కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 4/1 పేజీలు 27-29
  • పాఠకుల ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1996
  • లైంగిక వేధింపు—ఓ ప్రపంచవ్యాప్త సమస్య
    తేజరిల్లు!—1996
  • కైసరువి కైసరుకి చెల్లించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 4/1 పేజీలు 27-29

పాఠకుల ప్రశ్నలు

జూరీ పని (న్యాయనిర్ణయ సంఘంలో సభ్యునిగా పనిచేయడం) కొరకు పిలువబడినప్పుడు ఒక క్రైస్తవుడు ఏమి చేయాలి?

కొన్ని దేశాల్లో, న్యాయ పరిపాలనా విధానం పౌరుల్లో నుండి ఎంపిక చేసుకోబడిన జూరీలను ఉపయోగిస్తుంది. ఇది అమలులో ఉన్నచోట, జూరీ పని కొరకు పిలువబడినప్పుడు ఎలా ప్రతిస్పందించాలనేది ఒక క్రైస్తవుడు నిర్ణయించుకోవాలి. అలా హాజరు కావడాన్ని బైబిలు సూత్రాలు నిషేధించడం లేదని అనేకమంది క్రైస్తవులు మంచి మనస్సాక్షితో తీర్మానించారు, చివరికి షద్రకు, మేషాకు, అబేద్నెగోలు దూరా మైదానములో హాజరు కమ్మని బబులోను ప్రభుత్వము ఉత్తరువు పంపినప్పుడు దానికి వారు సమ్మతించారు, అలాగే రోమా అధికారుల ఉత్తర్వు ప్రకారం యోసేపు మరియలు బేత్లెహేముకు వెళ్లారు. (దానియేలు 3:1-12; లూకా 2:1-4) అయితే యథార్థవంతులైన క్రైస్తవులు పరిగణనలోకి తీసుకోవలసిన అంశాలు ఉన్నాయి.

జూరీలు విశ్వవ్యాప్తంగా వాడుకలో లేవు. కొన్ని దేశాల్లో, పౌర సంబంధమైన కేసులనూ, నేర సంబంధమైన కేసులనూ వృత్తిపరమైన న్యాయమూర్తీ లేక న్యాయమూర్తుల సభా నిర్ణయిస్తుంది. మరితర స్థలాల్లో, సాంప్రదాయిక ధర్మం అమలులో ఉంది, న్యాయ ప్రక్రియలో జూరీలు ఒక భాగమై ఉంటాయి. అయినప్పటికీ, అనేకమంది ప్రజలకు జూరీలు ఎలా ఎంపిక చేసుకోబడతాయి, అవేమి చేస్తాయి అనేదాని గురించి సరియైన అవగాహన లేదు. కాబట్టి మీరు జూరీ పనిని చేపట్టినా లేక చేపట్టకపోయినా కొంత అవగాహన కలిగివుండడం సహాయకరంగా ఉంటుంది.

దేవుని ప్రజలు యెహోవాను సర్వోన్నత న్యాయాధిపతిగా గుర్తిస్తారు. (యెషయా 33:22) ప్రాచీన ఇశ్రాయేలులో, నీతిమంతులైయుండి నిష్పక్షపాతంగా ఉండే అనుభవంగల పురుషులు వివాదాలను పరిష్కరించి, చట్టసంబంధమైన విషయాలకు సంబంధించి నిర్ణయాలు తెలియజేయడానికి న్యాయాధిపతులుగా సేవ చేసేవారు. (నిర్గమకాండము 18:13-22; లేవీయకాండము 19:15; ద్వితీయోపదేశకాండము 21:18-21) యేసు భూమి మీద ఉన్న కాలానికి వచ్చేటప్పటికి, న్యాయ కార్యవిధిని యూదుల ఉన్నత న్యాయస్థానమైన మహా సభ చేపట్టింది. (మార్కు 15:1; అపొస్తలుల కార్యములు 5:27-34) పౌర జూరీ సభ్యునిగా పనిచేసే అవకాశం సగటు యూదునికి లేదు.

ఇతర దేశాలు పౌరులతో రూపొందించబడిన జూరీలను ఉపయోగించాయి. సోక్రటీసును 501 మంది జూరీ సభ్యులు విచారణ చేశారు. రోమన్‌ రిపబ్లిక్‌లో కూడా జూరీ ద్వారా విచారణ చేయడం జరిగేది, కానీ సామ్రాట్‌ల పరిపాలనలో ఇది రద్దు చేయబడింది. ఆ తర్వాత, ఇంగ్లాండ్‌లోని కింగ్‌ హెన్రీ III నిందితులు తమ పొరుగువారిచే తీర్పుతీర్చబడేలా ఏర్పాటు చేశాడు. వారికి నిందితులు తెలిసి ఉంటారు గనుక, పోరాటం ద్వారా నిందితుడు విచారణలో తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి లేక ఒక కఠిన పరీక్షను తప్పించుకోవడానికి ఉన్న విధానాల కంటే వారి తీర్పు న్యాయమైనదై ఉండగలదని భావించబడేది. కాలం గడిచే కొద్దీ, జూరీ విధానం అనేది పౌరుల గుంపు ఒకటి ఒక కేసును విని సాక్ష్యం ఆధారంగా ఒక తీర్మానానికి వచ్చే ఒక ఏర్పాటుగా మారింది. సాక్ష్యాలకు సంబంధించి ఒక వృత్తిపరమైన న్యాయమూర్తి వారికి నడిపింపునిచ్చేవాడు.

నేడు జూరీలు ఉపయోగించుకోబడుతున్న ప్రాంతాల్లో, జూరీల రకాల్లోనూ, జూరీ సభ్యుల సంఖ్యలోనూ, ఒక తీర్మానానికి రావడంలో ఇమిడివున్నదానిలోనూ వైవిధ్యం ఉంది. ఉదాహరణకు, అమెరికాలో, 12 నుండి 23 మంది సభ్యులుగల గ్రాండ్‌ జూరీ ఒక వ్యక్తి ఒక నేరం చేశాడని నిందించడానికి తగినంత సాక్ష్యాధారం ఉందో లేదో నిర్ణయిస్తుంది; అది అపరాధా లేక నిరపరాధా అనే విషయాన్ని నిర్ణయించదు. అలాగే, ఒక కొరోనర్‌ జూరీలో (ఇంక్వెస్ట్‌ జూరీ), ఒక నేరం జరిగిందా లేదా అనేది నిర్ణయించడానికి జూరీ సభ్యులు సాక్ష్యాధారాన్ని తూచి చూస్తారు.

అనేకమంది ప్రజలకు జూరీ గురించి ఆలోచించినప్పుడు, పౌర వివాదమైనా లేక నేరానికి సంబంధించిన కేసు అయినా అది అపరాధమా లేక అపరాధం కాదా అనేది నిర్ణయించడానికి దానికి సంబంధించిన సాక్ష్యాన్ని వినే 12 మంది పౌరులుగల సంఘం వారి మనస్సులో ఉంటుంది. గ్రాండ్‌ జూరీతో పోల్చి చూస్తే ఇది ఒక పెటిట్‌ (చిన్న) జూరీ. సాధారణంగా, జూరీ పని కొరకు హాజరు కమ్మని కోర్టు ఓటర్లు, లైసెన్సు ఉన్న డ్రైవర్లు, లేక అటువంటి ఇతర లిస్టులలో నుండి కొంతమంది వ్యక్తులకు ఉత్తర్వులు పంపుతుంది. దోషులుగా నిర్ణయింపబడిన ఘోరాపరాధులూ మతి స్థిమితం లేనటువంటి వ్యక్తులూ లాంటివారు సహజంగానే అనర్హులౌతారు. స్థానిక చట్టం ఆధారంగా, ఇతరులు అంటే వైద్యులు, మత నాయకులు, న్యాయవాదులు, లేక చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు మినహాయింపును కోరవచ్చు. (కొంతమందికి జూరీ సేవకు సంబంధించి బలమైన వ్యక్తిగత, మనస్సాక్షిపూర్వక అభ్యంతరాలు ఉంటాయి గనుక వారు మినహాయింపబడవచ్చు.) అయితే, జూరీ పని కొరకు అందరూ హాజరయ్యే బాధ్యతను కలిగివుండే విధంగానూ బహుశా సంవత్సరాలు గడుస్తుండగా పదేపదే ఆ బాధ్యతను చేపట్టేలా అధికారులు ఎక్కువగా మినహాయింపులను రద్దు చేస్తున్నారు.

