క్రైస్తవమత సామ్రాజ్యపు ఆరాధనను దేవుడెలా దృష్టిస్తాడు?
“ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి—ప్రభువా, ప్రభువా, మేము . . . నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు—నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నాయొద్ద నుండి పొండని వారితో చెప్పుదును.”—మత్తయి 7:21-23.
తన పవిత్రవాక్యమగు పరిశుద్ధ బైబిలు ద్వారా దేవుడు తన చిత్తమేమిటో స్పష్టం చేశాడు. క్రైస్తవమత సామ్రాజ్య చర్చి సభ్యులు మరి దేవుని చిత్తం చేస్తున్నారా? లేక యేసు చెప్పినట్లు ‘అక్రమము చేయువారిగా’ ఉన్నారా?
రక్తపాతం
తన యజమాని మరణించడానికి ముందురాత్రి, యేసును బంధించడానికి పంపబడిన సైనికులతో పేతురు దాదాపు సాయుధ పోరాటానికి దిగాడు. (యోహాను 18:3, 10) యేసు, పరిస్థితిని శాంతపరచి పేతురునిలా హెచ్చరించాడు: “నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు.” (మత్తయి 26:52) ఈ స్పష్టమైన హెచ్చరిక ప్రకటన 13:10లో పునరుద్ఘాటించబడింది. క్రైస్తవమత సామ్రాజ్యపు చర్చి సభ్యులు దానిని లక్ష్యపెట్టారా? లేక భూమ్మీద వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధాలకు వారు బాధ్యతను పంచుకుంటారా?
రెండవ ప్రపంచయుద్ధ కాలంలో లక్షలాది మంది సెర్బ్‌లు, క్రోయేషియన్లు మతం పేరిట హత్యచేయబడ్డారు. “ఫాసిస్టు పరిపాలన క్రోయేషియాలో జాతి ప్రక్షాళనా విధానాన్ని ప్రవేశపెట్టింది, అది నాజీ కృత్యాలను కూడా మించిపోయింది. . . . సెర్బ్లలో మూడింట ఒక వంతును దేశం నుండి వెళ్ళగొట్టాలని, మూడింట ఒక వంతును రోమన్ కాథోలిక్ మతానికి మార్చాలని, మరో మూడింట ఒక వంతును హతమార్చివేయాలని అది ప్రకటించింది. . . . ఈ చర్యల్లో కాథోలిక్ మతగురువుల పాక్షిక సహకారం, యుద్ధం ముగిసిన తర్వాత చర్చికి ప్రభుత్వానికి మధ్యగల సంబంధాలను తీవ్రంగా పాడుచేసింది” అని ద న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా నివేదిస్తున్నది. అసంఖ్యాక ప్రజలు కాథోలిక్ మతానికి మారడానికో లేక చావడానికో ఒత్తిడి చేయబడ్డారు; వేలాదిమంది ఇతరులకు ఎంచుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. గ్రామాలకు గ్రామాలనే—పురుషులనేమి స్త్రీలనేమి పిల్లలనేమి—బలవంతంగా వారి ఆర్థడాక్స్ చర్చిలోనికి తీసుకెళ్ళి చంపారు. మరి వ్యతిరేకిస్తున్న కమ్యూనిస్టు సేనల విషయమేమి? వారికి కూడా మతం మద్దతు ఉండెనా?
“కొంత మంది ప్రీస్టులు విప్లవ దళాల పక్షాన పోరాడారు” అని హిస్టరీ ఆఫ్ యుగోస్లావియా అనే పుస్తకం నివేదిస్తుంది. రహస్య దళాల్లో సెర్బియన్ ఆర్థడాక్స్, రోమన్ కాథోలిక్ చర్చీల ప్రీస్టులు కూడా ఉన్నారు’ అని యుగోస్లావియా అండ్ ద న్యూ కమ్యూనిజమ్ అనే పుస్తకం పేర్కొంటోంది. బాల్కన్ ప్రాంత యుద్ధ జ్వాలకు మత విభేదాలు మరింత ఆజ్యం పోశాయి.
మరి రువాండ విషయమేమి? అంతర్జాతీయ సంబంధాల కొరకైన కాథోలిక్ సంస్థ ప్రధాన కార్యదర్శి ఈయన్ లిండన్ ద మంత్ అనే పత్రికలో ఈ విధంగా అంగీకరించాడు: “స్థానిక కాథోలిక్ ఆంగ్లికన్ మరియు బాప్టిస్ట్ చర్చి నాయకులు పొరపాటుననో లేక కావాలనో సాయుధ మారణకాండలో ఇమిడి ఉన్నట్లు లండన్‌లో ఆఫ్రికన్ రైట్స్ చేసిన పరిశోధన ఒకటి రెండు ఉదాహరణలను అందిస్తున్నది. . . . ఆ మారణకాండలో ప్రముఖ చర్చీల సభ్యులు అనేకమంది చేరియున్నారనడంలో ఏ సందేహం లేదు.” విచారకరంగా, క్రైస్తవులమని చెప్పుకునే వారిమధ్య పోరాటం మధ్య ఆఫ్రికాను ఇప్పటికీ ఎడతెగక పీడిస్తుంది.
జారత్వము, వ్యభిచారము
దేవుని వాక్యం ప్రకారము లైంగిక సంబంధాలకు కేవలం ఒకే గౌరవస్థానం కలదు, అది వివాహబంధమందు మాత్రమే. “వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును” అని బైబిలు చెబుతున్నది. (హెబ్రీయులు 13:4) చర్చి నాయకులు దేవుని ఈ బోధను హత్తుకుంటున్నారా?
ఆ జంట పూర్తిగా ఒకరికొకరు మాట ఇచ్చుకుంటే వివాహానికి ముందే లైంగిక చర్యలో తప్పులేదని సూచించే ఒక అధికార దస్తావేజుని ఆస్ట్రేలియాలోని ఆంగ్లికన్ చర్చి 1989లో విడుదల చేసింది. ఈ మధ్యే స్కాట్లండ్‌లోని ఆంగ్లికన్ చర్చి నాయకుడు, “వ్యభిచార కార్యకలాపాలను పాపమని, తప్పని చర్చి నిందించకూడదు. వ్యభిచారానికి మన జన్యువులే కారణమని చర్చి తప్పక ఒప్పుకోవాలి” అని అన్నాడు.
దక్షిణాఫ్రికాలో అనేకమంది మతగురువులు సలింగసంయోగాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. ఉదాహరణకు, 1990లో దక్షిణాఫ్రికా పత్రిక యు ఒక ప్రముఖ ఆంగ్లికన్ మతాచారి ఇలా చెప్పాడని తెల్పింది: “లేఖనం ఎల్లకాలం మనకు వర్తించదు . . . సలింగ సంయోగుల విషయంలో చర్చి దృక్పథం విధానంలో మార్పులు వస్తాయని నేను నమ్ముతున్నాను.”—రోమీయులు 1:26, 27కు విరుద్ధమైనది.
1994 బ్రిటానికా బుక్ ఆఫ్ ది ఇయర్ ప్రకారం, “ప్రకటిత సలింగ సంయోగులుగా ఉన్న పురుషులను మరియు స్త్రీలను మతాచారులుగా తీసుకోవడం, సలింగ సంయోగుల హక్కుల విషయంలో మతావగాహన, ‘సలింగ వివాహాన్ని’ ఆశీర్వదించడం, సలింగ సంయోగంతో ముడిపడివున్న జీవన పద్ధతులను చట్టబద్ధంచేయడం లేదా ఖండించడం” వంటి విషయాల్లో ప్రత్యేకంగా అమెరికా చర్చీల్లో లైంగికత్వం ఒక ప్రధాన అంశంగా తయారైంది. మరింత లైంగిక స్వేచ్ఛ కొరకు విశేష ప్రచారం చేసే మతగురువులను అనేక పెద్ద చర్చి శాఖలు సమర్థిస్తున్నాయి. 1995 బ్రిటానికా బుక్ ఆఫ్ ది ఇయర్ ప్రకారం, “సలింగసంయోగులను మతాచారులుగా స్వీకరించాలని, సలింగ సంయోగ క్రియను అంగీకరించాలనే ధృవపత్రంపై” 55 మంది ఎపిస్కోపాలియన్ బిషప్పులు సంతకం చేశారు.
యేసు దానికి వ్యతిరేకంగా ఎన్నడూ మాట్లాడలేదని చెబుతూ, కొందరు మతగురువులు సలింగసంయోగం తరపున వాదిస్తున్నారు. కానీ అది నిజమేనా? దేవుని వాక్యము సత్యమని యేసుక్రీస్తు ప్రకటించాడు. (యోహాను 17:17) అంటే లేవీయకాండము 18:22లో వివరించబడినట్లు సలింగసంయోగం విషయంలో దేవుని ఉద్దేశాన్ని ఆయన ధృవీకరించినట్లేనని దాని భావం. అక్కడిలా ఉంది: “స్త్రీ శయనమువలె పురుషశయనము కూడదు; అది హేయము.” అంతేకాకుండా, “చెడ్డవన్నియు లోపలినుండియే బయలువెళ్లి, మనుష్యుని అపవిత్రపరచునని” చెప్పినప్పుడు యేసు వ్యభిచారమును జారత్వమును ఈ రెండింటిని కూడా ప్రస్తావించాడు. (మార్కు 7:21-23) వ్యభిచారం అనేదానికి గ్రీకు భాషా పదానికి జారత్వమనే పదం కంటే మరి విస్తృతమైన భావం ఉంది. సలింగ సంయోగంతో సహా చట్టబద్ధమైన వివాహం వెలుపలగల అన్నిరకాల లైంగిక సంబంధాలను సూచిస్తుంది. (యూదా 7) వ్యభిచార గంభీరతను తక్కువచేయు ఏ క్రైస్తవుడినైననూ సహించవద్దని కూడా యేసుక్రీస్తు తన అనుచరులను హెచ్చరించాడు.—ప్రకటన 1:1; 2:14, 20.
సలింగసంయోగులైన స్త్రీపురుషులు మతాచారత్వమును పొందాలని మతనాయకులు గట్టిగా ప్రచారం చేసినప్పుడు, వారి చర్చిసభ్యులపై ప్రత్యేకంగా యౌవనస్థులపై అది ఎలాంటి ప్రభావం చూపుతుంది? వివాహేతర లైంగికత్వాన్ని ప్రయోగాత్మకంగా చేయమని పురికొల్పడం కాదా? దానికి భిన్నంగా, “జారత్వమునకు దూరముగా పారిపోవుడి” అని బైబిలు క్రైస్తవులను పురికొల్పుతున్నది. (1 కొరింథీయులు 6:18) తోటివిశ్వాసి ఎవరైనా అలాంటి పాపమందు పడినట్లయిన మరలా దేవుని అనుగ్రహం పొందే స్థితికి వచ్చులాగున ప్రేమతో అట్టివారికి సహాయం చేయబడుతుంది. (యాకోబు 5:16, 19, 20) ఆ సహాయాన్ని నిరాకరించినట్లయితే అప్పుడేమిటి? అలాంటివారు పశ్చాత్తాపపడకపోతే, వారు ‘దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని’ బైబిలు పేర్కొంటోంది.—1 కొరింథీయులు 6:9, 10.
‘వివాహమును నిషేధించుట’
“జారత్వములు జరుగుచున్నందున” “కామతప్తులగుటకంటె పెండ్లిచేసికొనుట మేలు” అని బైబిలు చెబుతున్నది. (1 కొరింథీయులు 7:2, 9) ఈ జ్ఞానయుక్తమైన సలహా ఉన్ననూ, అనేకమంది మతగురువులు వివాహం చేసుకోకుండానే అంటే అవివాహితులుగానే ఉండాలని కోరబడుతున్నారు. “ఒక ప్రీస్టు, సన్యాసి లేదా సన్యాసిని లైంగిక సంబంధాల్లో పాల్గొంటే వారి అవివాహిత ప్రమాణం తొలగిపోదు. . . . పాపసంకీర్తన చేసి, యథార్థముగా ఒప్పుకుంటే లైంగిక సంబంధాలకు క్షమాపణ లభించవచ్చు, అయితే ఏ ప్రీస్టు అయినా వివాహం చేసుకుంటే మాత్రం చర్చి అంగీకరించదు” అని ది వాటికన్ పేపర్స్ అనే స్వీయగ్రంథంలో నీనో లో బెల్లో వివరిస్తున్నాడు. ఈ బోధ ఎట్టి ఫలాన్ని ఉత్పత్తి చేసింది, మంచిదా లేక చెడ్డదా?—మత్తయి 7:15-19.
నిస్సందేహంగా, చాలామంది ప్రీస్టులు నైతిక పరిశుభ్రతతో జీవిస్తున్నారు, అయితే, అనేకమంది అలా జీవించడం లేదు. 1992 బ్రిటానికా బుక్ ఆఫ్ ది ఇయర్ చెప్పిన ప్రకారం, “మతగురువుల లైంగిక దుర్నీతికి సంబంధించిన కేసుల పరిష్కారానికి రోమన్ కాథోలిక్ చర్చి 30 కోట్ల డాలర్లు ఖర్చు చేసినట్లు నివేదించబడింది.” ఆ పిదప 1994వ సంచిక ఇలా తెల్పింది: “ఎయిడ్స్ ద్వారా మరణించిన మతగురువుల సంఖ్యలో సలింగ సంయోగులైన ప్రీస్టులున్నారని, ప్రీస్టులుగా సేవచేసేందుకు చెప్పలేనంతమంది సలింగసంయోగులు . . . తీసుకోబడ్డారని స్పష్టంగా వెల్లడౌతోంది.” ‘వివాహమును నిషేధించడం’ దయ్యాల బోధయని బైబిలు చెప్పడంలో ఆశ్చర్యం లేదు. (1 తిమోతి 4:1-3) వికార్స్ ఆఫ్ క్రైస్ట్ అనే స్వీయపుస్తకంలో పీడర్ డే రోసా ఇలా వ్రాస్తున్నాడు: “కొందరు చరిత్రకారులు చెప్పినదాని దృష్ట్యా వ్యభిచారంతో సహా పశ్చిమ ప్రపంచమందు మరేయితర వ్యవస్థకన్నా [ప్రీస్టుల బ్రహ్మచర్యం] నైతికత్వానికి ఎంతో హాని కల్గించింది. . . . అది క్రైస్తవత్వానికి ఎంతో పెద్ద మచ్చ తెచ్చింది. . . . మతనాయక వర్గాల్లో ఒత్తిడి చేయబడిన అవివాహితత్వం అన్నివేళలా వేషధారణకు నడిపింది. . . . ఒక ప్రీస్టు వెయ్యిసార్లు తప్పిపోవచ్చేమో గానీ అతడు వివాహం చేసుకోవడాన్ని చర్చిశాసనం నిషేధించింది.”
బయలు ఆరాధన విషయంలో దేవుని ఉద్దేశాన్ని పరిశీలించిన తర్వాత, క్రైస్తవమత విభాగిత చర్చీలను ఆయనెలా దృష్టిస్తాడో వివేచించడం అంత కష్టమైన పనేమీ కాదు. బైబిల్లోని చివరి పుస్తకం అన్ని అబద్ధ ఆరాధనలను కలిపి “వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లియైన మహాబబులోను” అనే పేరుతో వాటిని పిలుస్తుంది. బైబిలు ఇంకా చెప్పేదేంటంటే, ‘ప్రవక్తల యొక్కయు, పరిశుద్ధుల యొక్కయు, భూమిమీద వధింపబడినవారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెను.’—ప్రకటన 17:5; 18:24.
కాబట్టి, తన సత్యారాధికులుగా ఉండాలని ఇష్టపడేవారందరికి దేవుడిలా ఉద్బోధిస్తున్నాడు: “నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచిరండి. . . . ఒక్క దినముననే దాని తెగుళ్లు, అనగా మరణమును దుఃఖమును కరవును వచ్చును; దానికి తీర్పుతీర్చుచున్న దేవుడైన ప్రభువు [“యెహోవా,” NW] బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడును.”—ప్రకటన 18:4, 8.
ఇప్పుడు ఈ ప్రశ్న లేవదీయబడుతుంది: అబద్ధమతం నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? దేవునికి ఎలాంటి ఆరాధన అంగీకృతంగా ఉంటుంది?
[5వ పేజీలోని బాక్సు/చిత్రం]
విగ్రహారాధన
బయలు ఆరాధనలో విగ్రహాలు చేరివుండెను. ఇశ్రాయేలీయులు యెహోవా ఆరాధనలో బయలు ఆరాధనను మిళితం చేసేందుకు ప్రయత్నించారు. వారు యెహోవా మందిరములోనికి విగ్రహాలను కూడా తెచ్చారు. యెరూషలేమును అందలి ఆలయాన్ని నాశనం చేసినప్పుడు, విగ్రహారాధన విషయంలో తన ఉద్దేశమేమిటో దేవుడు స్పష్టంగా చూపాడు.
క్రైస్తవమత సామ్రాజ్యపు అనేక చర్చీలు విగ్రహాలతో నిండివున్నాయి. అవి సిలువలుగా, విగ్రహాలుగా లేదా మరియమ్మ ప్రతిమలుగా ఉండవచ్చు. అంతేకాకుండ, ఈ ప్రతిమల ముందు తలవంచడం మోకాళ్ళూనడం లేక సిలువ గుర్తు వేసుకోవడం వంటివి చర్చీలకు వెళ్ళేవారికి అనేక మందికి నేర్పబడుతుంది. దీనికి భిన్నంగా “విగ్రహారాధనకు దూరముగా పారిపొండి” అని సత్యరాధికులు ఆజ్ఞాపించబడ్డారు. (1 కొరింథీయులు 10:14) వస్తురూపాల సహాయంతో దేవుని ఆరాధించడానికి వారు ప్రయత్నించరు.—యోహాను 4:24.
[క్రెడిట్ లైను]
Musée du Louvre, Paris
[7వ పేజీలోని బాక్సు]
“చర్చి నాయకుడు దోషం లేకుండా ఉండాలి”
టుడేస్ ఇంగ్లీష్ వర్షన్ ప్రకారం తీతు 1:7నుండి ఈ వాక్యభాగం తీసుకోబడింది. కింగ్ జేమ్స్ వర్షన్లో అదిలా చదువబడుతోంది: “బిషప్ దోషము లేనివాడై ఉండాలి.” “బిషప్” అనే పదం ‘అధ్యక్షుడు’ అనే అర్థంగల గ్రీకు పదం నుండి వచ్చింది. ఆ విధంగా నిజమైన క్రైస్తవ సంఘంలో నాయకత్వం వహించడానికి నియమించబడిన పురుషులు బైబిలు ప్రాథమిక సిద్ధాంతాలను పాటించేవారిగా ఉండాలి. అలా పాటించకపోతే వారేమాత్రం ‘మందకు మాదిరిగా’ లేరు గనుక ఆ పర్యవేక్షణా స్థానం నుండి తొలగించబడాలి. (1 పేతురు 5:2, 3) క్రైస్తవమత చర్చీలు ఈ నియమాన్ని ఎంత గంభీరంగా తీసుకున్నాయి?
ఐ కేర్ ఎబౌట్ యువర్ మ్యారేజ్ అనే స్వీయరచనలో డా. ఎవర్ట్ వాషింగ్టన్ అమెరికాలోని వర్జీనియానందలి 100 మంది పాస్టర్లతో జరిపిన సర్వేను గూర్చి ఇలా తెల్పుతున్నాడు. వారిలో 40 శాతంపైగా తమ వివాహజత కాని ఎవరో ఒకరితో మోహోద్రేక ప్రవర్తనలో పాల్గొన్నట్లు అంగీకరించారు. వారిలో అనేకులు వ్యభిచారం చేశారు.
“గత దశాబ్దమందు, చర్చిలో ప్రముఖులైన వారి లైంగిక దుర్నీతిగల ప్రవర్తన విషయమై అనేకమార్లు చర్చి కలవరపడింది” అని క్రిస్ట్యానిటీ టుడే కనుగొన్నది. “లైంగిక దుష్ప్రవర్తనలో పట్టుబడిన” తర్వాత చర్చినాయకులను త్వరితంగా వారి పూర్వస్థానాలకు తిరిగి నియమించే క్రైస్తవమత సామ్రాజ్య సాధారణ వాడుకను “వ్యభిచారులైన పాస్టర్లను వారి పూర్వస్థానాలకు తిరిగి ఎందుకు నియమించకూడదు” అనే శీర్షిక సవాలు చేసింది.