ఒక మేలైన జీవితం—త్వరలో!
ఒక వాతావరణ సూచకుని అంచనాలు దాదాపూ అన్నిసార్లు నిజం అయ్యాయని ఊహించుకోండి. మర్నాడు వాన కురుస్తుందని అతను సాయంకాల వార్తల్లో చెబితే, తర్వాతి ఉదయం ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు మీరు గొడుగు పట్టుకెళ్లడానికి వెనకాడరు. అతని గత రికార్డు మీ నమ్మకాన్ని చూరగొన్నది. అతను చెప్పే దానికి అనుగుణంగా మీరు చర్య తీసుకుంటారు.
ఇప్పుడు, పరదైసు భూమిపైన ఒక మేలైన జీవితాన్ని గూర్చిన యెహోవా వాగ్దానం ఎంత నమ్మదగినది? ఆయన గత రికార్డు ఏమి సూచిస్తుంది? బైబిలు ప్రవచనాల నెరవేర్పు యెహోవా రికార్డును స్పష్టంగా స్థాపిస్తుంది. ఆయన నిష్ఫలముకాని కచ్చితత్వం, సత్యత్వం యొక్క దేవుడు. (యెహోషువ 23:14; యెషయా 55:11) యెహోవా దేవుని వాగ్దానాలు ఎంత విశ్వసనీయమైనవంటే, ఆయన కొన్నిసార్లు అవి అప్పటికే జరిగినవన్నంత వాస్తవంగా వాగ్దాన భవిష్యత్ సంఘటనలను గురించి మాట్లాడతాడు. ఉదాహరణకు, మరణం, దుఃఖం ఇక ఉండని నూతన లోకాన్ని గూర్చిన ఆయన వాగ్దానం తర్వాత ఇలా ఉండటాన్ని మనం చదువుతాం: “అవి [వాగ్దానం చేయబడిన దీవెనలు] సమాప్తమయ్యాయి!” మరో మాటల్లో, “అవి ఒక వాస్తవం!”—ప్రకటన 21:5, 6, అథఃస్సూచి, NW.
అవును, యెహోవా యొక్క గత వాగ్దానాల నెరవేర్పు, మానవజాతి కొరకు ఒక మేలైన జీవితాన్ని గూర్చిన ఆయన వాగ్దాన నెరవేర్పులో మనకు నమ్మకాన్ని కలిగిస్తుంది. అయితే ఈ మేలైన జీవితం ఎప్పుడు వస్తుంది?
ఒక మేలైన జీవితం—ఎప్పుడు?
ఒక అత్యంత మేలైన జీవితం త్వరలో వస్తుంది! అలాగని మనం నిశ్చయతను కలిగి ఉండవచ్చు, ఎందుకంటే పరదైసు ఒక మేలైన జీవితాన్ని తీసుకుని రావడానికి ముందు అనేక చెడ్డ సంగతులు జరుగుతాయని బైబిలు చెబుతుంది. ఆ చెడ్డ సంగతులు ఇప్పుడు జరుగుతున్నాయి.
ఉదాహరణకు, మహాయుద్ధాలు జరుగుతాయని యేసుక్రీస్తు ముందే చెప్పాడు. ఆయనిలా చెప్పాడు: “జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును.” (మత్తయి 24:7) ఈ ప్రవచనం నిజమైంది. 1914 నుండి 1945 మధ్య సంవత్సరాలలో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి మరి వీటి తర్వాత దేశాలు ఒకదానితో ఒకటి పోరాడిన అనేక ఇతర యుద్ధాలు కూడా జరిగాయి. “ప్రతి సంవత్సరం సగటున, 19వ శతాబ్దంలోని మరణాలకు రెండంతలకంటే ఎక్కువగా, మరి 18వ శతాబ్దంలోని వాటికంటే ఏడంతలు ఎక్కువగా, [రెండవ ప్రపంచ యుద్ధం నుండి] ఈ కాలంలో యుద్ధమందు హతులైన వారి సంఖ్య ఉంది.”—ప్రపంచ సైనిక మరియు సాంఘిక వ్యయం 1993.
వ్యాధుల వ్యాప్తి, పరదైసు భూమిపై ఒక మేలైన జీవితం దగ్గరలో ఉందనడానికి మరొక ఆధారం. ‘అక్కడక్కడ గొప్ప తెగుళ్లు తటస్థించును’ అని యేసు ప్రవచించాడు. (లూకా 21:11) ఈ ప్రవచనం నిజమైందా? అయ్యింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, స్పానిష్ ఫ్లూ రెండు కోట్లకంటే ఎక్కువమంది ప్రజలను చంపింది. అప్పటినుండి క్యాన్సరు, హృద్రోగం, మలేరియా, ఎయిడ్స్ మరితర జబ్బులు లక్షలాది మంది ప్రజలను చంపాయి. వర్థమాన దేశాల్లో, కలుషితమైన నీటి ద్వారా వచ్చే వ్యాధులు (వాటిలో అతిసార వ్యాధి, ప్రేగులలో పురుగుల ఇన్‌ఫెక్షన్ కూడా ఉన్నాయి) ప్రతి సంవత్సరం లక్షలాదిమంది జీవితాలను బలిగొంటున్నాయి.
యేసు ఇలా కూడా చెప్పాడు: “అక్కడక్కడ కరవులు . . . కలుగును.” (మత్తయి 24:8) మొదటి శీర్షికలో పేర్కొన్నట్లుగా, ప్రపంచంలోని పేదవారికి తినడానికి తగినంత తిండి లేదు. పరదైసు భూమిపై ఒక అత్యంత మేలైన జీవితం త్వరలో రాబోతుందనడానికి ఉన్న ఆధారంలో ఇది మరొక భాగం.
“అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును,” అని యేసు చెప్పాడు. (లూకా 21:11) అది కూడా మన కాలంలో నిజం అయ్యింది. 1914 నుండి నాశనకరమైన భూకంపాలవలన కలిగిన వినాశనం లక్షలాదిమంది జీవితాలను బలిగొన్నది.
“అంత్యదినము”లు ప్రజలలో మార్పు రావడంతో సూచింపబడతాయని కూడా బైబిలు చెబుతుంది. వారు “స్వార్థప్రియులు ధనాపేక్షులు” అయి ఉంటారు మరి పిల్లలు “తలిదండ్రులకు అవిధేయులు” అవుతారు. ప్రజలు సాధారణంగా “దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు” అయి ఉంటారు. (2 తిమోతి 3:1-5) అనేకులు ఈ వివరణకు సరిపోతారని మీరు అంగీకరించరా?
అనేకమంది ప్రజలు చెడ్డ విషయాలను ఆచరిస్తుండగా, అక్రమం విస్తరిస్తుంది. ఇది కూడా ప్రవచించబడింది. మత్తయి 24:12 ప్రకారం, “అక్రమము విస్తరించుట”ను గూర్చి యేసు మాట్లాడాడు. నేరం కొన్ని సంవత్సరాల క్రితంకంటే ఇప్పుడు మరింత విపరీతమైందని మీరు తప్పకుండా ఒప్పుకుంటారు. అన్ని ప్రాంతాల్లోని ప్రజలు తాము దోచుకోబడతాం, మోసగింపబడతాం లేక ఇతర పద్ధతిలో తమకు హాని కలిగింపబడుతుందని భయపడుతూ ఉన్నారు.
యుద్ధాలు, వ్యాప్తి చెందిన వ్యాధులు, ఆహార కొరతలు, భూకంపాలు, పెరిగిపోతున్న నేరం మరి మానవ సంబంధాలు చెడుగా మారుతున్న పరిస్థితి—బైబిలు ప్రవచించినట్లుగా ఇవన్నీ కూడా నేడు కనిపిస్తున్నాయి. ‘అయితే ఇవన్నీ కూడా మానవ చరిత్రంతటిలో జరుగలేదా? మన దినాల్లో ఏం వ్యత్యాసం ఉంది?’ అని మీరు అడుగవచ్చు.
నేడు ఏమి జరుగుతుంది అన్న విషయంలో కొన్ని అత్యంత ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఆహార కొరతలవంటి ఏదైనా ఒక ప్రత్యేక అంశం, మనం అంత్య కాలంలో ఉన్నామని మరి ఒక మేలైన జీవితం త్వరలో వస్తుందని అనేందుకు సూచనయని బైబిలు చెప్పడం లేదు. అంత్య కాలాన్ని గూర్చిన బైబిలు ప్రవచనాలు ఒక భక్తిహీన తరంపై నెరవేరాల్సి ఉంటుంది.—మత్తయి 24:34-39; లూకా 17:26, 27.
అంతేకాకుండా, యేసు ప్రవచనంలోని కొన్ని అంశాలు—ప్రాముఖ్యంగా ఆహార కొరతలు మరియు వ్యాప్తి చెందిన వ్యాధులను గూర్చినవి—నేడు నెరవేరుతున్నాయంటే అది అసాధారణం. ఎందుకు? ఎందుకంటే విజ్ఞానశాస్త్రం యొక్క సాఫల్యాలు క్రితమెన్నటికంటే నేటి కాలంలోనే ఎక్కువగా ఉన్నాయి. వైద్య పరిజ్ఞానం మరియు చికిత్సా విధానాలు ఇంత సాంకేతికంగా లేక విస్తృతంగా ఎన్నడూ లేవు. ఇలాంటి సమయంలోనే, వ్యాధి మరియు కరవు ఎక్కువ అవుతాయి గానీ తగ్గవని దేవుడు మాత్రమే, తన వాక్యమైన బైబిలులో ప్రవచించగలడు.
అంత్య కాలాన్ని లేక “అంత్య దినముల”ను గూర్చిన బైబిలు ప్రవచనాలన్నీ నిజమౌతున్నాయి గనుక, మనం ఏమని ముగించవచ్చు? ఒక మేలైన జీవితం త్వరలో రాబోతుందని! అయితే అది ఎలా వస్తుంది?
ఒక మేలైన జీవితం—ఎలా?
మానవులు పరదైసును తీసుకురాగలరని మీరు భావిస్తున్నారా? ఈనాటి వరకున్న చరిత్రంతటిలో, అనేక రకాలైన మానవ ప్రభుత్వాలు కనిపించాయి. ప్రజల అవసరతలను తృప్తిపర్చడానికి కొన్ని ఎంతో కష్టపడ్డాయి. అయినప్పటికీ, అనేక సమస్యలు మరింత విపరీతమయ్యాయి. ధనిక దేశాల్లోని, పేద ప్రాంతాల్లోని ప్రభుత్వాలు మాదక ద్రవ్యాల దుర్వినియోగం, సరైన ఇళ్లు లేక పోవడం, పేదరికం, నేరం, నిరుద్యోగం మరి యుద్ధాల వంటి వాటితో పోరాడుతున్నవి.
ప్రభుత్వాలు ఈ సమస్యల్లో కొన్నింటిని పరిష్కరించగల్గినా, వారు అనారోగ్యం నుండి సంపూర్ణ విడుదలను ఎన్నటికీ ఇవ్వలేరు; వారు వృద్ధాప్యానికి, మరణానికి కూడా అంతాన్ని తీసుకురాలేరు. మానవులు పరదైసును ఈ భూమిపైకి ఎన్నటికీ తీసుకురాలేరన్నది స్పష్టం.
బైబిలు జ్ఞానయుక్తంగా ఇలా చెబుతుంది: “రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి.” మరి మనం ఎవరిని నమ్ముకోవాలి? బైబిలిలా జవాబిస్తుంది: “ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టుకొనునో వాడు ధన్యుడు.” (కీర్తన 146:3, 5) మనం మన నిరీక్షణను యెహోవా దేవునిపై నిలిపితే, మనం ఎన్నటికీ నిరాశ చెందం.
భూమిని, సూర్యున్ని మరి నక్షత్రాలను సృష్టించగల బుద్ధి ఉన్న వాడు భూమిని ఒక పరదైసుగా తప్పకుండా మార్చగలడు. మానవులు ఒక మేలైన జీవితాన్ని అనుభవించి ఆనందించడానికి ఆయన సాధ్యం చేయగలడు. యెహోవా దేవుడు ఏమి చేయాలని తీర్మానించుకుంటాడో, దాన్ని ఆయన సాధించగలడు, సాధిస్తాడు. “దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థకము కానేరదని,” ఆయన వాక్యం చెబుతుంది. (లూకా 1:37) అయితే దేవుడు ఒక మేలైన జీవితాన్ని ఎలా తీసుకువస్తాడు?
యెహోవా తన రాజ్యం ద్వారా మానవజాతి కొరకు ఒక మేలైన జీవితాన్ని తీసుకువస్తాడు. మరి దేవుని రాజ్యం అంటే ఏమిటి? అది యేసుక్రీస్తును, దేవుని నియమిత పరిపాలకునిగా కలిగివున్న వాస్తవమైన ప్రభుత్వం. దేవుని రాజ్యం పరలోకంలో ఉంది, అయితే అది పరదైసు భూమి యొక్క నివాసులకు అద్భుతమైన దీవెనలను మరి ఒక అత్యంత మేలైన జీవితాన్ని త్వరలో తెస్తుంది.—యెషయా 9:6, 7.
బైబిలునందు మత్తయి 6:9-13లో కనుగొనబడే యేసు మాదిరి ప్రార్థనను గురించి మీకు ఇప్పటికే తెలిసి ఉండవచ్చు. దేవునికి చేయబడిన ఆ ప్రార్థనలో ఒక భాగమిలా చెబుతుంది: “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.” ఆ ప్రార్థనకు అనుగుణంగా, భూమిపట్ల యెహోవా దేవునికిగల సంకల్పాన్ని నెరవేర్చడానికి, దేవుని రాజ్యం “వచ్చు”ను. భూమి పరదైసుగా మారాలన్నది ఆయన సంకల్పమే.
ఒక చివరి ప్రశ్న ఉత్పన్నమౌతుంది: రాబోయే పరదైసులో ఒక మేలైన జీవితాన్ని అనుభవించడానికి మీరేమి చేయాలి?
మీరేమి చేయాల్సిన అవసరం ఉంది
పరదైసులో ఒక మేలైన జీవితం యొక్క ఉత్తరాపేక్షను తన చిత్తం చేసే వారికందరికీ యెహోవా దేవుడు ప్రేమపూర్వకంగా అందిస్తున్నాడు. బైబిలు మనకిలా చెబుతుంది: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.” (కీర్తన 37:29) అయితే ఒక వ్యక్తిని దేవుని దృష్టిలో నీతిమంతున్ని చేసేది ఏది?
యెహోవాను ప్రీతిపర్చడానికి, మనం ఏమి చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడో దాన్ని గురించి మనం ఎక్కువగా నేర్చుకోవలసిన అవసరం ఉంది. దేవుని గూర్చిన జ్ఞానాన్ని పొంది, దాన్ని మన జీవితాల్లో అన్వయించుకుంటే, మనం నిరంతరం జీవించగలం. దేవునికి చేసిన ప్రార్థనలో యేసు ఇలా చెప్పాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును గూర్చిన సరియైన జ్ఞానాన్ని పొందడమే నిత్యజీవము.”—యోహాను 17:3, NW.
యెహోవా దేవున్ని, యేసుక్రీస్తును గురించి చెప్పే గ్రంథమే దేవుని వాక్యమైన బైబిలు. యెహోవా ఇచ్చిన అత్యంత అమూల్యమైన బహుమానాల్లో అది ఒకటి. బైబిలు, ఒక ప్రేమగల తండ్రి తన పిల్లలకు వ్రాసిన ఉత్తరం వంటిది. మానవజాతి కొరకు ఒక మేలైన జీవితాన్ని తీసుకురావాలన్న దేవుని వాగ్దానాన్ని గూర్చి అది చెబుతుంది మరి మనం దాన్ని ఎలా పొందగలమో కూడా చూపిస్తుంది. దేవుడు గతంలో ఏమి చేశాడు మరి భవిష్యత్తులో ఆయన ఏమి చేయబోతున్నాడు అనేవి బైబిలు మనకు తెలియజేస్తుంది. మన సమస్యలతో ఇప్పుడు విజయవంతంగా వ్యవహరించడానికి అది మనకు ఆచరణాత్మకమైన సలహాలను కూడా ఇస్తుంది. వాస్తవానికి, కష్టాలున్న ఈ ప్రపంచంలో కూడా కొంత సంతోషాన్ని ఎలా కనుగొనాలో దేవుని వాక్యం మనకు బోధిస్తుంది.—2 తిమోతి 3:16, 17.
యెహోవాసాక్షులు మీ కొరకు ఉచిత బైబిలు పఠనాన్ని సంతోషంగా ఏర్పాటు చేస్తారు. మీరు సమీప భవిష్యత్తులో ఒక అత్యంత మేలైన జీవితాన్ని పొందగల ఉత్తరాపేక్షతోపాటు, ఇప్పుడు సంతోషకరమైన జీవితాన్ని ఎలా పొందగలరో నేర్చుకోండి.
[5వ పేజీలోని చిత్రం]
ఒక మేలైన జీవితం త్వరలో వస్తుందని బైబిలు ప్రవచనాలు సూచిస్తున్నాయి
[7వ పేజీలోని చిత్రం]
దేవుని రాజ్యం మానవజాతి కొరకు ఒక మేలైన జీవితాన్ని తీసుకువస్తుంది