కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 4/15 పేజీలు 21-26
  • అలస్కా చివరి సరిహద్దుపైనున్న తెరను తొలగించడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అలస్కా చివరి సరిహద్దుపైనున్న తెరను తొలగించడం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఓ బాధాకరమైన పరివర్తన
  • సాక్ష్యమివ్వడానికి తొలి ప్రయత్నాలు
  • అపేక్షించని సహాయం అందొస్తుంది
  • అల్యేటియన్‌ ద్వీప పరంపర క్రిందికి
  • మెల్లిగా వేడెక్కే ధోరణి
  • సరిహద్దు అవతలికి అడుగిడడం
  • చేసిన ప్రయత్నానికి తగ్గ ఫలితం లభించిందా?
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 4/15 పేజీలు 21-26

అలస్కా చివరి సరిహద్దుపైనున్న తెరను తొలగించడం

ఇప్పటికి దాదాపు రెండు రోజులుగా, బంగారం అన్వేషణకు పేరుగాంచిన అలస్కా నందలి నోమ్‌ నగరంలో మేం నలుగురమూ ఓ కిక్కిరిసిన గదిలో యిరుక్కుని ఉన్నాము. నలభై వేల మంది అన్వేషకులు ఒకే ఒక దానికొరకు 1898లో ఈ ప్రాంతంలో కూడుకున్నారు, అదే బంగారం! మేము మాత్రం మరోవైపు వేరే ధనాన్ని వెదుకుతున్నాము.

ఆ సమయంలో మా ఆసక్తి, బెరింగ్‌ సెయిట్‌కు పడమరన 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెయింట్‌ లారెన్స్‌ ద్వీపంపై గాంబెల్‌, సావుంజా, నందలి విడి గ్రామాల్లో జీవించే ‘యిష్టవస్తువులపై’ ఉంది. (హగ్గయి 2:7) అక్కడ ఇన్యూట్‌లు మునుపు సంయుక్త రాష్ట్రాలుగా ఉన్న దాన్నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఆర్కిటిక్‌ మంచుగడ్డలతో కూడిన నీటిని ధైర్యంగా ఎదుర్కొంటూ తిమింగలాలను వేటాడుతుంటారు. అయితే విస్తారంగా కురుస్తున్న మంచూ బూడిద వర్ణంలో ఉన్న దట్టమైన పొగమంచు మమ్మల్ని బంధించింది మా విమానం నేల మీదికి దిగింది.

మేము వేచివుంటుండగా, గత కొన్ని సంవత్సరాల్లో సంభవించిన సంఘటనలను నేను జ్ఞాపకం చేసుకుని, సుదూరంగా ఉన్న ప్రాంతాల్లో సాక్ష్యమిచ్చే పనిని యెహోవా దేవుడు ఆశీర్వదించినందుకు యెహోవాకు కృతజ్ఞతలు తెల్పుకున్నాను. ప్రపంచ చివరి సరిహద్దు అని అనేకులు పిలుస్తున్న అలస్కాలో 150 కంటే అధిక సుదూర ప్రాంతాల్లో జీవిస్తున్న 60,000 మంది ప్రజలు 16,00,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న అడవిలో నివసిస్తున్నారు. వీటికి ఏ విధమైన రహదారులు లేవు. వాచ్‌టవర్‌ సొసైటీ వారి విమాన సహాయంతో దేవుని రాజ్య సువార్తను తీసుకుని అప్పటికే మేం మూడు వంతుల ఈ సుదూర గ్రామాలను చేరాము.—మత్తయి 24:14.

ఈ సుదూర నివాస స్థలాలను చేరడానికి, రోజుల కొలదీ నేలను కప్పి ఉంచే మేఘాలూ పొగ మంచు కారణంగా ఆ విమానం తరచూ నేల మీద దిగాల్సి వచ్చేది. ఒక సారి దిగిన తర్వాత, చొచ్చుకు పోవాల్సిన మరో దట్టమైన పొగ మంచు ఉంది. ఓ తెరలా అది, ఈ దయాపూర్ణులూ శాంతి ప్రియులైన ప్రజల మనస్సులనూ హృదయాలనూ కప్పివేస్తుంది.—2 కొరింథీయులు 3:15, 16 పోల్చండి.

ఓ బాధాకరమైన పరివర్తన

ఈ అలస్కా అడవిలో ఇన్యూట్‌లు, ఎల్యూట్‌లు, అమెరికన్‌ ఇండియన్లు నివసిస్తున్నారు. ఇందులో ప్రతి దానికి దాని విశిష్ట వారసత్వం ప్రకారం స్వంత ఆచారాలూ లక్షణాలున్నాయి. ఆర్కిటిక్‌ ప్రాంతంలోని శీతాకాలాన్ని తప్పించుకోడానికి వేటాడుతూ, చేపలు పడుతూ తిమింగలాలను పడుతూ వారు ఆ ప్రాంతంలోని వనరులను జాగ్రత్తగా వినియోగించుకుంటూ, దానితో సహకరిస్తున్నారు.

వారిపైన 1700 మధ్యకాలంలో పరదేశుల ప్రభావం పడింది. అక్కడి ప్రజలు జంతు చర్మం ధరించుకుని, సీలు నూనె వాసనతో, మంచుగడ్డతో చేసిన యిగ్లోస్‌లో జీవించకుండా, గడ్డి పైకప్పు ఉన్న భూగర్భ ద్వారాలు కల్గి పచ్చిక బీళ్లతో చేసిన యిళ్లలో నివసించడం రష్యాకు చెందిన బొచ్చు వర్తకులు చూశారు. మృదువుగా మాట్లాడేవారూ సాత్వికులూ అయినప్పటికీ కష్టపడి పనిచేసే ఈ ప్రజలకు క్రొత్త ఆచారాలు, వారిలో కొన్ని వర్గాలు సగానికి తగ్గిపోడానికి కారణమైన క్రొత్త వ్యాధులతో సహా ఎన్నో గంభీరమైన సమస్యలను బొచ్చు వర్తకులు తెచ్చిపెట్టారు. త్వరలోనే మద్యం వారికో శాపంగా పరిణమించింది. కొత్త ఆర్థిక వ్యవస్థ, కుటుంబానికి సరిపడే సరకులను సంపాదించుకోవడం నుండి ధనాన్ని ఆర్జించడానికి బలవంతపెట్టింది. ఈనాటి వరకూ కూడ, అది చాలా బాధాకరమైన పరివర్తన అని కొందరు భావిస్తున్నారు.

క్రైస్తవ మత సామ్రాజ్య మిషనరీలు వచ్చినప్పుడు, అలస్కా ప్రజలపైన మరో విధమైన మార్పు బలవంతంగా తీసుకురాబడింది. కొందరు తమ పారంపర్య ఆచారాలను అంటే వాయువు, మంచుగడ్డ, ఎలుగుబంటి, గద్దలు వగైరా వగైరాల ఆత్మలను ఆరాధించడాన్ని అయిష్టతతోనే త్యజించినప్పటికీ, యితరులు మిశ్రిత సిద్ధాంతాలను వృద్ధి చేసుకున్నారు. తద్వారా మతాల మిళితం, లేక గందరగోళం ఏర్పడింది. ఇదంతా తరచూ అపరిచితులపై అనుమానానికి అపనమ్మకానికి కారణమైంది. కొన్ని గ్రామాల్లో ఓ అపరిచితుని ఎల్లప్పుడూ ఆహ్వానించరు.

మా ముందున్న సవాలేమంటే, యింత విస్తృత సరిహద్దులో విస్తరించి ఉన్న నివాసులను మేము ఎలా చేరాలి, అనుమానానికి తావులేదని వారికి మేము ఎలా చూపించాలి? తెరను తొలగించడానికి మేమేం చేయగలం?

సాక్ష్యమివ్వడానికి తొలి ప్రయత్నాలు

కష్టపడి పనిచేసే అనేకమంది అలస్కా సాక్షులు 1960 దశక తొలి కాలంలో భయంకరమైన గాలులూ, అతి శీతల ఉష్ణోగ్రత మంచు మునిగిన పరిస్థితివంటి తీవ్ర వాతావరణ పరిస్థితులను ధైర్యంతో తట్టుకొని ఒకే యింజిన్‌ గల తమ స్వంత విమానాల్లో ప్రయాణించి ఉత్తర దిక్కున అక్కడక్కడ ఉన్న గ్రామాల్లో ప్రకటించే పర్యటనలకు వెళ్లారు. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటే, ఈ ధైర్యశాలులైన సహోదరులు తమను గొప్ప అపాయంలో పడేసుకున్నారని చెప్పవచ్చు. ఇంజిన్‌ పాడుకావడం నాశనానికి దారితీసివుండేది. ఒకవేళ సురక్షితంగా దిగడం సాధ్యమైనప్పటికీ, అతి శీతల వాతావరణంలో సహాయ కార్యకలాపాలకు ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉండడమో లేక ప్రయాణించే మార్గం లేకపోవడమో జరిగేది. చాలా అరుదుగా దొరికే ఆహారం, నివాసంపైన బ్రతికి బట్టకట్టడం ఆధారపడి ఉంటుంది. దేవుని దయవల్ల ఏ గంభీరమైన సంఘటనలు సంభవించలేదు. అయితే అలాంటి అపాయాలను అలక్ష్యం చేయలేం. కనుక, వాచ్‌టవర్‌ సొసైటీ వారి అలస్కా బ్రాంచి కార్యాలయం, సహోదరులు ఈ విధంగా ప్రకటించేపనిని నిరుత్సాహపర్చింది.

పనిని కొనసాగించడానికి, ఫెయిర్‌బాంక్స్‌, ఉత్తర పోల్‌ సంఘాల్లోని నమ్మకమైన సహోదరులు, వర్తక విమానాలున్న నోమ్‌, బార్రో, కొట్జ్‌బ్యు వంటి పెద్ద గ్రామాలపై తమ ప్రయత్నాలను కేంద్రీకరించారు. వారు తమ విరాళాలను ఉత్తర పడమరలకు 720 కిలోమీటర్లున్న ఈ ప్రాంతాలవైపు ప్రయాణించడానికి ఉపయోగించేవారు. ఆసక్తి గలవారితో బైబిలును పఠించడానికి కొందరు నోమ్‌లోనే కొన్ని నెలలపాటు ఉండిపోయారు. మైనస్‌ 45 డిగ్రీల సెల్సియస్‌ శీతల ఉష్ణోగ్రతను తట్టుకోడానికి బర్రోలో ఓ ఫ్లాట్‌లో నివాసస్థలాన్ని అద్దెకు తీసుకున్నారు. భూదిగంతములలో రాజ్య సువార్త ప్రకటించబడాలనే యేసు ఆజ్ఞను హృదయంలోకి తీసుకున్నవారు ఏన్నో సంవత్సరాలుగా 15,000 డాలర్ల కంటే ఎక్కువ డబ్బును ఖర్చుపెట్టారు.—మార్కు 13:10

అపేక్షించని సహాయం అందొస్తుంది

మరీ సుదూరంగా ఉన్న ప్రాంతాలను చేరే మార్గాలను వెదకడం కొనసాగుతూ వచ్చింది, అప్పుడు యెహోవా మార్గాన్ని తెరిచారు. మెట్టపల్లాలున్న అలస్కా పర్వత శ్రేణిని దాటి వెళ్లడానికి సరిగ్గా అవసరమైన రెండు యింజన్ల విమానం అందుబాటులోనికి వచ్చింది. అలస్కాలో, 4,200 మీటర్ల ఎత్తుకు మించే అనేక పర్వతాలున్నాయి, అంతేకాదు పేరుగాంచిన మేక్‌కిన్లి పర్వతం సముద్ర మట్టానికి 6,193 మీటర్ల ఎత్తులో ఉంది.

చివరికి విమానం వచ్చింది. మరమ్మత్తు చేయబడి శిథిలావస్థలో ఉన్న ఓ విమానం వచ్చి వాలినప్పుడు మేం ఎంతగా నిరుత్సాహపడ్డామో ఊహించండి. అది ఎగరగలదంటారా? దాన్ని నమ్మి మన సహోదరుల జీవితాలను దానికి అప్పగించగలమా? మరలా యెహోవా హస్తం కురచ కాలేదు. లైసెన్సున్న మెకానిక్కుల నడిపింపులో 200 మంది సహోదరులు, పూర్తి విమానాన్నంతా మరలా కొత్తది చేయడానికి కొన్ని వేల గంటల సమయాన్ని వెచ్చిస్తూ తమ స్వచ్ఛంద సేవలను అందించారు.

అది చూడడానికి ఎంత యింపుగా ఉందో! మిరిమిట్లుగొల్పుతూ కొత్తదానిలా కనిపిస్తూ, తోకపై 710WT రిజిస్ట్రేషన్‌ నంబరు అలంకరించుకున్న ఓ చిన్న విమానం అలస్కా నింగిలోకి ఉడాయించడం ఎంత బావుందో! బైబిల్లో ఏడు, పది పరిపూర్ణతకు సూచన గనుక, అంధకారంలో కూరుకుపోయిన హృదయాలపై అలుముకున్న తెరను తొలగించడానికి, యెహోవా సంస్థ అందించే మద్దతును 710 నొక్కితెల్పుతుందని చెప్పవచ్చు.

అల్యేటియన్‌ ద్వీప పరంపర క్రిందికి

విమానం దొరికినప్పటి నుండి, షుమారు 80,000 కిలోమీటర్ల అడవిని పూర్తిచేస్తూ 54 గ్రామాల కంటే కూడా ఎక్కువ గ్రామాలకు రాజ్యసువార్తనూ బైబిలు పుస్తకాలనూ అందించాం. అంటే అమెరికా ఖండాన్ని 19 సార్లు చుట్టడంతో సమానం అన్నమాట!

పసిఫిక్‌ మహా సముద్రాన్ని బేరింగ్‌ సముద్రం నుండి వేరుపర్చే 1,600 అల్యేటియన్‌ ద్వీపాలను మేం మూడు సార్లు చేరాం. ఓ పరంపరగా చెట్లులేని దాదాపు 200 దీపాలు. అల్యేట్‌ నివాసులకే కాకుండా వేలాది సముద్ర పక్షులకూ, గద్దలూ, హిమ వర్చస్సు తలలతో తెలుపూ నలుపూ గీసినట్లుండే రెక్కలతో ఎంపరర్‌ గీస్‌లకు కూడా అది నివాసస్థానమే.

అయితే, మరులుగొల్పే ఆ ప్రాంతపు అందం, అపాయాలు లేకుండా మాత్రం లేదు. సముద్రం మీదుగా విమానంలో పయనిస్తూ, నురగలు కక్కే చల్లటి నీటిపై కెరటాల మూలంగా ఏర్పడిన మూడు నుండి అయిదు మీటర్ల తెల్లటి నురుగును మేము చూడగల్గాము, అది ఎంత చల్లగా ఉందంటే వేసవిలోనైనా ఒక వ్యక్తి అక్కడ 10 నుండి 15 నిమిషాలు మాత్రమే జీవించగలడు. ఒక వేళ దిగాల్సిన పరిస్థితి ఎదురైతే, వైమానికునికి రెండే రెండు అవకాశాలున్నాయి, ఒకటి గరుకుగరుకుగా ఉన్న రాతి ద్వీపం లేదా గడ్డగట్టిన, ప్రాణాంతక సముద్రం. విమానం అద్భుతంగా ఎగురగల పరిస్థితిలో ఉంచడానికి స్వచ్ఛంగా ముందుకొచ్చిన సహోదరులకు అంతేకాకుండా గుర్తింపు పొందిన ఎ, ఇ (ఎయిర్‌క్రాఫ్ట్‌ అండ్‌ ఇంజన్స్‌) మెకానిక్కులకూ మేమెంత కృతజ్ఞులము!

ఒకానొక ప్రయాణ సమయంలో, మేము డచ్‌ హార్బర్‌ వైపుకూ చేపలు పట్టే గ్రామమైన అన్‌అలస్కా వైపుకు ప్రయాణించాం. గంటకు 130 నుండి 190 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులకు పేరుగాంచిన ప్రాంతం అది. సంతోషకరమైన సంగతేమంటే, ఆ రోజు గాలి కొద్దిగా శాంతంగానే ఉంది, అయితే మేము అనేక సార్లు వాంతి చేసుకునేంత ఉద్ధృతంగానే ఉంది. దిగవలసిన—ఒక ప్రదేశం ప్రక్కగా చెక్కిన మెట్టస్థలం—కన్పించినప్పుడు ఎంత ఆశ్చర్యమైందో! ఆ రహదారికి ఓ ప్రక్క నిటారైన కొండరాయి, మరో ప్రక్క బేరింగ్‌ సముద్రంలోని గడ్డగట్టిన నీరు! మేము క్రిందికి దిగేసరికి రహదారి తడిగానే ఉంది. అక్కడ సంవత్సరానికి 200 రోజులకంటే ఎక్కువ కాలం వర్షం కురుస్తుంది.

దేవుని వాక్యం, ఆయన సంకల్పం గూర్చి ఆ ప్రాంతంలోని వారితో చర్చించడం ఎంత ఆనందదాయకంగా ఉందో! వృద్ధులనేకులు యుద్ధంలేని లోకాన్ని గూర్చిన నిరీక్షణను ఎంతగానో మెచ్చుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో డచ్‌ హార్బర్‌ను జపాన్‌ దేశీయులు బాంబు వేసి పేల్చడం వారికింకా జ్ఞాపకం ఉంది. సాక్ష్యమివ్వడానికి చేసిన అలాంటి ప్రయాణాల తీపి జ్ఞాపకాలు కూడా అంతే మరువరానివి.

మెల్లిగా వేడెక్కే ధోరణి

వాతావరణాన్ని మరలా పరీక్షించినప్పుడు ఉష్ణోగ్రత మెల్లిగా పెరగడం గమనించాం. సూదూర ప్రాంతంలో సాక్ష్యమిచ్చే పనిని అది నాకు జ్ఞాపకం చేస్తోంది. మెల్ల మెల్లగా అయితే నిబ్బరంగా అక్కడి ప్రజల హృదయాలు కూడా వేడెక్కే ధోరణిని మేం చూశాము.

ఆ ప్రజలకు బయిటి వారి యెడల గల అనుమానమూ అపనమ్మకాల అడ్డును తొలగించడానికి సమయం పట్టింది. మా మొదటి ప్రయత్నాల్లో ఆ గ్రామంలోని చర్చీ మతనాయకులు విమానాన్ని సమీపించి మా సందర్శనానికి కారణం కనుక్కుని, తర్వాత హఠాత్తుగా మమ్మల్ని వెళ్లిపొమ్మనేవారు. నిశ్చయంగా అలాంటి స్వాగతాలు నిరుత్సాహ పర్చేవి. అయితే మత్తయి 10:16లో యేసు యిచ్చిన సలహాలను మేం జ్ఞాపకం చేసుకున్నాం: “పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి.” కనుక అక్కడ అంత సుళువుగా దొరకని ఆకుకూర, టమాటాలు, కర్బూజాలు మరితర వస్తువులను విమానంలో నింపుకుని మేం మరలా వెళ్లాం. అంతకుముందు వ్యతిరేకించిన నివాసులు యిప్పుడు మా సామాగ్రిని చూసి సంతోషించారు.

ఓ సహోదరుడు తాజా వస్తువులకు చందాను అందుకుంటూ ఆ “కొట్టును” చూసుకుంటుండగా, తాజా సామాగ్రి వచ్చిందనే సమాచారాన్ని అందిస్తూ మిగిలినవారంతా యింటింటికీ వెళ్లేవారు. ఇంటింట వారు ఈ విధంగా కూడా అడిగేవారు: “అలాగే, మీరు బైబిలును చదువుతారా? దేవుడు మనకు పరదైసును వాగ్దానం చేశాడని చూపే బైబిలు పఠన సహాయకాన్ని చదవడానికి మీరు యిష్టపడతారని నాకు తెలుసు.” ఆకర్షణీయమైన అలాంటి అవకాశాన్ని ఎవరు కాదనగలరు? ఆత్మీయ, భౌతిక ఆహారాలను అందరూ మెచ్చుకున్నారు. ఆహ్వానం ఆనందదాయకంగా ఉండేది, ఎన్నో ప్రచురణలు అందించబడ్డాయి, కొన్ని హృదయాలైతే వెచ్చబడ్డాయి.

సరిహద్దు అవతలికి అడుగిడడం

యుకొన్‌ ప్రాంతంలోని వైట్‌హార్స్‌ సంఘం, వాయవ్య ప్రాంతంలోని సుదూర స్థలాలను సందర్శించడానికి కెనడాకు దాటి “రావాలనే” “మాసిడోనియన్‌” ఆహ్వానాన్ని అందించింది. (అపొస్తలుల కార్యములు 16:9) మేము టుక్టోయాక్‌టుక్‌కు ప్రయాణించినప్పుడు మాలో ఐదుగురం అందులోకి ఎక్కాము. ఆర్కిటిక్‌ సర్కిల్‌కు ఉత్తరాన ఉన్న బియుఫోర్ట్‌ సముద్రం లోని మేక్‌కెన్‌జీ దగ్గర గ్రామమది.

‘ఈ విచిత్రమైన పేరును ఎలా పలకాలి?’ అని మేం అక్కడికి చేరుతుండగా ఆలోచించాము.

“టుక్‌” అని ఓ యౌవనస్థుడు చిరునవ్వుతో జవాబు చెప్పాడు.

“దాన్ని గూర్చి మనం ఎందుకు ఆలోచించలేదు?” అని ఆశ్చర్యపోయాము.

టుక్టోయాక్‌టుక్‌ ప్రజలు లేఖనాల్లో దిట్టని తెలుసుకొని మేం ఆశ్చర్యచకితులమయ్యాం. తత్ఫలితంగా, మేం అనేక స్నేహపూర్వక చర్చలను జరిపి, ఎన్నో ప్రచురణలను అందించాం. మాలో ఓ యువ పయినీరు ఓ యింటి వారితో జ్ఞానయుక్తమైన చర్చను జరిపాడు.

“నేను ఓ ఆంగ్లికన్ను” అన్నాడు ఆ యింటాయన.

“ఆంగ్లికన్‌ చర్చీ సలింగ సంయోగాన్ని అంగీకరిస్తోందని మీకు తెలుసా?” అని మా పయినీరు ప్రశ్నించాడు.

“అది అంగీకరిస్తుందా?” ఆ వ్యక్తి తత్తరపడ్డాడు. “అయితే, నేనిక ఏమాత్రం ఆంగ్లికన్ను కాను.” అలాగే మరో వ్యక్తి కూడా బైబిలులోని సువార్తకు తన హృదయ ద్వారాలను తెరిచాడు.—ఎఫెసీయులు 1:18.

ప్రతి యింటిని సందర్శించాలనే మా నిశ్చయానికి ఓ వృద్ధుడు ముగ్ధుడయ్యాడు. సాధారణంగా, మేం మా పనినంతా నడకతోనే సాగించాల్సి వచ్చేది. సహజంగా, విమానం దిగిన స్థలంనుండి గ్రామానికి ఓ కిలోమీటరో లేక అంతకంటే ఎక్కువే నడవాల్సి వచ్చేది. తర్వాత, ప్రతి యింటికి చేరడానికి కంకర్రాళ్లున్న లేక బురద మార్గం గుండా చాలా కష్టంగా నడవాల్సి వచ్చేది. ఆ వ్యక్తి సామాన్లు తీసుకువెళ్లే తన ట్రక్కును మాకిచ్చాడు, అది ఎంత చక్కటి ఆశీర్వాదం! సరిహద్దు అవతలకు వెళ్లి కెనెడియన్ల ప్రాంతంలోని వారికి సహాయం చేయడం ఎంతో చక్కటి ఆధిక్యత.

చేసిన ప్రయత్నానికి తగ్గ ఫలితం లభించిందా?

వాతావరణం బాగోలేనప్పుడు, యిప్పుడునట్లు మేం ఎటూ కదలేని పరిస్థితిలో లేక చాలా ఆలస్యమైపోతున్నప్పుడు లేక ఒక దినమంతా ప్రకటించే పని చేసినప్పటికి ఆసక్తి లేకపోవడం లేక వ్యతిరేకత సంభవించినప్పుడు, వెచ్చించిన సమయం, శ్రమ, ద్రవ్యం అన్ని వ్యర్థమేనా అని అనిపించేది. ఆసక్తి చూపించి ఉత్తరప్రత్యుత్తరాల ద్వారా బైబిలును నేర్చుకుంటామని వాగ్దానం చేసి విఫలమైన వారిని గూర్చి కొన్నిసార్లు మేం ఆలోచించేవాళ్లం. స్థానికుల్లో ఉత్తరాలు రాయడం అనేకులకు అలవాటు లేదని, బైబిలు సమాచారంలో స్నేహభావాన్ని ఆసక్తి అని సుళువుగా అపార్థం చేసుకోవచ్చు అని అప్పుడు జ్ఞాపకం చేసుకొనేవాళ్లం. కొన్నిసార్లు విజయాన్ని అంచనావేయడం చాలా కష్టమనిపించేది.

ఇతర రాజ్య ప్రచారకుల మంచి అనుభవాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ ప్రతికూల ఆలోచనలు మటుమాయమయ్యేవి. ఉదాహరణకు, ఫెయిర్‌బాంక్స్‌కు చెందిన ఓ సాక్షి ఉత్తరదిశలో సుదూర ప్రాంతమందున్న బార్రో గ్రామంలో ప్రకటించింది. అక్కడ ఆమె కాలిఫోర్నియాలోని కాలేజీలో చదువుతూ సెలవులకు యింటికి వచ్చిన ఓ యౌవనురాలిని కలిసింది. ఆ సహోదరి ఉత్తరాల ద్వారా ఆసక్తిని పెంచుతూ ఆ అమ్మాయి కాలేజీకి వచ్చిన తర్వాత కూడా ఆమెను ప్రోత్సహిస్తూనే వచ్చింది. నేడు, ఆ యౌవనురాలు బాప్తిస్మము పొందిన యెహోవా సేవకురాలిగా సంతోషంగా ఉంది.

తలుపు చప్పుడు నన్ను నా ఆలోచనలనుండి తట్టి లేపి, యిదంతా విలువైనదేనని మరో నిదర్శనాన్నిచ్చింది. ఇంతవరకూ నోమ్‌లో సమర్పించుకుని బాప్తిస్మం పొందిన ఏకైక ఇన్యూట్‌ సాక్షి ఎల్మర్‌ తలుపు దగ్గర నిలబడివున్నాడు.

“మీరు పరిచర్యకు వెళ్లగల్గినట్లైతే, నేను కూడా మీతో రావచ్చునా?” అని అడిగాడు. ఒంటరిగా, సంఘం నుండి 800 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో జీవిస్తూ అతనికి అవకాశం ఉన్నప్పుడు సహోదరులతో పరిచర్యలో భాగం వహించాలని కోరుకుంటున్నాడు.

సూర్య కిరణాలు మేఘాల్లోనుండి చొచ్చుకు రావడం ప్రారంభమైంది, యిక మేం వెళ్లడానికి వాతావరణం తేటపడుతుందని మాకు తెలుసు ఎల్మర్‌ విమానాన్ని ఎక్కుతుండగా సంతోషంతో ప్రకాశించే అతని ముఖాన్ని చూసి మేం ప్రోత్సాహాన్ని పొందాం. ఎల్మర్‌కు యిది ఓ ప్రత్యేకమైన రోజు. ప్రపంచ చివరి సరిహద్దులో జీవించే వారి హృదయాలపై అలుముకున్న తెరను తొలగించడానికి మేం చేసే ప్రయత్నంలో మాతో చేరి, మా గమ్యమైన ఆ గ్రామానికి వచ్చి తన స్వంత ఇన్యూట్‌ ప్రజలకు ప్రకటించడానికి మాతో వస్తున్నాడు.—ఉచితవ్యాసం.

[23వ పేజీలోని చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

1. గాంబెల్‌

2. సావూన్గా

3. నోమ్‌

4. కొట్జెబ్యూ

5. బర్రో

6. టుక్టోయాక్‌టుక్‌

7. ఫేర్‌బాంక్స్‌

8. ఆన్‌కొరేజ్‌

9. అన్‌అలస్కా

10. ఉచ్చ్‌ హార్‌బర్‌.

[24వ పేజీలోని చిత్రం]

సుదూరంలో ఉన్న జాతులవారిని చేరడానికి, అలస్కాలోని అనేక పర్వత శ్రేణుల్లోని ఒకదాన్ని దాటడం తరచూ తప్పని సరి

[25వ పేజీలోని చిత్రం]

బెట్టి హాస్‌, సోఫీ మెజెక్‌, కేరీ టీపిల్స్‌ మొత్తం 30 కంటె ఎక్కువ సంవత్సరాల పూర్తికాల సేవను కల్గివున్నారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి