దైవపరిపాలనా గ్రంథాలయాన్ని ఎలా సంస్థీకరించుకోవాలి
షెరసాడే అనే ఒక చురుకైన స్పానిష్ అమ్మాయి తన అధ్యాపకురాలు ఈ రోజు వాళ్లు “ఫాదర్ క్రిస్టమస్” బొమ్మలకు రంగు వేయబోతున్నామని చెప్పినప్పటికి నాలుగేళ్ల వయస్సుగలది. వెంటనే షెరసాడే ఈ విషయంలో తనను క్షమించమని అడిగింది. తానలా చేయడానికి తన మనస్సాక్షి తనను అనుమతించదని ఆమె వివరించింది.
ఇలా నిరాకరించడాన్నిబట్టి ఆశ్చర్యపోయి, అది కేవలం ఒక బొమ్మ పటానికి రంగు వేయడం లాగే ఉంటుంది, అందులో తప్పేమి లేదని అధ్యాపకురాలు ఆమెకు చెప్పింది. “అది కేవలం బొమ్మే అయితే, మీకు అభ్యంతరం లేనట్లయితే నేను నా స్వంతగా బొమ్మను గీస్తానని,” షెరసాడే జవాబిచ్చింది.
మరో సందర్భంలో జాతీయ పతాకానికి రంగు వేయవలసిందిగా తరగతిలో ఉన్న వారికి చెప్పబడింది. మళ్లీ, తాను వేరే ఏదైనా చేయవచ్చా అని షెరసాడే అడిగింది. వివరణ కొరకు, ఆమె అధ్యాపకురాలికి షద్రకు, మేషాకు, అబేద్నెగోల కథను చెప్పింది.—దానియేలు 3:1-28.
తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడానికి ఈ అధ్యాపకురాలు కొద్ది రోజుల తర్వాతే షెరసాడే వాళ్ల అమ్మకు టెలిఫోన్ చేసింది. “మీ కూతురు నాతో చాలాసార్లు తన మనస్సాక్షిని గురించి మాట్లాడింది. మీరు దాన్ని ఊహించగలరా? ఆ వయస్సులోని అమ్మాయి, తన మనస్సాక్షి తననెందుకు గద్దిస్తుందో నాకు వివరించడం! చూడండి, మీరు ఆమెకు బోధిస్తున్న దానితో నేను ఏకీభవించను, కానీ మీరు విజయవంతులౌతున్నారని మాత్రం నేను హామీ యిస్తున్నాను. నేను మీ అమ్మాయిని మెచ్చుకుని, గౌరవిస్తున్నానన్న విషయం మీరు తెలుసుకోవాలని నేను యిష్టపడుతున్నాను,” అని ఆమె చెప్పింది.
నాలుగేళ్ల పాప బైబిలు శిక్షిత మనస్సాక్షిని ఎలా సంపాదించుకోగలదు? షెరసాడేకు తన పడకగదిలో తన స్వంత గ్రంథాలయం ఉందని ఆమె తల్లి అయిన మెరీనా వివరిస్తుంది. ఆమె అండర్లైన్ చేసుకున్న కావలికోటల వ్యక్తిగత ప్రతులు, ఆమె ప్రకటించడానికి కావల్సిన ప్రచురణలు, ఆమె జన్మించినప్పటినుండి విడుదల చేయబడిన వాచ్‌టవర్ సంస్థ ప్రచురణలు కూడా ఆ గ్రంథాలయంలో ఉన్నాయి. ఆమె గ్రంథాలయంలో యిష్టమైన అంశం నా బైబిలు కథల పుస్తకము యొక్క ఆడియో టేపు, ఆమె ప్రతిరోజు రాత్రి దాన్ని వింటూ, తన ప్రతిలో చూసుకుంటుంది. పైన చెప్పబడిన నిర్ణయాలు చేయడానికి ఆమెకు ఈ బైబిలు వృత్తాంతాలే సహాయం చేశాయి.
చక్కగా సంస్థీకరింపబడిన దైవపరిపాలనా గ్రంథాలయం మీకు, మీ పిల్లలకు సహాయం చేయగలదా? యింట్లో గ్రంథాలయం ఎందుకు అవసరం?
“గ్రంథాలయం విలాసానికి సూచనకాదు”
“గ్రంథాలయం హోదాకు సూచనకాదు, కానీ అది జీవిత అవసరాల్లో ఒకటి,” అని హెన్రీ వార్డ్ బీచర్ తెలియజేశాడు. నిస్సందేహంగా, “జీవిత అవసరాల్లో” ఒకటైన దీనిని మనకు తెలియకుండానే మనందరం కలిగి ఉంటాము. అదెలా? ఎందుకంటే మన దగ్గర బైబిలు మాత్రమేవున్నా మనం ఒక విధమైన గ్రంథాలయాన్ని కలిగి ఉన్నట్లే.
వాస్తవంగా బైబిలు ఒక శ్రేష్ఠమైన దైవపరిపాలనా గ్రంథాలయం. నాల్గవ శతాబ్దంలో, మనం బైబిలు అని పిలుస్తున్నటువంటి ప్రవచింపబడిన పుస్తకాల పూర్తి సమీకరణను వర్ణించడానికి జెరోము, బిబ్లియోతెకా డెవినా (దైవిక గ్రంథాలయము) అనే పదసముదాయాన్ని కూర్చాడు. మనకు ఆచరణాత్మక సహాయం, ఉపదేశం, నడిపింపును యివ్వడానికి యెహోవా దేవుడు ఈ పవిత్ర గ్రంథాలయాన్ని అందించాడు. మనం దాన్ని ఎన్నటికీ తక్కువ విలువైనదిగా భావించకూడదు. కేవలం పూర్తి బైబిలును కల్గి వుండడమంటేనే, గత కాలాల్లో దేవుని సేవకులు అనేకమంది కలిగి ఉన్న దానికంటే విస్తృతమైన గ్రంథాలయాన్ని మనం కలిగి ఉన్నామని అర్థము.
ఒకప్పుడు ఎంతో వ్యయంతో కూడిన చేవ్రాత ప్రతులు లభ్యమౌతున్నప్పుడు, కేవలం ప్రత్యేక గృహాల్లో మాత్రమే పూర్తి బైబిలు ఉండేది. పౌలు చివరగా రోమాలో ఖైదునందున్నప్పుడు తాను లేఖనాలను చదవాలని యిష్టపడినప్పుడు తన కొరకు ఆసియా మైనరు నుండి కొన్ని గ్రంథపు చుట్టలను—బహుశా హెబ్రీ లేఖనాల భాగాన్ని—తీసుకుని రమ్మని తిమోతిని అడుగవలసి వచ్చింది. (2 తిమోతి 4:13) అయితే సమాజమందిరాల్లో మాత్రం గ్రంథపు చుట్టలు ఉండేవి, మరి యేసుక్రీస్తు, అపొస్తలుడైన పౌలు తమ ప్రకటనా పనిలో ఈ గ్రంథాలయాలను ఉపయోగించుకున్నారు. (లూకా 4:15-17; అపొస్తలుల కార్యములు 17:1-3) సంతోషకరంగా, మొదటి శతాబ్దంలోకంటే నేడు లేఖనాలు ఎంతో సులభంగా లభ్యమౌతున్నాయి.
అచ్చు యంత్రాలను కనిపెట్టడం వలన ఈనాడు దేవుని సేవకుల్లో దాదాపు అందరూ—తమ భాష ఏదైనప్పటికీ—పూర్తి బైబిలును సహేతుకమైన ధరకు పొందగలరు. ఈ పవిత్ర “గ్రంథాలయానికి” కొంత చేర్చగల ప్రత్యేక అవకాశం కూడా మనకు ఉంది. ఒక శతాబ్దంపైగా, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన” దాసుడు తగిన వేళకు ఆత్మీయ ఆహారాన్ని అందించడంలో పనితొందర కలిగి ఉన్నాడు.—మత్తయి 24:45-47.
మనము వ్యక్తిగత దైవపరిపాలనా గ్రంథాలయాన్ని సరిగ్గా సంస్థీకరించుకోకపోతే, మనం ఈ విలువైన గ్రంథాలయంనుండి పూర్తి లాభాన్ని పొందడం వీలుకాదు. దాన్నెలా చేయవచ్చు? అటువంటి గ్రంథాలయానికి అవసరమయ్యే పుస్తకాలను సేకరించడం మొదటి మెట్టు. సమస్యలతో వ్యవహరించడానికి, బైబిలు ప్రశ్నలకు జవాబు చెప్పడానికి అటువంటి కచ్చితమైన సమాచారాన్ని మనం వెంటనే కలిగి ఉండడానికి అది వీలు కలిగిస్తుంది గనుక అది మన ప్రయాసకు తగినది.
నాకు ఏ పుస్తకాలు అవసరం?
మీరు మీ వివాహంలో సంభాషణా సమస్యను ఎలా పరిష్కరించుకోవచ్చు లేక మీ పిల్లవాడు మాదకద్రవ్యాలు వద్దు అని చెప్పడానికి ఎలా సహాయం చేయవచ్చు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కృంగుదలతో బాధపడుతున్న స్నేహితునికి మీరెలా సహాయం చేయగలరు? దేవుడు ఉనికిలో ఉన్నాడని, ఆయన దుష్టత్వాన్ని ఎందుకు అనుమతిస్తున్నాడని చెప్పడానికి మనకే రుజువుందో మీరు స్పష్టంగా వివరించగలరా? ప్రకటన 17వ అధ్యాయంలోని ఎర్రని క్రూరమృగం దేనిని సూచిస్తుంది?
మీరు సముచితమైన దైవపరిపాలనా గ్రంథాలయాన్ని కలిగి ఉంటే యీ ప్రశ్నలకు, మరితర లెక్కలేనన్ని వాటికి జవాబు చెప్పవచ్చు. అనేక లేఖనాధార సంగతులను చర్చించే పుస్తకాలను, బ్రోషూర్లను, పత్రిక శీర్షికలను వాచ్‌టవర్ సంస్థ ప్రచురించింది. అంతేకాకుండా, ఈ ప్రచురణలు కుటుంబ సంగతులతో వ్యవహరిస్తాయి, బైబిలు మరియు దేవునిలో మన విశ్వాసాన్ని నిర్మిస్తాయి, మన ప్రకటనా నైపుణ్యాలను మెరుగుపర్చుకోడానికి వీలు కలిగిస్తాయి, మనం బైబిలు ప్రవచనాలను అర్థం చేసుకోడానికి సహాయం చేస్తాయి.
గత 20 సంవత్సరాలుగా సంస్థచే ప్రచురింపబడిన ప్రచురణలు అనేకం యింకా లభ్యమౌతున్నాయి. మీరు యిటీవలనే సత్యం తెలుసుకుని వుంటే మీ భాషలో లభ్యమయ్యే అటువంటి ప్రచురణలన్నింటినీ మీరు పొందడం ఎంతో శ్రేష్ఠం. గడిచిన సంవత్సరాల కావలికోటల బౌండు వాల్యూములు మీ భాషలో లభ్యమౌతుండవచ్చు. లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం), మరియు విపులమైన సమగ్రసూచిక (ఆంగ్లం) వంటి గణనీయమైన రెఫరెన్సు పుస్తకాలు కూడా వివిధ భాషల్లో ప్రచురింపబడ్డాయి. అయితే, ఈ పుస్తకాలను సంపాదించడం కేవలం మొదటి మెట్టు మాత్రమే.
మీ గ్రంథాలయాన్ని సంస్థీకరించుకోండి!
ఫలాని పుస్తకం మీవద్ద ఎక్కడో ఉందని తెలుసుకోడం ఒక విషయం, కానీ మీకు అవసరమైన దాన్ని కనుగొనడం మరో విషయం. మనకు అవసరమైన రెఫరెన్సు పుస్తకం కొరకు వెదకడంలో మనం సమయాన్ని వృధా చేయవలసి వస్తే, మనం ఆ విషయంలోనే ఆసక్తిని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, మనం మన పుస్తకాలను, అనుకూలమైన స్థలంలో, సరిగ్గా అమర్చుకుంటే, వ్యక్తిగత పరిశోధన చేయడానికి మనం ఎక్కువ యిష్టపడతాము.
ఒకవేళ వీలైతే, దైవపరిపాలనా పుస్తకాలను ఎక్కువ వాటిని ఒకే స్థలంలో ఉంచుకోవడం సహాయకరంగా ఉంటుంది. మీరు తయారు చేయబడిన పుస్తకాల షెల్ఫులను కొనలేకపోతే, వాటిని తయారు చేసుకోవచ్చు, తరచుగా వాటిని చాలా తక్కువ ధరకే పొందవచ్చు, అవి ఎక్కువ స్థలాన్ని కూడా ఆక్రమించనవసరం లేదు. గ్రంథాలయంలోని పుస్తకాలను సులభంగా అందుకోగల్గేలా ఉంచుకోవడం కూడా ప్రాముఖ్యమే. అటకపై భద్రపర్చబడిన పుస్తకాలు, తరచుగా దుమ్ముపట్టడం కంటే వాటివల్ల ఎక్కువ ప్రయోజనమేమీ ఉండదు.
పుస్తకాలను సంస్థీకరించడం తదుపరి మెట్టు. పుస్తకాలను సరైన క్రమంలో సర్దడానికి కేవలం కొంత సమయాన్ని వెచ్చించడం ప్రతిఫలాలను తెస్తుంది.
మీ కుటుంబంలో అనేకులు యెహోవాసాక్షులు కానట్లయితే అప్పుడేమిటి? మీరు యిష్టపడినట్లు గ్రంథాలయాన్ని సర్దుకోడానికి మీకు వీలు కల్గకపోయినా, మీ స్వంత గదిలో మీరు కనీసం కొన్ని లేఖనాధార ప్రచురణలనైనా కల్గివుండే పుస్తకాల అరను కలిగి ఉండవచ్చు.
దైవపరిపాలనా గ్రంథాలయం ఆత్మీయతను పెంపొందింపజేసుకోడానికి సహాయం చేయగలదు
మన పుస్తకాలు ఒకసారి అమర్చబడిన తర్వాత, సమాచారాన్ని కనుగొనడానికి మనకు ఒక క్రమపద్ధతి కావాలి. మన జ్ఞాపకశక్తి తప్పుగా ఉండవచ్చు, మరియు మన దైవపరిపాలనా గ్రంథాలయంలో ఉన్న ప్రతి పుస్తకం యొక్క అంశాలను గురించి మనకు వ్యక్తిగతంగా తెలియకపోవచ్చు. అయినప్పటికీ, గ్రంథాలయంలో ఉన్న సమాచారమంతా వెంటనే పొందవచ్చు. ఒకవేళ కావలికోట ప్రచురణల విషయసూచిక మన భాషలో లభ్యమౌతుంటే, దాదాపు ఏ అంశాన్ని గురించైనా కావలసిన సమాచారాన్ని కొద్ది సమయంలోనే కనుగొనడానికి అది సహాయం చేస్తుంది.
అనేక సంవత్సరాలు స్పెషల్ పయినీర్‌గా, పెద్దగా పని చేసిన జూలియన్, తన చిన్న కుమారునికి వ్యక్తిగత పఠనం చేయడాన్ని నేర్పించేందుకు విషయసూచిక ఎంతో విలువైన ఉపకరణమని వివరిస్తున్నాడు. “ఏడేండ్ల జైరో, ఒకరోజు పాఠశాలనుండి వచ్చి నన్నిలా అడిగాడు, ‘నాన్నా, డినాసర్లను గురించి సంస్థ ఏం చెప్పింది?’ మేము వెంటనే విషయసూచికను తెరిచి, ‘డినాసర్లు’ అనే పదాన్ని చూశాము. ఆ విషయం ఒక తేజరిల్లు! [ఫిబ్రవరి 8, 1990] కవరు శీర్షికలో ఉందని మేము వెంటనే కనుగొన్నాము. అదే రోజు జైరో దాన్ని చదవడం ప్రారంభించాడు. మా గ్రంథాలయం దాదాపు ప్రతి ఆచరణాత్మక అంశంపై ఉపయుక్తమైన సమాచారాన్ని కలిగివుందని యిప్పటికే అతనికి తెలుసు. మా పిల్లలు దైవపరిపాలనా గ్రంథాలయాన్ని మంచిగా ఉపయోగించడం నేర్చుకున్నప్పుడు, వాళ్లు ఆత్మీయంగా ఎదగడానికి అది సహాయం చేస్తుందని నేను వ్యక్తిగతంగా దృఢంగా విశ్వసిస్తున్నాను. వాళ్లు తర్కించడం నేర్చుకుంటారు, అంతేకాకుండా వ్యక్తిగత పఠనం ఆనందదాయకంగా ఉండగలదని వాళ్లు కనుకొంటారు.
ప్రారంభంలో ప్రస్తావించబడిన షెరసాడే తండ్రి అయిన ఫాస్టో, పిల్లలకు దైవపరిపాలనా గ్రంథాలయాన్ని ఉపయోగించడాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేర్పాలని నమ్ముతున్నాడు. “యిప్పుడు ఆరు సంవత్సరాల వయస్సుగల షెరసాడేకు యిప్పటినుండే మేము సూచికను ఉపయోగించడం నేర్పిస్తున్నాము. భూపరదైసు ఉత్తరాపేక్షను బట్టి ఆమె ఎంతో సంతోషిస్తుంది గనుక, మేము విషయసూచిక నుండి ‘పరదైసు’ అనే పదాన్ని చూపించి, అక్కడ సూచింపబడిన కావలికోట శీర్షికలను తెరిచి చూపించడం ద్వారా ప్రారంభించాము. సాధారణంగా మేము ఆమెకు బొమ్మలను మాత్రమే చూపిస్తాము. అయినప్పటికీ, ఈ పద్ధతి ద్వారా మా యింట్లోని గ్రంథాలయంలో సమాచారాన్ని కనుగొనడానికి విషయసూచిక మూలమని ఆమె తెలుసుకుంది. ఈస్టరు వేడుకలను గురించిన ప్రశ్నతో ఆమె ఒక రోజు పాఠశాలనుండి తిరిగి వచ్చినప్పుడు ఆమె విషయాన్ని గ్రహించిందని మేము తెలుసుకున్నాము. ‘మనము సూచిక సహాయంతో ఎందుకు వెదక కూడదు?’ అని ఆమె వాళ్ల అమ్మను అడిగిందని” అతను వివరించాడు.
మన వయస్సు ఎంతైనప్పటికీ, “సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి” అని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది. (1 థెస్సలొనీకయులు 5:21) లేఖనాలు ఏమి చెబుతున్నాయో దాని కొరకు మనం పరిశోధించడం అవసరం. (అపొస్తలుల కార్యములు 17:11) మనకు చక్కగా సంస్థీకరింపబడిన దైవపరిపాలనా గ్రంథాలయం ఉన్నట్లయితే, అటువంటి పరిశోధన ఆనందదాయకంగా ఉండగలదు. ఒక ప్రసంగాన్ని సిద్ధం చేయడానికి, ఒక సమస్యతో వ్యవహరించడానికి ఆచరణాత్మక సలహాను కనుగొనడానికి, లేక ఆసక్తికరమైన సమాచారాన్ని చూడడానికి మనం గ్రంథాలయాన్ని విజయవంతంగా ఉపయోగించిన ప్రతిసారీ, మన గ్రంథాలయం యొక్క ఆచరణాత్మక విలువను అది మనకు నొక్కిచెబుతుంది.
“ఒక క్రైస్తవ కుటుంబంలో, దైవపరిపాలనా గ్రంథాలయం కచ్చితంగా ఒక విలాసం కాదు!” అని షెరసాడే తలిదండ్రులు స్పష్టంగా చెబుతున్నారు.
[30వ పేజీలోని బాక్సు]
మీరు మీ పుస్తకాలను ఎలా అమర్చుకోగలరు?
మీ పుస్తకాలను ఎలా సంస్థీకరించుకోవాలనే విషయంలో కచ్చితమైన నియమాలేమి లేవు. అయితే, మీ పుస్తకాలను అందులోని విషయాల ఆధారంగా అమర్చుకోగల ఒక విధానాన్ని ఈ క్రింది క్రమమైన విభజన చూపిస్తుంది.
1. బైబిలు యొక్క కొన్ని భాగాల, ప్రతివచన వివరణను కల్గివున్న పుస్తకాలు
(ఉదాహరణలు: జీవించన వారిలోకెల్లా మహా గొప్ప మనిషి, ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది!, “నేను యెహోవానని దేశాలు తెలుసుకుంటాయి”—ఎలా?, “నీ చిత్తము భూమిపై నెరవేరుతుంది”)
2. కుటుంబ జీవితానికి సంబంధించిన పుస్తకాలు
(ఉదాహరణలు: నీ కుటుంబ జీవితమును సంతోషభరితము చేసికొనుము, యౌవనస్థులు అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మక సమాధానాలు, నా బైబిలు కథల పుస్తకం)
3. బైబిలులు మరియు రెఫరెన్సు పుస్తకాలు
(ఉదాహరణలు: పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము—రిఫరెన్సులు, యితర బైబిళ్లు, కావలికోట ప్రచురణల విషయసూచికలు, సమగ్రమైన అకారాదిసూచిక, లేఖనములపై అంతద్దృష్టి, గ్రీకు లేఖనములను గూర్చిన రాజ్యంతస్సంబంధ అనువాదము, ఒక మంచి నిఘంటువు)
4. సంఘ పుస్తక పఠనం మరియు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల కొరకు ప్రస్తుతం ఉపయోగింపబడుతున్న పుస్తకాలు
5. ఆడియోక్యాసెట్టులు మరియు వీడియోలు
6. కావలికోట మరియు తేజరిల్లు! యొక్క బౌండ్ వాల్యూములు
7. యెహోవాసాక్షుల చరిత్ర
(ఉదాహరణలు: యెహోవాసాక్షుల వార్షిక పుస్తకములు, యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు)
8. మన పరిచర్యలో మనం క్రమంగా ఉపయోగించే పుస్తకాలు, బ్రోషూర్లు
(ఉదాహరణలు: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు, లేఖనములనుండి తర్కించడము, జీవము—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా?, దేవుని కొరకు మానవజాతి అన్వేషణ, అద్వితీయ సత్య దేవుని ఆరాధనలో ఐక్యమగుట)
[31వ పేజీలోని చిత్రం]
షెరసాడే యిప్పటికే మంచి బైబిలు విద్యార్థిని అయ్యింది
[31వ పేజీలోని చిత్రం]
ఎంతో చిన్నవాడైనా, ఈ బాలుడు దైవపరిపాలనా గ్రంథాలయాన్ని ఉపయోగించుకుంటున్నాడు