కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 10/15 పేజీలు 23-26
  • విభిన్న ప్రజలున్న దేశంలో ప్రకటించుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విభిన్న ప్రజలున్న దేశంలో ప్రకటించుట
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • సువార్త వ్యాప్తి చెందుట
  • ఐసొలేటెడ్‌ ప్రాంతాలలో త్వరితగతిన నిర్మింపబడిన మందిరాలు
  • ఆస్ట్రేలియా “ఉత్తర భాగానికి” ప్రయాణం
  • ఆస్ట్రేలియా గ్రామీణ ప్రాంతాలనుండి ఆలీస్‌ నీటిబుగ్గలకు
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 10/15 పేజీలు 23-26

విభిన్న ప్రజలున్న దేశంలో ప్రకటించుట

కంగారూలు, కోలాలు, వాంబట్‌లు, ప్లాటిపస్‌లు, అయర్స్‌ రాక్‌, గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌—ప్రజలు ఆస్ట్రేలియా గురించి తలంచుకున్నప్పుడు వారి మనస్సుకువచ్చే పేర్లు ఇవి. అయితే ఆశ్చర్యకరమైన విషయమేమంటే నిజానికి చాలామంది ఆస్ట్రేలియా వాసులు అయర్స్‌ రాక్‌ను లేదా గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌ను ఎప్పుడూ దర్శించివుండరు, జంతుప్రదర్శనశాలలో కాక మరెక్కడా కోలాను, వాంబట్‌ను, లేక ప్లాటిపస్‌ను చూసివుండరు. దానికి కారణం, 1 కోటి 73 లక్షల దేశ జనాబాలో 85 శాతం మంది నగర వాసులే, తీరం వెంబడివున్న ఐదు మహానగరాల్లోవారు నివసిస్తున్నారు.

తీరాన్ని విడిచి, 200 కిలోమీటర్లు లేదా ఆపైన దేశంలోకి ప్రయాణిస్తే, ఆ ఖండం యొక్క పేరు గాంచిన భూభాగానికి చేరతారు. ఫలవంతమైన, సారవంతమైన ప్రదేశము వేడిగల, ఎండిన, కేవలం పొదలు, మామూలు గడ్డి మాత్రమే పెరిగే ప్రాంతంగా పరిసరాలు మారిపోతాయి. అయినా గ్రామప్రాంతంలో కూడా జీవనం సాగుతుంది. పెద్ద పశుపాలనా కేంద్రాలు వందలాది చదరపు మైళ్ల స్థలాన్ని ఆక్రమించివుంటాయి. ఇంకా లోనికి వెళ్తే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్నిసార్లు మనుష్యులను చంపేసిన వేడిగల ఎడారులు ఉన్నాయి.

సువార్త వ్యాప్తి చెందుట

ఆస్ట్రేలియాలో ఈ పరిస్థితులందు కూడా దేవుని రాజ్యసువార్త ప్రకటింపబడుతున్నది. నీతియుక్తమైన నూతన లోకాన్ని గూర్చిన యెహోవా వాగ్దానానికి వేలాదిమంది ప్రతి సంవత్సరం ప్రతిస్పందిస్తున్నారు. క్రిందటి సేవా సంవత్సరం, రాజ్యప్రచారకుల సంఖ్య 57,000 కంటే అధిక శిఖరాగ్ర సంఖ్యను చేరింది, ఇది దాదాపు పది సంవత్సరాల క్రితం వున్నదానికి రెట్టింపు. అధికభాగం ప్రజలవలె ప్రచారకులలో అనేకులు తీరప్రాంత నగరాల్లోనే ఎక్కువగా నివసిస్తున్నను సువార్త మారుమూల ప్రాంతాల్లో కూడా వ్యాప్తి చెందుతున్నది.

విభిన్న ప్రజలున్న ఈ సువిశాల దేశంలో ప్రకటించడం ఎలావుంటుందో తెలుసుకోవటానికి, మనకున్న ఐదుగురు జిల్లాకాపరులలో ఒకరు తన భార్యతోపాటు మారుమూల ప్రాంతాలలోని సంఘాలను దర్శిస్తుండగా మనం వారితో కలిసివెళ్దాం. పశ్చిమ ఆస్ట్రేలియా, క్వీన్స్‌లాండ్‌ రాష్ట్రంలోని సగంభాగము, ఉత్తర ప్రాంతం కలిపి, 47 లక్షల చదరపు కిలోమీటర్ల కంటె ఎక్కువ ప్రాంతాన్ని వారు చుట్టివస్తారు. అది మునుపటి రష్యా కాకుండా, దాదాపు యూరపు యొక్క సగంభాగమంత ప్రాంతము.

పశ్చిమ ఆస్ట్రేలియా ముఖ్యపట్టణమైన పెర్త్‌ నుండి మన ప్రయాణం మొదలవుతుంది. పన్నెండు లక్షలమంది ప్రజలున్న ఈ ఆధునిక నగరంలో ఇప్పుడు యెహోవాసాక్షుల సంఘాలు 49 వున్నాయి. ఇంగ్లీషుతోపాటు, గ్రీకు, ఇటాలియన్‌, పోర్చుగీసు, స్పానిష్‌ సంఘాలు, ఇంకా ఇతర భాషలచిన్న గుంపులు వున్నాయి. ఆదివాసులైన సహోదర సహోదరీలతో కూడిన సంఘం కూడా ఒకటివుంది, వారు ఆ ఖండంలోని ఆదివాసి తెగల ప్రజలకు ప్రకటించటానికి పాటుపడతారు. ఈ ప్రజల్లో సాత్వికులైన అనేకులు రాజ్యసువార్తకు ప్రతిస్పందిస్తున్నారు. కాని పెద్ద పెద్ద నగరాలకు దూరంగానున్న ఈ ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉంటాయి?

మనం పెర్త్‌ నుండి ఉత్తరంగా పోర్ట్‌ హెడ్‌ల్యాండుకు 1,800 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాము, అక్కడ ఒక ప్రాంతీయ సమావేశం జరుగనైయుంది. హాజరైన 289 మందిలో చాలామంది 200 నుండి 700 కిలోమీటర్ల వరకు ప్రయాణించి ఇక్కడకు చేరుకున్నారు. ఐసొలేటెడ్‌ ప్రాంతాల నుండి తమ ఇళ్లకు దగ్గరలో వున్న సంఘానికి, సాధారణంగా కారు టైర్లలో గుచ్చుకొనే పదునైన రాళ్లతో నిండివున్న రోడ్ల మీద 250 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చారు. ఈ ప్రాంతంలోని మూడు సంఘాలవారు ఇటీవలనే త్వరితగతిన కట్టే పద్ధతి నుపయోగించి రాజ్యమందిరాలను నిర్మించారు.

ఐసొలేటెడ్‌ ప్రాంతాలలో త్వరితగతిన నిర్మింపబడిన మందిరాలు

ఈ ప్రాంతాలలో రాజ్యమందిరాలను నిర్మించటానికి నగరాలలోను, పెద్ద పట్టణాలలోను నిర్మించటానికి ఎంత వ్యత్యాసం వుంది! చాలామట్టుకు నిర్మాణ సామాగ్రంతటినీ పెర్త్‌ నుండే అనగా 1,600 కిలోమీటర్ల దూరంనుండి దక్షిణానికి రప్పించాలి. నిర్దేశింపబడిన వారాంతంలో 40 నుండి 45 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉన్ననూ వందలాదిమంది సహోదర సహోదరీలు రాజ్యమందిరాన్ని నిర్మించటానికి ఇంత దూరం ప్రయాణించి వస్తారు. ఎక్కువ సంఖ్యలో ప్రజలు అలాంటి ఐసొలేటెడ్‌ ప్రాంతాల్లోకి ప్రవేశించడమే ఒక విశేషమైన సాక్ష్యం. ఇనుప-ఖనిజపు గనులున్న పట్టణమగు టామ్‌ప్రైస్‌లో ఒక రాజ్యమందిరం నిర్మించబడినప్పుడు, స్థానిక వార్తాపత్రిక యొక్క మొదటిపేజి ఇలా ప్రకటించింది: “టామ్‌ప్రైస్‌లో మూడు రోజుల్లో ‘త్వరితగతిన నిర్మించే’ యెహోవాసాక్షుల రాజ్యమందిరపు పనిలో భాగం వహించటానికి వస్తున్న స్వచ్ఛంద వృత్తిపనివారికి, వారి సహాయకులకు హార్దిక స్వాగతం.”

పట్టణంలో వున్న ప్రతి ఒక్కరు సహకరించటానికి ఆసక్తి కలిగివున్నట్లనిపించింది. సాధారణంగా 50 టన్నుల సరుకును తేవటానికయ్యే 11,000 డాలర్ల ఖరీదుకు బదులు, ఔదార్యవంతుడైన ఒక ట్రక్కుడ్రైవరు సహోదరులను కేవలం ఇంధన ఖర్చును మాత్రమే ఇవ్వమని కోరాడు. స్థానిక పెయింటింగ్‌ కంట్రాక్టర్లు 100 లీటర్ల పెయింటును విరాళంగా ఇచ్చారు. తవ్వకం పని కంట్రాక్టర్లు మిషన్లను, ఒక మైనింగు కంపెనీ వారు ఒక క్రేన్‌ను ఉచితంగా ఇచ్చారు. మూడు వందలమంది సందర్శకులకు వసతి కల్పించడం సమస్యే అయ్యింది, కాని పట్టణవాసులు చూపిన సహకారం విశేషంగా వుంది. కొంతమంది ఫోనుచేసి పడకలు ఇస్తామని చెప్పారు. ఒక వ్యక్తి ఫోను చేసి, తాను వారాంతమందు బయటికి వెళుతున్నానని, తన ఇంటి వెనుక తలుపు తాళం వేయకుండా వుంచుతానని చెప్పాడు. అతనిలా అన్నాడు: “ఈ నిర్మాణపు పని అయిపోయేంత వరకు నా ఇల్లు మీదే అనుకోండి.”

స్థానిక సర్క్యూట్‌కు చెందిన ట్రెయిలర్‌ను తీసుకుని రమ్మని కొంతమంది సహోదరులకు చిరునామా యిచ్చిపంపినప్పుడు ఒక తమాషా సంఘటన జరిగింది. గేటుపైన “మతప్రచారకులు రాకూడదు” అని వ్రాయబడిన బోర్డు చూసి వారు విభ్రాంతి చెందారు. కాని ట్రెయిలర్‌ అక్కడవుంది. పూర్తిగా చెత్తతో నిండివున్న ఆ ట్రక్కును తీసుకువెళ్తున్నామని వారు ఆ ఇంటిగృహిణికి చెప్పారు. దాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు, అది సర్క్యూట్‌ ట్రెయిలర్‌ కాదని వారు గుర్తించారు. ట్రెయిలర్‌ యజమాని ఇంటికి వచ్చినప్పుడు, ట్రెయిలర్‌ను యెహోవాసాక్షులు తీసుకెళ్లారని ఆయన భార్య అతనికి చెప్పింది. ఆ తర్వాత కొద్దిసేపటికే, జరిగిన పొరపాటును వివరిస్తూ, సహోదరులు ఖాళీ ట్రెయిలర్‌ను తిరిగి తీసుకొచ్చారు. మంచి సంభాషణ జరిగింది, మునుపు వ్యతిరేకించిన వీరు మన గురించి, మన పని గురించి ఎన్నో ప్రశ్నలడిగారు. వారు ఇప్పుడు వచ్చి క్రొత్త రాజ్యమందిరాన్ని చూడటానికి ఆసక్తితో ఉన్నారు.

ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించాలంటే సహనం అవసరం. మొదటిగా, దానిలో ఎంతో దూరం వెళ్లడం ఇమిడివుంది. పునర్దర్శనాలు, బైబిలు పఠనాలు చేయడానికి, ఒక పయినీరు సహోదరి ఆమె భర్త పోర్ట్‌హెడ్‌లాండ్‌ నుండి మార్‌బల్‌ బార్‌ పట్టణానికి దారి సరిగాలేక, దుమ్ముతో నిండిన రోడ్ల మీద 350 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరాన్ని క్రమంగా ప్రయాణిస్తారు. అక్టోబరు నుండి మార్చి వరకు 50 డిగ్రీల సెంటిగ్రేడ్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే మార్‌బల్‌ బార్‌, ఆస్ట్రేలియాలోని అధిక ఉష్ణోగ్రత గల ప్రాంతాలలో ఒకటి.

ఆస్ట్రేలియా “ఉత్తర భాగానికి” ప్రయాణం

తర్వాతి ప్రాంతీయ సమావేశం 2,500 కిలోమీటర్లు ఉత్తరంగా వున్న డార్విన్‌ పట్టణంలో జరుగుతుంది. జిల్లాకాపరి, అతని భార్య తమ వ్యక్తిగత పఠనం కొరకు ఎన్నోగంటలపాటు చేసే ప్రయాణ సమయాన్ని ఉపయోగించుకుంటారు. మొదట వారు దినవచనాన్ని చదివి పరిశీలిస్తారు. తరువాత వారు టేపులో బైబిలు పఠనాన్ని వింటారు. డ్రైవింగ్‌ చేయడం, అలాగే ది వాచ్‌టవర్‌ మరియు అవేక్‌!ల నుండి శీర్షికలు చదవడం వారు ఇద్దరూ మార్చిమార్చి వంతులు తీసుకుని చేస్తారు.

“రోడ్‌ట్రెయిన్స్‌” గురించి జాగ్రత్త కలిగివుండమని ఒక రోడ్డు ప్రక్కన బోర్డుపైవ్రాత వారిని హెచ్చరిస్తుంది. అవి మూడు లేక నాలుగు ట్రెయిలర్లు కలిసివుండి, 55 మీటర్ల పొడవుండే పెద్ద వాహనాలు. కాబట్టి ఈ రోడ్‌ట్రెయిన్లను దాటివెళ్లాలంటే చాలా స్థలం కావాలి. ఐసొలేటెడ్‌ పట్టణాలకు పశువులను, ఇతర వస్తువులను చేరవేయటానికి వీటిని ఉపయోగిస్తారు.

వాతావరణం ఎప్పుడూ వేడిగా, పల్లెప్రాంతాల్లో పొడిగా వుంటుంది. నేలంతా సమానదూరాల్లో వున్న చీమలపుట్టల వల్ల ఎండిననేల బహుశ పెద్ద శ్మశానంలా కనిపించవచ్చు. చీమలపుట్టలను కట్టటానికి అవి ఉపయోగించిన నేలనుబట్టి ఈ చీమలపుట్టలు వివిధ రంగుల్లో వుంటాయి, ఎక్కడున్నా అవి 1 నుండి 2.5 మీటర్ల ఎత్తుంటాయి. తరువాత మన ప్రయాణికులు విక్టోరియా నదిని దాటుచుండగా ఇంటివద్ద చేయబడిన అనేక హెచ్చరికల బోర్డులు వారికి కన్పిస్తాయి. “ప్రమాదం: ఈత కొట్టడం అనుమతించబడదు. ఈ నదులలో మనుష్యులను తినే మొసళ్లున్నాయి!” అని ఒకటి చెపుతుంది. తెలివిగా, స్నానంచేసి చల్లబరచుకోవటానికి వారు వేరే మార్గాలు వెతుక్కోడానికి నిర్ణయించుకుంటారు!

చివరకు, సామాన్యంగా “టాప్‌ ఎండ్‌” అని పిలువబడే ఆస్ట్రేలియా ఉత్తరభాగాన్ని వారు చేరుకున్నారు. ఉత్తరప్రాంత ముఖ్యపట్టణమైన డార్విన్‌లో యెహోవాసాక్షుల రెండు పెద్ద సంఘాలున్నాయి. సర్క్యూట్‌ సమావేశానికి హాజరైనప్పుడు డార్విన్‌ నందలి విభిన్న సంస్కృతుల ప్రజలను చూడవచ్చు. ఇండోనేషియాలోని యుద్ధవిచ్ఛిన్న తూర్పు టైమోర్‌ నుండి వచ్చిన 30 ఏళ్ల చార్లెస్‌ను కలవండి. చైనీయులైన అతని తలిదండ్రులు పూర్వీకుల ఆరాధనాచారాన్ని అతనికి నేర్పారు. కరాటె, జూడోవంటి ఆత్మరక్షణ యుద్ధ కళలందు అతను ఎక్కువగా పాలుపొందేవాడు. అభిచారముతో పటిష్టమైన సంబంధం కలిగివున్నందున వాటిని విడిచిపెట్టడం అంత సులభం కాలేదు. అయినా, “సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును,” అన్న యేసు వాగ్దానాన్ని మనస్సులో వుంచుకుని, ఈ విధమైన జీవిత విధానాన్ని ఆయన విడిచిపెట్టాడు. (యోహాను 8:32) ఆయనిలా అంటున్నాడు: “ఈనాడు నాకు యెహోవా ఎదుట పరిశుభ్రమైన మనస్సాక్షి వుంది, ప్రస్తుతం నేను పరిచారకునిగా సేవ చేస్తున్నాను. మినిస్టీరియల్‌ ట్రైనింగ్‌ స్కూల్‌కు హాజరవ్వాలన్నది నా గురి.”

తరువాత, పాపువా న్యూ గినియా నుండి వచ్చిన బెవర్లెను కలవండి. “మొదట్లో తెల్లవారికి సాక్ష్యమివ్వాలంటే నాకు భయమేసేది ఎందుకంటే నా రెండవ భాష ఇంగ్లీషు, ఆస్ట్రేలియా ఉచ్చరింపున్న కొన్ని మాటలు నాకు అర్థం చేసుకోవటం కష్టమయ్యేలా చేశాయి. అయితే యెహోవా యందు విశ్వాసముంచి, ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకొమ్మని బైబిలు చెబుతున్నదని గుర్తుచేసుకుని, 1991 జనవరి నెలలో నేను పూర్తికాల పయినీరు సేవ మొదలుపెట్టాను. నా మొదటి బైబిలు విద్యార్థి ఇప్పుడు పయినీరు. ఆమె ఇద్దరు కుమార్తెలు కూడా సత్యాన్ని అంగీకరించారు, వారిలో ఒకామె తన భర్తతో కలిసి పయినీరు సేవచేస్తున్నది” అని బెవర్లే చెబుతున్నది.

డార్విన్‌ను విడిచి వెళ్లకముందు, తూర్పుకు 250 కిలోమీటర్లు ప్రయాణం చేసి విస్తారంగా రకరకాల పక్షులుగల కకాడు జాతీయ పార్కుకు త్వరగా వెళ్లివద్దాము. ఇక్కడ మనం ఈ మొత్తం ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తున్న ఒంటరి ప్రచారకురాలైన డెబ్బీని కలుస్తాము. అలాంటి ఐసొలేటెడ్‌ ప్రదేశంలో వుంటున్న ఆమె తన ఆత్మీయత నెలా బలంగా కాపాడుకుంటున్నదో మనం ఆమెను అడుగుదాము. ఆమె ఇలా జవాబిస్తున్నది: “మొదట, ప్రార్థన ద్వారా. . . . ఆ తర్వాత ‘భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును’ అనే యెషయా 41:10 లాంటి వచనాల నుండి నేను ఓదార్పును పొందుతాను.”

డార్విన్‌ నుండి 450 కిలోమీటర్ల దక్షిణంగా వెళ్తే, జిల్క్‌మినెన్‌ వద్ద, ఆదిమవాసుల చిన్న గుంపును మనం కలుస్తాము. వారిలో ఎవ్వరూ బాప్తిస్మం పొందనప్పటికీ, అనేకమంది క్రమంగా సమావేశాలకు హాజరయ్యేవారు గనుక ఈ ఆదివాసుల సమాజాన్ని అనేక సంవత్సరాల నుండి యెహోవాసాక్షుల సమాజంగా పరిగణించేవారు. ఈ సమాజం పరిశుభ్రతకు పేరుపొందింది. సంతోషకరంగా, కొంత మంది ఇప్పుడు సత్యంవైపు గట్టిగా నిలబడి బాప్తిస్మం తీసుకున్నారు. అలా చేసినవారిలో వీరు మొదటి గ్రామీణ ప్రాంత ఆదివాసులు. వారు తమ జాతివారి అభిచారసంబంధమైన, శతాబ్దాల తరబడి వస్తున్న ఆచారాల నుండి స్వతంత్రులు కావడానికి ఈ దీనులైనవారికి యెహోవా పరిశుద్ధాత్మపై ఆధారపడడం, నిజమైన ధైర్యం అవసరమయ్యింది.

ఆస్ట్రేలియా గ్రామీణ ప్రాంతాలనుండి ఆలీస్‌ నీటిబుగ్గలకు

“టాప్‌ ఎండ్‌”ను విడిచి 1,600 కిలోమీటర్లు దక్షిణానికి ప్రఖ్యాత అయ్యర్స్‌రాక్‌ వద్దనున్న ఖండం యొక్క “రెడ్‌ సెంటర్‌”లో ఆలీస్‌ నీటిబుగ్గలకు వెళ్లటానికి ఇది సమయం. ఇక్కడ ఎయిర్‌ కండిషన్డ్‌ రాజ్యమందిరంలో, ఈ ప్రాంతంలోని రెండు సంఘాల నుండి ఒక సమావేశానికి హాజరవుతున్న వారికి 130 లేక ఇంకా ఎక్కువ అనుకూలమైన సీట్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఆస్ట్రేలియాకు తూర్పున వున్న చిన్న ద్వీపములవారు, యూరోపియన్లు, ఆదివాసులు క్రైస్తవ సహవాసములో కలిసిమెలిసి వుండే సంతోషకరమైన దృశ్యాన్ని మనం మళ్లీ చూడవచ్చు.

చివరకు మనం ఆలీస్‌ నీటిబుగ్గలను విడిచి, మన సంచార జిల్లా కాపరి, అతని భార్యతో కలిసి మన ప్రయాణపు చివరి అంకాన్ని మొదలుపెడదాము. ఉత్తర, తూర్పు వైపులకు సాగిన ఈ ప్రయాణం మనల్ని ఖండంలో 2,000 కిలోమీటర్ల వరకు తీసుకువెళుతుంది. అలా వెళ్తుండగా, మనం ఆస్ట్రేలియా గ్రామీణ ప్రాంతాల నుండి మెల్లిగా క్వీన్స్‌లాండ్‌ యొక్క సారవంతమైన ఉష్టమండల ప్రాంతమందు అధిక వర్షాలు పడే అడవులను చేరతాము. గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌ ప్రాంతమైన—ఉత్తర క్వీన్స్‌లాండ్‌ తీరాన జనాబాలో అధిక నిష్పత్తిగల సాక్షులతో కూడిన సంఘాలు అనేకమున్నాయి.

మరో ప్రాంతీయ సమావేశానికి హాజరుకాక ముందే మన ప్రయాణం ముగియదు. బారియర్‌ రీఫ్‌ ఫేమ్‌ యొక్క క్వీన్స్‌లాండ్‌ ఉష్ణమండల నగరమైన కారిన్స్‌ నందు ఒక విమానం ఎక్కి ఆస్ట్రేలియా ముఖ్య ప్రాంతాన్ని విడిచి కేప్‌ యార్క్‌ ద్వీపకల్పం ఉత్తరకొన మీదుగా, టోరెస్‌ స్ట్రేయిట్‌కు విమానంలో ప్రయాణిస్తూ థర్స్‌డే ద్వీపానికి చేరతాము. అక్కడ కేవలం 23 మంది ప్రచారకులు మాత్రమేవున్న ఒక చిన్న సంఘం వుంది. ఈ ప్రయాణంలో మన చివరి సమావేశమందు 63 మంది హాజరవ్వడం చూస్తే ఎంత సంతోషంగా ఉంటుందో!

విభిన్న ప్రజలున్న ఈ దేశంలో జరుగుతున్న రాజ్య ప్రచార పనిని తిలకించి మీరు ఆనందించి యుండవచ్చని మేము నిరీక్షిస్తున్నాం. ఈ ఆసక్తికరమైన దేశంలో బహుశ మీరొకరోజు మమ్మల్ని సందర్శించి, తమ విశేష నియామకాల్లో విశ్వాసంగా తమ పరిచర్యయందు కొనసాగుతున్న సహోదర సహోదరీలను కలవచ్చు.

[23వ పేజీలోని బాక్సు/చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

పోర్ట్‌హెడ్‌లాండ్‌

కాన్‌బెర్రా

టామ్‌ ప్రైస్‌

మార్భల్‌ బార్‌

న్యూ మాన్‌

డార్విన్‌

కాధెరిన్‌

ఆలీస్‌ నీటిబుగ్గలు

అయ్యర్స్‌ రాక్‌

థర్స్‌డే ద్వీపం

కారిన్స్‌

అడెలాయిడ్‌

మెల్‌బోర్న్‌

హాబర్ట్‌

సిడ్నీ

బ్రిస్‌బేన్‌

పెర్త్‌

[24వ పేజీలోని చిత్రం]

పెర్త్‌, పశ్చిమ ఆస్ట్రేలియా ముఖ్యపట్టణం

[25వ పేజీలోని చిత్రం]

వీధిసాక్ష్యం మంచి ఫలితాలను తెస్తుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి