ప్రయాణ పైవిచారణకర్తలు—మనుష్యులకు ఈవులు
‘అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెను.’—ఎఫెసీయులు 4:8.
1. ఈ పత్రికలో 1894లో ఏ క్రొత్త పని ప్రకటించబడింది?
ఒక శతాబ్దంకంటే పూర్వం, కావలికోట ఒక క్రొత్త విషయాన్ని ప్రకటించింది. అది “ప్రకటనపనిలో మరో రంగం” అని వర్ణించబడింది. ఈ క్రొత్త పనిలో ఏమి ఇమిడి ఉంది? అది ప్రయాణ పైవిచారణకర్తల పని యొక్క ఆధునికదిన ప్రారంభోత్సవం. ఈ పత్రిక (ఆంగ్లం) సెప్టెంబరు 1, 1894 సంచికలో, అర్హులైన సహోదరులు ఇప్పటి నుండి బైబిలు విద్యార్థుల గుంపులను ‘సత్యమందు అభివృద్ధి చెందేలా చేసే సంకల్పంతో’ వారిని సందర్శిస్తారని వివరించింది.
2. ప్రాంతీయ, జిల్లా పైవిచారణకర్తలకు ఏ కర్తవ్యాలుంటాయి?
2 సా. శ. మొదటి శతాబ్దంలో పౌలు, బర్నబా వంటి పైవిచారణకర్తలు క్రైస్తవ సంఘాలను సందర్శించేవారు. ఈ నమ్మకమైన పురుషులు సంఘాలను ‘కట్టే’ లక్ష్యాన్ని కల్గియున్నారు. (2 కొరింథీయులు 10:8) నేడు, దీనిని క్రమపద్ధతిలో చేస్తున్న వేలాదిమంది పురుషులతో మనం ఆశీర్వదింపబడ్డాము. యెహోవాసాక్షుల పరిపాలక సభ వారిని ప్రాంతీయ మరియు జిల్లా పైవిచారణకర్తలుగా నియమించింది. ఒక ప్రాంతీయ పైవిచారణకర్త సంఘ రికార్డులను పరిశీలిస్తూ ప్రసంగాలిస్తూ స్థానిక రాజ్యప్రచారకులతోపాటు ప్రాంతీయ పరిచర్యలో పాల్గొంటూ సంవత్సరానికి రెండుసార్లు చొప్పున ఒక్కో సంఘాన్ని ఒకవారం వరకు సందర్శిస్తూ, అలా 20 సంఘాలకు సేవ చేస్తాడు. ఒక జిల్లా పైవిచారణకర్త అనేక ప్రాంతాల కొరకు జరిగే ప్రతి వార్షిక ప్రాంతీయ సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు, ఆతిథేయి సంఘాలతోపాటు ప్రాంతీయ పరిచర్యలో పాల్గొంటాడు, బైబిలు ఆధారిత ప్రసంగాలనిచ్చి ప్రోత్సాహాన్ని అందజేస్తాడు.
వారి స్వయంత్యాగపూరిత స్ఫూర్తి
3. ప్రయాణ పైవిచారణకర్తలకు స్వయంత్యాగ స్ఫూర్తి ఎందుకుండాలి?
