“పాదాలకు కాదు, నోటికి ఆహారాన్ని అందించండి”
ఆఫ్రికానందలి భూస్థాపన పారంపర్య ఆచారాన్ని ఓ మారు పరిశీలించుట
“వారు తమ మృతులను పాతిపెట్టరు!” పశ్చిమ ఆఫ్రికాలో యెహోవాసాక్షులను గూర్చి తరచూ యిలాగే వ్యాఖ్యానించబడుతుంది. అయితే సాక్షులు తమ వాళ్లెవరైనా చనిపోతే తప్పకుండా సమాధి చేస్తారన్నది అందరికీ తెలిసిందే.
యెహోవాసాక్షులు తమ మృతులను సమాధి చేయరని ప్రజలు ఎందుకు అంటారు? ఎందుకంటే, ఆ ప్రాంతంలో ప్రఖ్యాతిగాంచిన భూస్థాపన ఆచారాలలో అనేకమైన వాటిని సాక్షులు ఆచరించరు.
సమాధిచేయడానికి సంబంధించిన పారంపర్య ఆచారాలు
ఆలియు, మధ్య నైజీరియా నందు ఓ చిన్న గ్రామంలో జీవిస్తున్నాడు. తన తల్లి చనిపోయినప్పుడు, అతను తన బంధువులకు ఆమె మరణ వార్తను తెలియజేసి ఆమె యింట్లో లేఖనాధార ప్రసంగాన్ని ఏర్పాటుచేశాడు. యెహోవాసాక్షుల ప్రాంతీయ సంఘంలోని ఓ పెద్ద యిచ్చిన ప్రసంగం, మృతుల పరిస్థితిని గూర్చి బైబిలులో ప్రస్తావించబడిన ఓదార్పుకరమైన పునరుత్థాన నిరీక్షణపై కేంద్రీకృతమైంది. ప్రసంగం తర్వాత, ఆలియు తల్లి సమాధి చేయబడింది.
బంధువులకు చాలా కోపం వచ్చింది. సహజంగా ఓ మనిషి చనిపోయిన రాత్రి జరిపే శవజాగారం లేనిదే సమాధి చేయడం పూర్తికానట్లు లెక్క. ఆలియు ప్రజల్లో శవజాగారం అంటే దుఃఖించే సమయం కాదు, అది సంబరం జరుపుకునే సమయం. శవానికి స్నానం చేయించి, తెల్ల బట్టలు కట్టించి మంచం మీద పడుకోబెడతారు. మరణం సంభవించిన యింటివారు సంగీతకారులను పిలిపిస్తారు, సీసాలు సీసాల్ల బీరూ ముంతలు ముంతల తాటి కల్లునూ తెప్పించి, ఓ దూడను గాని లేక మేకను గాని బలి యివ్వడానికి ఏర్పాటుచేస్తారు. అప్పుడు, మరుసటి రోజు తెల్లవారేదాకా పాడడానికి, ఆడడానికి, తినడానికి తాగడానికి బంధువులు స్నేహితులు వస్తారు.
ఈ పండుగ సమయంలో, శవం కాళ్ల దగ్గర ఆహారం ఉంచబడుతుంది. చనిపోయిన వ్యక్తి వెంట్రుకలు కొన్ని, వ్రేళ్లగోళ్లు, బొటన వ్రేళ్లగోళ్లు కత్తిరించి, రెండవ సమాధికొరకు అట్టేపెడతారు. అది రోజులు, వారాలు సంవత్సరాల తర్వాత కూడా జరుగుతుంది.
అంత్యక్రియల ఆచారకర్మలు ఓ వారంపాటు గాని అంతకంటే ఎక్కువే గానీ కొనసాగినప్పటికి, శవజాగారం జరిగిన మరుసటి రోజు, శవాన్ని సమాధి చేస్తారు. తర్వాత, “రెండవ సమాధి” జరుగుతుంది. వెంట్రుకలు, వ్రేలిగోళ్లు, బొటనవ్రేలి గోళ్ల భాగాలను ఓ తెల్లటి బట్టలో చుట్టి, అయిదు లేక ఆరు అడుగుల చెక్క పలకకు కడతారు. ఆటపాటలతో, కూడిన ఊరేగింపుతో ఆ పలక సమాధి స్థలానికి తీసుకువెళ్లబడి, అది సూచించే ఆ వ్యక్తి దగ్గర పాతిపెట్టబడుతుంది. మరలా, సంగీతం, తాగుడు, భోజనం అమితంగా జరుగుతుంది. అంత్యక్రియల వ్యవహారాలు పూర్తిచేయడానికి తుపాకితో ఓమారు ఆకాశంలోకి పేలుస్తారు.
