రాజ్య ప్రచారకుల నివేదిక
సాక్ష్యమివ్వడం ఇంట్లోను పాఠశాలలోను ఫలాన్నిస్తుంది
ఒక క్రైస్తవుని జీవితంలో ఇతరులకు మంచి చేయడం, ముఖ్యంగా వారితో దేవుని రాజ్య సువార్తను పంచుకోవడం ఇమిడి ఉంటుంది. “మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము” అని సామెతలు 3:27 చెబుతుంది. అర్జెంటీనాలో ఒక యౌవనస్థుడైన సాక్షి తాను ఉన్నత పాఠశాలలో మూడవ సంవత్సరం చదువుకుంటుండగా తన తోటి విద్యార్థితో రాజ్య సువార్తను పంచుకోవాలనుకున్నాడు. అతడలా చేయడం ఎంతో మంచి ఫలాలనిచ్చింది.
ఒకరోజు ఆ యౌవనస్థుడైన సాక్షి మతాలన్నీ మంచివి కావని తన స్నేహితునితో చెప్పాడు. తాను చెడు ఏమీ చేయలేదని ఆ యౌవనస్థుడు బదులిచ్చినప్పుడు “నువ్వు దేవుని కొరకు ఏమీ చేయనూ లేదు” అని సాక్షి చెప్పాడు. ఇది ఆ యౌవనస్థుడు ఆలోచించేలా చేసింది. తరువాత ఇవి అంత్యదినాలని, దేవుని అంగీకారం కావాలంటే ఒకడు కచ్చితమైన బైబిలు జ్ఞానాన్ని పొంది, దానిని అన్వయించడం తప్పనిసరని సాక్షి వివరించాడు. అతని పాఠశాల స్నేహితుడు అందుకు ఒప్పుకున్నాడు. కాని అతని కుటుంబం అతడు బైబిలు పఠనాన్ని కలిగి ఉండేందుకు అనుమతిస్తుందా? ఆ సాక్షి తన స్నేహితునిలో ఆలోచనను రేకెత్తిచ్చేందుకుగాను మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని చదవమని అతనికి చెప్పాడు.
కాలం గడిచిపోయింది, మరి ఆ స్నేహితుడు పాఠశాల వదిలిపెట్టాడు. సంవత్సరం కన్నా ఎక్కువే గడిచిపోయినా అతని గురించి ఏమీ వినలేకపోయాడు. ఫోను చేసి బైబిలు ప్రవచనాలు నిజంగా నెరవేరుతున్నాయని చూడగలిగానని ఒకరోజు తన స్నేహితుడు తనతో చెప్పినప్పుడు యౌవనస్థుడైన ఆ సాక్షి ఆశ్చర్యపోయాడు. వెంటనే అతనితో బైబిలు పఠనం చేసేందుకు ఆ సాక్షి ఏర్పాటు చేశాడు.
అతడు తన పాత పాఠశాల స్నేహితుని ఇంటికి వెళ్ళినప్పుడు, తమ కొడుకు ఎందులో చేరుతున్నాడనే దాని గురించి తన స్నేహితుని అమ్మానాన్నలు వ్యాకులపడుతున్నారని అతడు గమనించాడు. స్నేహితుని తమ్ముడు కూడా అతనికి పిచ్చి పట్టిందని అనుకున్నాడు. కనుక తరువాయి పఠనానికి వాళ్ళ అమ్మానాన్నలు అతని తమ్ముడ్ని కూడా కూర్చోబెట్టారు. తరువాత, తన అన్నకు పిచ్చిపట్టలేదని ఆ యౌవనస్థుడు కన్నీటితో వాళ్ళ అమ్మకు చెప్పాడు, దానికి వాళ్ళ అమ్మగారు “ఒక సమస్యకు బదులు, నాకిప్పుడు రెండు సమస్యలు!” అని బాధగా అరిచారు.
అలా, తరువాయి పఠనానికి ఆమె స్వయంగా హాజరయ్యారు, మరి అబ్బాయిలకు పిచ్చి పట్టలేదని ఆమె ఒప్పుకోవలసి వచ్చింది. తరువాత, ఆమెతోను ఆమె భర్తతోను ఒక బైబిలు పఠనం ఆరంభమైంది. త్వరలోనే కుటుంబమంతా కూడా రాజ్య మందిరంలో సంఘ కూటాలకు హాజరు కావడం మొదలుపెట్టింది. చివరికి, తాత మామ్మలు కూడా బైబిలు పఠనం చేయడం మొదలుపెట్టి కూటాలకు వెళ్ళనారంభించారు. అలా మొదటి యౌవనస్థుడు బాప్తిస్మం పొందాడు. అతని పెళ్ళయ్యింది, మరి అతడు, అతని భార్య ఆసక్తిగల ప్రచారకులుగా ఉన్నారు.
యౌవనస్థుడైన ఆ సాక్షి పాఠశాలలో అనియత సాక్ష్యం ఇవ్వడం ద్వారా వీళ్ళకేగాక, మరో ఇద్దరు తోటివిద్యార్థులకు అలాగే వారిలో ఒకరి అమ్మకు మరియు సహోదరీకి బైబిలు పఠనం చేయనారంభించడానికి సహాయపడ్డాడు. ఆ యౌవనస్థుడైన సాక్షి తన తోటి విద్యార్థులకు మంచి చేయడంలో వెనుకాడనందువల్ల మొత్తం 11 మంది బైబిలు సత్యాన్ని నేర్చుకున్నారు. ఎంత సంతోషకరమైన ఫలితం! నిజంగా, “యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు.”—కీర్తన 144:15.