కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 11/15 పేజీలు 5-7
  • ఉపవాసం ఉండాలని దేవుడు కోరుతున్నాడా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఉపవాసం ఉండాలని దేవుడు కోరుతున్నాడా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రైస్తవులు ఉపవాసం ఉండాలా?
  • లెంట్‌ సంగతేమిటి?
  • ఉపవాసం ప్రయోజనకరంగా ఉండగల సమయం
  • ఉపవాసం దేవునికి దగ్గరవడానికి సహాయం చేస్తుందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • ఉపవాసం గురించి బైబిలు ఏమి చెప్తుంది?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపవాసానికి కాలం చెల్లిందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపవాసమును గూర్చి ప్రశ్నింపబడుట
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 11/15 పేజీలు 5-7

ఉపవాసం ఉండాలని దేవుడు కోరుతున్నాడా?

మోషే ద్వారా ఇవ్వబడిన దేవుని ధర్మశాస్త్రం కేవలం ఒక సందర్భంలోనే ఉపవాసం ఉండాలని కోరింది, అదే సాంవత్సరిక ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినాన ఇశ్రాయేలీయులు ‘దుఃఖపడాలని’ ధర్మశాస్త్రం ఆజ్ఞాపించింది, దాని భావం వారు ఉపవాసం ఉన్నారని అర్థం చేసుకోబడుతుంది. (లేవీయకాండము 16:29-31; 23:27; కీర్తన 35:13) అయితే, ఇలా ఉపవాసం ఉండటం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. ప్రాయశ్చిత్తార్థ దినాన్ని ఆచరించడం, ఇశ్రాయేలీయులు తమ పాపస్థితిని బాగా తెలుసుకునేందుకు మరియు విడుదల పొందవలసిన తమ అవసరతను జ్ఞాపకం చేసుకునేందుకు వారిని పురికొల్పింది. తమ పాపాల విషయమై దుఃఖాన్ని వ్యక్తం చేసేందుకు మరియు దేవుని ఎదుట పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసేందుకు కూడా వారు ఆ దినాన ఉపవాసం చేసేవారు.

మోషే ధర్మశాస్త్రం ప్రకారం తప్పనిసరిగా ఉపవాసం ఉండవలసినది ఇది ఒక్కటే అయినప్పటికీ, ఇశ్రాయేలీయులు ఇతర సందర్భాల్లో కూడా ఉపవాసం ఉన్నారు. (నిర్గమకాండము 34:28; 1 సమూయేలు 7:6; 2 దినవృత్తాంతములు 20:3; ఎజ్రా 8:21; ఎస్తేరు 4:3, 16) పశ్చాత్తాపాన్ని ప్రదర్శించేందుకు ఇష్టపూర్వకంగా ఉపవాసం చేయడం కూడా ఇందులో ఇమిడివుంది. యూదాలోని తప్పిదస్థులను యెహోవా ఇలా పురికొల్పాడు: “మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి.” అది పైకి కన్పించేందుకు మాత్రం కాదు, ఎందుకంటే దేవుడు ఇలా చెబుతున్నాడు: “మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపు”కొనుడి.—యోవేలు 2:12-15.

తుదకు, అనేకులు ఉపవాసం ఉండటాన్ని పైకి కన్పించే ఆచారంగా చేశారు. అలా యథార్థత లేకుండా ఉపవాసం చేయడాన్ని యెహోవా అసహ్యించుకున్నాడు, అందుకే వేషధారులైన ఇశ్రాయేలీయులను ఇలా అడిగాడు: “అట్టి ఉపవాసము నాకనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదె పరచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరనుకొందురా?” (యెషయా 58:5) అలా పైకి కన్పించేలా ఉపవాసం ఉండే బదులు, పశ్చాత్తాపానికి తగిన పనులను చేయమని దారి తప్పిన ఈ ప్రజలను అడగటం జరిగింది.

