పాఠకుల ప్రశ్నలు
ఓ క్రైస్తవుడు మానసిక-ఆరోగ్య చికిత్సచేసే వారిని సంప్రదించడం తెలివైన పనేనా?
ఈ ‘అంత్యదినాల్లో’ భావోద్రేక మానసిక బలహీనతల్లో పెరుగుదల ఉందని కొన్ని దేశాల నుండి వచ్చిన రిపోర్టులు తెలియజేస్తున్నాయి. (2 తిమోతి 3:1) తోటి విశ్వాసులు వీటికి గురైనప్పుడు, క్రైస్తవులు ప్రగాఢమైన దయను చూపిస్తారుగాని తన అనారోగ్యానికి చికిత్సను తీసుకోవాలా, వద్దాయని మరొకవేళ తీసుకోవాలనుకుంటే ఏ రకమైన చికిత్సను తీసుకోవాలో నిర్ణయించుకోవాల్సింది ఆయావ్యక్తులేనని వారు గుర్తిస్తారు.a “ప్రతివాడును తన బరువుతానే భరించుకొనవలెను.” (గలతీయులు 6:5) స్కిట్సొఫ్రెనియా, బైపోలార్ డిసార్డర్, డీప్ క్లినికల్ డిప్రషన్, అబ్సెస్సివ్-కంపల్సివ్ డిసార్డర్‌తోను, సెల్ప్-మ్యుటులేషన్ మరితర కలతపర్చే రుగ్మతలతోను తీవ్రంగా బాధపడుతున్న కొందరు, సరియైన నిపుణుల సహాయాన్ని పొందిన తర్వాత సాధారణమైన జీవితాన్ని జీవించగల్గుతున్నారు.
కొన్నిచోట్ల చికిత్స కొరకు ప్రయత్నించడం పూర్తిగా సర్వసాధారణమై పోయింది. అనేక సందర్భాల్లో రోగికి తీవ్రమైన మానసిక రుగ్మతలేకపోయినా జీవితంలో ఏదొక పరిస్థితిని తాళుకోవడంలో ఇబ్బందిని కల్గివున్నాడు. అయినా, జీవితంలోని క్లిష్టమైన సమస్యలతో వ్యవహారించడంలో అత్యంత ప్రతిఫలదాయకమైన సహాయాన్ని ఇచ్చేది బైబిలే. (కీర్తన 119:28, 143) మనల్ని మానసికంగాను భావోద్రేకంగాను బలపర్చే తెలివిని, ఆలోచనా సామర్థ్యాన్ని, నిజమైన జ్ఞానాన్ని యెహోవా బైబిలు ద్వారా అందిస్తున్నాడు. (సామెతలు 2:1-11; హెబ్రీయులు 13:6) తీవ్రమైన అంతర్మధనాల్నిబట్టి కొన్నిసార్లు దేవుని నమ్మకమైన సేవకులు తమ్మునుతాము వివేచనా రహితంగా వ్యక్తపర్చుకోవచ్చు. (యోబు 6:2, 3) అటువంటివారు సహాయ సలహాల కొరకు పెద్దల్ని పిలిపించాలని యాకోబు 5:13-16 వచనాలు ప్రోత్సహిస్తున్నాయి. ఓ క్రైస్తవుడు ఆత్మీయంగా రోగియై ఉండవచ్చు లేదా మార్పునొందని పరిస్థితినిబట్టో అమితమైన ఒత్తిడినిబట్టో అతడు కలతచెంది ఉండవచ్చు లేదా తానో అన్యాయానికి గురయ్యానని అతడు భావిస్తుండవచ్చు. (ప్రసంగి 7:7; యెషయా 32:2; 2 కొరింథీయులు 12:7-10) ఓదార్పునిచ్చే బైబిలు సలహాను నైపుణ్యవంతంగా తెలియజేసే ‘నూనెను అతనికి రాచి, ప్రార్థన చేసే’ పెద్దల సహాయాన్ని అటువంటి వ్యక్తి పొందగలడు. ఫలితం? “విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని [నిరాశనుంచి లేదా దేవుడు తన్ను విడిచిపెట్టాడనే భావాన్నుంచి] లేపును.”
అయితే, ఆత్మీయ కాపరుల నైపుణ్యవంతమైన సహాయమున్నా ఓ వ్యక్తి మానసికంగా కలతచెంది, విభ్రాంతిచెందితే ఏం చెయ్యాలి? ఈ స్థితిలో కొందరు సమగ్రమైన భౌతిక పరీక్షను చేయించుకోవడాన్ని ఎంచుకున్నారు. (సామెతలు 14:30; 16:24; 1 కొరింథీయులు 12:26 పోల్చండి.) భౌతికసంబంధమైన సమస్య భావోద్రేక లేదా మానసిక కలతలనుబట్టి వచ్చి ఉండవచ్చు. అలాంటి ఓ సమస్యకు చికిత్సచేయడం, కొన్ని కేసుల్లో భావోద్రేకంగా బలహీనపడిన వ్యక్తికి ఉపశమనాన్ని ఇచ్చింది.b ఏ భౌతిక సమస్యా లేకపోతే మానసిక ఆరోగ్య సంబంధమైన నిపుణునికి సిఫారసు చేయవచ్చు. అప్పుడేం చెయ్యాలి? ఇది పైన తెలియజేయబడినట్లుగానే, ప్రతి వ్యక్తీ తనకుతానుగా విషయాల్ని అంచనావేసి తీసుకునే నిర్ణయం. ఇతరులు విమర్శించకూడదు లేక తీర్పుతీర్చకూడదు.—రోమీయులు 14:4.
అయినా, అభ్యాససిద్ధమైన జ్ఞానాన్ని తప్పక ఉపయోగించాలి, బైబిలు సూత్రాల్ని మర్చిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. (సామెతలు 3:21; ప్రసంగి 12:13) భౌతిక సంబంధమైన రోగం విషయంలో, రోగులు సాంప్రదాయక వైద్యం నుండి ప్రకృతి వైద్యం, ఆక్యుపంక్చర్, హోమియోపతివంటి వైద్యపద్ధతుల వరకు విభిన్నమైన చికిత్సా ఎంపికలను ఎదుర్కొంటారు. వివిధ రకాల మానసిక ఆరోగ్య ప్రాక్టీషనర్లు కూడా ఉన్నారు. వారిలో క్రమరాహిత్య ప్రవర్తనకుగల కారణాలను కనుగొనడానికి లేదా బాధాకరమైన భావోద్రేకానికిగల కారణాలను కనుగొనడానికి ప్రయత్నించేందుకు రోగి వ్యక్తిగత చరిత్రను పరిశీలించే ఎనాలటిక్ సైకోథెరపిస్టులు మరితరులు ఉన్నారు. కొత్త ప్రవర్తనా పద్ధతుల్ని, రోగి నేర్చుకునేందుకు సహాయపడడానికి ప్రవర్తనా సైకోథెరపిస్టులు ప్రయత్నించవచ్చు. అనేకమైన మానసిక బలహీనతల్ని మందులతో చికిత్స చేయవచ్చని కొంతమంది మానసిక ఆరోగ్య ప్రాక్టీషనర్లు విశ్వసిస్తారు.c ఇతరులు పత్యాన్ని విటమిన్లను సిఫారసు చేస్తారని తెలియజేయబడింది.
ఈ ఎంపికలను పరిశీలించేటప్పుడు రోగులు వారి కుటుంబీకులు జాగ్రత్త తీసుకోవాలి. (సామెతలు 14:15) ప్రాముఖ్యంగా, మానసిక ఆరోగ్య వృత్తి “ప్రప్రథమ వైద్య కళ. అది మానవ జీవితంలో అతి సంక్లిష్ట లక్షణాలైన మనస్సు, ప్రవర్తనలతో వ్యవహరిస్తున్నప్పటికి కూడా వారి సలహాలకు సంబంధించిన రుజువును పొందడం అంత సులభమేమీ కాదు” అని జాన్స్ హోప్‌కిన్స్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌నందు సైకియాట్రి, బిహేవియరల్ సైన్స్ డిపార్టుమెంట్‌కు డైరక్టరైన ప్రొఫెసర్ పాల్ మాక్యు తెలియజేశాడు. ఈ పరిస్థితి చపలచిత్త నడవడికి, మోసాలకు అంతేగాక సదుద్దేశంతో చేసిన చికిత్సలైనా మేలుకన్నా ఎక్కువ కీడునే కలుగచేసే వాటికి నడిపించవచ్చు.
సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు వృత్తి ధర్మ, పోస్టుగ్రాడ్యుయేట్ పట్టాలను కల్గివున్నా అనేకమందితరులు వృత్తిపరమైన అర్హతలేమీ లేకుండానే కౌన్సిలర్లగాను చికిత్సదారులుగాను ప్రాక్టీసు చేస్తున్నారని, ఏవిధమైన పర్యవేక్షణాలేదని కూడా చెప్పక తప్పదు. అలాంటి అనర్హులైన వారిని సంప్రదించడానికి కొంతమంది ఎంతో ధనాన్ని వెచ్చించారు.
శిక్షణపొందిన, అర్హుడైన మానసిక-ఆరోగ్య వృత్తిని చేపట్టేవారి విషయంలో కూడా పరిశీలించాల్సిన విషయాలు ఉన్నాయి. ఓ మెడికల్ డాక్టర్‌నుగాని సర్జన్‌నుగాని ఎంపిక చేసుకునేటప్పుడు, బైబిలు ఆ ధారితమైన మన ఉద్దేశాల్ని ఆయన గౌరవిస్తాడో లేదో మనం నిశ్చయపర్చుకోవాలి. అదేవిధంగా, మతపరమైన మరియు నైతికపరమైన మన దృక్పథాల్ని గౌరవించని మానసిక-ఆరోగ్య ప్రొఫెషనల్ని సంప్రదించడం ప్రమాదకరమైందౌతుంది. మానసిక, భావోద్రేక సమస్యలున్నా “క్రీస్తుయేసు కల్గివున్న మానసిక దృక్పథాన్నే” కల్గివుండడానికి అనేకమంది క్రైస్తవులు తీవ్రంగా పోరాడుతున్నారు. (రోమీయులు 15:5, NW) తమ ఆలోచన లేదా ప్రవర్తన ప్రభావితం చెందిన వాళ్లెవరైనాసరే వారి దృక్పథాల ఎడల అలాంటివారు సరిగానే శ్రద్ధవహిస్తారు. లేఖనాధార నమ్మకాలచే విధించబడిన ఏ నిర్బంధాల్నైనా, అనవసరమైనవిగాను మానసిక ఆరోగ్యానికి హాని కల్గించేవిగాను కొంతమంది చికిత్సకారులు దృష్టిస్తారు. వాళ్లు సలింగ సంయోగం లేదా వైవాహిక విశ్వాసఘాతుకం వంటి బైబిల్లో ఖండించబడిన అభ్యాసాల్ని అంగీకరించి, సిఫారసు కూడా చేయవచ్చు.
“జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదము”లు అని అపొస్తులుడైన పౌలు పిలిచిన దానిలో ఈ ఆలోచనలు చేరివున్నాయి. (1 తిమోతి 6:20) వాళ్లు క్రీస్తును గూర్చిన సత్యాన్ని వ్యతిరేకించి, “ఈ లోకసంబంధమైన . . . నిరర్థక తత్వ జ్ఞానము”లో భాగస్తులయ్యారు. (కొలొస్సయులు 2:8) బైబిలు యొక్క గీటురాయి స్పష్టంగా ఇలా ఉంది: “యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు.” (సామెతలు 21:30) “కీడు మేలని మేలు కీడని” చెప్పు మానసిక-ఆరోగ్య చికిత్సకారులు ‘చెడ్డ సహవాసులే.’ నిలకడలేని మనస్సుల్ని బాగుచేసేందుకు సహాయపడ్డానికి బదులు, వాళ్లు ‘మంచి నడవడిని చెరుపుతారు.’—యెషయా 5:20; 1 కొరింథీయులు 15:33.
గనుక, మానసిక-ఆరోగ్య చికిత్సకారుని సంప్రదించడం అవసరమని భావిస్తున్న ఓ క్రైస్తవుడు అతని అర్హతల్ని, దృక్పథాన్ని, ఖ్యాతిని అలాగే సిఫారసు చేయబడిన చికిత్స చూపించే ప్రభావ సాధ్యతను పరిశీలించాలి. కలతచెందిన క్రైస్తవుడు తనకుతానుగా దీనిని చేయలేకపోతే, బహుశా పరిపక్వతకు ఎదిగిన ఓ సన్నిహిత స్నేహితుడుగాని బంధువుగాని సహాయపడవచ్చు. ఫలాన చికిత్సను గూర్చిన జ్ఞానానికి సంబంధించి ఒక క్రైస్తవుడు అనిశ్చయ స్థితిలోవుంటే సంఘంలోని పెద్దలతో మాట్లాడడం సహాయకరంగా ఉంటుందని కనుగొనవచ్చు. అయినప్పటికీ తుది నిర్ణయం ఆయనదే (లేక అతని తల్లిదండ్రులది లేక భార్యభర్తల ఉమ్మడి నిర్ణయమై ఉంటుంది).d
బాధను నివారింపచేయడానికి మునుపటి కాలాల్లోకన్నా నేడు విజ్ఞాన శాస్త్రం మరింత చేయగలదు. ప్రస్తుతానికి బాగుచేయలేని మరియు ఈ విధానమందంతటా ఓర్చుకోవాల్సిన భౌతిక మానసిక రోగాలు అనేకం ఇప్పటికీ ఉన్నాయి. (యాకోబు 5:11) ఈలోగా “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుడు,” పెద్దలు, సంఘంలోవున్న ఇతరులందరూ రోగులకు కరుణా హస్తాన్ని చాచి, మద్దతునిస్తున్నారు. రోగమికలేని మహిమాయుక్తమైన సమయం వరకూ సహించుకోవడానికి వారిని యెహోవాయే బలపరుస్తున్నాడు.—మత్తయి 24:45; కీర్తన 41:1-3; యెషయా 33:24.
[అధస్సూచీలు]
a బహుశా ఉన్నతస్థాయి ఉద్యోగం కొరకు పరిశీలన క్రిందనున్నప్పుడు, కొన్నిసార్లు మానసిక వ్యాధి నిర్ధారణ చేయించుకోవాలని వ్యక్తిగతంగా కోరబడవచ్చు. అలాంటి నిర్ధారణకు ఒకడు అంగీకరించడం లేక అంగీకరించకపోవడం వ్యక్తిగతమైన విషయమేగాని సైకియాట్రిక్ వ్యాధి నిర్ధారణ, సైకియాట్రిక్ చికిత్సకాదని గుర్తించాలి.
b మార్చి1, 1990 కావలికోట (ఆంగ్లం) సంచికలోని “కృంగుదలకు వ్యతిరేకంగా పోరాటాన్ని జయించుట” చూడండి.
c కొన్ని మానసిక బలహీనతలు సరియైన మందులతో నయమవుతున్నట్లు కనబడుతుంది. కాని ఈ మందుల మోతాదు సరియైనరీతిలో క్రమపరచకపోతే తీవ్రమైన సైడ్ ఎఫెక్టులు ఉంటాయి గనుక నైపుణ్యంగల, అనుభవజ్ఞులైన వైద్య ఫిజిషియన్లు లేదా సైకియాట్రిస్ట్‌ల సలహాతోనే వీటిని ఉపయోగించాలి.
d అక్టోబరు 15, 1988 కావలికోట (ఆంగ్లం) సంచికలోని “మానసిక కలత—ఓ క్రైస్తవున్ని కమ్ముకున్నప్పుడు” అనే శీర్షికను చూడండి.