కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 4/15 పేజీలు 16-21
  • ఎందుకు సత్యారాధన దేవుని దీవెనను అందుకుంటుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎందుకు సత్యారాధన దేవుని దీవెనను అందుకుంటుంది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిజమైన మతం ఏ ఫలాలను ఉత్పత్తి చేయాలి?
  • ప్రేమించే మతమే కానీ, ద్వేషించే మతం కాదు
  • ప్రవర్తన మరియు బోధల శుద్ధతను దేవుడు దీవిస్తాడు
  • ‘సత్యం మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది’
  • ఒక విశిష్టమైన నామం
  • దేవుడు ఆమోదించే ఆరాధన
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • దేవున్ని ఆరాధించే సరైన పద్ధతి ఏంటి?
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • మతాలన్నీ దేవున్ని ప్రీతిపర్చుతాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • మీరు సరియైన మతాన్ని కనుగొన్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 4/15 పేజీలు 16-21

ఎందుకు సత్యారాధన దేవుని దీవెనను అందుకుంటుంది

“ప్రజలారా, యాను స్తుతించుడి! రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును; ఏలయనగా ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి.”—ప్రకటన 19:1, 2, NW.

1. మహాబబులోను ఎలా నాశనమౌతుంది?

దేవుని దృష్టిలో “మహాబబులోను” కూలిపోయింది, అది ఇప్పుడు అంతరించబోతోంది. ఈ ప్రపంచవ్యాప్త మత వేశ్య తన రాజకీయ ప్రియుల చేతుల్లో నాశనం కాబోతోందని బైబిలు ప్రవచనం సూచిస్తుంది; దాని నాశనం అకస్మాత్తుగా, వేగంగా వస్తుంది. యేసు యోహానుకిచ్చిన ప్రకటనలో ఈ ప్రవచనార్థక మాటలు ఉన్నాయి: “బలిష్టుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి యెత్తి సముద్రములో పడవేసి—ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును . . . అని చెప్పెను.”—ప్రకటన 18:2, 21, 23.

2. బబులోను నాశనాన్ని చూసి యెహోవా సేవకులు ఎలా ప్రతిస్పందిస్తారు?

2 మహాబబులోను నాశనం విషయమై సాతాను లోకంలోని కొన్ని విభాగాలు విలపిస్తాయి, అయితే దేవుని సేవకులు పరలోకంలోని వారైనా లేక భూమ్మీది వారైనా దాని విషయమై ఎంతమాత్రం విలపించరు. వారు ఆనందంతో దేవునికి ఇలా ఎలుగెత్తి చెబుతారు: “ప్రజలారా యాను స్తుతించుడి! రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును; ఏలయనగా ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి; తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పుతీర్చి తన దాసుల రక్తమునుబట్టి దానికి ప్రతిదండన చేసెను.”—ప్రకటన 18:9, 10; 19:1, 2, NW.

నిజమైన మతం ఏ ఫలాలను ఉత్పత్తి చేయాలి?

3. ఏ ప్రశ్నలకు జవాబు చెప్పవలసిన అవసరం ఉంది?

3 అబద్ధ మతం భూమిపైనుండి తుడిచిపెట్టబడుతుంది గనుక, ఏ విధమైన ఆరాధన నిలుస్తుంది? సాతాను లోకానికి చెందిన అబద్ధ మత సామ్రాజ్యం యొక్క నాశనాన్ని ఏ మత గుంపు తప్పించుకోగలదో నేడు మనమెలా నిర్ణయించగలం? ఈ గుంపు ఉత్పన్నం చేయవలసిన నీతియుక్త ఫలాలు ఏమిటి? యెహోవా సత్యారాధనను వేర్పరచేందుకు కనీసం పది లక్షణాలు ఉన్నాయి.—మలాకీ 3:18; మత్తయి 13:43.

4. సత్యారాధనకున్న మొదటి అవసరత ఏమిటి, ఈ విషయంలో యేసు ఎలా మాదిరి చూపాడు?

4 మొదటిది మరియు ప్రాముఖ్యమైనది ఏమంటే, యేసు దేని కొరకు మరణించాడో ఆ సర్వాధిపత్యాన్ని—ఆయన తండ్రి సర్వాధిపత్యాన్ని—నిజ క్రైస్తవులు ఉన్నత పరచాలి. యేసు ఏదో రాజకీయ, వర్గీయ, తెగ సంబంధమైన లేక సాంఘీక కారణాల కొరకు తన ప్రాణాన్ని అర్పించలేదు. యూదా రాజకీయ లేక విప్లవ ఆదర్శాలన్నింటికంటే తన తండ్రి రాజ్యాన్ని ఆయన ముందుంచాడు. ప్రాపంచిక అధికారాన్ని ఇస్తానన్న సాతాను ప్రతిపాదనకు ఆయనిలా సమాధానమిచ్చాడు: “సాతానా, పొమ్ము—ప్రభువైన నీ దేవునికి [“యెహోవా,” NW] మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్న”ది. భూమ్యంతటిపై యెహోవా నిజమైన సర్వాధిపతి అని ఆయనకు హెబ్రీ లేఖనాలనుండి తెలుసు. ఈ ప్రపంచ రాజకీయ విధానాలకు బదులు యెహోవా ఆధిపత్యానికి నిస్సందేహంగా మద్దతును ఏ మత గుంపు అందిస్తోంది?—మత్తయి 4:10; కీర్తన 83:18.

5. (ఎ) సత్యారాధికులు దేవుని నామాన్ని ఎలా దృష్టించాలి? (బి) యెహోవాసాక్షులు ఆ నామాన్ని ఘనపర్చుతున్నారని ఏది చూపుతుంది?

5 రెండవ అవసరత ఏమంటే సత్యారాధన దేవుని నామాన్ని ఘనపరచి, మహిమపరచాలి. సర్వశక్తిమంతుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు యెహోవా (కొన్ని బైబిలు అనువాదాల్లో యాహ్‌వే అని అనువదింపబడింది) అనే తన నామాన్ని బయల్పరచాడు, హెబ్రీ లేఖనాల్లో అది వేల కొలది సార్లు ఉపయోగింపబడింది. దానికంటే ముందే, ఆదాము హవ్వలకు మరియు ఇతరులకు ఈ నామం తెలుసు, అయితే వారు దీన్ని ఎల్లప్పుడూ గౌరవించలేదు. (ఆదికాండము 4:1; 9:26; 22:14; నిర్గమకాండము 6:2) క్రైస్తవమత సామ్రాజ్యం యొక్క మరియు యూదుల అనువాదకులు దైవిక నామాన్ని తమ బైబిళ్ల నుండి సాధారణంగా తొలగించినప్పటికీ, యెహోవాసాక్షులు మాత్రం పరిశుద్ధ లేఖనాల నూతన లోక అనువాదంలో (ఆంగ్లం) ఆ నామానికి తగిన స్థానాన్ని, గౌరవాన్ని ఇచ్చారు. తొలి క్రైస్తవులు చేసినట్టే వాళ్లూ ఆ నామాన్ని ఘనపర్చుతారు. యాకోబు ఇలా సాక్ష్యమిచ్చాడు: “అన్యజనులలోనుండి దేవుడు తన నామముకొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెనో సుమెయోను వివరించి యున్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడియున్నవి; . . . మనుష్యులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులును ప్రభువును [“యెహోవా,” NW] వెదకునట్లు . . . అనాదికాలమునుండి ఈ సంగతులను తెలియపరచిన ప్రభువు [“యెహోవా,” NW] సెలవిచ్చుచున్నాడు.”—ఇటాలిక్కులు మావి, అపొస్తలుల కార్యములు 15:14-17; ఆమోసు 9:11, 12.

6. (ఎ) సత్యారాధనకుగల మూడవ అవసరత ఏమిటి? (బి) యేసు మరియు దానియేలు రాజ్య పరిపాలనను ఎలా నొక్కి తెలిపారు? (లూకా 17:20, 21)

6 సత్యారాధనకు ఉండాల్సిన మూడవ అవసరత ఏమంటే, పరిపాలనను గూర్చిన మానవజాతి సమస్యలకున్న ఏకైక న్యాయబద్ధ మరియు ఆచరణయోగ్య పరిష్కారంగా అది దేవుని రాజ్యాన్ని ఉన్నతపరచాలి. ఆ రాజ్యం రావాలని, దేవుని పరిపాలన ఈ భూమిపై ఆధిపత్యం వహించాలని తన శిష్యులు ప్రార్థించాలని యేసు వారికి స్పష్టంగా నేర్పించాడు. అంత్య దినాలను గురించి ఇలా ప్రవచించేందుకు దానియేలు ప్రేరేపింపబడ్డాడు: “పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, . . . అది ముందు చెప్పిన [లౌకిక, రాజకీయ] రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయునుగాని అది యుగముల వరకు నిలుచును.” ఆ రాజ్యానికి తాము అవిభాగిత మద్దతును ఇస్తున్నామని ఈ 20వ శతాబ్దంలో ఎవరు తమ ప్రవర్తనా మాదిరి ద్వారా తెలియజేశారు—మహాబబులోను యొక్క మతాలా లేక యెహోవాసాక్షులా?—దానియేలు 2:44; మత్తయి 6:10; 24:14.

7. సత్యారాధికులు బైబిలును ఎలా దృష్టిస్తారు?

7 దేవుని అంగీకారాన్ని పొందేందుకు కావలసిన నాల్గవ అవసరత ఏమంటే దేవుని నిజ సేవకులు బైబిలును దేవుని ప్రేరేపిత వాక్యంగా ఉన్నతపరచాలి. అలా, బైబిలు మామూలు మానవ సాహిత్యం మాత్రమే అని, సాధారణ మానవ సాహిత్యంలో ఉండే సర్వ విఫలతలు బైబిలులో ఉన్నాయని సూచించేందుకు ప్రయత్నించే ఉన్నత విమర్శకు వారు లొంగిపోరు. అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన విధంగానే, బైబిలు దేవుని ప్రేరేపిత వాక్యమని యెహోవాసాక్షులు నమ్ముతారు: “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.”a కాబట్టి, యెహోవాసాక్షులు బైబిలును తమకు నడిపింపును ఇచ్చే దానిగా, ప్రతిదిన జీవితం కొరకు తమ చేతి పుస్తకంగా, భవిష్యత్తు కొరకైన తమ నిరీక్షణా ఊటగా వారు దృష్టిస్తారు.—2 తిమోతి 3:16, 17.

ప్రేమించే మతమే కానీ, ద్వేషించే మతం కాదు

8. సత్యారాధనకుగల ఐదవ అవసరత ఏమిటి?

8 యేసు తన నిజ అనుచరులను ఎలా వేరుపరిచాడు? ఆయన జవాబు, సత్యారాధనను గుర్తించేందుకుగల ప్రాముఖ్యమైన ఐదవ విషయం వద్దకు మనల్ని తెస్తుంది. యేసు ఇలా చెప్పాడు: ‘మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.’ (యోహాను 13:34, 35) యేసు తన ప్రేమను ఎలా చూపించాడు? తన ప్రాణాన్ని విమోచన క్రయధన బలిగా అర్పించడం ద్వారా. (మత్తయి 20:28; యోహాను 3:16) నిజ క్రైస్తవులకు యథార్థమైన ప్రేమ ఎందుకు ఒక ప్రాముఖ్యమైన లక్షణం? యోహాను ఇలా వివరించాడు: “ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది . . . దేవుడు ప్రేమాస్వరూపి; ప్రేమలేనివాడు దేవుని ఎరుగడు.”—1 యోహాను 4:7, 8.

9. నిజమైన ప్రేమను ఎవరు, మరియు ఎలా కనపరిచారు?

9 వంశీయ, జాతీయ, లేక తెగ సంబంధ ద్వేషం ఉన్నప్పటికీ, మన కాలంలో ఈ విధమైన ప్రేమను ఎవరు ప్రదర్శించారు? తమ ప్రేమ నిత్యం నిలిచేందుకని మరణం వరకూ తాళుకుని అత్యున్నత పరీక్షలో ఎవరు సఫలీకృతులయ్యారు? 1994లో రువాండా నందు జరిగిన జాతి నిర్మూలనానికి కొంతమేరకు బాధ్యత వహించారని తెలియవచ్చిన కాథోలిక్‌ ప్రీస్టులు, సన్యాసినులు అలా చేశారని మనం చెప్పగలమా? బాల్కన్స్‌లోని అంతర్యుద్ధంలో “జాతి ప్రక్షాళనకు” మరియు ఇతర క్రైస్తవ విరుద్ధ కార్యాలకు పాల్పడిన సెర్బియా యొక్క ఆర్థడాక్స్‌లూ లేక క్రొయేషియా యొక్క కాథోలిక్‌లునా? లేక గత కొన్ని దశాబ్దాలుగా ఉత్తర ఐర్లాండ్‌లోని వివక్షతాద్వేషాల అగ్నికి ఆజ్యం పోసిన కాథోలిక్‌ లేక ప్రొటెస్టెంటు మత నాయకులా? అలాంటి గొడవల్లో వేటిలో కూడా పాల్పంచుకున్నారని యెహోవాసాక్షులు ఎంతమాత్రం నిందించబడరు. తమ క్రైస్తవ ప్రేమకు ద్రోహం చేసే బదులు వారు చివరకు మరణ పర్యంతం చెరసాలలో మరియు నిర్బంధశిబిరాల్లో కష్టాలను సహించారు.—యోహాను 15:17.

10. నిజ క్రైస్తవులు ఎందుకు తటస్థంగా ఉండాలి?

10 దేవునికి అంగీకారయోగ్యమైన ఆరాధనకు ఉండవలసిన ఆరవ యోగ్యత ఏమంటే ఈ లోక రాజకీయ కార్యకలాపాల సంబంధంగా తటస్థంగా ఉండటం. క్రైస్తవులు రాజకీయాల్లో ఎందుకు తటస్థంగా ఉండాలి? అలాంటి స్థానాన్ని చేపట్టేందుకు పౌలు, యాకోబు మరియు యోహానులు మనకు దృఢమైన కారణాలను అందించారు. విభజించే రాజకీయాలతోపాటు, సాధ్యమైన ప్రతి విధంగా సాతాను, అవిశ్వాసుల మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగజేస్తున్న “ఈ యుగ సంబంధమైన దేవత” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. ‘యీ లోకస్నేహము దేవునితో వైరము’ అని శిష్యుడైన యాకోబు పేర్కొన్నాడు, ‘లోకమంతయు దుష్టునియందున్నది’ అని అపొస్తలుడైన యోహాను చెప్పాడు. కాబట్టి, సాతాను యొక్క కుళ్లిన లోకంలోని రాజకీయాలు, అధికారం విషయంలో ఇమిడిపోవడం ద్వారా ఒక క్రైస్తవుడు దేవుని ఎడల తనకుగల భక్తి విషయంలో రాజీపడలేడు.—2 కొరింథీయులు 4:4; యాకోబు 4:4; 1 యోహాను 5:19.

11. (ఎ) క్రైస్తవులు యుద్ధాన్ని ఎలా దృష్టిస్తారు? (బి) ఈ స్థానానికి ఏ లేఖనాధార నియమం ఉంది? (2 కొరింథీయులు 10:3-5)

11 దీనికి ముందున్న రెండు యోగ్యతల దృష్ట్యా, నిజ క్రైస్తవ ఆరాధికులు యుద్ధాల్లో భాగం వహించకూడదు అనే ఏడవ అవసరత తప్పనిసరి అవుతుంది. నిజమైన మతం ప్రేమపై ఆధారపడిన ప్రపంచవ్యాప్త సహోదరత్వం గనుక, ‘లోకమందున్న . . . సహోదరుల’ ఆ సహవాసాన్ని ఏదీ కూడా విభజింపలేదు లేక నాశనం చేయలేదు. యేసు ప్రేమనే బోధించాడు కానీ ద్వేషాన్ని కాదు; శాంతినే కానీ యుద్ధాన్ని కాదు. (1 పేతురు 5:9; మత్తయి 26:51, 52) హేబెలును హత్య చేసేందుకు కయీనును పురికొల్పిన అదే ‘దుష్టుడైన’ సాతాను, రాజకీయ, మతపర మరియు తెగ సంబంధ విభజన ఆధారంగా రక్తపాతాన్ని, గొడవలను రేకెత్తించడంలో మరియు మానవజాతిలో ద్వేషాన్ని నాటడంలో కొనసాగుతున్నాడు. దానికి వారెంత మూల్యాన్ని చెల్లించవలసి వచ్చినా నిజ క్రైస్తవులు ‘ఇక ఎంతమాత్రం యుద్ధాన్ని నేర్చుకోరు.’ అలంకారికంగా, వారు ఇప్పటికే ‘తమ ఖడ్గాలను నాగటి నక్కులుగా తమ ఈటెలను మచ్చుకత్తులుగా సాగగొట్టుకున్నారు.’ దేవుని ఆత్మ యొక్క శాంతికర ఫలాలను వారు ఉత్పన్నం చేస్తారు.—1 యోహాను 3:10-12; యెషయా 2:2-4; గలతీయులు 5:22, 23.

ప్రవర్తన మరియు బోధల శుద్ధతను దేవుడు దీవిస్తాడు

12. (ఎ) ఎనిమిదవ యోగ్యత ఏమిటి, అయితే ఏ మతపర విభజనను మీరు సూచించగలరు? (బి) ఈ ఎనిమిదవ యోగ్యతను పౌలు ఎలా ఉన్నతపరిచాడు?

12 క్రైస్తవ ఐక్యతయే సత్యారాధనకు ఉండవలసిన ఎనిమిదవ యోగ్యత. అయితే, క్రైస్తవమత సామ్రాజ్యం యొక్క విభాగిత మతాలు ఈ విషయంలో ఏమీ చేయలేకపోయాయి. ముఖ్యమైన విభాగాలని చెప్పుకోబడే అనేకం విభిన్న తెగలుగా చీలిపోయాయి, తద్వారా గందరగోళం ఏర్పడింది. ఉదాహరణకు, ఉత్తర బాప్టిస్టులు (అమెరికాలోని అమెరికన్‌ బాప్టిస్టు చర్చీలు) మరియు దక్షిణ బాప్టిస్టులుగా (దక్షిణ బాప్టిస్టు సంస్థ), అలాగే ఆ అంతశ్ఛిద్రాల కారణంగా ఏర్పడిన డజన్ల సంఖ్యలోగల ఇతర బాప్టిస్టు గుంపులుగా చీలిన అమెరికాలోని బాప్టిస్టు మతాన్ని పరిశీలించండి. (ప్రపంచ క్రైస్తవ సర్వసంగ్రహ నిఘంటువు, పేజీ 714) చర్చి ప్రభుత్వం లేక సిద్ధాంతాల తేడా వలన అనేక విభాగాలు పుట్టుకొచ్చాయి (ఉదాహరణకు, ప్రెస్బిటేరియన్‌, ఎపిస్కోపాలియన్‌, కాంగ్రిగేషనల్‌ వంటివి). క్రైస్తవమత సామ్రాజ్యం యొక్క విభాగాలు, క్రైస్తవమత సామ్రాజ్యం వెలుపలున్న మతాలకు అనగా బౌద్ధ, ఇస్లాం, లేక హిందూ మతం వంటి వాటికి సారూప్యంగా ఉన్నాయి. అపొస్తలుడైన పౌలు తొలి క్రైస్తవులకు ఏమని సలహా ఇచ్చాడు? “సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సుతోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తుపేరట మిమ్మును వేడుకొనుచున్నాను.”—1 కొరింథీయులు 1:10; 2 కొరింథీయులు 13:11.

13, 14. (ఎ) ‘పరిశుద్ధులుగా ఉండటం’ అంటే అర్థం ఏమిటి? (బి) సత్యారాధన ఎలా శుభ్రంగా ఉంచబడుతుంది?

13 దేవునిచేత అంగీకరింపబడే మతానికి ఉండవలసిన తొమ్మిదవ యోగ్యత ఏది? లేవీయకాండము 11:45లో ఒక బైబిలు సూత్రం ఇలా వ్యక్తం చేయబడింది: “నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను.” అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాసినప్పుడు ఆయన ఈ యోగ్యతను గురించి తిరిగి చెప్పాడు: “మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.”—ఇటాలిక్కులు మావి, 1 పేతురు 1:15.

14 పరిశుద్ధంగా ఉండవలసిన ఈ అవసరతలో ఏమి సూచింపబడింది? యెహోవా ఆరాధికులు ఆత్మీయంగా, నైతికంగా శుభ్రంగా ఉండాలన్నదే. (2 పేతురు 3:14) తమ ప్రవర్తన ద్వారా, క్రీస్తు విమోచనా క్రయధన బలి ఎడల తిరస్కార భావాన్ని చూపే పశ్చాత్తాపం చెందని, ఉద్దేశపూర్వక పాపులకు ఎంతమాత్రం స్థానం లేదు. (హెబ్రీయులు 6:4-6) క్రైస్తవ సంఘం శుభ్రంగా, పరిశుద్ధంగా ఉంచబడాలని యెహోవా అపేక్షిస్తున్నాడు. అదెలా సాధించబడుతోంది? కొంత మేరకు, సంఘాన్ని మలినపరచే వారిని బహిష్కరించే న్యాయ విచారణా ప్రక్రియ ద్వారా.—1 కొరింథీయులు 5:9-13.

15, 16. అనేకమంది క్రైస్తవులు తమ జీవితంలో ఏ మార్పులు చేసుకున్నారు?

15 క్రైస్తవ సత్యం తెలుసుకోక ముందు, అనేకమంది విచ్ఛలవిడియైన సౌఖ్యమే ప్రాముఖ్యమన్నట్టు, స్వార్థ పూరితమైన జీవితాలను జీవించారు. అయితే క్రీస్తును గూర్చిన వాక్యం వాళ్లను మార్చింది, వారు తమ పాపాల కొరకు క్షమాపణను కూడా పొందారు. పౌలు ఇలా వ్రాసినప్పుడు ఆయన దాన్ని శక్తివంతంగా ఇలా వ్యక్తం చేశాడు: “అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుషసంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని . . . మీరు కడుగ . . . బడితిరి.”—ఇటాలిక్కులు మావి, 1 కొరింథీయులు 6:9-11.

16 తమ లేఖనరహిత ప్రవర్తన విషయమై పశ్చాత్తాపం చెంది, మార్పు చేసికొని, క్రీస్తు మరియు ఆయన బోధల నిజమైన అనుచరులైన వారినే యెహోవా అంగీకరిస్తాడన్నది స్పష్టం. వారు తమను వలె తమ పొరుగు వారిని నిజంగా ప్రేమిస్తారు, వినేవారందరికీ జీవపు వర్తమానాన్ని అందించే పరిచర్యలో కొనసాగేటువంటి, అనేక విధాల్లో దాన్ని చూపిస్తారు.—2 తిమోతి 4:5.

‘సత్యం మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది’

17. సత్యారాధనకుగల పదవ యోగ్యత ఏమిటి? ఉదాహరణలను ఇవ్వండి.

17 తనను ఆత్మతో, సత్యంతో ఆరాధించే వారి కొరకు యెహోవా ఇచ్చిన పదవ యోగ్యత స్వచ్ఛమైన బోధ. (యోహాను 4:23, 24) తన అనుచరులకు యేసు ఇలా చెప్పాడు: ‘మీరు . . . సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.’ (యోహాను 8:32) అమర్త్యమైన ఆత్మ, నరకాగ్ని మరియు పాపవిమోచన లోకం వంటి దేవున్ని అవమానపరిచే సిద్ధాంతాల నుండి బైబిలు సత్యం మనల్ని స్వతంత్రులను చేస్తుంది. (ప్రసంగి 9:5, 6, 10; యెహెజ్కేలు 18:4, 20) క్రైస్తవమత సామ్రాజ్యం యొక్క “అతి పవిత్ర త్రిత్వం” అనే బబులోను సంబంధమైన మర్మం నుండి కూడా అది మనల్ని స్వతంత్రులను చేస్తుంది. (ద్వితీయోపదేశకాండము 4:35; 6:4; 1 కొరింథీయులు 15:27, 28) బైబిలు సత్యాలకు విధేయులవ్వడం ప్రేమ, శ్రద్ధ, దయ, కనికరంగల ప్రజలుగా చేస్తుంది. తోమాస్‌ డె టార్‌క్యుమాడా వంటి పగ, అసహనంగల ఇంక్విజిటర్‌లను లేక మత యుద్ధాలను ప్రోత్సహించిన మత నాయకులవంటి ద్వేషపూరిత యుద్ధ ప్రియులను నిజ క్రైస్తవత్వం ఎన్నడూ పెంచి పోషించలేదు. కాని, మహాబబులోను ఈ విధమైన ఫలాలను చరిత్రంతటిలో ఉత్పత్తి చేసింది, కనీసం నిమ్రోదు కాలంనుండి నేటి వరకు అలా చేసింది.—ఆదికాండము 10:8, 9.

ఒక విశిష్టమైన నామం

18. (ఎ) సత్యారాధనకుగల పది యోగ్యతలకు ఎవరు సరితూగుతారు, ఎలా? (బి) మన ఎదుట ఉన్న దీవెనను స్వంతం చేసుకునేందుకు మనం వ్యక్తిగతంగా ఏమి చేయాలి?

18 సత్యారాధన యొక్క ఈ పది యోగ్యతలను నేడు ఎవరు వాస్తవంగా నెరవేర్చుతున్నారు? తమ యథార్థత మరియు శాంతియుతత్వం యొక్క చరిత్ర విషయమై ఇతరులచే గుర్తింపబడుతున్న మరియు ఇతరులకు తెలిసిన వారెవరు? ప్రపంచ వ్యాప్తంగా యెహోవాసాక్షులు “లోకసంబంధులు కారు” అని గుర్తించబడ్డారు. (యోహాను 15:19; 17:14, 16; 18:36) యేసుక్రీస్తు తన తండ్రికి నమ్మకమైన సాక్షి అయి ఉండిన విధంగానే, యెహోవా ప్రజలు ఆయన నామాన్ని ధరించగల మరియు ఆయనకు సాక్షులుగా ఉండగల ఘనతను పొందారు. మనం ఆ పవిత్ర నామాన్ని ధరించాము, అది దేనికి ప్రాతినిధ్యం వహిస్తుందో దానికి తగినట్టు జీవించాల్సిన మన బాధ్యతను మనం గ్రహించాము. ఆయన సాక్షులుగా, మన ముందు ఎంత మహోన్నత ఉత్తరాపేక్ష ఉందో కదా! ఈ భూమిపై పునఃస్థాపించబడిన పరదైసులో విశ్వ సర్వాధిపతిని ఆరాధిస్తూ, విధేయతగల, ఐక్యపరచబడిన మానవ కుటుంబంలో భాగమవ్వగల ఉత్తరాపేక్ష. అలాంటి దీవెనను పొందేందుకు, సత్యారాధనతో మనల్ని మనం స్పష్టంగా గుర్తుంచుకోవడంలో, “ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి” గనుక యెహోవాసాక్షులు అనే నామాన్ని సగర్వంగా ధరించుకోవడంలో కొనసాగుదాం!—ప్రకటన 19:2; యెషయా 43:10-12; యెహెజ్కేలు 3:11.

[అధస్సూచీలు]

a బైబిలు అనువాదాలు వాటంతటవే దేవునిచేత ప్రేరేపింపబడలేదు. అనువాదాలు వాటి సహజ గుణంతో, వ్రాయబడిన ఆదిమ బైబిలు భాషలను అర్థం చేసుకోవడంలో ఉన్న తేడాలను ప్రతిబింబించవచ్చు.

మీరె సమానమిరు?

◻ మహాబబులోను నాశనాన్ని యెహోవా సేవకులు ఎలా దృష్టిస్తారు?

◻ సత్యారాధనకుగల ముఖ్య యోగ్యతలు ఏమిటి?

◻ సత్యం మిమ్మల్ని ఎలా స్వతంత్రులను చేస్తుంది?

◻ యెహోవాసాక్షులుగా మనకు ఏ ప్రత్యేక ఘనత ఉంది?

[17వ పేజీలోని చిత్రం]

యెహోవాసాక్షులు దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ, బోధిస్తున్నారు

[18వ పేజీలోని చిత్రం]

ప్రపంచ రాజకీయాలు మరియు యుద్ధాల విషయంలో నిజ క్రైస్తవులు ఎల్లప్పుడూ తటస్థంగా ఉన్నారు

[క్రెడిట్‌ లైను]

Airplane: Courtesy of the Ministry of Defense, London

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి