రాజ్య ప్రచారకుల నివేదిక
స్థిరత్వం గొప్ప ఆశీర్వాదాలను తెస్తుంది
తన అనుచరులు హింసింపబడతారని యేసు ముందే చెప్పాడు, అపొస్తలుడైన పౌలు కూడా 2 తిమోతి 3:12 నందు ఇలా తెలియజేసాడు: “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించువారందరు హింసపొందుదురు.” కాని యెహోవా దేవున్ని సేవించడంలో స్థిరత్వం గొప్ప ఆశీర్వాదాలను తెస్తుంది.
◻ మలేసియా ఈశాన్య తీరమునున్న ఒక పట్టణంలో ఇది నిజమైంది. తన పిల్లలకు తీవ్రంగా ఉపన్యాసాలిచ్చే బౌద్ధ మతాభిమాని అయినప్పటికీ తన ముగ్గురు కుమార్తెలను, ముగ్గురు కుమారులను యెహోవాసాక్షులతో బైబిలు పఠించడం నుండి ఆ తండ్రి ఆపలేకపోయాడు. ఆయన భార్య కూడా సత్యం యెడల ఆసక్తి చూపించింది. తరువాత ఒక రోజు ఒక పొరుగువాడు అతన్నిలా ఎగతాళి చేశాడు: “నీ పిల్లలను అదుపులో ఉంచుకోకుండా వారు యెహోవాసాక్షులగుటకు ఎలా అనుమతిస్తున్నావు? నా పిల్లలంతా నన్ను, మా పూర్వీకుల బౌద్ధమతానికి హత్తుకొని ఉన్నారు. నీపై జాలి కలుగుతుంది!”
తన పిల్లలతో బైబిలు పఠనం చేస్తున్న సహోదరిని కొడతానని బెదిరిస్తూ ఆ తండ్రి ఇంటికి వెళ్లాడు. అయితే పిల్లలు అతన్ని శాంతపరచి, యెహోవాసాక్షులతో బైబిలు పఠనం చేయడం, తమ తల్లి మద్దతుతో కూటాలకు హాజరు కావడం కొనసాగించారు.
అయితే చివరకు, తండ్రి మొత్తం కుటుంబాన్ని తన యెదుట సమావేశ పరిచి, వారికిలా చెప్పాడు, “నాతో కలిసి ఇంట్లో ఉండటం లేదా, క్రైస్తవులై ఇల్లు విడిచి వెళ్లడం రెండింటిలో మీరు ఏదో ఒకటి ఎంపిక చేసుకోండి.” వెంటనే, చాలా నెమ్మదస్థుడైన పెద్ద కుమారుడు ఇల్లు విడిచి వెళ్లడానికి సర్దుకోవటం మొదలెట్టాడు. “వద్దు! మీరంతా తిరుగుబాటు చేసే పిల్లలు కాబట్టి, నేనే చనిపోవడం మంచిది” అని అరిచి, ఇంట్లో నుండి బయటికి వెళ్లిపోతుంటే, తనను తాను చంపుకో వద్దని కుటుంబమంతా ఆ తండ్రినెంతో ప్రాధేయపడ్డారు. వారి విజ్ఞాపనలకు ప్రభావితుడై, వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేశాడు.
కాలం గడిచింది. తన పిల్లల ప్రవర్తనపై బైబిలు సత్యం చూపిస్తున్న మంచి ప్రభావాన్ని తండ్రి గమనించటం మొదలు పెట్టాడు. ఒకరోజు ఆయన తనను ఎగతాళి చేసిన స్నేహితున్ని కలిశాడు, అతడు ఇప్పుడు చాలా విచారంగల వ్యక్తి, అతడిలా అన్నాడు: “నేను నా పిల్లలను బట్టి చాలా నిరుత్సాహపడుతున్నాను. వారు నన్ను మోసం చేస్తూ, నన్ను దోచుకుంటున్నారు.” కాని యెహోవాసాక్షులతో పఠనం చేస్తున్న పిల్లల తండ్రి ఇలా చెప్పాడు: “నా పిల్లలు ఎంతో వేరుగా ఉన్నారు! వారు నా యెడల ఎంతో కనికరం కలిగివున్నారు, నాకు ఉద్యోగం లేనప్పుడు నా కారు రుణం యొక్క వాయిదాలను కట్టడానికి కూడా వారు నాకు సహాయం చేశారు.”
ఈనాడు, ముగ్గురు కుమార్తెలు, వారి తల్లి బాప్తిస్మం తీసుకున్నారు. ఒక కుమారుడు ప్రత్యేక పయినీరుగా ఉన్నాడు. ఒకప్పుడు దృఢమైన మతాసక్తిగల, కోపోద్రేకం గల తండ్రి ఏమయ్యాడు? ఆయనిప్పుడు స్నేహపూర్వకంగా ఉండి, జ్ఞాపకార్థ దినాచరణకు కూడా హాజరయ్యాడు.
ఆయన యెడల చూపించిన స్థిరత్వానికి యెహోవా ఆ కుమారున్ని, ఆయన ముగ్గురు సహోదరీలను, అలాగే వారి తల్లిని ఆశీర్వదించాడు. వారు యెహోవా హృదయాన్ని సంతోషపర్చే ఆసక్తిగల క్రొత్త రాజ్య ప్రచారకులైయున్నారు.—సామెతలు 27:11.