ఒంటరితనం మీ జీవితాన్ని హానికరంగా ప్రభావితం చేయనివ్వకండి
ఒంటరితనం వృద్ధులు మరియు యౌవనస్థుల జీవితాలను ఒకేవిధంగా హానికరంగా ప్రభావితం చేయగలదు. రచయిత్రి అయిన జూడిత్ వియార్స్ట్, రెడ్‌బుక్ అనే పత్రికలో యిలా చెబుతుంది: “ఒంటరితనం గుండెపై ఒక పెద్ద రాయిలా భారంగా ఉండి కృంగదీస్తుంది. . . . ఒంటరితనం మనల్ని శూన్యంగా, నిరాశతో మిగుల్చుతుంది. ఒంటరితనం, మనం తల్లిలేని బిడ్డలా, ఎంతో పెద్దది, అశ్రద్ధగలదీ అయిన ప్రపంచంలో, ఎంతో చిన్నది, దారి తెలియక తప్పిపోయిన గొర్రెపిల్లలా భావించేలా చేస్తుంది.”—సెప్టెంబరు 1991.
స్నేహితులనుండి వేర్పర్చబడటం, పరిచయం లేని పరిస్థితులు, విడాకులు, మృతుల కొరకు దుఃఖించడం, లేక సంభాషణలు తెగిపోడం—యిట్టి అన్ని విధాలైన విషయాలు మిమ్మల్ని ఒంటరి వారిని చేయగలవు. ఇతర ప్రజల మధ్య ఉన్నప్పుడు కూడా, కొంతమంది తీవ్రంగా ఒంటరివారౌతారు.
మీరేమి చేయగలరు?
ఒకవేళ ఒంటరితనం ముట్టడిస్తే, మీరు కేవలం ఒక నిస్సహాయ బాధితులుగా ఉండాలా? ఒంటరితనం మిమ్మల్ని కొద్ది కొద్దిగా నాశనం చేయకుండా లేక జీవించాలనే మీ కోరికను వడియగట్టకుండా మీరేమైనా చేయగలరా? వాస్తవంగా మీరు చేయగలరు. సహాయకరమైన సలహాలెన్నో లభ్యమౌతున్నాయి. దేవుని ప్రేరేపిత వాక్యమైన బైబిలులో, ఎంతో మంచి ఉపదేశం యివ్వబడింది. ఒంటరితనానికి విరుద్ధంగా పోరాడేందుకు మీకు అటువంటి ప్రోత్సాహమే అవసరమై ఉండవచ్చు.—మత్తయి 11:28, 29.
ఉదాహరణకు, దాదాపు 3,000 సంవత్సరాల క్రితం మధ్యప్రాచ్యంలో జీవించిన ఒక యౌవన స్త్రీ అయిన రూతును గూర్చి చదవటం ప్రోత్సాహకరంగా ఉందని మీరు కనుగొనవచ్చు. ఒంటరితనం చేత బాధింపబడే పరిస్థితులు ఆమెకు చాలా ఎక్కువగా ఉండినవి. ఆమె భర్త చనిపోయినప్పుడు, తనకు పరిచయంలేని ఇశ్రాయేలు ప్రాంతంలో జీవించడానికి ఆమె తన అత్త వెంట వెళ్లింది. (రూతు 2:11) ఆమె తన కుటుంబాన్ని, పూర్వపు స్నేహితులను కోల్పోయి, తనకు తెలియని దేశంలో పరదేశిగా ఉన్నా, ఆమె ఒంటరితనం తనను చుట్టుముట్టనిచ్చిందని బైబిలులో ఏ దాఖలాలూ లేవు. మీరు ఆమె కథను బైబిలు పుస్తకమైన రూతులో చదువవచ్చు.
రూతువలె, మీరు అనుకూల దృక్పథాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. మీరు విషయాలను, సంఘటనలను గురించి ఆలోచించే పద్ధతి మీ ఒంటరితనాన్ని పెంచగలదు. నిస్సత్తువ కల్గజేసే అనారోగ్యంతో ఉన్న తన తండ్రికి నాలుగు సంవత్సరాలు సేవ చేసిన ఆన్, దీన్ని దృఢపరుస్తుంది. ఆయన చనిపోయినప్పుడు ఆమె ఎంతో ఒంటరిదయ్యింది. “నేను నిరుపయోగమైనదాన్ని, పూర్తిగా విలువలేనిదాన్ని అయినట్లు—నేనిక ఎవ్వరికీ అవసరం లేనట్లు భావించాను. కానీ నా జీవితమిక మారిపోయిందన్న వాస్తవాన్ని నేను ఎదుర్కొన్నాను, మరి నా ఒంటరితనానికి విరుద్ధంగా పోరాడడానికి, నాకిప్పుడున్న పరిస్థితులను నేను సరిగ్గా ఉపయోగించుకోవాలని నేను గ్రహించాను,” అని ఆమె చెబుతుంది. కొన్నిసార్లు మీరు మీ పరిస్థితులను మార్చలేరు, కానీ వాటిపట్ల మీ దృక్పథాన్ని మాత్రం మీరు మార్చకోగల్గడం సంభావ్యమే.
ప్రతిఫలదాయకమైన కార్యకలాపాల్లో మునిగి ఉండడం కొంతవరకూ సహాయం చేయగల్గినా, ఒంటరితనానికి విరుద్ధంగా పోరాడడానికి అదే జవాబు మాత్రం కాదు. వివాహమైన కేవలం ఆరు నెలలకే విధవరాలు అయిన ఎరేన్, అది తన విషయంలో నిజమని తెలుసుకున్నది. “నాకు తక్కువ పని ఉన్నప్పుడు నన్ను ఒంటరితనం ముట్టడించేదని నేను గమనించాను. అందువల్ల నేను యితరులతో కలిసిపోవడంపై, వారు తమ సమస్యలను ఎదుర్కోడానికి సహాయం చేయడంపై అవధానాన్ని నిలిపాను,” అని ఆమె చెబుతోంది. ఇతరులకు సహాయం చేయడం ఆనందాన్ని తెస్తుంది, మరి ఒంటరిగా ఉన్న క్రైస్తవులు ప్రభువు పనిలో చేయడానికి ఎంతో ఉంది.—అపొస్తలుల కార్యములు 20:35; 1 కొరింథీయులు 15:58.
స్నేహితులను సహాయం చేయనివ్వండి
ది న్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్ ఒంటరి పిల్లలు “స్నేహితులు లేకపోవడమనే గాయాలతో” బాధపడే వారని వర్ణిస్తుంది. (ఏప్రిల్ 28, 1991) అనేకమంది ఒంటరి ప్రజలు, యౌవనులు మరియు వృద్ధులు, స్నేహితులు లేనట్లు భావిస్తారు. కాబట్టి శ్రద్ధగల క్రైస్తవ సంఘం అందించే యథార్థమైన స్నేహాన్ని కలిగుండడం నిజంగా ఒక ప్రయోజనమే. సంఘంలో మీరు ఎక్కువమంది స్నేహితులను కలిగి ఉండడానికి కృషిచేయండి, మరి వాళ్లకు వీలైన మార్గాలలో మీకు సహాయం చేయనివ్వండి. స్నేహితులున్నది అందుకొరకే అనగా కష్టకాలాల్లో మద్దతునివ్వడానికే.—సామెతలు 17:17; 18:24.
అయితే, మీ భావోద్రేక బాధవలన, స్నేహితులు మీకు సహాయం చేయడాన్ని మీరు కష్టతరం చేయకుండా జాగ్రత్త పడండి. ఎలా? జెఫ్రే యంగ్ అనే రచయిత యిలా వివరిస్తున్నాడు: “కొంతమంది ఒంటరి ప్రజలు . . . సంభాషణంతటిని తమ వైపే త్రిప్పుకోడం ద్వారా లేక అప్రీతికరమైన లేక అసందర్భమైన విషయాలు చెప్పడం ద్వారా, సన్నిహిత స్నేహితులను కూడా దూరం చేసుకోవచ్చు. ఏదో ఒక విధంగా, విపరీతంగా ఒంటరిగా ఉన్నవాళ్లు సన్నిహిత సంబంధాలను నాశనం చేస్తుంటారు.”—యు.ఎస్.న్యూస్ & వరల్డ్ రిపోర్ట్, సెప్టెంబరు 17, 1984.
కొన్నిసార్లు, మిమ్మల్ని మీరు యితరులనుండి దూరం చేసుకోడం ద్వారా పరిస్థితిని క్షీణించేదిగా చేయవచ్చు. పీటర్ అనబడే 50 సంవత్సరాలు పైబడిన వ్యక్తి అలాగే చేశాడు. తన భార్య చనిపోయిన తర్వాత, తనకు లోలోపల యితరుల సహాయం కావాలని యిష్టపడినా, అతను యితరుల నుండి తనను తాను దూరపర్చుకుంటున్నట్లు గమనించాడు. “కొన్ని రోజులు, నేను యితరులతో ఉండడానికి ఎంత మాత్రం యిష్టపడేవాన్ని కాదు, అలా కొంత కాలానికి నేను ప్రజలకు అందకుండా అయ్యానని,” ఆయన చెబుతున్నాడు. అది ప్రమాదకరం కావచ్చు. కొంత సమయం ఏకాంతంగా ఉండడం మంచిదే అయినా, ఒంటరిగా ఉండడం వినాశకరంకావచ్చు. (సామెతలు 18:1) పీటర్ దీన్ని గ్రహించాడు. ఆయనిలా చెబుతున్నాడు: “నేను తుదకు దానిని అధిగమించాను, నా పరిస్థితిని ఎదుర్కొన్నాను, మరి నా స్నేహితుల సహాయంతో, నా జీవితాన్ని తిరిగి నిర్మించుకోగలిగాను.”
అయితే, యితరులు మీకు సహాయం చేయవలసిన అగత్యత వాళ్లకుందని మాత్రం భావించకండి. ఎక్కువగా అడిగే వారిగా ఉండకుండా ప్రయత్నించండి. మీకు చూపబడిన దయాగుణాన్ని ఆనందంగా అంగీకరించండి, దానిని గుణగ్రహించినట్లు తెల్పండి. కానీ సామెతలు 25:17 నందు కనుగొనబడిన ఈ మంచి సలహాను మనస్సులో ఉంచుకోండి: “మాటిమాటికి నీ పొరుగువాని యింటికి వెళ్లకుము అతడు నీవలన విసికి నిన్ను ద్వేషించునేమో.” ఫ్రాన్సిస్, 35 సంవత్సరాల వివాహ జీవితం తర్వాత తన భర్త చనిపోయినప్పుడు ఘోరమైన ఒంటరితనాన్ని ఎదుర్కొన్నది, అటువంటి జాగ్రత్త ప్రాముఖ్యమని ఆమె భావిస్తుంది. “మీరు ఆశించే దానిలో సముచితంగా ఉండండి అని, మరి యితరుల నుండి మరీ ఎక్కువ అపేక్షించవద్దు. సహాయం కొరకు వెదుకుతూ ఎప్పుడూ యితరుల యింటికి వెళ్లకండి” అని ఆమె చెబుతోంది.
యెహోవా శ్రద్ధ చూపిస్తాడు
మానవ స్నేహితులు మీకు కొన్నిసార్లు నిరాశ కల్గించినా, మీరు యెహోవా దేవున్ని మీ స్నేహితునిగా కలిగి ఉండవచ్చు. ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడని నిశ్చింతగా ఉండండి. ఆయనయందు మీ నమ్మకాన్ని దృఢంగా ఉంచండి, ఆయన కాపాడే శ్రద్ధయందు ఎడతెగక ఆశ్రయం వెదకండి. (కీర్తన 27:10; 91:1, 2; సామెతలు 3:5, 6) మోయాబీయురాలైన రూతు అలా చేసింది, ఆమె ఎంతో అధికంగా ఆశీర్వదింపబడింది. అంతెందుకు, ఆమె యేసుక్రీస్తు పూర్వీకురాలు అయ్యింది!—రూతు 2:12; 4:17; మత్తయి 1:5, 16.
యెహోవాకు ఎడతెగక ప్రార్థించండి. (కీర్తన 34:4; 62:7, 8) ఒంటరితనంతో పోరాడడానికి ప్రార్థన గొప్ప బలాన్ని యివ్వగల మూలమని మార్గరేట్ కనుగొన్నది. తన భర్త మరణించక ముందు ఆమె అతనితో పూర్తికాల సేవలో పాల్గొన్నది. అతను యౌవన దశలో ఉన్నప్పుడే మరణించాడు. “బిగ్గరగా ప్రార్థిస్తూ, యెహోవాకు నా భయాలను, బాధలన్నింటినీ చెప్పుకోడం మంచిదని నేను కనుగొన్నాను, ఒంటరితనం ముట్టడించినప్పుడు విషయాలను సరైన దృష్టితో చూడడానికి నాకది సహాయం చేసింది. యెహోవా ఆ ప్రార్థనలకు జవాబివ్వడాన్ని చూడడం కూడా నాకు దృఢనమ్మకాన్ని యిచ్చిందని,” ఆమె చెబుతోంది. అపొస్తలుడైన పేతురు సలహాను పాటించడం ద్వారా ఆమె గొప్ప ప్రయోజనాలను పొందింది: “దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి. ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.”—1 పేతురు 5:6, 7; కీర్తన 55:22.
యెహోవాతో సత్సంబంధం, ఒంటరి ప్రజలు తరచుగా కోల్పోయే దాన్ని తిరిగి పొందడానికి మీకు సహాయం చేస్తుంది—అదే ఆత్మవిశ్వాసం. తన భర్త క్యాన్సర్ వలన మరణించినప్పుడు, జర్నలిస్ట్ అయిన జెనెట్ కప్ఫర్మాన్ “ఆత్మవిశ్వాసం లోపించడం, పనికిరామనే భావాలను గురించి” వ్రాసింది. ఆమె యిలా చెప్పింది: “పనికిరామనే ఈ భావమే అనేకమంది విధవరాండ్లను ఆత్మహత్య చేసుకునేంతగా కృంగదీస్తుంది.”
యెహోవా మిమ్మల్ని ఎంతో విలువైన వారిగా పరిగణిస్తున్నాడని జ్ఞాపకముంచుకోండి. మీరు విలువలేని వారని ఆయన భావించడంలేదు. (యోహాను 3:16) దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను గత కాలాల్లో బలపర్చినట్లే ఆయన మిమ్మల్ని కూడా బలపరుస్తాడు. ఆయన వారికిలా చెప్పాడు: “నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.”—యెషయా 41:9, 10.
దేవున్ని నిందించకండి
అతి ప్రాముఖ్యంగా, మీ ఒంటరితనాన్నిబట్టి దేవున్ని నిందించకండి. యెహోవా దానికి బాధ్యుడుకాడు. మీరు, అలాగే మానవజాతి యావత్తు, మంచి సంతృప్తిదాయకమైన భాగస్వామ్యాన్ని ఆనందించాలన్నదే ఎప్పటికీ ఆయన సంకల్పమై ఉంది. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు, ఆయనిలా చెప్పాడు: “నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదును.” (ఆదికాండము 2:18) మొదటి స్త్రీ అయిన హవ్వను ఆయన సృష్టించినప్పుడు దేవుడు చేసింది అదే. సాతాను తిరుగుబాటు చేయకుండా ఉండి ఉంటే, పురుషుడు మరియు స్త్రీ, వారు ఉత్పత్తి చేసిన సంతానం, ఒంటరితనాన్ని ఎన్నటికీ అనుభవించి ఉండేవారు కాదు.
యెహోవా దుష్టత్వాన్ని కొద్ది కాలంవరకు అనుమతించడం, నిజంగానే ఒంటరితనం పెరగడానికి, అలాగే యితర బాధలు కల్గడానికి దారితీసింది. అయితే, యిది కేవలం తాత్కాలికమేనని మదిలో సృష్టంగా ఉంచుకోండి. ఒంటరితనపు శ్రమలను, తన నూతన ప్రపంచంలో దేవుడు మీ కొరకు ఏమి చేస్తాడన్నదాని వెలుగులో దృష్టించడం వలన, ఆ శ్రమలను భరించడం తక్కువ కష్టంగా ఉంటుంది. ఈ మధ్యలో ఆయన మీకు మద్దతును, ఓదార్పును యిస్తాడు.—కీర్తన 18:2; ఫిలిప్పీయులు 4:6, 7.
దాన్ని తెలుసుకోడం మీకు శక్తినివ్వగలదు. (ముందు ప్రస్తావించబడిన) ఫ్రాన్సిస్ విధవరాలైనప్పుడు, ప్రాముఖ్యంగా రాత్రులందు, కీర్తన 4:8లోని మాటలయందు ఆమె గొప్ప ఓదార్పును కనుగొన్నది: “యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.” కీర్తనల గ్రంథంలో కనుగొనబడే అట్టి భావాలపై ధ్యానముంచండి. కీర్తన 23:1-3నందు వ్యక్తపర్చినట్లు, దేవుడు మీపట్ల ఎలా శ్రద్ధ వహిస్తున్నాడో దానిని ధ్యానించండి.
ఒంటరివాళ్లకు ఎలా సహాయం చేయవచ్చు?
ఒంటరివాళ్లకు సహాయం చేయడంలో మొదటి మార్గం వారియెడల ప్రేమ చూపడమే. ప్రాముఖ్యంగా కష్ట సమయాల్లో, ఒకరికొకరు ప్రేమను చూపుకొనమని దేవుని ప్రజలను బైబిలు పదే పదే ప్రోత్సహిస్తుంది. “సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై” ఉండాలని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (రోమీయులు 12:10) వాస్తవానికి, దేవుని ప్రేరేపిత వాక్యమిలా చెబుతోంది: “ప్రేమ శాశ్వతకాలముండును.” (1 కొరింథీయులు 13:8) ఒంటరిగా ఉన్న వారికి మీరెలా ప్రేమ చూపగలరు?
ఒంటరిగా ఉండే ప్రజలను నిరాకరించడం లేక అలక్ష్యం చేసే బదులు, వీలైనప్పుడల్లా వారికి సహనంతో సహాయం చేయడం ద్వారా శ్రద్ధగల వ్యక్తులు వారియెడల తమ అనురాగాన్ని చూపగలరు. “ఏలయనగా మొఱ్ఱపెట్టిన దీనులను తండ్రి లేనివారిని సహాయములేనివారిని నేను విడిపించితిని. . . . విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టితిని,” అని చెప్పిన యోబువలే వాళ్లుండగలరు. (యోబు 29:12, 13) క్రైస్తవ సంఘంలోని నియమింపబడిన పెద్దలు మరియు అనురాగంగల స్నేహితులు కూడా సాధారణమైన మానవ అవసరతలైన అర్థం చేసుకోడం, ఆప్యాయత చూపడం, ఓదార్పునివ్వడం వంటివి చేయడం ద్వారా అదే దయాపూర్వక పద్ధతిలో ప్రవర్తించగలరు. వారు సహానుభూతి చూపగలరు, మరి కొన్నిసార్లు వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు వినవలసిన అవసరం కూడా కలుగవచ్చు.—1 పేతురు 3:8.
తరచుగా, ఒంటరివారి కొరకు స్నేహితులు చేసే చిన్న పనులే చాలా ప్రాముఖ్యమైనవి. ఉదాహరణకు, ఒక తోటి విశ్వాసి మరణమందు తమ ప్రియమైన వారిని కోల్పోతే, నిజమైన స్నేహాన్ని చూపే దయాపూర్వక చర్యల ద్వారా ఎంతో మేలును సాధించవచ్చు. భోజనానికి ఆహ్వానించడం, ఆప్యాయతతో వినడం, లేక సంభాషణను ప్రోత్సహించడం వంటి చిన్న దయాపూర్వక క్రియలను చిన్నచూపు చూడకండి. ఒంటరితనానికి విరుద్ధంగా పోరాడేందుకు ఒక వ్యక్తికి సహాయం చేయడానికి ఈ విషయాలు ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయి.—హెబ్రీయులు 13:16.
అప్పుడప్పుడు మనందరం ఒంటరితనాన్ని అనుభవిస్తాము. అయినా, ఒంటరితనం ఒక శిక్ష కానవసరం లేదు. మీ జీవితాన్ని అర్థవంతమైన, నిర్మాణాత్మకమైన కార్యకలాపాలతో నింపుకోండి. వారికి వీలైనప్పుడు స్నేహితులను సహాయం చేయనివ్వండి. యెహోవా దేవునియెడల విశ్వాసాన్ని కలిగి ఉండండి. కీర్తన 34:19లో వ్రాయబడి ఉన్న ప్రోత్సాహకరమైన వాగ్దానాన్ని మనస్సులో ఉంచుకోండి: “నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నింటిలోనుండి యెహోవా వానిని విడిపించును.” సహాయం కొరకు యెహోవా వైపు తిరగండి, మరి ఒంటరితనం మీ జీవితాన్ని హానికరంగా ప్రభావితం చేయనివ్వకండి.
[24వ పేజీలోని బాక్సు]
ఒంటరితనానికి విరుద్ధంగా పోరాడడానికి కొన్ని మార్గాలు
▪ యెహోవాకు దగ్గరవ్వండి.
▪ బైబిలు చదవడం ద్వారా ఓదార్పు పొందండి
▪ అనుకూలమైన క్రైస్తవ దృక్పథాన్ని కలిగి ఉండండి.
▪ అర్థవంతమైన కార్యకలాపంలో నిమగ్నమవ్వండి
▪ ఎక్కువమంది స్నేహితులను చేసుకోండి
▪ స్నేహితులు మీకు సహాయపడడాన్ని సులభం చేయండి
▪ మిమ్మల్ని మీరు వేర్పర్చుకోకండి, కానీ అందరికీ చూపగల ప్రేమను పెంపొందించుకోండి
▪ యెహోవా మీపట్ల శ్రద్ధకలిగి ఉన్నాడనే దృఢనమ్మకాన్ని కలిగి ఉండండి
[24వ పేజీలోని బాక్సు]
ఒంటరివారికి మీరెలా సహాయం చేయగలరు
▪ అవగాహనను, ఆప్యాయతను, ఓదార్పును అందివ్వండి
▪ వ్యక్తిగతంగా మాట్లాడే అవసరతను తీర్చండి
▪ సహాయం చేయగల చిన్న పనులను ఎడతెగక చేయండి
[23వ పేజీలోని చిత్రం]
తనకు కష్టతరమైన పరిస్థితులు ఉన్నా, రూతు ఒంటరితనం తన జీవితాన్ని హానికరంగా ప్రభావితం చేయడానికి అనుమతించలేదు.