జూరీ పని కొరకు హాజరయ్యే వారందరూ విచారణలో జూరీ సభ్యులుగా పాల్గొన వలసిన అవసరం ఉండదు. జూరీ పని కొరకు పిలువబడిన వ్యక్తుల గుంపులో నుండి, ఒక ప్రత్యేకమైన కేసుకు జూరీ సభ్యులుగా ఉండగలిగేలా కొంతమంది యాదృచ్చిక ఎంపిక చేసుకోబడతారు. అప్పుడు న్యాయమూర్తి వాది ప్రతివాదులను వారి అటార్నీలను గుర్తించి, కేసు యొక్క లక్షణాలను వివరిస్తాడు. ఆయనా ఆయనతోపాటు అటార్నీలూ జూరీ సభ్యుడు కాగల వ్యక్తిని పరీక్షిస్తారు. ఆ కేసు స్వభావాన్నిబట్టి ఎవరి మనస్సాక్షియైనా జూరీ పని చేయడానికి అతనిని అనుమతించకపోతే, దాన్ని గురించి మాట్లాడ్డానికి సమయమిదే.

ఈ గుంపును, వాస్తవంగా ఆ కేసు విచారణకు కూర్చునేవారి సంఖ్యకు తగ్గించవలసి ఉంటుంది. కేసులో ఉన్న ఆసక్తినిబట్టి ఎవరి నిష్పక్షపాతత అయినా ప్రశ్నించబడితే వారిని న్యాయమూర్తి తీసివేస్తాడు. అంతేగాక, ఇరువైపుల ఉన్న అటార్నీలకూ కొంతమంది జూరీ సభ్యులను తీసివేసే హక్కు ఉంటుంది. ఆ జూరీ సంఘం నుండి తీసివేయబడిన ఎవరైనా, ఇతర కేసుల కొరకు యాదృచ్చిక ఎంపిక చేసుకోబడేందుకు వేచివుండడానికి జూరీ గుంపుకు తిరిగి వస్తారు. ఈ పరిస్థితిలో కొంతమంది క్రైస్తవులు అనియత సాక్ష్యమిచ్చేందుకు సమయాన్ని ఉపయోగించుకున్నారు. కొన్ని రోజుల తర్వాత, ఆ వ్యక్తి వాస్తవంగా జూరీ సభ్యునిగా కూర్చున్నా లేకపోయినా ఆ వ్యక్తి యొక్క జూరీ పని నెరవేర్చబడుతుంది.

క్రైస్తవులు ‘పరులజోలికి పోకుండా,’ ‘తమ సొంత కార్యములను జరుపుకొనుట యందు ఆశకలిగి’ ఉండడానికి ప్రయాసపడతారు. (1 పేతురు 4:15; 1 థెస్సలొనీకయులు 4:11) పిత్రార్జితము విషయంలో తీర్పు తీర్చమని ఒక యూదుడు యేసును అడిగినప్పుడు, “ఓయీ, మీమీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించెనని” యేసు సమాధానమిచ్చాడు. (లూకా 12:13, 14) యేసు రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చాడు గాని న్యాయసంబంధమైన విషయాలు తీర్మానించడానికి కాదు. (లూకా 4:18, 43) యేసు ఇచ్చిన సమాధానం, వివాదాలను పరిష్కరించుకోవడానికి దేవుని ధర్మశాస్త్రమందు పొందుపర్చబడిన విధానాన్ని ఉపయోగించడానికి ఆ వ్యక్తిని పురికొల్పి ఉండవచ్చు. (ద్వితీయోపదేశకాండము 1:16, 17) అలాంటి విషయాలు ప్రాముఖ్యమైనవే అయినప్పటికీ, జూరీ పని కొరకు హాజరు కమ్మని ఇచ్చిన ఉత్తర్వుకు ప్రతిస్పందించడానికీ, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడానికీ ఎంతో తేడా ఉంది. పరిస్థితి దానియేలు యొక్క ముగ్గురు సహచరుల పరిస్థితికి మరింత సారూప్యంగా ఉంది. దూరా మైదానానికి రమ్మని బబులోను ప్రభుత్వం వారికి ఆజ్ఞాపించింది, వారలా చేయడం దేవుని ధర్మశాస్త్రాన్ని అధిగమించినట్లు కాలేదు. బైబిలు చూపిస్తున్నట్లుగా, వారు ఆ తర్వాత చేసినది పూర్తిగా వేరే విషయం.—దానియేలు 3:16-18.

దేవుని సేవకులు మోషే ధర్మశాస్త్రము క్రింద ఉండడం మానుకున్న తర్వాత, వారు వివిధ దేశాల్లో లౌకిక న్యాయస్థానాలతో వ్యవహరించవలసి వచ్చింది. సంఘంలోనే వివాదాలను పరిష్కరించుకోమని అపొస్తలుడైన పౌలు కొరింథులోని “పరిశుద్ధులను” కోరాడు. లౌకిక న్యాయస్థానాల న్యాయాధీశ వర్గం గురించి “అనీతిమంతు”లని చెబుతూ, పౌలు లౌకిక వ్యవహారాలను చేపట్టడంలో అలాంటి లౌకిక న్యాయస్థానాలకున్న స్థానాన్ని కాదనలేదు. (1 కొరింథీయులు 6:1) రోమా న్యాయ స్థానంలో ఆయన తన్నుతాను సమర్థించుకున్నాడు, తన కేసును కైసరుకు కూడా అప్పీలు చేసుకున్నాడు. లౌకిక న్యాయస్థానాలు సిద్ధాంతపరంగా తప్పని కాదు.—అపొస్తలుల కార్యములు 24:10; 25:10, 11.

లౌకిక కోర్టులు “పై అధికారుల” నిర్వహణలో భాగమే. అవి “దేవుని వలననే నియమింపబడి” ఉండి, అవి చట్టాలను రూపొందించి, అమలుపరుస్తాయి. పౌలు ఇలా వ్రాశాడు: “నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; . . . నీవు చెడ్డది చేసినయెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు; కీడు చేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు.” క్రైస్తవులు ‘అధికారమును ఎదిరించరు’ ఎందుకంటే అది చట్టపరమైన వ్యవహారాలను చూసుకుంటుంది, ‘దానికి వ్యతిరేకంగా నిలువబడి’ తీర్పు పొందాలని వారు కోరుకోరు.—రోమీయులు 13:1-4; తీతు 3:1.

దృక్పథాలను సమతూకపర్చడంలో, క్రైస్తవులు కైసరు కోరుతున్న కొన్నింటికి తాము లోబడగలమా లేదా అని పరిశీలించుకోవాలి. పౌలు ఇలా ఉపదేశించాడు: “యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండ వలెనో వానియెడల భయము . . . కలిగియుండి, అందరికిని [పై అధికారులకు] వారి వారి ఋణములను తీర్చుడి.” (రోమీయులు 13:7) అది ద్రవ్యసంబంధమైన పన్నుకు సంబంధించిన సమాచారం. (మత్తయి 22:17-21) రోడ్లను శుభ్రపరచడం లేక కైసరు వ్యవహారాల్లోని ఇతర పనులను చేయడం కొరకు పౌరులు తమ సమయాన్నీ, శ్రమనూ వెచ్చించాలని కైసరు చెబితే, లోబడాలా వద్దా అనేది ప్రతి క్రైస్తవుడు నిర్ణయించుకోవాలి.—మత్తయి 5:41.

కొంతమంది క్రైస్తవులు జూరీ సేవను కైసరువి కైసరుకు అప్పగించడంగా దృష్టించారు. (లూకా 20:25) జూరీ పనిలో సాక్ష్యాధారాన్ని వినడం, వాస్తవ విషయాల్లో లేక చట్టం విషయాల్లో నిజాయితీతో కూడిన అభిప్రాయాన్ని ఇవ్వడం ఇమిడి ఉంటాయి. ఉదాహరణకు, గ్రాండ్‌ జూరీ పనిలో జూరీ సభ్యులు సాక్ష్యాధారం ఒక వ్యక్తి విచారణకు తీసుకురాబడడం సరైనదా కాదా అనేది నిర్ణయిస్తారు; వారు అపరాధాన్ని నిశ్చయించరు. సాధారణ విచారణ మాటేమిటి? ఒక పౌర సంబంధమైన కేసులో, జూరీ నష్టాలను లేక నష్టపరిహారాన్ని విధిస్తుండవచ్చు. నేరసంబంధ కేసులో, సాక్ష్యాధారం అపరాధ తీర్పుకు మద్దతునిస్తుందా లేదా అని వారు నిశ్చయించాలి. చట్టం నిర్ణయించిన ఏ శిక్షను అమలుపర్చాలనే విషయాన్ని కొన్నిసార్లు వారు సిఫారసు చేస్తారు. అప్పుడు, “చెడు కార్యములు చేయువారిపై ఉగ్రతను వ్యక్తపర్చడానికి” లేక “దుర్మార్గులకు ప్రతిదండన” చేయడానికి తనకున్న అధికారాన్ని ప్రభుత్వం ఉపయోగిస్తుంది.—1 పేతురు 2:14.

ఫలానా జూరీ సభ్యులుగా పని చేయడానికి ఒక క్రైస్తవుడిని అతని మనస్సాక్షి అనుమతించనట్లు భావిస్తే అప్పుడేమిటి? బైబిలు జూరీ పని గురించి చెప్పడం లేదు గనుక అతడు ‘జూరీ పని చేయడం నా మతానికి వ్యతిరేకమైనది’ అని చెప్పలేడు. కేసును బట్టి, ఫలాన కేసులో జూరీగా పని చేయడం తన వ్యక్తిగత మనస్సాక్షికి వ్యతిరేకమైనదని అతడు చెప్పవచ్చు. అది లైంగిక దుర్నీతి, గర్భస్రావం, హత్య, లేక లౌకిక చట్టం ద్వారా కాకుండా బైబిలు జ్ఞానం ద్వారా తర్ఫీదు పొందిన అతని ఆలోచనా విధానానికి సంబంధించిన మరో విషయం ఇమిడి ఉంటే అలా చేయవచ్చు. అయితే, వాస్తవానికి అతడు ఏ విచారణ కొరకు ఎంపిక చేసుకోబడతాడో అందులో అలాంటి విషయాలు లేకపోయే సాధ్యత ఉంది.

న్యాయమూర్తులు తీర్చే తీర్పుకు తాను కూడా ఏదైనా బాధ్యత వహించవలసి ఉంటుందా అని కూడా పరిణతి చెందిన ఒక క్రైస్తవుడు ఆలోచించాలి. (ఆదికాండము 39:17-20; 1 తిమోతి 5:22 పోల్చండి.) అపరాధ తీర్మానం లోపం గలదైవుండి, మరణశిక్ష విధింపబడితే, ఆ జూరీలో సభ్యునిగావున్న క్రైస్తవుడు రక్తాపరాధి అవుతాడా? (నిర్గమకాండము 22:2; ద్వితీయోపదేశకాండము 21:8; 22:8; యిర్మీయా 2:34; మత్తయి 23:35; అపొస్తలుల కార్యములు 18:6) యేసు విచారణ సమయంలో పిలాతు ‘ఆయన రక్తమునుగూర్చి తాను నిరపరాధిగా’ ఉండాలని కోరుకున్నాడు. యూదులు వెంటనే, “వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనిరి.”—మత్తయి 27:24, 25.

ఒక క్రైస్తవుడు ప్రభుత్వం నిర్దేశించినట్లుగా, జూరీ పని కొరకు హాజరైతే, ఫలానా కేసు విషయంలో న్యాయమూర్తి ఒత్తిడి చేసినప్పటికీ, ఆ కేసులో జూరీగా పని చేయడానికి తన వ్యక్తిగత మనస్సాక్షి నిరాకరిస్తుంటే, ఆ క్రైస్తవుడు పర్యవసానాలను ఎదుర్కోవడానికి అది ఒకవేళ జుర్మానా అయినా లేక జైలు శిక్ష అయినా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.—1 పేతురు 2:19.

తుది విశ్లేషణలో, జూరీ పని మీద ఉన్న ప్రతి క్రైస్తవుడు బైబిలు గురించి తనకున్న అవగాహనను, తన స్వంత మనస్సాక్షిని ఆధారం చేసుకుని, ఏ విధానాన్ని అనుసరించాలనేది నిశ్చయించుకోవాలి. కొంతమంది క్రైస్తవులు జూరీ పని కొరకు హాజరై, కొన్ని జూరీలలో సేవచేశారు. కొందరు శిక్షను పొందవలసి వచ్చినప్పటికీ నిరాకరించడానికి ఇష్టపడ్డారు. తాను ఏమి చేస్తాడనేది ప్రతి క్రైస్తవుడు తనకై తాను నిర్ణయించుకోవాలి, ఆయన నిర్ణయాన్ని ఇతరులు విమర్శించకూడదు.—గలతీయులు 6:5.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి