దైవిక సర్వాధిపత్యానికి క్రైస్తవ సాక్షులు
‘మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయవలెను.’—1 పేతురు 2:9.
1. క్రీస్తుకు పూర్వమున్న కాలాల్లో యెహోవాను గూర్చి ఏ ప్రభావవంతమైన సాక్ష్యమివ్వబడింది?
క్రీస్తుకు పూర్వమున్న కాలాల్లో, ఎంతో మంది సాక్షులు యెహోవాయే సత్య దేవుడన్న విషయానికి ధైర్యంగా సాక్ష్యమిచ్చారు. (హెబ్రీయులు 11:4–12:1) తమ విశ్వాసంలో వారు దృఢంగా ఉండి, వారు యెహోవా నియమాలను ధైర్యంగా పాటించారు మరియు ఆరాధన విషయంలో రాజీపడేందుకు నిరాకరించారు. వారు యెహోవా సర్వాధిపత్యానికి బలమైన సాక్ష్యాన్నిచ్చారు.—కీర్తన 18:21-23; 47:1, 2.
2. (ఎ) యెహోవాకు అతి గొప్ప సాక్షి ఎవరు? (బి) యెహోవాసాక్షులుగా ఇశ్రాయేలు జనాంగం స్థానాన్ని ఎవరు తీసుకున్నారు? అది మనకెలా తెలుసు?
2 చివరి సాక్షి మరియు క్రీస్తుకు పూర్వం ఉన్న సాక్షుల్లో అతి గొప్ప సాక్షి బాప్తిస్మమిచ్చు యోహాను. (మత్తయి 11:11) ఎన్నుకొనబడినవాని రాకను ప్రకటించే ఆధిక్యత ఆయనకు లభించింది మరియు ఆయన యేసును వాగ్దాన మెస్సీయాగా పరిచయం చేశాడు. (యోహాను 1:29-34) యేసు యెహోవాకు గొప్ప సాక్షి అంటే “నమ్మకమైన సత్యసాక్షి.” (ప్రకటన 3:14) శారీరక ఇశ్రాయేలు యేసును నిరాకరించింది కనుక, యెహోవా దానిలోని వారిని తృణీకరించాడు మరియు తన సాక్షిగా ఉండేందుకుగాను దేవుని ఆత్మీయ ఇశ్రాయేలును ఓ నూతన జనాంగంగా నియమించాడు. (యెషయా 42:8-12; యోహాను 1:11, 12; గలతీయులు 6:16) “మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు” అని చెప్పినప్పుడు, పేతురు ఇశ్రాయేలును గూర్చిన ఓ ప్రవచనాన్ని సూచించి, అది “దేవుని ఇశ్రాయేలు,” అంటే క్రైస్తవ సంఘానికి వర్తిస్తుందని కనపర్చాడు.—1 పేతురు 2:9; నిర్గమకాండము 19:5, 6; యెషయా 43:21; 60:2.
3. దేవుని ఇశ్రాయేలు మరియు “గొప్ప సమూహము” యొక్క ప్రాధమిక బాధ్యతేమిటి?
3 దేవుని ఇశ్రాయేలు ప్రథమ బాధ్యత యెహోవా మహిమను గూర్చి బహిరంగంగా సాక్ష్యమివ్వడమని పేతురు మాటలు కనపరుస్తున్నాయి. మన రోజుల్లో ఈ ఆత్మీయ జనాంగంతో, సాక్షుల “గొప్ప సమూహము” చేరుతుంది, వీరు కూడా దేవున్ని బహిరంగంగా మహిమపరుస్తారు. వారు అందరూ వినేలా పెద్ద స్వరంతో ఇలా ఎలుగెత్తి చెబుతారు: ‘సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రము.’ (ప్రకటన 7:9, 10; యెషయా 60:8-10) దేవుని ఇశ్రాయేలు మరియు దాని సహచరులు తమ సాక్ష్యాన్ని ఎలా ఇవ్వగలరు? వారి విశ్వాసమూ విధేయతల ద్వారానే.
అబద్ధ సాక్షులు
4. యేసు కాలంలోని యూదులు ఎందుకు అబద్ధ సాక్షులుగా ఉన్నారు?
4 విశ్వాసమూ విధేయత అంటే దేవుని సూత్రాలకు అనుగుణంగా నడుచుకోవడం. దాని ప్రాముఖ్యత, తన కాలంలోని యూదా మత నాయకులను గూర్చి యేసు చెప్పిన దానిలో కనిపిస్తుంది. న్యాయాన్ని బోధించేవారిగా తమకు తామే ‘మోషే పీఠమందు కూర్చున్నారు.’ అవిశ్వాసులైన వారిని మార్చేందుకు సహితం వారు మిషనరీలను పంపించారు. అయినప్పటికీ, యేసు వారితో ఇలా చెప్పాడు: “ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు.” ఈ మతావలంభులు అబద్ధ సాక్షులు—అహంకారులు, వేషధారులు మరియు ప్రేమలేనివారు. (మత్తయి 23:1-12, 15) ఒక సందర్భంలో కొందరు యూదులతో యేసు ఇలా చెప్పాడు: “మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు.” దేవునిచే ఎన్నుకోబడిన జనాంగంలోని సభ్యులతో ఆయన ఎందుకు అలా మాట్లాడివుంటాడు? ఎందుకంటే వారు యెహోవా యొక్క అతి గొప్ప సాక్షి మాటలను లక్ష్యపెట్ట లేదు.—యోహాను 8:41, 44, 47.
5. క్రైస్తవమత సామ్రాజ్యం, దేవున్ని గూర్చి అబద్ధ సాక్ష్యమిచ్చిందని మనకు ఎలా తెలుసు?
5 అదే విధంగా, యేసు జీవించిన కాలంనుండి శతాబ్దాలుగా క్రైస్తవమత సామ్రాజ్యంలోని కోట్లమంది తాము ఆయన శిష్యులని చెప్పుకున్నారు. అయితే, వారు దేవుని చిత్తాన్ని చేయలేదు కనుక, యేసు వారిని స్వీకరించలేదు. (మత్తయి 7:21-23; 1 కొరింథీయులు 13:1-3) క్రైస్తవమత సామ్రాజ్యం మిషనరీలను పంపించింది, నిస్సందేహంగా వారిలో అనేకులు యథార్థవంతులే. అయితే, వారు పాపులను నరకాగ్నిలో కాల్చే ఒక త్రిత్వ దేవున్ని ఆరాధించడాన్ని ప్రజలకు నేర్పించారు, మరియు వారివల్ల మతంమారినవారు తాము క్రైస్తవులనేందుకు చిన్న రుజువును కూడా చూపించరు. ఉదాహరణకు, రోమన్ కాథోలిక్ మిషనరీలకు, ఆఫ్రికా దేశమైన రువాండా ఫలవంతమైన ప్రాంతమైంది. అయినప్పటికీ, రువాండానందలి కాథోలిక్కులు ఆ దేశంలో జరిగిన ఇటీవలి జాత్యంతర యుద్ధంలో హృదయపూర్వకంగా పాల్గొన్నారు. ఆ మిషనరీ ప్రాంతంలోని ఫలం, క్రైస్తవమత సామ్రాజ్యం నుండి దానికి యథార్థమైన క్రైస్తవ సాక్ష్యం లభించలేదని కనపరుస్తోంది.—మత్తయి 7:15-20.
దైవిక సూత్రాలకనుగుణంగా జీవించడం
6. సాక్ష్యమివ్వడంలో సరైన ప్రవర్తన ఏ విధాల్లో ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తుంది?
6 క్రైస్తవులమని చెప్పుకునేవారి చెడు ప్రవర్తన “సత్యమార్గము”నకు దూషణను తెస్తుంది. (2 పేతురు 2:2) ఓ యథార్థమైన క్రైస్తవుడు దేవుని సూత్రాల ప్రకారంగా జీవిస్తాడు. అతడు దొంగతనం చేయడు, అబద్ధమాడడు, మోసగించడు, లేక అనైతికతను జరిగించడు. (రోమీయులు 2:22) నిశ్చయంగా అతడు తన పొరుగువానిని చంపడు. క్రైస్తవ భర్తలు తమ కుటుంబాలను ప్రేమపూర్వకంగా పర్యవేక్షిస్తారు. ఆ పర్యవేక్షణకు భార్యలు గౌరవపూర్వకంగా మద్దతునిస్తారు. పిల్లలు తమ తలిదండ్రుల నుండి శిక్షణను పొందుతారు, తద్వారా బాధ్యతగల క్రైస్తవ పెద్దలయ్యేందుకు సిద్ధమౌతారు. (ఎఫెసీయులు 5:21–6:4) నిజమే, మనమందరమూ అపరిపూర్ణులమే, తప్పులు చేసేవాళ్లమే. అయితే నిజమైన క్రైస్తవుడు బైబిలు ప్రమాణాలను గౌరవిస్తాడు, వాటిని అమలుపర్చేందుకు యథార్థంగా ప్రయత్నిస్తాడు. ఇది ఇతరులకు కనిపిస్తుంది మరియు చక్కని సాక్ష్యాన్నిస్తుంది. కొన్ని సందర్భాల్లో, మునుపు సత్యాన్ని వ్యతిరేకించినవారు ఓ క్రైస్తవుని మంచి ప్రవర్తనను గమనించి, రాబట్టబడ్డారు.—1 పేతురు 2:12, 15; 3:1.
7. క్రైస్తవులు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కల్గివుండడం ఎంత ప్రాముఖ్యం?
7 ‘మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు’ అని అన్నప్పుడు క్రైస్తవ ప్రవర్తనలోని ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని యేసు చూపించాడు. (యోహాను 13:35) సాతాను లోకం ‘సమస్తమైన దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య, . . . మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రుల కవిధేయులును, అవివేకులును’ వంటి వారితో నిండివుంది. (రోమీయులు 1:29, 30) అలాంటి వాతావరణంలో, ప్రేమతో నిండిన ప్రపంచవ్యాప్త సంస్థ దేవుని ఆత్మ పని చేస్తుందనేందుకు బలమైన సాక్ష్యంగా ఉండగలదు అదే ప్రభావవంతమైన సాక్ష్యం. అలాంటి సంస్థ యెహోవాసాక్షులతో తయారౌతుంది.—1 పేతురు 2:17.
సాక్షులు బైబిలు విద్యార్థులు
8, 9. (ఎ) కీర్తనల గ్రంథకర్త, దేవుని న్యాయాన్ని గూర్చి చదివి దానిపైన ధ్యానించడం వల్ల ఎలా బలపర్చబడ్డాడు? (బి) బైబిలు పఠనం మరియు దాని ధ్యానం మనం సాక్ష్యమిస్తూ ఉండేందుకు మనకు ఎలా సహాయపడతాయి?
8 చక్కని సాక్ష్యమివ్వడంలో సఫలుడయ్యేందుకు, ఓ క్రైస్తవుడు యెహోవా యొక్క నీతియుక్త సూత్రాలు ఏమిటో తెలుసుకుని, వాటిని ప్రేమించాలి మరియు లోకంలోని అవినీతిని అసహ్యించుకోవాలి. (కీర్తన 97:10) లోకం దాని స్వంత ఆలోచనను ప్రబోధించడంలో పట్టువిడకుండా ఉంది, మరియు దాని ఆత్మను ఎదిరించడం కష్టతరంకావచ్చు. (ఎఫెసీయులు 2:1-3; 1 యోహాను 2:15, 16) మనం సరైన మానసిక దృక్పథాన్ని కల్గివుండేందుకు మనకు ఏది సహాయపడుతుంది? క్రమమైన, అర్థవంతమైన బైబిలు పఠనం సహాయపడుతుంది. కీర్తన 119ని వ్రాసిన రచయిత, యెహోవా ధర్మశాస్త్రం ఎడల ఆయనకు గల ప్రేమను అనేకసార్లు మరలా మరలా చెప్పాడు. ఆయన దాన్ని చదివి, దాన్ని ఎల్లప్పుడు “దినమెల్ల” ధ్యానించాడు. (కీర్తన 119:92, 93, 97-105) తత్ఫలితంగా, ఆయన ఇలా వ్రాయగలిగాడు: “అబద్ధము నాకసహ్యము అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము.” అంతేకాకుండ, ఆయన గాఢమైన ప్రేమ చర్య తీసుకునేందుకు ఆయనను పురికొల్పింది. ఆయన ఇలా అంటున్నాడు: “నీ న్యాయవిధులనుబట్టి దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను.”—కీర్తన 119:163, 164.
9 అదే విధంగా, మనం దేవుని వాక్యాన్ని క్రమంగా పఠించి దాన్ని ధ్యానించడం, మన హృదయాన్ని స్పర్శించి మనం ‘ఆయనను స్తుతించేలా’—యెహోవాను గూర్చి సాక్ష్యమిచ్చేలా మనలను కదిలిస్తుంది—తరచూ “దినమునకు ఏడు మారులు” కూడా సాక్ష్యమివ్వవచ్చు. (రోమీయులు 10:10) దీనికి అనుగుణంగా, యెహోవా వాక్యాలను గూర్చి ఎవరైతే క్రమంగా ధ్యానిస్తారో వారు “నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును,” అని మొదటి కీర్తన యొక్క రచయిత చెబుతున్నాడు. (కీర్తన 1:3) “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై యున్నది” అని అపొస్తలుడైన పౌలు వ్రాసినప్పుడు దేవుని వాక్యానికున్న శక్తిని ఆయన చూపించాడు.—2 తిమోతి 3:16, 17.
10. ఈ అంత్య దినాల్లో యెహోవా ప్రజలను గూర్చిన ఏ విషయం స్పష్టమైంది?
10 ఈ 20వ శతాబ్దంలో సత్యారాధికుల సంఖ్యలోని త్వరిత పెరుగుదల, యెహోవా ఆశీర్వాదాలను సూచిస్తోంది. నిస్సందేహంగా, ఒక దైవిక సర్వాధిపత్యం కొరకు గుంపుగా ఈ ఆధునిక దిన సాక్షులు తమ హృదయాల్లో యెహోవా నియమం ఎడల ప్రేమను అలవర్చుకున్నారు. కీర్తనల గ్రంథకర్తలా, వారు ఆయన ఆజ్ఞకు లోబడి, “రాత్రింబగళ్లు” యెహోవా మహిమను గూర్చి నమ్మకంగా సాక్ష్యమిచ్చేందుకు కదిలించబడ్డారు.—ప్రకటన 7:15.
యెహోవా అద్భుత కార్యాలు
11, 12. యేసు మరియు ఆయన అనుచరులు చేసిన అద్భుతాలవల్ల ఏమి సాధించబడింది?
11 మొదటి శతాబ్దంలో, నమ్మకమైన క్రైస్తవ సాక్షులు అద్భుతాలను చేసేందుకు పరిశుద్ధాత్మ ద్వారా శక్తిమంతులుగా చేయబడ్డారు, అది వారిచ్చే సాక్ష్యం సత్యమనేందుకు బలమైన నిదర్శనాన్నిచ్చింది. బాప్తిస్మమిచ్చు యోహాను చెరసాలలో ఉన్నప్పుడు, యేసును ఇలా అడగమని తన శిష్యులను పంపించాడు: “రాబోవు వాడవు నీవేనా, మేము మరియొకనికొరకు కనిపెట్టవలెనా?” యేసు దానికి అవునని గానీ కాదని గానీ జవాబు చెప్పలేదు. బదులుగా, ఆయన ఇలా అన్నాడు: ‘మీరు వెళ్లి, విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు.’ (మత్తయి 11:2-6) ఈ శక్తివంతమైన పనులు, ‘రాబోవువాడు’ నిజంగా యేసే అనడానికి యోహానుకు సాక్ష్యంగా పనిచేశాయి.—అపొస్తలుల కార్యములు 2:22.
12 అదే విధంగా, యేసు అనుచరుల్లో కొందరు రోగులను స్వస్థపర్చి మృతులను కూడా లేపారు. (అపొస్తలుల కార్యములు 5:15, 16; 20:9-12) ఈ అద్భుతాలు, వారికొరకు స్వయంగా దేవునినుండి వచ్చిన సాక్ష్యమన్నట్లుగానే ఉన్నాయి. (హెబ్రీయులు 2:4) మరి అలాంటి క్రియలు యెహోవా సర్వోన్నతశక్తిని ప్రదర్శించాయి. ఉదాహరణకు, “ఈ లోకాధికారి” అయిన సాతాను మరణము యొక్క బలము గలవాడన్న విషయం నిజమే. (యోహాను 14:30; హెబ్రీయులు 2:14) అయితే పేతురు యెహోవా శక్తివల్ల మాత్రమే నమ్మకమైన స్త్రీయగు దొర్కాను మరణం నుండి లేపగలిగాడు, ఎందుకంటే ఆయన మాత్రమే జీవాన్ని తిరిగి ఇవ్వగలడు.—కీర్తన 16:10; 36:9; అపొస్తలుల కార్యములు 2:25-27; 9:36-43.
13. (ఎ) బైబిలు అద్భుతాలు ఏవిధంగా యెహోవా శక్తికి ఇప్పటికీ సాక్ష్యంగా ఉన్నాయి? (బి) యెహోవా దైవత్వాన్ని నిరూపించడంలో ప్రవచన నెరవేర్పు ఎలా ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తుంది?
13 నేడు, ఆ అద్భుత క్రియలు ఇక జరగడంలేదు. వాటి సంకల్పం నెరవేరింది. (1 కొరింథీయులు 13:8) అయినప్పటికీ, వాటిని గూర్చి చూసినవారనేకులు సాక్ష్యమిచ్చిన రికార్డు మనకు ఇంకా బైబిల్లో ఉంది. ఈ చరిత్రాత్మక దృష్టాంతాలకు క్రైస్తవులు నేడు అవధానమిస్తుండగా, ఈ క్రియలు నేటికీ కూడా యెహోవాశక్తికి ప్రభావవంతమైన సాక్ష్యాన్నిస్తున్నాయి. (1 కొరింథీయులు 15:3-6) దానికి తోడు, తాను సత్య దేవుడనేందుకు, తన కచ్చితమైన ప్రవచనాలు విశేషమైన నిదర్శనమని యెహోవా సూచించాడు. (యెషయా 46:8-11) దైవికంగా ప్రేరేపించబడిన అనేక ప్రవచనాలు నేడు నెరవేరాయి—క్రైస్తవ సంఘాన్ని గూర్చిన అనేక ప్రవచనాలు నెరవేరాయి. (యెషయా 60:8-10; దానియేలు 12:6-12; మలాకీ 3:17, 18; మత్తయి 24:9; ప్రకటన 11:1-13) అంతేకాకుండ, మనం “అంత్యదినములలో” జీవిస్తున్నామని నేరుగా సూచిస్తున్న, ఈ ప్రవచనాల నెరవేర్పు యెహోవాయే సత్య దేవుడని నిరూపిస్తున్నాయి.—2 తిమోతి 3:1.
14. యెహోవా సర్వాధిపతియైన ప్రభువనేందుకు యెహోవాసాక్షుల ఆధునిక చరిత్ర ఏ విధాల్లో శక్తివంతమైన సాక్ష్యంగా ఉంది?
14 చివరికి, యెహోవా ఇంకా గొప్ప అద్భుత కార్యాలను విషయాలను తన ప్రజలకొరకు చేస్తున్నాడు. బైబిలు సత్యంపై అధిక వెలుగు ప్రకాశించడమనేది, యెహోవా ఆత్మ ద్వారా నడిపించబడుతుంది. (కీర్తన 86:10; ప్రకటన 4:5, 6) ప్రపంచవ్యాప్తంగా నమోదైన విశేషమైన అభివృద్ధి, యెహోవా విషయాలను ‘తగినకాలమున త్వరపెడుతున్నాడు’ అనేందుకు రుజువు. (యెషయా 60:22) అంత్యదినాలంతటిలోనూ ఒక దేశం తర్వాత మరో దేశంలో ఘోరమైన హింస చెలరేగినప్పుడెల్లా, పరిశుద్ధాత్మ చేకూర్చిన బలపర్చే సహకారం వల్లనే యెహోవా ప్రజలు ధైర్యంగా సహించడం సాధ్యమైంది. (కీర్తన 18:1, 2, 17, 18; 2 కొరింథీయులు 1:8-10) యెహోవాసాక్షుల ఆధునిక దిన చరిత్రే యెహోవా సర్వాధికారియైన ప్రభువనేందుకు బలమైన సాక్ష్యం.—జెకర్యా 4:6.
ప్రకటించబడవలసిన సువార్త
15. క్రైస్తవ సంఘం ఏ విస్తారమైన సాక్ష్యాన్నివ్వవల్సి ఉంది?
15 యెహోవా ఇశ్రాయేలును అన్యులకు తన సాక్షులుగా నియమించాడు. (యెషయా 43:10) అయితే, కొందరు ఇశ్రాయేలీయులు మాత్రమే, ఇశ్రాయేలీయులుకానివారి వద్దకు వెళ్లి ప్రకటించాలని దైవికంగా ఆదేశించబడ్డారు, మరి ఇది తరచూ యెహోవా తీర్పులను ప్రకటించేందుకే అయివుండేది. (యిర్మీయా 1:5; యోనా 1:1, 2) అయినప్పటికీ, ఒకనాడు యెహోవా జనాంగాలవైపు తన అవధానాన్ని ఎక్కువగా మళ్లిస్తాడని, మరి దీన్ని ఆయన దేవుని ఆత్మీయ ఇశ్రాయేలు ద్వారా చేశాడని హెబ్రీ లేఖనాల్లోని ప్రవచనాలు సూచిస్తున్నాయి. (యెషయా 2:2-4; 62:2) పరలోకానికి వెళ్లేముందు, యేసు తన అనుచరులకు ఇలా బోధించాడు: “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి.” (మత్తయి 28:19) “ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెల”పై యేసు అవధానాన్ని నిలిపినప్పటికీ, ఆయన శిష్యులు “సమస్త జనులకు” “భూదిగంతముల వరకు” కూడా పంపించబడ్డారు. (మత్తయి 15:24; అపొస్తలుల కార్యములు 1:8) క్రైస్తవ సాక్ష్యాన్ని మానవజాతి అంతా వినాలి.
16. మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘం ఏ ఆజ్ఞను పాటించింది, మరి అది ఎంతమేరకు?
16 దీన్ని తాను బాగా అర్థం చేసుకున్నాడని పౌలు చూపించాడు. సా.శ 61వ సంవత్సరంకల్లా, సువార్త “సర్వలోకములో ఫలించుచు, వ్యాపించుచున్న”దని ఆయన చెప్పగలిగాడు. “దేవదూతారాధన”లో ఉన్నట్లుగా, ఆ సువార్త కేవలం ఒక్క జనాంగానికి లేక ఒక్క జాతికి మాత్రమే పరిమితంగా ఉండలేదు. బదులుగా, అది “ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి” బహిరంగంగా ‘ప్రకటింపబడింది.’ (కొలొస్సయులు 1:6, 23; 2:13, 14, 16-18) ఆ విధంగా, మొదటి శతాబ్దంలోని దేవుని ఇశ్రాయేలు, ‘చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి [వారిని] పిలిచినవాని గుణాతిశయములను ప్రచురముచేయు’ము అన్న ఆజ్ఞను పాటించింది.
17. మత్తయి 24:14 విస్తృత రీతిలో ఎలా నెరుతుంది?
17 అయితే, మొదటి శతాబ్దంలో జరిగినవి అంత్యదినములలో సాధించబోయేవాటికి ముంగుర్తు మాత్రమే. ప్రత్యేకంగా మనకాలాన్ని గూర్చి ప్రవచిస్తూ యేసు ఇలా చెప్పాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:14; మార్కు 13:10) ఈ ప్రవచనం నెరవేరిందా? తప్పకుండా. పందొమ్మిదివందల పందొమ్మిదిలో చిన్నగా ప్రారంభమైన సువార్త ప్రకటన, నేడు 230 దేశాలకు మించిపోయింది. ఈ సాక్ష్యం, అతి శీతలమైన ఉత్తరంలోనూ మండే ఉష్ణమండలంలోనూ వినిపించబడుతోంది. పెద్ద ఖండాల్లో సాక్ష్యమివ్వబడింది మరియు సుదూర ప్రాంతాల్లోని నివాసులు సాక్ష్యాన్ని పొందేలా ఆ ద్వీపాలలో ప్రత్యేక ప్రయత్నాలు జరిగాయి. బోస్నియా, హెర్జిగోవినాల్లోని యుద్ధాల్లోలా గొప్ప అస్థిరత నడుమ కూడా, సువార్త ప్రకటించబడుతోంది. మొదటి శతాబ్దంలోలా, “సకల జనులకు” ఇవ్వబడుతున్న సాక్ష్యం ఫలాన్నిస్తోంది. సువార్త బహిరంగంగా “ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి” ప్రకటించబడుతోంది. దాని ఫలితం? మొదట, ‘ప్రతి వంశములో, ఆయా భాషలు మాటలాడువారిలో, ప్రతి ప్రజలో, ప్రతి జనములో’ నుండి దేవుని ఇశ్రాయేలులోని మిగిలినవారు సమకూర్చబడ్డారు. రెండవదిగా, లక్షలాదిమంది “గొప్ప సమూహము” వారు “ప్రతి జనములోనుండియు, ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలోనుండియు” తీసుకొనబడడం ప్రారంభమైంది. (ప్రకటన 5:6; 7:9) మత్తయి 24:14 విస్తృత పరిమాణంలో నెరవేరుతూనే ఉంటుంది.
18. ప్రపంచవ్యాప్త సువార్త ప్రకటన వల్ల సాధించబడిన కొన్ని విషయాలేమిటి?
18 ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటించడం, యేసు రాజరికపు ప్రత్యక్షత ప్రారంభమైందని నిరూపించేందుకు సహాయపడుతుంది. (మత్తయి 24:3) అంతేకాకుండ, “భూమి పైరు”ను కోసేందుకుగల ముఖ్యమైన విధానమదే, ఎందుకంటే అది మానవజాతికి గల నిజమైన నిరీక్షణైన యెహోవా రాజ్యంవైపుకు ప్రజలను నడిపిస్తుంది. (ప్రకటన 14:15, 16) సువార్తను ప్రకటించడంలో కేవలం యథార్థమైన క్రైస్తవులు మాత్రమే పాల్గొంటారు కనుక, ఈ ప్రాముఖ్యమైన పని అబద్ధ క్రైస్తవులనుండి యథార్థమైన వారిని వేరుపర్చేందుకు సహాయపడుతుంది. (మలాకీ 3:18) ఈ విధంగా, ప్రకటించేవారికి అలాగే దానికి ప్రతిస్పందించేవారికి అది విమోచనయనే ప్రతిఫలాన్ని తెస్తుంది. (1 తిమోతి 4:16) అన్నిటికంటే ప్రాముఖ్యంగా, సువార్తను ప్రకటించడం, అలా చేయమని ఆజ్ఞాపించిన వ్యక్తి, దానికి మద్దతునిచ్చే వ్యక్తి, మరియు దాని సఫలంచేసే వ్యక్తైన యెహోవా దేవునికి స్తుతిని ఘనతను తెస్తుంది.—2 కొరింథీయులు 4:7.
19. నూతన సేవా సంవత్సరంలోకి వారు అడుగుపెడుతుండగా క్రైస్తవులందరూ ఏ నిశ్చయాన్ని కల్గివుండాలని ప్రోత్సహించబడుతున్నారు?
19 “అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ” అని అపొస్తలుడైన పౌలు అనేందుకు కదిలించబడడంలో ఆశ్చర్యంలేదు. (1 కొరింథీయులు 9:16) నేడు క్రైస్తవులుకూడా అలాగే భావిస్తారు. ఈ అంధకారమయమైన లోకంలో సత్యపు వెలుగును వెదజల్లుతూ “దేవుని జతపనివారమై” ఉండడం గొప్ప ఆధిక్యత మరియు గొప్ప బాధ్యతే. (1 కొరింథీయులు 3:9; యెషయా 60:2, 3) పందొమ్మిదివందల పందొమ్మిదిలో చిన్నగా ప్రారంభమైన పని నేడు అద్భుతమైన నిష్పత్తికి చేరుకుంది. సుమారు 50 లక్షలమంది క్రైస్తవులు, ఇతరులకు రక్షణ సమాచారాన్ని అందించడంలో సంవత్సరానికి 10 కోట్ల కంటే అధిక గంటలను వ్యయంచేస్తూ దైవిక సర్వాధిపత్యానికి సాక్ష్యమిస్తున్నారు. యెహోవా నామాన్ని మహిమపర్చే ఈ పనిలో భాగం వహించడం ఎంత ఆనందదాయకంగా ఉంటుందో! మనం 1996 సేవాసంవత్సరంలోకి అడుగుపెడుతుండగా, మందగిల్లకుండా ఉండాలని మనం నిశ్చయించుకుందాం. బదులుగా, పౌలు తిమోతికి వ్రాసిన మాటలను మనం మునుపెన్నటికంటే ఇప్పుడు ఎక్కువగా లక్ష్యపెడదాం, ఆయన ఇలా వ్రాశాడు: ‘వాక్యమును ప్రకటించుము అత్యవసర భావంతో దానిని గైకొనుము.’ (2 తిమోతి 4:2) మనం అలా చేస్తుండగా, మన ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదిస్తాడని మనం మన పూర్ణహృదయంతో ప్రార్థిస్తాము.
మీకు జ్ఞాపకమున్నాయా?
◻ జనాంగాల ఎదుట యెహోవాకు “సాక్షిగా” ఇశ్రాయేలు స్థానాని ఎవరు వహించారు?
◻ క్రైస్తవ ప్రవర్తన సాక్ష్యమిచ్చేందుకు ఎలా దోహదపడుతుంది?
◻ క్రైస్తవ సాక్షికి బైబిలు పఠనం మరియు దానిపై ధ్యానం ఎందుకు ఆవశ్యకం?
◻ యెహోవాయే సత్య దేవుడనేందుకు యెహోవాసాక్షుల ఆధునిక దిన చరిత్ర రుజువుగా ఎలా పనిచేస్తుంది?
◻ సువార్త ప్రకటించబడడం వల్ల ఏమి సాధించబడింది?
[15వ పేజీలోని చిత్రాలు]
సువార్త “ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి” అపరిమితంగా ప్రకటించబడుతోంది