కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 3/1 పేజీలు 17-23
  • జనములతో యెహోవా వ్యాజ్యెమాడుచున్నాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జనములతో యెహోవా వ్యాజ్యెమాడుచున్నాడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • విచ్చలవిడి రాజ్యమైన క్రైస్తవమత సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తీర్పు
  • మహాబబులోనుకు వ్యతిరేకంగా తీర్పు
  • “జనములన్నిటికి” వ్యతిరేకంగా తీర్పు
  • మందకాపరులు గోలెత్తి, మొర్రపెట్టాలి
  • యిర్మీయా గ్రంథములోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 3/1 పేజీలు 17-23

జనములతో యెహోవా వ్యాజ్యెమాడుచున్నాడు

“భూమ్యంతమువరకు సందడి వినబడును, యెహోవా జనములతో వ్యాజ్యెమాడుచున్నాడు.”—యిర్మీయా 25:31.

1, 2. (ఎ) రాజైన యోషీయా మరణం తరువాత యూదా దేశములో ఏం జరిగింది? (బి) యూదా చివరి రాజు ఎవరు, ఆయన తన అపనమ్మకత్వాన్నిబట్టి ఎలా బాధను అనుభవించాడు?

యూదా దేశము అపాయకరమైన కాలములను ఎదుర్కోవలసివచ్చింది. ఒక మంచిరాజైన యోషీయా, రగులుచున్న యెహోవా కోపాన్ని తాత్కాలికంగా ఆపాడు. కాని సా.శ.పూ. 629లో యోషీయా చంపబడిన తర్వాత ఏమి జరిగింది? ఆయన తర్వాత రాజ్యాధికారంలోకి వచ్చిన రాజులు యెహోవాను అగౌరవపర్చారు.

2 యోషీయా నాల్గవ కుమారుడైన సిద్కియా, యూదయ రాజ్యానికి ఆఖరి రాజు, 2 రాజులు 24:19లో చెప్పబడినట్లుగా, “[తన అన్నయైన] యెహోయాకీముయొక్క చర్య అంతటి చొప్పున సిద్కియా యెహోవా దృష్టికి చెడునడత” నడచుటలో కొనసాగెను. దాని ఫలితం? నెబుకద్నెజరు యెరూషలేముకు వ్యతిరేకంగా వచ్చి, సిద్కియాను చెరపట్టుకుని, తన కళ్లముందే తన కుమారులను సంహరించి, అతనిని గ్రుడ్డివానిని చేసి, బబులోనుకు తీసుకొనిపోయాడు. అంతేగాకుండా, బబులోనీయులు యెహోవా మందిరమును, యెరూషలేమును దహించి, ఆయన ఆరాధనలో ఉపయోగించబడిన పాత్రలను కొల్లగొట్టి స్వాధీనం చేసుకున్నారు. దానినుండి తప్పించుకున్నవారు బందీలుగా బబులోనుకు కొనిపోబడ్డారు.

3. సా.శ.పూ. 607లో యెరూషలేము నాశనం చేయబడటంతో ఏ కాలం ప్రారంభమయ్యింది, ఆ కాలాంతమున ఏమి సంభవింపనైయుండెను?

3 అదే సంవత్సరం, అనగా సా.శ.పూ. 607లో, యెరూషలేము చివరకు నాశనము చేయబడుటకు మాత్రమేగాకుండా, లూకా 21:24 నందు సూచించినట్లు అది “అన్యరాజుల కాలములు” మొదలు కావడాన్ని గుర్తించింది. ఈ 2,520 సంవత్సరాల కాలం మన శతాబ్దంలోని 1914లో సమాప్తమైంది. నెబుకద్నెజరు కంటే గొప్పవాడై, సింహాసనాసీనుడైన తన కుమారునిద్వారా చెడిపోయిన ఈ లోకానికి తీర్పు తీర్చడానికి యెహోవాకు అప్పటికి సమయం ఆసన్నమైయుండెను. ఈ ఆధునిక కాలంలో దేవునికి, క్రీస్తుకు భూమిపై ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకుంటున్న యూదయకు సమాంతరంగానున్న దానితోనే ఈ తీర్పు మొదలౌతుంది.

4. యిర్మీయా ప్రవచనానికి సంబంధించి ఇప్పుడు ఏ ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి?

4 యూదా దాని రాజుల చివరికాలంలో ఉన్న గందరగోళానికి, పొరుగు దేశాలకుకూడా వినాశకర సంఘటనల ప్రభావం విస్తరిస్తున్న దానికి—క్రైస్తవమత సామ్రాజ్యంలో ఈనాడున్న గందరగోళానికి మనమేమైనా సమాంతరాన్ని చూడగలమా? నిజంగా మనం చూడగలం! యెహోవా ఈనాడు విషయాలను ఎలా చక్కబరుస్తాడు అనే దాని గురించి యిర్మీయా ప్రవచనం ఏమి సూచిస్తున్నది? మనం పరిశీలిద్దాము.

5, 6. (ఎ) దాని నాశనానికి ముందు యూదాలోవున్న పరిస్థితి, 1914 తరువాత నుండి క్రైస్తవమత సామ్రాజ్యంలో ఉన్న పరిస్థితితో ఎలా సారూప్యాన్ని కలిగివుంది? (బి) ఆధునిక యిర్మీయా క్రైస్తవమత సామ్రాజ్యానికి ఏ సమాచారం తీసుకువెళ్లాడు?

5 బ్రిటీష్‌ గణితశాస్త్రజ్ఞుడు, తత్వవేత్తయైన బర్‌ట్రెండ్‌ రస్సెల్‌ 40 సంవత్సరాల క్రితం ఈవిధంగా వ్యాఖ్యానించాడు: “పందొమ్మిది వందల పధ్నాలుగు మొదలుకొని, విధి నిర్ణయమన్నట్లు, మరింత గొప్ప విపత్తునకు ముందుగానే నిర్ణయించబడి పయనిస్తున్నట్లు కనిపిస్తున్న దానిని చూచి లోకం పోకడలు ఎంతగా కలత చెందాయో ప్రతి ఒక్కరికి తెలుసు.” జర్మన్‌ రాజనీతిజ్ఞుడైన కొన్‌రాట్‌ అడినార్‌ ఈ విధంగా చెప్పాడు: “భద్రత, నెమ్మది అనేవి 1914 నుండి మానవుల జీవితాల్లోనుండి అదృశ్యమైపోయాయి.”

6 ఈనాడు, యిర్మీయా కాలంలో వలెనే, ముఖ్యంగా ఈ శతాబ్దంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలలో అమాయకుల రక్తాన్ని మహాసాగరంలా చిందించడంద్వారా, ఈ దుష్టవ్యవస్థ అంతానికి సమీపంలో ఉందని గుర్తించబడింది. బైబిలులోని దేవున్ని ఆరాధిస్తున్నామని చెప్పుకునే క్రైస్తవమత సామ్రాజ్య దేశాలే ఈ యుద్ధాలలో ఎక్కువ భాగం వహించాయి. ఎంత వేషధారణ! యిర్మీయా 25:5,6లోని మాటలను వారితో చెప్పుమని యెహోవా తన సాక్షులను పంపాడనుటలో ఆశ్చర్యం లేదు: “మీ చేతిపనులవలన నాకు కోపము పుట్టించకుండునట్లును, నేను మీకు ఏ బాధయు కలుగజేయకుండునట్లును, అన్యదేవతలను అనుసరించుటయు, వాటిని పూజించుటయు, వాటికి నమస్కారముచేయుటయు మాని, మీరందరు మీ చెడ్డమార్గమును మీ దుష్టక్రియలను విడిచి పెట్టి [తిరగండి].”

7. క్రైస్తవమత సామ్రజ్యం యెహోవా హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిందని చెప్పటానికి ఏ సాక్ష్యాధారం ఉంది?

7 అయినను, క్రైస్తవమత సామ్రాజ్య దేశాలు వెనుదిరుగుటలో విఫలమయ్యాయి. కొరియా, వియత్నాం దేశాలలో యుద్ధదేవతకు యింకనూ వారు బలులను యివ్వడంద్వారా ఇది ప్రదర్శించబడింది. వారు మృత్యు వ్యాపారులైన ఆయుధాలను తయారుచేయువారికి ఆర్ధికంగా సహాయపడుటలో కొనసాగుతునే వున్నారు. క్రైస్తవమత సామ్రాజ్య దేశాలు 1980వ దశకంలో ప్రతిసంవత్సరం ఆయుధాలకొరకే ఎక్కువ భాగాన్ని అనగా దాదాపు ఒక లక్ష కోట్ల అమెరికన్‌ డాలర్లను ఖర్చుపెట్టారు. ఒక్క అమెరికాలోనే 1951 నుండి 1991 వరకుగల సైనిక వ్యయం, అమెరికా కార్పోరేషన్‌లన్నింటి మొత్తం నికరలాభాలకంటే మించిపోయింది. ప్రచ్ఛన్నయుద్ధం సమసిపోయిందని బిగ్గరగా ప్రకటనలు చేసినప్పటినుండి, పాతబడ్డ అణుఆయుధాలన్నీ తక్కువ చేయబడ్డాయి, కాని చాలా మరణకరమైన ఆయుధాల ఆయుధశాలలు అలాగేవున్నాయి, వాటి వృద్ధి కొనసాగుతునే ఉంది. ఏదోఒకరోజు ఇవి ఉపయోగించబడవచ్చును.

విచ్చలవిడి రాజ్యమైన క్రైస్తవమత సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తీర్పు

8. యిర్మీయా 25:8, 9 నందలి మాటలు క్రైస్తవమత సామ్రాజ్యంపై ఎలా నెరవేర్చబడతాయి?

8 యిర్మీయా 25:8, 9లోనున్న యెహోవా తదుపరి మాటలు ప్రస్తుతం క్రైస్తవ నీతిప్రమాణాలను అనుసరించి జీవించుటలో విఫలమైన క్రైస్తవమత సామ్రాజ్యానికే ప్రాముఖ్యంగా అన్వయిస్తాయి: “సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తరదేశములోనున్న సర్వజనములను, నా సేవకుడైన నెబుకద్రెజరను బబులోనురాజును పిలువనంపించుచున్నాను; ఈ దేశముమీదికిని దీని నివాసుల మీదికిని చుట్టునున్న యీ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను; ఈ జనులను శాపగ్రస్తులగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికిని పాడుగాను ఉండజేసెదను.” ఆవిధంగా, మహాశ్రమలు దేవుని ప్రజలమని చెప్పుకునే క్రైస్తవమత సామ్రాజ్యంతో మొదలై, చివరకు భూవ్యాప్తంగా, ‘చుట్టూనున్న యీ జనులందరి మీదికిని’ వ్యాపిస్తాయి.

9. మన కాలంలో క్రైస్తవమత సామ్రాజ్యం యొక్క ఆత్మీయ పరిస్థితి ఏ విధాలుగా హీనమైపోయింది?

9 ఒకానొక కాలంలో క్రైస్తవమత సామ్రాజ్యంలో బైబిలును గౌరవించడం, దాదాపు విశ్వవ్యాప్తంగా వివాహం, కుటుంబ జీవితం సంతోషానికి మూలమని దృష్టించడం, ప్రజలు ఉదయాన్నే లేచి వారి ప్రతిదిన పనులను నెరవేర్చడం జరిగేది. చాలామంది సాయంకాల దీపకాంతిలో దేవుని వాక్యం చదవడంలో, పఠించడంలో నూతన ఉత్సాహాన్ని పొందేవారు. కాని ఈనాడు, లైంగిక ప్రవృత్తి, విడాకులు, మాదకద్రవ్యవినియోగం, త్రాగుబోతుతనం, అపచారం, పేరాశ, సోమరితనం, టివీ బానిసలగుట—ఇవన్నియు, మరితర దుర్గుణాలు భయంకరమైన స్థాయిలో జీవితాన్ని కలుషితం చేశాయి. క్రైస్తవమత సామ్రాజ్య విచ్చలవిడితనంపై యెహోవా దేవుడు విధించనైయున్న నాశనానికి ఇది ప్రారంభ చర్య.

10. యెహోవా తీర్పులు అమలుచేయబడిన తరువాత క్రైస్తవమత సామ్రాజ్య పరిస్థితి ఎలా ఉంటుందో వివరించండి.

10 మనం యిర్మీయా 25వ అధ్యాయం 10, 11 వచనాల్లో చదువునట్లుగా, యెహోవా యిలా ప్రకటిస్తున్నాడు: “సంతోషనాదమును ఉల్లాసశబ్దమును, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును తిరుగటిరాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండ చేసెదను. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును.” క్రైస్తవమత సామ్రాజ్య మహోన్నత మందిరాలు, విలాసభవంతులు విరిగిపడి చూర్ణమై నాశనమైనప్పుడు నిజంగా ఇది పాడుగానేవుంటుంది. ఈ నాశనం ఎంత విస్తృతంగా ఉంటుంది? యిర్మీయా కాలంలో, యూదాకు దాని పొరుగు దేశాలకు నాశనం 70 సంవత్సరాలు కొనసాగింది, దానిని కీర్తనలు 90:10 ఒక పూర్తి జీవితకాలంగా వివరిస్తున్నది. నేడు యెహోవా విధించే తీర్పు సంపూర్ణమైంది, నిత్యమూ ఉండేది.

మహాబబులోనుకు వ్యతిరేకంగా తీర్పు

11. క్రైస్తవమత సామ్రాజ్యాన్ని నాశనం చేయడంలో ఎవరు పరికరాలుగా ఉపయోగింపబడతారు? ఎందుకు?

11 ప్రకటన 17:12-17లో ప్రవచించినట్లుగా, ప్రపంచ అబద్ధ మతసామ్రాజ్యమును నాశనం చేయుటకు, “పదికొమ్ములు” అనగా ఐక్యరాజ్యసమితి సైనిక సభ్యుల హృదయాలలో, యెహోవా “తన సంకల్పమును కొనసాగించునట్లు” బుద్ధిపుట్టించడంద్వారా, తన విచిత్రకార్యం తలపెట్టే సమయం వస్తుంది. ఇది ఏవిధంగా వస్తుంది? అనేకమైన మార్గాలు కలవు, ప్రకటన 17వ అధ్యాయంలోని “పదికొమ్ములు” బహుశ 16వ వచనంలో చెప్పినట్లుగా, “వారు ఆ వేశ్యను ద్వేషించి, . . . అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు.” అది నిజమే, అణుఆయుధాలు బహుళంగా ఉత్పత్తి చేయబడ్డాయి, భూమి మీద యుద్ధం చెలరేగుతున్న స్థలాల్లో అవి యింకనూ ఉత్పత్తి చేయబడుతూనే ఉన్నాయి. కాని యెహోవా తన ప్రతీకారాన్ని తీర్చుకొనుటకు ఏవిధంగా దానిని రాజకీయపాలకుల హృదయాలలో ప్రవేశపెడతాడో మనం వేచిచూడాలి.

12. (ఎ) బబులోను యెరూషలేమును నాశనం చేసిన తరువాత, దానికి ఏమి సంభవించింది? (బి) క్రైస్తవమత సామ్రాజ్యం నాశనం చేయబడిన తరువాత జనాంగములకు ఏమి జరుగుతుంది?

12 ప్రాచీనకాలంలో యెహోవా కోపాగ్నిని అనుభవించటానికి బబులోను వంతు వచ్చింది. ఆ ప్రకారంగానే, యిర్మీయా 25వ అధ్యాయం, 12వ వచనం మొదలుకొని, ఆ ప్రవచనం మారిన దృక్కోణంతో విషయాలను దృష్టిస్తున్నది. నెబుకద్నెజరు యిక యెహోవా కార్యనిర్వాహకుని పాత్రలో లేడు, మరి బబులోను యిప్పుడు లోకరాజ్యాలలో చేర్చబడింది. ఇది ఈనాటి పరిస్థితిని పోలివుంది. ప్రకటన 17వ అధ్యాయంలోని “పదికొమ్ములు” అబద్ధమతాన్ని పాడుచేస్తాయి, కాని తరువాత, ప్రకటన 19వ అధ్యాయంలో వివరించబడినట్లుగా, వారుకూడా మిగిలిన “భూరాజులు” అందరితోసహా నాశనాన్ని అనుభవిస్తారు. యెహోవా ప్రజలను దోచుకున్న “ఆ జనులందరితోపాటు” బబులోను ఏవిధంగా తీర్పులోకి వచ్చిందో యిర్మీయా 25:13, 14 వచనాలు వివరిస్తున్నాయి. యూదాను శిక్షించుటలో యెహోవా నెబుకద్నెజరును కార్యనిర్వాహకునిగా ఉపయోగించుకున్నాడు. కాని నెబుకద్నెజరు మరియు అతని తరువాతి బబులోను రాజులును గర్వంతో యెహోవాకే విరుద్ధంగా తమనుతాము హెచ్చించుకున్నారు, ఉదాహరణకు, ఇది యెహోవా ఆలయంలోని పాత్రలను అపవిత్రం చేయడంద్వారా ప్రదర్శించబడింది. (దానియేలు 5:22, 23) బబులోనీయులు యెరూషలేమును నాశనం చేసినపుడు, యూదాకు చుట్టుప్రక్కలగల జనాంగాలు అనగా మోయాబు, అమ్మోను, తూరు, ఎదోము మరితర జనాంగాలు అమితంగా ఆనందించి, దేవుని ప్రజలను హేళనచేశారు. వారుకూడా యెహోవానుండి తగిన ప్రతిఫలం పొందవలసియున్నారు.

“జనములన్నిటికి” వ్యతిరేకంగా తీర్పు

13. “క్రోధపు మద్య పాత్ర” అంటే ఏమిటి, ఆ పాత్రలోనిది త్రాగేవారికి ఏమి జరుగుతుంది?

13 కాబట్టి, యిర్మీయా 25వ అధ్యాయం 15, 16 వచనాల్లో వ్రాయబడినట్లుగా యిలా ప్రకటిస్తున్నాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకీలాగు సెలవిచ్చుచున్నాడు—నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతిలోనుండి తీసికొని, నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికి దాని త్రాగింపుము. వారు దాని త్రాగి సొక్కిసోలుచు నేను వారిమీదికి పంపుచున్న ఖడ్గమునుబట్టి వెఱ్ఱివాండ్రగుదురు.” ఎందుకిది ‘యెహోవా క్రోధపు మద్యపాత్ర’యై యున్నది? మత్తయి 26:39, 42, యోహాను 18:11లో యేసు తనకు సంబంధించిన దేవుని చిత్తమును సూచించే ఒక “పాత్రను” గురించి మాట్లాడాడు. అదేరకంగా, జనాంగాలు దైవిక క్రోధమను మద్యము త్రాగాలనే యెహోవా చిత్తాన్ని సూచించుటకు ఒక పాత్ర ఉపయోగింపబడింది. ఈనాటి జనాంగములకు ముంగుర్తుగానున్న జనాంగముల గుంపులను యిర్మీయా 25:17-26 పేర్కొంటున్నది.

14. యిర్మీయా ప్రవచనం ప్రకారం, యెహోవా ఉగ్రతా పాత్రనుండి ఎవరికి త్రాగటానికి లభిస్తుంది, మన దినానికి ఇది దేన్ని సూచిస్తుంది?

14 యూదా వలెనే, క్రైస్తవమత సామ్రాజ్యం “పాడుగాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను” చేయబడిన తర్వాత, మొత్తం ప్రపంచ అబద్ధ మతసామ్రాజ్యం కొరకు నాశనమనేది వేచియుంది. తరువాత, ఐగుప్తుగా సూచించబడిన ప్రపంచమంతయు యెహోవా క్రోధపు మద్యపాత్రను త్రాగవలసియున్నారు! ఔను, “సమీపమున ఉన్నవారేమి దూరమున ఉన్నవారేమి ఉత్తరదేశముల రాజులందరును భూమిమీదనున్న రాజ్యములన్నియు దానిలోనిది త్రాగుదురు.” చివరకు, “షేషకురాజు వారి తరువాత త్రాగును.” ఈ “షేషకురాజు” ఎవరైయున్నాడు? షేషకు అనేది బబులోనుకుగల ఒక సూచనార్థక నామము, ఒక నిగూఢవార్త లేక సంకేతమైయున్నది. సాతాను బబులోనుమీద అదృశ్యరాజుగా ఉన్నట్లుగానే, యేసు తెలియజేసినట్లు నేటివరకూ అతడు “ఈ లోకాధికారియైయున్నాడు.” (యోహాను 14:30) ఆవిధంగా, యెహోవా క్రోధపు పాత్రంతటను అందింపబడుతున్నపుడు జరిగే సంఘటనల క్రమమును నిర్ధారించుటలో యిర్మీయా 25వ అధ్యాయం 17 నుండి 26 వచనాలు, ప్రకటన 18 నుండి 20 అధ్యాయాలతో అనురూపత కల్గియున్నవి. మొదటిగా, ప్రపంచ అబద్ధ మతసామ్రాజ్యం నాశనం కావలసి ఉంది, తరువాత రాజకీయ శక్తులు, ఆ తరువాత సాతాను తానే అగాధములోకి పడవేయబడతాడు.—ప్రకటన 18:8; 19:19-21; 20:1-3.

15. “శాంతి భద్రతల” అరుపు వినబడినప్పుడు ఏమి జరుగుతుంది?

15 ప్రచ్ఛన్నయుద్ధం ముగిసి, ఒకేఒక్క మహాశక్తి మిగిలియున్నదని భావించి శాంతి భద్రతలను గూర్చి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ప్రకటన 17:10లో వివరింపబడినట్లుగా, ఆ మహాశక్తి అనగా క్రూరమృగముయొక్క ఏడవ తల “కొంచెము కాలముండవలెను.” కాని ఆ “కొంచెము కాలము” దాని అంతమునకు చేరుకుంటున్నది. తొందరలోనే, రాజకీయ “శాంతి భద్రతల” అరుపులన్నియు, “వారికి ఆకస్మికముగా [రాబోయే] నాశనము తటస్థించుటకు” మార్గమునేర్పరచును. అలాగని అపొస్తలుడైన పౌలు వివరిస్తున్నాడు.—1 థెస్సలొనీకయులు 5:2, 3.

16, 17. (ఎ) ఎవరైనా యెహోవా తీర్పును తప్పించుకోటానికి ప్రయత్నిస్తే, ఫలితమేమైయుంటుంది? (బి) ఏ నాశనకరమైన పద్ధతిలో యెహోవా చిత్తం త్వరలోనే భూమిపై నెరవేర్చబడుతుంది?

16 సాతాను లోకవ్యవస్థంతయు, క్రైస్తవమత సామ్రాజ్యంతో మొదలై, యెహోవా క్రోధపు పాత్రను త్రాగవలసిందే. ఇంకనూ ఆయన యిర్మీయాకు ఇచ్చిన ఆజ్ఞ 25వ అధ్యాయం 27 నుండి 29 వచనాల్లో ఈవిధంగా వ్రాయబడింది: “నీవు వారితో ఈలాగు చెప్పుము—ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—నేను మీమీదికి పంపబోవు యుద్ధముచేత త్రాగి మత్తిల్లి కక్కుకొనినవారివలెనే యుండి మీరు మరల లేవకుండ పడుదురు. మేము త్రాగమని వారు నీ చేతిలోనుండి ఆ పాత్రను తీసికొననొల్లని యెడల నీవు వారితో ఇట్లనుము—మీరు అవశ్యముగా దాని త్రాగవలెనని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడుచేయ మొదలుపెట్టగా మీకు శిక్షలేకుండ పోవునా? మీరు శిక్షింపబడకపోరు. భూలోక నివాసులందరిమీదికి నేను ఖడ్గమును రప్పించుచున్నాను; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు.”

17 అవి చాలా ప్రభావవంతమైన మాటలు—నిజంగా, భయోత్పాతకమైన మాటలు, ఎందుకంటే విశ్వమంతటికి సర్వాధికారియు, ప్రభువైన యెహోవాదేవుని ద్వారా వచ్చిన మాటలవి. వేలకొలది సంవత్సరాలనుండి, ఆయన పవిత్రనామంపై వచ్చిపడిన దూషణను, కళంకాన్ని, విద్వేషాన్ని ఆయన ఎంతో ఓర్పుతో సహించాడు. కాని చివరకు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు “మీరీలాగు ప్రార్థనచేయుడి, పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని భూమిపైనున్నప్పుడు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థనకు ఆయన జవాబునిచ్చే సమయం వచ్చింది. (మత్తయి 6:9, 10) క్రోధమును తీర్చుకొనుటలో యేసు ఆయన ఖడ్గముగా ప్రవర్తించాలని యెహోవా చిత్తమైయుంది.

18, 19. (ఎ) యెహోవా నామమున జయించటానికి ఎవరు బయలువెళ్తారు, ఆయన తన విజయాన్ని సాధించటానికి ముందు దేనికొరకు వేచివుంటాడు? (బి) యెహోవా ఉగ్రత యొక్క గాలిని దేవదూతలు విడుదల చేసినప్పుడు, భూమిపై ఎలాంటి భయానక సంఘటనలు జరుగుతాయి?

18 ప్రకటన 6వ అధ్యాయంలో, యేసు తెల్లనిగుర్రముపై కూర్చుండి ‘జయించుచు, జయించుటకు’ బయలువెళ్లుటను గూర్చి మొదటిగా మనము చదివెదము. (2వ వచనం) ఆయన 1914లో పరలోకరాజుగా సింహాసనాసీనుడగుటతో ఇది ఆరంభమయ్యింది. అప్పటినుండి మన భూమిని పట్టిపీడిస్తున్న మొత్తం యుద్ధములు, కరువు, వ్యాధులను సూచించే ఇతర గుర్రములు, వాటి రౌతులు ఆయనను అనుసరించారు. కాని ఈ గందరగోళమంతా ఎప్పుడు అంతమౌతుంది? ప్రకటన 7వ అధ్యాయం మనకు తెలియజేసినట్లుగా, ఆత్మీయ ఇశ్రాయేలీయులును, ప్రతి జనములోనుండి వచ్చిన ఒక గొప్పసమూహము రక్షణకొరకు సమకూర్చబడేంత వరకూ నలుగురు దేవదూతలు “భూమియొక్క నాలుగు దిక్కుల వాయువులను” పట్టుకొనియుంటారు. (1వ వచనం) ఆతర్వాత ఏమౌతుంది?

19 యిర్మీయా 25వ అధ్యాయం 30, 31 వచనాలు ఇంకనూ ఈవిధంగా చెబుతున్నాయి: “ఉన్నత స్థలములోనుండి యెహోవా గర్జించుచున్నాడు, తన పరిశుద్ధాలయములోనుండి తన స్వరమును వినిపించుచున్నాడు. తన మందమేయు స్థలమునకు విరోధముగా గర్జించుచున్నాడు, ద్రాక్షగానుగను త్రొక్కువారివలె అరచుచు ఆయన భూలోక నివాసులకందరికి విరోధముగా ఆర్భటించుచున్నాడు. భూమ్యంతమువరకు సందడి వినబడును, యెహోవా జనములతో వ్యాజ్యెమాడుచున్నాడు, శరీరులందరితో ఆయన వ్యాజ్యెమాడుచున్నాడు. ఆయన దుష్టులను ఖడ్గమునకు అప్పగించుచున్నాడు; ఇదే యెహోవా వాక్కు.” ఆవిధంగా యెహోవా క్రోధపు పాత్రను త్రాగకుండా ఏ జనాంగముకూడా తప్పించుకొనలేదు. సమయం అత్యావశ్యకమైనది గనుక, యెహోవా ఉగ్రత అనే పెనుతుఫానును నలుగురు దేవదూతలు విడిచిపెట్టకముందే, యథార్థహృదయులైన ప్రజలందరూ జనాంగముల దుష్టత్వమునుండి తమనుతాము వేరుపరచు కొనవలసియున్నారు. నిజంగా అది తుఫానులాంటిదే, ఎందుకంటే యిర్మీయా ప్రవచనం 32, 33 వచనాలలో యింకనూ యిలా కొనసాగుతుంది:

20. యెహోవా తీర్పు తీవ్రతను ఏ దృశ్యం నొక్కిచెబుతుంది, కాని ఈ చర్య ఎందుకు అవసరము?

20 “సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—జనమునుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది, భూదిగంతములనుండి గొప్ప తుఫాను బయలు వెళ్లుచున్నది. ఆ దినమున యెహోవాచేత హతులైన వారు ఈ దేశముయొక్క యీ దిశనుండి ఆ దిశవరకు కనబడుదురు. ఎవరును వారినిగూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతిపెట్టరు, పెంటవలె వారి శవములు నేలమీద పడియుండును.” నిజంగా ఒక భయంకరమైన దృశ్యం, కాని దేవుడు వాగ్దానంచేసిన పరదైసును తీసుకువచ్చే ముందు దుష్టత్వంతోకూడిన భూమిని శుభ్రంచేయుటకు ఇది అవసరమైయున్నది.

మందకాపరులు గోలెత్తి, మొర్రపెట్టాలి

21, 22. (ఎ) యిర్మీయా 25:34-36 నందు ఎవరు ఇశ్రాయేలు యొక్క “మందకాపరులు,” వారు గోలలెత్తుటకు ఎందుకు బలవంతము చేయబడ్డారు? (బి) ఏ ఆధునిక మందకాపరులు యెహోవా ఉగ్రతకు పాత్రులు, ఎందుకు వారు పూర్తిగా తగియున్నారు?

21 యెహోవా తీర్పును గురించి 34 నుండి 36 వచనాలు ఇంకనూ యిలా చెబుతున్నవి: “మందకాపరులారా, గోలలెత్తుడి, మొఱ్ఱపెట్టుడి; మందలోని ప్రధానులారా, బూడిద చల్లుకొనుడి. మీరు మరణమునొందుటకై దినములు పూర్తియాయెను, నేను మిమ్మును చెదరగొట్టెదను, రమ్యమైన పాత్రవలె మీరు పడుదురు. మందకాపరులకు ఆశ్రయస్థలము లేకపోవును, మందలోని శ్రేష్ఠమైన వాటికి రక్షణ దొరకకపోవును. ఆలకించుడి, మందకాపరుల మొఱ్ఱ వినబడుచున్నది, మందలోని ప్రధానుల గోలవినబడుచున్నది, యెహోవా వారి మేతభూమిని పాడుచేసియున్నాడు.”

22 ఈ మందకాపరులెవరు? వారు, అప్పటికే యెహోవా క్రోధమును త్రాగియున్న మతనాయకులు కాదు. వారు, యిర్మీయా 6:3లో కూడా వర్ణింపబడినట్లుగా యెహోవాకు విరుద్ధంగా తమ సేనలను మందలుగా సమకూర్చే సైనిక సంబంధ మందకాపరులైయున్నారు. వారెవరనగా, పరిపాలనలో తమ ధనార్జనతో సంపన్నులైన రాజకీయపాలకులు. వీరిలో చాలామంది లంచగొండితనంలో నైపుణ్యంకల్గి, పేరుగాంచారు. అననుకూలతగల్గిన దేశాలలోని ప్రజలందరినీ సమూలంగా నాశనంచేసిన కరవులను అరికట్టడానికి వారు అప్రమత్తంగా ఉండడంలేదు. చనిపోతున్న కోట్లాదిమంది పిల్లలను కాపాడుటకు అతి తక్కువ ఖర్చుతోకూడిన ఆహారమిచ్చుటకును, వైద్యసదుపాయం అందజేయుటకును నిరాకరిస్తూ అదే సమయంలో వారు ఆయుధ వ్యాపార ప్రభువులను, దురాశతో వాతావరణాన్ని నాశనం చేసేవారివంటి ‘మందలోని ప్రధానులను,’ సుసంపన్నవంతులుగా చేస్తున్నారు.

23. యెహోవా నాశనకర చర్యల తరువాత సాతాను ప్రపంచ పరిస్థితి ఎలా ఉంటుందో వివరించండి.

23 “నెమ్మదిగల మేతస్థలములు యెహోవా కోపాగ్నిచేత పాడాయెను; క్రూరమైన ఖడ్గముచేతను ఆయన కోపాగ్నిచేతను వారి దేశము పాడుకాగా సింహము తన మరుగును విడిచినట్లు ఆయన తన మరుగును విడిచెను” అని కేవలం తమ సమాధానంకొరకే స్వార్ధంతో ఎదురుచూచిన వీరినిగూర్చి మాట్లాడుతూ, యిర్మీయా 25వ అధ్యాయం 37, 38 వచనాలు ఈవిధంగా ముగించబడటంలో ఆశ్చర్యంలేదు. నిజంగా ఆశ్చర్యకరమైనదే! అయిననూ, నిశ్చయంగా యెహోవా కోపము ప్రకటన 19:15, 16 వచనాల్లో వివరించబడిన విధంగా “రాజులకు రాజును ప్రభువులకు ప్రభువుగా” యినుపదండముతో జనములను ఏలువానిద్వారా వ్యక్తపరచబడుతుంది. అయితే దీని తర్వాత ఏం జరుగుతుంది?

24. అబద్ధ మతం మరియు మిగతా సాతాను ప్రపంచ నాశనం నీతియుక్తమైన మానవజాతికి ఏ దీవెనలను తెస్తుంది?

24 మీరు ఎన్నడైనా ఉప్పెన లేదా తుఫాను తాకిడిని తప్పించుకున్నారా? అది ఒక భయానక అనుభవమైయుండవచ్చును. కాని తరువాతిరోజు ఉదయం, చుట్టుప్రక్కల ధ్వంసమైన వాటిని మీరు చూస్తున్నను వాతావరణం సర్వసాధారణంగా ఎంతో నిర్మలంగాను, ప్రశాంతంగాను సేదదీర్చేదిగా ఉంటుంది గనుక మనోహరమైన ఆరోజు కొరకు మీరు యెహోవాకు కృతజ్ఞత చెల్లించగలరు. అదేరకంగా, మహాశ్రమల తుఫాను గాలులు సద్దుమణుగుచుండగా, మీరు జీవంతోనున్నందుకు కృతజ్ఞతాభావంతో భూమిని తిలకిస్తూ, యికముందు జరుగబోయే యెహోవా పనియైన శుభ్రపర్చబడిన భూమిని మహిమాయుత పరదైసుగా తయారుచేయుటలో భాగం వహించుటకు ఎదురుచూడవచ్చును. మెస్సీయ వెయ్యేండ్ల పరిపాలనక్రింద ఆయన చిత్తం భూమిపై నెరవేరుటకు, ఆయన నామం పరిశుద్ధ పరచబడుటకుగాను జనములతో యెహోవాకుగల వ్యాజ్యెం మహత్తర ముగింపుకు వస్తుంది. ఆ రాజ్యము త్వరలో వచ్చును గాక!

పునఃసమీక్ష ఈ శీర్షికలోని 5-24 పేరాలు

◻ క్రైస్తవమత సామ్రాజ్యం యొక్క వేషధారణతో కూడిన ఏ మార్గాలు తీర్పు క్రిందకి వచ్చాయి?

◻ యిర్మీయా 25:12-38 నందు తీర్పు గురించిన ఏ విపులమైన దృష్టి తీసుకొనబడింది?

◻ దేశాలన్నిటికి ఏ ఉగ్రతా పాత్ర అందజేయబడుతుంది?

◻ గోలలెత్తి, మొర్రపెట్టే మందకాపరులు ఎవరు, వారు ఎందుకు భంగపర్చబడ్డారు?

[18వ పేజీలోని చిత్రం]

క్రైస్తవమత సామ్రాజ్యాన్ని నాశనం చేయటానికి యెహోవా ఉపకరణాన్ని ఎన్నుకున్నాడు

[23వ పేజీలోని చిత్రం]

మహాశ్రమల తుఫాను గాలుల తరువాత, శుభ్రపర్చబడిన భూమి కనిపిస్తుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి