ఒక మేలైన జీవితం వాగ్దానం చేయబడింది
జీవితాన్ని కష్టతరం చేసే సమస్యలనుండి విముక్తి పొందాలని మీరు ఇష్టపడతారా? ఈ పత్రిక మొదటి మరియు చివరి కవరు పేజీలపై చిత్రీకరింపబడిన దృశ్యంలో ఉన్నంతటి ఆహ్లాదకరమైన జీవితాన్ని అందించే లోకంలో జీవించాలని మీరు కోరుకుంటున్నారా? ఆ చిత్రం వైపు బాగా పరికించి చూడండి. ప్రజలకు తినేందుకు పుష్కలంగా ఉంది. వారు ఆ రుచికరమైన ఆహారాన్ని తిని నిజంగా ఆనందిస్తారు. అందరూ సంతోషంగా ఉన్నారు. వేర్వేరు జాతుల ప్రజలు ఒకరితోనొకరు సమాధానంగా ఉన్నారు. జంతువులు కూడా సమాధానంగా ఉన్నాయ్! ఎవరూ పోట్లాడటం లేదు. ఎవరూ పేదవారు కాదు. ఎవరూ అనారోగ్యంగా లేరు. అక్కడ చక్కని పరిసరాలు, అందమైన వృక్షాలు, శుభ్రమైన, స్వచ్ఛమైన నీళ్లు ఉన్నాయి. అదెంతటి మహత్తరమైన దృశ్యం!
ఈ భూమి ఎప్పటికైనా అలా ఉంటుందా? అవును, అది ఒక పరదైసులా ఉంటుంది. (లూకా 23:43) భూమిని సృష్టించిన దేవుడు, పరదైసు భూమిపై మానవులు ఒక మేలైన జీవితాన్ని అనుభవించాలని సంకల్పించాడు. మీరు కూడా అక్కడ ఉండగలరు!
మీరు ఏ జీవితాన్ని ఎన్నుకుంటారు?
రానైవున్న పరదైసు భూమి, మనం ఇప్పుడు జీవిస్తున్న లోకానికి భిన్నంగా ఎలా ఉంటుంది? ప్రస్తుతం, 100 కోట్లకంటే ఎక్కువమంది ప్రజలు ప్రతిదినం పస్తులుంటున్నారు. అయితే, భూమి కొరకు దేవుడు సంకల్పించిన పరదైసులో, ప్రతి ఒక్కరికీ తినేందుకు పుష్కలంగా ఉంటుంది. బైబిలిలా వాగ్దానం చేస్తుంది: “సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో . . . మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును.” (యెషయా 25:6) అక్కడ ఆహార కొరత అసలు ఉండదు, ఎందుకంటే బైబిలిలా చెబుతుంది: “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును.”—కీర్తన 72:16.
నేడు, అనేకులు గుడిసెల్లో, పూరిపాకల్లో జీవిస్తున్నారు, లేక వాళ్లు అద్దె కట్టేందుకు అవస్థలు పడుతున్నారు. ఇతరులకు ఇళ్లు లేవు గనుక వీధిలో పడుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచంలోని పిల్లల్లో దాదాపు పది కోట్లమంది నిరాశ్రయులుగా ఉన్నారు. అయితే రాబోయే పరదైసులో, తనదని పిలవడానికి ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉంటుంది. దేవుని వాక్యం ఇలా చెబుతుంది: “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు.”—యెషయా 65:21.
అనేకులు తాము ఇష్టపడని ఉద్యోగాలను కష్టపడి చేస్తున్నారు. వారు తరచూ ఎంతో సేపు కష్టించి పనిచేస్తారు, కానీ చాలా తక్కువ జీతం పొందుతారు. ప్రపంచంలోని ప్రతి 5 గురిలో ఒకరు సంవత్సరానికి 500 డాలర్ల కంటే తక్కువ జీతంతో జీవిస్తున్నారు. అయితే, రాబోయే పరదైసులో, ప్రజలు తమ పనిలో ఆనందిస్తారు, దానినుండి మంచి ఫలితాలను చూస్తారు. దేవుడిలా వాగ్దానం చేస్తున్నాడు: “నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు వారు వృథాగా ప్రయాసపడరు.”—యెషయా 65:22, 23.
ఇప్పుడు అనారోగ్యం, వ్యాధి ప్రతిచోటా ఉన్నాయి. అనేకులు అంధులు. కొందరు బధిరులు. ఇతరులు నడవలేరు. అయితే పరదైసులో, ప్రజలు అనారోగ్యం, వ్యాధి నుండి విముక్తి పొందుతారు. యెహోవా ఇలా చెబుతున్నాడు: “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.” (యెషయా 33:24) ఇప్పటికే దుర్భలులైన వారికి, హృదయాన్ని ఉప్పొంగజేసే వాగ్దానమేమిటంటే: “గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును కుంటివాడు దుప్పి [ఓ మగ జింక] వలె గంతులువేయును మూగవాని నాలుక పాడును.”—యెషయా 35:5, 6.
ప్రస్తుత కాలంలో, బాధ, వేదన మరియు మరణం ఉన్నాయి. అయితే భూమిపైనున్న పరదైసులో అలాంటివేవి ఉండవు. అవును, మరణం కూడా ఉండదు! బైబిలిలా చెబుతుంది: “దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెను.”—ప్రకటన 21:3, 4.
అలాంటప్పుడు, యెహోవా వాగ్దానం చేసిన పరదైసు భూమి, మానవజాతి కొరకు ఒక మేలైన జీవితమన్నది స్పష్టం. అయితే అది తప్పకుండా వస్తుందని మనం ఎలా నిశ్చయతను కలిగి ఉండవచ్చు? అది ఎప్పుడు, ఎలా వస్తుంది? అక్కడ ఉండడానికి మీరేమి చేయాలి?