స్పెయిన్‌లో గ్రామ గ్రామానికి ప్రకటించుట
యేసుక్రీస్తు “యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను.” (లూకా 13:22) యేసు, ఆయన శిష్యులు తమ పరిచర్యను తుదముట్టించుటకు “పట్టణములలో”నే కాక “గ్రామములలో” కూడ ప్రకటించారు. పట్టణములందే తమ శ్రద్ధను కేంద్రీకరించడం సుళువైనప్పటికీ, వారు గ్రామసీమల్ని దాటివెళ్లిపోలేదు.a
యేసు ఎదుర్కొన్నటువంటి సవాలునే స్పెయిన్‌లోని యెహోవాసాక్షులు కూడా ఎదుర్కొన్నారు. ఈ 1970 నాటికి, కోతకు సిద్ధమైన విస్తారమైన గ్రామ ప్రాంతాలు ఉండినవి. (మత్తయి 9:37, 38) ఉత్తరాన బాగా వర్షాలు కురిసే పర్వత ప్రాంతాల్లో, ఎండిన మధ్యభూభాగ మైదానాల్లో, తీరప్రాంతాల్లో ఎన్నడూ రాజ్య సమాచారం అందని వందలాది గ్రామాలున్నాయి.
ఈ ప్రాంతాలకు సువార్తను తీసుకువెళ్లుటకు గట్టిప్రయత్నం చేయాలని స్పెయిన్‌లోని యెహోవాసాక్షులు నిర్ణయించుకున్నారు. కాని ఈ ప్రాంతాల్లోని ప్రజలు రాజ్య సమాచారం వినుటకు ఇంత కాలం ఎందుకు వేచియుండవలసి వచ్చింది? వారెలా ప్రతిస్పందించారు?
చట్టబద్ధమైన గుర్తింపు గ్రామప్రాంతంలో సాక్ష్యాన్ని పురికొల్పింది
అంతర్యుద్ధం 1939లో ముగిసిన నాటి నుండి స్పెయిన్‌లో యెహోవాసాక్షుల సేవ నిషేధింపబడింది. వారిని అంతగా గమనించని పట్టణాల్లో ఉత్సాహంగల సాక్షులు 1950, 1960 దశాబ్దాల్లో జాగ్రత్తతో ప్రకటించారు. చివరకు వారి సేవ 1970లో చట్టబద్ధం చేయబడినప్పుడు, స్పెయిన్‌లో ఇంచుమించు 10,000 మంది రాజ్య ప్రచారకులున్నారు. దాదాపు వారిలో అందరూ పట్టణాల్లో, పెద్ద నగరాల్లో జీవించేవారే, అయితే స్పెయిన్‌లోని గ్రామాలు కూడా రాజ్య సమాచారం వినవలసిన అవసరత వుండెను. ఈ సవాలును ఎవరు ఎదుర్కొంటారు?
ద్వీపకల్పమందలి అన్ని ప్రాంతాలకు సువార్తను తీసుకు వెళ్లాలని 1970వ దశాబ్దంలో ఒక కార్యక్రమం మొదలుపెట్టబడింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అవసరతలను తెలియజేస్తూ ప్రత్యేకమైన నోటీసులు యెహోవాసాక్షుల సంఘాల నెలసరి సేవా ప్రచురణయైన మన రాజ్య పరిచర్యలో దాదాపు ప్రతినెల 1973 నుండి 1979 వరకు వెలువడ్డాయి. ఇష్టపడిన, ప్రతిస్పందించిన అనేక కుటుంబాలు అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సేవచేయుటకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి.
