వారు యెహోవా చిత్తాన్ని చేశారు
దానియేలు దేవున్ని నిత్యము సేవించాడు
ఒక రాత్రిలోనే చరిత్ర గమనం మారిపోవడం చాలా అరుదుగా జరుగుతుంది. అయినప్పటికీ, సా. శ. పూ. 539లో మాదీయులు మరియు పారసీకులు బబులోను సామ్రాజ్యాన్ని కేవలం కొన్ని గంటల్లో కూలదోసినప్పుడు అదే జరిగింది. ఆ సంవత్సరానికల్లా, యెహోవా ప్రవక్తయైన దానియేలు చెరబట్టబడి బబులోనుకు తీసుకురాబడిన బందీగా దాదాపు 80 ఏళ్లుగా జీవిస్తున్నాడు. బహుశ తన 90వ పడిలో ఉన్న దానియేలు, దేవుని ఎడల తనకుగల యథార్థతకు అత్యంత గొప్ప పరీక్షను ఎదుర్కొనబోతున్నాడు.
బబులోను నాశనమైన తర్వాత, దానియేలుకు తొలుత సంగతులు సాఫీగానే గడిచాయి. క్రొత్త రాజు మాదీయుడైన దర్యావేషు 62 ఏండ్ల ప్రాయంగలవాడు, అతను దానియేలు ఎడల ఎంతో అభిమానం చూపాడు. రాజుగా దర్యావేషు తీసుకున్న చర్యల్లో మొదటిది 120 మంది సెట్రపులను నియమించి, వారిలో ముగ్గురిని ఉన్నత అధికారుల స్థాయిలో నియమించడమే.a అలా అభిమానం పొందిన ముగ్గురు మనుష్యుల్లో దానియేలు ఒకడు. దానియేలు యొక్క విశిష్టమైన సామర్థ్యాన్ని గుర్తించిన వాడై, దర్యావేషు ఆయనను ప్రధానమంత్రి స్థానానికి హెచ్చించాలని కూడా తీర్మానించుకున్నాడు. అయితే అప్పుడే, రాజు పథకాలను హఠాత్తుగా మార్చేది ఏదో సంభవించింది.
ఓ మోసకరమైన పథకం
దానియేలు యొక్క తోటి ఉన్నత అధికారులు, వారితోపాటు సెట్రపుల పెద్ద గుంపు ఒక ఆసక్తికరమైన ఉపాయంతో రాజును సమీపించారు. “ముప్పది దినములవరకు నీయొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవునియొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు; ఎవడైనను చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును” అని శాసించే ఒక నియమాన్ని స్థాపించమని వారు దర్యావేషును వేడుకున్నారు. (దానియేలు 6:7) ఈ మనుష్యులు తన ఎడల వారి యథార్థతను వ్యక్తం చేస్తున్నారని దర్యావేషుకు అనిపించి ఉండవచ్చు. రాజ్యాధికారిగా తన స్థానాన్ని పటిష్ఠపర్చుకునేందుకు ఒక విదేశీయుడైన తనకు ఈ నియమం సహాయపడుతుందని కూడా అతను తలంచి ఉండవచ్చు.
అయితే, ఉన్నత అధికారులు మరియు సెట్రపులు ఈ నియమాన్ని రాజు శ్రేయస్సు కొరకు స్థాపించమని అడుగలేదు. వారు “రాజ్య పాలన విషయములో దానియేలుమీద ఏదైన ఒక నింద మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్థుడై యే నేరమైనను ఏ తప్పయినను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పయినను లోపమైనను కనుగొనలేకపోయిరి.” కాబట్టి ఈ మోసకరమైన మనుష్యులు ఇలా అభిప్రాయపడ్డారు: “అతని దేవుని పద్ధతి విషయమందేగాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొన”లేము. (దానియేలు 6:4, 5) దానియేలు యెహోవాకు అనుదినం ప్రార్థన చేస్తాడనే విషయం తెలిసిన వారై, వారు దాన్ని రాజకీయ నేరంగా చేయాలని ప్రయత్నించారు.
“దానియేలు అతిశ్రేష్ఠమైన బుద్ధిగలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతినొందియుండెను గనుక రాజ్యమంతటిమీద అతని నియమింపవలెనని రాజుద్దేశించెను” గనుక బహుశ ఉన్నత అధికారులు మరియు సెట్రపులు దానియేలు ఎడల విముఖతను ఏర్పరచుకుని ఉంటారు. (దానియేలు 6:3) అవినీతి మరియు లంచగొండి తనాన్ని కొనసాగించేందుకు వారికి దానియేలు యొక్క యథార్థత ఆటంకంగా ఉంటుండవచ్చు. సంగతేదైనప్పటికీ, అది “మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు పద్ధతి ననుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు” దానిపై సంతకం చేసేందుకు వారు రాజును ఒప్పించారు.—దానియేలు 6:8, 9.
దానియేలు స్థిరంగా ఉన్నాడు
క్రొత్త శాసనం గురించి విన్న తర్వాత దానియేలు యెహోవాకు ప్రార్థించడం ఆపేశాడా? ఎంత మాత్రం ఆపలేదు! తన ఇంట్లోని మేడ గదిలో మోకాళ్లూని, “యథాప్రకారముగా అనుదినము” దేవునికి మూడుసార్లు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. (దానియేలు 6:10) ఆయన ప్రార్థిస్తుండగా, ఆయన శత్రువులు “గుంపుకూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థనచేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు” చూశారు. (దానియేలు 6:11) వారు ఆ విషయాన్ని రాజు అవధానానికి తెచ్చినప్పుడు, తాను సంతకం చేసిన నియమం దానియేలును చిక్కుల్లో పెడుతుందని దర్యావేషు వ్యాకులపడ్డాడు. “సూర్యుడస్తమించువరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేసెను” అని ఆ వృత్తాంతం మనకు చెబుతుంది. అయితే రాజు కూడా తాను స్థిరపర్చిన శాసనాన్ని ఉల్లంఘించకూడదు. కాబట్టి దానియేలును సింహపు గుహ వద్దకు తీసుకు వెళ్లారు, బహుశ అది ఒక లోతైన లేక భూగర్భ స్థలమైయ్యుండవచ్చు. “నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని” అంటూ రాజు దానియేలుకు అభయమిచ్చాడు.—దానియేలు 6:12-16.
నిద్ర లేని రాత్రి మరియు ఉపవాసం తర్వాత, దర్యావేషు గుహ వద్దకు త్వరపడిపోయాడు. దానియేలు సజీవంగా, ఎలాంటి హాని కలుగకుండా ఉన్నాడు! రాజు వెనువెంటనే ప్రతిస్పందించాడు. తగిన శాస్తిగా దానియేలు శత్రువులు మరియు వారి కుటుంబాలు సింహపు గుహలో పడవేయబడాలని అతను ఆజ్ఞాపించాడు. “నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను” అని కూడా దర్యావేషు తన రాజ్యమంతటిలో తెలియజేశాడు.—దానియేలు 6:17-27.
మనకు పాఠం
దానియేలు నమ్మకత్వానికి చక్కని ఉదాహరణగా ఉన్నాడు. యెహోవాను ఆరాధించని రాజు కూడా దానియేలు ఆయనను “నిత్యము” సేవిస్తుండేవాడని గమనించాడు. (దానియేలు 6:16, 20) “నిత్యము” అని అనువదింపబడిన అరామిక్ మూలపదం సాధారణంగా “ఒక వలయంలో తిరగడం” అనే అర్థాన్నిస్తుంది. అది ఎడతెగక కొనసాగుటను సూచిస్తుంది. యెహోవా ఎడల దానియేలుకున్న ఎడతెగని యథార్థతను అది ఎంత చక్కగా వర్ణిస్తుందో కదా!
దానియేలు అలా నిత్యము సేవించే దృక్పథాన్ని సింహపు గుహలో పడవేయబడిన దానికి ఎంతో ముందునుండే అలవరచుకున్నాడు. బబులోనులో ఒక యౌవన బందీగా ఉంటూ, మోషే ధర్మశాస్త్రం ద్వారా నిషేధించబడిన లేక అన్య ఆచారాల ద్వారా కలుషితం చేయబడిన ఆహారాన్ని లేక పానీయాన్ని తీసుకునేందుకు దానియేలు నిరాకరించాడు. (దానియేలు 1:8) తర్వాత, ఆయన బబులోను రాజైన నెబుకద్నెజరుకు దేవుని వర్తమానాన్ని ధైర్యంగా ప్రకటించాడు. (దానియేలు 4:19-25) బబులోను నాశనమయ్యేందుకు కేవలం కొన్ని గంటల ముందు దానియేలు దేవుని వర్తమానాన్ని రాజైన బెల్షస్సరుకు నిర్భయంగా ప్రకటించాడు. (దానియేలు 5:22-28) కాబట్టి దానియేలు సింహపు గుహను ఎదుర్కొన్నప్పుడు తాను అలవర్చుకున్న యథార్థమైన మార్గంలో ఆయన కొనసాగాడు.
మీరు కూడా యెహోవాను నిత్యము సేవించగలరు. మీరు ఒక యౌవన వ్యక్తియై ఉన్నారా? ఈ లోకపు చెడు సహవాసాన్ని మరియు అవినీతికరమైన ప్రవర్తనను నిరాకరించడం ద్వారా నిత్యము సేవించే దృక్పథాన్ని అలవరచుకునేందుకు ఇప్పుడే చర్య తీసుకోండి. మీరు దేవున్ని కొంతకాలంగా సేవిస్తున్నట్లయితే, నమ్మకంతో కూడిన దృక్పథాన్ని కలిగివుండండి. మనం ఎదుర్కొనే ప్రతి శ్రమ మనం యెహోవాను నిత్యము సేవించాలని తీర్మానించుకున్నామని ఆయనకు చూపే అవకాశాన్ని మనకిస్తుంది గనుక ఎన్నడూ అధైర్యపడకండి.—ఫిలిప్పీయులు 4:11-13.
[అధస్సూచీలు]
a “సెట్రప్” (అక్షరార్థంగా “రాజ్యాన్ని కాపాడేవాడు” అని అర్థం) అనే పదం ఒక జిల్లాపై ముఖ్య పరిపాలకునిగా సేవ చేసేందుకు పర్షియా రాజు నియమించిన గవర్నరును సూచిస్తుంది. రాజు యొక్క అధికారిక ప్రతినిధిగా, పన్నులను వసూలు చేసి రాజుగారి సభకు సుంకాన్ని చెల్లించే బాధ్యత అతనికి ఉంటుంది.