రాజ్య ప్రచారకుల నివేదిక
‘దేవుని వాక్యము ప్రబలమవ్వసాగింది’
క్రైస్తవ సంఘం ఏర్పడిన తర్వాత చాలా త్వరగా 120 మంది సభ్యులనుండి 3,000 మంది వరకూ పెరిగింది. (అపొస్తలుల కార్యములు 1:15; 2:41) “దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను,” అని బైబిలు వివరిస్తుంది. (అపొస్తలుల కార్యములు 6:7) కేవలం కొన్ని సంవత్సరాల తర్వాత, క్రొత్తగా ఏర్పడిన సంఘం ఆఫ్రికా, ఆసియా మరియు ఐరోపాలలోని క్రైస్తవులతో ఒక అంతర్ఖండ సంస్థ అయ్యింది.
క్రైస్తవ సంఘం కూడా నేడు అదేవిధంగా అత్యంత త్వరితమైన పెరుగుదలను చవిచూస్తుంది. ఉదాహరణకు, మెక్సికోలో రాజ్య ప్రచారకుల సంఖ్య కేవలం ఐదు సంవత్సరాల్లో 1,30,000 నుండి 4,43,640 కి పెరిగింది! యెహోవాసాక్షుల ద్వారా ఆచరింపబడే క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినానికి, 1995 లో మెక్సికోలోని ప్రతి 59 మందిలో ఒకరు హాజరయ్యారు. ఈ క్రింది అనుభవం ఉదాహరిస్తున్నట్లు, ఆ దేశంలోని ఆత్మీయకోత ఇంకా పూర్తికాలేదు.—మత్తయి 9:37, 38.
కయాపాస్ రాష్ట్రంలోని ఒక పట్టణంలో యెహోవాసాక్షులు 20 ఏళ్లు సువార్త ప్రకటించినప్పటికీ ఎవరూ వారితో గృహ బైబిలుపఠనాన్ని తీసుకునేందుకు అంగీకరించలేదు. దౌర్జన్యపూరితమైన ప్రవర్తనగల వానిగా పేరుపొందిన ఒక వ్యక్తి పట్టణంలోని అనేకమందిని భయపెట్టాడన్నది స్పష్టం. వారు సాక్షులతో బైబిలు పఠిస్తున్నారని అతనికి తెలిస్తే అతనెలా ప్రతిస్పందిస్తాడోనని వారు భయపడ్డారు.
ఆ ప్రాంతానికి వెళ్లిన ఇద్దరు ధైర్యవంతులైన సాక్షులు, నేరుగా ఆ వ్యక్తి వద్దకే వెళ్లి ప్రశ్నించడం ద్వారా సమస్యను పరిష్కరించాలని తీర్మానించుకున్నారు. వారు అతని ఇంటివద్దకు వచ్చినప్పుడు, అతని భార్య తలుపుతెరిచి వారి వర్తమానాన్ని శ్రద్ధగా విన్నది. పరదైసు భూమిపై జీవించడాన్ని గురించి బైబిలు చెబుతున్నదానిపట్ల ఆమెకు ప్రాముఖ్యంగా ఆసక్తి కలిగింది. అయితే ఆమె గనుక బైబిలు పఠిస్తే, ఆమె భర్త పరిస్థితులను మరీ కష్టతరం చేస్తాడని ఆమె తెలియజేసింది. బైబిలేమి చెబుతుందో తను జాగ్రత్తగా పరిశీలించకపోతే, దేవున్ని ఎలా సేవించాలో, భూమిపై నిరంతరం ఎలా జీవించాలో ఆమె ఎన్నడూ తెలుసుకోలేదని సాక్షులు వివరించారు. ఆమె బైబిలు పఠనాన్ని అంగీకరించింది.
అనుకున్నట్లే, ఆమె తీసుకున్న నిర్ణయాన్నిబట్టి ఆమె భర్త సంతోషించలేదు. ఆమెకున్న వాహనాన్ని ఆమె క్రైస్తవకూటాలకు హాజరయ్యేందుకు ఉపయోగించకూడదని అతను నిషేధించాడు, అయితే ఆమె వేరే పనులకొరకు దాన్ని ఉపయోగించడానికి అనుమతింపబడింది. అతను వ్యతిరేకించినప్పటికీ, యెహోవాసాక్షుల రాజ్యమందిరాలలో దగ్గర్లో ఉన్నదానికి ఆమె నడుచుకుంటూ క్రమంగా వెళ్లేది, ఆ రాజ్యమందిరం పది కిలోమీటర్ల దూరానవుంది. త్వరలోనే ఆమె ధైర్యాన్ని, నిశ్చయతను పట్టణంలోని ఇతరులు గమనించారు. సాక్షులు ప్రజల గృహాలను దర్శించినప్పుడు వారు వినడం ప్రారంభించారు. కొందరు ఆ స్త్రీతోపాటు కూటాలకు వెళ్లడం కూడా ప్రారంభించారు. ఆ తర్వాత కొద్ది కాలానికల్లా, సాక్షులు ఆ పట్టణంలో 20 బైబిలు పఠనాలను నిర్వహిస్తున్నారు!
ఆ స్త్రీ యొక్క స్నేహితురాలు ఒకామె, తన భర్త వ్యతిరేకిస్తున్నప్పటికీ బైబిలు పఠించాలని తీర్మానించుకుంది. ఆశ్చర్యకరంగా, పఠించేందుకు ఆమె మొదటి స్త్రీ యొక్క భర్త ద్వారా ప్రోత్సహింపబడింది. అతను ఆమె భర్తతో మాట్లాడిన తర్వాత వ్యతిరేకత ఆగిపోయింది. కాబట్టి, ఇప్పుడు సువార్తను ప్రకటిస్తున్న ఆ ఇద్దరు స్త్రీలతోపాటు, 15 కంటే ఎక్కువమంది వ్యక్తులు బైబిలును పఠిస్తూ క్రైస్తవ కూటాలకు హాజరవ్వడంతో, 20 ఏళ్ల తర్వాత బైబిలు సత్యపు విత్తనం తుదకు మొలకెత్తింది.