పాఠకుల ప్రశ్నలు
మెల్కీసెదెకు అనే పేరుగల ప్రాచీన యాజకుడు నిజమైన మానవుడైనప్పటికీ, బైబిలు అతడు “వంశావళి లేనివాడు” అని ఎందుకు చెబుతుంది?
ఈ వ్యాఖ్యానం హెబ్రీయులు 7:3 నందు చేయబడింది. ఈ వచనాన్ని దాని సందర్భంలో పరిశీలించండి:
“రాజులను సంహారముచేసి, తిరిగి వచ్చుచున్న అబ్రాహామును ఎవడు కలిసికొని అతనిని ఆశీర్వదించెనో, యెవనికి అబ్రాహాము అన్నిటిలో పదియవవంతు ఇచ్చెనో, ఆ షాలేమురాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట ‘నీతికి రాజనియు,’ తరువాత ‘సమాధానపు రాజనియు’ అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రిలేనివాడును తల్లిలేనివాడును వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆదియైనను జీవనమునకు అంతమైనను లేనివాడునైయుండి దేవుని కుమారుని పోలియున్నాడు.”—హెబ్రీయులు 7:1-3.
ముందు చెప్పినట్లుగా మెల్కీసెదెకు నిజమైన మానవుడే, ఎవరితో అతనికి సూటియైన వ్యవహారాలుండేవో ఆ అబ్రాహామంత నిజమైన వ్యక్తి అతడు. (ఆదికాండము 14:17-20; హెబ్రీయులు 7:4-10) విషయమది గనుక, మెల్కీసెదెకుకు తల్లి, తండ్రి సంతానం వుండియుండవచ్చు. కాబట్టి, మానవునిగా అతనికి వంశావళి, లేక కుటుంబ వంశవృక్షం వుండింది. అతని భౌతిక జీవితానికి ముగింపు కూడా ఉండింది. రోమీయులు 5:12, 14 నందలి అపొస్తలుడైన పౌలు వ్యాఖ్యానాని కనుగుణంగా ఏదో ఒక సమయంలో మెల్కీసెదెకు మరణించాడు. మెల్కీసెదెకు ఎప్పుడు మరణించాడో, ఎప్పుడు తన యాజక సేవను ముగించాడో మనకు తెలియదు గనుక, ఆ విధంగా అతను తెలిసిన ముగింపేమి లేకుండా సేవచేశాడు.
మహోన్నత ప్రధాన యాజకునిగా యేసుక్రీస్తు పాత్రను గూర్చి చర్చిస్తూ, హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో పౌలు మెల్కీసెదెకును గురించి వ్యాఖ్యానించాడు. ఈ యాజక పాత్రలో యేసు మెల్కీసెదెకునకు చిహ్నము, లేక మాదిరి అని ఉదహరిస్తూ, పౌలు ఇలా అన్నాడు: “నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధానయాజకుడైన యేసు.” (హెబ్రీయులు 6:20) ఏ భావములో?
మెల్కీసెదెకు కుటుంబ వంశావళిని గూర్చి, అతని పూర్వీకులు లేక వంశస్థుల గురించి బైబిలు వృత్తాంతము ఏ వివరాలను ఇవ్వడంలేదని పౌలు గ్రహించియుండవచ్చు. ఆ సమాచారం కేవలం బైబిలు వృత్తాంతము మాత్రమేకాదు. పౌలుకు తెలిసినదాన్నిబట్టి, లేక మనకు తెలిసినదాని దృష్ట్యా మెల్కీసెదెకు “వంశావళి లేనివాడు” అని (న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ది హోలీ స్క్రిప్చ్‌ర్స్; అమెరికన్ స్టాండర్డ్ వెర్షన్), “వారసత్వ పట్టిక లేనివాడు” అని (డబ్ల్యూ. జె. కానిబీర్), లేక “కుటుంబ వంశవృక్షం లేనివాడు” అని సరిగ్గా చెప్పవచ్చు.—జె. బి. ఫిలిప్స్.
యేసు ఏవిధంగా అలా ఉండెను? యేసు తండ్రి యెహోవా దేవుడు, అతని మానవ తల్లి యూదా గోత్రికురాలైన మరియ అని ఒప్పుకొనవలసిందే. అయినా, మెల్కీసెదెకునకు యేసుకు ఒక సారూప్యం వుండింది. ఎలా? ఇశ్రాయేలీయుల జనాంగములో యాజకుల గోత్రమైన, లేవి గోత్రంలో యేసు జన్మించలేదు. యేసు మానవ వంశావళి ప్రకారం యాజకుడు కాలేదు. మెల్కీసెదెకు కూడా “శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమునుబట్టి” అంటే, యాజక గోత్రీకుల కుటుంబములో జన్మించడం ద్వారా యాజకుడు కాలేదు. (హెబ్రీయులు 7:15, 16) యాజకుడైన మానవ తండ్రి ద్వారా యాజకుడగుటకు బదులుగా, యేసు “మెల్కీసెదెకు యొక్క క్రమములోచేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడ్డాడు.”—హెబ్రీయులు 5:10
ఇంకా, యేసుకు ఆయన యాజకత్వాన్ని కొనసాగించుటకు వంశస్థులు లేదా వారసులు ఎవరూ లేరు. ఈ భావంలో కూడా, అతను వంశావళి లేనివాడు. సహాయకారియైన ఉపదేశకునిగా, అతడు తన యాజక సేవను నిరంతరం కొనసాగిస్తాడు. ఈ శాశ్వతసేవను గూర్చి వ్యాఖ్యానిస్తూ పౌలు ఇలా అన్నాడు:
“[యేసు] నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను. ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనముచేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు.”—హెబ్రీయులు 7:24, 25.
హెబ్రీయులు 7:3 నందలి పౌలు మాటలను మనం పరిశీలించడం కేవలం మనం గుర్తుంచుకొన వలసిన ఒక జ్ఞానవంతమైన అంశంకంటే ఎక్కువైనదే. పాపానికి నిత్య క్షమాపణ పొందుటకు యెహోవా దేవుడు చేసిన ప్రేమపూర్వక ఏర్పాటును, శాశ్వత సహాయాన్ని, నడిపింపును పొందుటకు ఆయన ఏర్పాటు చేసిన మార్గం యెడల మన మెప్పును అది బలపర్చాలి.