మీరు నిజంగా దేవునిని ప్రేమించగలరా?
‘ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడు’ అని దేవుడు చెప్పాడు. (నిర్గమకాండము 33:20) అంతేకాకుండా, బైబిలు కాలాలనుండీ ఏ మానవుడూ ఆయనతో నేరుగా సంభాషించినట్లుగా ఏ ఆధారాలూ లేవు. మీరు ఎన్నడూ నేరుగా చూడనీ లేక వినని వ్యక్తితో సన్నిహిత సంబంధాన్ని పెంచుకోవడం—కష్టమని—అసాధ్యమని కూడా అనిపించదా? విశ్వ సృష్టికర్తతో ప్రేమపూర్వకమైన సంబంధాన్ని పెంచుకోవడం నిజంగా సాధ్యమేనా?
దేవునితో అనురాగంతో కూడిన వ్యక్తిగత సంబంధాన్ని పెంచుకోవడం సాధ్యమన్న విషయంలో ఏ అనుమానమూ ఉండకూడదు. ద్వితీయోపదేశకాండము 6:5లో, “నీ పూర్ణహృదయముతోను నీపూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను” అని ఇశ్రాయేలు జనాంగానికి ఆజ్ఞ ఇవ్వబడినట్లు మనం చదువుతాము. యేసుక్రీస్తు ఈ ఆజ్ఞను తన అనుచరులకు మరలా నొక్కిచెబుతూ ఇంకా ఇలా అన్నాడు: “ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ.” (మత్తయి 22:37, 38) అలాంటి సంబంధం అసాధ్యమైనట్లయితే దేవునిని ప్రేమించమని బైబిలు మనకు ఉద్బోధిస్తుందా?
కేవలం యెహోవా ఆజ్ఞాపిస్తున్నందుకే ఆయన్ను మనం ప్రేమించాలని ఆయన అపేక్షిస్తాడా? లేదు. తనను ఆరాధించే శక్తితో మొదటి మానవ జంటను దేవుడు సృజించాడు. తమ సృష్టికర్తతో ప్రేమపూర్వకమైన సంబంధం కల్గివుండాలని ఆదాము హవ్వలు బలవంతం చేయబడలేదు. బదులుగా, వారు దేవుని ఎడల గాఢమైన ఆప్యాయతను పెంచుకునేందుకు అనువైన పరిస్థితులను ఆయన వారి చుట్టూ ఉంచాడు. దేవునికి సన్నిహితులు కావడం లేదా ఆయనకు దూరంకావడం అన్న ఎంపిక వారు చేసుకోవల్సిందే.
ఆదాము హవ్వలు ఎదురుతిరగాలనే ఎంచుకున్నారు. (ఆదికాండము 2:16, 17; 3:6, 7) అయితే వారి సంతతివారు సృష్టికర్తతో ప్రేమపూర్వకమైన సంబంధాన్ని పెంచుకునే శక్తిని కల్గివుంటారు.
నిజమైన దేవునితో నడవడం
ఉదాహరణకు, బైబిలులో అబ్రాహాము దేవుని ‘స్నేహితునిగా’ పేర్కొనబడ్డాడు. (యాకోబు 2:23) అయినప్పటికి దేవునితో సన్నిహిత సంబంధాన్ని అనుభవించినది అబ్రాహాము ఒక్కడు మాత్రమే కాడు. యెహోవా ఎడల యథార్థమైన ఆప్యాయతను చూపించి, “దేవునితో నడిచిన” అనేక మంది ఇతర అపరిపూర్ణ మానవులను గూర్చి బైబిలు మాట్లాడుతోంది.—ఆదికాండము 5:24; 6:9; యోబు 29:4; కీర్తన 25:14; సామెతలు 3:32.
పురాతన కాలంలోని దేవుని సేవకులు దేవుని ఎడల ప్రేమానురాగాలు కల్గి జన్మించలేదు. వారు దాన్ని పెంచుకోవల్సివుండినది. అది ఎలా? యెహోవా అనే ఆయన వ్యక్తిగత నామాన్ని తెలుసుకోవడం ద్వారా. (నిర్గమకాండము 3:13-15; 6:2, 3) ఆయన ఉనికి మరియు ఆయన దేవత్వాన్ని గూర్చి ఎరిగియుండడం ద్వారా. (హెబ్రీయులు 11:6) ఆయన ప్రేమపూర్వకమైన కార్యాలను తరచూ ధ్యానించడం ద్వారా. (కీర్తన 63:6) వారి అంతరంగ ఆలోచనలను ప్రార్థనలో వ్యక్తపర్చడం ద్వారా. (కీర్తన 39:12) ఆయన మంచితనాన్ని గూర్చి నేర్చుకోవడం ద్వారా. (జెకర్యా 9:17) ఆయన్ను బాధపెట్టకుండా ఉండేందుకు ఆరోగ్యకరమైన భయాన్ని పెంపొందించుకోవడం ద్వారా.—సామెతలు 16:6.
మీరు దేవుని స్నేహితులై ఆయనతో నడవగలరా? మీరు దేవున్ని చూడలేరు లేదా ఆయన స్వరాన్ని వినలేరన్నది నిజమే. అయినప్పటికీ, ‘తన గుడారములో అతిథిగా ఉండమని’ స్నేహితునిగా ఉండమని మిమ్మల్ని యెహోవా ఆహ్వానిస్తున్నాడు. (కీర్తన 15:1-5) ఆ విధంగా, దేవున్ని ప్రేమించడం మీకు సాధ్యమే. అయితే, ఆయనతో సన్నిహితమైన ఆప్యాయకరమైన సంబంధాన్ని మీరు ఎలా పెంచుకోగలరు?