వారు యెహోవా చిత్తాన్ని చేశారు
మెస్సీయగా రాజుగా యేసు స్తుతించబడ్డాడు!
సా.శ. 33, నీసాన్ 9న కేకలు వేస్తూ యెరూషలేములోకి ప్రవేశించిన జనసమూహము యూదయ దేశస్థులను అనేకులను ఆశ్చర్యపరచింది. పస్కాకు ముందు ప్రజలు నగరంలోనికి తండోపతండాలుగా వస్తూ కనిపించడం అసాధారణం కాదు, అయితే ఈ సందర్శకులు భిన్నమైనవారు. వారిలో ప్రముఖుడెవరంటే గాడిద పిల్లపై కూర్చుని సవారీ చేస్తున్న మనిషే. ఆ మనిషి యేసుక్రీస్తు, ప్రజలు వస్త్రాలను ఖర్జూరపు మట్టలను ఆయన ముందు పరచి, “దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము” అని కేకలు వేశారు. అప్పటికే యెరూషలేములో ఉన్న చాలా మంది ఆ జనసమూహాన్ని చూసి ఆ ఊరేగింపులో చేరేందుకు పురికొల్పబడ్డారు.—మత్తయి 21:7-9; యోహాను 12:12, 13.
తను అప్పుడు స్తుతించబడుతున్నప్పటికీ, శోధనలు తనను వేచివున్నాయని యేసు ఎరిగివున్నాడు. అవును మరి, కేవలం ఐదు రోజుల్లోనే అదే నగరంలో ఆయనకు మరణశిక్ష విధించబడనున్నది! అవును, అది శత్రువుల ప్రదేశమని యేసుకు తెలుసు, ఆయన దానిని మనస్సులో ఉంచుకునే ఆ నగరంలోకి స్పష్టంగా కనిపించేలా బహిరంగంగా ప్రవేశించాడు.
పురాతన ప్రవచనం నెరవేరింది
యేసు యెరూషలేములోకి విజయోత్సవంతో ప్రవేశించడాన్ని గూర్చి జెకర్యా సా.శ.పూ. 518లో ముందుగానే చెప్పాడు. ఆయనిలా వ్రాశాడు: “సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. . . . సమాధానవార్త అన్యజనులకు తెలియజేయును, సముద్రము నుండి సముద్రము వరకు యూఫ్రటీసునది మొదలుకొని భూదింగతముల వరకు అతడు ఏలును.”—జెకర్యా 9:9, 10.
కనుక నీసాన్ 9న యెరూషలేములోకి యేసు ప్రవేశించడం బైబిలు ప్రవచనాన్ని నెరవేర్చింది. అది అనుకోని సంఘటన కాదుగానీ, అది చాలా జాగ్రత్తగా పథకం వేయబడిన సంఘటన. ముందుగానే, యెరూషలేముకు వెలుపల ఉన్నప్పుడే, “మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; వెళ్లగానే కట్టబడియున్న యొక గాడిదయు దానితోనున్న యొక గాడిదపిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నాయొద్దకు తోలుకొని రండి; ఎవడైనను మీతో ఏమైనను అనిన యెడల—అవి ప్రభువునకు కావలసియున్నవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని” యేసు తన శిష్యులలో ఇద్దరికి నిర్దేశించాడు. (మత్తయి 21:1-3) కానీ యేసు యెరూషలేములోకి గాడిద మీద ఎందుకు సవారీ చేశాడు, జనసమూహముల ప్రతిక్రియకు అర్థం ఏమిటి?
రాజరికాన్ని గూర్చిన ముఖ్య సందేశం
పలికే మాటకన్నా దృశ్య దర్శనం తరచూ మరింత శక్తివంతంగా ఉంటుంది. కనుక తమ ప్రవచనాత్మక సందేశాన్ని బలపర్చేందుకు యెహోవా తరచూ తన ప్రవక్తలచే తమ సందేశాన్ని ప్రదర్శింపజేసేవాడు. (1 రాజులు 11:29-32; యిర్మీయా 27:1-6; యెహెజ్కేలు 4:1-17) ఈ ఉన్నతమైన దృశ్య సందేశం చూపరులలో ఎంతో కఠినహృదయులైన వారి మనస్సుపై కూడా చెరగని ముద్ర వేసేది. అదే విధంగా, యేసు యెరూషలేము నగరంలోనికి గాడిద మీద సవారీ చేసి ఆ శక్తివంతమైన సందేశాన్ని ప్రదర్శించాడు. ఎలా?
బైబిలు కాలాల్లో గొప్ప ఉద్దేశాల కొరకు గాడిద ఉపయోగించబడేది. ఉదాహరణకు, సొలొమోను తన అభిషేకానికి తన తండ్రి యొక్క మగ గాడిద యొక్క సంకరజాతియైన ‘ఆడ కంచరగాడిద’ పై సవారీ చేశాడు. (1 రాజులు 1:33-40) యేసు యెరూషలేములోనికి గాడిద మీద సవారీ చేయడమంటే తనను ఒక రాజుగా కనబరచుకున్నాడని అర్థం.a జనసమూహముల క్రియలు ఆ సందేశాన్ని బలపరచాయి. నిస్సందేహంగా ఆ జనసమూహంలో ఎక్కువ మంది గలీలయులే. వారు యేసు ఎదుట తమ వస్త్రములను పరిచారు—అది యెహూ రాజరికాన్ని గూర్చిన బహిరంగ ప్రకటనను స్మరింపజేసే సూచనగా ఉంది. (2 రాజులు 9:13) “దావీదు కుమారుడు” అని వారు యేసును గూర్చి చెప్పడం పరిపాలించే ఆయన చట్టబద్ధమైన హక్కును వక్కాణించి చెబుతుంది. (లూకా 1:31-33) వారు ఖర్జూరపు మట్టలను ఉపయోగించడం ఆయన రాజరిక అధికారం ఎడల వారి విధేయతను స్పష్టంగా చూపిస్తుంది.—ప్రకటన 7:9, 10 పోల్చండి.
కనుక నీసాను 9న యెరూషలేములోకి వచ్చిన ఊరేగింపు యేసు దేవుడు అభిషేకించిన మెస్సీయ మరియు రాజు అన్న సందేశాన్ని స్పష్టంగా తెలియజేసింది. నిజమే, యేసు ఈ విధంగా కనబరచుకోవడం వల్ల అందరూ సంతోషించలేదు. యేసుకు అలాంటి రాజరిక గౌరవాన్ని చూపడం ఎంతో అనుచితమని ముఖ్యంగా పరిసయ్యులు తలంచారు. “బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని” వారు క్రోధ స్వరంతో ఆయనతో చెప్పారన్న విషయంలో సందేహం లేదు. ‘వీరు ఊరకుండినయెడల ఈ రాళ్లు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను’ అని యేసు బదులిచ్చాడు. (లూకా 19:39, 40) అవును, దేవుని రాజ్యం యేసు ప్రకటనా విషయంగా ఉండినది. ప్రజలు దానిని అంగీకరించినా లేకపోయినా ఆయన ధైర్యంగా ప్రకటించేవాడు.
మనకు పాఠం
జెకర్యా ప్రవక్త ముందుగా చెప్పిన రీతిలో యెరూషలేములోనికి ప్రవేశించేందుకు యేసుకు ఎంతో ధైర్యం అవసరమై ఉండింది. తాను అలా చేయడం వలన శత్రువులకు తన ఎడల క్రోధం కలుగుతుందని ఆయనకు తెలుసు. దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలని, ‘సమస్త జనులను శిష్యులనుగా చేయాలనే’ ఆదేశాన్ని యేసు తన అనుచరులకు తాను పరలోకానికి ఆరోహణం కాక ముందు ఇచ్చాడు. (మత్తయి 24:14; 28:19, 20) ఈ పనిని పూర్తి చేసేందుకు కూడా ధైర్యం అవసరం. ఆ సందేశాన్ని వినడంలో అందరూ సంతోషించరు. కొందరు దాన్ని వ్యతిరేకిస్తుండగా మరి కొందరు దాని ఎడల ఉదాసీనతను చూపిస్తారు. కొన్ని ప్రభుత్వాలు ప్రకటనా పనిపై ప్రతిబంధకాలు పెట్టడమో లేక దాన్ని పూర్తిగా నిషేధించడమో చేశాయి.
అయినప్పటికీ, ప్రజలు విన్నా వినకున్నా స్థాపించబడిన దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్త ప్రకటించబడాలని యెహోవాసాక్షులు గుర్తిస్తారు. (యెహెజ్కేలు 2:7) జీవాన్ని కాపాడే ఈ పనిని చేయడంలో వారు కొనసాగుతుండగా, ‘ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానన్న’ యేసు వాగ్దానం వారికి మళ్ళీ నిశ్చయాన్నిస్తుంది.—మత్తయి 28:20.
[అధస్సూచీలు]
a ఆ గాడిద పిల్లపై “ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు” అన్న సమాచారాన్ని మార్కు వృత్తాంతం జతచేస్తుంది. (మార్కు 11:2) ఇంతవరకూ ఉపయోగించని జంతువు ప్రత్యేకంగా పవిత్ర సంకల్పాల కొరకు చాలా యోగ్యమైనదన్న విషయం స్పష్టమే.—సంఖ్యాకాండము 19:2; ద్వితీయోపదేశకాండము 21:3; 1 సమూయేలు 6:7, పోల్చండి.