నీతిమంతుల పునరుత్థానం ఉంటుంది
‘నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని . . . దేవునియందు నిరీక్షణయుంచి యున్నాను.’—అపొస్తలుల కార్యములు 24:15.
1. ఆదాము హవ్వలు పడిపోయినప్పటి నుండి మానవులందరు ఏ పరిస్థితినెదుర్కొన్నారు?
“చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.” (ప్రసంగి 9:10) చక్కగా ఎంపిక చేయబడిన ఈ కొద్ది మాటలతో, మన మొదటి తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు పడిపోయినప్పటి నుండి మానవజాతి యొక్క ప్రతి తరం ఎదుర్కొన్న ఒక స్థితిని గూర్చి జ్ఞానియైన సొలొమోను రాజు వివరిస్తున్నాడు. ఎవ్వరినీ విడిచిపెట్టకుండా, ధనవంతులను పేదవారిని, రాజును సామాన్యున్ని, విశ్వాసిని అవిశ్వాసిని ఇలా ప్రతి ఒక్కరిని మరణం చివరికి మ్రింగివేసింది. నిజంగానే, మరణం ‘రాజులా ఏలింది.’—రోమీయులు 5:17.
2. ఈ అంత్య కాలంలో కొంతమంది విశ్వాసులు ఎందుకు నిరుత్సాహపడి ఉండవచ్చు?
2 వైద్య శాస్త్రమందు అత్యంత ఆధునిక అభివృద్ధులు ఎన్నివున్నప్పటికీ, నేడు కూడా మరణం రాజులా ఏలుతోంది. ఇదేమీ ఆశ్చర్యకరమైన విషయం కాకపోయినప్పటికీ, కొంతమంది చివరికి ఈ దీర్ఘకాల శత్రువును ముఖాముఖిగా ఎదుర్కోవల్సి వచ్చినప్పుడు, కొంత నిరుత్సాహపడి ఉంటారు. ఎందుకు? పూర్వం 1920వ దశకంలో, వాచ్‌టవర్ సంస్థ “ఇప్పుడు జీవిస్తున్న లక్షలాదిమంది మరెన్నడూ మరణించరు” అనే వర్తమానాన్ని ప్రకటించింది. ఈ లక్షలాదిమంది ఎవరైవుంటారు? వీరు, గొర్రెలు మేకలను గూర్చిన యేసు వ్యాఖ్యానంలోని “గొర్రెలు.” (మత్తయి 25:31-46) అంత్యకాలంలో ఈ గొర్రెల వంటి వారు కనిపిస్తారని, పరదైసు భూమిపై నిత్యజీవం వారి నిరీక్షణయై ఉంటుందని ప్రవచింపబడింది. సమయం గడుస్తుండగా దేవుని ప్రజలు, యెహోవా సంకల్పాలలో ఈ “గొర్రెల” స్థానాన్ని గూర్చిన సరైన గ్రహింపును పొందారు. విధేయులైన వీరు మూర్ఖులైన “మేకల” నుండి వేరుచేయబడాలని, ఆ తర్వాత చెప్పబడిన వారు నాశనం చేయబడ్డాక, గొర్రెలు తమ కొరకు సిద్ధం చేయబడిన రాజ్యం యొక్క భూపరిధిని స్వతంత్రించుకుంటారని గ్రహించడం జరిగింది.
గొర్రెలవంటి వారిని సమకూర్చుట
3. దేవుని ప్రజలు 1935 నుండి ఏ పనిమీద అవధానం నిలిపారు?
3 ‘నమ్మకమైన దాసుడు’ 1935 మొదలుకొని, అలాంటి గొర్రెల వంటి వారిని కనుగొని, వారిని యెహోవా సంస్థలోకి తేవడంపై అవధానం నిలిపారు. (మత్తయి 24:45; యోహాను 10:16) యెహోవా పరలోక రాజ్యంలో యేసు ఇప్పుడు పరిపాలిస్తున్నాడని, ఈ దుష్ట విధానాంతానికి, నీతి నివసించే నూతన లోకం రాడానికి సమయం త్వరగా సమీపిస్తున్నదని, బోధింపబడగల ఈ క్రైస్తవులు గ్రహించారు. (2 పేతురు 3:13; ప్రకటన 12:10) ఆ నూతన లోకంలో, హృదయాన్ని ఉప్పొంగజేసే యెషయా యొక్క ఈ మాటలు నెరవేరుతాయి: “మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగివేయును.”—యెషయా 25:8.
4. అర్మగిద్దోనునందు యెహోవా సర్వాధిపత్యం ఉన్నతపర్చబడటాన్ని చూడడానికి అత్యాసక్తితో నిరీక్షిస్తున్నప్పటికీ, అనేకమంది వేరే గొర్రెలకు ఏమి జరిగింది?
4 సాతాను లోకాంతం సమీపంలో ఉంది గనుక, మహాబబులోను పైకి, సాతాను యొక్క మిగతా లోకంపైకి రానైయున్న శ్రమల సమయంలో యెహోవా యొక్క సర్వాధిపత్యం ఘనపర్చబడే వరకు జీవించడానికి గొర్రెల వంటి క్రైస్తవులు ఎంతో ఆనందిస్తారు. (ప్రకటన 19:1-3, 19-21) అనేకులకు అలా జరగలేదు. ఎన్నడూ మరణించని “లక్షలాదిమంది”లో ఉంటామని నిరీక్షించిన అనేకులు, వాస్తవానికి మరణించారు. కొందరు సత్యం కొరకు చెరసాలలో, నిర్భంద శిబిరాలలో లేక మతోన్మాదుల చేతుల్లో హతసాక్షులయ్యారు. ఇతరులు దుర్ఘటనల్లో లేక సహజ కారణాలని పిలువబడే వ్యాధి మరియు వృద్ధాప్యం వల్ల మరణించారు. (కీర్తన 90:9, 10; ప్రసంగి 9:11) స్పష్టంగా, అంతం రాకముందు ఇంకా అనేకులు మరణిస్తారు. నీతి నివసించే నూతన లోకాన్ని గూర్చిన వాగ్దాన నెరవేర్పును అలాంటివారు ఎలా చూస్తారు?
పునరుత్థాన నిరీక్షణ
5, 6. అర్మగిద్దోనుకు ముందు మరణించే భూ నిరీక్షణ గలవారికి ఏ భవిష్యత్తు ఉంటుంది?
5 అపొస్తలుడైన పౌలు రోమా అధిపతియైన ఫేలిక్సు ముందు మాట్లాడేటప్పుడు దానికి సమాధానమిచ్చాడు. అపొస్తలుల కార్యములు 24:15 నందు వ్రాయబడినట్లుగా, పౌలు ధైర్యంగా ఇలా ప్రకటించాడు: ‘నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని . . . దేవునియందు నిరీక్షణయుంచి యున్నాను.’ పునరుత్థాన నిరీక్షణ తీవ్రమైన ఆపదల సమయంలో మనకు ధైర్యాన్నిస్తుంది. అనారోగ్యులై, తాము మరణించబోతున్నామని గ్రహించే మన ప్రియమైన స్నేహితులు ఆ నిరీక్షణ మూలంగా అతిగా నిరుత్సాహపడరు. ఏమి జరిగినప్పటికీ, తాము విశ్వాసం యొక్క ప్రతిఫలాన్ని పొందుతామని వారికి తెలుసు. పునరుత్థాన నిరీక్షణ మూలంగా, హింసించే వారి చేతుల్లో మరణించే మన ధైర్యవంతులైన సహోదర సహోదరీలకు, తమను హింసించేవారు ఏవిధంగాను విజయం సాధించలేరని తెలుసు. (మత్తయి 10:28) సంఘంలో ఎవరైనా మరణిస్తే, ఆ వ్యక్తిని కోల్పోయినందుకు మనం దుఃఖపడతాము. అదే సమయంలో, ఆయన లేక ఆమె వేరే గొర్రెలలో ఒకరైతే, మన తోటి విశ్వాసి అంతం వరకు నమ్మకంగా ఉన్నారని, ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారని, దేవుని నూతన లోకంలో ఒక భవిష్యత్తును నిశ్చయంగా కలిగివుంటారని మనం సంతోషిస్తాము.—1 థెస్సలొనీకయులు 4:13.
6 అవును, పునరుత్థాన నిరీక్షణ మన విశ్వాసమందు ఒక ప్రాముఖ్యమైన అంశం. అయితే, పునరుత్థానమందు మన నమ్మకం ఎందుకంత బలంగా ఉంది, ఆ నిరీక్షణ ఎవరికి కూడా ఉంది?
7. పునరుత్థానం అంటే ఏమిటి, దాని కచ్చితత్వాన్ని తెలియజేసే కొన్ని లేఖనాలు ఏవి?
7 “పునరుత్థానం” అనే దానికి గ్రీకు పదం అనాస్టాసిస్, దానికి అక్షరార్థంగా, “లేచి నిలుచుట” అని భావం. ప్రాథమికంగా అది, మరణం నుండి లేవడాన్ని సూచిస్తుంది. ఆసక్తికరంగా, “పునరుత్థానం” అనే అసలైన పదం హెబ్రీ లేఖనాల్లో కనిపించదు, కాని అక్కడ పునరుత్థాన నిరీక్షణ స్పష్టంగా వ్యక్తపర్చబడింది. ఉదాహరణకు, తన బాధ మధ్యన యోబు పలికిన ఈ మాటలలో మనం దాన్ని కనుగొనవచ్చు: “నీవు పాతాళములో నన్ను దాచి . . . నాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసికొనవలెను.” (యోబు 14:13) అలాగే, హోషేయ 13:14 నందు మనమిలా చదువుతాము: “పాతాళవశములో నుండి నేను వారిని విమోచింతును; మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?” అపొస్తలుడైన పౌలు 1 కొరింథీయులు 15:55 నందు ఈ మాటలను ఎత్తి చెప్పి, ప్రవచింపబడిన మరణంపై విజయం పునరుత్థానం ద్వారా సాధించబడుతుందని చూపించాడు. (నిజమే, ఆ లేఖనంలో పౌలు పరలోక నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు.)
విశ్వాసులు “నీతిమంతులుగా తీర్చబడ్డారు”
8, 9. (ఎ) నీతిమంతుల పునరుత్థానంలో అపరిపూర్ణ మానవులు ఎలా భాగం కలిగివుండగలరు? (బి) మరణం సంభవించని జీవితాన్ని గూర్చిన మన నిరీక్షణకు ఆధారం ఏమిటి?
8 ఐదవ పేరాలో చెప్పబడిన, ఫేలిక్సుతో తాను చేసిన వ్యాఖ్యానంలో పౌలు నీతిమంతులకు, అనీతిమంతులకు పునరుత్థానం ఉంటుందని చెప్పాడు. లేపబడే నీతిమంతులు ఎవరు? ఏ మానవుడు స్వతహాగా నీతిమంతుడు కాదు. మనల్ని మరణపాత్రులను చేసే రెండు కారణాలు—మనమందరం జన్మతః పాపులం, మనం మన జీవిత కాలమంతటిలో పాపాలు చేస్తూనే ఉంటాము. (రోమీయులు 5:12; 6:23) అయితే, బైబిలునందు “నీతిమంతులుగా తీర్చబడ్డారు” అనే పదాన్ని మనం కనుగొంటాం. (రోమీయులు 3:28) ఇది, అపరిపూర్ణులైనప్పటికీ యెహోవాచే తమ పాపాలు క్షమించబడిన మానవులను సూచిస్తుంది.
9 ఈ పదం అతి ప్రాముఖ్యంగా, పరలోక నిరీక్షణవున్న అభిషక్త క్రైస్తవులకు సంబంధించి ఉపయోగించబడుతుంది. అపొస్తలుడైన పౌలు రోమీయులు 5:1 నందు ఇలా చెబుతున్నాడు: “విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము.” అభిషక్త క్రైస్తవులందరూ విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. దేనియందు విశ్వాసం? రోమీయుల పుస్తకంలో పౌలు విపులంగా వివరించినట్లుగా, అది యేసుక్రీస్తునందు విశ్వాసం. (రోమీయులు 10:4, 9, 10) యేసు పరిపూర్ణ మానవునిగా మరణించి ఆ తర్వాత మృతులలో నుండి పునరుత్థానం చేయబడి, మన కొరకు తన మానవ జీవిత విలువను అర్పించడానికి పరలోకానికి ఆరోహణమయ్యాడు. (హెబ్రీయులు 7:26-28; 9:11, 12) యెహోవా ఆ బలిని అంగీకరించినప్పుడు, యేసు దానికి బదులుగా, పాపమరణాల బానిసత్వం నుండి మానవజాతిని కొన్నాడు. ఈ ఏర్పాటునందు విశ్వాసముంచే వారు దాని నుండి గొప్పగా ప్రయోజనం పొందుతారు. (1 కొరింథీయులు 15:45) దాని ఆధారంగా, భయంకర శత్రువైన మరణంచే అంతమొందించబడని జీవితాన్ని స్వతంత్రించుకొనే నిరీక్షణను విశ్వాసులైన పురుషులు, స్త్రీలు పొందుతారు.—యోహాను 3:16.
10, 11. (ఎ) నమ్మకమైన అభిషక్త క్రైస్తవుల కొరకు ఏ పునరుత్థానం వేచివుంది? (బి) క్రైస్తవపూర్వ ఆరాధికులు ఏ విధమైన పునరుత్థానమందు నిరీక్షణనుంచారు?
10 యేసు విమోచన బలి మూలంగా, నమ్మకమైన అభిషక్తులు నీతిమంతులుగా తీర్చబడి, యేసు వలె అమర్త్యమైన ఆత్మీయ జీవులుగా పునరుత్థానం చేయబడే కచ్చితమైన నిరీక్షణను పొందుతారు. (ప్రకటన 2:10) వారి పునరుత్థానం ప్రకటన 20:6నందు ఇలా చెప్పబడింది: “మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.” ఇది పరలోక పునరుత్థానం. అయితే, బైబిలు దాన్ని “మొదటి పునరుత్థానం” అని పిలుస్తుందని గమనించండి, మరి అనేకులు పునరుత్థానం చేయబడవలసి ఉందని ఇది సూచిస్తుంది.
11 యెహోవా దేవునియందు దృఢ విశ్వాసం కనపర్చిన క్రైస్తవపూర్వపు దేవుని సేవకుల పెద్ద పట్టికను గూర్చి పౌలు హెబ్రీయులు 11వ అధ్యాయమందు ప్రస్తావించాడు. వీరికి కూడా ఒక పునరుత్థానమందు విశ్వాసం ఉంది. ఆ అధ్యాయం యొక్క 35వ వచనంలో పౌలు, “స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానమువలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్ఠమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి” అని చెబుతూ, ఇశ్రాయేలీయుల చరిత్రలో సంభవించిన అద్భుతమైన పునరుత్థానాలను గూర్చి మాట్లాడుతున్నాడు. ప్రాచీన కాలంనాటి ఆ విశ్వాసులైన సాక్షులు, ఉదాహరణకు ఏలీయా మరియు ఎలీషా ఇమిడివున్న వాటికంటే మరింత శ్రేష్ఠమైన పునరుత్థానం కొరకు ఎదురుచూడవచ్చు. (1 రాజులు 17:17-22; 2 రాజులు 4:32-37; 13:20, 21) తమ విశ్వాసాన్ని బట్టి దేవుని సేవకులు హింసించబడని లోకంలోకి, స్త్రీలు తమ ప్రియమైన వారిని మరణమందు కోల్పోని లోకంలోకి, పునరుత్థానం చేయబడే నిరీక్షణ వారికుండేది. అవును, మనం నిరీక్షించే లోకంలోకే వారు కూడా మృతులలో నుండి లేపబడడం కొరకు ఎదురుచూశారు. (యెషయా 65:17-25) యెహోవా, ఈ నూతన లోకాన్ని గూర్చి మనకు తెలియజేసినంతగా వారికి తెలియజేయలేదు. అయినప్పటికీ, అది వస్తుందని వారికి తెలుసు, దానిలో ఉండాలని వారు కోరుకున్నారు.
భూ పునరుత్థానం
12. క్రైస్తవపూర్వపు నమ్మకమైనవారు నీతిమంతులుగా తీర్చబడ్డారా? వివరించండి.
12 విశ్వాసులైన ఈ క్రైస్తవపూర్వ స్త్రీ పురుషులు ఆ నూతన లోకంలోకి లేపబడడాన్ని నీతిమంతుల పునరుత్థానంలో భాగమని మనం భావించాలా? కచ్చితంగా అవును, ఎందుకంటే బైబిలు వారిని నీతిమంతులుగా సూచిస్తుంది. ఉదాహరణకు, నీతిమంతులని ధృవీకరించబడిన ప్రాచీన కాలంనాటి ఒక స్త్రీని గూర్చి, పురుషుని గూర్చి శిష్యుడైన యాకోబు తెలియజేస్తున్నాడు. ఆ పురుషుడు అబ్రాహాము, హెబ్రీ జాతికి మూలపురుషుడు. ఆయన గురించి మనమిలా చదువుతాము: “అబ్రాహాము దేవుని [యెహోవాను] నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను . . . దేవుని స్నేహితుడని అతనికి పేరుకలిగెను.” ఇశ్రాయేలీయురాలు కాని ఆ స్త్రీ యెహోవాయందు విశ్వాసముంచిన రాహాబు. ఆమె ‘నీతిమంతురాలని యెంచబడి’ హెబ్రీయుల జనాంగంలో భాగస్థురాలయ్యింది. (యాకోబు 2:23-25) అలా, యెహోవాయందు, ఆయన వాగ్దానాలందు దృఢ విశ్వాసముంచి, మరణం వరకు నమ్మకంగా నిలిచివుండిన పూర్వకాలపు స్త్రీలు పురుషులు తమ విశ్వాసం ఆధారంగా యెహోవాచే నీతిమంతులుగా తీర్చబడ్డారు, వారు నిస్సందేహంగా ‘నీతిమంతుల పునరుత్థానంలో’ భాగం వహిస్తారు.
13, 14. (ఎ) భూ నిరీక్షణ గల క్రైస్తవులు నీతిమంతులుగా తీర్చబడగలరని మనకెలా తెలుసు? (బి) వారికి దీని భావమేమిటి?
13 అయితే నేడు, భూ నిరీక్షణ కలిగి యెహోవాకు తమను తాము సమర్పించుకుని, ఈ అంత్య కాలంలో నమ్మకంగా మరణించే గొర్రెల వంటి వ్యక్తుల సంగతేమిటి? వారు నీతిమంతుల పునరుత్థానంలో భాగం వహిస్తారా? తప్పకుండా. అలాంటి విశ్వాసుల ఒక గొప్ప సమూహాన్ని అపొస్తలుడైన యోహాను దర్శనంలో చూశాడు. ఆయన వారిని ఎలా వర్ణిస్తున్నాడో గమనించండి: “అటుతరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలోనుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడి—సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.”—ప్రకటన 7:9, 10.
14 ఈ దీనులు తమ రక్షణను గూర్చి కచ్చితంగా ఒప్పించబడ్డారని, వారు దీన్ని యెహోవాకు, “గొఱ్ఱెపిల్ల”యైన యేసుకు ఆపాదిస్తారని గమనించండి. అంతేగాక, వారందరు తెల్లని వస్త్రాలు ధరించుకొని యెహోవా యెదుట, గొఱ్ఱెపిల్ల యెదుట నిలువబడివున్నారు. తెల్లని వస్త్రాలలో ఎందుకు? ఒక పరలోక ప్రాణి యోహానుకు ఇలా చెబుతున్నాడు: “గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.” (ప్రకటన 7:14) బైబిలునందు, తెలుపు స్వచ్ఛతకు, నీతికి గుర్తు. (కీర్తన 51:7; దానియేలు 12:10; ప్రకటన 19:8) గొప్ప సమూహము తెల్లని వస్త్రాలు ధరించుకొనివుందన్న వాస్తవానికి, యెహోవా వారిని నీతిమంతులుగా దృష్టిస్తాడని భావం. అదెలా సాధ్యం? వారు, తమ వస్త్రాలు గొఱ్ఱెపిల్ల రక్తములో ఉదుకుకొన్నట్లుగా ఉన్నారు. వారు చిందింపబడిన యేసుక్రీస్తు రక్తమందు విశ్వసిస్తారు గనుక మహా శ్రమను తప్పించుకొనే ఉద్దేశంతో దేవుని స్నేహితులవలె, నీతిమంతులుగా తీర్చబడతారు. గనుక, ఇప్పుడు “గొప్ప సమూహము”లో భాగమైయున్న ఏ నమ్మకమైన సమర్పిత క్రైస్తవుడైనా, మహాశ్రమకు ముందు మరణిస్తే, నీతిమంతుల భూ పునరుత్థానంలో తప్పకుండా భాగం వహిస్తాడు.
15. నీతిమంతులు అనీతిమంతులు కూడా పునరుత్థానం చేయబడతారు గనుక, నీతిమంతుల పునరుత్థానం యొక్క ప్రయోజనం ఏమిటి?
15 ఆ పునరుత్థానం ప్రకటన 20వ అధ్యాయం, 13వ వచనమందు ఈ మాటల్లో వివరించబడింది: “సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.” అలా, యెహోవా యొక్క గొప్ప వెయ్యేండ్ల తీర్పు దినంలో, దేవుని జ్ఞాపకంలో ఉన్న వారందరు అంటే నీతిమంతులైనా, అనీతిమంతులైనా, పునరుత్థానం చేయబడతారు. (అపొస్తలుల కార్యములు 17:31) అయితే, నీతిమంతులకు అది ఎంత శ్రేష్ఠంగా ఉంటుందో కదా! వారు ఇప్పటికే విశ్వాస జీవితాలను గడిపారు. వారికి ఇప్పటికే యెహోవాతో సన్నిహిత సంబంధం ఉంది, ఆయన సంకల్పాలు నెరవేరతాయనే నమ్మకం ఉంది. క్రైస్తవపూర్వ యుగపు నీతిమంతులైన సాక్షులు, సంతానాన్ని గూర్చిన యెహోవా వాగ్దానాలు ఎలా నెరవేరాయో నేర్చుకోడానికి ఆసక్తితో మృతులలోనుండి లేస్తారు. (1 పేతురు 1:10-12) మన దినాల్లో యెహోవా నీతిమంతులని దృష్టించే వేరే గొర్రెలకు సంబంధించినవారు, తాము ఈ విధానంలో సువార్త ప్రకటించినప్పుడు మాట్లాడిన భూపరదైసును చూడాలని ఆసక్తితో ముందుకు వస్తారు. అదెంతటి ఆనందకరమైన సమయమై ఉంటుంది!
16. మన కాలంలో మరణించే వారి తీర్పుదిన పునరుత్థానాన్ని గూర్చి మనం ఏమి చెప్పవచ్చు?
16 ఆ వెయ్యి సంవత్సరాల తీర్పు దినంలో, సాతాను విధానం యొక్క ఈ చివరి సంవత్సరాల్లో నమ్మకంగా ఉండి మరణించిన వారు కచ్చితంగా ఎప్పుడు పునరుత్థానం చేయబడతారు? బైబిలు చెప్పడం లేదు. అయితే, మన కాలంలో మరణించి నీతిమంతులుగా తీర్చబడేవారు, మునుపటి తరాలవారిని మృతులలోనుండి తిరిగి ఆహ్వానించే పనిలో అర్మగిద్దోనును తప్పించుకునే గొప్ప సమూహముతో పాటు భాగం వహించేలా ముందు పునరుత్థానం చేయబడతారని తలంచడం కారణసహితంగా ఉండదా? అవును, వాస్తవమే!
ఓదార్పునిచ్చే నిరీక్షణ
17, 18. (ఎ) పునరుత్థాన నిరీక్షణ ఏ ఓదార్పునిస్తుంది? (బి) యెహోవా గురించి ఏమి ప్రకటించడానికి మనం కదిలించబడతాము?
17 పునరుత్థాన నిరీక్షణ నేడు క్రైస్తవులందరికి బలాన్ని, ఓదార్పును ఇస్తుంది. మనం నమ్మకంగా నిలిచివుంటే, ఏ అనుకోని సంఘటన, ఏ శత్రువు మనం ఆ ప్రతిఫలాన్ని పొందకుండా చేయలేవు. ఉదాహరణకు, 1992 యెహోవాసాక్షుల వార్షిక పుస్తకం (ఆంగ్లం) 177వ పేజీ నందు, తమ విశ్వాసంతో రాజీపడకుండా మరణించిన ఇతియోపియానందలి ధైర్యవంతులైన క్రైస్తవుల చిత్రాలున్నాయి. ఆ శీర్షిక ఇలా ఉంది: “మనం పునరుత్థానంలో చూస్తామని నిరీక్షిస్తున్న ముఖాలు.” వీరిని, అలాగే, మరణసమయంలో కూడా అలాంటి నమ్మకాన్నే చూపించిన లెక్కలేనంతమంది ఇతరులను తెలుసుకోవడం ఎంతటి ఆధిక్యత!
18 వృద్ధాప్యం లేక అనారోగ్యంవల్ల మహా శ్రమను తప్పించుకోలేకపోయే మన స్వంత ప్రియమైనవారు మరియు స్నేహితుల మాటేమిటి? వారు నమ్మకంగా ఉన్నట్లయితే పునరుత్థాన నిరీక్షణకు అనుగుణ్యంగా, వారికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. మనం కూడా యేసు విమోచనా బలియందు ధైర్యంగా విశ్వాసం ఉంచినట్లయితే, మనకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే, పౌలువలె మనం “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము” ఉంటుందని నిరీక్షిస్తాము. మనం పూర్ణహృదయంతో ఈ నిరీక్షణ గురించి యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేస్తాము. నిజంగా, కీర్తనల గ్రంథకర్త మాటలను ప్రతిధ్వనింపజేయడానికి అది మనల్ని కదిలిస్తుంది: “అన్యజనులలో ఆయన [దేవుని] మహిమను ప్రచురించుడి సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము పొందతగినవాడు.”—కీర్తన 96:3, 4.
మీరు వివరించగలరా?
◻ భూ పునరుత్థానమందలి మన నిరీక్షణను దృఢపర్చుకోడానికి ఏ లేఖనాలు సహాయం చేస్తాయి?
◻ క్రైస్తవులు ఇప్పుడు దేని ఆధారంగా నీతిమంతులుగా తీర్చబడతారు?
◻ పునరుత్థాన నిరీక్షణ మనకు ధైర్యాన్ని, నిశ్చయతను ఎలా ఇస్తుంది?
[9వ పేజీలోని చిత్రం]
పౌలు వలె, అభిషక్త క్రైస్తవులు పరలోక పునరుత్థానాన్ని నిరీక్షిస్తారు