రాసెన్‌డొ, ఆయన భార్య లూసిల ఉదాహరణ విశిష్టమైనది. వారు స్పెయిన్‌లోని వాయవ్య భాగంలో జాలర్ల గ్రామానికి ప్రత్యేక పయినీర్లుగా (పూర్తికాల రాజ్య ప్రచారకులు) పంపబడ్డారు. వారు తల్లిదండ్రులైనప్పుడు అక్కడే నివసించుటకు నిర్ణయించుకున్నారు. రాసెన్‌డో ఇలా తెలియజేస్తున్నారు: “మేమెంతో కష్టసమయాలను ఎదుర్కొన్నామని నేను అంగీకరించవలసిందే, ఉద్యోగం దొరకడం చాలా కష్టం, కాని మేము యెహోవా సహాయం కొరకు ఎదురుచూసాము, మేమెప్పుడూ ఆకలి గొనలేదు, నివసించుటకు స్థలం లేకుండాపోలేదు. అది కచ్చితంగా ఎంతో విలువైనది.” గడచిన సంవత్సరాల్లో స్పెయిన్‌లోని ఈ ప్రాంతంలో నాలుగు సంఘాలు ఏర్పరచుటకు వారు సహాయం చేయగల్గారు.
‘ఎవడు యోగ్యుడో విచారణ చేయుట’
ప్రతి పట్టణం లేక గ్రామంలో యోగ్యులైన వారిని “విచారణ చేయమని” యేసు తన శిష్యులకు చెప్పాడు. (మత్తయి 10:11) ఆల్‌కాయ్ (అలికెంట్) నుండి వచ్చిన సహోదరుడైన అనకెల్ తెలుసుకున్నట్లు, స్పెయిన్‌లోని గ్రామప్రాంతాల్లో అలా విచారణ చేయుటకు శ్రద్ధ, చొరవ అవసరం. ఆయన మాసెయాస్ గ్రామంలోని కొన్ని ఇళ్లను దర్శించడం ముగించినప్పుడు, ఒక కోడి కూయడం ఆయనకు వినిపించింది. ఆయన తనకు తానిలా అనుకున్నాడు, “కోడి ఉందంటే, ఇక్కడే ఎక్కడో ఒక ఇల్లు, అనగా మేము గమనించకుండా వదిలి వచ్చేసిన ఇల్లు ఉందన్నమాట.” చుట్టూ వెదికిన తరువాత, కొండ శిఖరం మీదుగా విడిగావున్న ఒక ఇంటికి దారితీసిన ఒక మార్గం అనకెల్‌కి కన్పించింది.
ఆ యింటిలో కోసా, డోలోరెస్ అనే 60వ దశకంలో వున్న అన్నాచెల్లెళ్లు జీవిస్తున్నారు. వారు శ్రద్ధగా విని వెంటనే బైబిలు పఠనానికి అంగీకరించారు. అయినా, ఈ దీనులతో పఠనం చేయడం అంత సుళువుకాదు, ఎందుకంటే వారికి చదవడం, వ్రాయడం రాదు, వారికి అర్ధమయ్యే ఒకేఒక భాష వాలెన్‌స్యా భాష, గనుక ప్రతిదీ స్పానిష్ నుండి ఆ భాషలోకి అనువదించ వలసిందే. దానికితోడు, వారు తమ పొరుగువారి నుండి చాలా వ్యతిరేకతను ఎదుర్కొనవలసి వచ్చింది. ఈ అడ్డంకులున్నప్పటికీ, కూటాలకు హాజరవ్వాలంటే కొండలపైనుండి చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చినప్పటికీ కోసా, డోలోరెస్ సత్యమందు అభివృద్ధి సాధించారు. చివరకు వారు బాప్తిస్మం తీసుకొనుటకు అర్హులై, ఇద్దరూ యెహోవాను నమ్మకంగా సేవించడంలో కొనసాగుతున్నారు.
వాయవ్య స్పెయిన్‌లోని మెయెనా వద్ద ఏకాంతంగావున్న ఒక యింట్లో జీవిస్తున్న పక్షవాతం వచ్చిన వ్యక్తి సత్యాన్ని ఎలా అంగీకరించాడో ముందు పేర్కొన్న రాసెన్‌డొ, లూసి గుర్తుచేసుకుంటున్నారు. ఆమె పేరు మారియ. మొదట ఆమె సాక్షులతో మాట్లాడినప్పుడు, చిన్నతనంలోనే పోలియో వచ్చినందున చాలా సంవత్సరాలుగా మంచం పట్టే ఉండడం వలన, ఆమెకు చదవడం, వ్రాయడం రాదు. దగ్గర్లో ఉన్న రోడ్డుకు ఆమె ఇల్లు ఒక మైలు దూరంలో ఉంది. అయినా, ఆమెకు బైబిలును పఠించుటకు ఆసక్తి ఉండింది, యెహోవాను సేవించాలనే ఆమె నిర్ణయం త్వరలోనే విశదమయ్యింది. మారియ చదవడం, వ్రాయడం నేర్చుకుని, కూటాలకు హాజరవ్వటం మొదలుపెట్టింది, సంఘం చేసిన సమర్పిత ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలపాలి. ఆమెను జాగ్రత్తగా కారులో కూర్చోపెట్టడానికి వీలుగా ఆమె ఇంటివద్దనుండి సహోదరులు ఆమెను 200 మీటర్లు మోసుకెళ్లేవారు. ఆమె కుటుంబం మొదట్లోనే వ్యతిరేకించినప్పటికీ, ఆమె బాప్తిస్మం వరకు అభివృద్ధి సాధించింది. ఆత్మీయ అభివృద్ధి ఆమెకు కలిగించిన ఆత్మవిశ్వాసాన్ని బట్టి, ఇప్పుడామె ప్రత్యేకంగా తయారుచేయబడిన కారును నడపడం నేర్చుకుంది, ప్రాథమిక విద్య ముగించింది. “మారియ వంటి వారికి సహాయం చేయగలగడం ఏ త్యాగాన్నైనా తగినదిగా చేస్తుంది,” అని వివరించాడు రాసెన్‌డొ.
బైబిలు పాఠకులు వెంటనే ప్రతిస్పందించుట
స్పెయిన్‌లోని సామాన్య ప్రజలకు మొదటిసారిగా బైబిలు 1970వ దశకంలో లభ్యమయ్యింది. స్పెయిన్ దేశస్థులు ఎంతోమంది ఒక్కో ప్రతిని తెచ్చుకున్నారు, కొంతమంది లేఖనాలు చదవటం మొదలుపెట్టారు. యెహోవాసాక్షులు వాళ్ల పట్టణానికి 1973లో మొదటిసారి వచ్చేసరికే మాథెనా థెల్ కాంపొ (వల్లాడాలిడ్) నందలి పెలార్ బైబిలు చదువుతుండేది. కాథోలిక్ అయిన ఆమె, సాక్షుల వద్ద నుండి సాహిత్యాన్ని అంగీకరించడానికి భయపడింది, కాని ఆమెకు బైబిలును అర్థం చేసుకోవాలని ఉంది. ఫలితంగా, తన బైబిలు ప్రశ్నలకు జవాబిచ్చుటకు ప్రతివారం చర్చించడానికి ఆమె అంగీకరించింది.
వాచ్‌టవర్ సంస్థ ప్రచురించిన సాహిత్యాన్ని చక్కగా ఉపయోగించుకొని, పెలార్‌ను దర్శించిన పయినీరు సహోదరి ఆమె వేసే అనేక ప్రశ్నలకు జవాబివ్వగలిగేది. పెలార్ తాను నేర్చుకొంటున్నదాన్నిబట్టి ప్రభావితమై కొన్నివారాల తరువాత నిత్యజీవమునకు నడుపు సత్యము అనే పుస్తకాన్ని ఉపయోగించి బైబిలును పఠించుటకు ఆమె అంగీకరించింది. సత్యము పుస్తకము నుండి పఠనాన్ని ముగించక ముందే, ఆమె బైబిలు మొత్తం చదవడం ముగించి, తాను సత్యాన్ని కనుగొన్నానని అంగీకరించింది. ఇప్పుడు మెదినా డెల్ కాంపోలో ఒక మంచి రాజ్యమందిరం, 63 మంది ప్రచారకులున్న సంఘంలో ఆమె మొదటి సాక్షి అయ్యింది.
ఇప్పటికీ, స్పెయిన్‌లోని సాక్షులు ‘తమ ఆత్మీయ విషయాల యెడల శ్రద్ధ’ గల వారిని, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకొనుటకు ప్రయత్నిస్తూ క్రమంగా బైబిలు చదవేవారిని కలుసుకుంటున్నారు. (మత్తయి 5:3) (ఉత్తర స్పెయిన్) సుమయాలోని పారిష్‌లో ఒకప్పుడు ప్రశ్నోత్తర గ్రంథాన్ని బోధిస్తూ, మునుపు కాథోలిక్‌గా వున్న పెపి దగ్గరలోవున్న గ్రామంలో ప్రకటిస్తుండగా, ఆమె ఒక పారిష్ మతగురువును కలిసింది.
మతగురువు ఆమెతో ఇలా చెప్పాడు: “పెపి నీవు నీ సమయాన్ని వ్యర్థం చేస్తున్నావు, ఈ ఇత్‌జ్యార్ గ్రామంలో, ఆత్మీయాసక్తిగల వారు కేవలం ఇద్దరు వ్యక్తులే, వారు వివాహిత జంట. ఇతరులు ఊరికే అలవాటుగా చర్చికి వెళతారు.”
“ఆత్మీయాసక్తిగల ఇద్దరు వ్యక్తులుంటే, వారు యెహోవాసాక్షులవుతారు” అని పెపి జవాబిచ్చింది.
ఆ గ్రామమంతా పూర్తయ్యే వరకు ఇతర సాక్షులతో కలిసి పెపి ఇంటింటి ప్రకటనా పనిలో పాల్గొన్నది. ఒంటరిగావున్న ఒక ఇంట్లో మతగురువు చెప్పిన ఆ జంటను సహోదరులు కలిశారు. వారు బైబిలును చదువుతున్నారు గాని దాన్ని అర్ధం చేసుకోలేక పోయారు. వారు ఆసక్తిగా బైబిలు పఠనానికి అంగీకరించి, త్వరగా అభివృద్ధి చెంది, 1991 ఏప్రిల్ నెలలో బాప్తిస్మం తీసుకున్నారు.
కొంతమంది యథార్థపరులైన ప్రజలు వాచ్‌టవర్ సంస్థ ప్రచురించిన బైబిలు ఆధారిత సాహిత్యాన్ని కేవలం తామే స్వయంగా చదివి సత్యం తెలుసుకున్నారు. ఉదాహరణకు, అల్‌మాడెన్ (క్యుడాడ్ రియల్) నుండి వచ్చిన సాక్షులు సెర్యేలాస్ (బాడాజోజ్) అనే చిన్న పట్టణంలో ప్రకటిస్తుండగా తమ సమచారాన్ని ఆసక్తిగా విన్న ఒక స్త్రీని వారు కలిశారు. ఆమె కనపర్చిన ఆసక్తిని బట్టి వారు ఆమెకు గృహ బైబిలు పఠనాన్ని గూర్చి చెప్పారు. అయితే ఒక పెద్ద మనిషి తనకు ఇప్పటికే బైబిలు పాఠాలు చెప్తున్నాడని చెప్పి ఆమె నిరాకరించింది. ఆ ప్రాంతంలోని ఇంకా అనేకమంది కూడా అలాగే చెప్పారు. వారి ఆసక్తి పెరిగింది, ఆ పెద్దమనిషిని గూర్చి సహోదరులు విచారణ చేసారు. వారికి అతని చిరునామా దొరికింది, వారు అతన్ని దర్శించడానికి వెళ్లారు.
మాడ్రిడ్‌లో ఫెలెపా అనే ఈ వ్యక్తి వద్ద మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం ఉండడం చూసి వారు ఆశ్చర్యపోయారు. అది చదివిన తరువాత, సువార్తను తన పొరుగువారితో పంచుకోవడం తన బాధ్యత అని ఆయన అర్థం చేసుకున్నాడు. అందుకే ఆయన వారికి బైబిలు పాఠాలు చెప్పడానికి ఆ పుస్తకాన్ని ఉపయోగించేవాడు. ఆయనతో పఠనం చేయడానికి సహోదరులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయనతో బైబిలు పఠనం చేసిన ఒక స్త్రీ కూడా పఠనానికి అంగీకరించింది. సరైన ఆరోగ్యంలేని, 80 సంవత్సరాల వయస్సు గలవాడైనప్పటికీ, ఫెలెపా సత్యమందు బాగా అభివృద్ధి సాధిస్తున్నాడు.
దురభిమానాన్ని అధిగమించడం
గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని అసాధారణమైన సమస్యలుంటాయి. అలాంటి ప్రాంతాల్లో మతాచారాలు, మూఢనమ్మకాలు సాధారణంగా ఎక్కువ ప్రభావాన్ని కలిగివుంటాయి, గ్రామప్రాంతాల్లో జీవించే అనేకమంది “క్రొత్త మతం” గురించి సహజంగా అనుమానం కలిగివుంటారు. తాము తమ మతం మార్చుకుంటే ప్రత్యేకంగా తమ పొరుగువారు, బంధువులు ఏమనుకుంటారోనని కొంతమంది గ్రామస్థులు బాధపడతారు. కాని దేవుని వాక్యశక్తి అలాంటి సమస్యలను అధిగమించి ఒక వ్యక్తి జీవితాన్ని మార్చివేయగలదు. వాయవ్య స్పెయిన్‌లోని కాన్‌గాస్ డె మారాసొ అనే జాలర్ల గ్రామం విషయంలో ఇదే జరిగింది.
ఈ గ్రామ నివాసియైన రాబెర్టో, స్వాతంత్ర్యాన్ని కోరుకొని 14 ఏండ్ల వయస్సులో నావికునిగా పనిచేయటానికి సముద్రతీరానికి వెళ్లిపోయాడు. వ్యాపార ఓడల నావికునిగా అతని జీవితం, సముద్రంలో వుండవలసిన ఒంటరి సమయాలను గడపడానికి ఎక్కువగా త్రాగడం, మత్తుపదార్థాలను వినియోగించే ఇతర యౌవన నావికులతో పరిచయమేర్పడేలా చేసింది. త్వరలోనే రాబెర్టో కూడా బాగా త్రాగటానికి, మత్తుపదార్థాలకు అలవాటు పడిపోయాడు.
కొంత కాలానికి రాబెర్టో ఇంటికి తిరిగివచ్చాడు గాని చెడు అలవాట్లు మానుకోవడానికి అతనికి సాధ్యం కాలేదు, దానికి అతడు ఇష్టపడలేదు కూడా. మత్తుపదార్థాల కొరకు డబ్బు గురించి అతను దొంగతనాలు చేసి, ఆరు వేరువేరు సందర్భాలలో జైలుకు వెళ్లాడు. అతనికి 18 సంవత్సరాలున్నప్పుడు, ద్రాక్షారసం మరియు మందుల ప్రాణాంతకమైన మిశ్రమాన్ని త్రాగాడు. వైద్యులు అతని ప్రాణాన్ని రక్షించారు కాని, అతని కాళ్లు, చేతులు పనిచేయడం మానివేశాయి. అతడు రెండు కాళ్లు, చేతులు పక్షవాతంచే పడిపోగా ఆసుపత్రి నుండి వచ్చాడు. చక్రాలకుర్చీకే అంకితమైపోయినప్పటికీ, అతను తన మత్తుపదార్థాల అలవాటును మానుకోలేకపోయాడు. మతం యెడల ఆసక్తి లేకుండాపోయింది, మూడేండ్ల తరువాత యెహోవాసాక్షులు అతన్ని దర్శించేంతవరకు, జీవించడానికి ఆధారం ఆయనకు మత్తుపదార్థాలే అన్నట్లు వుండింది.
