కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 4/15 పేజీలు 13-18
  • దేవుడు బోధించినట్లు నడవండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుడు బోధించినట్లు నడవండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఉపదేశించబడడం, ప్రయోజనం పొందడం
  • ఉపదేశం కుటుంబ సభ్యులకు ప్రయోజనాన్నిస్తుంది
  • అనుకూల ఉపదేశం
  • అపాయకరమైన మనకాలానికి సహాయకరమైన బోధ
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • పెళ్ళికి ముందు లైంగిక సంబంధం పెట్టుకుంటే తప్పేమిటి?
    తేజరిల్లు!—2004
  • సెక్స్‌లో పాల్గొనమని ఎవరైనా ఒత్తిడి చేస్తే నేనేం చేయాలి?
    యువత అడిగే 10 ప్రశ్నలకు జవాబులు
  • సెక్స్‌ గురించిన నా నమ్మకాలను నేను ఎలా వివరించాలి?
    యువత అడిగే ప్రశ్నలు
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 4/15 పేజీలు 13-18

దేవుడు బోధించినట్లు నడవండి

“యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకొందము.”—మీకా 4:2.

1. మీకా ప్రకారం, అంత్యదినాల్లో దేవుడు తన ప్రజలకు ఏమి చేయబోతున్నాడు?

దేవుని ప్రవక్తయైన మీకా, “అంత్యదినములు,” అంటే మన కాలంలో అనేకులు దేవున్ని ఆరాధించడానికి ఆయనను చురుకుగా వెదుకుతారని ప్రవచించాడు. వారు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ యిలా అంటారు: “యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి, ఆయన తన మార్గములవిషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకొందము.”—మీకా 4:1, 2.

2, 3. మనుష్యులు ధనాపేక్షులని పౌలు ముందుగా తెలిపినది ఈనాడు ఎలా నెరవేరుతోంది?

2 మనం 2 తిమోతి 3:1-5ను పఠించడం ద్వారా “అంత్యదినములలో” దేవుడు ఉపదేశించడం వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయన్నదాన్ని చూడగలం. ముందున్న శీర్షికలో, “స్వార్థప్రియులు” కాకుండా ఉండాలని పౌలు యిచ్చిన హెచ్చరికను తమ హృదయానికి తీసుకున్నవారికి వచ్చే ప్రయోజనాలను సూచిస్తూ ప్రారంభించాం. పౌలు యింకా చేరుస్తూ మన కాలంలోని మనుష్యులు “ధనాపేక్షులై” ఉంటారని చెప్పాడు.

3 మన కాలానికి ఆ మాటలు ఎంత చక్కగా సరిపోతాయో గ్రహించడానికి ఓ వ్యక్తి ఆధునిక చరిత్రలో పట్టభద్రుడు కానవసరంలేదు. తాము ప్రతి సంవత్సరం సంపాదిస్తున్న లక్షల డాలర్ల డబ్బుతో సంతృప్తిపడని పెట్టుబడీదారులను గూర్చి, కార్పొరేషన్‌ అధికారులను గూర్చి మీరు చదవలేదా? అయినా, ఈ ధనాపేక్షులు అన్యాయంగానైనా సరే ఎక్కువ కావాలని కోరుకుంటారు. ధనికులు కాకపోయినా ఎన్నడూ సంతృప్తిలేని వట్టి పేరాశపరులకు కూడా పౌలు మాటలు సరిపోతాయి. మీ ప్రాంతంలో నివసిస్తున్న అలాంటి వ్యక్తులు అనేకమంది మీకు తెలిసి ఉండవచ్చు.

4-6. క్రైస్తవులు ధనాపేక్షులు కాకుండా ఉండడానికి బైబిలు వారికి ఎలా సహాయం చేస్తుంది?

4 పౌలు ప్రస్తావించింది మానవ లక్షణంలో నివారించలేని విషయమేనా? బైబిలు రచయిత ప్రకారం మాత్రం కాదు. ఆయన ఎంతో కాలం ముందే ఈ సత్యాన్ని పేర్కొన్నాడు: “ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.” ‘ధనం సమస్తమైన కీడులకు మూలము’ అని దేవుడు చెప్పలేదని గమనించండి. అది “ధనాపేక్ష” అని ఆయన అన్నాడు.—1 తిమోతి 6:10.

5 ఆసక్తికరంగా, మొదటి శతాబ్దంలోని కొందరు మంచి క్రైస్తవులు, తమకు వారసత్వంగా వచ్చినదైనా లేక సంపాదించుకున్నప్పటికి వారు ఈ వ్యవస్థలో ఆస్తిపరులని పౌలు మాటలను బట్టి తెలుస్తోంది. (1 తిమోతి 6:17) మన ఆర్థిక స్థితి ఎలా ఉన్నప్పటికి మనం ధనాన్ని అపేక్షించేవారం అయ్యే అపాయాన్ని గూర్చి బైబిలు హెచ్చరిస్తోంది. ఈ అపాయకరమైన, సామాన్య లోపాన్ని నివారించడాన్ని గూర్చి బైబిలు మనకు మరింకేమైనా ఉపదేశాన్ని అందిస్తోందా? తప్పకుండా, యేసు తన కొండ మీది ప్రసంగంలో చెప్పినటువంటి వాటిని అది అందిస్తోంది. దాని జ్ఞానం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఉదాహరణకు మత్తయి 6:26-33లో యేసు ఏమన్నాడో గమనించండి.

6 లూకా 12:15-21లో వ్రాయబడినట్లుగా, ధనాన్ని కూడబెట్టుకోడానికి ప్రయత్నిస్తూ అకస్మాత్తుగా తన ప్రాణాన్ని కోల్పోయిన ఓ ధనవంతుని గూర్చి యేసు మాట్లాడాడు. యేసు చెప్పిన విషయమేమిటి? ఆయన యిలా అన్నాడు: “మీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట చేత వాని జీవమునకు మూలము కాదు.” అటువంటి సలహాను యివ్వడంతోపాటు, బైబిలు సోమరితనాన్ని ఖండించి, నిజాయితీగా కష్టపడి పనిచేయడాన్ని నొక్కివక్కాణిస్తోంది. (1 థెస్సలొనీకయులు 4:11, 12) ఈ బోధలు మన కాలానికి అన్వయించదగవని కొందరంటారు—అయితే అవి తప్పక అన్వయించదగినవే, అంతేకాదు అవి విజయవంతం అవుతున్నాయి కూడా.

ఉపదేశించబడడం, ప్రయోజనం పొందడం

7. ధనాన్ని గూర్చిన బైబిలు సలహాను మనం విజయవంతంగా అన్వయించవచ్చునని నమ్మడానికి మనకు ఏ కారణాలున్నాయి?

7 అనేక దేశాల్లో, డబ్బును గూర్చిన దైవిక సూత్రాలను అన్వయించిన అన్ని సామాజిక ఆర్థిక స్థాయిల్లో ఉన్న స్త్రీపురుషుల నిజ జీవిత ఉదాహరణలు మీరు కనుగొనగలరు. సాక్షులు కానివారు కూడా గమనించగల్గేటట్లు, వారు తమకూ తమ కుటుంబాలకూ ప్రయోజనం చేకూర్చారు. ఉదాహరణకు, ప్రిన్స్‌టన్‌ యూనివర్శిటీ వారి ప్రకాశకుల నుండి వెలువడిన రెలిజియస్‌ మూమెంట్స్‌ యిన్‌ కాంటెంప్రరీ అమెరికా అనే పుస్తకంలో ఓ నరవానర శాస్త్రజ్ఞుడు యిలా రాశాడు: “[సాక్షుల] ప్రచురణల్లో, వారి కూటాలందలి ప్రసంగాల్లో వారు క్రొత్త కార్లపైన, ఖరీదైన దుస్తులపైన లేక భోగంగా జీవించడంపైన ఆధారపడిలేరని వారికి జ్ఞాపకం చేయబడుతుంది. అదే సమయంలో ఓ సాక్షి తన యజమానికి రోజుకు నిర్దేశించబడిన పనిని చేసి పెట్టాలి, [అంతేకాకుండా] సూత్రానుసారంగా నిజాయితీగా ఉండాలి . . . అటువంటి లక్షణాలు, ఓ వ్యక్తికి అనేక నేర్పులు లేకపోయినా ఓ ఉపయుక్త ఉద్యోగిగా కావడానికి సహాయపడుతుంది. ఉత్తర ఫిలడెల్ఫియాలోని [అమెరికా] కొందరు సాక్షులను గౌరవప్రదమైన ఉద్యోగ బాధ్యతలకు నడిపించింది.” స్పష్టంగా, దేవుని వాక్యం నుండి ఆయన ద్వారా ఉపదేశాన్ని అందుకున్నవారు ప్రస్తుత పరిస్థితులతో వ్యవహరించడానికి కష్టతరం చేస్తున్న ధోరణి నుండి మేల్కొల్పబడ్డారు. బైబిలు ఉపదేశం మరింత శ్రేష్ఠమైన, సంతోషకరమైన జీవితానికి నడిపిస్తుందని వారి అనుభవాలు నిరూపిస్తున్నాయి.

8. “బింకములాడువారు,” “అహంకారులు,” “దూషకులు” అనే వాటిని మనం ఎందుకు ఒకదానితో ఒకటి కలపవచ్చు, మరి ఈ మూడు పదాల భావం ఏమిటి?

8 పౌలు తర్వాత పేర్కొన్న మూడు విషయాలను మనం ఒక దానికొకటి కలపవచ్చు. అంత్యదినాల్లో, మనుష్యులు “బింకములాడువారు, అహంకారులు, దూషకులు”గా ఉంటారు. ఈ మూడూ అభిన్నమైనవి కావు కానీ, అవన్నీ గర్వానికి సంబంధించినవే. మొదటిది “బింకములాడువారు.” ఇక్కడ గ్రీకు పదంలోని భావాన్ని గూర్చి ఓ నిఘంటువు యిలా అంటోంది: “‘వాస్తవం నిరూపించినదానికంటే తన్నుతాను ఎక్కువ ఎంచుకొనువాడు,’ లేక ‘తాను చేయగల్గినదానికంటే ఎక్కువ వాగ్దానం చేసేవాడు.’” కొన్ని బైబిళ్లు “గొప్పలు చెప్పేవాడు” అని ఎందుకు పేర్కొంటున్నాయో మీరు గ్రహించగలరు. తర్వాత వచ్చేదే “అహంకారులు” లేక అక్షరార్థంగా “ఉన్నతంగా కనిపించేవారు.” చివరిది, “దూషకులు.” దూషకులు అంటే దేవున్ని గూర్చి అమర్యాదగా మాట్లాడేవారని కొందరు తలంచవచ్చు, అయితే దీనిలోని అసలు మాటలో మానవులకు ప్రతిగా మాట్లాడే హానికరమైన, అపఖ్యాతికరమైన, దుర్భాషాపూరితమైన మాటలు యిమిడి ఉన్నాయి. కాబట్టి దూషణను పౌలు అటు దేవునికి యిటు మనిషికీ, యిద్దరికీ వర్తింపజేస్తున్నాడు.

9. నేడు ప్రభలమైన అపాయకర దృక్పథాలకు భిన్నంగా, ఏ దృక్పథాలను ప్రజలు కల్గివుండాలని బైబిలు ప్రోత్సహిస్తుంది?

9 మీ సహోద్యోగులే గానీ, తోటి విద్యార్థులే గానీ లేక మీ బంధువులే గాని, పౌలు వర్ణనకు తగిన ప్రజల మధ్యలో మీరున్నపుడు మీరెలా భావిస్తారు? అది మీ జీవితాన్ని సాఫీగా సాగనిస్తుందా? లేక అటువంటి ప్రజలు మీ జీవితాన్ని మరింత కష్టతరం చేస్తూ మీరు మన కాలంతో వ్యవహరించడానికి మరింత కష్టతరం చేస్తున్నారా? అయితే దేవుని వాక్యం అటువంటి దృక్పథాన్ని విడనాడాలని బోధిస్తూ, 1 కొరింథీయులు 4:7; కొలొస్సయులు 3:12, 13; ఎఫెసీయులు 4:29లో ఉన్న ఉపదేశాలను అందిస్తోంది.

10. యెహోవా ప్రజలు బైబిలు ఉపదేశాలను అంగీకరించడం వల్ల ప్రయోజనం పొందుతున్నారని ఏది సూచిస్తోంది?

10 క్రైస్తవులు అపరిపూర్ణులైనప్పటికి, వారు ఈ చక్కటి ఉపదేశాన్ని అన్వయించుకోవడం ఈ అపాయకర కాలంలో వారికి ఎంతో సహాయకరంగా ఉంటుంది. ఇటాలియన్‌ పత్రికైన లా సివిల్టా కట్టోలికా, యెహోవాసాక్షులు పెరుగుతూండడానికి ఓ కారణమేమంటే, “వారి సంస్థ దాని సభ్యులకు నిర్దిష్టమైన నిశ్చయమైన గుర్తింపును అందిస్తుంది” అని చెప్పింది. అయితే “నిశ్చయమైన గుర్తింపు” అనడంలో రచయిత “బింకములాడువారు, అహంకారులు, దూషకులు” అనే భావాన్నిస్తున్నాడా? దానికి భిన్నంగా, ఆ సంస్థ “తమ సభ్యులకు నిర్దిష్టమైన నిశ్చయమైన గుర్తింపునిస్తుంది, మరి వారిని సాదరంగా ఆహ్వానించి, సహోదరత్వం, సంఘీభావాలను కలిగించే స్థలమే అది,” అని ఈ జెసూట్‌ పత్రిక గమనించింది. సాక్షులకు బోధింపబడిన విషయాలు వారికి సహాయపడుతున్నాయనడానికి యిది రుజువు కాదా?

ఉపదేశం కుటుంబ సభ్యులకు ప్రయోజనాన్నిస్తుంది

11, 12. అనేక కుటుంబాల్లోని పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని పౌలు ఎలా సరిగ్గా సూచించాడు?

11 కొద్దిగా ఒకదానితో ఒకటి సంబంధమున్న, తదుపరి నాలుగు విషయాలను మనం వర్గీకరించవచ్చు. అంత్యదినాలలో అనేకులు “తలిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞతలేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు” ఉంటారని పౌలు ప్రవచించాడు. కృతజ్ఞతలేనివారూ అపవిత్రులు అనే ఈ రెండు లోపాలు విశ్వవ్యాప్తంగా ఉన్నాయని మీకు తెలుసు అయితే, పౌలు వాటిని “తలిదండ్రులకు అవిధేయులు,” “అనురాగరహితులు” అనే పదాల మధ్యలో ఎందుకుంచాడో మనం సులభంగా అర్థం చేసుకోగలం. ఈ నాలుగూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి.

12 యౌవనులైనా వృద్ధులైనా, గమనించగల ఏ వ్యక్తెనా తలిదండ్రులకు అవిధేయత అనేది చాలా విస్తృతంగా ఉందని, అది మరింత విషమిస్తోందని తప్పకుండా ఒప్పుకోవాల్సివస్తోంది. తలిదండ్రులనేకులు తమ పిల్లలకు తాము చేసిన దానికంతటికి వారికి ఎలాంటి కృతజ్ఞత లేదని ఫిర్యాదు చేస్తున్నారు. అనేకమంది యౌవనులు తమ తలిదండ్రులు తమ యెడల (లేక కుటుంబమంతటి) నిజంగా యథార్థంగా లేరనీ, తమ తమ ఉద్యోగాల్లో, భోగాల్లో లేక తమ్మును తామే ప్రీతిపర్చుకోవడంలో మునిగి పోయారని వాదిస్తున్నారు. ఎవరిని నిందించాలని తీర్మానించడానికి బదులు, ఫలితాలను చూద్దాం. పెద్దలూ యౌవనుల మధ్యనున్న విముఖత తరచూ, నైతికత లేక అవినీతి విషయాలను గూర్చి యౌవనులు తమ స్వంత సూత్రాలను ఏర్పర్చుకోడానికి నడిపిస్తోంది. దాని పరిణామం? పెచ్చుపెరిగే కౌమార గర్భధారణ, గర్భస్రావం, లైంగికంగా సంక్రమించే వ్యాధులు. తరచుగా యింట్లో అనురాగం లేకపోవడం దౌర్జన్యానికి దారి తీస్తుంది. అనురాగం అంతరించిపోతోందనడానికి రుజువులుగా బహుశా మీరు మీ ప్రాంతంలోని ఉదాహరణలను పేర్కొనవచ్చు.

13, 14. (ఎ) కుటుంబాలు విడిపోతున్న ఈ సమయంలో మనం బైబిలుకు అవధానాన్నెందుకివ్వాలి? (బి) కుటుంబాన్ని గూర్చి బైబిలు ఎలాంటి వివేకయుక్తమైన సలహాను అందిస్తోంది?

13 ఒకప్పుడు తమ విస్తృత కుటుంబంలో భాగమైన ఒకే వంశం, ఒకే తెగ, ఒకే గుంపుకు చెందిన అనేకమంది ప్రజలు యిప్పుడు ఎందుకు ఎదురు తిరుగుతున్నారన్న దాన్ని యిది వివరించవచ్చు. అయితే, ఈనాటి జీవితంలోని ప్రతికూల విషయాలను నొక్కితెల్పడానికి వీటిని ప్రస్తావించడం లేదని జ్ఞాపకముంచుకోండి. మన రెండు ముఖ్య ఆసక్తులేమనగా: పౌలు పేర్కొన్న లోపాలవల్ల కల్గిన బాధలను నివారించడానికి బైబిలు బోధ మనకు సహాయపడగలదా, మరి బైబిలు బోధను మన జీవితాల్లో అన్వయించడం వల్ల మనం ప్రయోజనం పొందగలమా? పౌలు పేర్కొన్న ఆ నాలుగు సంగతుల విషయంలో స్పష్టమైనట్లుగా దాని జవాబు అవునని చెప్పవచ్చును.

14 ఓ సహజ వివరణ చక్కగా సమర్థించబడింది: బైబిలును మించి హృదయాన్నుప్పొంగించే, విజయవంతమైన కుటుంబ జీవితాన్ని అందించగల ఏ బోధా లేదు. కుటుంబ సభ్యులు అడ్డంకులను ఎలా నివారించాలో అన్నదే కాకుండా, ఎలా విజయవంతం కావాలో అని కూడా చూపే సలహా నమూనా ఒక్కటి దాన్ని నిరూపిస్తుంది. భర్తలకు భార్యలకూ పిల్లలకూ వర్తించే ఎన్నో యితర చక్కటి ఆచరణయోగ్యమైన సలహాలు ఉన్నప్పటికి, కొలొస్సయులు 3:18-21 దాన్ని మరింత చక్కగా దృష్టీకరిస్తోంది. మన కాలంలో ఆ ఉపదేశం విజయవంతం అవుతోంది. నిజమే, నిజ క్రైస్తవ కుటుంబాల్లో కూడా సమస్యలు, సవాళ్లు ఉన్నాయి. అయినా, మొత్తంమీది ఫలితాలు, బైబిలు సహాయకరమైన బోధను కుటుంబాలకు అందిస్తోందని రుజువు చేస్తున్నాయి.

15, 16. ఓ పరిశోధకురాలు జాంబియాలోని యెహోవాసాక్షులను పరిశీలించేటప్పుడు ఏ పరిస్థితిని కనుగొంది?

15 ఓ సంవత్సరంన్నర పాటు, కెనడాలోని యూనివర్శిటీ ఆఫ్‌ లెథ్‌బ్రిడ్జ్‌ నుండి ఓ పరిశోధకురాలు జాంబియాలోని సామాజిక జీవితాన్ని పరిశీలించింది. చివరికి ఆమె యిలా వివరించింది: “స్థిరమైన వివాహ బాంధవ్యాలను నిలుపుకోవడంలో యెహోవాసాక్షులు యితర మత శాఖల కంటే కూడా అధిక విజయాన్ని పొందుతున్నారు. . . . వారి విజయం భార్యాభర్తల మధ్య ఉన్న సవరించబడిన పరస్పర సంబంధాన్ని సూచిస్తుంది. వారు ఒకరితోనొకరు వ్యవహరించే విధానంలో నూతనంగా కనుగొన్న, భయంలేని, సహకారంతో కూడి గమ్యాల విషయంలో క్రొత్త నాయకుడైన దేవునికి వారు జవాబుదారులై ఉన్నారు. . . . యెహోవాసాక్షుల్లోని భర్తకు తన భార్యా పిల్లల మంచి చెడులను చూసే బాధ్యతలను తన భుజస్కందాలపైన మోయగల పరిపక్వతకు ఎదగాలని బోధించబడుతోంది. . . . భార్యా భర్తలు యథార్థత గల వ్యక్తులుగా ఉండాలని ప్రోత్సహించబడతారు . . . యథార్థత కొరకైన ప్రభలమైన కోరిక వివాహాన్ని పటిష్ఠం చేస్తుంది.”

16 ఆ పరిశీలన అనేక నిజ అనుభవాలపై ఆధారపడివుంది. ఉదాహరణకు, సహజ అలవాటు ప్రకారం కాకుండా “యెహోవాసాక్షుల్లోని పురుషులు తమ భార్యలతో పాటు తోటలో సహాయం చేస్తూ కన్పించారు. అంటే కేవలం దాన్ని తయారు చేసే సమయంలోనే కాదు గానీ తవ్వడం నాటడంలోకూడా సహాయపడతారు” అని ఈ పరిశోధకురాలు చెప్పింది. కాబట్టి, బైబిలు ఉపదేశం జీవితాలను తాకుతుందని భూవ్యాప్తంగా ఎన్నికలేని అనుభవాలు చూపుతున్నాయన్నది స్పష్టమైంది.

17, 18. పితృ పారంపర్యం, వివాహానికి ముందు లైంగిక సంబంధం కల్గివుండడం అనే విషయాల్లో జరిపిన పరిశీలన ఏ ఆశ్చర్యకర ఫలితాలనిచ్చింది?

17 దీనికి ముందున్న శీర్షిక, జర్నల్‌ ఫర్‌ ది సైంటిఫిక్‌ స్టడీ ఆఫ్‌ రిలిజియన్‌ కనుగొన్న వాటిని ప్రస్తావించింది. దీనిలో 1991 నందు “రెలీజియస్‌ హెరిటేజ్‌ అండ్‌ ప్రీమారిటల్‌ సెక్స్‌: ఎవిడెన్స్‌ ఫ్రమ్‌ ఎ నేషనల్‌ సామ్‌పిల్‌ ఆఫ్‌ యంగ్‌ అడల్ట్స్‌” అనే ఓ శీర్షిక వెలువడింది. వివాహం కాకముందే లైంగిక సంబంధాలు ఎంత ప్రబలంగా ఉన్నాయో బహుశ మీకు తెలిసే ఉండవచ్చు. చిన్న వయసులోనే అనేకులు మోహానికి లొంగిపోతున్నారు, అనేకమంది యౌవనులకు ఎంతోమంది లైంగిక భాగస్వాములుంటారు. సర్వసాధారణమైన ఈ విధానాన్ని బైబిలు బోధ మార్చగలదా?

18 ఈ విషయాన్ని పరిశీలించిన ముగ్గురు అసోసియేట్‌ ప్రొఫెసర్లు ‘మరింత సాంప్రదాయ సిద్ధమైన క్రైస్తవ ఆచారంలో పెరిగిన యౌవనులకు వివాహం కాకముందే లైంగిక సంబంధం కల్గివుండే అవకాశాలు తక్కువని’ కనుగొనాలని అపేక్షించారు. అయితే వాస్తవాలు ఏమి చూపాయి? మొత్తం మీద, 70 నుండి 82 శాతం మంది వివాహం కాకముందే లైంగిక సంబంధం కల్గివుండిరి. కొందరికి “పితృ పారంపర్యాచారం, వివాహం కాకముందు లైంగిక సంబంధం కల్గి ఉండే అవకాశాలను తగ్గించింది కానీ ‘కౌమారదశలోనే వివాహం కాకముందు లైంగిక సంబంధం’ కల్గివుండే విషయంలో మాత్రం కాదు.” “సాంప్రదాయ ప్రొటెస్టెంట్‌లకు పోల్చితే, వివాహం కాకముందు లైంగిక సంబంధం కల్గి ఉండగల ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కనపర్చిన” పైకి భక్తిపరులైన కుటుంబాల నుండి వచ్చిన కొంతమంది యువకులను గూర్చి పరిశోధకులు వ్యాఖ్యానించారు.—ఇటాలిక్కులు మావి.

19, 20. దేవుని బోధ యెహోవాసాక్షుల్లోని అనేక యౌవనులకు ఎలా సహాయపడి, కాపాడింది?

19 ప్రొఫెసర్లు “యితర గుంపులకన్నా చాలా ప్రత్యేకంగా వున్న గుంపైన” యెహోవాసాక్షుల్లో దానికి పూర్తి విరుద్ధమైన దాన్ని కనుగొన్నారు. ఎందుకు? “అనుభవాలూ అపేక్షలూ మతపర కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా కల్గిన నిబద్ధత, సామాజిక యథార్థతా స్థాయి . . . విశ్వాస సూత్రాలను హత్తుకుని ఉండే ఉన్నత స్థాయిలను సహజంగా సృష్టించగలదు.” వారింకా యిలా అన్నారు: “కౌమారులు, యౌవనులుగా సాక్షులు తమ సువార్త పనిని నిర్వర్తించాలని అపేక్షించబడతారు.”

20 కనుక బైబిలు ఉపదేశం యెహోవాసాక్షులకు అవినీతిని విడనాడడానికి సహాయపడుతూ వారికది ప్రయోజనకరంగా ఉంది. ఫలితంగా అది లైంగికంగా సంక్రమించే వ్యాధుల నుండి రక్షణనిస్తుంది, వాటిలో కొన్ని చికిత్స లేనివైతే మరికొన్ని ప్రాణాంతకమైనవి. బైబిలు బోధ ప్రకారం హత్యకు సమానమైన గర్భస్రావం చేయించుకోడానికి ఒత్తిడి ఉండదు. నిర్మలమైన మనస్సాక్షితో వివాహం చేసుకునే యౌవనులకు కూడా అది ఫలితాన్నిస్తుంది. దాని ఫలితంగా, మరింత దృఢమైన పునాదిపైన వివాహాలు నిర్మించబడతాయి. అలాంటి బోధ మనం తాళుకోడానికి, మరింత ఆరోగ్యంగానూ సంతోషంగాను, ఉండడానికి సహాయపడుతుంది.

అనుకూల ఉపదేశం

21. మన కాలాన్ని గూర్చి ఏ విషయాలను పౌలు మనకు కచ్చితంగా తెలియజేశాడు?

21 ప్రస్తుతం 2 తిమోతి 3:3, 4కు మరలి, మన కాలంతో వ్యవహరించడాన్ని అనేకులకు కష్టతరం చేసే—అయితే అందరికీ కాదు సుమా—మరింకే విషయాలను పౌలు పేర్కొన్నాడో గమనించండి: “[మనుష్యులు] అతిద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు.” ఎంత కచ్చితంగా చెప్పాడు! అయినప్పటికీ, బైబిలు నుండి వచ్చే ఉపదేశము మనలను కాపాడి, ఎదుర్కోడానికి, దానిలో విజయవంతం కావడానికి మనలను సన్నద్దులను చేస్తుంది.

22, 23. ఏ అనుకూల ఉద్బోధతో పౌలు తన జాబితాను పూర్తిచేశాడు, మరి దాని ప్రాముఖ్యతేమిటి?

22 అపొస్తలుడైన పౌలు తన జాబితాను అనుకూల రీతిలో ముగించాడు. చివరి విషయాన్ని, మనకు ఎనలేని ప్రయోజనాన్ని తీసుకురాగల దైవిక ఆజ్ఞకు మలిచాడు. పౌలు, ‘పైకి భక్తిగల వారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారిని’ గూర్చి ప్రస్తావిస్తూ “ఇట్టివారికి విముఖుడవై యుండుము” అన్నాడు. ఇతర వాటితో పోల్చిచూస్తే వాస్తవంగా చర్చీల్లో ఉన్న యౌవనుల్లో వివాహానికి ముందు లైంగిక సంబంధం కల్గిన వారి సంఖ్య ఎక్కువని జ్ఞాపకం చేసుకోండి. అంతెందుకు, చర్చికెళ్లే వారి అవినీతి కార్యాల సంఖ్య సగటున మాత్రం ఉన్నప్పటికి, వారి ఆరాధనా విధానం శక్తివిహీనమైందనడానికి అది ఓ రుజువుకాదా? అంతేకాదు, ప్రజలు వ్యాపారంలో ఎలా ప్రవర్తిస్తారో, తమ క్రింద పనిచేసేవారితో ఎలా వ్యవహరిస్తారో, లేక తమ బంధువులను ఎలా చూస్తారో అన్న విషయాలను మత బోధలు మార్చగలవా?

23 క్రైస్తవత్వపు నిజమైన శక్తిని వ్యక్తపర్చే ఆరాధనా పద్ధతిని కల్గివుంటూ దేవుని వాక్యం నుండి మనం నేర్చుకున్న వాటిని తప్పక ఆచరణలో పెట్టాలని పౌలు మాటలు చూపిస్తున్నాయి. ఎవరి ఆరాధనైతే శక్తిలేనిదో వారిని గూర్చి చెబుతూ పౌలు మనతో యిలా అంటున్నాడు: “ఇట్టివారికి విముఖుడవై యుండుము.” అది మనకు నిశ్చయమైన ప్రయోజనాలను తెచ్చే స్పష్టమైన ఆజ్ఞ.

24. ప్రకటన 18వ అధ్యాయంలోని ఉద్బోధ, పౌలు సలహాకు ఎలా సమాంతరం కల్గివుంది?

24 అది ఏవిధంగా మనకు ప్రయోజనాలను తెస్తుంది? బైబిలులోని చివరి పుస్తకం మహాబబులోను అనే ఓ సూచనార్థక వేశ్యయైన స్త్రీని వర్ణిస్తోంది. యెహోవా దేవుడు పరీక్షించి తృణీకరించిన ప్రపంచవ్యాప్త అబద్ధ మత సామ్రాజ్యాన్ని ఈ మహాబబులోను సూచిస్తోందని రుజువు చూపుతోంది. అయినా, యెహోవా తృణీకరించినవారిలో మనం చేరనవసరంలేదు. ప్రకటన 18:4 మనకు యిలా ఉద్బోధిస్తోంది: “నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏమియు ప్రాప్తించకుండునట్లును, దానిని విడిచిరండి.” “ఇట్టివారికి విముఖుడవై యుండుము” అని పౌలు యిచ్చిన సమాచారం అదే కాదా? మనం దీన్ని అన్వయించుకోవడం దేవుని ఉపదేశం నుండి ప్రయోజనం పొందడానికి మరో మార్గము.

25, 26. యెహోవా దేవున్నుండి ఉపదేశాన్ని అందుకుని ప్రస్తుతం దాన్ని అన్వయించుకొనువారికి భవిష్యత్తులో ఏమి దాచబడివుంది?

25 దేవుడు త్వరలోనే మానవ వ్యవహారాల్లో తానుగా జోక్యం చేసుకుంటాడు. ఆయన అన్ని అబద్ధ మతాలనూ మిగిలిన ప్రస్తుత దుష్టవిధానాన్ని నిర్మూలిస్తాడు. అది ప్రకటన 19:1, 2లో చెప్పినట్లుగా సంతోషానికి కారణమౌతుంది. భూమి మీద దేవుని ఉపదేశాన్ని అంగీకరించి, దాన్ని అనుసరించినవారు, ఈ అపాయకర కాలాల అవరోధాలు గతించినప్పుడు ఆయన బోధలను తదేకంగా అనుసరించడానికి అనుమతించబడతారు.—ప్రకటన 21:3, 4.

26 పునరుద్ధరించబడిన ఆ భూపరదైసులో జీవించడం మనం ఊహించగలదాని కంటే ఎంతో సంతోషవంతంగా ఉంటుంది. అది సాధ్యమని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, మరి మనం ఆయనను నిస్సందేహంగా నమ్మవచ్చు. అలా మనం ఆయన సహాయకర బోధను అంగీకరించి అనుసరించడానికి కావలసినంత హేతువును ఆయన మనకిస్తున్నాడు. ఎప్పుడు? ఇప్పుడు ఈ అపాయకర మన కాలంలోను ఆయన వాగ్దానం చేసిన పరదైసులోను ఆయన ఉపదేశాలను అనుసరిస్తూ ఉందాము!—మీకా 4:3, 4.

యోచించాల్సిన అంశాలు

◻ యెహోవా ప్రజలు ధనం విషయంలో ఆయనిచ్చే సలహానుండి ఎలా ప్రయోజనం పొందారు?

◻ దేవుని సేవకులు ఆయన వాక్యాన్ని అన్వయించుకోవడం వల్ల వచ్చే ఏ మంచి ఫలితాలను ఓ జెసూట్‌ పత్రిక రుజువుచేసింది?

◻ దైవిక ఉపదేశాన్ని అన్వయించుకున్న కుటుంబాలు పొందిన ఏ ప్రయోజనాలను గూర్చి జాంబియాలో జరిగిన ఓ పరిశీలన బయల్పర్చింది?

◻ దైవిక ఉపదేశం యౌవనులకు ఏ రక్షణను అందిస్తోంది?

[15వ పేజీలోని బాక్సు]

ఎంత దారుణ పరిణామాలు!

“యౌవనులు ఎయిడ్స్‌ను సంక్రమింపజేసుకునే తీవ్ర అపాయంలో ఉన్నారు, కారణం వారు లైంగికతతో, మాదకద్రవ్యాలతో ప్రయోగం చేయడానికి యిష్టపడతారు, అపాయానికి తావిస్తూ క్షణికానుభూతి కొరకు జీవిస్తారు. అంతేకాదు వారు తాము చనిపోబోమని భావించి అధికారాన్ని తృణీకరిస్తారు,” అని ఎయిడ్స్‌ మరియు యౌవనులపై ఆధారపడిన ఓ సభలో అందించబడిన ఓ నివేదిక చెబుతోంది.—న్యూయార్క్‌ డైలీ న్యూస్‌ ఆదివారం మార్చి 7 1993.

“లైంగిక విషయాల్లో చురుకుగా పాల్గొనే ఆడపిల్లలు ఎయిడ్స్‌ మహమ్మారికి గురయ్యే తదుపరి వరుసలోని ‘ప్రధములుగా’ ముందుకొస్తున్నారని ఐరోపా, ఆఫ్రికా, ఆగ్నేయాసియాలో ఐక్య రాజ్యసమితి జరిపిన పరిశోధన కనుగొంది.”—ది న్యూ యార్క్‌ టైమ్స్‌ శుక్రవారం జూలై 30, 1993.

[16, 17వ పేజీలోని చిత్రాలు]

బైబిలు ఉపదేశం యెహోవాసాక్షులకు అటు సంఘంలోనూ ఇటు ఇంటిలోనూ ప్రయోజనకరంగా ఉంటుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి