ప్రపంచవ్యాప్తంగా ఉన్న ద్వేషానికి ఒక ముగింపు
సుమారు రెండు వేల సంవత్సరాలకు పూర్వం, ఒక అల్పసంఖ్యాక వర్గం ద్వేషానికి గురైంది. తొలి క్రైస్తవుల ఎడల రోమీయులలో ప్రబలంగానున్న దృక్పథాన్ని గూర్చి టెర్టూలియన్ ఇలా వివరించాడు: “వర్షం కురియకపోయినా, భూకంపం సంభవించినా, కరువు లేక అనావృష్టి వచ్చినా, వెంటనే ఇలా కేకలు వేస్తారు: ‘క్రైస్తవులను సింహానికి వేయండి!’”
ద్వేషానికి లక్ష్యాలుగా ఉన్నప్పటికే, తొలి క్రైస్తవులు ఆ అన్యాయానికి ప్రతీకారం తీసుకునే శోధనను వ్యతిరేకించారు. ప్రసిద్ధమైన కొండమీది ప్రసంగంలో యేసుక్రీస్తు ఇలా చెప్పాడు: “నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; నేను మీతో చెప్పునదేమనగా, . . . మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.”—మత్తయి 5:44.
‘శత్రువును ద్వేషించడం’ సరైన విషయమనే నమ్మకం యూదుల మౌఖికాచారంలో ఉండేది. అయితే, మన స్నేహితుని మాత్రమే కాకుండా శత్రువుని సహితం మనం ప్రేమించాలని యేసు చెప్పాడు. ఇది కష్టమే కానీ అసాధ్యంకాదు. ఒక శత్రువును ప్రేమించడమంటే అతని విధానాలన్నిటినీ లేక అతని పనులన్నింటినీ ఇష్టపడమని కాదు. మత్తయి వృత్తాంతంలో కనిపించే గ్రీకు పదం అగాపే అనే పదం నుండి వచ్చింది, సూత్రానుసారంగా ప్రవర్తించే ప్రేమను అది వర్ణిస్తోంది. అగాపేను అంటే సూత్రానుసారమైన ప్రేమను కనపర్చే వ్యక్తి, తనను ద్వేషించి తనతో చెడుగా వ్యవహరించే ఓ శత్రువుకు కూడా మంచినే చేస్తాడు. ఎందుకు? ఎందుకంటే అది క్రీస్తును అనుసరించే మార్గం మరియు ద్వేషాన్ని జయించే మార్గము. ఒక గ్రీకు విద్వాంసుడు ఇలా గమనించాడు: “కోపగించుకోవాలన్న, కాఠిన్యంగావుండాలనే మన సహజ ప్రవృత్తిని జయించేలా [అగాపే] మనకు సహాయపడుతుంది.” అయితే ద్వేషంతో నిండిన ఈనాటి లోకంలో ఇది సాధ్యమౌతుందా?
క్రైస్తవులని చెప్పుకునే వారందరూ క్రీస్తు మాదిరిని అనుసరించాలన్న నిశ్చయాన్ని కల్గివున్నవారుకారు అన్నదాన్ని అంగీకరించాలి. ఇటీవల రువాండానందు జరిగిన క్రూరకృత్యాలను, తాము క్రైస్తవులమని చెప్పుకునే జాతుల సభ్యులే జరిగించారు. రువాండానందు 20 సంవత్సరాల పాటు పనిచేసిన రోమన్ కాథోలిక్ నన్ అయిన పీలర్ డీయిస్ ఎస్పిలోసిన్ దీన్ని ప్రదర్శించే ఒక సంఘటనను జ్ఞాపకం చేసుకుంది. తాను ఉపయోగించిన ఒక బల్లెమును చేతబుచ్చుకున్న ఓ వ్యక్తి ఆమె చర్చిని చేరుకున్నాడు. ఆ నన్ ఆయనను ఇలా అడిగింది: “అందరినీ చంపుకుంటూ తిరుగుతూ ఏమి సాధించాలని? నువ్వు క్రీస్తును గూర్చి ఆలోచించవా?” తాను ఆలోచిస్తానని చెప్పి, చర్చిలో ప్రవేశించి, మోకాళ్లూని రోజరీని శ్రద్ధగా వల్లించాడు. అయితే అతను వల్లించడం పూర్తి చేసిన తర్వాత, మరలా హత్యలు చేయడాన్ని కొనసాగించేందుకు వెళ్లిపోయాడు. “మేము సువార్తను సరిగ్గా బోధించడంలేదని అది చూపుతోంది,” అని ఆ నన్ అంగీకరించింది. అయితే, అలాంటి పొరపాట్లనుబట్టి యేసు సమాచారంలోనే లోపముందని అనలేము. నిజమైన క్రైస్తవత్వాన్ని అనుసరించేవారు ద్వేషాన్ని జయించగలరు.
నిర్బంధ శిబిరంలో ద్వేషాన్ని జయించడం
మారణహోమాన్ని తప్పించుకున్న ఓ సహజ యూదుడు మాక్స్ లైబస్టర్. ఆయన ఇంటి పేరు భావం “ప్రియమైనవాడు” అని అయినప్పటికీ, ఆయన అసాధారణమైన ద్వేషాన్ని చవిచూచాడు. నాజీ జర్మనీలో ప్రేమ ద్వేషాలను గూర్చి తాను నేర్చుకున్నదాన్ని ఆయన వర్ణిస్తున్నాడు.
“జర్మనీనందున మెనిహెమ్లో 1930వ పడిలో నేను పెరిగాను. యూదులందరూ జర్మనీ ప్రజలను కొల్లగొట్టే ధనవంతులైన అక్రమ సంపాదనాపరులని హిట్లర్ చెప్పాడు. అయితే నిజమేమిటంటే మా నాన్న చెప్పులు కుట్టే పేదవాడు. అయినప్పటికీ, నాజీ ప్రచారపు ప్రభావంవల్ల, మా పొరుగువారు మాయెడల ప్రతికూల దృక్పథాన్ని చూపించనారంభించారు. నేను యౌవనునిగా ఉన్నప్పుడు, ఆ గ్రామంలోని ఒక వ్యక్తి నా నొసటిపై పంది రక్తంతో బలవంతంగా రుద్దాడు. ఈ ఘోరమైన అవమానము, జరగబోయే విషయాలను గూర్చిన ముంగుర్తే. పందొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో గెట్టపో నన్ను అరెస్టు చేసి, నా వస్తువులనన్నింటినీ జప్తుచేశాడు.
“జనవరి 1940 నుండి మే 1945 వరకు, నేను అయిదు వేరు వేరు నిర్బంధ శిబిరాల్లో బ్రతికి బయటపడడానికి నేనెంతో కష్టపడ్డాను, అవి: జాక్సన్హవుజన్, నాయిన్గామె ఆవుచ్విట్స్, బ్యున, బ్యుచిన్వాల్డ్. జాక్సన్హవుజన్కు పంపించబడిన మా నాన్న కూడా 1940లో తీవ్రమైన చలికాలంలో చనిపోయాడు. కాల్చేందుకు సిద్ధంగా ఉన్న శవాల కుప్పవున్న శ్మశానవాటికకు నేనే స్వయంగా ఆయన శవాన్ని, మోసుకువెళ్లాను. మొత్తానికి, మా కుటుంబ సభ్యులలో ఎనిమిదిమంది శిబిరాల్లో మరణించారు.
“ఖైదీలలో, ఎస్.ఎస్. గార్డలకంటే కూడా కాపోస్లు ఎక్కువగా ద్వేషించబడ్డారు. ఎస్.ఎస్.లతో సహకరించే ఖైదీలే కాపోస్లు, కనుక వారికి కొంత స్వేచ్ఛ ఉండేది. వారు ఆహార సరఫరాను చూసుకునేందుకు నియమించబడ్డారు, అంతేకాకుండ వారు ఇతర ఖైదీలను క్రూరంగా కొట్టడాన్ని కూడా పర్యవేక్షించేవారు. వారు తరచూ అనుచితంగానూ మరియు నిర్హేతుకంగానూ ప్రవర్తించేవారు. అటు ఎస్.ఎస్.లనూ ఇటు కాపోస్లను ద్వేషించేందుకు నాకు అనేక కారణాలున్నాయని నా ఉద్దేశం కానీ, నేను ఖైదీగా ఉన్న సమయంలో, ద్వేషంకంటే ప్రేమే ఎక్కువ బలమైనదని నేను నేర్చుకున్నాను.
“యెహోవాసాక్షులైన ఖైదీల స్థయిర్యం, వారి విశ్వాసం లేఖనాలపై ఆధారపడినదనే నమ్మకాన్ని నాకు కలిగించింది—మరి నేనే ఒక సాక్షినైయ్యాను. న్యుయన్గామె నిర్బంధ శిబిరంలో నేను కలిసిన ఎర్న్స్ట్ వావుర్ అనే ఓ సాక్షి, క్రీస్తు మనో దృక్పథాన్ని అలవర్చుకోమని నాకు ఉద్బోధించాడు. ‘ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్నుతాను లోబర్చుకొనెను’ అని బైబిలు చెబుతోంది. (1 పేతురు 2:23) నేనూ అదే చేసేందుకు ప్రయత్నించాను, అంటే అందరికీ న్యాయాధిపతియైన దేవుని చేతికే ప్రతీకారాన్ని విడిచిపెట్టేందుకు ప్రయత్నించాను.
“ప్రజలు తెలియక దుష్టకార్యాలను చేస్తుంటారని శిబిరంలో గడిపిన సంవత్సరాలు నాకు నేర్పాయి. ఎస్.ఎస్. గార్డులందరూ చెడ్డవారు కారు—వారిలో ఒక వ్యక్తి నా జీవితాన్ని కాపాడాడు. ఒకసారి నాకు తీవ్రంగా అతిసార వ్యాధి సోకింది, దానివల్ల క్యాంపులో నా పని స్థలం నుండి నేను నడవలేనంత బలహీనుడిణైపోయాను. దాని మరుసటి రోజున అచ్విట్జ్ గ్యాస్ చాంబర్లోకి నన్ను పంపించి ఉండేవారే, కానీ నేను జర్మనీలో ఏ ప్రాంతంనుండైతే వచ్చానో ఆ ప్రాంతంనుండే వచ్చిన ఒక ఎస్.ఎస్. గార్డ్, నాకొరకు జోక్యం కలుగజేసుకున్నాడు. నేను ఎస్.ఎస్. కాఫ్టీరియానందు పనిచేసేట్లు అతను ఏర్పాటుచేశాడు, అక్కడ నేను కోలుకునేంతవరకూ కాస్త విశ్రమించగలిగాను. ఒకరోజు ఆయన నాతో ఇలా చెప్పాడు: “మాక్స్, నేను చాలా వేగంగా, అదుపుతప్పి ప్రయాణించే రైలులో ప్రయాణిస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది. దూకానా, చచ్చిపోతాను. లేదు, దానిలోనే ఉన్నా నాశనమైపోతాను!”
“నాకు ఎంత ప్రేమ అవసరమో వాళ్లకీ అంత ప్రేమ అవసరం. వాస్తవానికి, దేవునియందలి నా విశ్వాసంతోసహా ప్రేమా వాత్సల్యాలే, దారుణమైన పరిస్థితులనూ మరియు చంపుతామనే అనుదిన బెదిరింపులనూ నేను తాళుకునేందుకు నాకు సహాయపడ్డాయి. నాకు ఏ గాయంకలుగకుండా నేను బయటపడ్డానని నేను చెప్పలేను కానీ, నా భావోద్రేక మచ్చలు మాత్రం తక్కువే.”
మాక్స్, 50 సంవత్సరాల తర్వాత కూడా కనపర్చే అనురాగమూ దయ ఆయన చెప్పిన మాటలు సత్యమని రుజువు చేస్తున్నాయి. మాక్స్ అనుభవం ప్రత్యేకమైంది కాదు. ద్వేషాన్ని అధిగమించడానికి ఆయనకు గట్టి కారణముంది—ఆయన క్రీస్తును అనుసరించాలనుకున్నాడు. లేఖనాలు తమ జీవితాలను నడిపించేందుకు అంగీకరించిన ఇతరులు అదే విధంగా ప్రవర్తించారు. ఫ్రాన్స్ నుండి వచ్చిన యెహోవాసాక్షియైన సీమోన్, నిస్వార్థ ప్రేమంటే ఏమిటో ఆమె ఎలా నేర్చుకుందో వివరిస్తోంది.
“రెండవ ప్రపంచ యుద్ధానికి కొంచెం ముందుగా సాక్షియైన మా అమ్మగారైన ఎమా, ప్రజలు తరచూ తెలియక చెడుపనులను చేస్తుంటారని నేర్పింది. మనం వారిని తిరిగి ద్వేషించినట్లైతే, మనం నిజమైన క్రైస్తవులము కాము, ఎందుకంటే మనం మన శత్రువులను సహితం ప్రేమించి, మనలను హింసిస్తున్నవారి కొరకు ప్రార్థించాలని యేసు చెప్పాడు.—మత్తయి 5:44.
“ఈ విశ్వాసాన్ని పరీక్షించిన మహా కష్టతరమైన ఒక పరిస్థితి నాకు జ్ఞాపకముంది. నాజీలు ఫ్రాన్స్‌ను ఆక్రమించుకున్నప్పుడు, మా బిల్డింగ్‌లోనే ఉన్న ఒక పొరుగువారివల్ల మా అమ్మ ఎంతో బాధననుభవించింది. మా అమ్మను గూర్చి ఆమె గెస్టాపోలకు రిపోర్టు చేసింది. దాని ఫలితంగా మా అమ్మ జర్మన్ నిర్బంధ శిబిరాల్లో రెండు సంవత్సరాలు గడిపింది, అక్కడ ఆమె చనిపోయివుండేదే. యుద్ధం తర్వాత, ఈ స్త్రీ జర్మన్ సహకారియనే నేరాన్ని ఆరోపించే ఒక పత్రంపై సంతకం చేయమని ఫ్రెంచ్ పోలీసులు కోరారు. అయితే ‘మంచికైనా చెడుకైనా తీర్పుతీర్చేది ప్రతిఫలమిచ్చేది దేవుడే’ అని చెబుతూ మా అమ్మ అందుకు నిరాకరించింది. కొన్ని సంవత్సరాల తర్వాత, ఆ పొరుగింటావిడే మరణకరమైన క్యాన్సర్‌తో వ్యాధిగ్రస్థురాలైంది. ఆమె అనుభవించే దురదృష్టానికి సంతోషించక ఆమె జీవితంలోని ఆ చివరి ఘడియల్లో వీలున్నంతమట్టుకు ఆమె సుఖంగా ఉండేటట్లు మా అమ్మ ఎంతో కృషి చేసింది. ద్వేషంపై ప్రేమ సాధించిన ఈ విజయాన్ని నేను ఎన్నడూ మర్చిపోలేను.”
అన్యాయాన్ని ఎదుర్కొంటున్నప్పుడు సూత్రానుసారమైన ప్రేమ యొక్క శక్తిని ఈ రెండు ఉదాహరణలు చూపిస్తున్నాయి. అయితే, “ప్రేమించుటకు ద్వేషించుటకు,” సమయముందని బైబిలే చెబుతోంది. (ప్రసంగి 3:1, 8) అది ఎలా సాధ్యం?
ద్వేషించే సమయం
అన్ని విధాలైన ద్వేషాన్ని దేవుడు ఖండించడు. యేసుక్రీస్తును గూర్చి బైబిలు ఇలా చెబుతోంది: “నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి.” (హెబ్రీయులు 1:9) అయితే, తప్పును ద్వేషించడంలోనూ, తప్పు చేసిన వ్యక్తిని ద్వేషించడంలోనూ తేడా ఉంది.
ప్రేమ మరియు ద్వేషం మధ్య యేసు సరైన సమతుల్యాన్ని ఉంచడంలో మంచి మాదిరినుంచాడు. ఆయన వేషధారణను ద్వేషించాడు, అయితే వేషధారులు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకునేలా సహాయపడేందుకు ప్రయత్నించాడు. (మత్తయి 23:27, 28; లూకా 7:36-50) ఆయన దౌర్జన్యాన్ని ఖండించాడు, కాని తనను చంపుతున్నవారి కొరకు ప్రార్థించాడు. (మత్తయి 26:52; లూకా 23:34) ఈ లోకం ఆయనను అకారణంగా ద్వేషించినప్పటికీ, ఆయన లోకంకొరకు జీవాన్నిచ్చేందుకు తన జీవితాన్నే ఇచ్చాడు. (యోహాను 6:33, 51; 15:18, 25) ఆయన సూత్రానుసారమైన ప్రేమకు, దైవిక ద్వేషానికి గల పరిపూర్ణ మాదిరిని మన కొరకు ఉంచాడు.
అన్యాయం ఎలాగైతే యేసులో నైతిక కోపాన్ని రేపిందో అలాగే మనలో కూడా కోపాన్ని రేపవచ్చు. (లూకా 19:45, 46) అయితే ప్రతీకారం తీర్చుకునే హక్కు క్రైస్తవులకు లేదు. “కీడుకు ప్రతి కీడెవనికినీ చేయవద్దు” అని పౌలు రోమానందలి క్రైస్తవులకు సలహానిచ్చాడు. “శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. మీరే పగతీర్చుకొనక, . . . కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.” (రోమీయులు 12:17-21) మనం ద్వేషాన్ని కల్గివుండేందుకు వ్యక్తిగతంగా తిరస్కరించినా లేక చెడుకు ప్రతీకారం చేసేందుకు తిరస్కరించినా ప్రేమ జయిస్తుంది.
ద్వేషంలేని లోకం
ప్రపంచవ్యాప్తంగా ద్వేషమనేది, కనిపించకుండా పోవాలంటే, లక్షలాది మంది ప్రజలలో దృఢంగా నాటుకు పోయిన దృక్పథాలు మారాల్సివుంటుంది. దీన్ని ఎలా సాధించవచ్చు? ప్రొఫెసర్ ఎర్విన్ స్టాబ్ ఈ క్రింది సిఫారసునిస్తున్నాడు: “మనం ఎవరికైతే హాని కలిగిస్తామో వారిని ఎక్కువగా లెక్కలోకి తీసుకోము, మనం ఎవరికైతే సహాయం చేస్తామో వారిని లెక్కలోకి తీసుకుంటాము. మనం సహాయం చేసే ప్రజలను మనం మరింతెక్కువగా అంచనా వేసినప్పుడు మరియు సహాయం చేయడంలోని సంతృప్తిని అనుభవించిన తర్వాత, మనం ఎంతో శ్రద్ధగలవారిగానూ సహాయం చేసేవారిగానూ ఉన్నట్లుగా మనం కనుగొంటాము. ఇతరుల అవసరతను తీర్చడంలో ఎక్కువగా పాల్గొనే అవకాశమున్న సమాజాలను సృజించడం మన గురుల్లో ఒకటై ఉండాలి.”—ది రూట్స్ ఆఫ్ ఈవిల్.
మరో మాటలో, ద్వేషాన్ని నిర్మూలించేందుకు, ఒకరికొకరు సహాయం చేసుకోవడం ద్వారా ప్రేమించుకోవడం నేర్చుకున్న ప్రజలుండే సమాజాలను సృష్టించడమే, అంటే దురభిమానం, జాతీయవాదం, వర్గవాదం, తెగాంతరత వల్ల కలిగిన పగను మరచిపోయే ప్రజలుండే సమాజాన్ని సృష్టించడం అవసరం. అలాంటి సమాజం ఉందా? చైనానందు సాంస్కృతిక ఉద్యమ సమయంలో ద్వేషాన్ని వ్యక్తిగతంగా ఎదుర్కొన్న ఒక వ్యక్తి అనుభవాన్ని పరిశీలించండి.
“సాంస్కృతిక ఉద్యమం ప్రారంభమైనప్పుడు “వర్గపోరాటం”తో రాజీపడేపనే లేదని మేము నేర్చుకున్నాము. ద్వేషం అన్నది ప్రబలమైన ప్రవృత్తి. నేను రెడ్ గార్డ్ అయ్యి, ‘వ్యతిరేక వర్గ శత్రువుల’కొరకు అంతటా వెతకడం ప్రారంభించాను—చివరికి నా స్వంత కుటుంబంలో కూడా. ఆ సమయంలో నేను యౌవనునినైనప్పటికీ, నేను ఇళ్లను తనిఖీచేయడంలో భాగం వహించాను, ‘ప్రగతినిరోధక అవకాశపు’ రుజువు కొరకు మేము వెతికేవాళ్లము. ‘మా ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తిని’ నిందించిన ఒక బహిరంగ కూటానికి కూడా నేను నాయకత్వం వహించాను. ఈ నిందలు రాజకీయ విషయాల మీద కాదుగానీ వ్యక్తిగత వైరం మీద కొన్నిసార్లు ఎక్కువగా ఆధారపడేవి.
“మరీ మరీ క్రూరమయ్యే శారీరక శిక్షను అనేకమంది ప్రజలు—పెద్దలూ పిన్నలూ స్త్రీలూ పురుషులపై విధించడం జరిగినట్లు నేను చూశాను. నా స్కూల్ టీచర్లలో ఒకరిని—ఓ మంచి మనిషిని, ఒక నేరస్థునిలా వీధుల్లో ఊరేగించారు. రెండు నెలల తర్వాత, మా పాఠశాలలోని మరో గౌరవనీయుడైన ఉపాధ్యాయుడు సూచౌ నదిలో చచ్చిపడివుండడం కనుగొన్నారు మరి మా ఆంగ్ల టీచరు తన్ను తాను ఉరితీసుకునేలా చేశారు. నేను ఆశ్చర్యపోయాను నాకేమీ అర్థంకాలేదు. వీరు దయగల ప్రజలు. వీరితో ఇలా వ్యవహరించడం తప్పు! కనుక రెడ్ గార్డులతో నా సంబంధాలన్నింటినీ నేను తెంచేసుకున్నాను.
“చైనాను కొద్ది కాలంపాటు చుట్టుముట్టిన ద్వేషపూరితమైన ఈ కాలం కేవలం ఒకే ఒక్క సంఘటన కాదని నేననుకుంటున్నాను. ఈ శతాబ్దంలో ద్వేషం వల్ల రేగిన అనేక కలహాలు సంభవించాయి. అయితే, ప్రేమ ద్వేషాన్ని జయించగలదని నేను నమ్ముతున్నాను. దీన్ని నేను స్వయంగా చవిచూశాను. నేను యెహోవాసాక్షులతో సహవసించడం ప్రారంభించినప్పుడు, వివిధ జాతులు పుట్టుపూర్వోత్తరాలనుండి వచ్చిన ప్రజల ఎడల వారు కనపర్చే యథార్థమైన ప్రేమను చూసి నేను ముగ్ధుడనయ్యాను. ప్రజలందరూ ఒకరినొకరు ప్రేమించుకోవడం నేర్చుకుంటారు అని బైబిలు వాగ్దానం చేసిన కాలం వస్తుందని నేను ఎదురుచూస్తున్నాను.”
అవును, ద్వేషం నిషేధించబడగలదనేందుకు యెహోవాసాక్షుల అంతర్జాతీయ సంస్థ సజీవ సాక్ష్యం. వారి పుట్టుపూర్వోత్తరాలేమైనప్పటికీ, దురభిమానం స్థానంలో పరస్పర గౌరవాన్నుంచేందుకు మరియు జాతీయత, తెగవాదం లేక జాతీయవాదం గురుతులేవీ లేకుండా చేసేందుకు సాక్షులు పాటుపడుతున్నారు. వారు జయించేందుకుగల ఆధారాల్లో ఒకటి, సూత్రానుసారమైన ప్రేమను కనపర్చడంలో యేసుక్రీస్తును అనుసరించాలనే వారి దృఢసంకల్పం. మరో ఆధారమేమిటంటే, వారు అనుభవించే ఏ అన్యాయానికైనా దేవుని రాజ్యమే అంతాన్ని తీసుకువస్తుందనే వారి నిరీక్షణ.
ద్వేషం లేని లోకాన్ని అంటే ద్వేషించేందుకు కనీసం చెడు సహితం లేని లోకాన్ని పొందేందుకు కచ్చితమైన పరిష్కారాన్ని తెచ్చేది దేవుని రాజ్యం మాత్రమే. బైబిలునందు “క్రొత్త ఆకాశము” అని వర్ణించబడిన ఈ పరలోక ప్రభుత్వం, అన్యాయం లేని లోకం తప్పకుండా వస్తుందనే హామీనిస్తుంది. అది “క్రొత్త భూమిని” లేక ఒకరినొకరు ప్రేమించుకోవడం నేర్చుకున్న ప్రజలు నివసించే నూతన సమాజాన్ని పరిపాలిస్తుంది. (2 పేతురు 3:13; యెషయా 54:13) మాక్స్, సిమోన్ మరియు అనేకమంది ఇతరుల అనుభవాలు రుజువు చేస్తున్నట్లుగా ఈ విద్యాభ్యాసం ఇప్పటికే ప్రారంభమైంది. ద్వేషాన్ని దానికి కారణమైన వాటిని తీసివేసే ప్రపంచవ్యాప్త కార్యక్రమానికి ఇది ముంగుర్తు.
తన ప్రవక్తైన యెషయా ద్వారా యెహోవా దాని ఫలితాన్ని ఇలా వర్ణిస్తున్నాడు: ‘నా పరిశుద్ధ పర్వతమందంతటను వారు ఏ హాని చేయరు నాశముచేయరు. సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.’ (యెషయా 11:9) దేవుడు తానే ద్వేషాన్ని తీసివేస్తానని ప్రకటించాడు. అది నిజంగానే ప్రేమ కల్గివుండడానికి సమయము.
[7వ పేజీలోని చిత్రాలు]
మాక్స్ లీబస్టర్ ఎడమ చేతిపైన ఓ ఖైదీ నెంబరును నాజీలు పచ్చబొట్టుతో వ్రాశారు
[8వ పేజీలోని చిత్రం]
సమీప భవిష్యత్తులో ద్వేషం గతించిన విషయంగా ఉంటుంది