నెరవేరిన బైబిలు ప్రవచనాలను గూర్చి తెలుసుకోవడం రాబెర్టో తన అపనమ్మకాన్ని పోగొట్టుకోవటానికి సహాయం చేసింది. రాజ్యమందిరం వద్ద ఆయనకు లభించిన స్నేహపూర్వకమైన ఆహ్వానం, నిజమైన మతం ప్రజల జీవితాలను అర్థవంతం చేస్తుందని అతనికి రూఢిపర్చింది. తొమ్మిది నెలల్లో, రాబెర్టో తన మత్తుపదార్థాల అలవాటును మానుకుని, బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయనకు శారీరక వైకల్యత కలిగివున్నప్పటికీ, ఇప్పటికి ఎనిమిదేళ్లుగా పయినీరు సేవలో కొనసాగుతున్నాడు. గత రెండేండ్ల నుండి అతడు ఒక సంఘ పెద్దగా పనిచేస్తున్నాడు. ఫ్రాన్‌తెస్కో అనే అతని పూర్వ సహవాసి, రాబెర్టో జీవితంలో వచ్చిన మార్పులను బట్టి ప్రభావితుడై, తాను కూడా సాక్షియై, యిప్పుడు పరిచారకునిగా సేవచేస్తున్నాడు. బాగుపరచబడలేని వ్యసనపరునిగా భావించబడే అతనిలో వచ్చిన చెప్పుకోదగిన మార్పులు, స్థానిక ప్రజలు మన పనివిధానాన్ని మెచ్చుకొనుటకు సహాయం చేశాయి. ఒకవేళ సాక్షులు బాగుపరచ గలరేమోనని ఒక స్త్రీ, మాదక ద్రవ్యాలకు బానిసయైన తన కుమారున్ని రాజ్యమందిరానికి తీసుకువచ్చింది.
సత్యం కొరకు బైబిలును పరిశోధించుట
సాధారణంగా, గ్రామప్రజలు సత్యం యెడల కలిగివుండే మెప్పు తరచూ ఈ లోక జ్ఞానులను సిగ్గుపరుస్తుంది. (1 కొరింథీయులు 1:26, 27) అలా మెప్పుగలవారిలో అడెలినా అనే సిగ్గుపడే మధ్యవయస్కురాలు ఒకరు. ఆమె తన కాథొలిక్ విశ్వాసాన్ని చాలా గంభీరమైనదిగా భావించేది. ప్రతి ఉదయం తప్పిపోకుండా ఆమె మోకాళ్లూని ప్రభువు ప్రార్థన, మేరి స్తుతి అనేకసార్లు వల్లించేది. కనీసం కొన్ని ప్రార్థనలైనా వినపడతాయని, వారంలోని ప్రతిరోజు ఒక్కొక్క “సెయింట్‌కు” ప్రార్థన చేసేది.
అడెలీనా బైబిలు పఠించడం మొదలు పెట్టినప్పుడు, ఆమె అదే ఆసక్తిని తాను క్రొత్తగా తెలుసుకున్న విశ్వాసంలో కూడా కనపర్చింది. మొదటిసారి ఆమె తన భర్తతో కలిసి రాజ్యమందిరానికి వచ్చినప్పుడు లోనికి ప్రవేశించటానికి దాదాపు పది నిమిషాలు పట్టింది, అయినా ఆమె బిడియం ఆమెను ఆటంకపరచలేక పోయింది. ఒకసారి లోనికి వచ్చిన తరువాత ఆమె శ్రద్ధగా విన్నది. ఒక సందర్భంలో ఆమె క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన గురించి తెలుసుకుంది. ఆ విషయం ఆమెను బాగా ప్రభావితం చేసింది, ఆమె ఇంటికి వెళ్లిన తరువాత, దాన్ని గురించి తన బైబిలులో ఇంకా ఎక్కువ చదివి తెలుసుకోవాలని ఇష్టపడింది. ఆమెకుగాని ఆమె భర్తకుగాని ఆ సమాచారం ఎక్కడ ఉంటుందో తెలియదు, అయినా ప్రకటన గ్రంథంలో ఎక్కడో ఉంటుందని వారు అనుకున్నారు. అందుకని అడెలినా ఆ రాత్రి ప్రకటన గ్రంథాన్ని చదవడం మొదలుపెట్టి, తెల్లవారుతుండగా 20వ అధ్యాయానికి వచ్చేంత వరకు ఆమె చదువుతూనే ఉంది.
మరో సందర్భంలో, భర్త భార్య తరపున కూడా ప్రార్థించడం తగినదేనని అడెలీనా తెలుసుకుంది. అతడు ప్రార్థించటానికి ఇష్టపడినప్పటికీ, ఆమె భర్తకు ప్రార్థనలో ఏం చెప్పాలో తెలియదు. ఆ రాత్రే ఉపదేశం కొరకు అడెలినా బైబిల్లో చూడాలనుకుంది. ఉదయం రెండు గంటల వేళ, ప్రార్థనకు సంబంధించిన వివరాల గురించి ఉన్న మత్తయి 6వ అధ్యాయాన్ని కనుగొన్నానని చెప్పడానికి ఆమె భర్తను మేలుకొల్పింది. యేసు చెప్పిన సలహాలను చదివిన తరువాత, ఆమె భర్త ఇద్దరి కొరకు ప్రార్థించాడు. ఇప్పుడు అడెలినా, ఆమె భర్త యెహోవాసాక్షులు.
మంచి కోత
ఉత్సాహంగల యెహోవా సేవకుల ద్వారా 25 సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాల్లో సాక్ష్యమివ్వబడిన తరువాత, స్పెయిన్‌లోని అన్ని భాగాలకు సువార్త చేరింది. మొదటి శతాబ్దంలో ఆసియా మైనరు విషయంలో నిజమైనట్లే, ‘ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను.’ (అపొస్తలుల కార్యములు 13:49) ఫలితంగా, వేలాదిమంది గ్రామస్థులు అనుకూలంగా ప్రతిస్పందించారు.
స్పెయిన్‌లోనైనా, మరెక్కడైనా గ్రామీణ ప్రాంతాల్లో బాగా ప్రకటించాలంటే సహనం, స్వయం త్యాగం అవసరం. ‘మనుష్యులందరు రక్షణ పొందాలని’ యెహోవా చిత్తం గనుక, మెచ్చుకొనే వారిని వెదుకుటకు యెహోవాసాక్షులు సంతోషిస్తారు. (1 తిమోతి 2:4) ముందు ప్రస్తావించబడిన అనుభవాలు చూపిస్తున్నట్లు, స్పెయిన్‌లో గ్రామగ్రామానికి ప్రకటించటానికి చేసిన ప్రయత్నాలకు యెహోవా గొప్పగా ప్రతిఫలమిచ్చాడు.
[అధస్సూచీలు]
a గలిలయలో మొత్తం 204 “పట్టణాలు మరియు గ్రామాలు” ఉండెనని జోసెఫస్ లెక్కించిచెప్పాడు, అది “చాలా ఎక్కువ గ్రామాలు” ఉన్న ప్రాంతంగా ఆయన వివరించాడు.
[23వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
ఫ్రాన్స్
పోర్చుగల్
స్పెయిన్
బలారిక్ ద్వీపాలు
కానారి ద్వీపాలు
[24వ పేజీలోని చిత్రసౌజన్యం]
విలాక్, లెరిడా
[24వ పేజీలోని చిత్రసౌజన్యం]
పూబ్లా డి సానాబ్ర్య, జామోరా
[25వ పేజీలోని చిత్రసౌజన్యం]
కాసారాబోనెలా, మాలాగా
[25వ పేజీలోని చిత్రసౌజన్యం]
సైన్యస్, హుస్కా
[26వ పేజీలోని చిత్రసౌజన్యం]
లెకేట్యో, విజ్‌కాయా