కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 1/15 పేజీలు 15-20
  • దైవపరిపాలనలో కాపరులూ గొర్రెలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనలో కాపరులూ గొర్రెలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఏయే విధాల్లో మనం ఈనాడు దైవపరిపాలనకు చెందినవారం?
  • ఆధునిక దైవపరిపాలన
  • దైవపరిపాలనలో పెద్దలు
  • క్రైస్తవ ఆత్మతో సేవించుట
  • దైవపరిపాలనలో గొర్రెలు
  • కాపరులూ గొర్రెలు కలిసి పనిచేస్తారు
  • విశ్వాసానికి ఒక సాక్ష్యం
  • దైవపరిపాలనకు పూర్తి అనుగుణ్యంగా ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • దైవపరిపాలన ద్వారా—యెహోవా పరిపాలిస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • క్రైస్తవ సంఘం ఎలా పనిచేస్తుంది?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • ‘మీ మధ్యనున్న దేవుని మందను కాయండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 1/15 పేజీలు 15-20

దైవపరిపాలనలో కాపరులూ గొర్రెలు

“యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును.”—యెషయా 33:22.

1. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులూ ఈనాటి క్రైస్తవులూ దైవపరిపాలనకు చెందినవారేనని ఎలా చెప్పవచ్చు?

దైవపరిపాలన అంటే దేవుని పరిపాలన అని అర్థం. దానిలో యెహోవా అధికారాన్ని అంగీకరించడమూ, మన జీవితంలో మనం చేసే ప్రతి చిన్న, పెద్ద నిర్ణయాల్లో ఆయన నడిపింపునూ ఉపదేశాలను అనుసరించడం యిమిడివున్నాయి. మొదటి శతాబ్దమందలి సంఘం నిజమైన దైవపరిపాలనై యుండెను. ఆనాటి క్రైస్తవులు యథార్థంగా యిలా చెప్పగల్గారు: “యెహోవా మనకు న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు.” (యెషయా 33:22) అభిషక్త శేషం మూలాంశంగా గల యెహోవా దేవుని సంస్థ, ఈనాడు అటువంటి నిజమైన దైవపరిపాలనై ఉంది.

ఏయే విధాల్లో మనం ఈనాడు దైవపరిపాలనకు చెందినవారం?

2. యెహోవాసాక్షులు యెహోవా పాలనకు లోబడే ఒక విధానమేమిటి?

2 యెహోవా భూసంస్థ దైవపరిపాలన అని మనం ఎలా చెప్పవచ్చు? ఎలాగంటే, దానికి సంబంధించినవారు యెహోవా అధికారానికి తప్పక లోబడి ఉంటారు. అంతేకాక యెహోవా, రాజుగా సింహాసనాసీనున్ని చేసిన యేసుక్రీస్తు నడిపింపును వారు అనుసరిస్తారు. ఉదాహరణకు, అంత్యదినముల్లో, గొప్ప దైవపరిపాలకుని నుండి ఈ ఆజ్ఞ నేరుగా యేసుకు తెలుపబడింది: “భూమి పైరు పండి యున్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలిపెట్టి కోయుము.” (ప్రకటన 14:15) యేసు ఆ ఆజ్ఞకు లోబడి, భూమి కోతను చేపడతాడు. ఆసక్తితో రాజ్యసువార్తను ప్రకటించి, శిష్యులను చేయడం ద్వారా క్రైస్తవులు తమ రాజుకు మద్దతునిస్తారు. (మత్తయి 28:19; మార్కు 13:10; అపొస్తలుల కార్యములు 1:8) అలా చేయడంలో గొప్ప దైవపరిపాలకునితో వారు తోటి పనివారౌతారు.—1 కొరింథీయులు 3:9.

3. నైతిక విషయాల్లో క్రైస్తవులు దైవపరిపాలనకు ఎలా లోబడతారు?

3 ప్రవర్తన యందు కూడా, క్రైస్తవులు దేవుని పాలనకు లోబడతారు. యేసు యిలా అన్నాడు: “సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్షపరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును.” (యోహాను 3:21) నేడు నైతిక విలువలపై అంతులేని వివాదాలున్నాయి, అయితే క్రైస్తవుల మధ్య అటువంటి వివాదాలకు తావులేదు. యెహోవా అవినీతి అని చెప్పినదాన్ని వారు అవినీతిగా పరిగణిస్తారు, అంతేకాదు అది ఒక మరణకర అంటువ్యాధి అన్నట్లు దాన్ని వారు విడనాడతారు! వారు తమ కుటుంబంపై శ్రద్ధ తీసుకుంటారు, తమ తలిదండ్రులకు విధేయత కనపరుస్తారు, పైఅధికారులకు లోబడి ఉంటారు. (ఎఫెసీయులు 5:3-5, 22-33; 6:1-4; 1 తిమోతి 5:8; తీతు 3:1) ఆ విధంగా, వారు దేవునితో పొందికగా దైవపరిపాలనకు అనుగుణంగా నడుచుకుంటారు.

4. ఏ తప్పడు ప్రవర్తనను ఆదాము, హవ్వ, సౌలు కనపర్చారు, మరి క్రైస్తవులు దానికి విరుద్ధమైన ప్రవర్తనను ఎలా కనపరుస్తారు?

4 ఆదాము హవ్వలు ఏది మంచో ఏది చెడో అన్న నిర్ణయాలను స్వయంగా తీసుకోవాలనుకోవడం వల్ల పరదైసును పోగొట్టుకున్నారు. దానికి పూర్తిగా వ్యతిరేకమైన దాన్నే యేసు కోరాడు. ఆయన యిలా అన్నాడు: “నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను.” క్రైస్తవులు కూడా దాన్నే చేయగోరుతున్నారు. (యోహాను 5:30 లూకా 22:42; రోమీయులు 12:2; హెబ్రీయులు 10:7) ఇశ్రాయేలీయుల మొట్ట మొదటి రాజైన సౌలు యెహోవాకు లోబడ్డాడు—కానీ, సంపూర్ణంగాకాదు. అందుకే ఆయన తృణీకరించబడ్డాడు. సమూయేలు అతనితో యిలా చెప్పాడు: “బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము.” (1 సమూయేలు 15:22) బహుశా, క్రమంగా ప్రకటించే పనిలో పాల్గొనడం లేక కూటాలకు హాజరుకావడం వంటి విషయాల్లో యెహోవా చిత్తాన్ని కొంతమేరకు చేస్తూ, నైతిక విషయం లేక మరో విషయం వచ్చేటప్పడికి వాటితో రాజీపడిపోవడం దైవపరిపాలనకు సంబంధించినదౌతుందా? ఎన్నటికి కాదు! ‘దేవుని చిత్తము మనఃపూర్వకముగా జరిగించడానికి’ మనం ఎంతగానో ప్రయత్నిస్తాం. (ఎఫెసీయులు 6:6; 1 పేతురు 4:1, 2) సౌలులా కాకుండా, మనం దేవుని పాలనకు సంపూర్తిగా లోబడతాము.

ఆధునిక దైవపరిపాలన

5, 6. యెహోవా ఈనాడు మానవులతో ఎలా వ్యవహరిస్తున్నాడు, ఈ ఏర్పాటుతో సహకరిస్తే ఎలాంటి ఫలితమొస్తుంది?

5 గతంలో యెహోవా, ప్రవక్తలు అపొస్తలులు రాజుల వంటి వ్యక్తుల ద్వారా పరిపాలిస్తూ, సత్యాలను బయల్పర్చాడు. అయితే నేడు ఆ పరిస్థితి లేనేలేదు; ప్రేరేపిత ప్రవక్తలుగానీ అపొస్తలులుగానీ లేరు. బదులుగా, యేసు తన రాజరికంతో ప్రత్యక్షమైన కాలంలో, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు”నిగా నమ్మకమైన అనుచరుల గుంపును గుర్తించి, తన ఆస్తియంతటిపైన దానిని నియమిస్తాడని ఆయన చెప్పాడు. (మత్తయి 24:45-47; యెషయా 43:10) ఆ దాసుడు 1919లో అభిషక్త క్రైస్తవుల శేషమని గుర్తించబడింది. ఆనాటి నుండి యెహోవాసాక్షుల పరిపాలకసభ దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నదై, అది భూమిపైగల దైవపరిపాలనకు కేంద్రంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా, పరిపాలక సభకు బ్రాంచి కమిటీ, ప్రయాణ కాపరులు, సంఘ పెద్దలూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

6 దైవపరిపాలనతో కూడిన సంస్థతో సహకరించడం, దైవపరిపాలనకు లోబడివుండడంలో ప్రధాన భాగంగా ఉంటుంది. అటువంటి సహకారం, ప్రపంచవ్యాప్త “సహోదర సహవాసమందు” (NW) ఐక్యత, క్రమం కొరకు తోడ్పడుతుంది. (1 పేతురు 2:17) తత్ఫలితంగా, “సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కా”ని యెహోవా దేవుని అది ప్రీతిపరుస్తుంది.—1 కొరింథీయులు 14:33.

దైవపరిపాలనలో పెద్దలు

7. క్రైస్తవ పెద్దలు దైవపరిపాలన ద్వారా నియమించబడ్డారని ఎందుకు చెప్పగలం?

7 నియమిత పెద్దలందరు, వారి అధికార స్థానమేదైనప్పటికి, అధ్యక్షులు లేక పెద్దల అధికారం కొరకు బైబిలు సూచించిన అర్హతలను కల్గివుంటారు. (1 తిమోతి 3:1-7; తీతు 1:5-9) అంతేకాకుండా, ఎఫెసీయుల్లోని పెద్దలకు పౌలు వ్రాసిన మాటలు పెద్దలందరికీ వర్తిస్తాయి: “దేవుడు . . . తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.” (అపొస్తలుల కార్యములు 20:28) అవును, పెద్దలు యెహోవా దేవుని నుండి వచ్చు పరిశుద్ధాత్మ ద్వారా నియమించబడ్డారు. (యోహాను 14:26) వారి నియామకం దైవపరిపాలనకు సంబంధించింది. అంతేగాక వారు దేవుని మందను కాస్తారు. ఆ మంద యెహోవాకు చెందిందే గానీ, పెద్దలది కాదు. అది దైవపరిపాలనే.

8. ఈనాడు పెద్దలకున్న సాధారణ బాధ్యతలేమిటి?

8 ఎఫెసీయులకు వ్రాసిన లేఖలో అపొస్తలుడైన పౌలు, పెద్దల సాధారణ బాధ్యతలను గూర్చి వ్రాస్తూ యిలా అన్నాడు: “పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.” (ఎఫెసీయులు 4:13) “క్రీస్తు శరీరము” బాల్యదశతో పాటు అపొస్తలులు, ప్రవక్తలు గతించారు. (1 కొరింథీయులు 13:8 పోల్చండి.) అయితే సువార్త ప్రకటించడంలో, కాయడంలో, బోధించడంలో పెద్దలు యింకా చురుకుగానే ఉన్నారు.—2 తిమోతి 4:2; తీతు 1:9.

9. దేవుని చిత్తానికి ప్రాతినిధ్యం వహించేలా సంఘంలోని పెద్దలు ఎలా సిద్ధపడాలి?

9 దైవపరిపాలన దేవుని పాలన గనుక, ప్రభావవంతమైన పెద్దలకు దేవుని చిత్తం అంటే ఏమిటో చాలా బాగా తెలుసు. ధర్మశాస్త్రాన్ని రోజూ చదవాలని యెహోషువకు ఆజ్ఞాపించబడింది. పెద్దలు కూడ పఠించి, లేఖనాలను క్రమంగా పరిశీలిస్తూ నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుడు ప్రచురించిన బైబిలు ప్రచురణల్లోని విషయాలను సంపూర్ణంగా తెలుసుకోవాలి. (2 తిమోతి 3:14, 15) దీనిలో బైబిలు సూత్రాలను ప్రత్యేక సందర్భాల్లో ఎలా అన్వయించాలో చూపే కావలికోట, తేజరిల్లు! పత్రికలు, యితర ప్రచురణలు కూడా యిమిడి ఉన్నాయి.a అయినా ఒక పెద్ద, వాచ్‌టవర్‌ సొసైటివారి ప్రచురణల్లోని నడిపింపులను ఎలా అనుసరించాలో సంపూర్ణంగా ఎరిగి ఉండడం ప్రాముఖ్యమైనప్పటికీ, వాటికాధారమైన లేఖనాధార సూత్రాలను కూడా పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడు ఆయన యితరులను అర్థంచేసుకుని, కరుణతో లేఖనాధార నడిపింపును అన్వయించే స్థాయిలో ఉంటాడు.—మీకా 6:8 పోల్చండి.

క్రైస్తవ ఆత్మతో సేవించుట

10. ఏ చెడు ప్రవర్తన నుండి పెద్దలు అప్రమత్తంగా ఉండాలి, ఎందుకు?

10 దాదాపు సా.శ. 55లో అపొస్తలుడైన పౌలు కొరింథుకు తన మొదటి పత్రిక వ్రాశాడు. ఆయన పరిష్కరించాల్సిన సమస్యల్లో ఒకటేమంటే, సంఘంలో ప్రధానత్వం కోరేవారిని గూర్చిన విషయం. పౌలు యిలా వ్రాశాడు: “ఇదివరకే మీరేమియు కొదువలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి; అవును, మేమును మీతో కూడ రాజులమగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే గదా?” (1 కొరింథీయులు 4:8) సా.శ. మొదటి శతాబ్దంలో, యేసుతో రాజులుగా యాజకులుగా పరిపాలిస్తారనే నిరీక్షణ క్రైస్తవులందరికీ ఉండేది. (ప్రకటన 20:4, 6) అయినా, భూమి మీద క్రైస్తవ దైవపరిపాలనలో రాజులు లేరనే విషయాన్ని కొందరు మర్చిపోయారన్నది స్పష్టమౌతోంది. ఈ లోక రాజుల్లా ప్రవర్తించకుండా, క్రైస్తవ కాపరులు, యెహోవాను ప్రీతిపర్చే లక్షణమైన సాత్వికాన్ని అలవర్చుకుంటారు.—కీర్తన 138:6; లూకా 22:25-27.

11. (ఎ) సాత్వికానికి గల శ్రేష్ఠమైన ఉదాహరణలేవి? (బి) పెద్దలు అలాగే యితర క్రైస్తవులందరు తమను గూర్చి ఎలాంటి దృష్టిని కల్గివుండాలి?

11 సాత్వికం ఒక బలహీనతా? ఎంతమాత్రమూ కాదు! యెహోవాయే సాత్వికుడని వర్ణించబడ్డాడు. (కీర్తన 18:35) ఇశ్రాయేలీయుల రాజులు సైన్యాలను యుద్ధాలకు నడిపించి, యెహోవా ఆధ్వర్యంలో జనాంగాన్ని పాలించారు. అయితే, ప్రతిఒక్కరూ ‘తాను తన సహోదరులమీద గర్వించ కుండా’ ఉండేలా జాగ్రత్తపడాలి. (ద్వితీయోపదేశకాండము 17:21) పునరుత్థానుడైన యేసు పరలోక రాజు. అయినప్పటికి, భూమి మీద ఉన్నప్పుడు ఆయన తన అపొస్తలుల పాదాలు కడిగాడు. ఎంతటి సాత్వికం! అంతేకాదు, తన శిష్యులు కూడా అలాగే ఉండాలని ఆయన కోరుతున్నాడని చూపుతూ ఆయన యిలా అన్నాడు: “కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే.” (యోహాను 13:14; ఫిలిప్పీయులు 2:5-8) మహిమ, ఘనత అంతా కూడా మనుష్యులకు కాదు దేవునికే చెందాలి. (ప్రకటన 4:11) వారు పెద్దలైనా కాకపోయినా క్రైస్తవులందరూ యేసు మాటల కనుగుణంగా ఆలోచించాలి: “మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నాము.” (లూకా 17:10) ఇది తప్ప మరే యితర దృక్పథమైనా కూడా దైవపరిపాలనకు విరుద్ధమైందే.

12. క్రైస్తవ పెద్దలు అలవర్చుకోవలసిన లక్షణాల్లో ప్రేమ ఎందుకంత ప్రధానమైంది?

12 క్రైస్తవ పెద్దలు సాత్వికంతోపాటు, ప్రేమను కూడ అలవర్చుకోవాలి. “ప్రేమలేనివాడు దేవుని ఎరుగడు” అని యోహాను అన్నప్పుడు ప్రేమ యొక్క ప్రాధాన్యతను ఆయన చూపుతున్నాడు. (1 యోహాను 4:8) ప్రేమ లేని వ్యక్తులు దైవపరిపాలనా సంబంధులు కారు. వారు యెహోవాను ఎరుగరు. దేవుని కుమారుని గూర్చి బైబిలు యిలా అంటోంది: “యేసు . . . లోకములోనున్న తనవారిని ప్రేమించి, వారిని అంతమువరకు ప్రేమించెను.” (యోహాను 13:1) క్రైస్తవ సంఘమందలి పరిపాలక సభలో భాగం కాబోయే 11 మంది సభ్యులతో మాట్లాడుతూ యేసు యిలా అన్నాడు: “నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీ రొకని నొకరు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ.” (యోహాను 15:12) నిజమైన క్రైస్తవత్వానికి ప్రేమే ఒక చిహ్నం. అది నలిగిన హృదయాలనూ, విలపిస్తున్నవారిని, ఆత్మీయ బంధకంలో ఉండి స్వాతంత్ర్యం కావాలని కోరేవారిని ఆకర్షిస్తుంది. (యెషయా 61:1, 2; యోహాను 13:35) ప్రేమను కనపర్చడంలో పెద్దలు మాదిరికరంగా ఉండాలి.

13. సమస్యలు ఈనాడు కఠినమైనప్పటికి, అన్ని సందర్భాల్లో ఒక పెద్ద మంచికి ఎలా తోడ్పడగలడు?

13 నేడు, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో తరచు పెద్దల సహాయం కోరబడుతోంది. వివాహ సమస్యలు లోతుగా పాతుకుపోయి, విడవకుండా ఉంటాయి. పెద్దవారు అర్థం చేసుకోడానికి కష్టతరమైన సమస్యలు యౌవనస్థులకుంటాయి. భావోద్రేకపరమైన అనారోగ్యం, అర్థం చేసుకోడానికి తరచూ చాలా కష్టంగా ఉంటుంది. ఇటువంటి విషయాలను ఎదుర్కొన్న పెద్దకు ఏం చేయాలో తోచకపోవచ్చు. అయితే తాను ప్రార్థనాపూర్వకంగా యెహోవా జ్ఞానంపై ఆధారపడి, బైబిలునూ నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి ప్రచురించిన సమాచారాన్ని పరిశోధించి, గొర్రెల యెడల సాత్వికంగా ప్రేమపూర్వకంగా ప్రవర్తిస్తే కష్టకాలంలోకూడా ఆయన మంచి ప్రభావాన్ని చూపగలడన్న నమ్మకాన్ని కల్గివుండవచ్చు.

14, 15. యెహోవా తన ప్రజలను, ఎంతోమంది శ్రేష్ఠులైన పెద్దలద్వారా ఆశీర్వదించాడని, వ్యక్తపర్చబడిన కొన్ని భావాలు ఎలా కనపరుస్తున్నాయి?

14 “మనుష్యులలో ఈవులను” అనుగ్రహించి యెహోవా తన సంస్థను బహుగా ఆశీర్వదించాడు. (ఎఫెసీయులు 4:8) దేవుని గొర్రెలను అనురాగంతో కాసే సాత్వికులైన పెద్దల ప్రేమకు సాక్ష్యంగా, ఎన్నోసార్లు మెప్పుదలతో కూడిన ఉత్తరాలను వాచ్‌టవర్‌ సొసైటి అందుకుంటోంది. ఉదాహరణకు ఒక సంఘ పెద్ద యిలా రాస్తున్నాడు: “నన్ను ఇంతకంటే ఎక్కువ ప్రభావితం చేసిన ప్రయాణకాపరి సందర్శనంగాని లేక యింత వరకూ సంఘంలో మెప్పునొందిన సందర్భం మరొకటేదీ నాకు జ్ఞాపకం లేదు. మెప్పుకోలును నొక్కితెల్పుతూ, సహోదరులతో వ్యవహరించేటప్పుడు అనుకూల దృక్పథం ప్రాముఖ్యమని గ్రహించడానికి ప్రయాణకాపరి నాకు సహాయం చేశాడు.”

15 చికిత్సకోసం దూరంలో ఉన్న ఆసుపత్రికి వెళ్లిన ఒక సహోదరి యిలా వ్రాస్తోంది: “ఇంటి నుండి అంత దూరంలో అదీ చింతతోకూడిన ఆ మొదటి రాత్రి ఒక పెద్దను కలవగల్గడం ఎంత ఓదార్పునిచ్చిందో! ఆయన, యితర సహోదరులూ నాతో చాలా సమయం గడిపారు. నేను అనుభవించే దాన్ని చూసిన బయటి ప్రజలు సహితం, ప్రేమ అంకిత భావంగల సహోదరుల ఓదార్పు, శ్రద్ధ, ప్రార్థనలు లేక పోయుంటే నేను బ్రతికి ఉండేదాన్నికానని భావించారు.” మరో సహోదరి యిలా వ్రాస్తోంది: “తీవ్రమైన కృంగుదలతో నేను పోరాడుతున్నప్పుడు పెద్దలకూటమి నాకు సహనంతో, తగు నడిపింపును యివ్వడం మూలంగానే నేను ఈనాడు జీవిస్తున్నాను. . . . ఒక సహోదరుడు ఆయన భార్యకు నాతో ఏమి చెప్పాలో తెలియలేదు, అయితే, . . . నన్ను కదిలించిన విషయమేమంటే, నేను ఏమనుభవిస్తున్నానో వారు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా వారు నన్ను గూర్చి ప్రేమపూర్వక శ్రద్ధను కనపర్చారన్నదే.”

16. పేతురు పెద్దలకు ఏ ఉద్బోధనిచ్చాడు?

16 అవును, ఎందరో పెద్దలు అపొస్తలుడైన పేతురు ఉద్బోధను అన్వయిస్తున్నారు: “బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతోకాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణ చేయుచు దానిని కాయుడి.” (1 పేతురు 5:1-3) అలాంటి దైవపరిపాలనా పెద్దలుండడం ఎంత ఆశీర్వాదకరము!

దైవపరిపాలనలో గొర్రెలు

17. సంఘంలో సభ్యులందరూ అలవర్చుకోవల్సిన కొన్ని లక్షణాలను పేర్కొనండి.

17 అయినప్పటికి, దైవపరిపాలన కేవలం పెద్దలతోనే తయారు కాలేదు. కాపరులు దైవపరిపాలనకు చెందినవారైనప్పుడు, గొర్రెలు కూడా దానికి సంబంధించినవారై ఉండాలి. ఏ విధాల్లో? కాపరులను నడిపించే సూత్రాలే గొర్రెలను నడిపించాలి. యెహోవా ఆశీర్వాదం పొందాలంటే పెద్దలేకాదు క్రైస్తవులందరూ సాత్వికులుగా ఉండాలి. (యాకోబు 4:6) అందరం ప్రేమను అలవర్చుకోవాలి, ఎందుకంటే అది లేకుండా యెహోవాకు మనం యిచ్చే అర్పణలు ఆయనకు ప్రీతికరం కావు. (1 కొరింథీయులు 13:1-3) పెద్దలేకాకుండా, మనమందరం “[యెహోవా] యొక్క సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమునుగలవా”రమైయుండాలి.—కొలొస్సయులు 1:9.

18. (ఎ) సత్యం గూర్చిన పైపై జ్ఞానం మాత్రమే ఎందుకు సరిపోదు? (బి) మనమందరమూ సరైన జ్ఞానంతో ఎలా నిండి ఉండగలము?

18 సాతాను లోకంలో జీవిస్తూకూడా నమ్మకంగా ఉండాలని ప్రయత్నించే యౌవనులూ వృద్ధులూ క్లిష్టమైన నిర్ణయాలను ఎడతెగక ఎదుర్కొంటున్నారు. లోకం పోకడకు సంబంధించిన దుస్తులు, సంగీతం, సినిమాలు, ప్రచురణలు కొందరి ఆత్మీయతను సవాలు చేస్తుంటాయి. మన సమతూకాన్ని మనం నిలుపుకోవాలంటే సత్యం గూర్చిన పైపై జ్ఞానం సరిపోదు. కచ్చితంగా తుదివరకూ నమ్మకంగా ఉండాలంటే, మనం సరైన జ్ఞానంతో నిండివుండాలి. దేవుని వాక్యం మాత్రమే యివ్వగల తెలివి వివేకం మనకు అవసరం. (సామెతలు 2:1-5) అంటే మంచి పఠన అలవాట్లు అలవర్చుకోవాలి మనం నేర్చుకునే వాటిని ధ్యానించాలి, వాటిని ఆచరణలో పెట్టాలి. (కీర్తన 1:1-3; ప్రకటన 1:3) “వయస్సు వచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును” అని పౌలు రాసినప్పుడు పెద్దలకేకాక, క్రైస్తవులందరికీ రాశాడు.—హెబ్రీయులు 5:14.

కాపరులూ గొర్రెలు కలిసి పనిచేస్తారు

19, 20. సంఘ పెద్దలతో సహకరించాలనే ఏ ఉద్బోధ అందరికీ యివ్వబడింది, ఎందుకు?

19 చివరికి, పెద్దలతో సహకరించేవారు నిజమైన దైవపరిపాలనా ఆత్మను చూపుతున్నారని చెప్పుకోవాలి. తిమోతికి పౌలు యిలా వ్రాశాడు: “బాగుగా పాలనచేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారిని, రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను.” (1 తిమోతి 5:17; 1 పేతురు 5:5, 6) పెద్దలుగా ఉండడం ఒక అద్భుతమైన ఆధిక్యత, అయితే అనేకమంది పెద్దలు ప్రతిరోజూ ఉద్యోగరీత్యా బయిటికి వెళ్లే కుటుంబ సభ్యులే, తమ భార్యా పిల్లలనుగూర్చి శ్రద్ధ తీసుకోవల్సిన అవసరం కూడా వారికుంది. వారు సేవ చేయడానికి సంతోషిస్తున్నా, ఎక్కువగా తప్పులు పట్టకుండా, ఎక్కువ ఆశించకుండా సంఘం వారికి మద్దతునిచ్చినప్పుడు వారి సేవ మరింత సులభం, మరింత సఫలమౌతుంది.—హెబ్రీయులు 13:17.

20 అపొస్తలుడైన పౌలు యిలా అన్నాడు: “మీకు దేవుని వాక్యము బోధించి, మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి.” (హెబ్రీయులు 13:7) పెద్దలను అనుసరించమని పౌలు సహోదరులను కోరలేదు. (1 కొరింథీయులు 1:12) ఒక మనిషిని అనుసరించడం దైవపరిపాలన విధానంకాదు. అయితే, సువార్త ప్రకటించే పనిలో చురుకుగా ఉండి, క్రమంగా కూటాలకు హాజరౌతూ సంఘంతో సాత్వికంగా ప్రేమపూర్వకంగా వ్యవహరించే దైవపరిపాలన సంబంధమైన పెద్ద యొక్క నిరూపింపబడిన విశ్వాసాన్ని అనుసరించడం నిజంగా జ్ఞానయుక్తం.

విశ్వాసానికి ఒక సాక్ష్యం

21. మోషే వంటి బలమైన విశ్వాసాన్ని క్రైస్తవులు ఎలా కనపరుస్తారు?

21 నిజానికి, మానవ చరిత్ర అంతకంతకూ దిగజారిపోయే ఈ తరుణంలో దైవపరిపాలన ఆధ్వర్యానున్న సంస్థ ఉండడం గొప్ప దైవపరిపాలకుని శక్తికి ఒక సాక్ష్యంగా ఉంది. (యెషయా 2:2-5) ప్రతిదిన సమస్యలతో పోరాడుతూ కూడా యెహోవాయే తమ పాలకుడని ఎన్నడూ మర్చిపోని 50 లక్షలకంటే కూడా ఎక్కువమంది క్రైస్తవ స్త్రీపురుషులు, పిల్లల విశ్వాసానికి కూడా అది ఒక సాక్ష్యమే. “విశ్వాసముబట్టి అతడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్లు స్థిరబుద్ధిగలవాడై”న నమ్మకమైన మోషేలా ఈనాటి క్రైస్తవులు కూడా అటువంటి బలమైన విశ్వాసాన్ని కల్గివుండాలి. (హెబ్రీయులు 11:27) వారు దైవపరిపాలనలో జీవించే ఆధిక్యతగలవారు, మరియు దానికొరకై వారు ప్రతిదినం యెహోవాకు కృతజ్ఞతలు తెల్పుతారు. (కీర్తన 100:4, 5) యెహోవా రక్షణశక్తిని వారు అనుభవించేకొలది, వారు యిలా ప్రకటించడంలో ఆనందిస్తున్నారు: “యెహోవా మన న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు ఆయన మనలను రక్షించును.”—యెషయా 33:22.

[అధస్సూచీలు]

a “పే అటెన్‌షన్‌ టు యువర్‌సెల్ఫ్స్‌ అండ్‌ టు ఆల్‌ ది ఫ్లాక్‌” అనే ప్రచురణకూడా అందులో ఒకటి. అందులో లేఖనాధార నడిపింపు ఉంది, మరి యిది నియమిత సంఘ అధ్యక్షులకు లేక పెద్దలకు అందించబడ్డాయి.

బైబిలు ఏమి చూపుతోంది?

◻ ఏ విధంగా క్రైస్తవులు దైవపరిపాలనకు లోబడతారు?

◻ ఈనాడు దైవపరిపాలన ఎలా వ్యవస్థీకరించబడింది?

◻ పెద్దలు తమ బాధ్యతలను నిర్వర్తించడానికి తమ్మును తాము ఎలా సిద్ధపర్చుకోవాలి?

◻ పెద్దలు అలవర్చుకొని, కనపర్చాల్సిన ప్రధానమైన క్రైస్తవ లక్షణాలు ఏవి?

◻ దైవపరిపాలనలో, గొర్రెలు కాపరుల మధ్య ఏ సంబంధం ఉండాలి?

[16వ పేజీలోని చిత్రం]

మంచి చెడులను గూర్చిన నిర్ణయాలను తమకు తాముగా తీసుకోవాలనుకున్నారు గనుక ఆదాము హవ్వలు పరదైసును పోగొట్టుకున్నారు

[18వ పేజీలోని చిత్రం]

ఒక పెద్ద, గొర్రెలతో సాత్వికంగా ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తే, ఆయన ఎల్లప్పుడూ మంచికి తోడ్పడతాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి