ఎవరు అధికారంలో ఉన్నారు?
“లోకాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు?” ఎవరైనా మిమ్మల్ని ఆ ప్రశ్న అడిగితే మీరేమని బదులిస్తారు? “దేవుడు” లేక “యేసు” అని మతవిశ్వాసులైన చాలా మంది ప్రజలు చెప్పవచ్చు. బహమాస్ వార్తాపత్రికయైన ది ఫ్రీపోర్ట్ న్యూస్‌లోని ఒక శీర్షిక ఎవరూ ఎదురు చూడని జవాబును ఇచ్చింది.
ఆ శీర్షిక విలేఖరి “మా గడప దగ్గర ఒక కరపత్రం పడి ఉండడం చూశాను” అని మొదలుపెట్టి, “సాధారణంగా అలా పడివున్న దేనినీ పట్టించుకునేదాన్ని కాను, కాని ఈసారి దానిని చదవాలని తీర్మానించుకున్నాను. ‘ఆ శీర్షిక లోకాన్ని నిజంగా ఎవరు పరిపాలిస్తున్నారు?’ అనే ప్రశ్నను వేసింది” అని ఆమె వ్రాసింది. ఆ స్త్రీ బైబిలు ఆధారితమైన ఆ కరపత్రాన్ని చదవడం వల్ల ఈ లోకాన్ని పరిపాలిస్తున్నది దేవుడు కానీ యేసు కానీ కాదని అది అపవాదియైన సాతానే అని తెలుసుకుంది.—యోహాను 12:31; 14:30; 16:11; 1 యోహాను 5:19.
“రాక్షసత్వంలోని విపరీత క్రూరత్వాన్ని పరిశీలించండి. మానవులు నిర్దాక్షిణ్యంగా ఒకరినొకరు హింసించుకొని చంపుకోవడానికి, గ్యాస్ చాంబర్లు, కాన్‌సన్‌ట్రేషన్ క్యాంపులు, జ్వాలా ప్రక్షేపణములు, నాపామ్‌బాంబులు, ఇతర భయంకర పద్ధతులను ఉపయోగించారు. . . . అలాంటి అసహ్యమైన కార్యాలకు లేక పాశవిక చర్యలకు పాల్పడు పరిస్థితులకు మనుష్యులను ఏ శక్తులు నడిపిస్తున్నాయి? ఏదో అదృశ్య, దుష్టశక్తి ప్రజలను యిలాంటి దౌర్జన్యపూరిత కార్యాలను చేయడానికి వారిని ప్రభావితం చేస్తున్నదేమోనని మీరెప్పుడన్నా అనుకున్నారా?” అని ఆ కరపత్రం వివరిస్తుంది. బైబిలు సాతానును “ఈ యుగ సంబంధమైన దేవత” అని పిలవడం ఆశ్చర్యపరిచేదిగా ఉందా?—2 కొరింథీయులు 4:4.
సంతోషకరంగా, సాతాను అతని దయ్యములు ఇకెన్నటికీ ఉండని సమయం ఆసన్నమైంది. “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవిగాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.” (1 యోహాను 2:17) అవును, దేవుని చిత్తాన్ని చేసేవారికి నీతియుక్తమైన క్రొత్త లోకంలో నిరంతరం జీవించే అపేక్ష ఉంటుంది అని బైబిలు వాగ్దానం చేస్తోంది. (కీర్తన 37:9-11; 2 పేతురు 3:13; ప్రకటన 21:3, 4) సాతాను మరియు వాని దయ్యాల హానికరమైన ప్రభావం తీసివేయబడితే ఎంత ఉపశమనంగా ఉంటుందో!
ది ఫ్రీపోర్ట్ న్యూస్ విలేఖరి ఈ కరపత్రంలోని సమాచారాన్ని సంగ్రహంగా చెప్పిన తర్వాత, “నేను ఈ కరపత్రాన్ని చదివినందుకు నిజంగా సంతోషిస్తున్నాను . . . ఎందుకంటే, లోక పరిస్థితిని గూర్చి, అది ఎవరి అధికారంలో ఉంది అనే విషయాన్ని గూర్చి నేను కూడా చింతించేదాన్ని” అని అంటూ ఆ శీర్షికను ముగించింది.