కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 3/15 పేజీలు 15-20
  • యెహోవా తన సంకల్పం నెరవేరుస్తాడని నమ్మండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా తన సంకల్పం నెరవేరుస్తాడని నమ్మండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పరిస్థితులు మరింత విషమించడానికి ఏది కారణమైంది?
  • దేవుని సంకల్పం మారలేదు
  • వారు యెహోవాపై నమ్మకముంచారు
  • క్రైస్తవ సాక్షులు దేవున్ని నమ్మారు
  • యెహోవా విశ్వాసులకు చేసిన తన వాగ్దానాల్ని నెరవేరుస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • విశ్వాసానికి పరీక్ష
    నా బైబిలు పుస్తకం
  • యెహోవా ఆయన్ని ‘నా స్నేహితుడు’ అని పిలిచాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • “మీ హృదయములను స్థిరపరచుకొనుడి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 3/15 పేజీలు 15-20

యెహోవా తన సంకల్పం నెరవేరుస్తాడని నమ్మండి

“నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.”—కీర్తన 37:29.

1. మానవుల యెడల, ఈ భూమి యెడల యెహోవా సంకల్పం ఏమిటి?

యెహోవా మన మొదటి తలిదండ్రులైన ఆదాము హవ్వలను సృజించినప్పుడు, వారిని పరిపూర్ణులుగా చేశాడు. వారు ఆయన నియమాలకు విధేయులైతే, ఈ భూమిపై వారు నిరంతరం జీవించేలాగున వారిని సృజించాడు. (ఆదికాండము 1:26, 27; 2:17) అంతేకాకుండా, దేవుడు వారిని పరదైసు పరిసరాల్లో ఉంచాడు. (ఆదికాండము 2:8, 9) యెహోవా వారితో యిలా అన్నాడు: “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి.” (ఆదికాండము 1:28) అలా వారి సంతానం చివరికి భూవ్యాప్తంగా వ్యాపిస్తుంది, మరి ఈ గ్రహము పరిపూర్ణ, సంతోషకర మానవజాతితో నిండిన పరదైసుగా మారుతుంది. మానవ కుటుంబం ఎంత చక్కగా ప్రారంభమైందో కదా! “దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగనుండెను.”—ఆదికాండము 1:31.

2. మానవ వ్యవహారాల స్థితి ఏ ప్రశ్నలను లేవనెత్తుతుంది?

2 అయితే, దేవుని మొట్టమొదటి ఉద్దేశానికి, వేలకొలది సంవత్సరాలుగా యింత వరకూ జరుగుతూ వచ్చిన మానవ వ్యవహారాలకు ఏ మాత్రం సారూప్యం లేదు. మానవజాతి యిక పరిపూర్ణత నుండి పూర్తిగా వైదొలగింది. వారికిక ఆనందం అన్నదే లేదు. ప్రపంచ పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయి, మరి ప్రవచించబడిన రీతిగా మన కాలంలో అవి అతి త్వరగా విషమించాయి. (2 తిమోతి 3:1-5, 13) మరి దేవుని సంకల్పం మన సమీప భవిష్యత్తులో నిజమౌతుందనే గట్టి నమ్మకాన్ని మనం ఎలా కల్గివుండగలం? ఇంకా ఎక్కువ కాలం యిలా ఈ వేదనా పరిస్థితులలోనే కొనసాగాల్సి వస్తుందా?

పరిస్థితులు మరింత విషమించడానికి ఏది కారణమైంది?

3. మానవజాతి తిరుగుబాటును యెహోవా వెంటనే ఎందుకు అంతమొందించలేదు?

3 యెహోవా ప్రేరేపించిన వాక్యపు సరైన జ్ఞానం గలవారికి దేవుడు భూమిపై చెడు పరిస్థితులను ఎందుకు అనుమతించాడో తెలుసు. దాని విషయమై ఆయన ఏం చేస్తాడో కూడా వారికి తెలుసు. దేవుడు మానవులకు అనుగ్రహించిన, స్వేచ్ఛగా ఎంపికచేసుకునే వరాన్ని మన మొట్టమొదటి తలిదండ్రులు దుర్వినియోగం చేశారని బైబిలు వృత్తాంతం నుండి వారు నేర్చుకున్నారు. (1 పేతురు 2:16 పోల్చండి.) వారు దేవున్నుండి స్వేచ్ఛను ఎన్నుకుని పొరపాటు చేశారు. (ఆదికాండము 2, 3 అధ్యాయాలు) వారి తిరుగుబాటు అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తింది, అవేమంటే: విశ్వ సర్వాధిపతికి మానవులపై పరిపాలించే హక్కు ఉందా? ఆయన పాలన వారికి శ్రేష్ఠమైనదా? దేవుని పర్యవేక్షణ లేకుండా మానవుల పాలన విజయవంతం కాగలదా? ఈ ప్రశ్నలకు జవాబును కనుక్కోడానికి శతాబ్దాల పాటు మానవ పాలనను కొనసాగనివ్వడమే సరైన పద్ధతి. దాని ఫలితాలు, మానవులు వారి సృష్టికర్త సహాయం లేకుండా విజయవంతం కాగలరా లేదా అన్న దాని ఫలితాలు ఏ అనుమానం లేకుండా చూపిస్తాయి.

4, 5. (ఎ) దేవుని పాలనను మానవులు తిరస్కరించడం వల్ల కలిగిన ఫలితమేమిటి? (బి) ఏ సంశయం రాకుండా గడచిన కాలం ఏమి చూపించింది?

4 ఆదాము హవ్వలు దేవుని విడిచిపెట్టినప్పుడు, ఆయన వారిని యిక ఏమాత్రమూ పరిపూర్ణతలో ఉండనివ్వలేదు. ఆయన మద్దతు లేనందువల్ల వారు కృశించిపోయారు. దాని ఫలితం, అపరిపూర్ణత, వృద్ధాప్యం, చివరికి మరణం. సంక్రమ నియమం ప్రకారం, మన మొదటి తలిదండ్రులు మనతో సహా వారి సంతానమంతటికీ ఆ హానికర స్వభావాలను సంక్రమింపజేశారు. (రోమీయులు 5:12) మరి వేల సంవత్సరాల మానవ పరిపాలన వల్ల కలిగిన ఫలితాల మాటేమిటి? “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు” అని ప్రసంగి 8:9 వాస్తవంగా పేర్కొన్నట్లు, అది వినాశనకరంగా ఉంటూ వచ్చింది.

5 తమ సృష్టికర్త లేకుండానే, తమ విషయాలు తామే విజయవంతంగా నడిపించుకునే సామర్థ్యం మానవులకు లేదని మరే సందేహం రాకుండా గడచిన కాలం చూపింది. ప్రేరేపిత బైబిలు రచయిత యిర్మీయా యిలా అన్నాడు: “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.”—యిర్మీయా 10:23; ద్వితీయోపదేశకాండము 32:4, 5; ప్రసంగి 7:29.

దేవుని సంకల్పం మారలేదు

6, 7. (ఎ) వేలకొలది సంవత్సరాల చరిత్ర యెహోవా సంకల్పాన్ని మార్చిందా? (బి) యెహోవా సంకల్పంలో ఏమి యిమిడివుంది?

6 దుష్టత్వమూ బాధలతో నిండిన వేల సంవత్సరాల మానవ చరిత్ర దేవుని సంకల్పాన్ని మార్చిందా? ఆయన వాక్యం యిలా అంటోంది: “ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింపలేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను.” (యెషయా 45:18) కాబట్టి, దేవుడు భూమిని మానవుల నివాసస్థానంగా తయారుచేశాడు, యిప్పటికీ ఆయన సంకల్పం అదే.

7 యెహోవా భూమిని కేవలం నివాసస్థలంగా మాత్రమే సృజించలేదు గాని పరిపూర్ణమైన, సంతోషంగల ప్రజలు దాన్ని అనుభవించే పరదైసుగా మారాలని కూడా ఆయన సంకల్పించాడు. అందుకనే “నీతి నివసించే,” “ఒక క్రొత్త భూమి” అనగా ఓ నూతన మానవ సమాజం ఉంటాయని బైబిలు ముందుగా చెప్పింది. (2 పేతురు 3:13) తన నూతన లోకంలో, “ఆయన వారి [మానవజాతి] కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు,” అని ప్రకటన 21:4 నందు దేవుని వాక్యం మనకు చెబుతోంది. ఈ కారణాల వల్లనే యేసు రానున్న క్రొత్త భూమిని గూర్చి “పరదైసు” అని మాట్లాడగల్గాడు.—లూకా 23:43.

8. యెహోవా తన సంకల్పాన్ని నెరవేరుస్తాడని మనం ఎందుకు నమ్మగలం?

8 యెహోవా సర్వ శక్తిమంతుడునూ సర్వ జ్ఞానియునైన విశ్వ సృష్టికర్త గనుక, ఎవ్వరూ ఆయన సంకల్పాన్ని ఆటంకపర్చలేరు. “సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు: ‘నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును.” (యెషయా 14:24) కనుక, ఈ భూమిని పరిపూర్ణ మానవులు జీవించే పరదైసుగా మారుస్తానని దేవుడు ఒక్కమారు చెబితే, అదే జరుగుతుంది. “సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు” అని యేసు చెప్పాడు. (మత్తయి 5:5; కీర్తన 37:29 పోల్చండి.) ఆ వాగ్దానం తప్పక నెరవేరుతుందని నమ్మి, దాని ప్రకారం మనం ప్రవర్తించవచ్చు. వాస్తవానికి, దాని కొరకు మనం మన జీవితాల్నే పణంగా పెట్టవచ్చు.

వారు యెహోవాపై నమ్మకముంచారు

9. యెహోవా యందు నమ్మకముందని చూపిన ఏ కార్యాన్ని అబ్రాహాము చేశాడు?

9 చరిత్రంతటిలో దేవునికి భయపడే ప్రజలనేకులు భూమి యెడల దేవుని సంకల్పం నెరవేరుతుందని ఒప్పించబడ్డారు గనుక దాని కొరకు వారు తమ జీవితాలనే పణంగా పెట్టారు. వారి జ్ఞానం పరిమితమైనా, వారు దేవున్ని నమ్మి, ఆయన చిత్తం నెరవేర్చడంలో తమ జీవితాలను నిర్మించుకున్నారు. ఉదాహరణకు, యేసు భూమిపై జీవించిన దానికి 2,000 సంవత్సరాల పూర్వం అంటే, బైబిలు వ్రాయబడక ముందు ఎంతో కాలం క్రితం అబ్రాహాము ఉండేవాడు. యెహోవా తన సంకల్పాలను నెరవేరుస్తాడని ఆయనపై అతడు నమ్మకముంచాడు. బహుశ, నోవహు నుండి బోధనందుకున్న తన నమ్మకమైన పితరుడు షేము నుండి సృష్టికర్తను గూర్చి అబ్రాహాము నేర్చుకుని ఉండవచ్చు. కాబట్టి, దేవుడు అబ్రాహాముతో కల్దీయుల ప్రవర్థమాన ప్రాంతమైన ఊరు నుండి, అపరిచిత, అపాయకరమైన కనాను ప్రాంతానికి వెళ్లమని చెప్పినప్పుడు, ఆ పితరుడు యెహోవాను నమ్మగల్గాడు కాబట్టే అతను వెళ్లాడు. (హెబ్రీయులు 11:8) యుక్త కాలంలో, యెహోవా ఆయనతో యిలా అన్నాడు: “నిన్ను గొప్ప జనముగా . . . చేయుదును.”—ఆదికాండము 12:2.

10, 11. అబ్రాహాము తన ఏకైక కుమారుడైన ఇస్సాకును అర్పించడానికి ఎందుకు సిద్ధపడ్డాడు?

10 అబ్రాహాముకు ఇస్సాకు పుట్టిన తర్వాత ఏం జరిగింది? ఇస్సాకు ద్వారా తన సంతతి వారు గొప్ప జనాంగంగా తయారౌతారని యెహోవా అబ్రాహాముకు సూచించాడు. (ఆదికాండము 21:12) కనుక తన విశ్వాస పరీక్షగా, తన కుమారుడైన ఇస్సాకును బలివ్వమని అబ్రాహాముకు యెహోవా చెప్పడం పూర్తి విరుద్ధంగా కన్పించి ఉండవచ్చు. (ఆదికాండము 22:2) అయినప్పటికి, యెహోవా యందు పూర్తి నమ్మకంతో ఇస్సాకును చంపడానికి కత్తిని నిజంగానే ఎత్తి, అబ్రాహాము దాన్ని అమలుపర్చడానికి చర్యలు గైకొన్నాడు. చివరి క్షణాన దేవుడు దూతను పంపించి అబ్రాహామును అలా చేయకుండా నివారించాడు.—ఆదికాండము 22:9-14.

11 అబ్రాహాము ఎందుకు అంతగా విధేయుడయ్యాడు? హెబ్రీయులు 11:17-19 దాన్ని బయల్పరుస్తోంది: “అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ‘ఇస్సాకువలననైనది “నీ సంతానమనబడును”’ అని యెవనితో చెప్పబడెనో, ఆ అబ్రాహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై, తన యేకకుమారుని అర్పించి, ఉపమానరూపముగా అతనిని మృతులలోనుండి మరల పొందెను.” రోమీయులు 4:20, 21 కూడా అదే విధంగా పేర్కొంటోంది: “అవిశ్వాసమువలన [అబ్రాహాము] దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక . . . ఆయన [దేవుడు] వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.”

12. అబ్రాహాము తన విశ్వాసాన్నిబట్టి ఎలా బహుకరించబడ్డాడు?

12 అబ్రాహాము కనపర్చిన విశ్వాసాన్నిబట్టి, ఇస్సాకు విడవబడ్డం, “గొప్ప జనాంగం” అతని ద్వారా రావడమే కాకుండా మరో విధంగా కూడా అతను ఆశీర్వదించబడ్డాడు. అబ్రాహాముతో దేవుడు యిలా అన్నాడు: “నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును.” (ఆదికాండము 22:18) ఎలా? దేవుని పరలోక రాజ్యపు రాజు అబ్రాహాము సంతతిలో వస్తాడు. ఆ రాజ్యము సాతాను ఆధ్వర్యంలో ఉన్న ఈ దుష్ట లోకాన్ని ఉనికిలో లేకుండా సమూలంగా నలగద్రొక్కుతుంది. (దానియేలు 2:44; రోమీయులు 16:20; ప్రకటన 19:11-21) ఆ తర్వాత, రాజ్య పాలన క్రిందుండే శుభ్రపర్చబడిన భూమిమీద, ప్రపంచవ్యాప్తంగా పరదైసు వృద్ధిచేయబడుతుంది, అంతేకాక దేవుని చిత్తం చేసే ప్రజలు “జనాంగములన్ని”టి నుండి వచ్చి పరిపూర్ణ ఆరోగ్యాన్నీ నిరంతర జీవితాన్నీ అనుభవిస్తారు. (1 యోహాను 2:15-17) రాజ్యాన్ని గూర్చి అబ్రాహాముకు పరిమిత జ్ఞానం మాత్రమే ఉన్నప్పటికి అతను దేవుని యందు నమ్మికయుంచి అది నెలకొల్పబడుతుందని ఎదురుచూశాడు.—హెబ్రీయులు 11:10.

13, 14. యోబు దేవునిపై ఎందుకు నమ్మికనుంచాడు?

13 అనేక వందల సంవత్సరాల తర్వాత యోబు అనే వ్యక్తి ఉండేవాడు. ఇప్పుడు అరబియా అని పిలువబడే ప్రాంతంలో, సా.శ.పూ. 17, 16 శతాబ్దాల మధ్య అతను జీవించేవాడు. అతను కూడా బైబిలు రాయబడక ముందే జీవించాడు. యోబు “యథార్థవంతుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు.” (యోబు 1:1) సాతాను అతన్ని అవమానకర, బాధాకర జబ్బుతో మొత్తినప్పుడు ఆ నమ్మకస్థుడైన వ్యక్తి తన పరీక్షా సమయమంతటిలో ఎన్నడూ “ఒక్క పాపభరిత మాటనైనా ఉచ్చరించలేదు.” (యోబు 2:10, ది న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌) యోబు దేవున్ని నమ్మాడు. తానెందుకు అంత బాధను అనుభవిస్తున్నాడో అన్న వివరాలు అతనికి తెలియకపోయినా, తన జీవితాన్ని దేవునికి, ఆయన వాగ్దానాల విషయమై పణంగా పెట్టాడు.

14 తాను చనిపోయినా ఏదోఒక రోజున పునరుత్థానం ద్వారా తన్ను దేవుడు తిరిగి జీవింపజేస్తాడని యోబుకు తెలుసు. “నీవు పాతాళములో [సమాధిలో] నన్ను దాచినయెడల ఎంతో మేలు . . . నాకు యింతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసికొనవలెనని నేనెంతో కోరుచున్నాను! మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? . . . అలాగుండినయెడల నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను” అని యెహోవాతో అన్నప్పుడు ఆయన ఈ నిరీక్షణను సూచించాడు. (యోబు 14:13-15) మనస్తాపంలో ఉన్నప్పటికీ, “మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను” అని అంటూ యెహోవా సర్వాధిపత్యమందు యోబు తన విశ్వాసాన్ని కనపర్చాడు.—యోబు 27:5.

15. దావీదు యెహోవా సంకల్పంపై నమ్మకాన్ని ఎలా వ్యక్తపర్చాడు?

15 యోబు తర్వాత సుమారు ఆరు శతాబ్దాల పిదప, అంటే యేసు భూమిమీద జీవించినదానికి వేయి సంవత్సరాలకు ముందు జీవించిన దావీదు నూతన లోకంపై తన నమ్మకాన్ని వ్యక్తపర్చాడు. కీర్తనల్లో ఆయన యిలా అన్నాడు: “యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు . . . దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.” ఈ అనిశ్చల విశ్వాసంవల్లనే దావీదు యిలా ఉద్బోధించాడు: “యెహోవాయందు నమ్మికయుంచి, . . . యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.”—కీర్తన 37:3, 4, 9-11, 29.

16. ‘గొప్ప సాక్షి సమూహము’నకు ఏ నిరీక్షణ ఉంది?

16 శతాబ్దాలుగా, నమ్మకమైన స్త్రీపురుషులు భూమిపై నిరంతరం జీవించాలనే యిదే నిరీక్షణను కల్గివుండేవారు. వాస్తవానికి, వారు ‘గొప్ప సాక్షి సమూహంగా’ తయారై, అక్షరార్థంగా తమ జీవితాలను యెహోవా సంకల్పాల కొరకు పణంగా పెట్టారు. యెహోవా యొక్క అనాదికాల సాక్షుల్లో అనేకులు “మరి శ్రేష్ఠమైన పునరుత్థానం” పొందడానికి గాను తమ విశ్వాసంవల్ల హింసించబడి చంపబడ్డారు. అదెలా? నూతన లోకంలో దేవుడు వారికి శ్రేష్ఠమైన పునరుత్థానాన్ని, నిత్యజీవిత ఉత్తరాపేక్షను పారితోషకంగా అందిస్తాడు.—యోహాను 5:28, 29; హెబ్రీయులు 11:35; 12:1.

క్రైస్తవ సాక్షులు దేవున్ని నమ్మారు

17. మొదటి శతాబ్ద క్రైస్తవులు యెహోవాను ఎంత దృఢంగా నమ్మారు?

17 సా.శ. మొదటి శతాబ్దంలో క్రొత్తగా స్థాపించబడిన క్రైస్తవ సంఘానికి యెహోవా, ఆ రాజ్యాన్ని గూర్చి భూమిపై దాని పాలనను గూర్చి మరిన్ని వివరాలను బయల్పర్చాడు. ఉదాహరణకు, పరలోక రాజ్యంలో యేసుతో కూడా సహవసించే వారి సంఖ్య 1,44,000 అని ఆయన ఆత్మ, అపొస్తలుడైన యోహాను చేత ప్రేరణాత్మకంగా రాయించింది. వీరు “భూలోకములోనుండి కొనబడిన”వారై దేవుని నమ్మకమైన సేవకులుగా ఉంటారు. (ప్రకటన 7:4; 14:1-4) వారు క్రీస్తుతో కూడా పరలోకమందు “రాజులుగా” భూమిని పరిపాలిస్తారు. (ప్రకటన 20:4-6) పరలోక రాజ్యమూ దాని భూపరిపాలన విషయంలో యెహోవా తన సంకల్పాన్ని నెరవేరుస్తాడని మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఆయన్ను ఎంత దృఢంగా నమ్మారంటే, వారు తమ విశ్వాసం కొరకు తమ జీవితాల్నే అర్పించడానికి ఇష్టపడ్డారు. అనేకులు సరిగ్గా అదే చేశారు.

18. గతంలో తమ వంటి విశ్వాసులైన వారిని ఈనాడు యెహోవాసాక్షులు ఎలా అనుకరిస్తున్నారు?

18 ఈనాడు, దాదాపు 50 లక్షలమంది యెహోవాసాక్షులకు కూడా శతాబ్దాల పూర్వం జీవించిన విశ్వాసులవలెనే, దేవునిపై నమ్మకం ఉంది. ఈ ప్రస్తుత దిన సాక్షులు దేవుని వాగ్దానాలనుబట్టి తమ జీవితాల్ని పణంగా పెట్టారు. వారు తమ జీవితాలను ఆయనకు సమర్పించుకొని, తమ విశ్వాసాన్ని కాపాడుకోడానికి వారు పూర్తి బైబిలును కల్గివున్నారు. (2 తిమోతి 3:14-17) ఈ ఆధునిక దిన యెహోవాసాక్షులు “మనుష్యులకు కాదు దేవునికే మనము లోబడవలెను గదా” అని చెప్పిన మొదటి శతాబ్దపు యేసు అనుచరులను అనుకరిస్తారు. (అపొస్తలుల కార్యములు 5:29) ఈ శతాబ్దంలో ఈ క్రైస్తవ సాక్షులనేకులు క్రూరంగా హింసింపబడ్డారు. కొందరైతే తమ విశ్వాసాన్నిబట్టి చంపబడ్డారు కూడా. ఇతరులు అస్వస్థతవల్ల, ప్రమాదాలవల్ల, వృద్ధాప్యం వల్ల మరణించారు. అయితే, గతంలోని నమ్మకమైన సాక్షుల్లా, వారు దేవున్ని నమ్మారు ఎందుకంటే పునరుత్థానం ద్వారా దేవుడు మరలా వారికి జీవాన్నిస్తాడని వారికి తెలుసు.—యోహాను 5:28, 29; అపొస్తలుల కార్యములు 24:15; ప్రకటన 20:12, 13.

19, 20. మన కాలానికి సంబంధించిన బైబిలు ప్రవచనం గూర్చి మనం ఏమి గుర్తించగలం?

19 యెహోవాసాక్షులు అన్ని జనాంగాలనుండి ఒకే ప్రపంచవ్యాప్త సహోదరత్వంలోకి తీసుకురాబడతారని మునుపెన్నడో బైబిలు ప్రవచనంలో చెప్పబడినదాన్ని వారు మెచ్చుకుంటున్నారు. (యెషయా 2:2-4; ప్రకటన 7:4, 9-17) ఇతర యథార్థ హృదయులను యెహోవా కృపా సంరక్షణలోకి సమకూర్చడానికి ఆయన వారిచేత ప్రపంచవ్యాప్తంగా ప్రకటించే పనిని చేయిస్తున్నాడు. (సామెతలు 18:10; మత్తయి 24:14; రోమీయులు 10:13) త్వరలోనే యెహోవా తన అద్భుతమైన నూతన లోకాన్ని ప్రవేశపెడుతున్నాడని తెలుసుకొని వీరందరూ ఆయన యెడల పూర్తి నమ్మకాన్ని ఉంచుతున్నారు.—1 కొరింథీయులు 15:58; హెబ్రీయులు 6:10 పోల్చండి.

20 ప్రాముఖ్య సంవత్సరమైన 1914 నుండి అంటే, యిప్పటికే సుమారు 80 సంవత్సరాలుగా సాతాను లోకం దాని అంత్యదినాల్లో ఉందని బైబిలు ప్రవచనం సూచిస్తోంది. ఈ లోకం దాని అంతానికి సమీపిస్తోంది. (రోమీయులు 16:20; 2 కొరింథీయులు 4:4; 2 తిమోతి 3:1-5) దేవుని రాజ్యం త్వరలోనే లోక వ్యవహారాలన్నిటినీ తన ఆధీనంలోకి పూర్తిగా తీసుకుంటుందని యెహోవాసాక్షులు గుర్తిస్తారు గనుక, వారు ధైర్యాన్ని నిశ్చయతను కల్గివున్నారు. దేవుడు ఈ ప్రస్తుత దుష్టలోకాన్ని అంతమొందించి, నీతియుక్తమైన తన నూతన లోకాన్ని ప్రవేశపెట్టి, శతాబ్దాలుగా భూమి మీద కొనసాగుతున్న చెడు పరిస్థితులను సమూలంగా తుడిచేస్తాడు.—సామెతలు 2:21, 22.

21. ప్రస్తుతం శ్రమలున్నా మనం ఎందుకు సంతోషించగలం?

21 ఆ తర్వాత గతంలో మనం పొందిన బాధలకు యివ్వబడే నష్టపరిహారం కంటే ఎంతో గొప్ప ఆశీర్వాదాలను దేవుడు యిక నిరంతరం మనపై కుమ్మరించడం ద్వారా తన గొప్ప శ్రద్ధను కనపరుస్తాడు. నూతన లోకంలో మనకు ఎన్ని మంచి విషయాలు జరుగుతాయంటే అసలు క్రితం మనం అనుభవించిన శ్రమలు జ్ఞాపకం చేసుకుందామన్నా జ్ఞాపకానికి రావు. అప్పుడు యెహోవా ‘తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికనూ తృప్తిపరుస్తాడని’ తెలుసుకోవడం ఎంత ఓదార్పుకరంగా ఉంటుంది.—కీర్తన 145:16; యెషయా 65:17, 18.

22. మనం యెహోవాయందు ఎందుకు నమ్మకముంచాలి?

22 నూతన లోకంలో, నమ్మకమైన మానవజాతి రోమీయులు 8:20-21 నెరవేరడం చూస్తుంది: “సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందును.” యేసు తన అనుచరులకు నేర్పించిన ఈ ప్రార్థన నెరవేర్పును వారు చూస్తారు: “నీ రాజ్యము వచ్చునుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక.” (మత్తయి 6:10) కాబట్టి, యెహోవా యెడల మీ పూర్తి నమ్మకాన్ని ఉంచండి కారణం యెహోవా యొక్క అమోఘమైన వాగ్దానం యిలా ఉంది: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.”—కీర్తన 37:29.

మీరెలా జవాబిస్తారు?

◻ మానవుల యెడల ఈ భూమి యెడల యెహోవా సంకల్పం ఏమిటి?

◻ దేవుడు భూమిపైన చెడు పరిస్థితులను ఎందుకు అనుమతించాడు?

◻ గతంలోని నమ్మకమైన ప్రజలు యెహోవా యెడల తమ నమ్మకాన్ని ఎలా చూపించారు?

◻ దేవుని సేవకులు నేడు యెహోవాను ఎందుకు నమ్ముతారు?

[16వ పేజీలోని చిత్రం]

దేవుడు మానవులు భూపరదైసులో సంతోషంతో నిరంతరం జీవించాలని సృజించాడు

[18వ పేజీలోని చిత్రం]

మృతుల్లోనుండి పునరుత్థానం చేయగల యెహోవా సామర్థ్యంపై అబ్రాహాము నమ్మికనుంచాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి