స్వాతంత్ర్యానికి నడిపే ఇరుకు మార్గం
విశ్వం ప్రకృతి సూత్రాలచే నడిపించబడుతుందనే విషయాన్ని విజ్ఞానవంతులైన ప్రజలెవరూ వ్యతిరేకించరు. సూక్ష్మమైన అణువుల నుండి వేల కోట్ల నక్షత్రాలుగల శక్తివంతమైన నక్షత్ర వీధుల వరకు ప్రతిదాన్ని ఈ సూత్రాలు అదుపుచేస్తాయి. అవి లేకపోతే, పద్ధతి ఉండదు, గ్రహింపు ఉండదు; జీవమే ఉనికిలో ఉండేది కాదు. ప్రకృతి సూత్రాలను గ్రహించి, వాటితో సహకరించడం ద్వారా, మానవుడు చంద్రునిపై నడవడం, భూమిపై ఏ ప్రాంతం నుండైనా లేక చివరికి భూ వాతావరణం వెలుపలి నుండి దూరదర్శిని తెరల ద్వారా మన గృహాల్లో రంగుల చిత్రాలను చూడడం వంటి విశేషమైన కార్యాలను సాధించగలిగాడు.
కాని నైతిక సూత్రాల మాటేమిటి? వాటిని అనుసరించడం అంత ప్రయోజనకరమైనది, ప్రతిఫలదాయకమైనదీనా? అనేకులు అసలు నైతిక సూత్రాలు లేనేలేవని భావించి, తమ స్వంత కోరికలకు సరిపడే స్వేచ్ఛానుసార వేదాంతాన్ని లేక మతాన్ని ఎన్నుకుంటారు.
అయితే, మరో మార్గాన్ని అంటే బైబిలునందు చెప్పబడినట్లుగా ‘జీవానికి నడిపే ఇరుకు మార్గాన్ని’ ఎన్నుకొనే వారు కొందరున్నారు. ఈ ఎంపిక కేవలం అల్పసంఖ్యాకులదేనంటే మనం ఆశ్చర్యపోకూడదు, ఎందుకంటే ఇరుకు మార్గం గురించి యేసు ఇలా చెప్పాడు: “దాని కనుగొనువారు కొందరే.” (మత్తయి 7:14) కేవలం కొందరే ఎందుకు?
ఎందుకంటే ఇరుకు మార్గం దేవుని సూత్రాలు మరియు కట్టడలచే నిర్బంధించబడి ఉంది. తన జీవితాన్ని దేవుని కట్టడల అనుసారంగా ఉంచుకోవాలని యథార్థంగా కోరుకొనే వ్యక్తినే అది ఆకర్షిస్తుంది. స్వాతంత్ర్యమున్నట్లు భ్రమ కలుగజేసి వాస్తవానికి బానిసలను చేసే విశాలమైన మార్గానికి పూర్తి భిన్నంగా, నిర్బంధాలు ఉన్నట్లు కనిపించే ఇరుకు మార్గం ఒక వ్యక్తిని ప్రతి ముఖ్యమైన విషయంలోను స్వతంత్రున్ని చేస్తుంది. దాని పరిధులు “స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమము”చే ఏర్పరచబడ్డాయి.—యాకోబు 1:25.
ఇరుకు మార్గం ఎలా స్వతంత్రులను చేస్తుంది
నిజమే, ఇరుకు మార్గంపైనే ఉండడం ఎల్లప్పుడు సులభమేమీ కాదు. జీవిస్తున్న ప్రతి మానవుడు అపరిపూర్ణుడే, తప్పు చేసే స్వాభావికమైన కోరికగలవాడే. కాబట్టి, ఒక వ్యక్తి కొంత తప్పిపోయే అవకాశం ఉంది. అయినప్పటికీ, ‘ఇరుకు మార్గాన్ని’ అంటిపెట్టుకొని ఉండడానికి అవసరమయ్యే ఎలాంటి స్వయం శిక్షణ లేక మార్పులైనా ప్రయోజనకరమైనవే, ఎందుకంటే దేవుడు ‘మనకు ప్రయోజనం కలుగునట్లు ఉపదేశం’ చేస్తాడు.—యెషయా 48:17; రోమీయులు 3:23.
ఉదాహరించేందుకు: జ్ఞానవంతులైన తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు ‘ఇరుకు మార్గం’ వంటి భోజన పట్టికను వేస్తారు. అంటే భోజన సమయాల్లో ఖండితంగా ఉండడమని కొన్నిసార్లు దీని భావం. కాని, పిల్లలు పెద్దవాళ్లయ్యాక, వాళ్లు తల్లిదండ్రుల ప్రేమపూర్వక శిక్షణను గుణగ్రహిస్తారు. పెద్దవారిగా, వారు ఆరోగ్యకరమైన ఆహారం కొరకు అపేక్షను పెంపొందింపజేసుకుని ఉంటారు. ఎన్నో రకాల పోషకాహారాలున్నాయి గనుక వాళ్లు నిర్బంధింపబడినట్లు ఎన్నడూ భావించరు.
ఆత్మీయ భావంలో, జీవానికి నడిపే ఇరుకు మార్గంపై నడిచేవారికి దేవుడు అదే చేశాడు. ఆయన దీనుల్లో, సంతోషానికి నిజమైన స్వాతంత్ర్యానికి నడిపే మంచి కోరికలు పెంపొందేలా చేశాడు. తన వాక్యమైన బైబిలును అందజేయడం ద్వారా ఆయన దీన్ని చేస్తాడు. అంతేగాక, మనకు సహాయం చేయమని మనం ఆయన ఆత్మ కొరకు ప్రార్థించాలని కూడా ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు, మనం ఇరుకు మార్గంపై కొనసాగేందుకు మనల్ని ప్రోత్సహించగల మన తోటి క్రైస్తవులతో సహవసించమని ఆయన మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. (హెబ్రీయులు 10:24, 25) అవును, దేవుడు ప్రేమాస్వరూపి, ఆయన ఉద్దేశాలు మరియు ఆయన విధానాలన్నిటి వెనుక ఈ అత్యున్నతమైన లక్షణం ఉంటుంది.—1 యోహాను 4:8.
ప్రేమ, సమాధానం, మంచితనం, ఆశానిగ్రహం మరియు దేవుని ఆత్మ యొక్క ఇతర ఫలాలు ప్రబలమైనప్పుడు, ఇరుకు మార్గం నిర్బంధింపబడినట్లుగా అనిపించదు. లేఖనం చెబుతున్నట్లుగా, “ఇట్టివాటికి విరోధమైన నియమమేదియు లేదు.” (గలతీయులు 5:22, 23) “ప్రభువుయొక్క [“యెహోవా,” NW] ఆత్మ యెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.” (2 కొరింథీయులు 3:17) ఇప్పుడు కూడా, నిజ క్రైస్తవులు ఈ స్వాతంత్ర్యపు రుచిని చవిచూస్తున్నారు. నేడు ప్రజలను బాధిస్తున్నటువంటి భవిష్యత్తును గూర్చిన భయం, మరణాన్ని గూర్చిన మూఢమైన భయం వంటి అనేక భయాల నుండి వారు స్వతంత్రులు. “సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి” యుండే భవిష్యత్తు గురించి తలంచడం ఎంత ఉత్తేజకరంగా ఉంటుందోకదా! (యెషయా 11:9) అప్పుడు నేరాన్ని గూర్చిన భయం కూడా ఇక ఉండదు. తాళాలు, కమ్మీలు మరెన్నడూ ఉండకుండా పోతాయి. అందరూ రాత్రి పగలు, ఇంట్లో బయట స్వాతంత్ర్యాన్ని, భద్రతను అనుభవిస్తారు. అది నిజమైన స్వాతంత్ర్యమై ఉంటుంది!
దేవుని సహాయం మనకు నిశ్చయపర్చబడింది
నిజమే, దేవుని కట్టడలకు అనుగుణంగా జీవించడానికి ప్రయత్నం అవసరం, అయినా అపరిపూర్ణ మానవులకు కూడా “ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.” (1 యోహాను 5:3) మనం ఇరుకు మార్గానికి తగినట్లుగా మారి, దానిపై నడవడంలోని ప్రయోజనాలను అనుభవిస్తుండగా, విశాలమైన మార్గంపై నడిచేవారిని సూచించే క్రియలు మరియు ఆలోచనా విధానం ఎడల అత్యధిక అయిష్టతను మనం పెంపొందింపజేసుకుంటాము. (కీర్తన 97:10) దేవుని ధర్మశాస్త్రానికి విధేయులమవ్వడం దేవుడిచ్చిన మన మనస్సాక్షిని ఆకర్షిస్తుంది. అనేకుల లక్షణాలైన “చింతా” మరియు “మనోదుఃఖము” వంటివాటికి బదులుగా, “నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరు” అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అవును, యెహోవా నుండి శిక్షణ పొందిన హృదయం సంతోషంగా, స్వతంత్రంగా ఉంటుంది.—యెషయా 65:14.
మనకు నిజమైన స్వాతంత్ర్యం సాధ్యమయ్యేలా చేసేందుకు యేసు మరణించాడు. బైబిలు ఇలా చెబుతుంది: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3:16) ఇప్పుడు, దేవుని పరలోక రాజ్యానికి రాజుగా, యేసు ఆ బలి ప్రయోజనాలను అమలుపరుస్తున్నాడు. “మహా శ్రమ” తర్వాత కొంతకాలానికి, విశాలమైన మార్గం మరియు దానిపైనున్నవారు నాశనం చేయబడిన తర్వాత, విధేయులైన మానవజాతి మిగిలివున్న ఇరుకు మార్గంపై కొనసాగేందుకు ఆయన ఓర్పుగా నడిపింపునివ్వడం ప్రారంభించి, దాని అంతం వరకు అంటే మానవ పరిపూర్ణత వరకు వారిని నడిపిస్తాడు. (ప్రకటన 7:14-17; మత్తయి 24:21, 29-31) చివరికి మనం “సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందు”ననే గొప్ప వాగ్దానం యొక్క నిజత్వాన్ని అనుభవిస్తాము. దేవుడిచ్చే ఈ స్వాతంత్ర్యం ఉత్కృష్టమైనది. చివరికి మరణం కూడా నిర్మూలించబడుతుంది.—రోమీయులు 8:21; ప్రకటన 21:3, 4.
ఇరుకు మార్గం ఎక్కడికి నడిపిస్తుందో చూసి, స్పష్టంగా అర్థం చేసుకోవడం ద్వారా ఒక వ్యక్తి ఈ మార్గాన్ని ఎన్నుకొని దానిపై నడువగలుగుతాడు. ప్రాముఖ్యంగా యౌవనస్థులు దూరదృష్టిలేనివారిగా ఉండకుండా, దేవుని కట్టడలు నిర్బంధాలు పెట్టేవిగా ఉన్నాయని భావించి చికాకు పడకుండా ఉండేందుకు సహాయం పొందుతారు. ఇవి దేవుని ప్రేమకు నిదర్శనాలని, విశాలమైన మార్గపు చెడుల నుండి రక్షణ ఇచ్చే వంటివని వాళ్లు తెలుసుకుంటారు. (హెబ్రీయులు 12:5, 6) అయితే, ఫలాలనిచ్చే ఒక వృక్షం మంచి ఫలాలనివ్వడానికి ఎలాగైతే సమయం పడుతుందో అలాగే దైవిక లక్షణాలను, కోరికలను పెంపొందింపజేసుకోవడానికి సమయం పడుతుందని ఒకరు గుర్తుంచుకొంటూ సహనం కలిగివుండాలి. కాని వృక్షాన్ని సాగుచేసి, నీరుపోస్తేనే అది ఫలాలనిస్తుంది.
గనుక, దేవుని వాక్యాన్ని పఠించండి, ఇతర క్రైస్తవులతో సహవసించండి, పరిశుద్ధాత్మ కొరకు ‘ఎడతెగక ప్రార్థన చేయండి.’ (1 థెస్సలొనీకయులు 5:15) ‘మీ త్రోవలను సరాళము చేసుకొనుటకు’ సహాయం చేసేందుకు దేవునియందు నమ్మకముంచండి. (సామెతలు 3:5, 6) కాని ఇదంతా ఆచరణయోగ్యమైనదేనా? అది విజయవంతమౌతుందా? అవును, గత శీర్షికలో ప్రస్తావించబడిన టామ్ మరియు మేరీల విషయంలో అది విజయవంతమైంది.
వాళ్లు విశాలమైన మార్గాన నడవడం ఆపేశారు
టామ్ ఇలా వ్రాస్తున్నాడు: “70వ పడి మధ్య భాగంలో, యెహోవాసాక్షుల్లో ఒకరు మా ఇంటికి వచ్చినప్పుడు మేము వారిని కలిశాము. చర్చ బైబిలు పఠనానికి దారితీసింది. క్రమంగా నేను నా జీవితాన్ని శుభ్రపర్చుకోవడం ప్రారంభించాను. నేను 1982లో బాప్తిస్మం తీసుకున్నాను, ఇప్పుడు నేను స్థానిక సంఘంలో సేవచేస్తున్నాను. మా కుమారుడు కూడా ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్నాడు. నేను సత్యం తెలుసుకోక ముందు ఆ సంవత్సరాలన్నిటిలో నా భార్య నన్ను సహించినందుకు నేను ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా, నేను యెహోవాకు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకు వారు మాకిచ్చినదానినంతటిని బట్టి మరియు భవిష్యత్తు కొరకు మనకిప్పుడున్న నిరీక్షణను బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.”
మరి మేరి సంగతేమిటి? దేవుడు తనను ఎన్నడూ క్షమించడని ఆమె భావించింది, కాని ఆమె తన పిల్లల కొరకు ఆయన గురించి తెలుసుకోవాలని కోరుకుంది. యెహోవాసాక్షులు తమ పొరుగువారికి బైబిలు బోధిస్తున్నారని ఆమె విన్నప్పుడు, తనకు కూడా సహాయం కావాలని ఆమె కోరింది. అయితే, ఆమెలో పాతుకుపోయిన చెడు అలవాట్లు ఆమె అభివృద్ధిని కష్టతరం చేశాయి. పఠనం హెచ్చు తగ్గులుగా సాగింది. అయితే ఆమె ఏడేళ్ల చిన్న కుమార్తె ఆమెను ప్రోత్సహించేది. “విడిచిపెట్టకు మమ్మీ. నీవు సాధించగలవు!” అని చెప్పేది. అప్పుడు మేరి కష్టపడి ప్రయత్నించేది.
ఎవరితో ఆమె ఉంటుందో ఆయన కూడా మాదకద్రవ్యాల దుర్వినియోగదారుడే, ఇంటికి తిరిగివచ్చిన తర్వాత ఆయన కూడా పఠనంలో భాగంవహించాడు. చివరికి ఇద్దరూ తమ చెడు అలవాట్లను అధిగమించారు. ఆ తర్వాత, తమ వివాహాన్ని చట్టబద్ధం చేసుకుని బాప్తిస్మం కొరకు సమర్పించుకున్న తర్వాత వాళ్లు గొప్ప సంతోషాన్ని పొంది, మొదటిసారిగా నిజమైన కుటుంబంలా భావించారు. దుఃఖకరంగా, ఎయిడ్స్ మేరి జీవితాన్ని బలి తీసుకుంది, కాని బైబిలు వాగ్దానమైన పునరుత్థానంపై మరియు విశాలమైన మార్గపు అపాయకరమైన ప్రతి ఛాయ నుండి శుభ్రపరచబడిన పరదైసు భూమ్మీద జీవితంపై ఆమె తన హృదయాన్ని నిలిపి మరణించింది.
అవును, నాశనానికి నడిపే విశాలమైన, వెడల్పయిన మార్గం నుండి ప్రక్కకు రావడం సాధ్యమే. యేసుక్రీస్తు ఇలా చెప్పాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని పొందడమే నిత్యజీవము.” (యోహాను 17:3, NW) కాబట్టి, జీవానికి నడిపే ఇరుకు మార్గంపై మీ కాలు మోపడానికి ఎందుకు నిశ్చయించుకోకూడదు? దేవుని వాక్యం నుండి మీరు నేర్చుకొనేదాన్ని హృదయంలోకి తీసుకొని, అన్వయించుకోవడం ద్వారా, “మీరు . . . సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయున”నే, హృదయాన్ని ఉత్తేజపర్చే బైబిలు వాగ్దానాన్ని మీరు వ్యక్తిగతంగా అనుభవించగలుగుతారు.—యోహాను 8:31, 32.