ఎముకలను సేకరించి ఒక అస్తికల పాత్రలో వేస్తారు—ఆ పాత్రలు సాధారణంగా సున్నపురాతితో చెక్కబడి అలంకరింపబడి ఉండేవి.” ప్రదర్శింపబడుతున్న రెండు పాత్రలూ 1990లో ఒక సమాధి గుహలో కనుగొనబడ్డాయి. పురావస్తు శాస్త్రజ్ఞుడైన జ్వీ గ్రీన్హట్ ఇలా నివేదిస్తున్నాడు: “సమాధిలోని ఆ రెండు అస్తికల పాత్రల పైనా ‘కయప’ అనే పదం కనిపించడం పురావస్తు శాస్త్ర పర్వంలో ఇదే మొదటిసారి. అది బహుశ క్రొత్తనిబంధనలో ప్రస్తావించబడిన . . . ప్రధాన యాజకుడైన కయప వంశానికి చెందిన పేరై ఉండవచ్చు . . . రోమీయుల అధిపతియైన పొంతి పిలాతుకు యేసు అప్పగించబడినది యెరూషలేములోని ఇతని గృహంలోనే.” ఒక అస్తికల పాత్రలో దాదాపు 60 ఏళ్ల వ్యక్తి ఎముకలు కనిపించాయి. అవి వాస్తవానికి కయప ఎముకలని పండితులు ఊహిస్తున్నారు. ఒక పండితుడు అలా కనుగొన్న వాటిని యేసు కాలానికి చెందినవని అంటున్నాడు: “మరో అస్తికల పాత్రలో కనుగొనబడిన ఒక నాణెం హేరోదు అగ్రిప్ప (సా.శ. 37-44) ముద్రించినది. ఈ రెండు కయప అస్తికల పాత్రలూ బహుశ ఆ శతాబ్దారంభానికి చెందినవై ఉంటాయి.”
ఆరిజోనా విశ్వవిద్యాలయంలో మధ్య ప్రాచ్య పురావస్తు శాస్త్ర ప్రొఫెసర్ అయిన విలియమ్ జీ. డేవర్ యెరూషలేమును గురించి ఇలా వ్యాఖ్యానించాడు: “ఈ ప్రముఖ స్థలం యొక్క పురావస్తు శాస్త్ర చరిత్రను గురించి మనం గత 15 సంవత్సరాల్లో నేర్చుకున్నది అంతకు ముందటి 150 సంవత్సరాలన్నింటిలోనూ నేర్చుకున్న దానికంటే ఎక్కువని అనడం అతిశయోక్తి కాదు.” ఇటీవలి దశాబ్దాలలో, యెరూషలేములోని పురావస్తు శాస్త్ర ప్రముఖ కార్యకలాపాలలో అనేకం బైబిలు చరిత్రను సుస్పష్టం చేసిన విషయాలనే అందించాయి.
[9వ పేజీలోని చిత్రసౌజన్యం]
రెండవ దేవాలయం నెలకొని ఉన్న సమయంలోని యెరూషలేము నగరం యొక్క ప్రతిమానం—యెరూషలేములోని హోలీలాండ్ హోటల్ ఆవరణలో ఉంది
[10వ పేజీలోని చిత్రం]
పైన: యెరూషలేములోని దేవాలయ పర్వతం యొక్క నైరుతి కోణం
కుడి: వారన్ షాఫ్ట్లోకి దిగడం