కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 3/1 పేజీలు 13-17
  • ఫలాలు—మంచివి, చెడ్డవి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఫలాలు—మంచివి, చెడ్డవి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దర్శనములోని మంచి అంజూరపు పండ్లు
  • దర్శనంలోని జబ్బుగల అంజూరపు పండ్లు
  • మన దినాల్లోని సూచనార్థక జబ్బుగల అంజూరపు పండ్లు
  • మనకు ఓ హెచ్చరికతో కూడిన పాఠం
  • యెహోవాను తెలుసుకోవాలనే హృదయం మీకు ఉందా?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • యెహోవాను “ఎరుగు హృదయము” మీకుందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • ప్రతి ఒక్కరు తమ అంజూరపు చెట్టు క్రింద కూర్చుంటారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ఆమోసు మేడిపండ్లు ఏరుకొనేవాడా లేక మేడికాయలకు గాట్లుపెట్టేవాడా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 3/1 పేజీలు 13-17

ఫలాలు—మంచివి, చెడ్డవి

“యెహోవా నాకు చూపగా . . . రెండు గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్లవంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను. రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లుండెను. అవి తిన శక్యముకానంతగా జబ్బువి.”—యిర్మీయా 24:1, 2.

1. తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు యెహోవా ఎలా ప్రేమను కనపర్చాడు, వారెలా ప్రతిస్పందించారు?

అది సా.శ.పూ. 617వ సంవత్సరము. అది యెరూషలేముకు, దాని ప్రజలకు వ్యతిరేకంగా యెహోవా తగిన తీర్పును విధించడానికి కేవలం పది సంవత్సరాల ముందు సంగతి. అప్పటికే 30 సంవత్సరాలనుండి యిర్మీయా ఎంతో కష్టించి సువార్త ప్రకటిస్తున్నాడు. ఈ పరిస్థితిని గూర్చి 2 దినవృత్తాంతములు 36:15 నందలి ఎజ్రా విశదీకరణను గమనించండి: “వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాసస్థలమందును కటాక్షము గలవాడై వారియొద్దకు తన దూతలద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఆయన పెందలకడలేచి” పంపుచూ వచ్చెను. ఈ ప్రయత్నమంతటి ఫలితమేమైయుండెను? దుఃఖకరంగా, ఎజ్రా 16వ వచనంలో యింకనూ ఈ విధంగా చెబుతున్నాడు: “వారు దేవుని దూతలను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింపశక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనులమీదికి వచ్చెను.”

2, 3. యెహోవా యిర్మీయాకు చూపించిన మహత్వపూర్ణ దర్శనాన్ని వివరించండి.

2 అయితే యూదా జనాంగము పూర్తిగా నిర్మూలించబడుతుందని దీని భావమా? సమాధానం తెలుసుకొనుటకు, మనం యిర్మీయాకు ఆయన పేరుతోనున్న పుస్తకంలోని 24వ అధ్యాయంలో ఆయనకు యివ్వబడిన ఒక మహత్వపూర్ణ దర్శనాన్ని పరిశీలిద్దాం. దేవుడు ఈ దర్శనంలో తన నిబంధన ప్రజల ఉన్నతికి సాదృశ్యంగా రెండు గంపల అంజూరపు పండ్లను ఉపయోగించాడు. ఇవి మంచి, చెడు అనే విలక్షణమైన రెండు రకాల ఫలాలను సూచించాయి.

3 ఇర్మీయా 24వ అధ్యాయం 1, 2 వచనాలు దేవుని ప్రవక్త చూసినదానిని వర్ణిస్తున్నాయి: “బబులోనురాజైన నెబుకద్రెజరు యూదారాజైన యెహోయాకీము కుమారుడగు యెకోన్యాను యూదా ప్రధానులను శిల్పకారులను కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనునకు తీసికొనిపోయిన తరువాత యెహోవా నాకు చూపగా యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన రెండు గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్లవంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను. రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లుండెను; అవి తిన శక్యముకానంతగా జబ్బువి.”

దర్శనములోని మంచి అంజూరపు పండ్లు

4. విశ్వాసులైన ఇశ్రాయేలీయులకు అంజూరపు పండ్లను గూర్చిన దర్శనం ఏ ఓదార్పుకరమైన సమాచారాన్ని ఇచ్చింది?

4 యిర్మీయా చూసినవాటినిగూర్చి ప్రశ్నించిన తర్వాత, యెహోవా 5, 6 వచనాల్లో యింకా ఈవిధంగా చెబుతున్నాడు: “వారికి మేలుకలుగవలెనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను, ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టునట్లు లక్ష్యపెట్టుచున్నాను. వారికి మేలు కలుగునట్లు నేను వారిమీద దృష్టియుంచుచు, ఈ దేశమునకు వారిని మరల తీసికొనివచ్చి, పడగొట్టక వారిని కట్టెదను, పెల్లగింపక వారిని నాటెదను. వారు పూర్ణహృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికిచ్చెదను.”

5, 6. (ఎ) కొంతమంది ఇశ్రాయేలీయులు ఎలా ‘మేలుకలుగునట్లు’ కల్దీయుల దేశమునకు పంపివేయబడ్డారు? (బి) విశ్వాసులైన ఇశ్రాయేలీయులు బందీలుగా ఉన్నప్పుడు ఎలా ‘వారికి మేలు కలుగునట్లు యెహోవా దృష్టి’ వారిని కనిపెట్టియుండెను?

5 కాబట్టి ఇక్కడ యెహోవా చెప్పినదానినిబట్టి ఇకముందు మంచి సమయం కలదని, అనగా యూదా జనాంగము పూర్తిగా నిర్మూలించబడదని అగపడుచున్నది. కాని ఈ మంచి అంజూరపు పండ్ల ప్రాముఖ్యత ఏమిటి?

6 ఇపుడు, యెకోన్యా లేదా యెహోయాకీను, రాజైన నెబుకద్నెజరుకు ఇష్టపూర్వకంగా యెరూషలేమును అప్పగించుటకు పూర్వం యూదాను కేవలం మూడు మాసాల పది రోజులు మాత్రమే రాజుగా ఏలాడు. ఆయనతోపాటు బందీలుగా చెరగొనిపోబడినవారిలో దానియేలు, అతని ముగ్గురు హెబ్రీ సహచరులైన హనన్యా, మిషాయేలు, అజర్యా, యెహెజ్కేలు కూడా ఉన్నారు. ఈ బందీల జీవితాలు బబులోను రాజుచే భద్రపరచబడ్డాయి, కాబట్టి ‘వారికి మేలుకలుగునట్లుగా కల్దీయుల దేశమునకు చెరగా పంపినట్లుగా’ యెహోవా ఈ బందీలనందరినీ దృష్టించాడని చెప్పవచ్చును. ‘వారికి మేలు కలుగునట్లు నేను వారిమీద దృష్టియుంచెదనని’ కూడా యెహోవా చేసిన వాగ్దానాన్ని మీరు గమనించారా? ఇది ఎలా నెరవేరింది? 80 సంవత్సరాల తర్వాత, సా.శ.పూ. 537లో, శేషించిన వారి సంతానము తిరిగి యూదా దేశమునకు వెళ్లుటకు అనుమతించుచు రాజైన కోరెషు ఆజ్ఞాపించునట్లుగా యెహోవా చేశాడు. ఈ విశ్వాసులైన యూదులు యెరూషలేము పట్టణమును తిరిగి నిర్మించారు; వారు వారి దేవుడైన యెహోవా ఆరాధనకొరకు క్రొత్త ఆలయాన్ని నిర్మించారు; వారు తమ పూర్ణహృదయంతో ఆయనయొద్దకు తిరిగివచ్చారు. కాబట్టి వీటన్నింటిలో, ఈ బందీలు, వారి సంతానము యెహోవాకు మిక్కిలి మంచి అంజూరపు పండ్లవలెనుండిరి.

7. ఆధునిక యిర్మీయా తరగతిపై ఎప్పుడు, మరియు ఎలా యెహోవా దృష్టి “వారికి మేలు కలుగునట్లు” ఉండెను?

7 యిర్మీయా ప్రవచన మాటలను గూర్చిన, మునుపటి శీర్షికలో అవి మన 20వ శతాబ్దమునకు భావాన్ని కల్గియున్నవని మనం తెలుసుకున్నాము. మరి 24వ అధ్యాయం కూడ మినహాయించబడలేదు. మొదటి ప్రపంచయుద్ధపు భయానకకాలంలో, చాలామంది యెహోవాకు సమర్పించుకున్న సేవకులు ఏదోఒక విధంగా మహాబబులోను ప్రభావానికి గురయ్యారు. కాని ‘వారికి మేలు కలుగునట్లు యెహోవా దృష్టి’ వారిని కనిపెట్టుకొనియుండెను. మరి ఆ విధంగానే మహా కోరెషు అయిన యేసుక్రీస్తు ద్వారా యెహోవా, వారిపైనున్న మహాబబులోను ఆధిపత్యాన్ని త్రెంచి, క్రమంగా వారిని ఒక ఆత్మీయ పరదైసులోనికి తీసుకువచ్చాడు. ఈ ఆత్మీయ ఇశ్రాయేలీయులు తమ పూర్ణహృదయంతో యెహోవాయొద్దకు తిరిగివచ్చారు. తరువాత, వారు 1931లో, యెహోవాసాక్షులనే నామాన్ని స్వీకరించుటకు ఆనందించారు. నిజంగా, ఇప్పుడు వారు యెహోవా దృష్టిలో చాలామంచి అంజూరపు పండ్ల గంపగా అయ్యారని చెప్పవచ్చును.

8. అంజూరపు పండ్లవంటి రాజ్యవర్తమానపు తీయదనాన్ని యెహోవాసాక్షులు ఏవిధంగా లోకమందంతటను ప్రకటించారు?

8 యెహోవాసాక్షులను మహాబబులోనునుండి విడిపించుటలోని దేవుని దయాపూర్వక ఉద్దేశమును వారు పోగొట్టుకొనలేదు. వారు అంజూరపు పండ్లవంటి రాజ్యవర్తమానపు తీయదనాన్ని వారికొరకుమాత్రమే ఉంచుకొనలేదు, గాని వారు మత్తయి 24:14లో “ఈ రాజ్యసువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును” అనే యేసు మాటలనుబట్టి దానిని సుదూర ప్రాంతాలలో ప్రకటించారు. దాని ఫలితమేమైయుండెను? ఆత్మీయ ఇశ్రాయేలీయులుకాని 47,00,000 కంటే ఎక్కువమంది గొర్రెలాంటి వ్యక్తులు మహాబబులోనునుండి తెగతెంపులు చేసుకున్నారు!

దర్శనంలోని జబ్బుగల అంజూరపు పండ్లు

9. యిర్మీయా దర్శనంలోని జబ్బు అంజూరపు పండ్లు ఎవరిని సూచించాయి, వారికి ఏమి సంభవించనైయుంది?

9 కాని యిర్మీయా దర్శనంలోని జబ్బుగల అంజూరపు పండ్లగంప విషయమేమి? యిర్మీయా 24:8-10 వచనాలలో కనబడే యెహోవా మాటలపై యిర్మీయా యిప్పుడు దృష్టిసారిస్తున్నాడు. “యూదారాజైన సిద్కియాను అతని ప్రధానులను దేశములో శేషించినవారిని ఐగుప్తు దేశమున నివసించువారిని, మిక్కిలి జబ్బువైనందున తినశక్యముగాని ఆ జబ్బు అంజూరపుపండ్లవలె ఉండజేసెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు వారు యిటు అటు చెదరగొట్టబడుటకై భూరాజ్యము లన్నిటిలోను, నేను వారిని తోలివేయు స్థలములన్నిటిలోను, వారిని భీతికరముగాను నిందాస్పదముగాను సామెతగాను అపహాస్యముగాను శాపాస్పదముగాను ఉండజేసెదను. నేను వారికిని వారి పితరులకును ఇచ్చిన దేశములో ఉండకుండ వారు పాడైపోవువరకు నేను ఖడ్గమును క్షామమును తెగులును వారిలోకి పంపెదను.”

10. సిద్కియాను యెహోవా ఎందుకు ‘జబ్బు అంజూరపు పండు’గా పరిగణించాడు?

10 కాబట్టి సిద్కియా నిజంగా యెహోవా దృష్టిలో ‘జబ్బుగల అంజూరపుపండు’ వలె ప్రవర్తించాడు. యెహోవా నామంలో నెబుకద్నెజరుకు చేసిన యథార్థతా ప్రమాణాన్ని పరిత్యజించి, అదే రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడమే గాకుండా, యిర్మీయాద్వారా యెహోవా తనపై చూపిన కరుణనుకూడా పూర్తిగా తృణీకరించాడు. నిజానికి, యిర్మీయాను కూడా కారాగారంలో బంధించడానికి సిద్ధపడ్డాడు! ఎజ్రా రాజుయొక్క దృక్పథాన్ని సంక్షిప్తంగా 2 దినవృత్తాంతములు 36:12లో ఈవిధంగా వివరించుటలో ఆశ్చర్యంలేదు: “అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడత నడచుచు, . . . తన్నుతాను తగ్గించుకొనకయు ఉండెను.” సిద్కియా మరియు యెరూషలేములో మిగిలినవారు యెహోవా దృష్టికి జబ్బుపడి, కుళ్లిన అంజూరపు పండ్లగంపవలె ఉండిరి!

మన దినాల్లోని సూచనార్థక జబ్బుగల అంజూరపు పండ్లు

11, 12. నేడు ఎవరు జబ్బు అంజూరపు పండ్లుగా గుర్తింపబడుతున్నారు, వారికి ఏమి జరుగుతుంది?

11 ఈనాడు మనచుట్టూవున్న లోకాన్ని చూడండి. సూచనార్థకంగా జబ్బుగల అంజూరపు పండ్లగంపను మనం కనుగొనగలమని మీరనుకుంటారా? అయితే, మనం మనకాలాన్ని యిర్మీయా కాలానికి పోల్చడంద్వారా నిజాలను పరిశీలిద్దాం. ఈ 20వ శతాబ్దంలో, యెహోవా మహాశ్రమల కాలంలో రాబోయే తన ఉగ్రతనుగూర్చి జనములను తదేకంగా హెచ్చరించుటకు ఆయన అభిషక్త శేషమైన యిర్మీయా తరగతిని ఉపయోగించాడు. తన నామమునకివ్వవలసిన మహిమను యివ్వుమని, ఆత్మతోనూ సత్యముతోనూ తనను ఆరాధించుమని, పరిపాలించుచున్న తన కుమారుడైన యేసుక్రీస్తును న్యాయసమ్మత భూపరిపాలకునిగా గుర్తించుమని జనాంగాలకు ఆయన ఉద్బోధించాడు. ప్రతిస్పందన ఏమైయున్నది? యిర్మీయా కాలంలో మాదిరిగానే వుంది. జనములన్నియు యెహోవా దృష్టిలో చెడుచేయుటలో కొనసాగుతున్నవి.

12 ఈ తిరుగుబాటు దృక్పథాన్ని రేకెత్తించేవారెవరైయున్నారు? యిర్మీయావంటి దేవుని దూతలను దేవుని సేవకులుగా వారికున్న అధికారాన్ని ప్రశ్నించడంద్వారా ఎగతాళి చేసేవారెవరైయున్నారు? దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నదెవరు? ఈనాడు యెహోవాసాక్షుల అనేక హింసల వెనుకనున్నదెవరు? దీని సమాధానం అందరికీ తెలిసినదే—అది క్రైస్తవమత సామ్రాజ్యం, ప్రాముఖ్యంగా మతగురువులే! ముందున్న శీర్షికలో మనం పరిశీలించినట్లుగా, క్రైస్తవమత సామ్రాజ్యం యొక్క కుళ్లిన, చెడిపోయినటువంటి ఫలాల్ని చూడండి. ఆహా, నిజంగా భూమిపై యీనాడు సూచనార్థకంగా జబ్బుపడిన ఒక అంజూరపు పండ్లగంప ఉన్నదనుట వాస్తవమే. వాస్తవంగా, అవి “తిన శక్యముకానంతగా జబ్బువి” అని యెహోవా చెబుతున్నాడు. యిర్మీయాద్వారా యెహోవా పలికిన మాటలు మనకాలంవరకూ ప్రతిధ్వనించాయి: ‘దేశములో ఉండకుండ వారు పాడైపోవుదురు’! క్రైస్తవమత సామ్రాజ్యానికి వ్యతిరేకంగా యెహోవా క్రోధానికి శాంతంలేదు.

మనకు ఓ హెచ్చరికతో కూడిన పాఠం

13. మొదటి కొరింథీయులు 10:11 నందలి పౌలు మాటల దృష్ట్యా, రెండు గంపల అంజూరపు పండ్లను గూర్చిన దర్శనాన్ని మనమెలా అర్థంచేసుకోవాలి?

13 మనము యిర్మీయా ప్రేరేపిత హెచ్చరిక సందేశంయొక్క అంతర్గత సూచనలను పరిశీలించుచుండగా, 1 కొరింథీయులు 10:11లోని అపొస్తలుడైన పౌలు మాటలు మన చెవులలో మారుమ్రోగుతాయి: “ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.” రెండు గంపల అంజూరపు పండ్ల దర్శనంద్వారా మనకు తెలియజేయబడిన హెచ్చరికను మనం వ్యక్తిగతంగా మన హృదయంలోనికి స్వీకరిస్తున్నామా? మనము చర్చిస్తున్నది ఇశ్రాయేలుకు సంభవించిన వాటిలో ప్రాముఖ్యమైన భాగమైయుండి, మనకు ఒక హెచ్చరిక గల దృష్టాంతముగానున్నది.

14. యెహోవా ఆప్యాయంగా చూపిన శ్రద్ధకు ఇశ్రాయేలీయులు ఎలా స్పందించారు?

14 చివరిగా, 2 సమూయేలు 7:10లో మనము కనుగొనునట్లుగా, ఇశ్రాయేలు గూర్చి రాజైన దావీదుకు యెహోవా చెప్పిన మాటలను జ్ఞప్తికి తెచ్చుకుందాం: “ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండ తమ స్వస్థలమందు నివసించునట్లు దానియందు వారిని నాటెదను.” యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయులయెడల ప్రతి విషయంలోనూ ఆప్యాయతా శ్రద్ధ వహించాడు. ఇశ్రాయేలీయులు వారి జీవితాల్లో మంచి ఫలాలను ఫలించుటకు వారికి ప్రతి కారణం వుంది. అయితే వారు యెహోవా దైవిక బోధను విని, ఆయన ఆజ్ఞలను పాటించవలసియుండిరి. కాని, వారిలో కొందరు మాత్రమే అలా చేశారు. ఎక్కువమంది చాలా మొండివైఖరిగలవారై, క్రమరహితులై తద్వారా కుళ్లిన, చెడిపోయిన ఫలాల్ని ఫలించారు.

15. నేడు యెహోవా దయకు ఆత్మీయ ఇశ్రాయేలీయులు, గొర్రె వంటి వారి సహవాసులు ఎలా ప్రతిస్పందించారు?

15 అయితే, మన కాలం విషయమేమి? శేషించిన ఆత్మీయ ఇశ్రాయేలీయులు, గొర్రెల్లాంటి వారి సహవాసుల యెడల యెహోవా ఎంతో దయను కనపర్చాడు. పందొమ్మిది వందల పందొమ్మిదిలో వారి ఆత్మీయ విడుదల సంభవించినప్పటినుండి, తదేకంగా ఆయన కన్నులు వారిపైనున్నవి. ఆయన యెషయా ద్వారా ముందుగానే ప్రవచించినట్లుగా, విశ్వమంతటిలోనూ మహాగొప్ప బోధకుడైన యెహోవానుండి వారు ప్రతిదినమూ దైవిక ఉపదేశాన్ని పొందుతారు. (యెషయా 54:13) ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుద్వారా నడిపింపబడిన ఈ దైవిక బోధ ఫలితంగా వారిమధ్యలో మెండుగా సమాధానం ఏర్పడింది, అది స్థిరంగా వారిని యెహోవాతో సన్నిహిత సంబంధానికి తీసుకువచ్చింది. మనమందరము యెహోవాను తెలిసికొనుటకు, ఆయన మాటలు ఆలకించుటకు, ఆ తర్వాత మన జీవితాల్లో ఎల్లప్పుడూ మంచి ఫలాలను ఫలించుటకు ఇది ఒక అద్భుతమైన ఆత్మీయ పర్యావరణాన్ని దయచేస్తుంది—ఆ ఫలాలే యెహోవాకు మహిమ తెస్తాయి. దీని భావం మన జీవితాలే!

16. రెండు గంపల అంజూరపు పండ్లకు సంబంధించిన దర్శనాన్ని గూర్చి మనలో ప్రతి ఒక్కరం ఏ వ్యక్తిగత అన్వయింపును చేసుకోవచ్చు?

16 కాని ఇంతగా దేవుని కృప ఉన్నప్పటికి, చాలామంది ప్రాచీన యూదాలో వారి జీవితాల్లో కుళ్లిన, చెడిపోయిన ఫలాలను ఫలించినట్లుగానే, ఇంకనూ అవిధేయులుగాను, క్రూరహృదయులుగాను తయారైన వారు కొందరున్నారు. ఇది ఎంత విషాదకరమైనదో! మంచివి-చెడ్డవి అనే తమ ఫలాలతోనున్న రెండు అంజూరపు పండ్లగంపలద్వారా మన దృష్టికి తీసుకురాబడ్డ హెచ్చరికా పాఠాన్ని మనలో ఎవ్వరమూ మరచిపోకుండా ఉందాము! ధర్మవిరోధులైన క్రైస్తవమత సామ్రాజ్యానికి విరుద్ధంగా యెహోవాయొక్క సరియైన తీర్పు వేగంగా సమీపిస్తుండగా, మనం అపొస్తలుడైన పౌలు ఉద్బోధను హృదయంలోనికి తీసుకొనగలము: “ప్రతిసత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టుదము.”—కొలొస్సయులు 1:10.

పునఃసమీక్ష “ఫలాలు—మంచివి, చెడ్డవి” మరియు “జనములతో యెహోవా వ్యాజ్యెమాడుచున్నాడు” నందలి 1-4 పేరాలు

◻ మంచి అంజూరపు పండ్ల గంప దేన్ని సూచిస్తుంది?

◻ దర్శనంలోని జబ్బుగల అంజూరపు పండ్ల గంప ఎలా స్పష్టమయ్యింది?

◻ యిర్మీయా సమాచారం మనకే హెచ్చరిక పాఠాన్ని ఇస్తున్నది?

◻ సా.శ.పూ. 607వ సంవత్సరం మరియు సా.శ. 1914వ సంవత్సరం గురించి ఏమిటి ప్రత్యేకత?

[15వ పేజీలోని చిత్రం]

మంచి అంజూరపు పండ్లవలె, దేవుని ప్రజలు తియ్యని రాజ్య ఫలాన్ని తెచ్చారు

[15వ పేజీలోని చిత్రం]

క్రైస్తవమత సామ్రాజ్యం జబ్బుగల అంజూరపు పండ్ల గంపగా నిరూపించబడ్డారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి