గ్రీసులో ప్రకటించు హక్కును యూరప్ హైకోర్టు సమర్ధించింది
“తన పొరుగువారందరితో పొగడబడే ఓ వ్యక్తి 1938 నుండి 60 సార్లు ఎందుకు అరెస్టు కావాలి? గ్రీకు ద్వీపం క్రేతులో నిజాయితీగా ఒక దుకాణాన్ని నడిపించుకునే ఈయన గ్రీకు న్యాయస్థానం ఎదుటికి 18 సార్లు పిలువబడి, ఆరు సంవత్సరాలు జైల్లో ఎందుకు గడపాలి? కష్టజీవి మినోస్ కొకీనాకీస్ అనే ఈ కుటుంబీకుడు భార్య, ఐదుగురు పిల్లలకు ఎడంగా దోషులను బంధించే నానా దీవుల్లో ఎందుకు బంధీగా గడపాల్సొచ్చింది?
మతమార్పిడిని నిషేధిస్తూ, 1938, 1939 లలో చేయబడిన చట్టాలే ఇందుకు ముఖ్య కారణము. ఈ చట్టాలు గ్రీకు ఆర్థడాక్స్ చర్చి ప్రభావానికి లోనై పనిచేసిన గ్రీకు నియంత ఇయానీస్ మెటాక్సెస్ వలన రూపుదిద్దుకున్నాయి.
ఈ చట్టాన్నిబట్టి 1938 నుండి 1992 వరకు 19,147 మంది యెహోవాసాక్షులను అరెస్టుచేయడం జరిగింది. వీటి మూలంగా కోర్టులు వారిపైన మొత్తం 753 సంవత్సరాల జైలు శిక్షను విధించగా, కచ్చితంగా 593 సంవత్సరాల శిక్ష అమలు జరిగింది. దీనంతటికి కారణమేంటంటే ఇతరచోట్ల మాదిరే యెహోవాసాక్షులు గ్రీసు దేశంలోను, యేసుక్రీస్తు ఆజ్ఞాపించినట్లు “మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, . . . నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి” అనే ఆజ్ఞను పాటించడమే.—మత్తయి 28:19, 20.
అయితే చివరకు 1993, మే 25వ తారీఖున స్వేచ్ఛగా ఆరాధించడానికి మహోన్నత విజయం లభించింది. ఆరోజే ఫ్రాన్సులోని స్ట్రాస్బోర్గ్ లోవున్న మానవహక్కుల యూరప్ కోర్టు గ్రీకు పౌరులకు తమ నమ్మకాలను ఇతరులకు బోధించే హక్కును ప్రసాదించింది. ఈ యూరప్ హైకోర్టు అలాంటి హక్కును జారీచేస్తూ, ప్రతిచోటనున్న ప్రజల జీవితాలపై గొప్ప ప్రభావాన్ని చూపించగల్గే మత స్వాతంత్ర్యానికి అత్యధిక రక్షణ కల్పించింది.
అయితే, నిర్ణయాత్మకమైన ఈ కోర్టు తీర్మానానికి దారితీసిన విషయాలేంటో, ఆ గ్రీకు పౌరుడొక్కడే అనుభవించిన అవమానాలేంటో మనము నిశితంగా పరిశీలిద్దాము.
పూర్వ రంగము
గ్రీకు చట్టప్రకారం మతమార్పిడిచేయడం అనే నేరానికి 1938లో దోషిగా ఆరోపించబడి కోర్టుకు లాగబడిన మొదటి యెహోవాసాక్షి ఈ మినోస్ కొకీనాకీస్. ఈ కేసు పూర్తిగా తేలకముందే అమోర్గోస్ లోని ఏజియన్ ద్వీపంలో ఆయన 13 నెలలు బంధీగా పంపబడ్డాడు. తరువాత 1939లో రెండుసార్లు జైల్లో వేయబడి ఒక్కోసారి రెండున్నర నెలలు గడిపాడు.
కొకీనాకీస్ 1940లో మెలోస్ ద్వీపానికి ఆరునెలలు బంధీగా పంపబడ్డాడు. ఆ తరువాతి సంవత్సరం రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఏథెన్సులోని సైనిక కారాగారంలో 18 నెలలు ఉంచబడ్డాడు. ఆకాలాన్ని గూర్చి ఆయనిలా జ్ఞాపకం చేసుకొంటున్నాడు:
“కారాగారంలో ఆహారములేని ఆ దుస్థితి మరీ దుర్భరమయ్యింది. మేము నడవలేనంత బలహీనులమయ్యాము. ఏథెన్సు, పీరాయేస్ పట్టణాలలోనున్న సాక్షులు వారి లేమి నుండే మాకు ఆహారం అందించకపోతే మేము మరణించివుండే వాళ్లం.” తరువాత 1947లో ఆయన్ను మరలా జైలుకు పంపినప్పుడు, నాలుగున్నర నెలలు అందులో గడిపాడు.
మినోస్ కొకీనాకీస్ 1949లో మేక్రొనిసస్ దీవికి చెరగా పంపబడ్డాడు. ఆ దీవి పేరు వినగానే అక్కడున్న జైలునుబట్టి గ్రీకుల మనస్సులో భయంకర రూపాలు మెదిలాడుతాయి. మేక్రోనిసస్ లో ఉంచబడిన 14,000 మంది ఖైదీలలో దాదాపు 40 మంది సాక్షులున్నారు. గ్రీకుభాషా ఎన్సైక్లోపీడియా పాపిరొస్ లారొస్ బ్రిటానికా ఇలా రాస్తున్నది: “అచ్చట హింసించే క్రూర పద్ధతులు, . . . అందులోగల జీవన పరిస్థితులు, సంస్కృతిగల జాతికి అనంగీకారమైనది. అందులోవుండే ఖైదీలయెడల గార్డుల నీచ ప్రవర్తన ఇవన్నీ గ్రీసు చరిత్రకే తలవంపులుగా ఉన్నది.”
అక్కడ జైల్లో ఒక సంవత్సరం గడిపిన కొకీనాకీస్ అందులోని పరిస్థితులను ఇలా వర్ణిస్తున్నాడు: “అక్కడ సైనికులు మధ్యకాలంనాటి రోమను కేథలిక్కు మత విచారణలలో ప్రవర్తించిన రీతిలో అక్కడ సైనికులు ప్రవర్తించేవారు. లోపలున్న వారిని ఉదయం నుండి సాయంకాలమువరకు విచారణతో వేధిస్తూ ఉండేవారు. వారు పెట్టిన హింసలను వర్ణించడానికి మాటలు చాలవు. చాలామంది ఖైదీలు పిచ్చివారయ్యారు. ఇతరులు చంపబడ్డారు. అనేకులు అంగవికలులయ్యారు. ఆ భయంకర రాత్రులలో హింసించబడేవారి ఏడ్పు, రోదనలను వింటూ, మేమందరము ఒక గుంపుగా ప్రార్థించుకునే వాళ్లము.”
మేక్రొనిసస్లోని బాధలనుండి బ్రతికి బయటపడ్డ తర్వాత, మరలా కొకీనాకీస్ ఆరుసార్లు అరెస్టు చేయబడి 1950వ దశకంలో మరో పది నెలలు జైల్లో గడిపాడు. అంతేగాక 1960వ దశకంలో నాలుగుసార్లు అరెస్టు చేయబడి ఎనిమిది నెలలు జైలుకు పంపబడ్డాడు. అయితే జ్ఞాపకముంచుకోవలసిన సంగతేమంటే తమ విశ్వాసమునుగూర్చి ఇతరులతో మాట్లాడినందుకు అనేక సంవత్సరాలలో అరెస్టు చేయబడి జైలులో వేయబడిన వందలకొలది యెహోవాసాక్షులలో ఈ మినోస్ కొకీనాకీస్ ఒకడు మాత్రమే.
గ్రీసులో యెహోవాసాక్షులకు వ్యతిరేకముగా జరిగించబడిన ఈ భయంకర అన్యాయ దుష్కృత్యములు చివరకు ఎలా మానవ హక్కులకోసం వెలసిన యూరప్ హైకోర్టు దృష్టికి తేబడ్డాయి?
వివాదాం రేపిన కేసు
ఈ కేసు మొట్టమొదట మార్చి 2, 1986న ప్రారంభమైంది. రిటైరై వ్యాపారం చేసుకుంటున్న 77 సంవత్సరాల మినోస్ కొకీనాకీస్, ఆయన భార్య, ఇద్దరూ ఆ రోజున క్రేతులోని సిటియాలో శ్రీమతి. జార్జియా కిరీయాకాకిని కలుసుకున్నారు. స్థానిక ఆర్థడక్స్ చర్చిలో గురువుగా పనిచేస్తున్న శ్రీమతి కిరియాకాకి భర్త ఈ విషయాన్ని పోలీసులకు తెలియపర్చాడు. పోలీసులు వచ్చి కొకీనాకీస్ను, ఆయన భార్యను అరెస్టుచేసి స్థానిక పోలీసు స్టేషనుకు తీసుకెళ్లారు. ఆ రాత్రంత వారిని అక్కడే నిర్బంధించారు.
వారిపైన మోపిన అభియోగమేంటి? గత 50 సంవత్సరాలుగా యెహోవాసాక్షులను ఏ నెపముమీదైతే వేలసార్లు అరెస్టు చేశారో అదే నెపము. మతమార్పిడి చేయడం. గ్రీకు రాజ్యాంగము (1975), ఆర్టికల్ 13, ఇలా అంటుంది: “మత మార్పిడి నిషేధించబడింది.” అంతేగాక మతమార్పిడిని నేరంతోకూడిన దోషంగా పరిగణించే సెక్షన్ 4, సంఖ్య 1363/1938 మరియు 1672/1939 గ్రీకు చట్టాన్నికూడా పరిశీలించండి. అది ఇలా అంటుంది:
ప్రత్యేకంగా “‘మతమార్పిడి’ అంటే, ప్రత్యక్షంగా గాని, పరోక్షంగాగాని, మరొక మతముగల వ్యక్తికి, తన నమ్మకాలను కించపరస్తూ, ఏ విధమైన ఆశనైనా చూపి, లేక వాగ్దానం చేసి, లేదా నైతికంగా లేక వస్తుపరంగా సహాయంచేస్తామనే ఆశతో, మోసపూరితంగానైనా, లేక వారి అనుభవ రాహిత్యాన్ని, నమ్మకాన్ని, అవసరతను, తక్కువ జ్ఞానాన్ని లేదా అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని తమ మత నమ్మకాలను నాటడమే.”
క్రేతులోని లెసిథీ క్రిమినల్ కోర్టు ఈ కేసును మార్చి 20, 1986లో విని, కొకీనాకీస్ను ఆయన భార్యను మతమార్పిడి చేస్తున్న దోషులుగా నిర్ధారించి, ఇద్దరికి నాలుగు నెలలు జైలు శిక్ష విధించింది. వారిని నేరస్థులుగా పరిగణిస్తూ కోర్టు, ముద్దాయిలు “వారి అనుభవ రాహిత్యాన్ని స్వల్పజ్ఞానాన్ని, వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ఆర్థడాక్స్ క్రైస్తవుల మత నమ్మకాలపై ముట్టడి జరిపారని ప్రకటించింది. అంతేగాక “తమ వివేకము, నైపుణ్యవంతమైన వివరణలతో ఆమెను [శ్రీమతి. కిరీయాకాకి]ని తన ఆర్థడాక్స్ నమ్మకాలను మార్చుకొనమని ప్రోత్సహించారని” ఆరోపించింది.
ఈ తీర్మానాన్ని క్రేతులోని అప్పీలుకోర్టులో అప్పీలు చేసుకున్నారు. మార్చి 17, 1987న ఈ క్రేతు కోర్టు శ్రీమతి కొకీనాకీస్ను విడిచిపెట్టి, ఆమె భర్త జైలు శిక్షను మూడునెలలు తగ్గించినప్పటికి ఆయనను మాత్రము దోషిగా ఆరోపించారు. కొకీనాకీస్ గారు [శ్రీమతి కిరియాకాకిగారి] అనుభవరాహిత్యాన్ని, అల్ప జ్ఞానాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొన్నాడని” న్యాయమూర్తి అన్నాడు. ఇంకా “సిద్ధాంతాలు అంతగా తెలియని, వాటినిగూర్చి సవాలు చేయలేని క్రైస్తవ స్త్రీకి ఆయన పరిశుద్ధలేఖనాలను చదివి ఆమె ఎదిరించలేనట్లు నైపుణ్యంగా వివరించాడని” అన్నారు.
అయితే ఈ అభిప్రాయంతో ఏకీభవించకుండా అప్పీలు న్యాయమూర్తులలో ఒకరు “ముద్దాయి ఈమె స్థితిని ఆసరాగా తీసుకొని యెహోవాసాక్షులలో ఒకరగునట్లు ప్రోత్సహించడానికి, ఒక మతగురువు భార్యయైన శ్రీమతి జార్జియా కిరియాకాకి ఆర్థడాక్స్ క్రైస్తవ సిద్ధాంతం విషయంలో అనుభవం లేనిదని, అల్పజ్ఞానంగలదని, ప్రతిఘటించలేనిదని, అమాయకురాలని అనడానికి ఏవిధమైన సాక్ష్యం లేదని” వ్రాశారు.
ఈ కేసును కొకీనాకీస్ అప్పీలుచేసుకొనే గ్రీకు అత్యున్నత న్యాయాస్థానానికి తీసుకెళ్లాడు. కానీ ఆ కోర్టు 1988, ఏప్రిల్ 22వ తారీఖున ఆ విన్నపాన్ని తిరస్కరించింది. దానితో 1988, ఆగస్టు 22లో కొకీనాకీస్ ఈ కేసును యూరోపియన్ కమీషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌కు విన్నవించుకున్నాడు. చివరకు ఆయన విన్నపము ఫిబ్రవరి 21, 1992న స్వీకరించబడి, మానవ హక్కులను కాపాడే యూరోపియన్ కోర్టులో ప్రవేశపెట్టబడింది.
కేసులోని వివాదాంశాలు
యూరప్ కౌన్సిల్లో గ్రీసు కూడా ఒక సభ్య దేశమైనందున, మానవహక్కులు, వారి ప్రాథమిక స్వేచ్ఛను కాపాడేందుకు ఏర్పడిన ఈ యూరప్ సమాఖ్య యొక్క ఆర్టికల్స్‌కు ఇది కట్టుబడింది. ఈ సమాఖ్యయొక్క ఆర్టికల్ 9 ఇలా ఉంది: “స్వతంత్ర తలంపు, మనస్సాక్షి, మతమును కలిగివుండే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఈ హక్కులో ఒకడు తన మతము, నమ్మకము, స్వేచ్ఛను ఒంటరిగాగాని, ఇతరులతో పాటు సామూహికంగాగాని, బహిరంగంగానైనా లేదా వ్యక్తిగతంగానైనా, తన మతము, నమ్మకము, ఆరాధన, బోధ, అభ్యాసము, ఆచరణను వ్యక్తపరచే స్వాతంత్ర్యాన్ని కలిగివున్నాడు.”
ఆవిధంగా గ్రీకు ప్రభుత్వము యూరోపియన్ కోర్టులో ముద్దాయిగా నిలబడింది. యేసుక్రీస్తు ఆజ్ఞాపించినట్లు ‘మీరు వెళ్లి బోధించి, శిష్యులనుచేయుడి’ అనే దానికి కట్టుబడి మతాన్ని ఆచరిస్తున్న ఒక గ్రీకు పౌరుని ప్రాథమిక మానవ హక్కును అది బాహాటంగా కాలరాచినట్లు ఆరోపించబడింది. (మత్తయి 28:19, 10) అంతేకాదు, పేతురు కూడా “[యేసు] ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యమియ్యవలెనని మాకు ఆజ్ఞాపించెనని” తెలియజేశాడు.—అపొస్తలుల కార్యములు 10:42.
యూరోపియన్ మ్యాగజైన్ ఆన్ హ్యూమన్ రైట్స్ అనే పత్రిక 1992 ప్రత్యేక సంచిక దాని కవరుపై “గ్రీస్—డెలిబెరేట్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్” అనే శీర్షికతో ప్రచురించబడింది. ఈ పత్రిక రెండో పేజీలో: “ఎవరైనా మరోవ్యక్తిని తన మతం మార్చుకోడానికి పురికొల్పితే అందుకు జురిమానా విధిస్తూ, జైలుకు పంపే శిక్షా చట్టంతో శిక్షించే దేశం యూరప్ సమాజంలో ఒక గ్రీసు దేశం మాత్రమే” అని వివరించింది.
దీంతో న్యాయవ్యవస్థ లోపల వెలుపల ఉత్సూకత పెల్లుబికింది. ఒకని నమ్మకాలను ఇతరులకు ప్రకటించడాన్ని నిషేధించే గ్రీకు చట్టం విషయంలో ఏ నిర్ణయం తీసుకోబడుతుంది?
స్ట్రాస్‌బోర్గ్‌లో విచారణ
చివరకు నవంబరు 25, 1992న కేసు విచారణ దినం రానే వచ్చింది. స్ట్రాస్‌బోర్గ్‌లో దట్టంగా మబ్బులు కమ్మాయి. బయట వాతావరణం చలిగా ఉంది. కాని కోర్టులో లాయర్లు చాలా వేడిగా వారి వాదనలు వినిపించారు. కొకీనాకీస్ పక్షంగా వాదించే అటార్ని ప్రొఫెసర్ ఫెడన్ వెగ్గిరీస్, వివాదాంశపు మూల సమస్యను వెలుగులోకి తెస్తూ, ఇలా ప్రశ్నించాడు: ‘ఈ నిర్బంధపు చట్టము, తమ మతనమ్మకాలవలెనే సజీవంగా కొనసాగుతూ, అన్వయించుకోతగ్గ ఇతర మత నమ్మకాలవైపు మారకుండా గ్రీకు ఆర్థడాక్స్ చర్చి వారిని కాపాడేటందుకే రూపించబడిందా?’
ఇందుకు నేనెంతో కలతచెందుతున్నానని చూపుతూ, ప్రొఫెసర్ వెగ్లీరిస్ ఇలా అడిగాడు: “ఈ [మతమార్పిడి] చట్టము ఆర్థడాక్స్వారికి మూర్ఖత్వాన్ని, అజ్ఞానతను ఎందు ఆపాదిస్తుందో, నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆర్థడాక్స్వారు మూర్ఖత్వము, ఆత్మీయ అచేతనంతో నిండివుంటే దానిని కాపాడటం ఎందుకు అవసరమో నన్ను కలవరపెడుతూ, దిగ్భ్రాంతున్ని చేస్తున్నది.” గమనించదగిన సంగతేమంటే, ఈ చట్టాన్ని యెహోవాసాక్షులకు కాక వేరే మరొకరికి అన్వయించినటువంటి ఒక సంఘటనను కూడా ప్రభుత్వ ప్రతినిధి పేర్కొనలేక పోయాడు.
కొకీనాకీస్గారి తరపున వాదించే రెండవ అటార్ని పానాయోటీస్ బీట్సాహీస్ ఈ మతమార్పిడి చట్టం ఎంత కారణరహితమైందో చూపాడు. ఆయన ఇలా అన్నాడు: “పెద్దల మధ్య సంభాషణ జరుగుతుందంటేనే పరస్పరం ఒకరి ప్రభావానికి మరొకరు ఆమోదిస్తున్నారనేది అందులో ముందే చేరివున్న ఒప్పందము. అలాకాని పక్షంలో మనము మాట్లాడక మౌనంగా ఉండే మృగ సమాజానికి అనగా ఒక వింత సమాజానికి చెందిన వారమౌతాము. ఆలోచిస్తూనే దానిని వ్యక్తం చేయకుండా, మాట్లాడుతూనే పరస్పరం సమాచారాన్ని పంచుకోకుండా, ఉనికిలో ఉంటూనే మరొకరితో కలిసివుండకుండా ఎవరుంటారు.”
బీట్సాహీస్గారు ఇలా వాదించారు, “కొకీనాకీస్గారు ‘ఆయన చేసిన ఒక పనినిబట్టి ఆయన ఖండించబడలేదు. ఆయన ఏమైయున్నాడో దాన్నిబట్టి ఆయన ఖండించబడ్డాడు.’” అందుచేత మత స్వాతంత్ర్యానికి సంబంధించిన సూత్రాలను ఉల్లంఘించడమే కాకుండా, వాటిని పూర్తిగా విచ్ఛిన్నం చేశారని బీట్సాహీస్గారు చూపించారు.
గ్రీకు ప్రభుత్వపు ప్రతినిధులు, అసలు విషయాన్ని వదిలిపెట్టి “గ్రీకు మానవ హక్కులకు పరదైసు వంటిదని” చెప్పుకుంటూ కథను మరోవిధంగా మలచడానికి ప్రయత్నించారు.
తీర్మానం
తీర్మానం కోసం ఎంతో దీర్ఘకాలంగా కనిపెట్టిన ఆరోజు మే 25, 1993కు రానే వచ్చింది. ఆరుగురిలో ముగ్గురు న్యాయాథిపతులు 84 సంవత్సరాల మినోస్ కొకీనాకీస్ మతస్వాతంత్ర్యాన్ని గ్రీకు ప్రభుత్వం భంగపరచిందని తీర్పునిచ్చింది. తన జీవిత మార్గంగా ఎన్నుకున్న బహిరంగ పరిచర్యను ప్రస్తుతించుటతోపాటు ఆయనకు నష్టపరిహారంగా 14,000 డాలర్లను బహుమానంగా అందించింది. ఆవిధంగా కొకీనాకీస్, యెహోవాసాక్షులు వారి నమ్మకాలను ఇతరులతో చర్చించేటప్పుడు యుక్తిని ఉపయోగిస్తారనే గ్రీకు ప్రభుత్వపు వాదనను కోర్టు త్రోసిపుచ్చింది.
గ్రీకు రాజ్యాంగము, వారి ప్రాచీన చట్టము మతమార్పిడిని నిషేధించినప్పటికి, ఈ చట్టాన్నుపయోగించి యెహోవాసాక్షులను హింసించడం తప్పిదమని యూరప్ హైకోర్టు తీర్మానించింది. మానవ హక్కుల యూరోపియన్ సమాఖ్య ఆర్టికల్ 9కి అది విరుద్ధమైనది.
కోర్టు తీర్మానం ఇంకా ఇలా వివరించింది: “మతమనేది మానవ ‘ఆలోచనా ప్రవాహంలో ఎప్పుడూ నూతన పర్చబడుతుండే’ భాగము. దానిని బహిరంగంగా చర్చించకుండా నిరోదించాలనే తలంపుతో ఉండటం అసాధ్యము.”
దీనితో ఏకీభవించే అభిప్రాయాన్నే వెలిబుచ్చుతూ తొమ్మిది మంది న్యాయాథిపతులలో ఒకరు ఇలా అన్నారు: “‘విశ్వాసాన్ని వ్యాప్తిచేయాలనే ఆసక్తి’ అని నిర్వచింపబడిన మతమార్పిడి అంతటి శిక్షార్హమైనది కాదు. ఒకని మతమును వ్యక్తపరచుకొనే అట్టి మార్గము—పరిపూర్ణంగా చట్టబద్ధమైనది.’
“ఈ ప్రస్తుత కేసులో దరఖాస్తుదారుడు [కొకీనాకీస్ గారు] ఏవిధమైన అనౌచిత్య ప్రవర్తన లేకుండా అలాంటి ఆసక్తిని చూపినవానిగానే నిరూపించబడ్డాడు.”
తీర్మానపు ఫలితాలు
మానవహక్కుల యూరోపియన్ కోర్టు ఇచ్చిన స్పష్టమైన సూచన గ్రీకు ప్రభుత్వాధికారులు మతమార్పిడి చట్టాన్ని దుర్వినియోగపర్చడం మానుకోవాలని స్పష్టంచేసింది. కోర్టుయిచ్చిన ఈ సూచనలకు గ్రీసు కట్టుబడి యెహోవాసాక్షులను హింసించడం మానుకుంటుందని ఆశిద్దాం.
యెహోవాసాక్షుల ఉద్దేశము సాంఘిక మార్పులు తీసుకురావడంగాని, లేక చట్టవ్యవస్థను పునర్నిర్మించడంగాని కాదు. యేసుక్రీస్తు ఆజ్ఞకు విధేయులౌతూ దేవుని రాజ్య సువార్తను ప్రకటించడమే వారి ముఖ్య ధ్యేయము. అయితే ఇందుకువారు అపొస్తలుడైన పౌలు మొదటి శతాబ్దంలో చేసినట్లే ‘సువార్త పక్షమున [చట్టపరంగా తమ్మును తాము కాపాడుకొనుటకు NW] వాదించుటకు వారు ఇష్టపడతారు.—ఫిలిప్పీయులు 1:7.
యెహోవాసాక్షులు ఏ దేశములో నివసిస్తున్నప్పటికి, వారు చట్టానికి బద్ధులైన పౌరులుగా ఉన్నారు. అన్నిటికంటే మిన్నగా పరిశుద్ధ బైబిలులో వ్రాయబడిన దైవశాసనానికి ఆజ్ఞకు లోబడుటకు తమలోతాము పురికొల్పబడుతున్నారు. అందుచేత బైబిలుపై ఆధారపడిన వారి నమ్మకాలను ఇతరులతో మాట్లాడకూడదని ఏ దేశ చట్టమైన వారిని నిషేధిస్తే, అపొస్తలులవలెనే “మనుష్యులకు కాదు మేము దేవునికే లోబడవలెను గదా” అనే స్థానాన్ని చేపట్టక తప్పదు.—అపొస్తలుల కార్యములు 5:29.
[28వ పేజీలోని బాక్సు]
ఎక్కువగా మతగురువులు ప్రేరేపించిన హింసే
‘చట్టం ద్వారా కీడు కల్పించాలను’ గ్రీసులోని మతగురువుల ప్రయత్నాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నవి. (కీర్తన 94:20) క్రేతు ద్వీపంలోనే ఇటీవల మరో సంఘటన పరిష్కరించబడింది. ఇంతకుమునుపు 1987లో స్ధానిక బిషప్పు మరి 13 మంది మతగురువులు కలిసి తొమ్మిదిమంది సాక్షులపై, వారు మతమార్పిడి చేస్తున్నారని ఆరోపించడం జరిగింది. చివరకు జనవరి 24, 1992న కేసు విచారణకు తీసుకోబడింది.
కోర్టు గదంతా నిండిపోయింది. వారిపై మోపబడిన అభియోగాలను బలపరచడానికి 35 మంది మతగురువులు వచ్చారు. ఎట్లైతేనేమి, అప్పటికే సీట్లన్ని తమ క్రైస్తవ సహోదరులను బలపర్చడానికి విచ్చేసిన సాక్షులతో నిండిపోయాయి. మామూలు వాదోపావాదాలు ఇంకా ప్రారంభం కాకముందే నిందితుల తరపునవున్న అటార్ని, ప్రాసిక్యూటర్ చేసిన చట్టసంబంధమైన పెద్ద తప్పులను ఎత్తిచూపించాడు.
ఫలితంగా ఆ వ్యవహారంలో ఇమిడివున్న వాళ్లంతా చిన్నగా ఒక ప్రైవేటు సమావేశానికి వేళ్లేందుకు జారుకున్నారు. రెండున్నర గంటలు సంప్రదించిన తర్వాత కోర్టు అధ్యక్షుడు ప్రతివాదుల తరపున లాయరు చెప్పింది సరైందేనన్నాడు. కనుక తొమ్మిది మంది సాక్షుల మీద మోపబడిన అభియోగాలు కొట్టివేయబడ్డాయి. నిందితులు మతమార్పిడి విషయంలో నిజంగా దోషులని నిరూపించడానికి మరలా పరిశోధనలు చేయడం అవసరమని పేర్కొన్నాడు.
ఈ ప్రకటన చేసిన వెంటనే కోర్టు గదంతా పెద్ద కేకలతో నిండిపోయింది. మతగురువులు బెదిరిస్తూ, అవమానకరంగా మాట్లాడుతూ కేకలు వేయడం ప్రారంభించారు. యెహోవాసాక్షుల పక్షాన వాదించిన లాయరుపై ఒక మతగురువు దాడిచేసి, సిలువను ఆరాధించాలని బలవంతపెట్టాడు. పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు సాక్షులు మౌనంగా బయటపడగలిగారు.
ఆ విచారణను రద్దుచేసిన తర్వాత, ప్రభుత్వ ప్రాసిక్యూటర్ ఈ తొమ్మిది మంది సాక్షులపై మరో అభియోగాన్ని సిద్ధంచేశాడు. దాని విచారణ ఏప్రిల్ 30, 1993కు నిర్ణయించబడింది. అనగా యూరప్ మానవహక్కుల కోర్టు కొకీనాకీస్ కేసు విషయంలో దాని తీర్మానాన్ని ప్రకటించడానికి మూడు వారాల ముందన్న మాట. మరలా అనేకమంది మతగురువులు హాజరయ్యారు.
ఈ తొమ్మిది మంది ప్రతివాదుల లాయర్లు నేరారోపణచేసినవారు కోర్టుకు హాజరుకాలేదని అభ్యంతరము లేవనెత్తారు. ప్రభుత్వ ప్రాసిక్యూటర్ కొత్త అభియోగాన్ని తయారుచేసే తొందరలో అసలు నేరారోపకులకు సమాన్లను పంపకుండా పెద్ద తప్పుచేశాడు. కాబట్టి ఈ తీవ్రమైన తప్పునుబట్టి సాక్షుల లాయర్లు ఈ విచారణను కూడా రద్దుచేయవలసిందని అడిగారు.
వారలా కోరినందున, న్యాయమూర్తులు కోర్టు గదిని విడిచిపెట్టి వెళ్లి వారిలో వారు ఒక గంటసేపు సంప్రదించుకున్నారు. తిరిగివచ్చిన తరువాత కోర్టు అధ్యక్షుడు తలవొంచి ఈ తొమ్మిది మంది సాక్షులు వారిపై మోపబడిన అభియోగాల విషయంలో నిర్దోషులని ప్రకటించాడు.
ఈ కేసు ఫలితానికి, కొకీనాకీస్ కేసు విషయంలో ఈ సంవత్సరం మే 25న మానవ హక్కుల యూరప్ కోర్టుతీర్మానానికి గ్రీసులోని సాక్షులు కృతజ్ఞులైయున్నారు. ఇలాంటి న్యాయపరమైన విజయాల మూలంగా వారు ‘సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకునట్లు’ తమ క్రైస్తవ జీవితాలను గడుపుటయే వారి ప్రార్థన.—1 తిమోతి 2:1, 2.
[31వ పేజీలోని చిత్రం]
మినోస్ కొకీనాకీస్ ఆయన భార్య