ప్రేమ యొక్క ఉత్కృష్టమైన మార్గాన్ని నేర్చుకోవడం
కోసోవో, లెబనన్, ఐర్లండ్. ఈ దేశాలు ఇటీవలి సంవత్సరాల్లో వార్తల్లో తరచూ కనిపించాయి. ఈ దేశాల పేర్లు విన్నప్పుడు రక్తపాతం, బాంబు దాడులు, హత్యల దృశ్యాలు ప్రజల మనస్సుల్లో మెదులుతాయి. నిజమే, మతసంబంధ, జాతి సంబంధ, వర్గ సంబంధ భేదాల మూలంగా గానీ, మరితర భేదాల మూలంగా గానీ జరిగిన దౌర్జన్యపూరితమైన పోరాటాలు క్రొత్తేమీ కాదు. వాస్తవానికి, చరిత్ర పుటలు ఈ సంఘటనలతో నిండి ఉన్నాయి. అవి మానవజాతికి చెప్పలేనన్ని బాధలను కలిగించాయి.
చరిత్రంతటిలోను యుద్ధాలు సంభవించడాన్ని చూసి, అనేకులు యుద్ధాలు నిజంగా అనివార్యమనే, మానవులు ఒకరినొకరు ద్వేషించుకోవడం సహజమనే నిర్ధారణకు వచ్చారు. అయితే, అలాంటి దృక్కోణాలు దేవుని వాక్యమైన బైబిలు బోధలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. “దేవుడు ప్రేమాస్వరూపి; ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు” అని లేఖనాలు సుస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. (1 యోహాను 4:8) మానవులు ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడన్నది స్పష్టమే.
దేవుడు తన స్వరూపంలో మానవుడ్ని సృష్టించాడని కూడా బైబిలు బయల్పరుస్తుంది. (ఆదికాండము 1:26, 27) దేవుని గుణాలను—ఆయన గుణాల్లో కొట్టొచ్చినట్లు కనిపించే ప్రేమ అనే గుణాన్ని—ప్రతిబింబించే సామర్థ్యం మానవజాతికి ఇవ్వబడిందని దానర్థం. విషయమిదై ఉంటే, చరిత్రంతటిలోను మానవులు పరస్పరం ప్రేమను కనబరచుకోవడంలో ఎందుకు ఇంతగా విఫలులయ్యారు? బైబిలు, దీని గురించి కూడా లోతైన అవగాహనను ఇస్తుంది. మొదటి మానవ జతయైన ఆదాము హవ్వలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పాపంలో పడిపోయినందుకే ఇలా జరిగింది. దాని ఫలితంగా, వాళ్ళ సంతానమంతా కూడా పాపాన్నీ, అపరిపూర్ణతనూ వారసత్వంగా పొందింది. “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” అని రోమీయులు 3:23 వివరిస్తుంది. మనం వారసత్వంగా పొందిన పాపమూ, అపరిపూర్ణతా దేవుడిచ్చిన ప్రేమించే సామర్థ్యాన్ని చెడగొట్టాయి. దీనర్థం, మానవులకు ఒకరినొకరు ప్రేమించుకునే సామర్థ్యం ఇక లేదనా? మన తోటివాళ్ళతో శాంతియుతమైన, ప్రేమపూర్వకమైన సంబంధాన్ని శాశ్వతంగా అనుభవించగలమనడానికి ఏ నిరీక్షణ ఉంది?
మనం తప్పనిసరిగా దేవుడ్ని ప్రేమించడం నేర్చుకోవాలి
అపరిపూర్ణులైనప్పటికీ, ప్రేమించే సామర్థ్యం మానవ జాతికి ఇప్పటికీ ఉందని యెహోవా దేవునికి తెలుసు. అందుకనే, తనను మెప్పించాలనుకునేవారు ఎవరైనా సరే, తమ శాయశక్తులా ప్రేమను కనబరచాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన ధర్మశాస్త్రంలో అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏదో చెప్పమని దేవుని కుమారుడైన యేసుక్రీస్తును అడిగినప్పుడు, ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె[ను]. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ” అని ఆయన చెప్పాడు. ఆ తర్వాత, “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి . . . ఆధారమై యున్నవని” కూడా ఆయన చెప్పాడు.—మత్తయి 22:37-40.
అయితే, తాము చూడలేని వ్యక్తిని ప్రేమించడం కష్టమని చాలా మంది అనుకుంటారు. యెహోవా దేవుడు ఒక ఆత్మ కనుక మానవులమైన మనం ఆయనను చూడలేం. (యోహాను 4:24) అయినప్పటికీ, మన ప్రయోజనం కోసం ఆయన సృష్టించిన అనేక కార్యాల మీద మనమందరం ఆధారపడతాం గనుక, దేవుడు చేస్తున్నవాటిని బట్టి మనం ప్రతి రోజూ ప్రభావితులమౌతాం. అందుకే, అపొస్తలుడైన పౌలు, “ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారముననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలుచేయుటచేత [దేవుడు] తన్ను గూర్చి సాక్ష్యములేకుండ చేయలేదని” చెప్పినప్పుడు ఈ వాస్తవాన్ని సూచించాడు.—అపొస్తలుల కార్యములు 14:17.
దేవుడు దయచేసిన వాటి నుండి ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ప్రయోజనం పొందుతున్నప్పటికీ, తారతమ్యేనా చాలా తక్కువ మంది మాత్రమే ఆయన ఎడల కృతజ్ఞులుగా ఉంటారు లేదా ఆయనకు కృతజ్ఞతలు తెలపడానికి కదిలించబడతారు. కనుక, దేవుడు మన కోసం చేసిన మంచి వాటన్నింటినీ లెక్కలోనికి తీసుకుని, ఆయన చేసే ప్రతిదానిలోను కనిపించే అద్భుతమైన గుణాలను ధ్యానించవలసిన అవసరం ఉంది. మనం అలా ధ్యానించడం ద్వారా, మన గొప్ప సృష్టికర్త యొక్క సంభ్రమాశ్చర్యాలను కలిగించేంతటి వివేకాన్నీ, శక్తినీ వివేచించగల్గుతాం. (యెషయా 45:18) అన్నిటికన్నా ముఖ్యంగా, ఆయన ఎంతటి ప్రేమగల దేవుడు అన్న విషయాన్ని మనం గ్రహించగల్గేలా మనకు సహాయపడుతుంది. ఆయన అంతటి ప్రేమామయుడు కనుకనే, మనకు జీవితాన్నివ్వడమే కాక, జీవించడంలోని అనేక ఆనందాలను ఆస్వాదించడం సాధ్యమయ్యేలా చేశాడు.
ఉదాహరణకు, దేవుడు భూమి మీద సృష్టించిన లెక్కించలేనన్ని వైవిధ్యభరితమైన మనోహరమైన పువ్వులను గురించి ఆలోచించండి. మనం ఈ అందమైన సృష్టిని చూసి ఎంతో ఆహ్లాదాన్ని పొందే సామర్థ్యాన్ని కూడా ఆయన మనకు ఇవ్వడం ఎంత అద్భుతంగా ఉంది! అలాగే, మన పోషణ నిమిత్తం దేవుడు అన్ని రకాల పోషకాహారాలనూ ఇచ్చాడు. మనం భుజించడంలో కూడా ఎంతో ఆనందాన్ని అనుభవించేలా, మనకు రుచిని తెలుసుకునే సామర్థ్యాన్నిస్తూ మనల్ని సృష్టించినప్పుడు ఆయన మన గురించి ఎంత ఆలోచించాడో! దేవుడు నిజంగానే మనల్ని ప్రేమిస్తున్నాడనేందుకూ, ఆయన మన మంచి గురించి ఆలోచిస్తున్నాడనేందుకూ ఇవన్నీ స్పష్టమైన రుజువులు కావా?—కీర్తన 145:16, 17; యెషయా 42:5, 8.
సృష్టికర్త, “ప్రకృతి పుస్తకం” ద్వారా తనను తాను మనకు బయల్పరచుకోవడమే కాక, ఆయన తన వాక్యమైన బైబిలు ద్వారా తాను ఎలాంటి దేవుడో మనకు చూపిస్తున్నాడు. యెహోవా దేవుడు గతంలో చేసిన ప్రేమపూర్వకమైన అనేక కార్యాలూ, సమీప భవిష్యత్తులో మానవజాతిపై తాను కుమ్మరిస్తానని వాగ్దానం చేస్తున్న ఆశీర్వాదాలూ బైబిలులో వ్రాయబడ్డాయి కనుక ఆయన ఎలాంటి వాడో బైబిలు ద్వారా తెలుస్తుంది. (ఆదికాండము 22:17, 18; నిర్గమకాండము 3:17; కీర్తన 72:6-16; ప్రకటన 21:4, 5) అన్నింటికన్నా ముఖ్యంగా, మానవజాతి ఎడల దేవుడు ప్రేమను అతి గొప్పగా వ్యక్తీకరించాడు—మనం పాప మరణాల నుండి స్వతంత్రులమయ్యేందుకు గాను మన విమోచకుడుగా, తన ఏకైక కుమారుడ్ని ఇచ్చాడు—అన్న విషయాన్ని బైబిలు బయల్పరుస్తుంది. (రోమీయులు 5:8) నిజానికి, మనం మన ప్రేమపూర్వక సృష్టికర్త గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, మనం మన హృదయాంతరాల నుండి ఆయన్ను ప్రేమించడానికి అంత ఎక్కువగా కదిలించబడతాం.
మన తోటి మానవులను ప్రేమించడం నేర్చుకోవడం
యేసు సూచించినట్లు, మన పూర్ణ హృదయంతో, మన పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో దేవుడ్ని ప్రేమించడమే కాక, మనం మనల్ని ఎలా ప్రేమించుకుంటామో, పొరుగువారిని కూడా అలాగే ప్రేమించాలి. వాస్తవానికి, దేవునిపై మనకున్న ప్రేమ, మనం మన తోటి మానవులను ప్రేమించ బద్ధులనుగా చేస్తుంది. “ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింపబద్ధులమై యున్నాము” అని అపొస్తలుడైన యోహాను వివరించాడు. “ఎవడైనను—నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయనవలన పొందియున్నాము” అని కూడా ఆయన నొక్కిచెప్పాడు.—1 యోహాను 4:11, 20, 21.
బైబిలు ముందుగా చెప్పినట్లు, అధికసంఖ్యాకులు “స్వార్థప్రియులు”గా ఉంటూ, నేనే-ముందు అనే దృక్పథంతో ఉన్న లోకంలో నేడు మనం జీవిస్తున్నాం. (2 తిమోతి 3:2) కనుక, ప్రేమ యొక్క ఉత్కృష్టమైన మార్గాన్ని మనం నేర్చుకోవాలనుకుంటే, సాధారణంగా ప్రజలు అనుసరించే స్వార్థపూరిత మార్గాలను అనుసరించే బదులు, మనం మన మనస్సును మరల్చుకుని, మన ప్రేమగల సృష్టికర్తను అనుకరించేందుకు తీవ్రంగా ప్రయత్నించవలసి ఉంది. (రోమీయులు 12:2; ఎఫెసీయులు 5:1) దేవుడు, “కృతజ్ఞత లేనివారియెడలను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు.” ఆయన “చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయంపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.” మన పరలోక తండ్రి మన కోసం ఇంత గొప్ప మాదిరిని ఉంచుతున్నాడు గనుక, మనం అందరి ఎడల దయగలవారము గాను, సహాయకారులముగాను ఉండడానికి శ్రమించాలి. అలా చేయడం ద్వారా, మనం, ‘మన ప్రేమపూర్వక పరలోక తండ్రికి కుమారులము’ అని నిరూపించుకోగలం.—లూకా 6:35; మత్తయి 5:45.
కొన్నిసార్లు అలాంటి ప్రేమపూర్వకమైన పనులు ప్రజలు సత్య దేవుని ఆరాధకులుగా మారేందుకు సహాయపడతాయి. కొన్ని సంవత్సరాల క్రితం, యెహోవాసాక్షుల్లో ఒకరైన ఒక గృహిణి, తన పొరుగు స్త్రీతో బైబిలు సందేశాన్ని పంచుకునేందుకు ప్రయత్నించింది, అయితే ఆమె గట్టిగా తిరస్కరించింది. అయినప్పటికీ, అలాంటి ప్రతిస్పందనతో సాక్షి నిరుత్సాహపడలేదు. బదులుగా, ఆమె ఆ పొరుగు స్త్రీకి దయ చూపించడంలో కొనసాగింది, ఆమెకు సహాయకరంగా ఉండడానికి ప్రయత్నించింది. ఒకసారి ఆ పొరుగింటామె, ఇల్లు మారుతుండగా ఈ సాక్షి సహాయపడింది. మరొక సమయంలో, ఆ పొరుగామె తన బంధువులను కలిసేందుకు ఎయిర్పోర్టుకు వెళ్తుండగా ఒకరిని ఆమెకు తోడు పంపింది. తర్వాత, ఆ పొరుగామె బైబిలు పఠనానికి అంగీకరించింది. చివరకు తన భర్త నుండి తీవ్రమైన హింసను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ, ఆమె ఉత్సాహవంతురాలైన క్రైస్తవురాలిగా మారింది. అవును, ఆమె అలా ప్రేమను చూపించడం శాశ్వత ఆశీర్వాదాలకు పునాది అయ్యింది.
మనం సత్యసంధులమైతే, మనకు ప్రశంసనీయమైన లక్షణాలు ధారాళంగా ఉన్నందుకు కాదు యెహోవా మనల్ని ప్రేమిస్తున్నది అని మనం ఒప్పుకుంటాం. దానికి భిన్నంగా, మనకు ఎన్నో లోపాలూ, బలహీనతలూ ఉన్నప్పటికీ ఆయన మనలను ప్రేమిస్తాడు. అలా ఉన్నందువల్ల, మనం కూడా మన తోటి మానవులకు ఎన్నో దౌర్భల్యాలున్నప్పటికీ వారిని ప్రేమించడం నేర్చుకోవాలి. మనం ఇతరుల తప్పిదాలను చూసే బదులు, వాళ్ళలోని మంచి లక్షణాలను వివేచించి, ప్రశంసించడానికి మనకు మనం శిక్షణనిచ్చుకుంటే, మనకు వాళ్ళ మీద ప్రేమ కలగడం మరింత సులభంగా ఉంటుందని మనం కనుగొంటాం. సూత్రానుసార ప్రేమ కన్నా ఎక్కువైన ప్రేమ మనకు కలుగవచ్చు. ఆ ప్రేమలో ఇద్దరు సన్నిహిత స్నేహితుల మధ్య కలిగే ఆర్ద్రపూర్వకమైన వాత్సల్యమూ, ఇష్టమూ కూడా కలుగవచ్చు.
మీ ప్రేమ పెంపొందడానికి అనుమతించడం
ప్రేమ, స్నేహం అనేవాటిని అలవరచుకొని పెంపొందించుకోవలసిన అవసరముంది. వీటికి తప్పనిసరిగా కావలసినవి యథార్థత, సత్యసంధత. కొందరు, తాము ఎవరినైతే స్నేహితులుగా చేసుకోవాలనుకుంటారో వారికి తమ గురించి మంచి అభిప్రాయం కలిగేందుకుగాను తమ లోపాలను దాచటానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ, అలా చేయడం బెడిసికొడుతుంది, ఏదో ఒకరోజు వాళ్ళు వాస్తవాలను తెలుసుకుంటారు, సత్యసంధత లేకపోవడం వల్ల దూరమవుతారు. కనుక, మనం అధిగమించడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నటువంటి లోపాలు మనకున్నప్పటికీ, నిజానికి మనమెలాంటి వారమో ఇతరులను తెలుసుకోనివ్వడానికి భయపడకూడదు. అలా చేయడం, వాళ్ళతో స్నేహాన్ని పెంచుకునేందుకు దోహదపడవచ్చు.
ఉదాహరణకు, దూర ప్రాచ్యంలోని ఒక సంఘంలోని పెద్దవయస్కురాలైన సాక్షియైన ఒక సహోదరి అంతగా చదువుకోలేదు. అయినప్పటికీ ఆమె ఆ వాస్తవాన్ని ఎవరి దగ్గరా దాచడానికి ఎన్నడూ ప్రయత్నించదు. ఉదాహరణకు, 1914లో అన్యజనుల కాలములు ముగిశాయన్న విషయాన్ని బైబిలు ప్రవచనాల ద్వారా చరిత్ర ద్వారా రూఢిగా నిరూపిస్తూ ఇతరులకు చెప్పడం తనకు రాదని ఆమె నిర్మొహమాటంగా ఒప్పుకుంటుంది.a అయినప్పటికీ ఆమె పరిచర్యలో ఉత్సాహంగా ఉండడంలోను, అలాగే సహోదరుల విషయమై ప్రేమగాను, ఉదారంగా ఉండడంలోను ఎంతో మంచి మాదిరిని ఉంచడం వల్ల, ఆమె సంఘంలో ఆణిముత్యం అని చెప్పుకోబడుతుంది.
కొన్ని సంస్కృతుల్లో, బహిరంగంగా వాత్సల్యాన్ని కనబరచడం అంగీకరించబడదు; ప్రజలు ఒకరితోనొకరు వ్యవహరించేటప్పుడు నమ్రతా పూర్వకమైన మర్యాద చూపించాలని నేర్పించబడుతుంది. మంచిమర్యాదలు, ఇతరులపై శ్రద్ధ చూపించడమూ ఎల్లప్పుడూ మంచిదే అయినప్పటికీ, మన నమ్రతను, మనకు ఇతరుల ఎడల కలిగే అనుభూతులను అణచివేసేందుకు, వాటిని కనబరచడంలో అడ్డు నిలబడేందుకు అనుమతించకూడదు. “శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను” అని తాను ఎన్నుకున్న ప్రజలైన ప్రాచీన ఇశ్రాయేలుతో అంటూ వాళ్ళపై తనకున్న వాత్సల్యాన్ని గురించి చెప్పుకోవడానికి యెహోవా సిగ్గుపడలేదు. (యిర్మీయ 31:3) అలాగే, అపొస్తలుడైన పౌలు, “మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములనుకూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి” అని థెస్సలొనీకలోని తన తోటి విశ్వాసులకు చెప్పాడు. (1 థెస్సలొనీకయులు 2:8) కాబట్టి మనం తోటి మానవులపై యథార్థమైన వాత్సల్యాన్ని పెంచుకోవడానికి గట్టి ప్రయత్నం చేయడం, అలాంటి అనుభూతులను అణచివేసే బదులు వాటిని సహజంగా వ్యక్తపరచాలన్న బైబిలు బోధకు అనుగుణ్యంగా ఉంటుంది.
నిరంతర కృషి అవసరం
ఇతరులపై ప్రేమను పెంచుకోవడాన్నీ, ప్రేమను కనబరచడాన్నీ నేర్చుకోవడమనేది కొనసాగే ప్రక్రియ. అలా చేయడంలో, మనం చాలా కృషి చేయవలసి ఉంటుంది, ఎందుకంటే, మనం మన సొంత అపరిపూర్ణతలను అధిగమించేందుకు, ప్రేమరహితమైన ఈ లోకపు బలమైన ప్రభావాలను ఎదిరించేందుకు చాలా శ్రమించవలసి ఉంటుంది. అయినప్పటికీ, అలా చేయడం వల్ల మంచి ప్రతిఫలాలు కలుగుతాయి కనుక అలా చేయడానికి ప్రయత్నించడం వల్ల ప్రయోజనముంటుంది.—మత్తయి 24:12.
ఈ అపరిపూర్ణ లోకంలో కూడా, మనం మన తోటివాళ్ళతో మెరుగైన సంబంధాలను పెంచుకోవచ్చు, తద్వారా మనమూ అలాగే ఇతరులూ ఎంతో ఆనందాన్నీ, శాంతినీ, సంతృప్తినీ అనుభవించవచ్చు. అలాంటి ప్రయత్నాన్ని చేయడం ద్వారా, దేవుని నూతన లోకంలో సదాకాలం జీవించే అద్భుతమైన నిరీక్షణను కలిగి ఉండేందుకు యోగ్యులమని నిరూపించుకోగలం. అంతేకాక, ప్రేమ యొక్క ఉత్కృష్టమైన మార్గాన్ని నేర్చుకోవడం ద్వారా, మనం ప్రేమగల మన సృష్టికర్త యొక్క అంగీకారాన్ని, ఆశీర్వాదాలను ఇప్పుడూ ఎల్లప్పుడూ అనుభవించవచ్చు!
[అధస్సూచీలు]
a వివరాల కోసం లేఖనాలపై అంతర్దృష్టి, సంపుటి 1, 132-5 పేజీలు (ఆంగ్లం) చూడండి.
[10వ పేజీలోని చిత్రాలు]
దయాపూర్వక క్రియల ద్వారా క్రైస్తవ ప్రేమను చూపించవచ్చు
[8వ పేజీలోని చిత్రసౌజన్యం]
UN PHOTO 186226/M. Grafman