3 ప్రయాణ పైవిచారణకర్తలు ఎల్లప్పుడూ ప్రయాణిస్తుంటారు. దీనికి స్వయంత్యాగపూరిత స్ఫూర్తి అవసరం. ఒక సంఘం నుండి మరో సంఘానికి ప్రయాణించడం తరచూ కష్టతరమైనదిగా ఉండగలదు, కాని ఈ పురుషులు మరియు వారి భార్యలు ఆనందభరిత దృక్పథంతో దీనిని చేస్తారు. ఒక ప్రాంతీయ పైవిచారణకర్త ఇలా చెప్పాడు: “నా భార్య ఎంతో మద్దతునిస్తుంది, ఫిర్యాదు చేయదు . . . ఆమె తన స్వయంత్యాగపూరిత స్ఫూర్తినిబట్టి ఎంతో మెప్పును పొందదగినది.” కొంతమంది ప్రాంతీయ పైవిచారణకర్తలు సంఘాల మధ్యన 1,000 కంటే ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణిస్తారు. అనేకులు తమ స్వంత వాహనాలపై వెళతారు, కాని ఇతరులు ఒక స్థలం నుండి మరో స్థలానికి ప్రజా రవాణా సౌకర్యం ద్వారా, సైకిలు ద్వారా, గుఱ్ఱం మీద, లేక కాలినడకన వెళతారు. ఒక ఆఫ్రికా ప్రాంతీయ పైవిచారణకర్త ఒక సంఘాన్ని చేరడానికి తన భార్యను తన భుజాలపై ఎత్తుకుని నదిని దాటవలసి వచ్చింది. అపొస్తలుడైన పౌలు తన మిషనరీ ప్రయాణాల్లో శీతోష్ణాలను ఆకలిదప్పులను జాగరణములను వివిధ ప్రమాదాలను దౌర్జన్యపూరిత హింసను ఎదుర్కోవలసి వచ్చింది. ఆయనకు “సంఘములన్నిటినిగూర్చిన చింత” కూడా ఉంది, నేడు ప్రయాణ పైవిచారణకర్తలకు అది సర్వసాధారణమైన అనుభవమే.—2 కొరింథీయులు 11:23-29.
4. ఆరోగ్య సమస్యలు ప్రయాణ పైవిచారణకర్తల జీవితాలపై మరియు వారి భార్యల జీవితాలపై ఏ ప్రభావాన్ని చూపగలవు?
4 పౌలు సహచరుడైన తిమోతివలె, ప్రయాణ పైవిచారణకర్తలకు మరియు వారి భార్యలకు కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలుంటాయి. (1 తిమోతి 5:23) ఇది వారికి అదనపు ఒత్తిడి కలిగిస్తుంది. ఒక ప్రాంతీయ పైవిచారణకర్త భార్య ఇలా వివరిస్తుంది: “నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎల్లప్పుడూ సహోదరులతో ఉండడం కష్టంగా ఉంటుంది. నాకు మెనోపాజ్ ప్రారంభమైనప్పుడు ప్రాముఖ్యంగా ఇది కష్టంగా అనిపించేది. ప్రతి వారం మా వస్తువులన్నీ సర్దుకుని, మరెక్కడికో వెళ్లడం నిజమైన సవాలుగా ఉండేది. తరచూ, కొనసాగడానికి శక్తినివ్వమని నేను యెహోవాను ప్రార్థించవలసి వచ్చేది.”
5. అనేక శ్రమలున్నప్పటికీ, ప్రయాణ పైవిచారణకర్తలు మరియు వారి భార్యలు ఎలాంటి స్ఫూర్తిని చూపించారు?
5 ఆరోగ్య సమస్యలు మరితర శ్రమలు ఉన్నప్పటికీ, ప్రయాణ పైవిచారణకర్తలు మరియు వారి భార్యలు తమ సేవలో ఆనందాన్ని కనుగొని, స్వయంత్యాగపూరిత ప్రేమను చూపిస్తారు. హింస మరియు యుద్ధ సమయాల్లో ఆత్మీయ సహాయాన్ని అందజేయడానికి కొందరు తమ జీవితాలను ప్రమాదంలో పడవేసుకున్నారు. సంఘాలను సందర్శించేటప్పుడు వారు, “స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీ మధ్యను సాధువులమై యుంటిమి. మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములనుకూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి” అని థెస్సలొనీకలోని క్రైస్తవులకు చెప్పిన పౌలు వంటి స్ఫూర్తిని చూపించారు.—1 థెస్సలొనీకయులు 2:7, 8.
6, 7. కష్టపడి పనిచేసే ప్రయాణ పైవిచారణకర్తలు ఏ అనుకూల ప్రభావాన్ని చూపగలరు?
6 క్రైస్తవ సంఘంలోని ఇతర పెద్దల వలె ప్రయాణ పైవిచారణకర్తలు “వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడ”తారు. అలాంటి పెద్దలందరినీ “రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా” ఎంచాలి. (1 తిమోతి 5:17) ‘వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనిన తర్వాత, వారి విశ్వాసమును అనుసరిస్తే,’ వారి మాదిరి ప్రయోజనకరమైనదిగా నిరూపించబడగలదు.—హెబ్రీయులు 13:7.
7 కొంతమంది ప్రయాణ పెద్దలు ఇతరులపై ఎలాంటి ప్రభావాన్ని చూపారు? ఒక యెహోవాసాక్షి ఇలా వ్రాశాడు: “సహోదరుడు పి——నా జీవితంలో ఎంత అద్భుతమైన ప్రభావంగా ఉన్నాడో! ఆయన 1960వ సంవత్సరం నుండి మెక్సికోలో ప్రయాణ పైవిచారణకర్తగా ఉన్నాడు. బాలునిగా నేను ఆయన సందర్శనాల కొరకు నిరీక్షణతోను ఆనందంతోను ఎదురు చూశాను. నాకు పది సంవత్సరాలున్నప్పుడు ఆయన నాతో ఇలా చెప్పాడు: ‘నీవు ప్రయాణ పైవిచారణకర్తవవుతావు.’ కష్టతరమైన యౌవనారంభపు సంవత్సరాలలో నేను తరచూ ఆయన కొరకు వెదికాను, ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ జ్ఞానవంతమైన మాటలు చెప్పేవాడు. ఆయన మందను కాయడానికే జీవించాడు! ఇప్పుడు నేను ఒక ప్రాంతీయ పైవిచారణకర్తను గనుక, నేను ఎల్లప్పుడూ యౌవనస్థుల కొరకు సమయాన్ని వెచ్చించి, ఆయన నాకు చేసినట్లుగానే వారి ఎదుట దైవపరిపాలనా లక్ష్యాలను ఉంచడానికి ప్రయత్నిస్తుంటాను. సహోదరుడు పి——తన జీవితపు చివరి సంవత్సరాలలో సహితం గుండెపోటుకు సంబంధించిన సమస్యలున్నప్పటికీ ఎల్లప్పుడు ప్రోత్సాహకరమైన మాటలు చెప్పడానికి ప్రయత్నించేవాడు. 1995 ఫిబ్రవరిలో తన మరణానికి కేవలం ఒకరోజు ముందు, ప్రత్యేక సమావేశ దినానికి ఆయన నాతోపాటు వచ్చి వాస్తుశిల్పి అయిన ఒక సహోదరుని ఎదుట చక్కని లక్ష్యాలను ఉంచాడు. ఆ సహోదరుడు వెంటనే బేతేలులో సేవచేసేందుకు దరఖాస్తు పంపించాడు.”
వారు మెచ్చుకొనబడ్డారు
8. ఎఫెసీయులు 4వ అధ్యాయంలో వివరించబడిన “మనుష్యులకు ఈవులు” ఎవరు, వారు సంఘానికి ఎలా ప్రయోజనకరంగా ఉండగలరు?
8 దేవుని కృపాబాహుళ్యాన్నిబట్టి సేవ చేసే నియామకాలు ఇవ్వబడిన ప్రయాణ పైవిచారణకర్తలు మరియు ఇతర పెద్దలు “మనుష్యులకు ఈవులు” అని పిలువబడ్డారు. యెహోవా ప్రతినిధిగా మరియు సంఘ శిరస్సుగా యేసు, మనం వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలని మరియు పరిపక్వతకు ఎదగాలని ఈ ఆత్మీయ పురుషులను అనుగ్రహించాడు. (ఎఫెసీయులు 4:8-15) ఏ ఈవియైనా మెప్పును పొందదగినదే. యెహోవా సేవలో కొనసాగడానికి మనల్ని బలపర్చే ఈవి విషయంలో ప్రాముఖ్యంగా ఇది నిజం. కాబట్టి మరి ప్రయాణ పైవిచారణకర్తల పని ఎడల మన మెప్పును మనమెలా ప్రదర్శించవచ్చు? ‘ఈ పురుషులను ఘనపరుస్తున్నామని’ మనం ఏ యే విధాలుగా చూపించవచ్చు?—ఫిలిప్పీయులు 2:29.
9. ప్రయాణ పైవిచారణకర్తల ఎడల మెప్పును మనం ఏ యే విధాలుగా చూపించవచ్చు?
9 ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శనం ప్రకటించబడినప్పుడు, ఆ వారం కొరకైన సంఘ కార్యకలాపాలన్నిటిలో పూర్తిగా భాగం వహించడానికి పథకాలు వేసుకోవడం ప్రారంభించవచ్చు. సందర్శనం సమయంలో ప్రాంతీయ సేవా ఏర్పాట్లకు మద్దతునిచ్చేందుకు మనం బహుశా అదనపు సమయాన్ని కేటాయించుకోవచ్చు. ఆ నెలలో మనం సహాయ పయినీర్లుగా సేవ చేయవచ్చు. మన పరిచర్యను మెరుగుపర్చుకునేందుకు, ప్రాంతీయ పైవిచారణకర్త ఇచ్చిన సలహాలను ఆచరణలో పెట్టాలని మనం తప్పక కోరుకుంటాము. అలాంటి స్వీకరించే స్ఫూర్తి మనకు ప్రయోజనకరంగా ఉంటుంది, తన సందర్శనం ఉపయోగకరమైనదని ఆయనకు నిశ్చయతనిస్తుంది. అవును, మనల్ని ప్రోత్సహించేందుకు ప్రయాణ పైవిచారణకర్తలు సంఘాన్ని సందర్శిస్తారు, కాని వారు కూడా ఆత్మీయంగా ప్రోత్సహింపబడడం అవసరం. పౌలుకు ప్రోత్సాహం అవసరమైన సమయాలు ఉండినవి, తన కొరకు ప్రార్థించమని ఆయన తోటి క్రైస్తవులను తరచూ కోరాడు. (అపొస్తలుల కార్యములు 28:15; రోమీయులు 15:30-32; 2 కొరింథీయులు 1:11; కొలొస్సయులు 4:2, 3; 1 థెస్సలొనీకయులు 5:25) అలాగే ప్రస్తుతదిన ప్రయాణ పైవిచారణకర్తలకు మన ప్రార్థనలు, ప్రోత్సాహం అవసరం.
10. ఒక ప్రయాణ పైవిచారణకర్త పని ఆనందదాయకంగా ఉండేలా చేసేందుకు మనమెలా సహాయం చేయగలము?
10 మనం వారి సందర్శనాలను ఎంతగా మెచ్చుకుంటున్నామో మనం ప్రాంతీయ పైవిచారణకర్తకు ఆయన భార్యకు చెబుతున్నామా? ఆయన మనకిచ్చే సహాయకరమైన ఉపదేశాన్నిబట్టి మనం ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామా? ప్రాంతీయ సేవ కొరకు ఆయనిచ్చే సలహాలు పరిచర్యలో మన ఆనందాన్ని అధికం చేసినప్పుడు అది ఆయనకు తెలియజేస్తున్నామా? మనమలా చేస్తే, ఇది ఆయన పని ఆయనకు ఆనందదాయకమైనదయ్యేలా చేయడానికి సహాయం చేస్తుంది. (హెబ్రీయులు 13:17) తాము సంఘాలను సందర్శించిన తర్వాత అందుకున్న కృతజ్ఞతా కార్డులను తాను తన భార్యా ఎంత విలువైనవిగా భావిస్తారనేదాని గురించి ప్రాముఖ్యంగా స్పెయిన్‌లోని ఒక ప్రాంతీయ పైవిచారణకర్త వ్యాఖ్యానించాడు. “మేము ఈ కార్డులను దాచుకుని, మేము నిరుత్సాహంగా భావిస్తున్నప్పుడు వాటిని చదువుకుంటాము. అవి నిజమైన ప్రోత్సాహానికి మూలం” అని ఆయన చెబుతున్నాడు.
11. వారు ప్రేమింపబడుతున్నారని, మెచ్చుకొనబడుతున్నారని ప్రాంతీయ మరియు జిల్లా పైవిచారణకర్తల భార్యలకు మనం ఎందుకు తెలియజేయాలి?
11 మెప్పుదల మాటల నుండి ప్రయాణ పైవిచారణకర్త భార్య తప్పకుండా ప్రయోజనం పొందుతుంది. ఈ సేవా రంగంలో తన భర్తకు సహాయం చేయడానికి ఆమె గొప్ప త్యాగాలు చేసింది. తమ స్వంత గృహాన్ని కలిగివుండాలనే, అనేక సందర్భాల్లో, పిల్లలను కలిగివుండాలనే స్వాభావికమైన కోరికను ఈ నమ్మకమైన సహోదరీలు వదులుకున్నారు. యెఫ్తా కుమార్తె ఒక యెహోవా సేవకురాలు, ఆమె తన తండ్రి చేసిన ఒక ప్రమాణం మూలంగా భర్తను కుటుంబాన్ని కలిగివుండే తన అవకాశాన్ని ఇష్టపూర్వకంగా వదులుకుంది. (న్యాయాధిపతులు 11:30-39) ఆమె త్యాగం ఎలా దృష్టించబడింది? న్యాయాధిపతులు 11:40 ఇలా తెలియజేస్తుంది: “ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు నాలుగు దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధిచేయుటకద్దు.” వారు ప్రేమించబడుతున్నారని, మెచ్చుకొనబడుతున్నారని ప్రాంతీయ మరియు జిల్లా పైవిచారణకర్తల భార్యలకు మనం చెప్పడానికి ప్రయత్నించడం ఎంత చక్కగా ఉంటుందో కదా!
“ఆతిథ్యము చేయ మరవకుడి”
12, 13. (ఎ) ప్రయాణ పైవిచారణకర్తలకు వారి భార్యలకు ఆతిథ్యమిచ్చేందుకు ఏ లేఖనాధారం ఉంది? (బి) అలాంటి ఆతిథ్యం పరస్పరం ఎలా ప్రయోజనకరంగా ఉండగలదో ఉదాహరించండి.
12 క్రైస్తవ ప్రయాణపనిలో ఉన్న వారి ఎడల ప్రేమను మెప్పును చూపించడానికి ఆతిథ్యమివ్వడం మరో మార్గం. (హెబ్రీయులు 13:1) ప్రయాణ మిషనరీలుగా సంఘాన్ని సందర్శిస్తున్న వారికి ఆతిథ్యమిచ్చినందుకు అపొస్తలుడైన యోహాను గాయును మెచ్చుకున్నాడు. యోహాను ఇలా వ్రాశాడు: “ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్ల విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమనుగూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనులవలన ఏమియు తీసికొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన యెడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టివారికి ఉపకారముచేయ బద్ధులమైయున్నాము.” (3 యోహాను 5-8) నేడు, ప్రయాణ పైవిచారణకర్తలకు మరియు వారి భార్యలకు అలాంటి ఆతిథ్యాన్నే ఇవ్వడం ద్వారా మనం రాజ్య ప్రకటన పనిని వృద్ధి చేయవచ్చు. అయితే, స్థానిక పెద్దలు వసతులు సంతృప్తికరంగా ఉండేలా చూడాలి, కాని ఒక జిల్లా పైవిచారణకర్త ఇలా చెప్పాడు: “సహోదరులతో మనం కలిసి ఉండేతీరు మన కొరకు ఎవరు ఏమి చేస్తారనే దానిపై ఆధారపడి ఉండకూడదు. మనం అలాంటి అభిప్రాయం కలిగేలా కూడా చేయకూడదు. ధనికులైనా లేక పేదవారైనా మన సహోదరులలో ఎవరు ఆతిథ్యమిచ్చినా స్వీకరించేందుకు మనం సుముఖంగా ఉండాలి.”
13 ఆతిథ్యమివ్వడం పరస్పరం ప్రయోజనకరమైనదై ఉండగలదు. ఇప్పుడు బేతేలులో సేవ చేస్తున్న ఒకప్పటి ప్రాంతీయ పైవిచారణకర్తయైన జార్జే ఇలా గుర్తు తెచ్చుకుంటున్నాడు: “మా కుటుంబంలో, ప్రయాణ పైవిచారణకర్తలను మాతోపాటు ఉండడానికి ఆహ్వానించే అలవాటు మాకుండేది. ఈ సందర్శనాలు నేను అప్పట్లో గుర్తించగలిగిన దానికంటే ఎక్కువగానే నాకు సహాయం చేశాయని నేను భావిస్తున్నాను. నేను యౌవనారంభంలో ఉండగా, నాకు ఆత్మీయ సమస్యలుండేవి. మా అమ్మ దీని గురించి చింతకలిగి ఉండేది, కాని ఎలా సహాయం చేయాలో ఆమెకు తెలిసేదికాదు, కాబట్టి నాతో మాట్లాడమని ఆమె ప్రాంతీయ పైవిచారణకర్తను కోరింది. నేను విమర్శింపబడతానేమోననే భయంతో మొదట్లో ఆయనను తప్పించుకునే వాడిని. కాని ఆయన స్నేహస్వభావం నా విషయాలు ఆయనకు చెప్పుకునేలా నన్ను ప్రోత్సహించింది. ఒక సోమవారం తనతోపాటు భోజనం చేయడానికి రమ్మని ఆయన నన్ను ఆహ్వానించాడు, నన్ను ఆయన తప్పకుండా అర్థం చేసుకుంటాడని నేను భావించాను గనుక నేను హృదయం విప్పి ఆయనతో మాట్లాడాను. ఆయన జాగ్రత్తగా విన్నాడు. ఆయనిచ్చిన ఆచరణాత్మకమైన సలహాలు నిజంగా పనిచేశాయి, నేను ఆత్మీయంగా అభివృద్ధి చెందడం ప్రారంభించాను.”
14. ప్రయాణ పెద్దల గురించి మనం విమర్శనాత్మకంగా ఉండే బదులు మెప్పు కలిగి ఎందుకు ఉండాలి?
14 ఒక ప్రయాణ పైవిచారణకర్త పిన్నలకు పెద్దలకు కూడా ఆత్మీయంగా సహాయకరంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి మనం ఆయన ప్రయత్నాల ఎడల తప్పకుండా మన మెప్పును చూపించాలి. అయితే, మనం ఆయన బలహీనతలనుబట్టి ఆయనను విమర్శించడం లేక సంఘాన్ని సందర్శించిన ఇతరులతో ఆయనను అనుచితంగా పోల్చడం వంటివి చేస్తే అప్పుడేమిటి? తప్పకుండా ఇది ఎంతో వేదనకరంగా ఉంటుంది. తన పనిని గురించిన విమర్శలు వినడం పౌలుకు ప్రోత్సాహకరంగా లేదు. ఆయన రూపం గురించి ఆయన వాక్చాతుర్యం గురించి కొరింథులోని కొంతమంది క్రైస్తవులు అవమానకరమైన వ్యాఖ్యానాలు చేశారని స్పష్టమౌతుంది. “అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియునై యున్నవి గాని అతడు శరీరరూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని” అలాంటి విమర్శకులు అన్నట్లు ఆయన తానే తెలియజేశాడు. (2 కొరింథీయులు 10:10) అయితే సంతోషకరంగా, ప్రయాణ పైవిచారణకర్తలు సాధారణంగా ప్రేమపూర్వకమైన మెప్పుతోకూడిన మాటలు వింటారు.
15, 16. తమ తోటి విశ్వాసులు చూపించే ప్రేమ మరియు ఆసక్తి ద్వారా ప్రయాణ పైవిచారణకర్తలు, వారి భార్యలు ఎలా ప్రభావితమౌతారు?
15 గెరిల్లాల ఆధీనంలో ఉన్న ప్రాంతంలో నివసిస్తున్న తన ఆత్మీయ సహోదర సహోదరీలను సందర్శించడానికి లాటిన్ అమెరికాలోని ఒక ప్రాంతీయ పైవిచారణకర్త బురదతోనిండిన దారులలో రోజంతా కష్టపడి నడుస్తాడు. ఆయనిలా వ్రాస్తున్నాడు: “సందర్శనం ఎడల సహోదరులు మెప్పును చూపించే తీరు కదిలించేదిగా ఉంటుంది. అక్కడికి చేరడానికి నేను అనేక ప్రమాదాలను కష్టాలను ఎదుర్కొంటూ ఎంతో ప్రయాసపడవలసి వచ్చినప్పటికీ, సహోదరులు చూపించే ప్రేమ ఆసక్తుల ద్వారా దీనికంతటికీ ప్రతిఫలం లభిస్తుంది.”
16 ఆఫ్రికాలోని ఒక ప్రాంతీయ పైవిచారణకర్త ఇలా వ్రాస్తున్నాడు: “సహోదరులు మా ఎడల చూపించిన ప్రేమనుబట్టి, మేము టాంజానియా ప్రాంతాన్ని ఎంతగానో ఇష్టపడ్డాము! సహోదరులు మా నుండి నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు, మేము తమ గృహాల్లో ఉండడం వారికి ఆనందాన్ని కలిగించేది.” అపొస్తలుడైన పౌలుకు మొదటి శతాబ్దపు క్రైస్తవ వివాహిత దంపతులైన అకుల ప్రిస్కిల్లలకు మధ్య ప్రేమపూర్వకమైన సంతోషభరితమైన సంబంధం ఉండేది. వాస్తవానికి, వారి గురించి పౌలు ఇలా చెప్పాడు: “క్రీస్తు యేసునందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును, అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. . . . నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘములవారందరు వీరికి కృతజ్ఞులైయున్నారు.” (రోమీయులు 16:3, 4) ఆతిథ్యమిచ్చేందుకు, సహవసించేందుకు ప్రత్యేకంగా ప్రయాసపడే ఆధునిక దిన అకుల ప్రిస్కిల్లలను తమ స్నేహితులనుగా కలిగివుండేందుకు ప్రయాణ పైవిచారణకర్తలు, వారి భార్యలు కృతజ్ఞత కలిగివుంటారు.
సంఘాలను బలపర్చడం
17. ప్రయాణ పైవిచారణకర్తల ఏర్పాటు వెనుక జ్ఞానం ఉందని ఎందుకు చెప్పవచ్చు, వారికి ఉపదేశం ఎక్కడ నుండి లభిస్తుంది?
17 “జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పుపొందు”నని యేసు చెప్పాడు. (మత్తయి 11:19) ప్రయాణాధ్యక్షుల ఏర్పాటు వెనుకనున్న జ్ఞానం, అది దేవుని ప్రజల సంఘాలను బలపర్చేందుకు సహాయం చేస్తుందనడంలో స్పష్టమౌతుంది. పౌలు రెండవ మిషనరీ ప్రయాణ సమయంలో, ఆయన మరియు సీల విజయవంతంగా “సంఘములను స్థిరపరచుచు సిరియ కిలికియ దేశముల ద్వారా సంచారము” చేశారు. అపొస్తలుల కార్యముల పుస్తకం మనకిలా చెబుతుంది: “వారు ఆ యా పట్టణముల ద్వారా వెళ్లుచు, యెరూషలేములోనున్న అపొస్తలులును పెద్దలును నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి, అనుదినము లెక్కకు విస్తరించుచుండెను.” (అపొస్తలుల కార్యములు 15:40, 41; 16:4, 5) ఇతర క్రైస్తవులందరి వలెనే, ప్రస్తుత దిన ప్రయాణ పైవిచారణకర్తలు లేఖనాల ద్వారా మరియు ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ ప్రచురణల ద్వారా ఆత్మీయ ఉపదేశాన్ని పొందుతారు.—మత్తయి 24:45.
18. ప్రయాణ పైవిచారణకర్తలు సంఘాలను ఎలా బలపరుస్తారు?
18 అవును, ప్రయాణ పెద్దలు యెహోవా ఆత్మీయ బల్లవద్ద ఆహారం తీసుకోవడం కొనసాగించాలి. దేవుని సంస్థ అనుసరించే పద్ధతులు, నిర్దేశకాలు వారికి సుపరిచితమై ఉండాలి. అప్పుడు అలాంటి పురుషులు ఇతరులకు నిజమైన ఆశీర్వాదంగా ఉండగలరు. ప్రాంతీయ సేవయందు ఆసక్తి విషయంలో తమ చక్కని మాదిరి ద్వారా, వారు క్రైస్తవ పరిచర్యను మెరుగుపరచుకోవడానికి తమ తోటి విశ్వాసులకు సహాయం చేయగలుగుతారు. సందర్శించే ఈ పెద్దలిచ్చే బైబిలు ఆధారిత ప్రసంగాలు శ్రోతలను ఆత్మీయంగా బలపరుస్తాయి. దేవుని వాక్య ఉపదేశాన్ని అన్వయించుకోవడానికి, భూవ్యాప్తంగానున్న యెహోవా ప్రజలతో పొందికగా సేవచేసేందుకు, ‘నమ్మకమైన దాసుని’ ద్వారా దేవుడు చేసిన ఆత్మీయ ఏర్పాట్లను ఆచరణలో పెట్టడానికి ఇతరులకు సహాయం చేయడం ద్వారా, సందర్శించేందుకు తమకు ఆధిక్యత లభించిన సంఘాలను ప్రయాణ పైవిచారణకర్తలు బలపరుస్తారు.
19. ఏ ప్రశ్నలను పరిశీలించవలసి ఉంది?
19 దాదాపు వంద సంవత్సరాల క్రితం యెహోవా సంస్థ బైబిలు విద్యార్థుల మధ్య ప్రయాణ పెద్దల పనిని ప్రారంభించినప్పుడు, ఈ పత్రిక ఇలా తెలియజేసింది: “మనం ఫలితాల కొరకు, ప్రభువు యొక్క తర్వాతి నడిపింపు కొరకు వేచి చూడాలి.” యెహోవా నడిపింపు స్పష్టంగా తెలియజేయబడింది. ఆయన ఆశీర్వాదం మూలంగా మరియు పరిపాలక సభ పర్యవేక్షణ క్రింద ఈ పని సంవత్సరాల కాలంలో విస్తృతమై, శుద్ధీకరించబడింది. తత్ఫలితంగా, భూవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షుల సంఘాలు విశ్వాసమందు బలపర్చబడి దినదినానికి సంఖ్యలో పెరిగిపోతున్నాయి. మనుష్యులకు ఈవులైన వీరి స్వయంత్యాగ స్ఫూర్తిని యెహోవా ఆశీర్వదిస్తున్నాడని స్పష్టమౌతుంది. కాని ప్రయాణ పైవిచారణకర్తలు తమ పనిని ఎలా విజయవంతంగా కొనసాగించవచ్చు? వారి లక్ష్యాలేమిటి? వారు ఇంకా ఎక్కువ ప్రయోజనాన్ని ఎలా చేకూర్చవచ్చు?
మీరెలా ప్రతిస్పందిస్తారు?
◻ ప్రాంతీయ మరియు జిల్లా పైవిచారణకర్తల కొన్ని కర్తవ్యాలు ఏవి?
◻ ప్రయాణ పైవిచారణకర్తలకు స్వయంత్యాగ స్ఫూర్తి ఎందుకుండాలి?
◻ ప్రయాణ పెద్దలు మరియు వారి భార్యల పని ఎడల మెప్పును ఎలా చూపించవచ్చు?
◻ సంఘాలను విశ్వాసమందు బలపర్చడానికి ప్రయాణ పైవిచారణకర్తలు ఏమి చేయవచ్చు?
[10వ పేజీలోని చిత్రం]
ఎల్లప్పుడూ ప్రయాణిస్తుండడానికి స్వయంత్యాగ స్ఫూర్తి అవసరం
[13వ పేజీలోని చిత్రం]
ప్రయాణ పైవిచారణకర్తలకు వారి భార్యలకు మీరు ఆతిథ్యమిచ్చారా?