యూదులు స్థాపించిన కొన్ని ఉపవాసాలు మొదటినుండి కూడా దేవుని అనంగీకారానికి గురయ్యాయి. ఉదాహరణకు, ఒకప్పుడు యూదాలోని ప్రజలకు, యెరూషలేము చెరపట్టబడటానికి మరియు సా. శ. పూ. ఏడవ శతాబ్దంలో నాశనమవ్వడానికి సంబంధించిన విపత్కరమైన సంఘటనల స్మారకంగా నాలుగు వార్షిక ఉపవాసాలు ఉండేవి. (2 రాజులు 25:1-4, 8, 9, 22-26; జెకర్యా 8:19) యూదులు బబులోను చెర నుండి విడుదల చేయబడిన తర్వాత, ప్రవక్తయైన జెకర్యా ద్వారా యెహోవా ఇలా అడిగాడు: “ఈ జరిగిన డెబ్బది సంవత్సరములు ఏటేట . . . మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు, నాయందు భక్తికలిగియే ఉపవాసముంటిరా?” యెహోవా నుండి వచ్చిన తీర్పుల విషయమై వారు ఉపవాసం ఉంటూ, రోధిస్తున్నారు గనుక దేవుడు ఈ ఉపవాసాలను అంగీకరించలేదు. వారు తమకు వచ్చిన విపత్తు విషయమై ఉపవాసం చేశారు గానీ దానికి నడిపిన తమ స్వంత తప్పిదం విషయమై కాదు. వారు తమ స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, తమ గతాన్ని గురించి దుఃఖించే బదులు వారు ఆనందించవలసిన సమయమది.—జెకర్యా 7:5.

క్రైస్తవులు ఉపవాసం ఉండాలా?

తన శిష్యులు ఉపవాసం ఉండాలని యేసు ఎన్నడూ ఆజ్ఞాపించకపోయినప్పటికీ ఆయన, ఆయన శిష్యులు మోషే ధర్మశాస్త్రం క్రిందనున్నారు గనుక వారు ప్రాయశ్చిత్తార్థ దినాన ఉపవాసం ఉన్నారు. దానికి తోడు, ఆ ఆచారాన్ని మొత్తానికి మానేయాలని యేసు వారికి చెప్పలేదు గనుక ఆయన శిష్యుల్లో కొందరు ఇతర సందర్భాల్లో ఇష్టపూర్వకంగా ఉపవాసం ఉన్నారు. (అపొస్తలుల కార్యములు 13:2, 3; 14:23) అయినప్పటికీ, వారు ‘ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని తమ ముఖములను వికారము చేసికొనకూడదు.’ (మత్తయి 6:16) అలా భక్తిని బాహ్యంగా ప్రదర్శించడం ఇతర మానవులనుండి పొగడ్తలతో కూడిన చూపులను మరియు అంగీకార వ్యక్తీకరణలను తీసుకురావచ్చు. అయినప్పటికీ, దేవుడు అలాంటి డంబములనుబట్టి ప్రీతిచెందడు.—మత్తయి 6:17, 18.

తన మరణం సమయంలో తన అనుచరులు ఉపవాసం ఉంటారని కూడా యేసు అన్నాడు. అలాగని చెప్పి ఆయన ఆచారబద్ధమైన ఉపవాసాన్ని స్థాపించడం లేదు. బదులుగా, వారు అనుభవించే మిక్కుటమైన దుఃఖానికి ఒక ప్రతిస్పందనను ఆయన సూచిస్తూ ఉన్నాడు. ఆయన పునరుత్థానం చేయబడిన తర్వాత, ఆయన మళ్లీ వారితోపాటూ ఉంటాడు, మరి వారు అలా ఉపవాసం ఉండేందుకు అటువంటి కారణం ఇక ఎంతమాత్రం ఉండదు.—లూకా 5:34, 35.

‘క్రీస్తు అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి’నప్పుడు మోషే ధర్మశాస్త్రం అంతమయ్యింది. (హెబ్రీయులు 9:24-28) ధర్మశాస్త్రం అంతం కావడంతో, ప్రాయశ్చిత్తార్థ దినాన ఉపవాసం చేయాలన్న ఆజ్ఞ కూడా అంతమయ్యింది. అలా, తప్పనిసరిగా ఉపవాసం ఉండాలని బైబిలులో ప్రస్తావించబడిన ఒకే ఒక సందర్భం కూడా తీసివేయబడింది.

లెంట్‌ సంగతేమిటి?

లెంట్‌ సమయంలో ఉపవాసం ఉండాలనే క్రైస్తవ మత సామ్రాజ్యం యొక్క ఆచారానికిగల ఆధారం ఏమిటి? దాన్ని ఆచరించే పద్ధతిలో చర్చికి చర్చికి తేడా ఉన్నా, కాథోలిక్‌లు మరియు ప్రొటెస్టెంటులు దాన్ని ఆచరిస్తారు. ఈస్టరుకు ముందుండే 40 దినాల కాలమంతటిలో కొందరు దినంలో కేవలం ఒక్కసారే తింటారు. ఇతరులు భస్మ బుధవారం మరియు మంచి శుక్రవారం మాత్రమే పూర్తిగా ఉపవాసం ఉంటారు. మరి కొందరికైతే, లెంట్‌ అంటే మాంసాన్ని, చేపలను గ్రుడ్లను మరియు పాలతో తయారు చేయబడిన వాటిని తినకుండా ఉంటారు.

యేసు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన 40 దినాలు ఉపవాసం ఉండటంపై లెంట్‌ ఆధారపడి ఉందని చెప్పబడుతోంది. ప్రతి సంవత్సరం అనుసరించవలసిన ఒక ఆచారాన్ని ఆయన అక్కడ స్థాపిస్తున్నాడా? ఎంత మాత్రం కాదు. తొలి క్రైస్తవులు అలాంటి ఆచారాన్ని కలిగివున్నట్లు బైబిలు ఎక్కడా నివేదించడం లేదనే వాస్తవాన్నిబట్టి ఈ విషయం స్పష్టమౌతుంది. లెంట్‌ మొదటిసారిగా క్రీస్తు శకం నాల్గవ శతాబ్దంలో ఆచరించబడింది. క్రైస్తవ మత సామ్రాజ్యం యొక్క ఇతర అనేక బోధల వలెనే, అది అన్య ఆచారాలనుండి తీసుకోబడింది.

లెంట్‌ అనేది యేసు తన బాప్తిస్మం తర్వాత అరణ్యంలో ఉపవాసం చేసిన దాన్ని అనుకరించి చేయబడేదైతే, ఆయన పునరుత్థాన సమయమని భావించబడే ఈస్టర్‌కు ముందు వారాల్లో అది ఎందుకు ఆచరించబడుతుంది? యేసు తన మరణానికి ముందు దినాల్లో ఉపవాసం చేయలేదు. ఆయన మరణానికి కేవలం కొన్ని దినాల ముందు ఆయన, ఆయన శిష్యులు బేతనియలో గృహాలను సందర్శించారని, భోజనం చేశారని సువార్త వృత్తాంతాలు సూచిస్తున్నాయి. ఆయన తన మరణానికి ముందు నాటి రాత్రి పస్కా భోజనం తిన్నాడు.—మత్తయి 26:6, 7; లూకా 22:15; యోహాను 12:2.

యేసు తన బాప్తిస్మం తర్వాత ఉపవాసం ఉండటం విషయంలో కొంత నేర్చుకోవలసినది ఉంది. ఆయన అత్యంత ఆవశ్యకమైన పరిచర్యను ప్రారంభించబోతున్నాడు. యెహోవా సర్వాధిపత్యం సరియైనదేనని నిరూపించబడడం మరియు యావత్‌ మానవాళి భవిష్యత్తు కూడా అందులో ఇమిడివున్నాయి. ఎంతగానో ధ్యానించేందుకు మరియు సహాయం, నడిపింపు కొరకు యెహోవా వైపు ప్రార్థనాపూర్వకంగా తిరిగేందుకు అది సమయమైవుంది. ఈ సమయంలో యేసు ఉపవాసం చేయడం ఎంతో సహేతుకం. సరైన ఉద్దేశముతో, తగిన సందర్భంలో ఉపవాసం ఉండటం చాలా ప్రయోజనకరంగా ఉండగలదని ఇది సూచిస్తుంది.—కొలొస్సయులు 2:20-23 పోల్చండి.

ఉపవాసం ప్రయోజనకరంగా ఉండగల సమయం

నేడు దేవుని ఆరాధికుడు ఉపవాసం చేయదగిన కొన్ని సందర్భాలను ఇప్పుడు పరిశీలించుదాం. పాపం చేసిన ఒక వ్యక్తికి కొంతకాలం వరకూ తిండితినాలని అనిపించకపోవచ్చు. ఇతరులను ప్రభావితం చేసేందుకు లేక ఇవ్వబడిన క్రమశిక్షణ ఎడల కోపంతో అలా చేయడం జరుగదు. మరి ఉపవాసం ఉండటమే దేవునితో సంగతులను చక్కదిద్దదు. అయితే, నిజంగా పశ్చాత్తాపం చెందిన వ్యక్తి యెహోవాకు మరియు బహుశ స్నేహితులకు, కుటుంబానికి బాధను కలిగించినందుకు మిక్కుటమైన దుఃఖాన్ని కలిగివుండవచ్చు. ఆవేదన మరియు క్షమాపణ కొరకైన ఎడతెగని ప్రార్థన ఆహారం కొరకైన కోరికను అణగార్చవచ్చు.

ఇశ్రాయేలు రాజైన దావీదుకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. బత్షెబ వలన తనకు కలిగిన కుమారున్ని తాను కోల్పోవలసి ఉందని ఆయనకు తెలిసినప్పుడు, ఆ బాలుని విషయంలో కనికరాన్ని పొందేందుకు ఆయన యెహోవాకు ప్రార్థించడంపై తన ప్రయత్నాలన్నింటినీ కేంద్రీకరించాడు. ఆయన తన భావోద్రేకాలను మరియు శక్తిని ప్రార్థనలో వెచ్చిస్తూ ఉపవాసం చేశాడు. అదే విధంగా, నేడు ఒత్తిడిగల కొన్ని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆహారం తీసుకోవాలని అనిపించకపోవచ్చు.—2 సమూయేలు 12:15-17.

దైవభక్తిగల ఒక వ్యక్తి కొన్ని లోతైన ఆత్మీయ సంగతులపై ధ్యానం ఉంచాలని అనుకునే సమయాలు కూడా ఉండవచ్చు. బైబిలు మరియు క్రైస్తవ ప్రచురణలలో పరిశోధన చేయడం అవసరం కావచ్చు. ధ్యానం కొరకు కొంత సమయం అవసరం కావచ్చు. పూర్తిగా లీనమయ్యే అలాంటి పఠన సమయంలో, ఒక వ్యక్తి ఆహారం తినడం ద్వారా పరధ్యానం చెందకూడదని నిర్ణయించుకోవచ్చు.—యిర్మీయా 36:8-10 పోల్చండి.

గంభీరమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉన్నప్పుడు దేవుని సేవకులు ఉపవాసం ఉండిన లేఖనాధార ఉదాహరణలు ఉన్నాయి. నెహెమ్యా దినాల్లో యెహోవాకు ఒక ప్రతిజ్ఞ చేయవలసి వచ్చింది, యూదులు ఒకవేళ దాన్ని ఉల్లంఘిస్తే వారు శాపాన్ని పొందే అవకాశం ఉంది. తమ విదేశీ భార్యలకు విడాకులు ఇస్తామని మరియు చుట్టు ప్రక్కలున్న జనాంగాలనుండి వేరుగా ఉంటామని వారు ప్రతిజ్ఞ చేయవలసి ఉండిరి. ఈ ప్రతిజ్ఞ చేయకముందు మరియు తమ తప్పిదాన్ని ఒప్పుకునేటప్పుడు పూర్తి సంఘమంతా ఉపవాసం చేసింది. (నెహెమ్యా 9:1, 38; 10:29, 30) ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు ఒక క్రైస్తవుడు కొంత పరిమిత వ్యవధి వరకు భోజనం లేకుండా ఉండవచ్చు.

తొలి క్రైస్తవ సంఘంలోని పెద్దల సభ నిర్ణయాలను తీసుకునేటప్పుడు కొన్నిసార్లు ఉపవాసం కూడా చేసింది. నేడు, బహుశ న్యాయ నిర్ణయ కేసులకు సంబంధించి క్లిష్టమైన నిర్ణయాలను తీసుకునే సంఘ పెద్దలు ఆ విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఆహారం తీసుకోకుండా ఉండవచ్చు.

కొన్ని పరిస్థితుల్లో ఉపవాసం ఉండాలని నిర్ణయించుకోవడం అనేది వ్యక్తిగతమైన విషయం. ఈ విషయంలో ఒక వ్యక్తి మరొకనికి తీర్పు తీర్చకూడదు. మనం ‘మనుష్యులకు నీతిమంతులుగా నగపడాలని’ కోరుకోకూడదు; మరి గంభీరమైన బాధ్యతల ఎడల మనం శ్రద్ధ తీసుకోవడానికి అది ఆటంకాన్ని కలిగించేంతగా ఆహారం మనకు ప్రాముఖ్యమైనది కాకూడదు. (మత్తయి 23:28; లూకా 12:22, 23) మనం తప్పక ఉపవాసం ఉండాలని దేవుడు అపేక్షించడం లేదని మరి మనం ఉపవాసం ఉండకూడదని ఆయన నిషేధించడం లేదని బైబిలు చూపుతుంది.

[7వ పేజీలోని చిత్రం]

యేసు తన బాప్తిస్మం తర్వాత 40 దినాలు ఎందుకు ఉపవాసం ఉన్నాడో మీకు తెలుసా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి