దేవదూతలను గూర్చిన సత్యం
ఎవరితోనైనా బాగా పరిచయం ఏర్పరచుకోవడంలో సాధారణంగా వారి కుటుంబాన్ని గూర్చి కొంతైనా తెలుసుకోవడం చేరివుంటుంది. యెహోవా దేవుని గురించి తెలుసుకోవడం విషయం కూడా అంతే. కేవలం ఆయన నామం గురించి తెలుసుకోవడం కంటే ఎక్కువే ఇమిడి ఉంది. పరలోకంలో ఉన్న ఆయన “కుటుంబము” గురించి కూడా మనం కొంత తెలుసుకోవాలి. (ఎఫెసీయులు 3:14, 15 పోల్చండి.) బైబిలు దేవదూతలను దేవుని “కుమారులు” అని పిలుస్తుంది. (యోబు 1:6, అథఃస్సూచి) బైబిలునందు వారు కలిగివున్న ప్రముఖ పాత్రను పరిగణలోకి తీసుకుంటూ, దేవుని సంకల్పంలో వారి స్థానాన్ని అర్ధంచేసుకోవడానికి మనం వారి గురించి ఎక్కువ తెలుసుకోవాలి.
ఒక క్రొత్త ఉపసాంప్రదాయం వృద్ధిచెందుతోంది. అనేకమంది ప్రజలు తాము దేవదూతలను నమ్ముతున్నామని చెప్పడమే కాదు; అధికశాతం మంది తాము ఏదో విధంగా వారిచేత ప్రభావం చెందుతున్నామని చెబుతున్నారు. “మీరు వ్యక్తిగతంగా మీ జీవితంలో ఎప్పుడైనా దేవదూతల ప్రభావాన్ని చవిచూశారా?” అని 500 మంది అమెరికావాసులను అడిగినప్పుడు దాదాపు మూడొంతుల మంది అవునని సమాధానమిచ్చారు. ఆశ్చర్యకరమైన మరో విషయం ఏమిటంటే, దేవదూతలను నమ్ముతున్నామని చెబుతున్న యౌవనస్థుల సంఖ్య, అమెరికాలో ఒక అభిప్రాయ సేకరణ ప్రకారం, మొత్తం 76 శాతంగా ఉంది! స్పష్టంగా, ప్రజలు దేవదూతల యందు ఆసక్తి కలిగివున్నారు. కాని దేవదూతలను గూర్చిన ప్రస్తుత ఆలోచనా విధానం బైబిలు సత్యంతో ఎంతమేరకు పొందిక కలిగివుంది?
సాతాను పాత్రను మరుగుచేయడం
దేవదూతల గురించి మాట్లాడేటప్పుడు, దేవునికి ఎదురుతిరిగినవారని బైబిలు చెప్పే పరలోక ప్రాణులైన దుష్ట దూతలను మనం మరచిపోకూడదు. వీరిలో ప్రముఖుడు సాతాను. మానవులు తమ “ఆత్మీయ కండరాలను” బలపర్చుకోవడానికి తదేక శోధన ద్వారా వారికి సహాయం చేసే సాతాను కేవలం “దేవుని ఒకానొక ప్రముఖ గుణమని” ఆస్క్ యువర్ ఏంజిల్స్ అనే ఒక ప్రసిద్ధ పుస్తకం సూచిస్తుంది. సాతానుకు “ప్రేమపూర్వకమైన ఉద్దేశాలు” ఉన్నప్పటికీ, అతడు శతాబ్దాలుగా పొరపాటున చెడుచేత గుర్తించబడుతున్నాడని ఆ రచయితలు తెలియజేస్తున్నారు. సాతాను మరియు యేసు “కచ్చితంగా ఒకరికొకరు సహాయకారులు కాకపోయినప్పటికీ, కనీసం వాళ్లిద్దరూ ఒకే వైపు ఉన్నారని, ఒకే వ్యక్తి యొక్క అభిన్నమైన భాగాలని” వారు చెబుతున్నారు. ఇవి ఆశ్చర్యం గొల్పే ప్రకటనలే, కాని బైబిలేమి చెబుతుంది?
సాతాను “దేవుని ఒకానొక ప్రముఖ గుణము” కాదు గాని దేవుని శత్రువు అని బైబిలు స్పష్టంగా తెలియజేస్తుంది. (లూకా 10:18, 19; రోమీయులు 16:20) అతడు యెహోవా సర్వోన్నతాధిపత్యాన్ని సవాలు చేస్తున్నాడు, మానవుల ఎడల అతనికున్న ఉద్దేశాలు ఎంతమాత్రం “ప్రేమపూర్వకమైనవి” కావు. దేవుని భూ సేవకులపై అతడు తన ఆగ్రహాన్ని నిర్దయగా వెళ్లగ్రక్కుతాడు. అతడు దేవుని ఎదుట వారిని రాత్రింబగళ్లు నిందిస్తాడు!a (ప్రకటన 12:10, 12, 15-17) వారిని ఎలాగైనా భ్రష్టులను చేయాలని సాతాను పట్టుదలతో ఉన్నాడు. నీతిమంతుడైన యోబును అతడు కనికరం లేకుండా హింసించడం మానవ బాధ ఎడల అతనికున్న కఠినమైన దృక్పథాన్ని బయల్పర్చింది.—యోబు 1:13-19; 2:7, 8.
సాతాను మరియు యేసు “ఒకే వైపు” ఎంతమాత్రం లేరు కాని, వారు ఒకరికొకరు పూర్తి విరుద్ధంగా ఉన్నారు. అంతెందుకు, బాలుడైన యేసును చంపాలనే ప్రయత్నంలో, శిశువులను సంహరించమని ఆజ్ఞ ఇచ్చేలా హేరోదును ప్రేరేపించింది నిస్సందేహంగా సాతానే! (మత్తయి 2:16-18) సాతాను యొక్క కనికరం లేని దాడులు యేసు మరణం వరకు కొనసాగాయి. (లూకా 4:1-13; యోహాను 13:27) అలా, “ఒకే వ్యక్తి యొక్క అభిన్నమైన భాగాలు” కావడానికి బదులు, యేసు మరియు సాతాను ఒకరికొకరు పూర్తిగా వ్యతిరేకులు. వారి శత్రుత్వం అనివార్యమైనదని బైబిలు ప్రవచనం చూపిస్తుంది. (ఆదికాండము 3:15) తగినట్లుగానే, దేవుని యొక్క నియమిత కాలంలో, పునరుత్థానం చేయబడిన యేసు సాతానును నాశనం చేస్తాడు.—ప్రకటన 1:18; 20:1, 10.
ఎవరికి ప్రార్థనలు చేయాలి?
దేవదూత ఉద్యమాన్ని సమర్థించేవారు కొందరు, దేవదూతలతో సంభాషించడానికి ధ్యానం మరియు ఇతర సంకేతపద్ధతులు అవసరమని చెబుతారు. “పరలోక కుటుంబంలోని ఏ సభ్యునితో మాట్లాడాలని చేసిన యథార్థమైన విన్నపమైనప్పటికీ నిర్లక్ష్యం చేయబడదని, అడిగితే మీకు తప్పకుండా సమాధానం లభిస్తుందని” ఒక పుస్తకం చెబుతుంది. సంప్రదించమని ఆ పుస్తకం సిఫారసు చేస్తున్న దేవదూతలలో మిఖాయేలు, గబ్రియేలు, ఉరియేలు, రాపేలు ఉన్నారు.b
అయితే, దేవదూతలకు కాదుగాని దేవునికి ప్రార్థించాలని యేసు తన అనుచరులకు నేర్పించాడు. (మత్తయి 6:9, 10) అలాగే, పౌలు కూడా వ్రాశాడు: “ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.” (ఫిలిప్పీయులు 4:6) కాబట్టి, క్రైస్తవులు యెహోవాకు తప్ప ఎవరికీ ప్రార్థన చేయరు, వారు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తారు.c—యోహాను 14:6, 13, 14.
దేవదూతలు ఏ వర్గానికీ చెందనివారా?
ఏంజిల్‌వాచ్ కార్యక్రమానికి అధ్యక్షత వహించే ఐలీన్ ఇలియస్ ఫ్రీమాన్ ఇలా తెలియజేస్తుంది, “దేవదూతలు ప్రతి మతాన్ని, ప్రతి తత్వాన్ని, ప్రతి జాతిని మించినవారు. వాస్తవానికి, మనకు తెలిసినట్లుగా దేవదూతలకు మతం లేదు.”
అయితే, నమ్మకమైన దేవదూతలకు ఒక మతం ఉందని బైబిలు స్పష్టం చేస్తుంది; ఇతర దేవుళ్ల నుండి పోటీని ఎంతమాత్రం సహించని సత్య దేవుడైన యెహోవాను వారు ఆరాధిస్తారు. (ద్వితీయోపదేశకాండము 5:6, 7; ప్రకటన 7:11) అందుకే అలాంటి ఒక దేవదూత తాను కూడా దేవుని ఆజ్ఞలకు విధేయత చూపే “సహదాసుడను” అని అపొస్తలుడైన యోహానుకు చెప్పాడు. (ప్రకటన 19:10) నమ్మకస్థులైన దేవదూతలు మరేవిధమైన ఆరాధనను ఉన్నతపర్చడం గురించి బైబిలులో మరెక్కడా మనం చదవము. వారు యెహోవాకు అనితర భక్తిని చెల్లిస్తారు.—నిర్గమకాండము 20:4, 5.
“అబద్ధమునకు జనకుడు”
దేవదూతలతో ఎదురైన సంఘటనల్లో అనేకం మృతులతో సంభాషించడం చేరివున్నవే. తాను ఒక సూచకక్రియ అని భావిస్తున్నదాన్ని పొందిన తర్వాత ఎలీస్ అనే స్త్రీ ఇలా చెబుతుంది: “మా మామయ్య తాను చివరికి సంతోషంగా ఉన్నానని నాకు తెలియజేసేందుకు నన్ను చేరడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడనే భావన నాకు కలిగింది.” అలాగే టెర్రీ మరణించిన తన ప్రియ స్నేహితుని గురించి గుర్తుచేసుకుంటుంది. ఆమె ఇలా చెబుతుంది: “అంత్యక్రియలు జరిగిన ఒక వారం తర్వాత, నేను స్వప్నమని భావించినదానిలో ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఆయన వియోగాన్ని బట్టి నేను బాధపడకూడదని ఎందుకంటే తాను సంతోషంగా, శాంతిగా ఉన్నానని నాతో చెప్పాడు.”
కాని మృతులు “ఏమియు ఎరుగరు” అని బైబిలు తెలియజేస్తుంది. (ప్రసంగి 9:5) ఒక వ్యక్తి మరణించినప్పుడు, అతని “సంకల్పములు నాడే నశించును” అని కూడా అది చెబుతుంది. (కీర్తన 146:4) అయితే, సాతాను “అబద్ధమునకు జనకుడు.” (యోహాను 8:44) మానవ ప్రాణము మరణాన్ని తప్పించుకుంటుందన్న అబద్ధాన్ని ప్రారంభించిందీ అతడే. (యెహెజ్కేలు 18:4 పోల్చండి.) క్రైస్తవత్వపు ప్రధాన సిద్ధాంతమైన పునరుత్థానాన్ని విశ్వసించనవసరం లేదనే సాతాను సంకల్పానికి సరిపోయే దీన్ని నేడు అనేకమంది ప్రజలు విశ్వసిస్తున్నారు. (యోహాను 5:28, 29) కాబట్టి, మృతుల గురించి తెలుసుకోవడం, లేదా వాళ్ల నుండి సమాచారాలు పొందుతుండడం, దేవునిచే నిరాకరించబడిన దేవదూతా ఉద్యమం యొక్క మరో అంకమే.
సమీపించుట దేవదూతలనా లేక దయ్యాలనా?
ప్రస్తుత దేవదూత ఉద్యమంలో అధికభాగం నిగూఢ విద్యలో నిమగ్నమై ఉంది. మార్‌స్యా అనుభవాన్ని పరిశీలించండి. ఆమె ఇలా చెబుతుంది: “1986 సెప్టెంబరు నుండి డిశంబరు వరకు నేను ‘సహజాతీత శక్తుల’ నుండి సందేశాలు పొందడం ప్రారంభమయ్యింది. నేను దయ్యాలను చూశాను, ‘గత జీవితాన్ని’ గూర్చిన నమ్మశక్యంకాని స్వప్నాలు నాకు కలిగాయి. నేను మరణించిన స్నేహితులను కలిశాను, నేను అప్పుడే కలిసిన ప్రజల గురించి నాకు తెలిసిన విషయాలు గల అనేక ఇతర మానసిక అనుభవాలను నేను పొందాను. అలౌకిక వ్రాత అనే ఈవితో నేను ఆశీర్వదించబడ్డాను, అదృశ్యుల నుండి వచ్చిన సందేశాలను అందజేసేదాన్ని. వారి భూ జీవితంలో నేను వారితో ఎన్నడూ కలవకపోయినా అలాంటి వారు కొందరు నా ద్వారా ఇతరులకు సందేశాలు పంపించేవారు.”
దేవదూతలతో “సంభాషించడానికి” సోదె చెప్పడాన్ని ఒక మార్గంగా ఉపయోగించడం అసాధారణమైనదేమీ కాదు. మాంత్రిక రాళ్లను, బొమ్మలున్న కార్డు ముక్కలతో జోస్యం, ఐ చింగ్ బిళ్లలను, హస్త సాముద్రికాన్ని, జ్యోతిశ్శాస్త్రాన్ని ఉపయోగించుకోమని ఒక గ్రంథ మూలం తన పాఠకులను సూటిగా ప్రోత్సహిస్తోంది. రచయితలు ఇలా వ్రాస్తున్నారు: “మీ అంతరంగం మిమ్మల్ని సరైన దివ్యవాక్యం యొద్దకు నడిపించేందుకు అనుమతించండి, అక్కడ ఒక దేవదూత మిమ్మల్ని కలుస్తాడని నమ్మండి.”
అయితే, బైబిలు ప్రకారం, ‘అక్కడ మిమ్మల్ని ఏది కలిసినప్పటికీ’ అది కచ్చితంగా దేవుని దేవదూతల్లో ఒకరు కాదు. ఎందుకు? ఎందుకంటే సోదె చెప్పడం దేవునికి పూర్తిగా వ్యతిరేకమైనది, పరలోకంలోగాని భూమిపైగాని ఉన్న సత్యారాధికులకు దానితో ఏ సంబంధమూ లేదు. అంతెందుకు, ఇశ్రాయేలులో సోదె చెప్పడం ఘోరమైన అపరాధంగా ఎంచబడేది! ధర్మశాస్త్రం ఇలా తెలియజేసింది: “వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు.”—ద్వితీయోపదేశకాండము 13:1-5; 18:10-12.
“వెలుగు దూత”
సోదె చెప్పడం ప్రయోజనకరమైనట్లు, చివరికి దేవదూతల సంబంధమైనదైనట్లు కనిపించేలా సాతాను చేయగలడంటే దాన్ని బట్టి మనం ఆశ్చర్యపోనవసరం లేదు. సాతాను “తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు” అని బైబిలు చెబుతుంది. (2 కొరింథీయులు 11:14) చూసేవారు శకునము దేవుని నుండి వచ్చిందేమోనని భావించేలా మోసగిస్తూ, అతడు శకునములను కల్పించి అవి నిజమయ్యేలా కూడా చేయగలడు. (మత్తయి 7:21-23; 2 థెస్సలొనీకయులు 2:9-12 పోల్చండి.) కాని సాతాను పనులన్నీ—అవి ఎంత మంచివైనట్లు కనిపించినా లేక ఎంత చెడ్డవైనట్లు కనిపించినా, ఈ రెండు సంకల్పాల్లో ఏదో ఒకదానిని అవి నెరవేరుస్తాయి: ప్రజలను యెహోవాకు వ్యతిరేకంగా త్రిప్పడం లేదా ‘క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండేలా’ కేవలం వారి మనస్సులకు అంధత్వం సంక్రమించేలా చేయడం. (2 కొరింథీయులు 4:3, 4) ఈ తర్వాతి విధమైన మోసం తరచూ ఎంతో ప్రభావవంతమైనది.
మొదటి శతాబ్దంలోని ఒక చిన్నదాన్ని గూర్చిన బైబిలు వృత్తాంతాన్ని పరిశీలించండి. ఆమె చెప్పే శకునములు ఆమె యజమానులకు ఎంతో లాభం చేకూర్చేవి. ఆమె చాలా రోజుల వరకు శిష్యులను అనుసరిస్తూ, “ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు; వీరు మీకు రక్షణమార్గము ప్రచురించువారైయున్నారని” చెప్పేది. ఆమె మాటలు నిజమే. అయినప్పటికీ, ఆమెకు ఒక దేవదూత కాదుగాని ‘సోదె చెప్పే దయ్యము’ పట్టిందని వృత్తాంతం మనకు తెలియజేస్తుంది. చివరికి, పౌలు “దానివైపు తిరిగి—నీవు ఈమెను వదలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను; వెంటనే అది ఆమెను వదలిపోయెను.”—అపొస్తలుల కార్యములు 16:16-18.
పౌలు ఆ ఆత్మను ఎందుకు వెళ్లగొట్టాడు? అది దయ్యము పట్టిన చిన్నదాని యజమానులకు ఎంతో ధనం కలిగేలా చేసేది. సహజాతీత శక్తులతో ఆ చిన్నది, ఎప్పుడు విత్తనాలు వేయాలనేది రైతులకు, ఎప్పుడు వివాహం చేసుకోవాలనేది కన్యలకు, బంగారం కొరకు ఎక్కడ చూడాలనేది గనులు త్రవ్వేవారికి చెప్పి ఉండవచ్చు. అంతెందుకు, శిష్యులను బహిరంగంగా పొగడడం ద్వారా సత్యాన్ని గూర్చిన కొన్ని మాటలు పలకడానికి కూడా ఆత్మ ఆ చిన్నదాన్ని ప్రేరేపించింది!
అయినప్పటికీ, అది ‘సోదె చెప్పే దయ్యమే.’ దయ్యమైనందున అది యెహోవా గురించి, రక్షణ కొరకైన ఆయన ఏర్పాటు గురించి ప్రకటించే హక్కు దానికి లేదు. బహుశా చిన్నదాని ప్రవచనాలకు కీర్తి కలుగజేయడానికి చెప్పబడిన దాని సహాయకరమైన మాటలు, చూసేవారి శ్రద్ధను క్రీస్తు నిజ అనుచరులపై నుండి మళ్లించాయి. అందుకే మంచి కారణంతోనే పౌలు కొరింథీయులను ఇలా హెచ్చరించాడు: “యెహోవా బల్లమీద ఉన్నదానిలోను దయ్యముల బల్లమీద ఉన్న దానిలోను కూడ పాలుపొందనేరరు.” (1 కొరింథీయులు 10:21, NW) ఆశ్చర్యపోనవసరంలేని విధంగా, మొదటి శతాబ్దపు క్రైస్తవులు సోదె చెప్పడానికి సంబంధించిన తమ పుస్తకాలన్నిటినీ నాశనం చేశారు.—అపొస్తలుల కార్యములు 19:19.
‘ఆకాశమధ్యమున ఎగురుతున్న దేవదూత’
మనం చూసినట్లుగా, ప్రస్తుతం జరుగుతున్న దేవదూత ఉద్యమం దేవుని శత్రువైన అపవాదియగు సాతానుతో సన్నిహిత సంబంధం కలిగివున్నట్లుగా బైబిలు బయల్పరుస్తుంది. అంటే పరిశుద్ధ దేవదూతలు మానవ విషయాల్లో ఇమిడి లేరని దీని భావమా? దానికి భిన్నంగా, ఇప్పుడు వారు భూమిపై ఒక శక్తివంతమైన పని చేస్తున్నారు. అదేమిటి? దానికి సమాధానం కొరకు, మనం బైబిలు పుస్తకమైన ప్రకటనను చూడాలి. ఈ పుస్తకంలో, బైబిలులోని మరే ఇతర పుస్తకాలకన్నా ఎక్కువ సార్లు దేవదూతల గురించి చెప్పబడింది.
ప్రకటన 14:6, 7 నందు అపొస్తలుడైన యోహాను తాను పొందిన ప్రవచనార్థక దర్శనాన్ని ఇలా వ్రాసిపెట్టినట్లుగా మనం చదువుతాము: “అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశమధ్యమున ఎగురుచుండెను. అతడు—మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసినవానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను.”
ఈ లేఖనం దేవదూతలు నేడు చేస్తున్న ప్రాముఖ్యమైన పనిని నొక్కి తెలియజేస్తుంది. వారు దేవుని రాజ్య సువార్తను ప్రకటించడమనే అత్యంత ప్రాముఖ్యమైన పనిలో ఇమిడి ఉన్నారు. ఈ పనికి సంబంధించే యేసు తన అనుచరులకు “ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని” వాగ్దానం చేశాడు. (మత్తయి 28:18-20) యేసు తన అనుచరులతో ఎలా ఉన్నాడు? ఒక విధమేమిటంటే, ఈ జ్ఞాపకార్థకమైన పని నెరవేరేలా వారికి దేవదూత సంబంధమైన సహాయాన్ని ఇవ్వడమే.
దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్తను ప్రకటించడంలో యెహోవాసాక్షులు సంవత్సరానికి 100 కోట్ల కంటే ఎక్కువ గంటలు గడుపుతున్నారు. ఈ పనిని నెరవేర్చడంలో వారు దేవదూత సంబంధమైన నడిపింపు యొక్క రుజువును చూస్తున్నారు. వారు తమ ఇంటింటి పరిచర్యలో, దేవుని సంకల్పాలను అర్థం చేసుకోవడానికి ఎవరైనా సహాయం చేయాలని అప్పుడే ప్రార్థిస్తుండిన వ్యక్తులను వారు కలవడం ఎన్నోసార్లు జరిగింది. సాక్షుల స్వంత చొరవతోపాటు దేవదూతల నడిపింపు, ప్రతి సంవత్సరం వందల వేలమంది యెహోవాను గూర్చిన జ్ఞానాన్ని పొందడానికి కారణమైంది!
మధ్యాకాశంలో ఎగురుతున్న దేవదూత చెప్పేది మీరు వింటున్నారా? యెహోవాసాక్షులు మీ దగ్గరకు వచ్చినప్పుడు, వారితో ఈ దేవదూత సంబంధ వర్తమానాన్ని మరింత సంపూర్ణంగా ఎందుకు చర్చించకూడదు?
[అధస్సూచీలు]
a “సాతాను” మరియు “అపవాది” అనే పదాలకు “విరోధి” మరియు “కొండెములు చెప్పువాడు” అని భావం.
b మిఖాయేలు, గబ్రియేలు గురించి బైబిలులో చెప్పబడింది, రాపేలు మరియు ఉరియేలు అనే పేర్లు బైబిలు గ్రంథంలో భాగంకాని అప్రమాణిక గ్రంథాలలో కనిపిస్తాయి.
c ప్రార్థన యేసు ద్వారా చేయబడుతుంది కాని ఆయనకు చేయబడదని గమనించండి. యేసు చిందించిన రక్తం దేవున్ని సమీపించేందుకు మార్గాన్ని తెరిచింది గనుక యేసు నామమున ప్రార్థన చేయబడుతుంది.—ఎఫెసీయులు 2:13-19; 3:12.
[8వ పేజీలోని బాక్సు]
దేవదూతలు ఎవరు?
అనేకులు విశ్వసించేదానికి భిన్నంగా, దేవదూతలంటే మరణించిన మానవుల వదిలిపెట్టబడిన ప్రాణములు కాదు. మృతులు “ఏమియు ఎరుగరు” అని బైబిలు స్పష్టంగా తెలియజేస్తుంది. (ప్రసంగి 9:5) మరి దేవదూతలు ఎక్కడి నుండి వచ్చారు? భూమి సృష్టించబడక మునుపు వారు దేవునిచే వ్యక్తిగతంగా సృష్టించబడ్డారని బైబిలు సూచిస్తుంది. (యోబు 38:4-7) దేవుని పరలోక కుటుంబం యొక్క పరిమాణం వందలాది లక్షల, బహుశా వందల కోట్లకంటే ఎక్కువమంది దేవదూతలతో కూడినదై ఉండవచ్చు! కొంతమంది దేవదూతలు సాతాను చేసిన తిరుగుబాటులో అతనితో కలిశారు.—దానియేలు 7:10; ప్రకటన 5:11; 12:7-9.
యెహోవా క్రమంగల దేవుడు గనుక, దేవదూత సంబంధమైన ఆయన విస్తృతమైన కుటుంబం కూడా క్రమం గలదైవుండడంలో ఆశ్చర్యంలేదు.—1 కొరింథీయులు 14:33.
• శక్తిలోను అధికారంలోను ప్రముఖమైన దేవదూత ఎవరంటే ప్రధానదూత అయిన యేసుక్రీస్తు, ఆయనే మిఖాయేలు అని కూడా పిలువబడ్డాడు. (1 థెస్సలొనీకయులు 4:16; యూదా 9) ఆయన అధికారం క్రింద సెరాపులు, కెరూబులు మరియు దేవదూతలు ఉన్నారు.
• సెరాపులు దేవుని సింహాసనం వద్ద ఉంటారు. దేవుని పరిశుద్ధతను ప్రకటిస్తూ, ఆయన ప్రజలను పరిశుభ్రంగా ఉంచడం వారి పని అన్నది స్పష్టం.—యెషయా 6:1-3, 6, 7.
• కెరూబులు కూడా యెహోవా సాన్నిధ్యంలో కనిపిస్తారు. దేవుని సింహాసనం వెంటపోవు పరివారంగా లేదా కాపలాకాసేవారిగా, వారు యెహోవా మహిమను ఉన్నతపరుస్తారు.—కీర్తన 80:1; 99:1; యెహెజ్కేలు 10:1, 2.
• దేవదూతలు (“వార్తాహరులు” అని భావం) యెహోవాకు ప్రతినిధులు మరియు సహాయులు. దేవుని ప్రజల విడుదల అయినప్పటికీ, దుష్టుల నిర్మూలన అయినప్పటికీ వారు దైవిక చిత్తాన్ని నెరవేరుస్తారు.—ఆదికాండము 19:1-26.
[7వ పేజీలోని చిత్రాలు]
మధ్యాకాశంలో ఎగురుతున్న దేవదూత చెప్పేది మీరు వింటున్నారా?