బోస్నియాలోని మన విశ్వాసగృహమునకు చేరినవారికి సహాయాన్ని అందించడం
యెహోవా సాక్షులు రాజకీయ విభేదాల్లో భాగం వహించరు. (యోహాను 17:16) అయితే, “విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడల” మంచి చేయాలన్న పౌలు సలహాను పాటిస్తూ వాళ్లు, యుద్ధంతో బాధింపబడుతున్న ప్రాంతాల్లోని తమ తోటి సహోదరులకు సహాయం చేయడానికి సన్నద్ధమై వస్తారు. (గలతీయులు 6:10, బెక్) గత 1993-94 శీతాకాలం దగ్గరపడినప్పుడు, ఆస్ట్రియా మరియు కృయేషియాలోని సాక్షులు, బోస్నియాలోని తమ విశ్వాసగృహమునకు చేరిన వారికి సహాయాన్ని అందించేందుకు తమ ప్రాణాలకు తెగించారు. ఈ క్రింద యివ్వబడినది వారి నివేదిక.
మార్చి నుండి అక్టోబరు 1993 వరకు, బోస్నియాకు సహాయ సామాగ్రిని పంపే అవకాశం లేకపోయింది. అయితే అక్టోబరు ప్రారంభంలో, వస్తువులను రవాణా చేయడం వీలౌతుందని అధికారులు సూచించారు. బోస్నియా సరిహద్దులు అన్నింటిలో భీకర పోరాటాలు చెలరేగుతున్నాయి గనుక అది యింకా ప్రమాదకరమైన వ్యవహారమే.
అయిననూ, మంగళవారం 1993 అక్టోబరు 26న మా ట్రక్కులు బోస్నియాలోని తోటి క్రైస్తవుల కొరకు 16 టన్నుల ఆహారం, వంటచెరుకు తీసుకుని వియన్నానుండి బయల్దేరాయి. మమ్మల్ని గుర్తించడానికి మేము మన జిల్లా సమావేశ లేబిల్ కార్డులను ధరించాము.
కృయేషియా మరియు బోస్నియా సరిహద్దులను చేరిన తర్వాత, భద్రతాసిబ్బంది మమ్మల్ని సైనిక స్థావరం వద్దకు తీసుకెళ్లారు, అక్కడ మా ట్రక్కులు క్షుణ్ణంగా పరీక్షించబడ్డాయి. సెర్బియా ప్రాంతంలోనుండి ప్రయాణిస్తామనే మా విన్నపం త్రోసిపుచ్చబడింది. కేవలం బోస్నియా మధ్యభాగం నుండి వెళ్లడం మాత్రమే అనుమతించబడుతుంది, అంటే సరిగ్గా యుద్ధం జరుగుతున్న ప్రాంతంనుండి వెళ్లాలి!
వ్యర్థ ప్రయత్నాలా?
సైనిక భద్రతా సిబ్బంది మమ్మల్ని ఒక చెక్‌పాయింట్ నుండి మరొక దానికి తీసుకువెళ్తుండగా ట్యాంకులు, తుపాకులనుండి చెవులు చిల్లులుపడే శబ్దాలను మేము విన్నాము. రాత్రుల్లో మేము రెండు ట్రక్కులు, ఒక జీపు రక్షణతో అడవుల్లోనుండి ప్రయాణించాము. మా ట్రక్కులు పోరాటం జరుగుతున్న ప్రాంతంలో చాలా నెమ్మదిగా ప్రయాణించాయి! ఉదయంవరకూ అంతా బాగానే జరిగింది, కానీ అప్పుడు మా తలలకుపైగా కాల్పులు జరగడంతో, మేము ఒక కొండ వెనుక తలదాచుకోవాల్సి వచ్చింది. కొంతసేపటికి కాల్పులు ఆగాయి, మేము మా ప్రయాణాన్ని కొనసాగించాము.
మేము ఒక శిబిరం వద్దకు వచ్చినప్పుడు, సైనికాధికారి మేము ఎవరము, మాకు ఏమి కావాలి అని అడిగాడు. మేము మా సంకల్పాన్ని చెప్పిన తర్వాత “మీ ప్రయత్నం తప్పకుండా విఫలమవుతుంది,” అని అతను అన్నాడు. “మీరు క్యాంపు దాటి క్షేమంగా వెళ్లలేరు, కనీసం కొన్ని గజాలు కూడా వెళ్లలేరు. దేశంలో ఎంత కరవు ఉందంటే ప్రజలు మీపై దాడి చేసి మీ వస్తువులను దోచుకుంటారు.” అతను మమ్మల్ని వెనక్కి తిరిగి వెళ్లిపొమ్మని తొందరపెట్టాడు.
మా ప్రయత్నాలు “విఫలం కానున్నాయా”? మేము యుద్ధం జరుగుతున్న, కరవుతో పీడింపబడుతున్న ప్రాంతంలో ప్రయాణించి కూడా, మా వస్తువులనూ, మా ప్రాణాలను కాపాడుకోగలమని అపేక్షించడం వ్యర్థమా? ఒక గంభీరమైన నిర్ణయం తీసుకోవాలి. మేము యిప్పటికే తుపాకి కాల్పుల శబ్దాలు, చెవులకు చిల్లులు వేసేంతటి బాంబు పేలుళ్లను విన్నాము. మేము ఆ రాత్రి సైనికులతో గడిపినప్పుడు, వాళ్లు యుద్ధం కొరకు సన్నద్ధమైనట్లు మేము గమనించాము. వాళ్లు బులెట్ ప్రూఫ్ వెస్టులు వేసుకుని, బాగా ఆయుధాలను ధరించి ఉన్నారు. చివరకు వంటవాడు కూడా తన భుజానికి మెషిన్ గన్ను తగిలించుకుని ఉన్నాడు. అయితే మేము చొక్కాలు, టైలు, లేబిల్ కార్డులు ధరించి ఉన్నాము! మేము కొనసాగడం జ్ఞానవంతంగా ఉంటుందా?
ట్రావ్నెక్కు చేరడం
ఈ యుద్ధంలో పాల్గొంటున్న మూడవ వర్గంతో సంప్రదించడమే మా ఏకైక నిరీక్షణ అని అనిపించింది. మర్నాటి ఉదయం, ఆ వర్గం యొక్క క్యాంపు ప్రధానకార్యాలయం ఎక్కడ ఉందో తెలుసా అని మేము ఒక యౌవన స్త్రీని అడిగాము. “అది ఎంతో దూరంలోలేదు, ఆ అడవి అవతల ఒకప్పుడు ఆసుపత్రిగా ఉన్న ఒక భవంతిని మీరు కనుగొంటారని” ఆమె చెప్పింది. మేము వెళ్లాలన్న ఆతురతతో ఉన్నాము. మేము క్యాంపునుండి ఆయుధాల సహాయం లేకుండా ధైర్యంగా బయలుదేరడాన్ని చూసి సైనికులు ఆశ్చర్యపోయారు.
ఆ పూర్వపు ఆసుపత్రి శిథిలావస్థలో ఉంది, కానీ ఒక అధికారి అక్కడ ఉన్నాడు. ఆయన సహాయం చేయడానికి ఒప్పుకుని, మొదట తన పైఅధికారితో మాట్లాడమని సలహా యిచ్చాడు. అతను తుక్కు రేగిపోయి ఉన్న తన కారులో ఎక్కించుకుని, మమ్మల్ని యుద్ధ రంగంలోనుండి పూర్తి వేగంతో తీసుకెళ్లాడు. మేము ఒక భవంతి వద్ద ఆగాము, అక్కడి సైనికాధికారి మాతో మాట్లాడడానికి మమ్మల్ని ఒక చీకటి గదిలోకి రానిచ్చాడు.
“గత రాత్రి మేము మీపై కాల్పులు జరపాలనుకున్నామని,” అతను చెప్పాడు. “మీకు ఏమి కావాలి?”
“మేము యెహోవా సాక్షులము, మేము మా సహోదరుల కొరకు సహాయ సామాగ్రిని తీసుకెళ్లాలనుకుంటున్నాము.”
కొన్ని వారాలనుండి సహాయ సామాగ్రి తీసుకువెళ్లే వాహనాలు, బోస్నియాలోకి ప్రవేశించడానికి ధైర్యం చేయలేదు గనుక అతనెంతో ఆశ్చర్యపోయాడు, ముగ్ధుడయ్యాడు. క్షుణ్ణంగా తనిఖీ చేయబడిన తర్వాత, మాకు వ్రాతపూర్వక ధృవీకరణ లభించింది. ముందు రోజు రాత్రి మేము మా ప్రయాణాన్ని కొనసాగించలేమని భావించాము, యిప్పుడు మాత్రం మేము ఏ రక్షణ లేకుండానే ముందుకు వెళ్లగలుగుతున్నాము!
మేము అడవిలో ఒక చెక్‌పాయింట్ నుండి మరోదానికి, కొన్నిసార్లు యుద్ధ రంగంనుండి ప్రయాణించి వెళ్లాము. ప్రమాదం ఉన్నప్పటికీ, మేము ట్రావ్నిక్కు క్షేమంగా చేరుకున్నాము. మేము వచ్చామన్న సంగతి విన్న ఒక సైనికుడు, మన సహోదరులు కూడుకున్న యింటి వద్దకు పరుగెత్తాడు. “మీ వాళ్లు ట్రక్కులతో యిక్కడికి వచ్చారు!” అని అతను అరిచి చెప్పాడు. వాళ్లెంతగా ఆనందించారో మీరు ఊహించవచ్చు. మేము ఆహారాన్ని యింట్లోకి మోసుకెళ్లి, కొన్ని మాటలు మాట్లాడాము, కాని మళ్లీ బయల్దేరాలి. చీకటి పడుతోంది, 32 కిలోమీటర్ల అపాయకరమైన ప్రయాణాన్ని యింకా కొనసాగించాల్సి ఉంది.
జెనిట్సాకు వెళ్లడం
భద్రతా సిబ్బంది కారు మమ్మల్ని అడవిలోనుంచి పూర్తివేగంతో తీసుకెళ్లింది. మేము జెనిట్సాకు చేరలేమని కొందరు అన్నారు కానీ మేము చేరాము. ఊర్లో ఒక మబ్బు కమ్మినట్లు కనిపిస్తుంది. దారిలో లైట్లు, కార్లు లేవు. జెనిట్సా అన్ని వైపులనుండి ముట్టడింపబడి ఉంది, అది గొప్ప కరవు, బాధకు కారణమైంది.
మేము ఆ వీధిలో ప్రయాణిస్తుండగా, మేమొక ఆశ్చర్యకరమైన సంగతిని చూశాము—యిద్దరు క్రైస్తవ సహోదరీలు సాక్ష్యమిస్తున్నారు! సరుకులు అయిపోయ్యాయి గనుక, సహోదరులు ఆహారం కొరకు అడవిలోకి వెళ్లవలసిందిగా ముందు రోజు వారి కూటాల్లో తీర్మానించబడిందని మేము తెలుసుకున్నాము. మేము సరైన సమయానికి వచ్చాము! వీధుల్లో ఎవ్వరూ లేనప్పుడు, ఉదయం నాలుగు గంటలకు మేము ఒక ట్రక్కునుండి సామాన్లను దింపుకున్నాము.
మర్నాడు మేమొక సైనికాధికారిని కలిశాము, మేము జెనిట్సాకు క్షేమంగా చేరుకున్నందుకు అతను ఎంతో ఆశ్చర్యపోయాడు. మేమిప్పుడు మా తదుపరి గమ్యమైన సెరజేవోకు ప్రయాణించడాన్ని గురించి వాకబు చేస్తున్నాము.
“కొన్ని నెలలనుండి ట్రక్కు ద్వారా రాడానికి ఎవ్వరూ ధైర్యం చేయలేదని” సైనికాధికారి చెప్పాడు. చివరకు మేము కొండలమీదుగా ప్రయాణించడానికి అతను మాకు అనుమతిచ్చాడు. “కానీ నేను చెప్పేదేమంటే, అది ఎంతో కష్టతరమైనది, మీ ట్రక్కులు అంత దృఢంగా ఉంటాయని నేననుకోను,” అని అతను హెచ్చరించాడు.
సైనికాధికారి చెప్పింది అతిశయోక్తి ఏమి కాదు. మేము సెరజేవోకు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు, అడవిలోనుంచి 140 కిలోమీటర్లు వెనక్కి ప్రయాణించాల్సి వచ్చింది! జెనిట్సా దగ్గరనుండి మా ప్రయాణం సెరజేవోగుండా యబ్లానిట్సాకు చేరడానికి, గంటకు కేవలం ఐదు కిలోమీటర్ల వేగంతో మాత్రమే తరచుగా వెళ్లినందువల్ల, మూడు పగళ్లు, రెండు రాత్రులు పట్టిన, ఈ ప్రయాణాన్ని మేము ఎన్నటికీ మర్చిపోము. ఆ “రోడ్డు” సాయుధ వాహనాలు ప్రయాణించడంతో ఏర్పడిన దారి. మేము ప్రమాదకరమైన కొండలు, గుంటలలోనుండి ప్రయాణించాము. మేము తరచుగా లైట్లు లేకుండా ప్రయాణించాల్సి వచ్చింది, రెండు సందర్భాల్లో మా ట్రక్కు ప్రమాదకరమైన గుట్టలపైనుండి జారింది. మా వాహనాల వెనుక వస్తున్న సైనిక ట్రక్కు ఒక క్షణం కొరకు లైట్లు వెలిగించింది, వెంటనే దానిపై కాల్పులు జరుపబడ్డాయి. కొన్నిసార్లు మేము పాడైన వంతెనలను సరిచేసుకుని, టయర్లు బాగుచేసుకోవలసి వచ్చేది.
మేము సెరజేవో పొలిమేరలను చేరుకున్న వెంటనే. మేము అక్కడ డ్యూటిలో ఉన్న సైనికాధికారిని కలిసి మాట్లాడతామని అడిగాము. అక్కడ వేచి ఉన్నప్పుడు, పది శవాలను, తలలున్న సంచిని తీసుకెళ్తున్న ఒక ట్రక్కును మేము చూశాము; సైనికులు శవాలను స్వాధీనపర్చుకోడాన్ని గురించి సంప్రదిస్తున్నారు—నిజంగా అదెంత అప్రీతికరమైన దృశ్యం, అది మేము యుద్ధం అంతమయ్యే దినం కొరకు ఎదురు చూసేలా చేసింది.—యెషయా 2:4.
ఉదయం 10:00 గంటలకు మాలో ఒకరు సైనికాధికారి మరియు అతని ఉన్నతాధికారులతో, కేవలం ఒక క్రొవ్వొత్తి మాత్రమే వెలిగించబడి ఉన్న ఒక చీకటి గదిలో మాట్లాడడానికి అనుమతింపబడ్డాము.
“మీరు ఎవరు?” అని సైనికాధికారి అడిగాడు.
“మేము యెహోవా సాక్షులము. మేము సెరజేవోలో ఉన్న మా తోటి సాక్షులకొరకు ఆహారాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నాము.”
“సెరజేవోలో చాలామంది యెహోవా సాక్షులు ఉన్నారని మీకు తెలుసా?”
“తెలుసు, అందుకే మేము యిక్కడికి వచ్చాము.”
తర్వాత సైనికాధికారి ఒక సాక్షి పేరు చెప్పాడు. “మీకు అతను తెలుసా?”
“తెలుసు, అతను మా స్నేహితుడు.”
“అతను నాకు కూడా స్నేహితుడే,” అని సైనికాధికారి చెప్పాడు. “మేము పాఠశాలకు కలిసి వెళ్లాము. అతను సాక్షి అయినప్పటినుండి నేను అతన్ని యింకా ఎక్కువ మెచ్చుకుంటున్నాను. అతను మీ ప్రజల కొరకు ఎంతో చేశాడు. యెహోవా సాక్షుల గురించి మాకు యింకా చెప్పండి.”
ఒక గంటసేపు చర్చ కొనసాగింది, దాని తర్వాత ఒక డజనుకంటే ఎక్కువ పత్రికలు, బ్రోషూర్లు పంచిపెట్టబడ్డాయి. రెండవసారి కల్సిన తర్వాత, సహాయ సామాగ్రి సెరజేవోలోని సహోదరులకు పంపబడేందుకు, ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికి సైనికాధికారి ఒప్పుకున్నాడు.
ఇది చిన్న వ్యవహారం కాదు. దాదాపు 30 వ్యక్తులు, కొంతమంది సాక్షులు కానివారు కూడా, ఒక్కొక్కటి 27 కిలోల బరువున్న పార్సల్లను దింపారు. వాళ్లు రాత్రి 8:00 నుండి ఉదయం 5:00 వరకు, రెండు వేర్వేరు రాత్రులు—మొత్తం 18 గంటలు శ్రమపడ్డారు. సహాయపనిని చూసి తన పొరుగువారు ఎంతగా ముగ్ధులయ్యారంటే, వారు సహోదరులతో కలిసి మోకాళ్లూని యెహోవాకు కృతజ్ఞతలు తెలిపారని ఒక పెద్ద చెప్పాడు! వాస్తవానికి, వారికి కూడా కొంత ఆహారం లభించింది.
దాదాపు 11,000 కిలోల సహాయ సామాగ్రిని అందుకున్నప్పుడు మన సహోదరులు అనుభవించిన ఆనందాన్ని ఊహించండి. పరిస్థితి దయనీయంగా ఉంది. ఆ ప్రాంతంలో ఒక కిలో పిండి ధర DM450 నుండి DM1,000 (8,700 రూ. నుండి 19,220 రూ) వరకు ఉంది. ఒక సంచి చెక్క DM400 (7,750 రూ), ఒక లీటరు డీజిల్ నూనె DM30 (620 రూ.) వరకు ఖరీదు చేస్తుంది.
మార్గంలో మేము అనుభవించిన ప్రమాదాలన్నింటికీ, మేము యిప్పుడు ప్రతిఫలాన్ని పొందుతున్నట్లు ఉంది. ఈ సహాయ సామాగ్రిని అందుకున్న మన సహోదరుల ఆనందాన్ని చూసి మేమెంతో సంతోషించాము. అది వాళ్లూ—మేము కూడా—ఎన్నటికీ మర్చిపోలేని అనుభవం. కానీ యిప్పుడు మేము యింటికి తిరిగి వెళ్లే సవాలును గురించి ఆలోచించడం ప్రారంభించాల్సి ఉంది.
యింటికి తిరిగి రావడం
“మేము ఏ మార్గంనుండి తిరిగి వెళ్లాలి?” అని సైనికాధికారిని మేమడిగాము.
“మీరు వచ్చిన దారిలోనే,” అని అతను జవాబిచ్చాడు.
మేము అలసిపోయాము, ఇంధనం తక్కువగా ఉంది, మాకు అదనపు టైర్లులేవు. వర్షం కురవడం మొదలైంది, మేము బురదలో ప్రయాణించలేకపోయాము. మేము దక్షిణంవైపుకు వెళ్లవచ్చా అని సైనికాధికారిని అడిగాము.
“అక్కడ ఘోర యుద్ధాలు జరుగుతున్నాయి, ఒక ఎలుక కూడా క్షేమంగా బయటపడలేదు,” అని అతను చెప్పాడు. అయితే కొంతసేపటికి, అతను మళ్లీ ఆలోచించాడు. “ప్రయత్నించి చూడండి, ఎంతైనా మీరు యిక్కడికే క్షేమంగా రాగలిగారు,” అని అతను అన్నాడు.
మేము ఒక ట్రక్కులోని ఇంధనాన్ని మిగతా మూడు ట్రక్కులలో పోసుకుని ఆ ట్రక్కును వెనకే ఉంచేయాల్సి వచ్చింది. మేము మధ్యరాత్రి బయల్దేరి అడవి మార్గంలో ప్రయాణించి వెళ్లాము.
మా తిరుగు ప్రయాణం సమస్యలు లేకుండా ఏమిలేదు. మేము దాటవల్సిన వంతెనకు కొంతమట్టుకు అడ్డం పెట్టబడి ఉన్న సైనిక ట్రక్కును మేము ఎదుర్కొన్నాము. దాని చక్రాలలో కేవలం ఒకదాన్ని తీస్తే చాలు, మేము వెళ్లడానికి తగినంత స్థలం లభిస్తుందని మేము గమనించాము.
ఒక సాయుధ సైనికునికి మేము విజ్ఞప్తి చేశాము. “మేము ఆ చక్రాన్ని తీసేసి, మేము వంతెన దాటిన తర్వాత మళ్లీ పెట్టవచ్చా?”
తన ఆయుధాన్ని గురిపెడుతూ, “మీరు చక్రాన్ని గనుక ముట్టుకుంటే, నా తుపాకీకి కొంత పని పడుతుంది,” అని జవాబిచ్చాడు.
కాఫీ తయారుచేసి సైనికుడికి ఒక కప్పు యివ్వడం బాగుంటుందని మేము భావించాము. జాగ్రేబ్లో జరిగినటువంటి 1991 అంతర్జాతీయ సమావేశాల గురించి మేము అతనికి కొన్ని గంటలపాటు చెప్పాము. దాని తర్వాత, అతని స్వభావం మెత్తపడింది, మేము చక్రాన్ని మార్చడానికి అతను అనుమతించాడు.
యబ్లానిట్సావద్ద, మేము ప్రయాణించాలి అని అనుకుంటున్న మార్గాన్ని గురించి మాలో ఒకరం ఒక సైనికాధికారితో మాట్లాడాము. తానేమి వింటున్నాడో అతను నమ్మలేకపోయాడు. “మీరు నెరేట్వా లోయలోనుండి వెళ్లాలని అనుకుంటున్నారా?”
అతను కంగారుపడటం అర్థవంతంగానే ఉంది. నెరేట్వా లోయల కొండప్రాంతాలు వేర్వేరు సైనిక గుంపులచేత ఆక్రమింపబడి ఉన్నాయి. వాళ్లు ఎడతెగక ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటున్నారు. దాదాపు 16 కిలోమీటర్ల వరకు, మార్గం మోసకరంగా ఉంది. “ఆ మార్గం పరిస్థితి అలా ఉంది, అయినా మీరు అక్కడినుండే వెళ్లాలని యిష్టపడుతున్నారా?” అని సైనికాధికారి అన్నాడు.
విషయాన్ని పరిశీలించిన తర్వాత, అధికారులు మావెంట ఉంటే మాత్రమే మేము వెళ్లవచ్చని సైనికాధికారి చెప్పాడు. అయితే ఈ అధికారులు మాతో వచ్చేందుకు సుముఖంగాలేరు! చివరకు, వాళ్లు కేవలం అవతలి వైపు వారితో మాట్లాడి, మేము యిక్కడినుండి వెళ్తామనే విషయాన్ని వారికి చెప్పవలసిందిగా మేము విన్నపం చేశాము. మేము మర్నాడు ఉదయం భద్రతా సిబ్బంది లేకుండా బయల్దేరుతాము.
మా ట్రక్కులు మానవహిత సహాయాన్ని తీసుకువెళ్తున్నట్లు మేము పెద్ద అక్షరాలతో రాశాము. ప్రార్థించిన తర్వాత, మేము లోయలోకి ప్రయాణించాము. కాల్పులు జరిగితే, మేము వేగాన్ని పెంచి, అనుమానం కలిగించమని ఒప్పుకున్నాము.
మేము వంతెన దాటి నది అవతలి వైపుకు వెళ్లి, జంతువుల శవాలను, పాడైన ట్రక్కులను, ట్యాంకులను దాటుతూ, మరో లోయగుండా వెళ్లాము. మేము వెళ్లడానికి వీలు లేకుండా, వీధుల్లో మందు పాతరలు ఉన్నాయని మేము హఠాత్తుగా గమనించాము. యిద్దరు సైనికులు ఒక బండ వెనుకనుండి చూసేంత వరకూ మేము హారన్ మ్రోగించాము. “మీరెవరు? మీకేం కావాలి?” అని వాళ్లు నిలదీశారు.
మమ్మల్ని గురించి మేము చెప్పుకున్న తర్వాత, వాళ్లు బాంబులను తీసేయగలరా అని మేమడిగాము, అందుకు వాళ్లు అంగీకరించారు. చివరకు, మేము అవతలివైపుకు చేరుకున్నాము.
అక్కడున్న సైనికులు మమ్మల్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. వాళ్లు దాక్కుని ఉన్న స్థలాల్లోనుండి మెల్లగా బయటకు వచ్చి, తమ తుపాకులను మా వైపుకు సూటిగా గురిపెట్టి, మా ట్రక్కువద్దకు వచ్చారు. మేము మా పర్మిట్ కాగితాలను, మా లైసెన్స్ ప్లేట్లను చూపించాము. మేము యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు మా లైసెన్స్ ప్లేట్లను భద్రత కొరకు తీసివేశాము.
“మీరు వస్తారని ఎవ్వరూ అపేక్షించలేదని,” ఒక సైనికుడు చెప్పాడు. “మీరు ఎలా రాగలిగారు?”
మా విన్నపానికి విరుద్ధంగా, మేము వస్తున్నామని ఈ సరిహద్దు చౌకీలోని వాళ్లకెవ్వరికీ చెప్పబడలేదు! ఆ అధికారి యిలా చెప్పడం ప్రారంభించాడు: “మా తుపాకులు కాల్చడానికి సిద్ధంగా ఉన్నాయి, మేము మొదట్లో కాల్పులు ప్రారంభించబోయాము.”
మీరెందుకు కాల్చలేదని మేము అడిగాము.
“నాకు తెలియదు, అది మీ అదృష్టం అయ్యుండవచ్చని నేను నమ్ముతున్నాను. కాని మా ఫీల్డ్ గ్లాసెస్నుండి మేము మిమ్మల్ని చూసినప్పుడు ‘మానవహిత సహాయం’ అనే లేబిల్‌ను మేము చూశాము, మరి మిమ్మల్ని ఏమి చేయాలో మాకు తెలియలేదు. అలా మీరు క్షేమంగా యిక్కడ చేరారు,” అని సైనికుడు జవాబిచ్చాడు. యెహోవా యిచ్చిన రక్షణనుబట్టి మేము తర్వాత ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలను ప్రార్థనల ద్వారా తెలుపుకున్నాము.
వారి పరిస్థితులు కఠినంగా ఉన్నా, బోస్నియాలోని మన సహోదరసహోదరీల స్ఫూర్తి ప్రోత్సహించేదిగా ఉంది. తాము కలిగివున్న వస్తువులతోపాటు విశ్వాసాన్ని, ప్రోత్సాహాన్ని గూర్చిన అనేక మాటలను పంచుకున్నారు. జెనిట్సాలో 2 స్పెషల్ పయినీర్లు, 11మంది సహాయ పయినీర్లు, 14 మంది క్రొత్తగా బాప్తిస్మం తీసుకున్న వారితో కలిపి 40మంది చురుకైన సాక్షులు ఉన్నారు. సెరజేవో పట్టణంలో యిప్పటికీ ఉన్న 65మంది సాక్షులు అలాగే నలుగురు సహాయ పయినీర్లు 134 బైబిలు పఠనాలను నిర్వహిస్తున్నారు. దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్తను గురించి యితరులతో మాట్లాడటంలో సాక్షులు ప్రతినెలా సగటున 20 గంటలు గడుపుతున్నారు.
వాస్తవంగా, యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్త విశ్వాసగృహమునకు చేరినవారు. వారు తమకు విశ్వాసం ద్వారా సంబంధులైన వారికి—తాము యింతవరకూ ఎన్నడు కలవని వారికి కూడా, మంచి చేసేందుకు తమ జీవితాలను యిష్టపూర్వకంగా పణంగా పెడతారు. ఎందుకు? ఎందుకంటే వారు వాళ్లను ప్రేమిస్తారు. యేసుక్రీస్తు యిలా చెప్పాడు: “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు” (యోహాను 13:35) బోస్నియాలోని మన విశ్వాసగృహమునకు చేరినవారి విషయంలో కూడా యిదే కచ్చితంగా జరిగింది.
[24వ పేజీలోని బాక్సు/చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
ఏడ్రియాటిక్ సముద్రం
ఆస్ట్రియా
స్లొవేనియా
హంగేరీ
కృయేషియా
బోస్నియా
సెర్బియా
ట్రావ్నెక్క్
జెనిట్సా
సెరజేవో
[చిత్రాలు]
బోస్నియా మరియు హెర్జిగోవినాకు సహాయ సామాగ్రిని తీసుకువెళ్లడం
[26వ పేజీలోని చిత్రం]
తలక్రిందులుగా ఉన్న ట్రక్కు ప్రక్కన ఉన్న కొంత స్థలంలోనుండి వెళ్లడం