ఆలియు వీటిలో దేనిని అనుమతించలేదు గనుక, చనిపోయినవారి యెడల గాని లేక వారు గౌరవించేవారిని గౌరవపర్చే పారంపర్య ఆచారాల యెడల గాని అతనికి గౌరవం లేదని నిందించబడ్డాడు. అయితే, యెహోవాకు సాక్షియైన ఆలియు, పారంపర్య ప్రకారం నడుచుకోడానికి ఎందుకు నిరాకరించాడు? కారణం, ఈ పారంపర్యం ఆధారపడిన మత ఆలోచనలను తెలిసి తెలిసి అతను అంగీకరించలేడు.
ఆఫ్రికానందలి పారంపర్య నమ్మకాలు
మనుష్యులు ఆత్మల లోకం నుండి వచ్చారనీ అక్కడికే మరలా వెళ్తాతారని ఆఫ్రికా అంతటిలో ఉన్న ప్రజలు నమ్ముతారు. నైజీరియా నందలి యరుబా జాతివారు యిలా అంటారు: “భూమి ఓ వ్యాపారస్థలం, అయితే స్వర్గమే మన ఇల్లు.” ఇగ్బో ప్రజల్లో యిలాంటి సామెత ఒకటుంది: “ఈ లోకంలో పుట్టే ప్రతివాడు, ఎంత కాలం ఈ భూమిమీద తిరుగాడినా చివరికి పరలోకానికి మరలాల్సిందే.”
ముందు ప్రస్తావించిన ఆచారాలను పరిశీలించండి. ఆత్మకు ఓ మంచి వీడ్కోలు చెప్పడమే శవ జాగారానికున్న ఉద్దేశం. ఆత్మీయ ప్రాణులకు తెల్లబట్టలు సరైన దుస్తులుగా పరిగణించబడుతున్నాయి. శవం కాలి దగ్గర ఆహారాన్నుంచడం, ఆ శవం కాళ్ల ద్వారా తింటుందనీ, అంతేకాకుండా తమ పితరుల ప్రాంతానికి ప్రయాణించేటప్పుడు దారిలో ఆకలిగొనకుండా ఆహారం యివ్వబడాలనే ఆలోచనలతో ముడిపడివుంది.
అంతేకాదు, ఆత్మ శరీరాన్ని విడిచినప్పుడు, రెండవ సమాధి చేయడం ద్వారా అది చివరిగా విడుదలపొందేంత వరకు అది పితరుల దగ్గరకు తిరిగి వెళ్లకుండా జీవించినవారి దగ్గరే తిరుగుతూ ఉంటుందని ప్రజలు సాధారణంగా నమ్ముతారు. రెండవ సమాధి చేయకపోతే ఆ ఆత్మకు కోపం వచ్చి బ్రతికి ఉన్నవారిని అది అనారోగ్యంతోనో మరణంతోనో బాధిస్తుందని ప్రజలు భయపడతారు. పరలోకానికి “ఆత్మను పంపించేయడానికి” తుపాకీని పేల్చడం జరుగుతుంది.
ఆఫ్రికాలో అంత్యక్రియల ఆచారాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిగా ఉన్నా, శరీరం చనిపోయినప్పుడు ఆత్మ బ్రతికి ఉంటుందనే నమ్మకం సాధారణంగా అందరికి ఉంటుంది. “పరలోకంనుండి వచ్చిన పిలుపుకు” ప్రతిస్పందించడానికి ఆ ఆత్మకు సహాయపడడమే ఈ కర్మకాండ ముఖ్య ఉద్దేశం.
ఈ నమ్మకాలనూ ఆచారాలను, క్రైస్తవమత సామ్రాజ్య సిద్ధాంతమైన మానవ ఆత్మ యొక్క అమర్త్యతా, దాని “పరిశుద్ధుల” ఆరాధనా ప్రోత్సహిస్తూ ఉన్నాయి. స్వాజిలాండ్ నందలి సైనిక మతగురువు వ్యాఖ్యానం అందుకు నిదర్శనం. యేసు పారంపర్య నమ్మకాలను తీసివేయడానికి రాలేదుగానీ, వాటిని నెరవేర్చి స్థిరపర్చడానికే వచ్చాడు. అని అతనన్నాడు. సహజంగా మతనాయకులు సమాధి చేసే పద్ధతులను పర్యవేక్షిస్తారు గనుక, అటు పారంపర్య నమ్మకాలనూ ఇటు వాటినుండి వచ్చే ఆచారాలను బైబిలు బలపరుస్తుందని అనేకమంది ప్రజలు భావిస్తున్నారు.
బైబిలు ఏమంటోంది
ఈ నమ్మకాలను బైబిలు బలపరుస్తుందా? మరణించినవారి స్థితిని గూర్చి ప్రసంగి 3:20 యిలా పేర్కొంటోంది: “సమస్తము [మానవులు, జంతువులు] ఒక్క స్థలమునకే పోవును; సమస్తము మంటిలోనుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును.” లేఖనాలు యింకా యిలా చెబుతున్నాయి: “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; . . . వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, . . . వారికిక నెప్పటికిని వంతు లేదు. . . . నీవు పోవు పాతాళమునందు [సమాధినందు] పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.”—ప్రసంగి 9:5, 6, 10.
ఇవి, మరితర లేఖనాలూ మృతులు మనలను చూడలేరు, మనం చెప్పేది వినలేరు, మనకు సహాయం చేయలేరు, హాని చేయలేరు అని స్పష్టం చేస్తున్నాయి. మీరు గమనించినదానికి యిది పొందికగా లేదా? ధనమూ పలుకుబడి గల ఓ వ్యక్తి చనిపోగా, అంత్యక్రియల ఆచారాలన్నింటిని నిర్వహించినప్పటికి ఆయన చనిపోయిన తర్వాత అతని కుటుంబం బాధలను అనుభవించడం మీరు చూసి ఉండవచ్చు. ఆ మనిషి ఆత్మగా బ్రతికే ఉంటే, తన కుటుంబానికి అతను సహాయం ఎందుకు చేయడు? అతను చేయలేడు ఎందుకంటే చనిపోయినవారికి జీవం లేదు, “చచ్చినవారు మరల బ్రదుకరు” అని బైబిలు చెప్పేదే సరైంది.—యెషయా 26:14.
దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు యిది నిజమని తెలుసు. లాజరు మరణించినప్పుడు ఏమి జరిగిందో పరిశీలించండి. బైబిలు యిలా పేర్కొంటోంది: “ఆయన [యేసు] ఈ మాటలు చెప్పిన తరువాత—మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలుకొలుప వెళ్లుచున్నానని వారితో [తన శిష్యులతో] చెప్పగా శిష్యులు—ప్రభువా, అతడు నిద్రించినయెడల బాగుపడుననిరి. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను.”—యోహాను 11:11-13.
యేసు మరణాన్ని నిద్ర, విశ్రాంతితో పోల్చాడన్నది గమనించండి. బేతనియకు ఆయన వచ్చినప్పుడు లాజరు సహోదరీలైన మరియ మార్తలను ఆయన ఓదార్చాడు. కరుణతో చలించిపోయిన యేసు కన్నీరు కార్చాడు. అయితే, లాజరు ఆత్మ యింకా బ్రతికి ఉండి తన పితరుల ప్రాంతానికి చేరడానికి సహాయాన్ని కోరుతోందని యేసు మాటగాని చర్యగానీ సూచించలేదు. బదులుగా, ఆయన ఏదైతే చేస్తానని చెప్పాడో సరిగ్గా అదే చేశాడు. ఆయన లాజరును పునరుత్థానం ద్వారా మృత్యు నిద్ర నుండి మేల్కొల్పాడు. చివరికి దేవుడు, సమాధుల్లో ఉన్నవారందరిని పురుత్థానం చేయడానికి యేసును ఉపయోగిస్తాడని యిది రుజువుచేసింది.—యోహాను 11:17-44; 5:28, 29.
కొందరెందుకు భిన్నంగా ప్రవర్తిస్తారు?
లేఖనాధారంకాని నమ్మకాలపై ఆధారపడిన అంత్యక్రియల ఆచారాలను ఆచరిస్తే తప్పా? తప్పేనని ఆలియు, యింకా లక్షలాది మంది యెహోవా సాక్షులు నమ్ముతున్నారు. అబద్ధమైన తప్పుదోవ పట్టించే సిద్ధాంతాలపై ఆధారపడిన ఏ ఆచారానికైనా మద్దతు నివ్వడం తప్పు అని, అది వేషధారణ అవుతుందని వారికి తెలుసు. మతపర వేషధారణగలవారని యేసు ఖండించిన పరిసయ్యులు సద్దూకయ్యులను పోలివుండడం వారికి యిష్టంలేదు.—మత్తయి 23:1-36.
అపొస్తలుడైన పౌలు తన సహచరుడైన తిమోతిని యిలా హెచ్చరించాడు: “అయితే కడవరి దినములో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసగించు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.” (1 తిమోతి 4:1, 2) మానవుల్లో మరణించినవారు బ్రతికే ఉన్నారన్న సిద్ధాంతం దయ్యాల బోధా?
అవును, అది దయ్యాల బోధే. “అబద్ధమునకు జనకుడునైన” అపవాదియైన సాతాను, హవ్వ శరీరంతోనే నిరంతరం జీవించగలదని సూచిస్తూ ఎన్నడూ చనిపోదని ఆమెతో చెప్పాడు. (యోహాను 8:44; ఆదికాండము 3:3, 4) శరీరం చనిపోయిన తర్వాత అమర్త్యమైన ఆత్మ జీవిస్తుందన్న సిద్ధాంతం వంటిది కాదిది. అయితే, దేవుని వాక్య సత్యమునుండి ప్రజలను తప్పుదోవ పట్టించాలన్న ప్రయత్నంలో సాతాను అతని దయ్యాలు మరణం తర్వాత జీవం ఉందనే ఆలోచనను పురికొల్పుతున్నారు. యెహోవాసాక్షులు బైబిలులో దేవుడు చెప్పేదాన్ని నమ్ముతారు గనుక, సాతాను అబద్ధానికి మద్దతునిచ్చే యోచనతో గానీ ఆచారాలతో గాని వారు ఏ మాత్రం పాలుపంచుకోరు.—2 కొరింథీయులు 6:14-18.
లేఖనాధారం కాని భూస్థాపన ఆచారాలను యెహోవా సేవకులు విసర్జించడం వల్ల తమ దృక్పథాలను పంచుకోని కొందరి అయిష్టతను వీరు పొందారు. కొందరు సాక్షులకు వారసత్వంగా వచ్చే ఆస్తి దక్కలేదు. కొందరు తమ కుటుంబాల నుండి వెలివేయబడ్డారు. అయితే, నిజ క్రైస్తవులుగా, దేవునికి నమ్మకమైన విధేయత ప్రపంచ తృణీకారాన్ని తెస్తుందని వారు గ్రహిస్తారు. యేసుక్రీస్తు యొక్క యథార్థ అపొస్తలులవలే, వారు “మనుష్యులకు కాదు దేవునికే . . . లోబడవలెను” అని నిర్ణయించుకున్నారు.—అపొస్తలుల కార్యములు 5:29; యోహాను 17:14.
చనిపోయిన తమ ప్రియులైన వారి జ్ఞాపకాలను తమ మదిలో ఉంచుకుంటూ నిజక్రైస్తవులు జీవించివున్న వారియెడల ప్రేమను కనపర్చడానికి కృషిచేస్తారు. ఉదాహరణకు, ఆలియు తన తండ్రి చనిపోయిన తర్వాత తన తల్లిని తన యింటికి తీసుకు వెళ్లి ఆమె శేష జీవితమంతటిలో ఆమెను పోషించాడు, ఆహారమిచ్చాడు, ఆమె యెడల శ్రద్ధ కనపర్చాడు. ఆలియు అందరి ఆచారం ప్రకారం తన తల్లికి సమాధి జరిపించలేదు గనుక అతను తన తల్లిని పట్టించుకోలేదని చెప్పేవారికి, తన ప్రజల్లో సామాన్యంగా చెప్పుకునే సామెతను అతను ప్రస్తావిస్తాడు: “నా పాదానికి ఆహారం పెట్టేముందు నానోటికి ఆహారం పెట్టు.” నోటికి ఆహారం పెట్టడం, లేక ఓ వ్యక్తి బ్రతికి ఉన్నప్పుడే అతని యెడల శ్రద్ధకనపర్చడం, ఓ మనిషి చనిపోయిన తర్వాత చేసే శవజాగారమూ దానికి సంబంధించి ముందుగా వివరించబడిన ఆచారం ప్రకారం పాదాలకు ఆహారం పెట్టడం కంటే ఎంతో ప్రాముఖ్యమైంది. వాస్తవానికి పాదాలకు ఆహారం పెట్టడం చనిపోయినవారికి అసలు ప్రయోజనకరం కాదు.
ఆలియు తన్ను విమర్శించేవారిని యిలా ప్రశ్నిస్తున్నాడు, ‘మీకు ఏది యిష్టం—మీ వార్థక్యంలో మీపై శ్రద్ధ కనపర్చడమా లేక మీరు చనిపోయిన తర్వాత పెద్ద ఉత్సవం ఏర్పాటు చేయడమా?’ అనేకులు తాము జీవించి ఉన్నప్పుడు శ్రద్ధ కనపర్చబడ్డమే ఎన్నుకున్నారు. వారు చనిపోయినప్పుడు, వారికి బైబిలు ఆధారితమైన జ్ఞాపకార్థమై ఆచరణను చేసి, మర్యాదకరమైన అంత్యక్రియలను జరిపిస్తారు అని తెలుసుకోవడాన్ని వారు మెచ్చుకుంటున్నారు.
యెహోవాసాక్షులు తమ ప్రియులైన వారికి అదే చేయాలని కృషిచేస్తున్నారు. వారు నోటికి ఆహారమిస్తారు గానీ పాదాలకు కాదు.