కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 6/15 పేజీలు 4-7
  • దేవునిని ప్రేమించడం అంటే ఏమిటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవునిని ప్రేమించడం అంటే ఏమిటి?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘బలులను అర్పించుటకంటె మాట వినుట శ్రేష్ఠము’
  • దేవునితో సన్నిహితత్వం సాధ్యమే
  • ప్రేమామయుడైన దేవుని అనుకరించడం
  • విభిన్న వైఖరులను పెంపొందించుకున్న సహోదరులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • యెహోవాకు అంగీకృతమైన బలులను అర్పించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • కోపం వల్ల హత్య
    నా బైబిలు పుస్తకం
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 6/15 పేజీలు 4-7

దేవునిని ప్రేమించడం అంటే ఏమిటి?

సుమారు ఆరువేల సంవత్సరాల క్రితం, మొదటి మానవ బిడ్డ జన్మించాడు. అతను జన్మించిన తర్వాత తన తల్లియైన హవ్వ ఇలా చెప్పింది: ‘యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాను.’ (ఆదికాండము 4:1) తమ తిరుగుబాటువల్ల మరణిస్తామని అప్పటికే తీర్పుతీర్చబడినప్పటికీ, హవ్వ ఆమె భర్త ఆదాము యెహోవా దేవత్వాన్ని గూర్చి ఇంకా ఎరిగియున్నారని ఆమె మాటలు బయల్పరుస్తున్నాయి. ఆ తర్వాత వారు రెండవ కుమారుణ్ణి కన్నారు. ఆ అబ్బాయిలకు కయీను, హేబెలు అనే పేర్లను పెట్టడం జరిగింది.

కుమారులు పెరుగుతుండగా, కేవలం యెహోవా సృష్టిని పరిశీలించడం ద్వారానే ఆయన ప్రేమను గూర్చి వారు ఎంతో నేర్చుకోవడంలో సందేహంలేదు. వారు ప్రకృతిలోని అందమైన రంగులనూ వివిధ జంతువులనూ మొక్కలనూ చూసి ఆనందించారు. దేవుడు వారికి జీవాన్ని మాత్రమే కాకుండా వారు తమ జీవితంలో ఆనందాన్ని కనుగొనే సామర్థ్యాన్ని కూడా ఇచ్చాడు.

తమ తలిదండ్రులు పరిపూర్ణంగా సృజించబడ్డారని మరియు యెహోవా అసలు సంకల్పం మానవులు నిరంతరం జీవించాలనీ వారు నేర్చుకున్నారు. బహుశ, ఆదాము హవ్వలు వారికి, అందమైన ఏదెను తోటను గూర్చి వర్ణించారు మరియు అలాంటి పరదైసు భూమిమీది నుండి వారు ఎందుకు వెలివేయబడ్డారో కూడ వివరించవలసి వచ్చివుంటుంది. కయీను, హేబెలు, ఆదికాండము 3:15 నందు వ్రాయబడిన దైవిక ప్రవచనాన్ని గూర్చి కూడా ఎరిగియుండవచ్చు. ఆ ప్రవచనం ద్వారా, తనను ప్రేమించి, తనకు యథార్థంగా ఉన్నట్లు నిరూపించుకున్నవారి ప్రయోజనార్థమై తగిన కాలంలో విషయాలను చక్కబరుస్తానన్న తన సంకల్పాన్ని యెహోవా వ్యక్తం చేశాడు.

యెహోవాను గూర్చి ఆయన లక్షణాలను గూర్చి తెలుసుకోవడం, కయీను మరియు హేబెలునందు, దేవుని అనుగ్రహాన్ని పొందే కోరికను కల్గించివుంటుంది. కనుక యెహోవాకు అర్పణలను ఇవ్వడం ద్వారా వారాయనను సమీపించారు. బైబిలు వృత్తాంతం ఇలా చెబుతోంది: “కొంతకాలమైన తరువాత కయీను పొలముపంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను.”—ఆదికాండము 4:3, 4.

దేవుని అనుగ్రహం కావాలన్న వారి కోరిక ఆయనతో సంబంధాన్ని కల్గివుండేందుకు ఓ పునాదిని స్థాపించింది. కయీను దేవునికి ఎదురుతిరిగాడు, అయితే హేబెలు దేవుని యథార్థమైన ప్రేమవల్ల ప్రేరేపించబడుతూ వచ్చాడు. యెహోవా వ్యక్తిత్వమును మరియు ఆయన ఉద్దేశాలను గూర్చిన జ్ఞానాన్ని సంపాదించకుండా హేబెలు దేవునితో అలాంటి సంబంధాన్ని ఎన్నడూ పెంచుకునివుండేవాడు కాదు.

మీరు కూడా యెహోవాను తెలుసుకోగలరు. ఉదాహరణకు, దేవుడు ఏదో అకస్మాత్తుగా సృష్టి చేస్తూవుండే జీవంలేని శక్తి కాదు కానీ ఆయన నిజమైన వ్యక్తని మీరు బైబిలునుండి నేర్చుకుంటారు. (యోహాను 7:28; హెబ్రీయులు 9:24; ప్రకటన 4:11 పోల్చండి.) యెహోవా ‘కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడు’ అని కూడా బైబిలు బోధిస్తోంది.—నిర్గమకాండము 34:6.

‘బలులను అర్పించుటకంటె మాట వినుట శ్రేష్ఠము’

కయీను హేబెలు వృత్తాంతం ద్వారా ఉదాహరించబడినట్లుగా, దేవుని గూర్చిన జ్ఞానాన్ని కలిగివుండడం మరియు ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కల్గివుండాలనే కోరికను కల్గివుండడం మాత్రమే సరిపోవు. నిజమే, ఇద్దరు సహోదరులూ అర్పణలతో దేవున్ని సమీపించారు. అయినప్పటికీ, “యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్యపెట్టెను; కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకి మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొ”న్నాడు.—ఆదికాండము 4:3-5.

కయీను బలిని యెహోవా ఎందుకు నిరాకరించాడు? తన అర్పణలోని నాణ్యతలో ఏదైనా లోపం ఉందా? కయీను జంతు బలికి బదులుగా “పొలముపంట”ను అర్పించినందుకు యెహోవా నొచ్చుకున్నాడా? కానేకాదు. ఆ తర్వాత, ధాన్యార్పణను మరియు పొలముపంటను తన ఆరాధికులిచ్చినప్పుడు దేవుడు ఆనందంగా అంగీకరించాడు. (లేవీయకాండము 2:1-16) అంటే ఆధారాల ప్రకారంగా కయీను హృదయంలో ఏదో లోపం ఉందని తెలుస్తోంది. కయీను హృదయాన్ని యెహోవా చదవగలిగాడు మరి ఆయన్ను ఇలా హెచ్చరించాడు: “నీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చుకొని యున్నావేమి? నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువు.”—ఆదికాండము 4:6, 7.

దేవుని ఎడల యథార్థమైన ప్రేమంటే కేవలం బలులను అర్పించడం మాత్రమే కాదు. అందుకనే ‘సత్క్రియ చేయమని’ కయీనును యెహోవా ప్రోత్సహించాడు. దేవుడు విధేయతను కోరాడు. అలాంటి విధేయత సృష్టికర్తతో కయీను ప్రేమపూర్వకమైన సంబంధాన్ని కలుగజేసుకునేందుకు సహాయపడివుండేది. “తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పించుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము” అన్న మాటలతో విధేయత యొక్క విలువను బైబిలు నొక్కిచెప్పింది.—1 సమూయేలు 15:22.

ఈ విషయం ఆ పిదప 1 యోహాను 5:3 నందలి మాటల్లో దృఢపర్చబడింది: “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.” మనలను మనం ఆయన అధికారానికి లోపర్చుకోవడంకన్నా మన ప్రేమను చూపించడంలో వేరే ఏ విధానమూ అంత శ్రేష్ఠమైనది కాదు. దానర్థం బైబిలులోని నైతిక సూత్రావళికి విధేయులవ్వడమన్నమాట. (1 కొరింథీయులు 6:9, 10) అంటే మంచిని ప్రేమించి చెడును ద్వేషించడమని దాని భావం.—కీర్తన 97:10; 101:3; సామెతలు 8:13.

దేవుని ఎడల మన ప్రేమను కనపర్చడంలో ఒక ముఖ్యమైన విధానం మన పొరుగువారి ఎడల ప్రేమను చూపడం. బైబిలు మనతో ఇలా చెబుతుంది: “ఎవడైనను—నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు.”—1 యోహాను 4:20.

దేవునితో సన్నిహితత్వం సాధ్యమే

‘నేను యెహోవాను ఆరాధిస్తున్నాను. నేను ఆయన కట్టడలకు విధేయుడనౌతున్నాను. నా తోటి వారితో నేను నిష్పక్షపాతంగానే వ్యవహరిస్తున్నాను. నేనన్నీ చేస్తున్నాను. అయినా, నేను దేవునికి సన్నిహితంగా ఉన్నట్లు భావించడంలేదు. ఆయన ఎడల గాఢమైన ప్రేమ ఉన్నట్లు నేను భావించడంలేదు, మరి అది నేను అపరాధిగా భావించేట్లు చేస్తోంది’ అని కొందరనవచ్చు. యెహోవాతో అంత సన్నిహిత సంబంధాన్ని కలిగివుండేందుకు తాము పాత్రులముకామని కొందరనుకోవచ్చు.

యెహోవాకు సమర్పించుకుని, 37 సంవత్సరాలుగా సేవచేస్తున్న ఓ క్రైస్తవుడు ఇలా వ్రాశాడు: “యెహోవాకు నేను చేసే సేవ యాంత్రికమైనదని, కనీసం నేను హృదయపూర్వకంగానైనా చేయలేదని నేను నా జీవితంలో అనేకమార్లు భావించాను. అయితే యెహోవాను సేవించడం సరైన పనియని నాకు తెలుసు మరి నేను ఆ పని చేయకుండా నన్ను నేను నిరోధించుకోలేను. అయితే, ‘యెహోవా ఎడల ప్రేమవల్ల’ ఆమె లేక ఆయన ‘హృదయం ఉప్పొంగిందని’ చెప్పిన వృత్తాంతాలను నేను చదివిన ప్రతిసారి, ‘నేనేప్పుడూ అలా భావించలేదే, అసలు నాకేమైంది’ అని నేను ఆలోచించేవాడిని.” మనం దేవునితో సన్నిహితత్వాన్ని ఎలా పొందగలం?

మీరు ఎవరినైనా నిజంగా ప్రేమించినప్పుడు, మీరు ఆ వ్యక్తిని గూర్చి తరచూ ఆలోచిస్తారు. మీరు అతని ఎడల శ్రద్ధకల్గివుంటారు కనుక అతనికి సన్నిహితంగా ఉండాలనే బలమైన కోరికను కల్గివుంటారు. మీరు ఆయన్ను ఎంతగా చూసి మాట్లాడి మరియు ఆయన్ను గూర్చి ఆలోచించినట్లయితే, ఆయన ఎడల మీ ప్రేమ అంతగా పెరుగుతుంది. ఈ సూత్రం, దేవుని ఎడల మీరు ప్రేమను అలవర్చుకునేందుకు సహాయపడుతుంది.

కీర్తన 77:12, నందు ప్రేరేపితుడైన రచయిత ఇలా చెప్పాడు: “నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును.” దేవుని ఎడల ప్రేమను అలవర్చుకోవడంలో ధ్యానం ప్రాముఖ్యం. ఆయన అదృశ్యుడన్న వాస్తవం దృష్ట్యా అది మరి ప్రత్యేకంగా నిజం. అయితే మీరు ఆయన్ను గూర్చి ఎంతగా ఆలోచిస్తే ఆయన మీకు అంత వాస్తవమైన వాడౌతాడు. అప్పుడు మాత్రమే మీరు ఆయనతో హృదయపూర్వకమైన ఆప్యాయతతోకూడిన సంబంధాన్ని పెంచుకోగలరు, ఎందుకంటే ఆయన మీకు వాస్తవమైనవాడు.

యెహోవా మార్గాలు ఆయన వ్యవహరించే విధానాలపై తరచూ ధ్యానించాలనే మీ కోరిక మీరు ఆయన చెప్పేవాటిని ఎలా వింటున్నారన్న దానిపై ఆధారపడివుంటుంది. ఆయన వాక్యమైన బైబిలును క్రమంగా చదవడం మరియు పఠించడం ద్వారా మీరు ఆయనను వింటారు. “ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యు”డైన ఓ సంతోషకరమైన వ్యక్తిని గూర్చి కీర్తన గ్రంథకర్త మాట్లాడుతున్నాడు.—కీర్తన 1:1, 2.

మరో ప్రాముఖ్యమైన విషయం ప్రార్థన. అందుకనే, ‘ప్రతి సమయమునందును ప్రార్థన చేయుము,’ ‘ప్రార్థనచేయుటకు కొంత సమయాన్ని కేటాయించుడి,’ ‘ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి’ మరియు “యెడతెగక ప్రార్థన చేయుడి” అని బైబిలు తరచూ మనకు ఉద్బోధిస్తోంది. (ఎఫెసీయులు 6:18; 1 కొరింథీయులు 7:5; రోమీయులు 12:12; 1 థెస్సలొనీకయులు 5:17) యెహోవాకు చేసే ఎడతెగని ప్రార్థనలు, మనం ఆయనకు ప్రియమైన వారమయ్యేట్లు చేస్తాయి మరియు ఆయన వింటాడనే అభయం మనం ఆయనకు సన్నిహితులమయ్యేట్లు చేస్తుంది. “యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించియున్నాడు. కాగా నేనాయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొఱ్ఱపెట్టుదును” అని కీర్తనల గ్రంథకర్త ప్రకటించినప్పుడు ఇది రూఢిపర్చబడింది.—కీర్తన 116:1, 2.

ప్రేమామయుడైన దేవుని అనుకరించడం

యెహోవా మన ఎడల మంచిగా ఉన్నాడు. విశ్వానికి సృష్టికర్తగా, పరిగణలో ఉంచుకోవాల్సినవి మరియు శ్రద్ధ కనుపర్చాల్సిన విషయాలు ఆయనకు అనేకం ఉన్నాయి. అయితే, ఆయన ఎంతో ఘనమైనవాడైనప్పటికీ ఆయన మానవ సృష్టియెడల శ్రద్ధను కలిగివున్నాడని బైబిలు మనకు చెబుతున్నది. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. (1 పేతురు 5:6, 7) కీర్తనల గ్రంథకర్త తన ఈ మాటల ద్వారా దాన్ని నిర్థారిస్తున్నాడు: “యెహోవా, మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమియందంతట నీ నామము ఎంత ప్రభావముగలది. నీ చేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?”—కీర్తన 8:1, 3, 4.

యెహోవా మంటివంటి మానవుని ఎలా జ్ఞాపకముంచుకున్నాడు? దానికి, “మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను” అని బైబిలు జవాబిస్తుంది.—1 యోహాను 4:9, 10.

ఈ ప్రాయశ్చిత్త బలి, దేవుని ప్రేమకు అతి గొప్ప నిదర్శనం ఎలా అవుతుంది? ఏదెను వనంలో ఏమి జరిగిందో మనం పరిశీలిద్దాము. యెహోవా నియమానికి విధేయులై పరిపూర్ణ జీవితాన్ని కల్గివుండే ఉత్తరాపేక్షను నిరంతరం కల్గివుండడమా లేక యెహోవాకు ఎదురుతిరిగి తత్ఫలితంగా మరణించడమా అన్న ఓ నిర్ణయాన్ని ఆదాము హవ్వలు ఎదుర్కొన్నారు. వారు ఎదురుతిరిగేందుకే ఎన్నుకున్నారు. (ఆదికాండము 3:1-6) అలా చేయడం ద్వారా మానవజాతినంతటిని మరణానికి గురిచేశారు. (రోమీయులు 5:12) మనకై మనం నిర్ణయించుకునే అవకాశాన్ని వారు అహంకారంగా దొంగిలించారు. ఈ విషయంలో మనలో ఎవరమూ ఓ నిర్ణయాన్ని చేసుకోలేకపోయాము.

అయితే, యెహోవా ప్రేమపూర్వకంగా మంటివాడైన మానవుని స్థితిని గ్రహిస్తూ అతన్ని తన జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు మరణం ద్వారా మనలోని ప్రతి ఒక్కరమూ జీవమో మరణమో, విధేయతనో తిరుగుబాటునో ఎన్నుకునేందుకు యెహోవా న్యాయసమ్మతమైన ఆధారాన్నందించాడు. (యోహాను 3:16) తీర్పును మనమే చేసుకునేందుకు యెహోవా మనకు అవకాశాన్నిచ్చినట్లయింది—అలంకారార్థకంగా చెప్పాలంటే ఏదెను వనంలోకి వెళ్లి మన నిర్ణయాన్ని మనమే చేసుకునేలా చేస్తాడు. ప్రేమను కనుపర్చడంలో అత్యుత్తమమైన విధానం ఇదే.

తన ప్రథమ సంతానం ఓ నేరస్తునిగా అవమానించబడి, హింసించబడి, వ్రేలాడదీయబడినప్పుడు యెహోవా సహించిన వేదనను ఒక్కసారి ఊహించుకోండి. మరి దేవుడు మనకొరకు దాన్ని సహించాడు. మనలను ప్రేమించడంలో యెహోవా మొట్టమొదట చొరవ తీసుకున్నాడని తెలుసుకోవడం, తిరిగి మనం ఆయన్ను ప్రేమించేందుకూ ఆయన కొరకు వెదికేందుకూ మనలను కదిలించాలి. (యాకోబు 1:17; 1 యోహాను 4:19) “యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. . . . ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసికొనుడి ఆయన చేసిన సూచక క్రియలను ఆయననోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి” అని బైబిలు మనలను ఆహ్వానిస్తుంది.—కీర్తన 105:4, 5.

దేవునితో వ్యక్తిగతానురాగం మరియు ప్రేమపూర్వక సంబంధం కల్గివుండడం, ఆయన స్నేహితునిగా ఉండడం అవాస్తవికంకాదు. అది సాధించగల్గినదే. దేవుని ఎడల మన ప్రేమను మానవ సంబంధాలతో కచ్చితంగా సరిసమానం చేయలేమన్నది నిజమే. మన జీవిత భాగస్వామి, తలిదండ్రులు, బంధువులు, పిల్లలు, లేక స్నేహితుల ఎడల మనకు గల ప్రేమ దేవుని ఎడల ప్రేమ నుండి వేరుగా ఉంటుంది. (మత్తయి 10:37; 19:29) యెహోవాను ప్రేమించడంలో భక్తి, ఆరాధన మరియు ఆయన ఎడల షరతులులేని సమర్పణ చేరివున్నాయి. (ద్వితీయోపదేశకాండము 4:24) ఏ ఇతర సంబంధాల్లోనూ అలాంటి భావాన్నిచ్చే విషయాలు లేవు. అంతేకాకుండ, మనం భయభక్తులతోనూ పూజ్యభావంతోనూ దేవుని ఎడల బలమైన లోతైన భావోద్రేకాలను పెంచుకోగలము.—కీర్తన 89:7.

అపరిపూర్ణులమైనప్పటికీ, కయీను, హేబెలులవలె మీరు సృష్టికర్తను ప్రేమించే శక్తిని కల్గివున్నారు. సాతానుతో చేరే ఎంపిక కయీను చేసుకున్నాడు అలా మొట్టమొదటి మానవ హంతకుడయ్యాడు. (1 యోహాను 3:12) దానికి విరుద్ధంగా, విశ్వాసం నీతిగల వ్యక్తిగా హేబెలును దేవుడు జ్ఞాపకముంచుకుంటాడు మరియు రానున్న పరదైసునందు ఆయన జీవంతో ఆశీర్వదించబడతాడు.—హెబ్రీయులు 11:4.

మీకు కూడా ఓ ఎంపిక ఉంది. దేవుని ఆత్మ మరియు ఆయన వాక్య సహాయంతో, ‘మీ పూర్ణహృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ పూర్ణశక్తితోను’ దేవునిని మీరు నిజంగా ప్రేమించగలరు. (ద్వితీయోపదేశకాండము 6:5) బదులుగా, యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాడు ఎందుకంటే ఆయన ‘తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడు.’—హెబ్రీయులు 11:6.

[7వ పేజీలోని చిత్రం]

హేబెలు బలి దేవునికి అంగీకారమైంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి