కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 11/15 పేజీలు 28-30
  • ఎందుకు తప్పు ఒప్పుకోవాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎందుకు తప్పు ఒప్పుకోవాలి?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిరాశ చెందవలసిన అవసరం లేదు
  • దీనత్వము ఒక ప్రాముఖ్యమైన లక్షణం
  • వారు తప్పులు ఒప్పుకున్నారు
  • మన తప్పులను సరిదిద్దుకొనుట
  • ఒక పెద్ద తప్పు చేస్తే
  • తప్పును ఒప్పుకొనుటకు వేగిరపడండి
  • తప్పులు ఒప్పుకొనుటలో సంతోషించడం
  • నా తప్పుల్ని నేనెలా సరిదిద్దుకోవాలి?
    యువత అడిగే 10 ప్రశ్నలకు జవాబులు
  • తప్పులు చేసినప్పుడు నేనేమి చేయాలి?
    యువత అడిగే ప్రశ్నలు
  • తప్పుల్ని ఎలా చూడాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2017
  • క్షమాపణ చెప్పడం సమాధానపడడానికి కీలకం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 11/15 పేజీలు 28-30

ఎందుకు తప్పు ఒప్పుకోవాలి?

అది సైనిక చరిత్రలో అత్యంత అసాధారణ సంఘటన. ఆయుధాలు ఏమిలేకుండానే రాయబారిగా వచ్చిన ఒక స్త్రీ 400 మంది కఠినాత్ములైన సైనికులను తాము పొందిన అవమానానికి ప్రతీకారం చేయకుండా ఆపగలిగింది. కేవలం ధైర్యంగల ఒక స్త్రీ చేసిన విన్నపాలను విన్న తరువాత, వారి నాయకుడు ఆ పథకాన్ని విరమించుకున్నాడు.

ఆ నాయకుడు, అటుపిమ్మట ఇశ్రాయేలీయులకు రాజైన దావీదు. ఆయన దేవున్ని ప్రీతిపర్చుటకు ఇష్టపడ్డాడు గనుక, అబీగయీలు చెప్పిన మాట విన్నాడు. తన భర్తయైన నాబాలు యెడల ప్రతీకారం తీర్చుకోవడం వల్ల అతనిపైకి రక్తాపరాధం వస్తుందని ఆమె వివేకవంతంగా చూపించినప్పుడు, దావీదు ఇలా అన్నాడు: “నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగతీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండను నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక.” ఒక గంభీరమైన తప్పుచేయకుండా తనను ఆపుటకు దేవుడు అబీగయీలును ఉపయోగించినందుకు దావీదు కృతజ్ఞుడైయుండెను.—1 సమూయేలు 25:9-35.

ఒక కీర్తనలో దావీదు ఇలా అడిగాడు: “తన పొరపాటులు కనుగొనగలవాడెవడు?” (కీర్తన 19:12) ఆయనలాగే, మనం కూడా మన తప్పులను ఇతరులు ఎత్తి చూపించే వరకు తెలుసుకోలేము. ఇతర సందర్భాల్లో మనం పొరపాటుగా, తెలివితక్కువగా, లేక నిర్దయగా ప్రవర్తించామని గ్రహించుటకు అప్రియమైన పరిణామాలు మనల్ని బలవంతపెడతాయి.

నిరాశ చెందవలసిన అవసరం లేదు

మనమందరం తప్పులు చేసినప్పటికీ, ఇవి నిరాశ చెందుటకు కారణాలు కానవసరం లేదు. దౌత్యనీతిజ్ఞుడైన ఎడ్‌వర్డ్‌ జాన్‌ ఫెల్‌ప్స్‌ ఇలా అభిప్రాయపడ్డాడు: “తప్పులు చేయని వ్యక్తి సాధారణంగా అసలేమి చేయడు.” క్రైస్తవ శిష్యుడైన యాకోబు: “అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము” అని చెప్పాడు. (యాకోబు 3:2) ఎన్నడు తొట్రుపడకుండా ఒక బాలుడు నడవటం నేర్చుకొనగలడా? లేదు, ఎందుకంటే, బాలుడు తన తప్పులనుండి నేర్చుకుంటాడు, సమతుల్యం సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాడు.

సమతుల్యంగల జీవితాలను గడపడానికి, మనం కూడా మన తప్పులనుండి, ఇతరుల తప్పులనుండి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మన పరిస్థితులను ప్రతిబింబించే పరిస్థితులనే కలిగిన అనేకమంది అనుభవాలను బైబిలు తెలియజేస్తుంది గనుక, వారు చేసిన తప్పులనే మనమూ చేయకుండా ఉండుటకు మనకు సహాయం లభిస్తుంది. అయితే, వారి తప్పుల నుండి మనమేమి నేర్చుకోగలము?

దీనత్వము ఒక ప్రాముఖ్యమైన లక్షణం

ఒక పాఠమేమిటంటే, తప్పుచేసిన వారినందరినీ దేవుడు శిక్షించడు గాని, వాటిని సరిచేసుకునే సాధ్యతవున్నా అందుకు నిరాకరించేవారికి ఆయన తీర్పుతీరుస్తాడు. అమాలేకీయులను నాశనం చేయుటను గూర్చిన యెహోవా ఉపదేశాలను ఇశ్రాయేలీయుల రాజైన సౌలు వినలేదు. ప్రవక్తయైన సమూయేలుకు ఎదురుపడినప్పుడు, సౌలు మొదట విషయాన్ని తక్కువచేసి, తరువాత ఇతరులను నిందించటానికి ప్రయత్నించాడు. తప్పును సరిచేసుకొనుటకు బదులు తన మనుష్యుల యెదుట తగ్గించబడతానేమోనని అతడు ఎక్కువ చింతించాడు. కనుక, ‘యెహోవా రాజుగా అతన్ని విసర్జించాడు.’—1 సమూయేలు 15:20-23, 30.

సౌలు తరువాతివాడైన దావీదు, గంభీరమైన తప్పులు చేసినప్పటికీ ఆయన దీనంగా ఉపదేశాన్ని, శిక్షను అంగీకరించాడు గనుక క్షమించబడ్డాడు. దావీదుకున్న దీనత్వం అతన్ని అబీగయీలు మాటలు వినేలా చేసింది. అతని సేనలు యుద్ధానికి సిద్ధమయ్యాయి. అయినా, తన సేనల యెదుట, తాను కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నానని దావీదుకున్న యీ ఒప్పుకున్నాడు. ఆయన జీవితమంతటిలో, క్షమాపణ పొందడానికి, తన అడుగులను సరిచేసుకోడానికి అలాంటి దీనత్వం దావీదుకు సహాయం చేసింది.

ఆలోచనలేని వ్యాఖ్యానాలను సరిచేసుకోవడానికి కూడా దీనత్వం యెహోవా సేవకులను ప్రేరేపిస్తుంది. యూదుల న్యాయసభ యెదుట ఒక సభలో ప్రధాన యాజకుడు పౌలును చెంపమీద కొట్టమని ఆజ్ఞాపించాడు. అపొస్తలుడు ఇలా జవాబిచ్చాడు: “సున్నము కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొట్టును.” (అపొస్తలుల కార్యములు 23:3) “నీవు దేవుని ప్రధానయాజకుని దూషించెదవా?” అని దగ్గర నిలిచియున్నవారు అడిగేవరకు, బహుశ కంటిచూపు మందగించడం వల్లనేమో పౌలు తాను ఎవరిని అంటున్నాడో తెలుసుకోలేదు. దానికి పౌలు వెంటనే తన తప్పును అంగీకరిస్తూ ఇలా అన్నాడు: “సహోదరులారా, యితడు ప్రధానయాజకుడని నాకు తెలియలేదు—నీప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి యున్నది.” (అపొస్తలుల కార్యములు 23:4, 5; నిర్గమకాండము 22:28) అవును, పౌలు దీనంగా తన తప్పును ఒప్పుకున్నాడు.

వారు తప్పులు ఒప్పుకున్నారు

కొందరు తమ తప్పుడు ఆలోచనావిధానాన్ని మార్చుకున్నారని కూడా బైబిలు చూపిస్తుంది. ఉదాహరణకు, కీర్తనల రచయితయైన ఆసాపును పరిశీలించండి. దుష్టులు వర్థిల్లుచున్నట్లు చూసి అతనిలా అన్నాడు: “నా హృదయమును నేను శుద్ధిచేసికొని యుండుట వ్యర్థమే.” యెహోవా ఆలయానికి వెళ్లి, స్వచ్ఛారాధన యొక్క మేలులను గూర్చి ధ్యానించిన తరువాత ఆసాపు తన పొరపాటు గ్రహించాడు. అంతేకాక, తన తప్పును ఆయన 73వ కీర్తనలో ఒప్పుకున్నాడు.

యోనా కూడా తప్పుడు ఆలోచన తన దృక్కోణాన్ని కప్పేయ నిచ్చాడు. నీనెవెలో ప్రకటించిన తరువాత, దాని నివాసులను తప్పించుటకు బదులు తన వ్యక్తిగత ఘనతను గూర్చి ఆయన ఆలోచించాడు. నీనెవె నివాసులు పశ్చాత్తాప పడినా, వారిని యెహోవా శిక్షించలేదని యోనా అసంతోషపడినప్పుడు, దేవుడు అతన్ని సరిచేశాడు. యోనా తన దృక్కోణం తప్పని గ్రహించాడు, ఆయన పేరున ఉన్న బైబిలు పుస్తకం నిజాయితీగా ఆయన తప్పులను గూర్చి తెలియజేస్తున్నది.—యోనా 3:10–4:11.

తన బాధలకు కారణం అపవాదియగు సాతాను కాదు, దేవుడేనని పొరపాటుగా భావించి, యోబు తాను బాధలు అనుభవించుటకు తగినవాన్ని కాదని నిరూపించుకొనుటకు ప్రయత్నించాడు. పరీక్షించబడినప్పుడు దేవుని సేవకులు ఆయనకు నమ్మకస్థులుగా ఉండగలరా? అనే గొప్ప వివాదాంశాన్ని గురించి అతనికి తెలియదు. (యోబు 1:9-12) ఎలీహు, ఆ తరువాత యెహోవా, యోబు తన తప్పును తెలుసుకొనుటకు సహాయం చేశారు, ఆయనిలా అంగీకరించాడు: “ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని . . . కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను.”—యోబు 42:3, 6.

తప్పులను ఒప్పుకోవడం దేవునితో మంచి సంబంధాన్ని కాపాడుకొనుటకు మనకు సహాయం చేస్తుంది. ముందు ప్రస్తావించిన ఉదాహరణలు చూపుతున్నట్లు, మన తప్పులను ఒప్పుకొని, మన తప్పుడు ఆలోచనను, అనాలోచిత మాటలను, అవివేకమైన క్రియలను సరిచేసుకుంటే, ఆయన మనల్ని శిక్షించాడు. ఈ జ్ఞానాన్ని మనమెలా అన్వయించుకోవచ్చును?

మన తప్పులను సరిదిద్దుకొనుట

దీనంగా మన తప్పులను ఒప్పుకొని, వాటిని సరిదిద్దుకొనుట మన కుటుంబ సంబంధాలను దృఢపరుస్తుంది. ఉదాహరణకు, అలసట వల్ల లేక తొందరపాటు వల్ల పిల్లలను శిక్షించడంలో తల్లిగాని తండ్రిగాని కఠినంగా ప్రవర్తించి ఉండవచ్చు. ఆ తప్పును సరిచేసుకొనుటకు నిరాకరిస్తే అది చెడు ప్రభావాలను కలిగించగలదు. దానికి తగినట్లుగానే అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.”—ఎఫెసీయులు 6:4.

యౌవన క్రైస్తవుడైన పాల్‌ ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “నాన్న తాను అతిగా ప్రవర్తించానని అనుకుంటే ఎల్లప్పుడు క్షమాపణ కోరేవాడు. అతన్ని గౌరవించడానికి అది నాకు సహాయం చేసింది.” ఫలానా సందర్భంలో క్షమాపణ చెప్పడం అవసరమా అన్నది వ్యక్తిగత నిర్ణయం. అయిననూ, క్షమాపణల వెంట అలాంటి తప్పులు భవిష్యత్తులో జరగకుండా గట్టి ప్రయత్నాలు చేయాలి.

భర్తగాని భార్యగాని బాధ కలిగించే తప్పు చేస్తే, అప్పుడేమి? సూటిగా అంగీకరించి, హృదయపూర్వకంగా క్షమాపణ కోరడం, క్షమించే గుణం వారి ప్రేమపూర్వక సంబంధాన్ని కొనసాగించుటకు సహాయం చేస్తాయి. (ఎఫెసీయులు 5:33; కొలొస్సయులు 3:13) యాభై ఏళ్ల కాసూస్‌ అనే స్పానిష్‌ వ్యక్తి, తన భార్యయైన అల్‌బీనాకు క్షమాపణ చెప్పుటకు గర్వించలేదు. ఆమె ఇలా చెబుతుంది: “ఒకరినొకరం అభ్యంతర పరచుకున్నప్పుడు క్షమాపణ చెప్పే ఆచారం మాకుంది, ప్రేమతో ఒకరినొకరం భరించుటకు ఇది మాకు సహాయం చేస్తుంది.”

ఒక పెద్ద తప్పు చేస్తే

తప్పులను ఒప్పుకొని, నిజాయితీగా క్షమాపణలు చెప్పుకోవడం క్రైస్తవ పెద్దలు సామరస్యంగా కలిసి పనిచేయుటకు ‘ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుటకు’ కూడా సహాయం చేస్తుంది. (రోమీయులు 12:10) ఒక పెద్ద తన తప్పును ఒప్పుకొనుటకు విముఖత చూపించవచ్చు, ఎందుకంటే అలా చేస్తే, అది సంఘంలో తన అధికారాన్ని తగ్గిస్తుందని అతను భయపడవచ్చు. అయినా, తప్పును సమర్థించుకొనడం, అలక్ష్యం చేయడం, తప్పును తగ్గించటానికి ప్రయత్నించడం ఇతరులు అతని నడిపింపు నందు నమ్మకం కోల్పోయేలా చేయవచ్చు. ఏదైనా ఒక అనాలోచిత వ్యాఖ్యానాన్ని గురించి ఒక పరిపక్వత చెందిన సహోదరుడు దీనంగా క్షమాపణ కోరితే, ఇతరుల గౌరవాన్ని సంపాదించుకుంటాడు.

పెద్దల సమూహానికి అధ్యక్షత వహిస్తూ ఒకానొక కూటము ఎలా నిర్వహించబడాలి అనే విషయాన్ని గురించి తప్పుడు వ్యాఖ్యానం చేసిన సందర్భాన్ని స్పెయిన్‌లోని ఒక పెద్దయైన ఫెర్‌నెన్‌డో గుర్తుచేసుకుంటున్నాడు. ఆయన చెప్పినదాన్ని ఒక సహోదరుడు గౌరవపూర్వకంగా సరిచేసినప్పుడు, తాను తప్పు చేశానని ప్రయాణ కాపరి వెంటనే అంగీకరించాడు. ఫెర్నాన్‌డో ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “ఆ పెద్దలందరి యెదుట అతడు తన తప్పును ఒప్పుకోవడం నేను చూసినప్పుడు, అది నన్ను బాగా ప్రభావితం చేసింది. ఆ క్షమాపణ తరువాత నేను అతన్ని ఇంకా ఎక్కువ గౌరవించాను. నా స్వంత పొరపాట్లను గుర్తించడం ఎంత ప్రాముఖ్యమో అతని ఉదాహరణ నాకు నేర్పింది.”

తప్పును ఒప్పుకొనుటకు వేగిరపడండి

సాధారణంగా ఒక క్షమాపణ ఎప్పుడు మెచ్చుకొన బడుతుందంటే, ప్రాముఖ్యంగా వెంటనే చెప్పినప్పుడు. వాస్తవానికి, ఎంత త్వరగా మనం తప్పు ఒప్పుకుంటే అంత మంచిది. దాన్నిలా వివరించవచ్చు: భూమి విశ్వానికి మధ్యలో లేదని నొక్కిచెప్పినందుకు గాలిలియోను 360 సంవత్సరాల క్రితం శిక్షించడంలో మతపరమైన న్యాయవిచారణ “పొరపాటు” చేసిందని అక్టోబరు 31, 1992న రెండవ పోపు జాన్‌ పాల్‌ ఒప్పుకున్నాడు. అయినా, క్షమాపణను మరీ అంతకాలానికి వాయిదా వేయడం దాని విలువను పోగొడుతుంది.

వ్యక్తిగత సంబంధాల విషయంలో కూడా ఇదే వాస్తవం. నిర్దయతో కూడిన మాట లేక క్రియ కలిగించిన గాయాన్ని వెంటనే చెప్పబడిన క్షమాపణ స్వస్థపరుస్తుంది. సమాధాన పడడంలో ఆలస్యం చేయవద్దని యేసు మనల్నిలా కోరాడు: “కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము.” (మత్తయి 5:23, 24) తరచూ, సమాధానకరమైన సంబంధాలను పెంపొందించుకొనుటకు, మనం తప్పుగా వ్యవహరించామని ఒప్పుకొని, క్షమాపణ కోరడం మాత్రమే అవసరమౌతుంది. ఇది చేయుటకు మనమెంత ఆలస్యం చేస్తే, అంత కష్టమౌతుంది.

తప్పులు ఒప్పుకొనుటలో సంతోషించడం

సౌలు, దావీదుల ఉదాహరణలు వివరిస్తున్నట్లే, మన తప్పులతో మనం వ్యవహరించే విధానం మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. సౌలు మూర్ఖంగా ఉపదేశాన్ని నిరాకరించాడు, అతని తప్పులు రెండింతలై, చివరకు దేవుని ఆగ్రహానికి గురై, అది అతని మరణానికి దారితీసింది. దావీదు తప్పులు, పాపాలు చేసినా, పశ్చాత్తాపంతో దిద్దుబాటును అంగీకరించి, యెహోవాకు నమ్మకస్థుడుగా ఉన్నాడు. (కీర్తన 32:3-5 పోల్చండి.) మన కోరిక అదే కాదా?

తప్పును ఒప్పుకొని, సరిదిద్దుకుని, పాపాన్ని గురించి పశ్చాత్తాప పడితే దొరికే అత్యంత గొప్ప ప్రతిఫలమేమంటే, అది దేవునిచే క్షమించబడిందని తెలుసుకోవడమే. దావీదు ఇలా చెప్పాడు: “తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు . . . యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు . . . ధన్యుడు.” (కీర్తన 32:1, 2) కాబట్టి, ఒక తప్పును ఒప్పుకోవడం ఎంత జ్ఞానయుక్తమైన పని!

[29వ పేజీలోని చిత్రం]

ఎన్నడూ తొట్రుపడకుండా ఒక బాలుడు నడక నేర్చుకొనగలడా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి