కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 7/15 పేజీలు 28-30
  • యూదా క్యాలండరు ఎంతమేరకు కచ్చితమైనది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యూదా క్యాలండరు ఎంతమేరకు కచ్చితమైనది?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రారంభదశను స్థిరపర్చుట
  • “సృష్టి శకం”
  • కాలక్రమ వృత్తాంతానికి ఆధారం
  • పారంపర్యాచారాలు మరియు వివరణలు
  • ఒక మతపరమైన అవశేషము
  • మెస్సీయ రావడాన్ని దానియేలు ప్రవచనం తెలియజేసిన విధానం
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 7/15 పేజీలు 28-30

యూదా క్యాలండరు ఎంతమేరకు కచ్చితమైనది?

యూదా క్యాలండరు ప్రకారం, గురువారం సెప్టెంబరు 16, 1993, రోష్‌ హషానా పండుగదినము. సాంప్రదాయానుసారంగా, నూతన సంవత్సర ఆగమనాన్ని ప్రకటించడానికి షోఫార్‌ లేక పొట్టేలు కొమ్ము బూర ఊదబడేది. అది 5754వ సంవత్సరం (యూదా క్యాలండరు), ఆ సంవత్సరం సెప్టెంబరు 16, 1993, నుండి సెప్టెంబరు 5, 1994 వరకు కొనసాగుతుంది.

అయితే, యూదాకాల లెక్కింపు మరియు ఇప్పుడు సామాన్యంగా వాడుకలో ఉన్న పాశ్చాత్య లేక గ్రెగోరియన్‌ క్యాలండరుకు మధ్య 3,760 సంవత్సరాల వ్యత్యాసముందని మనకు వెంటనే అర్థమౌతుంది. ఈ వ్యత్యాసం ఎందుకు ఉంది? మరి యూదా క్యాలండరు ఎంత కచ్చితమైనది?

ప్రారంభదశను స్థిరపర్చుట

కాలాన్ని లెక్కించే ఏ పద్ధతికైనా ఒక ప్రత్యేకమైన ప్రారంభం లేక నిర్దేశకాంశం ఉండాలి. ఉదాహరణకు, క్రైస్తవమత సామ్రాజ్యం క్రీస్తు జన్మించాడని తలంచబడే సంవత్సరం నుండి కాలాన్ని లెక్కిస్తుంది. అప్పటినుండి తారీఖులు క్రైస్తవ శకమందున్నాయని చెప్పబడుతున్నాయి. “మన ప్రభువు దినమందు,” అనే అర్థాన్నిచ్చే అన్నో డొమిని అనే లాటిన్‌ పదం నుండి వచ్చిన ఎ.డి. అనే సంకేతంతో తరుచుగా అవి పిలువబడుతున్నాయి. ఆ కాలానికి ముందున్న తారీఖులను “క్రీస్తు పూర్వము,” అంటే బి.సి., తో గుర్తిస్తున్నారు.a అలాగే సాంప్రదాయబద్ధమైన చైనీయులు పసుపువర్ణ పౌరాణిక చక్రవర్తియైన, వాన్‌-ది పరిపాలనారంభము అంటే, సా.శ.పూ. 2698 నుండి కాలాన్ని లెక్కిస్తారు. ఆవిధంగా, చైనీయుల 4692వ చంద్రమాన సంవత్సరారంభము ఫిబ్రవరి 10, 1994, అని గుర్తింపబడింది. అయితే, యూదా క్యాలండరు విషయమేమిటి?

ది జూవిష్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెబుతోంది: “ఒక సంఘటనా తారీఖును గుర్తించడానికి యూదుల మధ్య ప్రస్తుతం వాడుకలో ఉన్న పద్ధతి ఏమంటే లోకం సృష్టింపబడినప్పటి నుండి ఆ సంఘటన వరకు ఎన్ని సంవత్సరాలు గడచిపోయాయని తెలియజేయడమే.” యూదులలో సృష్టిశకం అని పిలువబడే ఈ పద్ధతి సుమారు సా.శ. తొమ్మిదవ శతాబ్దమందు సామాన్య వాడుకలోకి వచ్చింది. కనుక యూదా క్యాలండరులోని తారీఖుల ముందు ఎ.ఎమ్‌ అనే గుర్తు ఉంటుంది. ఆనో మన్‌దే అనే ఈ పదము, “లోకం సృష్టింపబడినప్పటి నుండి,” అనే అర్థాన్నిచ్చే ఆబ్‌ క్రియాత్యోనె మన్‌దే యొక్క సంక్షిప్త రూపము. ఇది ప్రామాణికంగా ఉంది. కాలాన్ని లెక్కించే ఈ పద్ధతి ప్రకారం, ఈ సంవత్సరం ఎ.ఎమ్‌. 5,754 అంటే, “లోకసృష్టి,” 5,753 సంవత్సరాల క్రితం జరిగినట్లు భావించబడుతున్నది. అది ఎలా నిర్ణయించబడిందో చూద్దాము.

“సృష్టి శకం”

ఎన్‌సైక్లోపీడియా జుడైకా (1971) ఈ వివరణను అందిస్తోంది: “వేరువేరు రబ్బూనీయుల వ్రాతపూర్వక లెక్కలలో, ‘సృష్టి శకం’ సా.శ.పూ 3762 మరియు 3758 మధ్య సంవత్సరాలలోని ఏదొక శరత్కాలంలో ఆరంభమయ్యింది. ఏమైనప్పటికీ, సా.శ.పూ. 3761 (కచ్చితంగా చెప్పాలంటే, ఆ సంవత్సరపు అక్టోబరు, 7) నందు సృష్టి శకం ఆరంభమయ్యిందని సా.శ. 12వ శతాబ్దం నుండి అంగీకరించబడింది. ఈ గణాంకము బైబిలులో తెలియజేయబడిన కాలమాన వివరాలు ఆ తర్వాతి తొలి యూదా సాహిత్యమందు కనుగొనబడిన లెక్కల కలయికపై ఆధారపడి ఉంది.”

“లోకం సృష్టింపబడినప్పటి,” నుండి తారీఖులను లెక్కించే ఈ పద్ధతి ప్రముఖంగా బైబిలు వృత్తాంతానికి రబ్బీలు అందించిన వివరణపై ఆధారపడి ఉంది. అక్షరార్థమైన ఆరు 24-గంటల దినాలలోనే లోకము, దానిలో ఉన్నదంతా సృష్టింపబడిందనే తమ నమ్మకాన్ని బట్టి, రబ్బీ వ్రాతల పండితులు, అలాగే క్రైస్తవమత సామ్రాజ్యంలోని వారు, లోకం సృష్టింపబడిన అదే సంవత్సరమందు మొదటి మానవుడైన, ఆదాము సృష్టింపబడ్డాడని అనుకుంటారు. అయినప్పటికిని, ఇది వాస్తవికతకు బహు దూరంగా ఉంది.

ఆదికాండము మొదటి అధ్యాయం ఇలా ప్రారంభమవుతోంది: “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.” తరువాత “నిరాకారముగాను శూన్యముగాను” ఉన్న స్థితి నుండి మానవులకు తగిన నివాస స్థలంగా భూమిని మార్చడానికి ఒక దానివెంబడి మరొకటి వచ్చే ఆరు “దినములలో” దేవుడు చేసిన దానిని వర్ణిస్తుంది. (ఆదికాండము 1:1, 2) ఈ రెండు దశల మధ్య లక్షలాది సంవత్సరాలు గతించిపోయి ఉంటాయి. అంతేకాకుండా, సృష్టికర్త యొక్క కార్యాలు ఏదో ఒక హద్దుకు పరిమితమైనట్లు, సృష్టిదినాలు 24-గంటల సమయం కాదు. ఈ సందర్భమందు ఆ ఒక “దినము” 24-గంటలకన్నా సుదీర్ఘమైనదని, సృష్టి కాలములన్నింటిని కలిపి ఒక “దినము”గా మాట్లాడుతున్న, ఆదికాండము 2:4 ద్వారా అర్థమౌతుంది. మొదటి సృష్టి దినానికి మరియు ఆదాము సృష్టింపబడిన ఆరవ సృష్టి దినానికి మధ్య అనేక వేల సంవత్సరాలు గడిచాయి. ఆదాము సృష్టింపబడిన తారీఖును భౌతిక భూమ్యాకాశములు సృష్టించబడిన తేదీగా లెక్కించడం అటు లేఖనాధారమైంది యిటు విజ్ఞాన శాస్త్రీయమైంది కాదు. అయినా, “సృష్టి శకము,” సా.శ.పూ. 3761లో ఆరంభమయ్యిందని ఎలా నిర్ణయించబడింది?

కాలక్రమ వృత్తాంతానికి ఆధారం

కాలవశాత్తు, పరిశీలనలో ఉన్న ఈ లెక్కలకు ఆధారమయిన యూదా సాహిత్యాలలో అనేకం ఉనికిలో లేవు. మిగిలి ఉన్నదల్లా ఒక కాలవృత్తాంతాన్ని చూపిన పుస్తకమే. మొదట్లో సాదర్‌ ఒలామ్‌ (ప్రపంచ క్రమం) అని యిది పిలువబడింది. అది సా.శ రెండవ శతాబ్దం నాటి టాల్‌ముడిక్‌ పండితుడైన యోసా బెన్‌ హాలాఫ్తాదని ఆరోపింపబడింది. ఈ వృత్తాంతాలు (సాదర్‌ ఒలామ్‌ జూటా అనే పేరుగల మధ్యయుగ కాలవృత్తాంతం నుండి దానిని వేరుచేయడానికి సేదర్‌ ఒలామ్‌ రాబా అని తరువాత పిలిచారు) ఆదాము నుండి అబద్ధపు మెస్సియా అయిన బార్‌ కోక్‌జిబా ఆధ్వర్యాన రోమునకు వ్యతిరేకంగా యూదా తిరుగుబాటు జరిగిన సా.శ. రెండవ శతాబ్దం వరకు గల కాలవృత్తాంత చరిత్రను అందిస్తోంది. ఆ సమాచారాన్ని రచయిత ఎలా సంపాదించాడు?

యోసా బెన్‌ హాలాఫ్తా బైబిలును అనుసరించడానికి ప్రయత్నించినప్పటికిని, తారీఖుల విషయంలో వచనము స్పష్టమైన వివరణనందించనప్పుడు తన స్వంత వివరణలను ఆయన చేర్చాడు. “అనేక సందర్భాలలో ఆయన . . . సాంప్రదాయ ప్రకారంగా వివరణలను చేర్చడంతోపాటు ముందున్న రబ్బీల మరియు సమకాలీకుల హాలాకోత్‌ [సాంప్రదాయములను] చేర్చాడని,” జూవిష్‌ ఎన్‌సైక్లోపీడియా చెబుతోంది. ఇతరులు వారి అంచనాలలో తక్కువ వారే. ది బుక్‌ ఆఫ్‌ జూవిష్‌ నాలెడ్జ్‌ ఇలా నొక్కి చెబుతోంది: “సృష్టి శకం నుండి ఆయన లెక్కించాడు. మరి దాని ప్రకారంగా, మొదటి మానవుడైన ఆదాము నుండి అలెగ్జాండర్‌ ది గ్రేట్‌ వరకు జరిగాయని ఊహించిన వేరువేరు యూదా సంఘటనలకు కల్పితమైన తేదీలను నిర్ణయించాడు.” కాని అటువంటి వివరణలు, చేర్పులు యూదా క్యాలండరు యొక్క కచ్చితత్వాన్ని, ప్రామాణికత్వాన్ని ఎలా ప్రభావితం చేశాయి? చూద్దాం.

పారంపర్యాచారాలు మరియు వివరణలు

రబ్బీ సాంప్రదాయానుసారంగా యోసా బెన్‌ హాలాఫ్తా, యెరూషలేములో రెండవసారి నిర్మింపబడిన దేవాలయము మొత్తం 420 సంవత్సరాలు నిలిచిందని లెక్కించాడు. ఇది “డెభ్భై వారములు” లేక 490 సంవత్సరములను గూర్చిన దానియేలు ప్రవచనం యొక్క రబ్బూనీయుల వివరణపై ఆధారపడి ఉంది. (దానియేలు 9:24) మొదటి దేవాలయ నాశనానికి మరియు రెండవసారి నిర్మింపబడిన దేవాలయ వినాశనానికి మధ్యనున్న వ్యవధికి ఈ కాలం అన్వయింపబడింది. బబులోనులో చెరగా గడిపిన 70 సంవత్సరాలు తీసివేసే, రెండవసారి నిర్మింపబడిన దేవాలయం 420 సంవత్సరాలు నిలిచిందనే ముగింపుకి యోసే బెన్‌ హాలాఫ్తా వచ్చాడు.

ఏమైనప్పటికిని, ఈ వివరణ ఒక గంభీరమైన సమస్యను లేవదీసింది. బబులోను కూలద్రోయబడిన సంవత్సరం (సా.శ.పూ. 539), రెండవ దేవాలయ నాశనం (సా.శ. 70) ఇవి రెండూ చారిత్రాత్మకంగా తెలిసిన తారీఖులే. ఇందునుబట్టి, రెండవ దేవాలయ కాలనిడివి 420 సంవత్సరాలకు బదులు 606 సంవత్సరాలై ఉండాలి. ఈ కాలనిడివికి 420 సంవత్సరాలు మాత్రమే నిర్ణయించడం వల్ల, యూదా కాలక్రమ వివరణకు 186 సంవత్సరాలు తక్కువయ్యాయి.

దానియేలు ప్రవచనం యెరూషలేము నందు దేవాలయం ఎంతకాలం నిలిచి ఉంటుందనే దానిని గూర్చింది కాదు. గానీ, అది మెస్సీయా ప్రత్యక్షమయ్యే కాలాన్ని ప్రవచించింది. “యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని నాయకుడైన మెస్సీయా వచ్చు వరకు ఏడువారములు, ఆపైన అరువదిరెండు వారములు పట్టును” అని ప్రవచనం స్పష్టంగా సూచిస్తున్నది. (దానియేలు 9:25, 26 NW) యూదులు చెరనుండి తిరిగి వచ్చిన రెండవ సంవత్సరమందు దేవాలయ పునాది వేయబడినప్పటికిని (సా.శ.పూ. 536), “అర్తహషస్త రాజు ఏలుబడికాలమున ఇరువదియవ సంవత్సరం,” వరకు యెరూషలేమును పునర్నిర్మించడానికి “ఆజ్ఞ” బయలుదేర లేదు. (నెహెమ్యా 2:1-8) కచ్చితమైన లౌకిక చరిత్ర ఆ సంవత్సరం సా.శ.పూ. 455గా స్థిరపరుస్తుంది. మనం 69 “వారములు” లేక 483 సంవత్సరములు ముందుకు లెక్కిస్తే, మనలను అది సా.శ. 29కి తీసుకొస్తుంది. అప్పుడే యేసు బాప్తిస్మముపొంది మెస్సీయాగా ప్రత్యక్షమయ్యాడు.b

యూదా కాలక్రమ వృత్తాంతమందు ఒక పెద్ద పరస్పర విరుద్ధతను తెచ్చిన రబ్బూనీయ వివరణల మరొక దృక్పథం అబ్రాహాము జన్మించిన కాలానికి సంబంధించినది. ఆదికాండము 11:10-26 నందు నమోదుచేయబడిన తరాల వరుస సంవత్సరాలను రబ్బీనీయులు ఆధారంగా తీసుకుని మరియు జలప్రళయము నుండి అబ్రాహాము (అబ్రాము) జన్మము వరకున్న కాలాన్ని 292 సంవత్సరములని నిర్ణయించారు. అయినను, ఆదికాండము 11:26వ వచనానికి రబ్బూనీయులు యిచ్చు వివరణ సమస్యను లేవదీస్తుంది. అదిలా చెబుతోంది: “తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహోరును హారానును కనెను.” ఈ వచనాన్ని బట్టి, యూదా సాంప్రదాయము అబ్రాము జన్మించినప్పుడు తెరహుకు డెబ్భై ఏండ్లని భావిస్తున్నది. అయినా, డెబ్భైయవ ఏట తెరహు అబ్రాహామును కనెనని నిర్దిష్టంగా చెప్పడం లేదు. బదులుగా, తన డెబ్భై ఏండ్ల వయస్సు తరువాత ఆయన ముగ్గురు కుమారులకు తండ్రి అయ్యాడని మాత్రమే అది చెబుతోంది.

అబ్రాహాము జన్మించినప్పుడు తెరహు యొక్క సరియైన వయస్సుని కనుగొనడానికి, బైబిలు వివరణను మాత్రమే మనము చదువవల్సిన అవసరత ఉంది. ఆదికాండము 11:32–ఆదికాండము 11:32 నుండి 12:4ను బట్టి, 205వ ఏట తెరహు మరణము పొందిన తరువాత యెహోవా ఆజ్ఞతో అబ్రాహాము మరియు ఆయన కుటుంబము హారాను విడిచి వెళ్లారని మనం తెలుసుకుంటాము. ఆ సమయమందు అబ్రాహాము వయస్సు 75 ఏండ్లు. అందునుబట్టి, తెరహుకు 70 ఏండ్ల వయస్సున్నప్పుడు జన్మించడానికి బదులు, 130 ఏండ్లప్పుడు అబ్రాహాము జన్మించి ఉండవచ్చును. ఆవిధంగా, జలప్రళయము నుండి అబ్రాహాము జన్మించినప్పటి వరకున్న కాలనిడివి 292 సంవత్సరాలకు బదులు, 352 సంవత్సరాలు. ఇక్కడ యూదా కాలక్రమ వృత్తాంతం 60 సంవత్సరాలను తప్పుగా లెక్కించింది.

ఒక మతపరమైన అవశేషము

సేదర్‌ ‘ఒలామ్‌ రాబా’ మరియు ఇతర టాల్‌ముడిక్‌ వృత్తాంత పుస్తకాలలోని అటువంటి పొరపాట్లు మరియు పరస్పర విరుద్ధతలు యూదా పండితుల మధ్య అత్యంత కలవరానికి, ఆలోచింపజేసే తర్కనలకు కారణమయ్యాయి. తెలిసిన చారిత్రక వాస్తవములతో ఈ వృత్తాంతములను సమన్వయపర్చడానికి అనేకమైన ప్రయత్నాలు జరిగినా అవి పూర్తిగా విజయవంతం కాలేదు. ఎందుకు? ఎందుకంటే, “మతపరంగా మరింత విద్యావంతంగా ఉండడం గాక, భిన్నమైన మతశాఖల ఎదుట, అన్ని రకాలుగా సాంప్రదాయం సమర్థించబడాలనేదే వారి పట్టుదల” అని ఎన్‌సైక్లోపీడియా జుడయికా చెబుతున్నది. తమ సాంప్రదాయం వలన వచ్చిన గలిబిలిని తొలగించడానికి బదులు, కొంతమంది యూదా పండితులు బైబిలు వివరణలను ఘనహీన పర్చడానికి ప్రయత్నించారు. ఇతరులు బబులోనీయుల, ఐగుప్తీయుల, మరియు హిందూ పురాణాలు, సాంప్రదాయాలలో మద్దతు పొందడానికి ప్రయత్నించారు.

తత్ఫలితంగా, చరిత్రకారులు “సృష్టి శకమును” కాలక్రమ వృత్తాంతములో ఒక నమ్మదగిన ఆధారంగా దృష్టించడం లేదు. దానిని సమర్థించడానికి ప్రయాసపడే యూదా పండితులు కొందరే ఉన్నారు. అధికారపూర్వక సూచనలిచ్చే పుస్తకాలైన ది జూవిష్‌ ఎన్‌సైక్లోపీడియా మరియు ఎన్‌సైక్లోపీడియా జుడయికా లాంటివి సహితం దాని యెడల సాధారణంగా ప్రతికూల దృక్పథాన్నే కల్గివున్నాయి. ఇందునుబట్టే, లోకం సృష్టింపబడినప్పటి నుండి కాలాన్ని లెక్కించే సాంప్రదాయ యూదా పద్ధతి, యెహోవా దేవుని యొక్క వెల్లడిచేయబడిన ప్రవచనాత్మక కాలక్రమ పట్టిక అయిన బైబిలు కాలక్రమ వృత్తాంత దృక్పథం నుండి చూస్తే కచ్చితమైనదిగా దృష్టింపబడటానికి వీలులేదు.

[అధస్సూచీలు]

a బైబిలు ఆధారిత మరియు చారిత్రాత్మకమైన రుజువులు రెండూ యేసుక్రీస్తు సా.శ.పూ. 2వ సంవత్సరమందు జన్మించాడని సూచిస్తున్నాయి. అందునుబట్టి, ప్రామాణికత కొరకు, సా.శ. (సామాన్య శకం) మరియు సా.శ.పూ (సామాన్య శక పూర్వం) అనే పేర్లను ఉపయోగించడానికి అనేకులు ఎంచుకుంటారు, వాచ్‌టవర్‌ సంస్థ ప్రచురణలలో తారీఖులను చూపించే విధానమిదే.

b వివరాల కొరకు వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సంస్థ ప్రచురించిన ఇన్‌సైట్‌ ఆన్‌ ది స్క్రిప్చ్‌ర్స్‌, వాల్యుమ్‌ 2, 614-16, 900-902 పేజీలను అలాగే, ఆల్‌ స్క్రిప్చర్స్‌ ఈజ్‌ ఇన్‌స్పయిర్డ్‌ ఆఫ్‌ గాడ్‌ అండ్‌ బెనిఫిషియల్‌, స్టడీ నెంబరు 3, పేరా. 18; ఇంకా W92 10/1 11వ పేజీ 8-11 పేరాలను చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి